కుంకీ ఏనుగులు పని మొదలెట్టేశాయ్!

ఆంధ్రప్రదేశ్ లో కుంకీ ఏనుగులు పని మొదలు పెట్టేశాయి. అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న పంటపొలాలు, గ్రామాలపై ఏనుగుల గుంపు పడి విధ్వంసం సృష్టిస్తుండటం, కొన్ని సార్లు ప్రాణనష్టం కూడా కలిగిస్తున్న నేపథ్యంలో ఏనుగుల బెడద నుంచి గ్రామాలను, పొలాలను కాపాడే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చొరవతో  కర్నాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించారు. ముఖ్యంగా ఏనుగుల బెడద చిత్తూరు జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన కుంకీ ఏనుగులు తమ తొలి ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించాయి.   చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ గస్తీ నిర్వహించిన  కుంకీ ఏనుగులు పలమనేరు ప్రాంతంలో తిరుగుతున్న ఎనిమిది ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించాయి.  

జార్ఖండ్ మాజీ సీఎం శిబూసొరేన్ కన్నుమూత

జార్ఖండ్ మాజా ముఖ్యమంత్రి శిబూ సొరేన్ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ( ఆగస్టు 4) ఉదయం కన్నుమూశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన జూన్ నెలలో ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచీ ఆక్కడే చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమించి సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన కుమారుడు హేమంత్ సొరేన్ ప్రస్తుతం జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.   జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన శిబు సొరేన్..  ఆ లక్ష్య సాధన కోసమే జార్ఖండ్ ముక్తిమోర్జా పార్టీని స్థాపించారు. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడు సార్లు పని చేశారు. 2004 నుంచి 2006 వరకూ కేంద్ర మంత్రిగా పని చేశారు.   శిబు సోరెన్ మృతి పట్ల  జార్ఖండ్ ముఖ్యమంత్రి, శిబు సొరేన్ కుమారుడు హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  గురూజీ  మనను విడిచి వెళ్లారంటూ సామాజిక వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. తన తండ్రి మరణంతో తాను శూన్యంలో ఉన్నానని పేర్కొన్నారు.  

కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదరింపు కాల్ వచ్చింది.ఆదివారం (ఆగస్టు 3) గుర్తు తెలియని అగంతకుడి నుంచి గడ్కరీ నివాసంలో బాబు పెట్టినట్లు ఫోన్ చేశాడు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు ఒక్కసారిగా ఉలక్కిపడ్డారు.   వెంటనే రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్ గడ్కరీ నివాసంలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు. అయితే బెదరింపు కాల్ చేసిన అగంతకుడి ఆచూకీ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.   కాల్ వచ్చిన  ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన క్రైమ్ బ్రాంచ్ బృందాలు గంటల వ్యవధిలోనే బెదరింపు కాల్ చేసిన వ్యక్తి ఆచూకీ కనుగొన్నాయి. బెదరింపు కాల్ చేసిన నాగ్‌పూర్‌లోని తులసి బాగ్ రోడ్డులో ఉన్న ఓ మద్యం దుకాణంలో పనిచేస్తున్న ఉమేష్ విష్ణు రౌత్‌ను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  

మూఢభక్తి.. దేవుని దగ్గరకంటూ బలవన్మరణం!

దేవుడిపై భక్తి ఉండటంలో తప్పులేదు. కానీ అధి మూఢభక్తిగా మారితే మాత్రం అనర్ధాలు తప్పవు. సరిగ్గా అలాగే జరిగింది ఆ వివాహిత విషయంలో. హాయత్ నగర్ ఉర్దూ గల్లిలో నివాసం ఉండే అరుణ్ కుమార్ భార్య పూజకు దైవ భక్తి ఎక్కువ. ఆమెకు భర్త అరుణ్ కుమార్,  పిల్లలు ఏ రకంగా చూసినా ఆమెది చింతలు లేని చక్కటి కుటుంబం. అయితే పూజకు దైవభక్తి మెండు. నిత్యం పూజలూ, పునస్కారాలతోనే గడుపుతుంటుంది. ఆమె భక్తి మూఢ భక్తి లిమిట్ కూడా దాటిపోయింది. ఏకంగా దేవుడి దగ్గరకు వెడుతున్నానంటూ ఓ ఐదు పేజీల సూసైడ్ నోట్ రాసి తాము నివసిస్తున్న అపార్ట్ మెంట్ ఐదో అంతస్తు పై నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.  తల్లిగా పిల్లల ఆలనాపాలనా చూడాల్సిన ఆమె దేవుడి దగ్గరకు ప్రయాణం అంటూ తనువు చాలించింది. పోలీసులు ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

