మన రైళ్లలో భద్రత డొల్లేనా?

భారత రైల్వే ప్రయాణీకుల భద్రతను గాలిలో దీపంగా మార్చేసిందనడానికి ఒడిశాలోని బాలాసూర్ వద్ద జరిగిన ఘోర ప్రమాద సంఘటన నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల మంది మృత్యువాత పడిన ఆ సంఘటనకు సంబంధించి సహాయక చర్యలు ఒక వైపు సాగుతుండగానే అదే ఒడిశాలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. సోమవారం (జూన్ 5) ఉదయం ఒడిశాలోని బర్గఢ్‌ జిల్లాలో   గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. సున్నపు రాయి లోడుతో వెళుతున్న ఈ రైలు సంబర్‌ధార వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించకపోయినపపటికీ రైల్వే శాఖ నిర్లక్ష్యం పెను ప్రమాదం తరువాత కూడా ఇసుమంతైనా తగ్గకుండా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా ఈ ఘటన నిలుస్తోంది.   అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా నిన్న రాత్రి మచిలీపట్నం, తిరుపతి ఎక్స్ ప్రెస్ రైళ్లో  మంటలు చెలరేగాయి. ప్రయాణీకుల అప్రమత్తతతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటన గుంటూరు స్టేషన్ కు సమీపంలో జరిగింది. చక్రాల రాపిడి కారణంగా మంటలు చెలరేగాయని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. ఇందుకు  లూబ్రికెంట్లు అయిపోవడమే కారణమంటున్నారు. ప్రయాణీకులు అప్రమత్తమై వెంటనే చైను లాగి రైలును ఆపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దాదాపు రెండు గంటల తరువాత రైలు అక్కడ నుంచి తిరుపతికి బయలుదేరింది.   వరుస ప్రమాదాలతో రైలు ప్రయాణమంటేనే జనం భయపడే పరిస్థితి తలెత్తింది. ఒక బాలాసూర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్న ప్రమాదానికి సిగ్నల్ సెట్టింగ్ లను ఎవరో మార్చివేయడమే కారణమని స్వయంగా రైల్వే మంత్రి చెప్పడంతో అసలు రైళ్లలో ప్రయాణం ఏ మాత్రం సేఫ్ కాదని పలువురు విమర్శస్తున్నారు. కవచ్ రక్షణ ఉన్నా ఆ ప్రమాదాన్ని నిలువరించే పరిస్థితి లేదన్న రైల్వే మంత్రి ప్రకటన ప్రజలలో ఆందోళనను మరింతగా పెంచుతోంది. ఎవరిష్టం వచ్చినట్లు వారు సెట్టింగ్ లను మార్చేస్తే ఇక రైల్వే శాఖ భద్రతకు ఏం పూచిపడగలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. సమగ్ర దర్యాప్తు, దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ వంటి ఊకదంపుడు ప్రకటనలతో సరిపుచ్చడం కాకుండా.. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాద ఘటనకు కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.   అన్నిటికీ మించి రైల్వే శాఖలో నిర్లక్ష్యం ఏ మేరకు పేరుకు పోయిందనడానికి రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాల గురించి ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మూడు నెలల కిందటే హెచ్చరించినా.. ఆ లోపాల సవరణ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడమే నిదర్శనం.  ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌లాకింగ్‌లో మార్పు కారణంగానే  కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ప్రాథమికంగా వెల్లడించిన  నేపథ్యంలో- ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ వైఫల్యాన్ని ఆ ఉన్నతాధికారి గతంలోనే ఎత్తిచూపిన విషయం చర్చనీయాంశంగా మారింది. నైరుతి రైల్వే జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ తన ఉన్నతాధికారులకు ఈ ఏడాది ఫిబ్రవరి 9న ఓ లేఖ రాశారు.   ఫిబ్రవరి 8న సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. నాడు వాస్తవానికి అప్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేందుకు ఆ రైలుకు తొలుత అనుమతి లభించింది. కానీ కొద్దిదూరం వెళ్లాక డౌన్‌ మెయిన్‌ లైన్‌లో వెళ్లేలా ఇంటర్‌లాకింగ్‌ ఉండటం కనిపించింది. దాన్ని గుర్తించిన లోకో పైలట్‌ అప్రమత్తమయ్యారు. రైలును వెంటనే నిలిపివేశారు. ఇంటర్‌లాకింగ్‌ ఉన్న ప్రకారం వెళ్లి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదే. సిగ్నలింగ్‌ వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని ఈ ఉదంతం స్పష్టం చేస్తోందన్నది ఆ లేఖ  సారాంశం.   కొన్నిసార్లు సిగ్నల్‌ ప్రకారం రైలు ప్రారంభమయ్యాక.. అది వెళ్లాల్సిన ట్రాక్‌ మారిపోతోందని పేర్కొన్నారు. ఈ వైఫల్యాలను నివారించేలా తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను ఆయనా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.న అలా చేయని పక్షంలో  ఘోర ప్రమాదాలు జరిగే ముప్పుందని లేఖలో హెచ్చరించారు. అయినా రైల్వే శాఖ ఆ హెచ్చరికను పట్టించుకోలేదు. ఫలితమే కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఘోర ప్రమాదం.

ఏపీలో క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ డౌన్!

