బ్రేకింగ్.. బ్రేకింగ్... వరద ముంపులో మల్యాల, కొండాయి గ్రామాలు
posted on Jul 28, 2023 @ 9:33AM
ఉభయ తెలుగు రాష్ట్రాలనూ భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వచ్చిన మెరుపు వరదలతో తెలంగాణ ఏటూరునాగారం మండలం కొండాయిలో జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జంపన్న వాగు వరద ఉధృతికి కొండాయి, మల్యాల గ్రామాలు ముంపునకు గురయ్యాయి.
ఏడుగురు గల్లంతయ్యారు. ఇక ఏపీలో మున్నేరు వాగు ఇంకా ఉద్ధృతంగానే ప్రవహిస్తుండడంతో కృష్ణా జిల్లా కీసర టోల్‌గేట్ నుంచి విజయవాడ వైపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వరద ఉద్ధృతి కారణంగా ఐతవరం వద్ద నిన్న సాయంత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేశారు.
పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈ ఉదయం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. మున్నేరుకు ప్రస్తుతం 1,92,000 క్యూసెక్కుల వరద వస్తుండగా ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, నిన్న సాయంత్రం నుంచి వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.