బీఆర్ఎస్ లో లక్కీ భాస్కర్ స్కీమ్?

నాన్నా విదేశాలకు వెళ్లిపోదాం పదండి.. ఇదీ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో చేస్తున్న కొత్త ప్రతిపాదనగా పార్టీ వర్గాలు, పరిశీలకులు అంటున్నారు.   బీజేపీ నేత సీఎం రమేష్  రహస్యాలన్నీ బయట పెట్టేశారు..  అవి మరింత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దానికి తోడు ఫోన్ ట్యాపింగ్, సహా పలు కేసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో  స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత   అరెస్టు తప్పదన్న ప్రచారమూ జోరుగా ఉంది. అంతే కాకుండా  అన్ని కేసుల దర్యాప్తులూ చివరి దశకుచేరుకుంటున్నాయి.   రీసెంట్ గా కాళేశ్వరం కర్త- కర్మ- క్రియ అన్నీ కేసీఆరే అంటూ కాళేశ్వరం కమిషన్ నివేదికను ఉటంకిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రముఖంగా ప్రచురించింది. ఇలా అన్ని ఇబ్బందులూ, కష్టాలూ ఏకకాలంలో చుట్టుముడుతున్న నేపథ్యంలో ఇక్కడే ఉంటే అవమాన భారం తప్పదన్న భావనతో కేటీఆర్  విదేశాలకు పోదాం అన్న ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్ ముందు యూఎస్, యూకే, దుబాయ్ వంటి ఆప్షన్లు ప్రతిపాదించారట ఇంత చేశారు. సంపాదించారు. వాటిని లక్కీభాస్కర్ సినిమాలో ఆ హీరో లాఎస్కేపై సేఫ్ గా ఉందామన్నదే కేసీఆర్ ప్రతిపాదనగా చెబుతున్నారు.  అయినా ఇదేమైనా జరగనిదా? గతంలో బ్రిటీషర్లు కూడా అంతేగా.. 3 లక్షల కోట్ల మేర పడవల్లో సర్దేసుకుని మన సంపదతో ఉడాయించారు. వాళ్లేమైనా మనలాగా రాష్ట్ర సాధన చేశారా? మన దేశమే మనికిచ్చి వెళ్లిపోయారు. అదే మనం  రాష్ట్రాన్ని సాధించాం. ఎప్పటికీ మీరే సీఎంగా ఉంటారని నమ్మాం. కానీ జనం కాంగ్రెస్ కి అధికారమిచ్చి మనకు జలక్ ఇచ్చారు. అలాంటి జనానికి మనమూ ఓ జర్క్ ఇద్దాం. దానికి తోడు ఇదేమైనా కొత్తా.. మొన్నటికి మొన్న మనకన్నా ముందే ప్రభాకర్ రావు యూఎస్ చెక్కేయలేదూ.. మనమూ అలాగే వెళ్లిపోదాం అన్నది కేటీఆర్ వాదనట.  అంతా బాగుంది కానీ ఇంత బతుకు బతికి అక్కడెక్కడో దేశం గాని దేశానికెళ్లి సెటిలవడమేంటన్నది కేసీఆర్ అభ్యంతరమట. ఇక్కడే ఉందాం... నేనుండే వరకూ నన్ను వేధిస్తారు. ఆ తర్వాత అంతా మరచి పోతారు. నువ్వు నీ కుటుంబం, నీ చెల్లి బావ, ఇతర బంధుమిత్రులు హ్యాపీగా బతకొచ్చు. కాబట్టి ఏం నారాజ్ కావద్దని కేసీఆర్ కేటీఆర్ ను సముదాయిస్లున్నారట.  మరి ఈ అటలో ఎంత వరకూ వాస్తవం ఉందో..  కేసీఆర్ జైలుకెళ్తారా? ఆ అవమాన భారాన్ని మోస్తారా? చూడాల్సి ఉందంటున్నారు పరిశీలకులు

జగన్ అడ్డా పై ఆందోళన.. పులివెందులలో పరువు గల్లంతేనా?