గత మూడేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లుల కారణంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తన సేవలను టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఉపసంహరించుకోవడంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాల్లో క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్ (సిసిటిఎన్ఎస్) డౌనైపోయింది. సీసీటీఎన్ఎస్ దేశవ్యాప్తంగా ఉన్న 15,000 కంటే ఎక్కువ పోలీస్ స్టేషన్‌ల డేటాను ఏకీకృతం చేయడంలో పోలీసు విభాగాలకు ప్రధాన సాంకేతిక సాధనంగా ఉద్భవించింది.  సీసీటీఎన్ఎస్ కేవలం మౌస్ క్లిక్‌తో సమాచారాన్ని సేకరించడం  నిల్వ చేయడం, విశ్లేషించడం, తిరిగి పొందడం లాంటి సమాచారాన్ని బదిలీ చేయడంలో పోలీసులకు సహాయ పడుతుంది. 2012లో ఏపీలో తమ సేవలను ప్రారంభించినప్పటి నుంచి నేరాలను గుర్తించడంలో, కోర్టుల్లో కేసుల పురోగతిని గుర్తించడంలో పోలీసులు సీసీటీఎన్‌ఎస్‌పై ఆధారపడుతున్నారు. సీసీటీఎనగెస్ అమలు కోసం టీసీఎస్ 2012లో ఆంధ్ర పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఇది ఇటీవలి వరకు కొనసాగుతూ వచ్చింది. అయితే, గత మూడేళ్లుగా ప్రభుత్వం టీసీఎస్‌కు బిల్లును క్లియర్ చేయడంలో  చూపిస్తున్న అలసత్వం కారణంగా నిర్వహణ సేవలను ఉపసంహరించుకుంది. అనేక మంది పోలీసు సిబ్బంది సీసీటీఎన్ఎస్ నిర్వహణలో శిక్షణ పొందినప్పటికీ, వారు సర్వర్‌లు, వివిధ డేటాబేస్‌లు, సిస్టమ్‌లను అనుసంధానించేటప్పుడు  కోర్ నెట్‌వర్క్‌లో తలెత్తే సమస్యలను పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు. టీసీఎస్ నిష్క్రమణ తర్వాత  సీసీటీఎన్ఎస్ సిస్టమ్‌లో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నది. రాష్ట్రంలోని గుంటూరు, కర్నూలు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి సమస్యలు తలెత్తినట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. చిత్తూరు జిల్లాలో ఏర్పడిన సమస్యను కొంత మేర సరిదిద్దినా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా పోలీసు స్టేషన్లలో ఈ సేవ ఇప్పటికీ అందుబాటులో లేదు.  సిసిటిఎన్ఎస్ సమస్యపై సిబ్బందికి అవగాహన లేదని, అయితే జిల్లా యూనిట్లతో తనిఖీలు చేస్తున్నట్టు టెక్నికల్ సర్వీసెస్ డిఐజి ఎస్ వి రాజశేఖర్ బాబు అంటున్నారు. టీసీఎస్ కు పెండింగ్‌లో ఉన్నబిల్లుల కారణంగా  సేవ ఉపసంహరణ అంశంపై మాత్రం ఆయన  మాట్లాడలేదు.  ఇప్పటికే  కొనసాగుతున్న పరిశోధనలను ట్రాక్ చేయడం,  కొత్త నేరాలు, డేటాలను  నవీకరించడం రెండింటిలోనూ ఎస్ హెచ్ఓఎస్,  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీసీటీఎన్ఎస్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను అదే రోజున సీసీటీఎన్ఎస్ లో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం టీసీఎస్ సేవలు లేని కారణంగా  పోలీసులు ఆ విధంగా చేయలేని పరిస్థితి ఏర్పడింది. గత వారం నుంచి ఏపీ పోలీస్ సేవా మొబైల్ అప్లికేషన్, ఏపీ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఎఫ్‌ఐఆర్ సేవలు నిలిచిపోయాయి.  ఇక ఇలాంటి పరిస్థితి.. రాష్ట్రంలోని పలు పుర, నగరపాలక సంస్థలలో కూడా నలకొని ఉంది.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యంతో కొత్త పనులకు గుత్తేదారులు టెండర్లు వేయడం లేదు. పూర్తయిన పనుల బిల్లులు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ(సీఎఫ్ఎంఎస్)లో అప్ లోడ్ చేయడానికే ఇంజినీర్లు పరిమితమవుతున్నారు. బిల్లుల చెల్లింపులు తమ చేతుల్లో లేదని పుర కమిషనర్లు చేతులెత్తేస్తున్నారు. దీంతో పాలకవర్గ సర్వసభ్య సమావేశాల్లో తీర్మానం చేసిన పనులు కూడా అమలుకు నోచుకోవడం లేదు. గుంటూరు నగరపాలక సంస్థలోని తూర్పు నియోజకవర్గంలో రూ.17 కోట్ల విలువైన పనులకు సంబంధించి ఇటీవల నాలుగైదుసార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారుల నుంచి స్పందన లేదు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక సంఘంలో రూ.15 లక్షల అంచనాలతో 12 పనులకు అధికారులు 15 సార్లు టెండర్లు పిలిచినా.. గుత్తేదారులు ముందుకు రాలేదు.  బిల్లుల చెల్లింపుల్లో తీవ్రమైన జాప్యంతో కొత్త పనులకు టెండర్లు వేయడానికి ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రంలోని దాదాపు అన్ని పుర, నగర పాలక సంస్థల్లో దాదాపుగా ఇదే పరిస్థితి.  రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్లలో చేసిన పనులకు రూ.750 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థలోనే దాదాపు రూ.50 కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఇలా రాష్ట్రంలో రూ.750 కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కొత్త పనులకు గుత్తెదారులు ముందుకు రావడం లేదు. పనులు పూర్తి అయినా.. గుత్తేదారుకు బిల్లులు చెల్లింపులలో ఏపీ ప్రభుత్వం చేతులెత్తేస్తున్న సంఘటనలు కోకొల్లలు. రెవెన్యూ జనరేషన్ లేదు.. రాబడి వస్తుందనే భరోసా లేదు.. తాజాగా టీసీఎస్.. ఏపీ ప్రభుత్వం బాధితురాలైంది.   నేరాలు, వాటి సంబంధిత డేటాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం.. అప్ డేట్ చేసే ప్రక్రియ ఆగిపోవడంతో..  పౌర భద్రతా డొల్లగా మారింది. దాంతో ఏపీ పోలీసు శాఖ  అధికారులు ఏం చేయాలో పాలు పోక..  ఆందోళనలో ఉన్నారు. మూడేళ్ల బిల్లులు చెల్లిస్తేనే.. సేవలు తిరిగి ప్రారంభిస్తామని టీసీఎస్ కుండ బద్దలు కొట్టేసింది.  

మంత్రులు, ఎమ్మెల్యేలు బొమ్మల కొలువులో బొమ్మలే !

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 175 మంది ఏమ్మేల్యేలున్నారు.. అందులో అధికార వైసీపీ ఎమ్మెల్యేలే 151 మంది ఉన్నారు ..మళ్ళీ అందులో ఓ పాతిక మంది వరకు మంత్రులు. వారిలో  మళ్ళీ ఓ ఐదుగురు ఉప ముఖ్యమంత్రులున్నారు. అయితే, ఇంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, వీరు గాక సలహాదారులు ఇలా పేరు గొప్ప పదవుల్లో ఎందరున్నా,  అందరూ జీరోలే. ఎవరికీ ఏ అధికారం లేదు. ఈ మాటన్నది, ఈ ఆరోపణ చేసింది ఎవరో కాదు, మాజీ మంత్రి, అదే అధికార పార్టీ  బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. అంతే కాదు అయన ఇంకోమాట కూడా అన్నారు. చివరికి గ్రామ, వార్డు వాలంటీర్లకు ఉన్న అధికారం కూడా ఎమ్మెల్యేకు లేదని   అన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడైనా రాష్ట్ర ఆదాయం పెంచుకుని సంక్షేమ కార్యక్రమాలు చేయాలి కానీ, అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదొక్కటే అని దుయ్యబట్టారు. అప్పులు తెచ్చి ఎన్నికలకు ఓట్లు కొనుక్కుంటామని చెప్పే పార్టీ కూడా  వైసీపీ ఒక్కటే అని ఎద్దేవా చేశారు. నిజమే కావచ్చు ఆనం రామనారాయణరెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడిన నేపధ్యంలో అసమ్మతి గళం వినిపిస్తున్నారని అధికార పార్టీ నాయకుల చేస్తున్న ప్రత్యారోపణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చు. కానీ, జరుగతున్న పరిణామాలను గమనిస్తే మంత్రులు. ఎంపీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అంతా ఉత్సవ విగ్రహాలు మాత్రమే అనే అభిప్రాయమే వైసీపీ నేతలతో సహా అందరిలో ఉందనేది కాదన లేని  నిఖార్సైన నిజం.  అలాగే ఓ వంక తమ ప్రభుత్వం నాలుగేళ్ళలో ఏవో అద్భుతాలు చేశామని చెప్పుకుంటుంటే, మరో వంక అదే  పార్టీకి చెందిన బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి  వైసీపీ నాలుగేళ్ల పరిపాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని ఆరోపిస్తున్నారు. దోపిడీయే ఈ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని విమర్శించారు. వైసీపీ దుర్మార్గపు పాలనను అంతమొందించటానికి అందరూ కలిసి రావాలని ఆనం రామనారాయణరెడ్డి పిలుపునిచ్చారు.   వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టారా అని ఆనం రాంనారాయణ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం కడతానన్న పోలవరం ప్రాజెక్టును నిలిపేసి.. చివరికి, కట్టలేమనే దుస్థితికి వచ్చారన్నారు. రాష్ట్రంలో పవర్‌ ప్రాజెక్టులను అమ్ముకునే పరిస్థితికి తీకొచ్చారని ఫైరయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని రామనారాయణరెడ్డి అన్నారు. ప్రతి మంగళవారం రూ.3 వేల కోట్లు అప్పులుగా తెస్తున్నారని.. ఆ లెక్కన రాష్ట్రానికి ఎంత అప్పు అయ్యుంటుందని రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. పవర్ ప్రాజెక్ట్‌లు అమ్మేసే  స్ధితికి వచ్చారని.. పోలవరం నిర్మాణాన్ని పక్కనబెట్టారని ఆయన దుయ్యబట్టారు. కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముందే 99 ఏళ్ల లీజుకు ఇచ్చేశారని..  ఏపీ ప్రజలను చూసి ఇతర రాష్ట్రాల వాళ్లు నవ్వుకుంటున్నారని, జాలి పడుతున్నారని ఆనం రామ నారాయణ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో ఇవాళ లే ఔట్లు లేవని.. తెలంగాణలో వ్యాపారాలు బాగున్నాయని ఆయన ప్రశంసించారు. అమరావతి పేరుతో ఏపీకి వచ్చిన వాళ్లంతా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారని ఆనం రాం నారాయణ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుంచి తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి నిర్వీర్యమైన పరిపాలనను ఎప్పుడూ చూడలేదని ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారులు స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజల అవసరాలను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా స్థాయి సమావేశాలకు విలువే లేదని పేర్కొన్నారు.

