ఘోర రైలు ప్రమాదం..250 మంది మృత్యువాత
posted on Jun 3, 2023 @ 10:09AM
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 250 మంది మృత్యువాత పడ్డారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దుర్ఘటన బాలాసోర్ చిల్లాలో జరిగింది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.
రెండు రైళ్లు ఢీకొన్నాయా? మూడు రైళ్లు ఢీకొన్నాయా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కోరమండల్ రైలు బోగీలు పట్టాలు తప్పాయనీ, ఆ బోగీలను... యశ్వంత్‌పూర్- హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్.. ఢీకొట్టిందనీ రైల్వే శాఖ చెబుతుంటే.. ఆగి ఉన్న రైలును కోరమాండ్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొందని చెబుతున్నారు. ఈ ఘటన బహనాగ్ రైల్వే స్టేషన్ లో జరిగింది. కాగా అధికారిక సమాచారం మేరకు శుక్రవారం (జూన్ 2) రాత్రి 7 గంటల సమయంలో షాలిమార్- చెన్నై కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పది నుంచి 12 బోగీలు ఎదురుగా ఉన్న ట్రాక్ పై పడిపోయాయి. అదే సమయంలో ఎదురుగా ఉన్న ట్రాక్ పై వస్తున్న యశ్వంత్ పూర్ నుండి హౌరాకు వెళ్లే మరో రైలు పట్టాలు తప్పిన కోచ్ లలోకి దూసుకెళ్లింది ఫలితంగా ఆ రైలు కూడా పట్టాలు తప్పింది.
కాగా ఘోర రైలు ప్రమాదం పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమౌతోంది. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇలా ఉండగా ప్రమాద స్థలానికి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేరుకున్నారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కాగా రైలు ప్రమాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉదయనిథి స్టాలిన్, అనిల్ మహేష్, శివశంకర్ లను హుటాహుటిన సంఘటనా స్థలిని పంపించారు.
ఏపీ ముఖ్యమంత్రి ప్రమాదానికి గురైన రైళ్లలో ఏపీ వాసుల గురించి ఆరా తీశారు. ప్రమాద ఘటనా స్థలికి సహాయక బృందాలు హెలికాప్టర్ లో చేరుకున్నాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాద కారణాలపై విచారణకు రైల్వే శాఖ మంత్రి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.