పులివెందల..ఆ పేరు చెప్తేనే రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపించే పేరు వైఎస్ కుటుంబం.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచీ.. అంటే 1978 నుంచి ఇప్పటివరకు పులివెందుల లో ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం ఆ కుటుంబానిదే అన్నట్లుగా వైఎస్ హవా సాగింది. వైయస్ మరణానంతరం ఆయన కుమారుడు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ హావా కొనసాగిస్తూ  వచ్చారు. ఇప్పటి వరకూ పులివెందుల అంటే వైఎస్, ఆయన కుమారుడి జగన్ అడ్డాగా ఉన్న పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయిందా? అంటే వైసీపీ నేతలే ఔనని అంటున్నారు. త్వరలో జరగనున్న పులివెందుల జడ్పీటీసీ  ఉప  ఎన్నికలో విజయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ పోటీలో నిలబడటమే కాకుండా ,  గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుడడంతో ఇప్పుడు వైసీపీ ముఖ్య నేతల నుంచి,  పార్టీ శ్రేణుల వరకు పులివెందులలో పరువు గల్లంతౌతుందా అన్న భయం వ్యక్తం చేస్తున్నారు.  అసలు పులివెందులలో ఎన్నికలంటే విజయం వైఎస్ కుటుంబానిదే అన్నట్లుగా అంతా భావించేవారు. ప్రత్యర్థులు కూడా అక్కడ పరాజయాన్ని ఎన్నికకు ముందే అంగీకరించేసే పరిస్థితి ఉండేది. అలాంటిది ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీ ఉప పోరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారా? వైసీపీ అంటే జగన్ పట్టు నిలుపుకుంటారా? అన్న అనుమానాలు వైసీపీలోనే వ్యక్తం అవుతోంది.   పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో తెలుగుదేశం పులివెందుల నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డిని బరిలో దింపింది.  బీటెక్ రవి ఎమ్మెల్సీగా, మాజీ మంత్రి దివంగత వైయస్ వివేకానందరెడ్డిపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పులివెందుల తెలుగుదేశం ఇన్చార్జిగా ఉన్న బీటెక్ రవి వ్యూహరచనలో  దిట్టగా గుర్తింపు పొందారు.  ఆయన సతీమణి  లతారెడ్డి టిడిపి అభ్యర్థిగా  నామినేషన్ దాఖలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ  పులివెందుల జెడ్పీటీసీని దక్కించుకోవాలన్న పట్టుదలతో తెలుగుదేశం పార్టీ ఉంది.  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పులివెందుల ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు.  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో  వైసిపి అత్యధిక స్థానాలను గెలిపించుకుంది. దీంతో ఇప్పుడు పులివెందులలో జగన్ కు పరాభవం కలిగేలా చేసి సత్తా చాటాలని తెలుగుదేశం పట్టుదలతో ఉంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికను టీడీపీ అవకాశంగా భావిస్తోంది.  దీంతో తెలుగుదేశం నేతలు గతంలో ఎన్నడూ లేని విధంగా   ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ప్రతి కుటుంబాన్ని కలుస్తూ,  విజయం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  తెలుగుదేశం దూకుడుతో వైసీపీ బెంబేలెత్తిపోతున్నది.   