తెలంగాణకు దళిత సీఎం

తెలంగాణ రాష్ట్రానికి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అన్న నినాదం ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా?! నిజమే, ప్రస్తుత ముఖ్యమంత్రి కవ్లకుంట్ల చంద్రశేఖరరావు తన నోటితో చెప్పిన మాటలు ఇవే.  కానీ ఆ మాటలు అందరూ మరచిపోయారు. పుష్కరకాలం తరువాత తిరిగి ఆ నినాదం ఊపందుకోబోతోంది. ఈ సారి కేసీఆర్ నోట కాదు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాలలో బలంగా వినిపిస్తోంది.  కాంగ్రెస్ పరిస్థితి కర్నాటక ఎన్నికల ఫలితాలతో పూర్తిగా మారిపోయింది.  ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ కి ఉన్న సంబంధం అపురూపమైనది. దేశమంతా  కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్న సమ యంలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీని గెలిపించుకున్న ప్రాంతం తెలంగాణ. సహజంగానే కర్నాటక ఫలితాల ప్రభావం పొరుగునే ఉన్న తెలంగాణ రాష్ట్రంపై పడింది. అయితే కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గ రాజకీయ ప్రాబల్యం అధికంగా ఉన్న తెలంగాణలో, అందులో కాంగ్రెస్ లో దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.   రెడ్లలో ఉన్న పోటీని నివారించాలంటే ఇతర సామాజిక వర్గాలకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. అదీకాక గతంలో మాట ఇచ్చి తప్పిన బీఆర్ఎస్ అధినేతను ఇరుకున పెట్టాలని, దళిత మహిళను పార్లమెంటు ప్రారంభోత్సవానికి  పిలవని బీజేపీకి బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గంలో పోరు జగమెరిగిన సత్యమే.  రెడ్ల మధ్య పోరును ఆపడానికి దళిత కార్డును కాంగ్రెస్ వినియోగించబోతోంది. ఇంతకీ కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టిలో ఉన్న దళిత నేత ఎవరంటే, విప్లవ పంధా నుంచి జనజీవన స్రవంతిలోకి అడుగు పెట్టిన ములుగు ఎమ్మెల్యే సీతక్క అనే సమాధానం వస్తోంది. నిజాయితీగా పని చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటున్న సీతక్క పెట్ట కాంగ్రెస్ పెద్దలు సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కరోనా కాలంలో తన నియోజకవర్గంలో కాలినడకన ప్రయాణిస్తూ ప్రజలను ఆదుకున్న అడవి బిడ్డ సీతక్క ఇప్పుడు కాంగ్రరెస్ కు ఆశాదీపంగా కనిపిస్తోంది.  ఇటీవల రాహుల్ గాంధీతో కలిసి బారత్ జోడో యాత్రలో పాల్గొన్న సీతక్క దేశంలోని అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ నాయకులతో పరిచయం పెంచుకున్నారు.  రాహుల్ గాంధీ సీతక్కను ప్రత్యేకంగా ఆహ్వానించి భారత్ జోడో యాత్రలో భాగస్వామ్యం చేయడం వెనుక ఆమెను తెలంగాణ సీఎం పీఠంలో కూర్చోపెట్టే వ్యూహమే ఉందంటున్నారు ఢిల్లీ పెద్దలు.  సీతక్కకు అన్ని రాజకీయ పార్టీలతో మంచి సంబంధాలు ఉండడం, వివాదాలకు  అతీతంగా వ్యవహరించడం కూడా అమెకు ప్లస్ అనేది కాంగ్రెస్ వాదన. మరో వైపు భట్టి విక్రమార్క కూడా పాదయాత్రలు చేస్తూ అధిష్ఠానం కంట్లో పడే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా రెడ్లు, రెడ్లు పోరులో దళితులు ప్రయోజనం పొందడం ప్రస్తత తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్

తెనాలి నుంనే పోటీ.. పొత్తు ఖాయం.. నాదెండ్ల!

సరిగ్గా హస్తినలో చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సమయంలోనే జనసేన రాజకీయ వ్యవహారాల ఇన్ చార్జ్ నాదెండ్ల మనోహర్.. తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తు విషయంలో ఎలాంటి అనుమానాలకూ తావు లేదని కుండ బద్దలు కొట్టేశారు. పొత్తు విషయంలో ఇప్పటికే దాదాను విధివిధానాలు ఖరారైపోయాయనీ, సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ఆయన నిర్ద్వంద్వంగా ప్రకటించారు. సీట్ల సర్దు బాటు విషయంలో కూడా ఎటువంటి గందరగోళం లేదనీ, ఆ విషయంలో తుది నిర్ణయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ దేననీ, ఆయనే  సీట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. దీంతో  తెలుగుదేశం, జనసేన కూటమి కట్టడం ఖాయమేననీ, సీట్ల సర్దుబాటు లాంఛనమేననీ తేలిపోయింది. ఇక తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ ఉంటుందా? ఉండదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని కూడా తేటతెల్లమైపోయింది. బీజేపీ ఈ కూటమితో కలవాలని భావించినా సీట్ల సర్దుబాటు విషయంలో ఆ పార్టీది నామమాత్రపు పాత్రేనని కూడా నాదెండ్ల ప్రకటనతో తేలిపోయింది. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు అన్ని విషయాలలోనూ అండదండగా ఉండి.. ఇప్పుడు వైసీపీ వ్యతిరేకత తమ పార్టీపై పడకూడదన్న ఉద్దేశంతో పొత్తుకు ముందుకు వచ్చినా.. గతంలోలా ఆ పార్టీకి ఈ కూటమిలో  సమాన హోదా ఉండే అవకాశం అంతంత మాత్రమేనని కూడా నాదెండ్ల మనోహర్ ప్రకటన తేటతెల్లం చేస్తోంది.  హస్తినలో చంద్రబాబు కేంద్ర హోమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చర్చలు జరుపుతుంటే.. అదే సమయంలో నాదెండ్ల తెలుగుదేశంతో పొత్తు విషయంలో అనుమానాల్లేవ్ అని చెప్పడంతోనే బీజేపీ కలిసినా కలవకపోయినా పట్టించుకోబోమన్న అర్ధం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక సీట్ల సర్దు బాటు విషయానికి వస్తే ఇప్పటికే పలు సందర్భాలలో  భేటీ అయిన  చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను సీట్ల సర్దుబాటు విషయంలో ఒక అవగాహనకు వచ్చి ఉంటారని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి తెనాలి నియోజకవర్గం నుంచి  తాను రంగంలో ఉంటానని ప్రకటించడం ద్వారానే సీట్ల సర్దుబాటు కూడా దాదాపుగా పూర్తయ్యిందన్న సంకేతాన్ని నాదెండ్ల ఇచ్చారని అంటున్నారు.   

షా నడ్డాలతో చంద్రబాబు భేటీ.. సంకేతం ఏంటి?