పులివెందుల ఉప ఎన్నికల్లో జడ్పిటిసి స్థానాన్ని కైవసం  కైవసం చేసుకోవడమే టార్గెట్ గా  పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆ పార్టీ నాయకులకు  దిశా నిర్దేశం చేయడంతో పాటు జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ని ఈ ఎన్నికల్లో సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది.  దీంతో ఆదినారాయణరెడ్డి   గత కొన్ని రోజులుగా  పులివెందులలో  మకాం వేసి, స్థానిక నాయకులు, అన్ని పంచాయతీలోని  నాయకులతో చర్చలు జరుపుతూ తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం కసరత్తు చేస్తున్నారు. ఆదినారాయణ రెడ్డికి పులివెందుల లో బంధుత్వాలు ఉండడం, పక్క నియోజకవర్గమే కావడంతో పులివెందుల మండలంలో జరిగే ఉప ఎన్నికల్లో వాటన్నిటిని సమీకరించి  తెలుగుదేశం అభ్యర్థి  లతారెడ్డిని గెలిపించే వ్యూహంతో ఉన్నారు. ఇందుకు తోడు బీటెక్ రవికి పులివెందుల మండలంలో ఉన్న పట్టు తోడౌతుందని పరిశీలకులు భావిస్తున్నారు.   అలాగే   పులివెందుల నియోజకవర్గం నుంచి రాయలసీమ పట్టభధ్రుల స్థలానికి పోటీ చేసి విజయం సాధించి సంచలనం సృష్టించిన  భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి  కేడా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తున్నారు.  అంటే కడప జిల్లాకు చెందిన ముగ్గురు ముఖ్య నేతలు పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి విజయం కోసం సమష్టిగా పని చేస్తున్నారు.  వైసీపీ విజయంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.    వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత మండలం అయిన పులివెందులలో ఈ పరిస్థితి తలెత్తడం వైసీపీ జీర్ణించుకోలేకపోతున్నది. దానికి తోడు జగన్ కు తల్లి విజయమ్మ, చెల్లలు షర్మిల దూరం కావడంతో వైఎస్ కుటుంబంలో స్పష్టమైన చీలిక వచ్చిన పరిస్థితి. ఈ తరుణంలో పులివెందుల జడ్పీటీసీ ఉప పోరులో వైసీపీ అభ్యర్థి విజయం అంత సులువు కాదన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నది.   వైసీపీ నుంచి గత స్థానిక సంస్థల ఎన్నికల్లో  పులివెందుల జడ్పీటీసీగా విజయం సాధించిన  మహేశ్వర్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందడంతో  ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. వైసీపీ అభ్యర్థిగా దివంగత మహేశ్వర్ రెడ్డి తనయుడు తుమ్మల హేమంత్ రెడ్డి ని  అభ్యర్థిగా బరిలో  దిగారు .కడప ఎంపీ అవినాష్ రెడ్డి  హేమంత్ రెడ్డి విజయం కోసం పని చేస్తున్నారు. అయితే  పులివెందులలో గతంలో ఉన్న పరిస్థితులు లేకపోవడం, అప్పుడు ఉన్నంతమంది నాయకులు ఇప్పుడు అందుబాటులో లేకపోవడం వైసీపీకి ఇబ్బందిగా మారాయి.  ఈ పరిస్థితుల్లో  పులివెందులలో జగన్ కు, వైసీపీకీ పరాభవం తప్పదా అన్న అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నాయి. 

అంతర్రాష్ట్ర గుర్రపు పందాల రాకెట్ ను గుట్టు రట్టు చేసిన పోలీసులు

బాగా చదువుకున్నాడు... ఇతర రాష్ట్రానికి వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాడు. కానీ అడ్డదారిన అడ్డగోలుగా సంపాదించి సంపన్నుడు కావాలన్న దురాశతో తప్పుదోవ పట్టాడు.   ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అంతర్రాష్ట్ర  బెట్టింగ్ సామ్రా జ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇలా గత ఐదు సంవత్సరాలు గా అంతర్రాష్ట్ర బెట్టింగ్  సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కానీ చివరకు పోలీసుల చేతికి చిక్కి ఊచలు లెక్కబడుతున్నాడు.  ఆంధ్రప్రదేశ్ పాత గుంటూరుకి చెందిన తోకల నగేష్ (45) అనే వ్యక్తి మహావీర్ కళాశాల నాగార్జున విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు. చదువు పూర్తి అయిన తర్వాత   చెన్నైలోని హ్యూ లేట్ ప్యాకర్డ్ కంపెనీలో పని చేశాడు. ఆ సమయంలో నగేష్ గుర్రపు పందాలకు బానిస అయ్యాడు. అయితే 2020 కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులతో   నగేష్ చెన్నై నుండి హైదరాబాద్ కు మకాం మార్చాడు. అదే సమయంలో నగేష్ కు హైదరాబాద్ కు చెందిన రాజేష్ కుమార్, విజయవాడకు చెందిన వెంకట చౌదరి తో పరిచయం ఏర్పడింది. నగేష్ ఈ ఇద్దరితో కలిసి గుర్రపు పందాలు ప్రారంభించాడు. బాగా లాభాలు వస్తుండటంతో   నగేష్ ఆ ఇద్దరి నుండి విడిపోయి హైదరాబాదు నగరంలో ఉంటూ గుర్రపు పందాలు నిర్వహించాడు. షిమ్ వెల్ ఎంటర్ ప్రైజెస్ అనే వాట్సాప్ గ్రూప్ ను సృష్టించి.. గేమింగ్ హౌస్ ఆఫ్ హార్స్ బెట్టింగ్ నిర్వహించాడు.  అమాయకులను  ప్రలోభ పెట్టి  పెట్టుబడులు పెడితే అధిక  లాభాలు వస్తాయంటూ నమ్మించి... వారిచేత పెట్టుబడి పెట్టించేవాడు... ఈ విధంగా నిందితుడు నగేష్ అక్రమ గుర్రపు బెట్టింగ్లో దేశవ్యాప్తంగా 105 మందిని సభ్యులుగా చేర్చుకున్నాడు. అందులో 20 మంది జంట నగరానికి చెందిన వారే ఉన్నారు. జవహర్ నగర్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారం రావడంతో వెంటనే దాడులు చేసి అంతర్రాష్ట్ర గుర్రపు బెట్టింగ్ రాకెట్   గుట్టు రట్టు చేసి... నగేష్, బుర్ర వెంకయ్య చౌదరి, చల్లా రమేష్ బాబు, డి సునీల్ లను అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు లక్షల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండు ఖాతాల్లో ఉన్న 2,47000 సీజ్ చేశారు. వెంకట్ చౌదరి, రాజేష్ కుమార్ పరారీలో ఉన్నారు వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  నిందితులు బ్యాంక్ ఖాతాలలో 8,34,50,749 లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.

స్నేహితుడి బర్త్డే పార్టీ పేరుతో డ్రగ్స్ పార్టీ.. ఆరుగురు ఐటీ ఉద్యోగులు అరెస్టు

ఐటీ ఉద్యోగులకు వీక్ ఎండ్ వచ్చిందంటే చాలు.. చిల్ అయిపో తుంటారు. పబ్ లు పార్టీలతో ఎంజాయ్ చేస్తుంటారు. కొందరు షాపింగ్ ల పేరుతో డబ్బులు ఖర్చు పెడుతుంటే.. మరికొందరు మద్యం మత్తులో తూగిపోతుంటారు. ఇంకొందరు అయితే డ్రగ్స్ తీసుకొని రెండు రోజులపాటు మత్తులో తేలియా డుతూ ఉంటారు. మళ్లీ సోమవారం నుంచి శుక్రవారం వరకు పనుల్లో బిజీ అయిపోతారు.  అయితే వీరందరూ వీక్ ఎండ్ పార్టీ కోసం ముందుగానే ప్లాన్ చేసుకుంటారు.  హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న రిసార్టులు, ఫామ్ హౌస్ లలో  వీకెండ్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ వీకెండ్ పార్టీల పైన ఎక్సైజ్, పోలీస్ అధికారులు నజర్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో ఆరు గురు ఐటి ఉద్యో గులు కలిసి ఏర్పాటు చేసుకున్న వీకెండ్ పార్టీపై పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్ లో ఆ వీకెండ్ పార్టీలో డ్రగ్స్  డ్రగ్స్ తీసు కుంటూ చిల్ అవుతున్న ఆరుగురు ఐటి ఉద్యోగులను ఎక్స్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు   అరెస్ట్ చేసారు. స్నేహితుడి బర్త్ డే పార్టీ పేరుతో వీరు ఈ వీకెండ్ పార్టీ జరుపుకుంటున్నారు. ఏల్ఎస్ డి బ్లాట్స్, హష్ అయిల్, మద్యం తో పార్టీ చేసుకుం టున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు   ఎక్స్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ పై సోదాలు జరిపి ఆరుగురిని అరెస్టు చేశారు. అలాగే డ్రగ్స్, మూడు ఖరీదైన లగ్జరీ కార్లను  స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ను హిమాచల్ ప్రదేశ్ నుంచి తీసుకు వచ్చినట్లు విచారణలో  ఉద్యోగులు వెల్లడించారు.. మరో ఇద్దరు ఐటీ ఉద్యోగులు  పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. 