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు హస్తినకేగి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవ్వడం ఏపీలో అధికార వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లైంది. గత నాలుగేళ్లుగా తాము ఆడింది ఆటగా, పాడింది పాటగా సాగేందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ అన్ని విధాలుగా అండదండ అందించిన ధీమాతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన జగన్ సర్కార్ కు.. ఇక ఈ చివరి సంవత్సరం అంటే ఎన్నికల ఏడాదిలో అలాంటి వెసులుబాటు ఉండదన్న సంకేతాలను ఈ భేటీ ఇచ్చిందనడంలో సందేహం లేదు. అయితే మీడియాలో, సామాజిక మాధ్యమంలో వస్తున్నట్లుగా పొత్తుల చర్చలు కాదు కానీ.. అసలు ఏపీలో ఏం జరుగుతోందన్న విషయాన్ని విపక్ష నేత, దార్శనికుడు అయిన చంద్రబాబు ద్వారా నేరుగా తెలుసుకునే ఉద్దేశంతోనే  బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాచును హస్తినకు ఆహ్వానించి భేటీ అయ్యిందని ఏపీ బీజేపీ శ్రేణుల్లోని ఒక వర్గం బలంగా చెబుతోంది. జగన్ సర్కార్ విషయంలో ఏపీ బీజేపీ నాయకత్వం కేంద్రానికి పూర్తి సమాచారం ఇవ్వడం లేదని ఆ వర్గం చెబుతోంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటన సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి జగన్ సర్కార్ పై వాడవాడలా చార్జిషీట్ లు రూపొందించమని విస్పష్ట ఆదేశాలు జారీ చేసినా.. పార్టీ హై కమాండ్  పూనుకునేవరకూ ఆ కార్యక్రమం కార్యరూపం దాల్చని విషయాన్ని ఆ వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది. అలాగే.. ఏపీలో బీజేపీ నాయకుల మీద అధికార పార్టీ శ్రేణులు దాడులకు పాల్పడినా పార్టీ రాష్ట్ర నాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం ఈ సారి నేరుగా విపక్ష నేత నుంచి వివరాలు తెలుసుకోవాలని భావించిందని అంటున్నారు. అందుకే ముందుగా అమిత్ షా తో మాత్రమే బాబు భేటీ అని చెప్పినా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కూడా వచ్చి కలవడంతో వారి మధ్య బేటీ రాజకీయపొత్తుల గురించి కాకుండా.. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకత్వాలపైనే సాగిందని అంటున్నారు.  దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ నిధులను విడుదల చేసినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ పట్ల రాష్ట్రంలో ఇసుమంతైనా సానుకూలత రాకపోవడం.. అలాగే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి ఈ సొమ్ముల విడుదల ద్వారా గట్టెక్కుతుందని మోడీ సర్కార్ భావించినా.. మళ్లీ యధావిథిగా అప్పుల కోసం జగన్ సర్కార్ తిప్పలు పడటం.. కనీసం ఉద్యోగులకు  జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కొనసాగుతుండటంతో... ఏదో తేడా జరుగుతోందని పసిగట్టిన బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబుతో భేటీలో అందుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

తప్పేముంది?.. బాబు హస్తిన పర్యటనపై బండి

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తెలుగుదేశం అధినేత చంద్రబాబు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ భేటీని పురస్కరించుకుని తెలుగుదేశం, బీజేపీ పొత్తు గురించి వస్తున్న ఊహాగానాలను తోసి పుచ్చారు. అవన్నీ ఊహాగానాలేనని కుండ బద్దలు కొట్టేశారు. గతంలో కూడా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీష్ కుమార్.. ఇంకా పలువురు ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని, హోంమంత్రితో భేటీ అయిన సందర్భాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.  కేంద్రంలో మోడీ సర్కార్  తొమ్మిది సంవత్సరాల పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెలాఖరు వరకూ నిర్వహిస్తున్న మహాజన సంపర్క్ అభియాన్  కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చేందుకు బండి సంజయ్ తెలంగాణలోని వివిధ జిల్లాల పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.   గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగానే తెలుగుదేశం  అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా, నడ్డాలతో భేటీ నేపథ్యంలో బీజేపీ, తెలుగుదేశం పొత్తులపై మీడియాలో సాగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టి పారేశారు.  ఊహాజనిత వార్తలను పట్టించుకోనవసరం లేదన్న బండి సంజయ్  దేశ సమగ్రాభివ్రుద్దే  లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పని చేస్తోందని చెప్పారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. మమతా బెనర్జీ, స్టాలిన్ ఆఖరకి కేసీఆర్ తో కూడా గతంలో మోడీ, షా భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మరో వైపు ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మాత్రం చంద్రబాబు అమిత్, షా నడ్డాలతో భేటీని భూతద్దంలో చూస్తూ ఖంగారు పడుతోంది. బీజేపీ అగ్రనాయకత్వం పిలుపుపై చంద్రబాబు హస్తిన వెళ్లిన సంగతిని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తూ.. బాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారంటూ కథనాలను వండి వారుస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం మాత్రం ఈ భేటీపై ఎటువంటి వ్యాఖ్యలూ చేయడం లేదు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మాత్రమే చంద్రబాబు హస్తినలో అమిత్ షాతో మాట్లాడారని అంటోంది.  మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటన ఇటు ఏపీలోనే కాకుండా, అటు తెలంగాణలో కూడా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

తెలుగుదేశంలోకి ట్రిపులార్?

ట్రిపులార్  అంటే ఎవరో తెపుసు కదా... అవును.. ఎప్పుడూ వార్తల్లో ఉండే, రచ్చబండలో అధికార వైసీపీ సర్కార్ ను  ఉతికేసే  నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి గెలిచిన ఆయన ఆది నుంచీ  అసమ్మతి ఎంపీగా ముద్ర వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి క్రమం తప్పకుండా ప్రతిరోజూ రచ్చబండకు ఈడుస్తునే ఉన్నారు. సర్కార్ అగ్రహానికి గురయ్యారు. జగన్ రెడ్డి పోలీసులు ఆయనకు, థర్డ్ డిగ్రీ రుచి చూపించారు.నిజానికి చెప్పాలంటే అయన కథ చాలానే వుంది.  అదలా వుంచి ప్రస్తుతంలోకి వస్తే,  ఇప్పడు ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయన తెలుగు దేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతునట్లు తెలుస్తోంది. నిజానికి,గతంలో రఘురామ కృష్ణం రాజు.. బీజేపీకి సన్నిహితంగా మెలిగారు. ఒక దశలో ఆయన కాషాయం కట్టేసినట్లేననే వార్తలు కూడా వచ్చాయి. అయితే  కారాణాలు ఏవైనా  ఆయన బీజేపీలో చేరలేదు. అయితే  బీజేపీతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. కానీ, గత కొంత కాలంగా ఆయన బీజేపీతో లాభం లేదనే నిర్ణయానికి వచ్చారో ఏమో కానీ, కొత్త పంథాను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  టీడీపీలో చేరి రాజకీయాలలో కంటిన్యూ అయ్యే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగవచ్చుననే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం టీడీపీ, జనసేన కూటమితో బీజేపే కూడా జట్టుకడుతుందనే నమ్మకంతో ఉన్న ఆయన, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీజేపీపై ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. అందుకే  రెండురోజుల్ పర్యటనకు ఢిల్లీ వెళ్ళిన టీడీపీ అధినేత చంద్రబాబుకు దేశం ఎంపీలతో కలిసి కృష్ణం రాజు కూడా స్వగతం పలికారు.  అంటే కాదు ఇక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకున్నారో ఏమో. నేరుగా ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ఆసక్తిగా ఉన్నానని చంద్రబాబు నాయుడుకు  చెప్పినట్లు తెలుస్తోంది. నర్సాపురం లేదా మరే లోక్‌సభ నియోజకవర్గం టికెట్‌ను అయినా తనకు కేటాయించాలనే  ప్రతిపాదన పెట్టారనీ. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారనీ సమాచారం.అదలా ఉంటే , రఘురామ కృష్ణం  రాజు అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన కుడా చేస్తున్నారని, అందుకే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు అవకాశాలు మెండుగా ఉన్న నేపధ్యంలో ఆయన ముందుగానే, తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని అయన సన్నిహితులు చెపుతున్నారు.

కలిశారు సరే.. ఏం మాట్లాడారు?

తెలుగుదేశం   అధినేత చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లారు. అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు.  అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వేరే చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు అమిత్షా తో బేటీ కావడం ఇదే తొలిసారి.   అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమంయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు చర్చలు పూర్తిగా రాజకీయపరమైనవేనని అనడంలో సందేహం లేదు.  అయితే అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారన్న విషయంలో రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కోరేందుకే బీజేపీ హై కమాండ్ చంద్రబాబును హస్తినకు పిలిచిందన్న వాదన రాజకీయవర్గాలలో గట్టిగా సాగుతోంది.   అదే సమయంలో గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన బలంగా జనంలోకి వెళ్లిపోయిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ సమయంలో ఏపీలో బీజేపీ పొత్తు, ఎన్డీయేలో చేరిక అంటే ప్రజలలో పలుచన అయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడితే అది పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అటుంచి నష్టం చేకూర్చే అవకాశాలే అధికంగా ఉంటాయని చంబ్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్ర ప్రభుత్వం,  రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నా.. ఇంత కాలం కేంద్రం వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలవడం, ఆర్థిక అరాచకత్వానికి మద్దతు ఇవ్వడాన్ని చంద్రబాబు ఆ సందర్భంగా వారి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ తీరు వెనుక కూడా కేంద్రం ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెద్దగా ఉపయోగం ఉండదనీ, ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ వైసీపీకి వ్యతిరేకం అన్న భావన కలిగేలా వ్యవహరించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో క్షేత్ర స్థాయిలో కలిసి ఉద్యమాలలో పాల్గొంటే.. ఆ తరువాత పొత్తుల విషయం మాట్లాడుకోవచ్చని చంద్రబాబు అమిత్ షా నడ్డాలకు వివరించారని అంటున్నారు. అన్నిటికీ మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీకి దూరం పాటించడం అవసరమనీ, అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తెలుగుదేశం లోక్ సభలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అరాచకాలు, అక్రమాలకు పాల్పడకుండా   గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ వ్యతిరేకమన్న విషయాన్ని గట్టిగా చాటితే బీజేపీకి అవసరమైతే  తెలంగాణలో టీడీపీ నుంచి సహకారంఅందుతుందని కూడా చంద్రబాబు  అమిత్ షా నడ్డాలకు హామీ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితో అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీపై ఏపీ సర్కార్ లో కలవరం విస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రులు ఈ భేటీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ చూస్తుంటే  తమకు గతంలోలా కేంద్రం మద్దదు లభించదేమోన్న భయం వారిలో ప్రస్ఫుటమౌతోంది. 

నోటితో వెక్కిరింపు.. నొసటితో పలకరింపు!

ఏపీలో బీజేపీ విచిత్ర విన్యాసాలు చేస్తోంది. అన్ని విధాలుగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం అధికార వైసీపీకి అడుగులకు మడుగులొత్తుతూనే.. చార్జిషీట్ల పేరుతో నామ్ కే వాస్తేగా జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఆ మాత్రమైనా చేయకపోతే రాష్ట్రంలో ఉన్న ఒక్క శాతం ఓట్లు కూడా గాయబ్ అవుతాయన్న భయమే అందుకు కారణం. జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేకతను గుర్తించిన బీజేపీ అగ్రనాయకత్వం.. అంటే హస్తినలో ఉన్న కమలం పార్టీ అధిష్ఠానం మీరు జగన్ సర్కార్ ను కనీసం తిట్టినట్లైనా చేయకపోతే ఎలా అని రాష్ట్ర నాయకత్వాన్ని  మందలించడమే   కారణం. అధిష్ఠానం కన్నెర్ర చేయడంతోనే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇవ్వడానికి ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలకు జనం నుంచి వీసమెత్తు కూడా స్పందన రాకపోవడంతో వ్రతమూ చెడి.. ఫలమూ దక్కలేదన్నట్లుగా బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి తయారైంది.   ఈ నేపథ్యంలో  ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలనపై నెల రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాల్లో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, నడ్డా రాష్ట్రంలో  పర్యటించనున్నారు. వీరిలో హోంమంత్రి అమిత్ షా ఈ నెల 8న విశాఖపట్నంలో జరిగే బహిరంగ సభలో మోడీ తొమ్మిదేళ్ల  పాలన విజయాలపై ప్రసంగించనున్నారు.   అలాగే పదో తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో   బహిరంగసభలో ప్రసంగిస్తారు. బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ పై దృష్టి పెట్టినట్లుగా ఏపీని పట్టించుకోవడం లేదు.  వైసీపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలు అని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే జనసేనతో పొత్తు కొనసాగించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉంటే ఉంటుంది.. లేకుంటే ఊడుతుంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నది.  ఈ నేపథ్యంలోనే బీజేపీ  నాయకత్వం జగన్ సర్కార్ విషయంలో తిట్టినట్లు చేస్తూ.. వెనుక నుంచి  సహకారం అందిస్తోంది. 

బీటలు వారిన మజ్లిస్, బిఆర్ఎస్ సంబంధాలు

తెలంగాణలో అధికార బిఆర్ఎస్  పార్టీకి మిత్ర పక్షాల కంటే శత్రు పక్షాలే ఎక్కువవుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తర్వాత బిఆర్ఎస్ నుంచి వామ పక్షాలు దూరమయ్యాయి. ఏరు దాటకముందు వీర మల్లన్న , ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టుంది బీఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ వ్యవహారం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన  వామ పక్షాలను బిఆర్ఎస్ గెలిచిన తర్వాత  ప్రగతిభవన్ మెట్లు కూడా ఎక్కనియ్యలేదు కెసీఆర్. తొమ్మిదేళ్లు చెట్టపట్టాల్ వేసుకున్న ఎంఐఎంతో  ప్రస్తుతం బిఆర్ఎస్ మధ్య సంబంధాలు  బీటలు వారాయి. ఆదిలాబాద్, సంఘారెడ్డి బహిరంగ సభల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాదాద్రిని డెవలప్ చేసిన కెసీఆర్ హైద్రాబాద్ లో ఇస్లామిక్ సెంటర్ పెట్టలేకపోతున్నారన్నారు అని ఆరోపించారు.  ముస్లింల శ్రేయస్సు కోసం బిఆర్ఎస్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.  ఎంఐఎం అధినేత తొలిసారి కెసీఆర్ ను బాహాటంగా విమర్శించడం సంచలనం అయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ  చేస్తున్నప్పటికీ స్వంత రాష్ట్రంలో హైదరాబాద్ పాతబస్తీకే పరిమితమైంది. పాతబస్తీలో మజ్లిస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ తెలంగాణలో ఇతర స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయడానికి ఆసక్తి కనబరిచేది కాదు. ముస్లింలు అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలలో సైతం ఎంఐఎం పోటీ చేసేది కాదు. పైగా బిఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందడానికి ఒవైసీ పాటుపడేవారు. ముస్లింల వోట్లు కాంగ్రెస్ కు పడకుండా కేసీఆర్ జాగ్రత్తలు పడేవారు. అందులో భాగంగా కెసీఆర్ మజ్లిస్ సపోర్ట్ తీసుకున్నారు. ముస్లింల వోట్లు బిఆర్ఎస్ కు పడే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు కెసీఆర్.  ఇన్ని రోజులు మజ్లిస్ పార్టీ, బిఆర్ఎస్ మిత్ర పక్షాలుగా ఉండి ప్రస్తుతం శత్రు పక్షాలుగా మారడానికి మజ్లిస్ పార్టీ రహస్య ఎజెండా ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ మాత్రమే బిఆర్ఎస్ మీద విరుచుకుపడేవారు. ప్రస్తుతం అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడుతున్నారు. మజ్లిస్ బీఆర్ ఎస్ సంబంధాలు దెబ్బతినకుండా అసదుద్దీన్ ప్యాచప్ చేసేవారు.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేసి 50 స్థానాలు కైవసం చేసుకుంటుందని అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.  మజ్లిస్ ను బుజ్జగించే ప్రయత్నంలో భాగంగా కెసీఆర్ మజ్లిస్ కు ఎంఎల్ సీ సీటు కేటాయించారు.  కొత్త సచివాలయంలో మసీదు కట్టలేదని, షాదీ ముబారక్ అసలైన లబ్ది దారులకు అందడం లేదు వంటి ఆరోపణలు చేశారు అసదుద్దీన్. ముస్లింలు ఉన్న ప్రాంతాల్లో మజ్లిస్ పోటీ చేస్తే ఆ పార్టీ మాత్రమే స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఇదే సమీకరణాలు కొనసాగితే బిఆర్ఎస్ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో స్థానాలు కోల్పోవడం ఖాయం. ప్రస్తుతం బిఆర్ఎస్ కు ఏ ఒక్క పార్టీ కూడా మిత్ర పక్షం లేకపోవడం ఆసక్తికరంగా మారింది. 

రైలు ప్రయాణం.. ప్రాణం గాల్లో దీపం !

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రం ఒడిశాలో పట్టాలపై మరణ మృదంగం మోగింది.రెండు రైళ్లు.. గూడ్స్ రైలు ఢీ కొట్టుకొన్న ఘటనలో దాదాపు 300 మంది ప్రయాణికులు  విగత జీవులయ్యారు. మరో 1000 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడి.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది. బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్‌లోని హౌరా వెళ్తున్న బెంగళూరు - హౌరా సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా ఆ రైలుకు చెందిన పలు బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడిపోవడం.. వాటిని షాలిమార్ - చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఢీ కొట్టడం.. దాంతో ఆ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డడం.. ఆ కొద్దిసేపటికే బోల్తాపడ్డ.. కోరమండల్ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టడం.. అంతా క్షణాల్లో జరిగిపోయింది. అయితే మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీ కొట్టుకోవడంతో ప్రమాదం తీవ్రత భారీగా.. ఊహించనంతగా పెరిగింది. ఈ ప్రమాదాలన్నీ ఒకదాని వెంట ఒకటి కొన్ని నిమిషాల వ్యవధిలో చోటు చేసుకోవడంతో.. అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలోకి ఇటు స్థానికులు.. అటు ప్రయాణికులు కొన్ని నిమిషాలు పాటు అలా నిశ్చేష్టులై ఉండిపోయినట్లు వెలువడుతోన్న కథనాల ద్వారా అవగతమవుతోంది.   అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయా రైల్వే స్టేషన్ల వద్ద సిబ్బంది విదుల్లో ఉన్నారా? ఓ వేళ వారు విధుల్లో  ఉండి ఉంటే.. తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నారా? అనే అంశంపై ఆరా తీయాల్సి ఉంది. అంతే కానీ సాక్షాత్తూ కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఘటన స్థలానికి చేరుకుని.. ఈ రైలు ప్రమాద కారణాలను ఇప్పటికిప్పుడు అయితే చెప్పలేమని... ప్రమాద ఘటనపై విచారణ చేసి  చెబతామని... ఈ ఘటనపై విచారణకు ఉన్నత స్థాయి కమిటీ  ఏర్పాటు చేశామంటూ  చేతులు దులిపేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అలాగే మృతుల కుటుంబాలకు నష్ట పరిహరం అందజేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.    అయితే కొన్ని దశాబ్దాల క్రితం రైల్వే శాఖ మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి విధులు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో దేశంలో ఏక్కడో రైలు ప్రమాదం జరిగితే.. అందుకు ఆయన నైతిక బాధ్యత వహిస్తూ... మంత్రి పదవికి రాజీనామా చేశారు. కానీ నేటి రాజకీయ నాయకుల్లో ఆ నీతి.. ఆ నిజాయితీ.. ఆ నైతిక బాధ్యత.. నిబద్దత అనేవి ఎక్కడా దుర్భిణి వేసి వెతికినా.. కానరాని పరిస్థితి అయితే నెలకొందనేది మాత్రం సుస్పష్టం. పోనీ ఈ ప్రమాద ఘటనపై స్థానిక రైల్వే స్టేషన్ సిబ్బందిని రైల్వే మంత్రి ఆరా తీసినా.. ప్రమాద ఘటన వివరాలు వెంటనే వెల్లడించవచ్చు. కానీ సదరు మంత్రిగారికి ఆ ఆలోచన, ఉద్దేశం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా భారతీయ రైల్వే.. ఆదాయం కోసం చేసే వేసే ట్రిక్కులకు ట్రాక్ రికార్డు గట్టిగానే ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రయాణికుల అవసరాన్ని.. అత్యవసరాన్ని క్యాష్.. ఎన్ క్యాష్ చేసుకోవడం కోసం.. రైలు టికెట్ ధరలు పెంచు కోవడమే కాదు.. తత్కాల్, ప్రీమియం తత్కాల్ వంటి వాటిని తెరపైకి తీసుకు వచ్చి.. ప్రయాణికులను నిలువు దోపిడి చేయడంలో దేశంలోని అన్ని రైల్వే జోన్లు పోటా పోటీగా   అగ్రస్థానంలో నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఒలింపిక్స్ మెడల్.. మెడలో వేయాల్సిందేనని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక పండగలు, వరుస సెలవుల దృష్ట్యా రైల్వే స్టేషన్లకు పిల్లాపాపలతో ప్రయాణికులు పోటెత్తుతుంటారు. అలాంటి వేళ.. రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ టికెట్ల ధరలు 10 రూపాయిలు  నుంచి  ఏకంగా 50 రూపాయిలకు పెంచేసిన ఘనత మన రైల్వే శాఖది. అంతేందుకు రైల్వే స్టేషన్ల వద్ద, రైల్వే రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద.. వాహనాల పార్కింగ్ ఫీజు సైతం.. అదీ కూడా జీఎస్టీ వడ్డనతో సహా లెక్క కట్టి మరీ వసూల్ చేసి.. వసూల్ రాజాగా రైల్వే శాఖ ఖ్యాతి గాంచింది. అంతే కాదు.. ఓ సాధారణ మధ్యతరగతి ప్రయాణికుడు.. తన కుటుంబంతో కలిసి రైల్వే స్టేషన్‌కు వచ్చి.. రైలులో సాదారణ బోగి ఎక్కి.. ప్రయాణించడం.. ఓ మహా ప్రహనంగా మారిపోయింది. ఇక ఓ ప్రయాణికుడు.. అత్యవసర సమయంలో రైల్వే సమాచారం కోసం రైల్వే స్టేషన్‌కి ఫోన్ చేయాలంటే.. నెంబర్ ఉండదు. అలాగే టోల్ ప్రీ నెంబర్లు కానీ కాన రానీ దుస్థితి నెలకొంది.  రైల్వే స్టేషన్ల అభివృద్దికి కోట్లది రూపాయిలు వెచ్చించే ఈ ప్రభుత్వాలు.. రిజర్వేషన్ల కౌంటర్ల వద్ద మరింత మంది సిబ్బందిని నియమించే విషయంలో మాత్రం అపరిచితుడిలాగా వ్యవహరిస్తోంది. అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిత్యం.. దేశవ్యాప్తంగా రైళ్లు అటు ఇటు వెళ్తుంటాయి. అలాంటి వేళ.. ప్రతి రైలుకు అటు రెండు...  ఇటు రెండు సాధారణ భోగిలు కాకుండా.. దాదాపు ఆరు నుంచి ఏడు సాధారణ ప్రయాణికుల కోసం బోగీలను ఏర్పాటు చేస్తే.. అత్యవసర ప్రయాణాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు సైతం ఎంతొ కొంత ఊరట చెందుతారు. అయితే ఆ దిశగా చర్యలు కాదు కనీసం ఆలోచన కూడా రైల్వే శాఖ చేయడం లేదు.  అంతే కాదు వందే బారత్.. వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌ల కంటే.. దూర ప్రాంతలకు వెళ్లే రైళ్లకు సాధారణ బోగీల సంఖ్య మరింత పెంచాల్సిన అవసరం.. అవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే సదరు సాధారణ బోగీల్లో.. కొన్ని గంటల పాటు సాగిస్తున్న సామాన్య ప్రయాణికుడు.. నిత్య నరకాన్ని ప్రతి ప్రయాణంలో చవి చూస్తున్నాడనేది ఎవరు కాదన లేని వాస్తవం.

రైలు ప్రమాద బాధితుల కోసం స్వచ్ఛందంగా రక్తదానం

ఒక విపత్తు సంభవించినపుడు, ఒక మహా విషాదం జరిగినప్పుడు జనం స్వచ్ఛందంగా సహాయ హస్తం అందించేందుకు ముందుకు రావడం భారత్ డీఎన్ ఏలోనే ఉంది. దివిసీమ ఉప్పెన, కోనసీమ ఉప్పెన వంటి సంఘటనలు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడానికి యావద్దేశం ముందుకు వచ్చింది. అలాగే  ఒడిశా రైలు ప్రమాద ఘటనలో 300 మందికి పైగా మరణించి, వెయ్యి మందికి పైగా గాయపడిన సందర్భంలో  క్షతగాత్రులకు రక్త దానం చేయడానికి జనం ఆస్పత్రుల ముందు క్యూ కడుతున్నారు.  ఆస్పత్రులలో చేరిన క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటమే కాకుండా వారికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఉండటంతో  రక్త దానం చేయడానికి బాలాసోర్ ఆస్పత్రికి వేల సంఖ్యలో జనం తరలి వచ్చారు. బాధితులకు ఆదుకోవడానికి తమ వంతు సాయంగా రక్తదానం చేయడానికి వాళ్లంతా స్వచ్ఛందంగా వచ్చారు. అలాగే ఘటనా స్థలం వద్ద స్థానికులు యుద్ధ పాత్రిపదికన జరుగుతున్న సహాయ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.   బోగీలలో చిక్కుకున్న వారిని బయటకు తీయడంలోనూ, గాయపడిన వారిని అంబులెన్సులలోకి చేర్చడంలోనూ సహాయక బృందాలకు సహాయం అందిస్తున్నారు.  రైలు ప్రమాదం జరిగిన శుక్రవారం రాత్రి నుంచి జనం ఎడతెరిపి లేకుండా వారి వంతు సహాయం వారు అందిస్తున్నారు. 

జవాబుదారీ తనం ఏదీ ఎక్కడ?

ఒడిశాలో మూడు రెైళ్లు ఢీకొన్న ఘటనలో  దగ్గరదగ్గర మూడు వంద ల మంది మరణించారు. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగి గంటలు గడిచినా ఇంకా సహాయక కార్యక్రమాలు పూర్తికాలేదు. బోగీల్లో ఎంత మంది చిక్కుకుని ఉన్నారన్న దానిపై స్పష్టత రాలేదు. రైల్వే మంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి, తమిళనాడు నుంచి ముగ్గురు మంత్రులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. మృతుల కుంటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అయితే  రైలు ప్రమాదాల నివారణకు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో, దానిని వినియోగించుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనడానికి ఒడిశా రైలు ప్రమాద ఘటన నిలువెత్తు నిదర్శనమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వంలో, సంబంధిత మంత్రిలో జవాబుదారీ తనం ఎక్కడుందన్న ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఒడిశా ప్రమాద ఘటనే తెలుసుకుంటే ఈ ప్రమాదం వెనుక కనిపిస్తున్నది నిర్లక్ష్యమేనని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రైలు ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన సాంకేతిక పరికరాలను వినియోగంలోకి తీసుకురావడంలో  అలవిమాలిన నిర్లక్ష్యం చూపుతున్న కేంద్రం.. విపక్ష నేతల కదలికలపై నిఘా కోసం కోట్లాది రూపాయలు వ్యయం చేస్తోందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. ఒడిశా రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది.   గతంలో రైలు ప్రమాద ఘటనలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన రైల్వే మంత్రుల ఉదంతాలను ఈ సందర్భంగా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 1956 నవంబర్ లో తమిళనాడులోని అరియాలూర్ లో రైలు ప్రమాదం జరిగి 142 మంది మరణించారనీ, ఆ సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన మంత్రి పదవికి రాజానామా చేశారు.  అంతకు ముందు 1956  ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ లోని మహబూబ్ నగర్ వద్ద రైలు ప్రమాదం సంభవించి 112 మంది మరణించిన సందర్భంలో కూడా రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. అయితే ప్రధాని నెహ్రూ అయన రాజీనామాను ఆమోదించలేదు. ప్రధాని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఊరుకున్న లాల్ బహదూర్ శాస్త్రి అదే ఏడాది నవంబర్ లో  మరో రైలు ప్రమాదం జరగడంతో నెహ్రూకు తిరస్కరించే అవకాశం లేకుండా మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమోదించి తీరాల్సిందే అని పట్టుబట్టి మరీ పదవి నుంచి వైదొలగారు. ఇక 1999 ఆగస్టలో అసోంలో జరిగిన రైలు ప్రమాదంలో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ సైతం తన పదవికి రాజీనామా చేశారు.  ఆ తురువాత కూడా 2000 సంవత్సరంలో జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ చేసిన రాజీనామాను అప్పటి ప్రధాని వాజ్ పేయి ఆమోదించలేదు. అలాగే 2106లో పాట్నా సమీపంలో రైలు ప్రమాదం జరిగి 150 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదానికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి సురేష్ ప్రభు చేసిన రాజీనామాను ప్రధాని మోడీ ఆమోదించలేదు. అయితే తాజాగా ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చినా దానిని వినియోగించుకోవడంలో విఫలం కావడం వల్ల జరిగిన ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ను కనీసం ఆయన పరిగణనలోనికి తీసుకోకపోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.   మోడీ సర్కార్ లో మంత్రులలో జవాబుదారీ తనం కనిపించడం లేదన్న విమర్శలు చాలా కాలంగా వినవస్తున్న సంగతి తెలిసిందే.   

 దేశ ప్రతిష్ట తీసిన రాహుల్ 

అమెరికాలో మన ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వల్ల దేశ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విదేశీ గడ్డపై ఇండియా సమస్యలు, పరిష్కారాల మీద మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి లాభించేది. మోడీ పాలన గురించి విమర్శిస్తే పర్వాలేదు వ్యక్తిగతంగా దూషించడం భారత్ ను చులకన చేసినట్టయ్యింది ఎందుకంటే మోడీ చరిష్మా ఉన్న నేత. ప్రపంచంలో అత్యంత శక్తివంత ప్రధానులలో ఆయన ఒకరు. అటువంటి నేత మీదే రాహుల్ బాణాలు సంధించడం నెగెటివ్ మీనింగ్  వెళుతుంది. భార్యభర్తలు కొట్లాడుకుంటే ఆ గొడవ ఇంట్లో మటుకే పరిమితం చేస్తే బాగుంటుంది. నలుగురికి తెలిస్తే పరువుపోతుంది. మన దేశ జాతీయత భావం మోడీ హాయంలో విపరీతంగా పెరిగింది . ఈ సమయంలో  మోడీ మీద రాహుల్ విమర్శ చేయడం వల్ల కాంగ్రెస్ పరువు బజారున పడింది.  మరికొద్ది రోజుల్లో మన ప్రధాని మోడీ అమెరికా వెళ్లనున్నారు. ఆయన పర్యటనకు ముందే రాహుల్ అమెరికా చేరుకుని మోడీని విమర్శించడం రాంగ్ మెసేజ్ వెళుతుందన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది.  ‘‘ప్రధానికి అన్ని తెలుసు అనుకుంటాడు. దేవుని కంటే తాను ఎక్కువ అనుకుంటాడు. దేవుడికే హిత బోధ చేయగలనని’’ భావిస్తాడు అని  మోడీని చులకన చేసి మాట్లాడటం మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. ‘‘ నఫ్రత్ కే బజార్ మే మొహబ్బత్ కే దుకాణ్ కోలింగే హమ్ ’’ అంటూ ఫక్తు రాజకీయాలే మాట్లాడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. 

 తలసాని గెలవడం కష్టమే? 

మంత్రి తలసానికి స్వంత పార్టీలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. సనత్ నగర్  అసెంబ్లీ      నియోజకవర్గం నుంచి గెలుపొందిన తలసానికి ద్వితీయ శ్రేణి నేతల నుంచి మద్దత్తు కరవయ్యింది. ఏళ్ల తరబడి పార్టీ జెండాలు మోస్తున్న తమకు కనీసం నామినేటెడ్ పోస్టులు దక్కకుండా తలసాని అడ్డుకుంటున్నాడని ద్వితీయ శ్రేణి నేతలు ఆరోపిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల సమయంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచే బిజెపి వోట్లుఎక్కువయ్యాయి. ఈ కారణంగా సికింద్రాబాద్  నుంచి బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి గెలుపొందారు. తలసాని ప్రాతినిద్యం వహిస్తున్న సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం  ప్రజలు బిజెపి అభ్యర్థి విజయానికి కారకులయ్యారు.   గత అసెంబ్లీ ఎన్నికలలో       సనత్ నియోజకవర్గం టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి  ఓడిపోయిన కూన వెంకటేశ్ గౌడ్ బిఆర్ఎస్ లో చేరినప్పటికీ అతనికి నామినేట్ పోస్టులు రాకుండా తలసాని అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. తలసానితో వేగలేక కూన తిరిగి టీడీపీలో చేరారు.  కాగా తలసాని కుమారుడి జోక్యం పార్టీలో పెరిగిపోతుందని ఆరోపించే వారు ఎక్కువయ్యారు. భూ కబ్జాలు, సెటిల్ మెంట్స్ లో తలసాని కుమారుడి పాత్ర ఎక్కువయ్యిందని  ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. తలసానికి పట్టు ఉన్న రెజిమెంటల్ బజార్  వంటి ప్రాంతాల్లో బిఆర్ఎస్ వోట్లు పడడం కష్టమేనన్నారు.  

ఆర్జీవీ వ్యూహం.. తెరపైకి భారతి!

మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. వరుసగా రెండోసారి అధికారాన్ని అందుకోవాలన్న లక్ష్యంతో  వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. అలాంటి వేళ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో  జగన్ బయోపిక్.. వ్యూహాత్మకంగా తెరకెక్కుతోంది.  అయితే ఈ చిత్రంలోని పలు సన్నివేశాలకు చెందిన నాలుగు ఫొటోలను రామగోపాల్ వర్మ సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో   జగన్‌గా అజ్మల్... ఆయన భార్య   భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్   నటిస్తున్నారు. ఈ ఫొటోల్లో... వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్ర ఫటంలో.. ఆజ్మల్, మానస రాధాకృష్ణన్ కనిపించీ కనిపించకుండా ఉన్నారు. ఇక రెండో చిత్రంలో అజ్మల్ ఆందోళనతో ఏదో  చెబుతుండగా.. అతడి మొఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న ఆందోళనను భారతీ పాత్రలో మానస రాధాకృష్ణన్ తీవ్ర ఆవేదనతో గమనిస్తున్నట్లుగా ఉంది. ఇక మరో ఫొటోలో అజ్మల్‌కు ఫోన్ రావడం.. మానస.. ఆందోళనతో మంచంపై నుంచి లేచి కూర్చొవడం.. వంటి ఫోటోలు వదిలారు. అయితే   వీరిద్దరు ఇంత ఆందోళనతో ఉండడాన్ని బట్టి చూస్తే.. ఇది వైఎస్ జగన్   చిన్నాన్న వైయస్ వివేక హత్య జరిగిన సమయంలో వచ్చిన ఫొన్ కాల్‌గా నెటిజన్లు భావిస్తున్నారని వారి కామెంట్లను బట్టి అవగతమౌతోంది.  మరోవైపు ఈ చిత్రం అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్దం అంటూ క్యాప్షన్   పెట్టారు. మరోవైపు ఇది బయోపిక్ కాదు.. బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్.. బయోపిక్‌లో అబద్దాలు ఉండొచ్చు కానీ.. రియల్ పిక్‌లో వందకి వందశాతం నిజాలే ఉంటాయని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ చిత్ర షూటింగ్ శరవేగంతో జరుపుకొంటోంది. ఈ చిత్రం ఎన్నికల నాటికి విడుదల చేసి.. లబ్ధి పొందాలన్న లక్ష్యంతో  జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం రెండో భాగం తెరకెక్కనుందని.. ఆ చిత్రానికి శపథం పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.   ఇక మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి.. అధికారంలోకి రావడంతో.. మహీ వి. రాఘవ దర్శకత్వంలో యాత్ర పేరుతో మమ్ముటి నటించిన చిత్రం 2019 ఎన్నికలకు ముందు విడుదలై.. ఘన విజయం సాధించింది. అలాగే వైయస్ఆర్ మరణం తర్వాత ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ పాదయాత్ర సైతం చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని మహీ వి రఘవ దర్శకత్వంలో యాత్ర 2 పేరుతో చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది.   ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో 2019 ఎన్నికలకు ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ తర్వాత అమ్మ రాజ్యంలో కడప రెడ్లు పేరుతో ఓ చిత్రాన్ని సైతం తెరకెక్కించారు.  మరి ఎన్నికల వేళకు ఈ వ్యూహాం చిత్రం పూర్తయి.. ప్రజల ముందుకు వస్తుందా? వస్తే.. జగన్ పాదయాత్రలో నాడు ఇచ్చిన హామీలు.. ఆయన గద్దెనక్కిన తర్వాతా అంటే.. ఈ నాలుగేళ్లలో పుల్ ఫిల్ చేసేశారా? అనేది.. చిత్రం విడుదలై.. ప్రజలు ఎలా రిసివ్ చేసుకొంటారనే ఓ చర్చ జోరుగా సాగుతోంది. 

కవిత అరెస్ట్ పై దాగుడు మూతలు 

కర్ణాటక ఫలితాల తర్వాత మద్యం కుంభకోణంలో నిందితురాలైన కల్వకుంట్ల కవితపై బిజెపీ ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. కర్ణాటక ఫలితాల తర్వాత కవిత అరెస్ట్ ఖాయమని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేశారు. ఆమె జైలు గది కూడా సిద్దమైందని ఒక దశలో ప్రచారం చేశారు. కర్ణాటక ఎన్నికలకు ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎటువంటి సంబంధం లేదు. కర్ణాటక ఎన్నికలు జరిగాయి, ఫలితాలు వెలువడ్డాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న బిజెపి ఓడిపోయింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని దేవగౌడ అభ్యర్థన మేరకు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కెసీఆర్ పాల్గొనాలి. ఢిల్లీ బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవం కాగానే కెసీఆర్ నేరుగా కర్ణాటక వెళతారని షెడ్యూల్ లో ఉంది. జెడీఎస్ తరపున కెసీఆర్ ఏ ఒక్క బహిరంగ సమావేశంలో పాల్గొనలేదు. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే కూతురు కవితను అరెస్ట్ చేస్తామని బిజెపి బ్లాక్ మెయిల్ చేసిందని తెలంగాణాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. జనతాదళ్ ఎస్  పార్టీకి ఫండ్ ఇస్తానని కెసీఆర్ హామి ఇచ్చినట్లు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ ఎస్ నేత  కుమార స్వామి చెప్పారు. ఫండ్ ఇవ్వలేదు కనీసం ప్రచారం కూడా చేయలేదని కుమారస్వామి ఆరోపించారు.  కాగా తెలంగాణలో తమ పార్టీ మూడో పొజీషన్ లో ఉందని తెలంగాణ బిజెపి నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కర్ణాటక ఎన్నికలకు ముందు ఈ బిజెపి నేతలు తెలంగాణలో అధికారంలో వస్తామని, తమకు బిఆర్ఎస్ పోటీ కూడా ఇవ్వలేదని జోస్యం చెప్పారు. అనేక చోట్ల బిఆర్ఎస్ డిపాజిట్లు కూడా రావని చెప్పారు. కవిత అరెస్ట్ అటకెక్కిన తర్వాత తెలంగాణ బిజెపి నేతలు కాంగ్రెస్ , బిఆర్ఎస్ మధ్యే పోటీ ఉండబోతుంది. మేము థర్డ్ పొజిషన్ లో ఉంటామని అంగీకరిస్తున్నారు.  ఇంత పెద్ద భారీ స్కాంలో నిందితురాలైన కవితను కాపాడటానికి కెసీఆర్ చక్రం తిప్పారని జోరుగా ప్రచారం జరుగుతుంది.  కూతురును సిబిఐ, ఈడీ కేసుల నుంచి విముక్తి చేయడానికి కెసీఆర్ బిజెపితో అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తుంది. బిజెపిని పల్లెత్తు మాట అనడం లేదు. పైగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. కవిత అరెస్ట్ అయితే తమ పార్టీ గెలుస్తుంది. ఒక వేళ చేయకపోతే తమ పార్టీ ఓడిపోతుందని తెలంగాణ బిజెపి నేతలు బాహాటంగానే స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నారు.  ఇదిలా ఉండగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధం ఉన్నట్లు  ఆరోపణ ఎదుర్కొంటున్న శరత్ రెడ్డి గత సంవత్సరం నవంబర్ లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ప్రస్తుతం ఆయన అప్రోవర్ గా మారిపోయారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు అతని నుంచి సేకరించిన సాక్ష్యాధారాలను బట్టి కెసీఆర్ కూతురు కవిత అరెస్ట్ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది. కెసీఆర్ తమ గుప్పిట్లో ఉండే విధంగా బిజెపి ప్రభుత్వం శరత్ రెడ్డి ని అప్రోవర్ గా నియమించిందని ప్రచారం జరుగుతోంది.