సింగపూర్ లో.. సముద్రాన్ని పూడ్చి ప్లాంట్ ఎలా కట్టారో తెలుసా ?

ఇటీవల సింగపూర్ పర్యటించిన చంద్రబాబు బృందం అక్కడ సముద్రాన్ని పూడ్చి నిర్మించిన ఒక దీవిలోని పెట్రోల్ ప్లాంట్ ని సందర్శించారు.  ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఒక సముద్రాన్నే పూడ్చి ప్లాంటు నిర్మించగా లేనిది.. అమరావతిలోని ఈ మాత్రం నీటిని పూడ్చడం ఎంత పని? కానీ ఇక్కడే జగన్ మార్క్ విధ్వంసమే ప్రధాన అడ్డంకిగా కనిపిస్తుంది.  ఎందుకంటే ఆయన విచ్చలవిడిగా పెట్టిన ఖర్చు..   ప్రస్తుతం అమరావతి నిర్మాణానికి ఆటంకాలను సృష్టిస్తోంది.  గత జ. మో. రె. (జగన్ మోహన్ రెడ్డి) పాలనలో ఐదేళ్ల పాటు అప్పు చేసి మరీ సంక్షేమానికి పెట్టిన ఖర్చు అక్షరాలా రెండున్నర లక్షల కోట్లు. ఇదంతా ఆయన గెలుపునకూ పనికి రాలేదు. రాష్ట్రానికీ పనికి రాలేదు. దీంతో ఎప్పటిలాగానే మళ్లీ మొదటికే వచ్చింది వ్యవహారం.  జగన్ గానీ కాస్త విచక్షణతో రాజధాని గురించి ఆలోచించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. జగన్ పాలన ఎలా ఉందంటే తన ఓట్ల కోసం జనానికి జనం సొమ్ము దోచి పెట్టడం. మధ్యలో లిక్కర్ వంటి స్కాముల ద్వారా తను తన వాళ్లు జేబు నింపుకోవడం. జగన్ ఐదేళ్ల పాలనలో ఇది తప్ప మరేం చేయలేదన్నది వాస్తవం.   ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లబ్దిదారు జనం కాదు జగన్ అన్నది జగమెరిగిన సత్యం.  మూడు ముక్కలాట ఆడకుండా జగన్  బాధ్యతగా వ్యవహరించి ఉంటే అమరావతి నిర్మాణం ఈ పాటికి పూర్తయ్యేది. అదే జరిగితే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపయ్యేది. చేయాల్సిందంతా చేసి.. ఇక్కడి జనానికి పని లేకుండా పాడుబెట్టి అదేమంటే ఇది దేవతల రాజధాని కాదు- వేశ్యల రాజధాని అంటూ బురద జల్లడం. ఇక్కడ చేపలు పట్టడం తప్ప మరేమీ చేయలేమని కామెంట్లు గుప్పించడం వంటివి చూస్తుంటే.. జగన్ నిజంగానే రాక్షసుడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా ఒక మంచి కార్యం జరుగుతుంటే దాన్ని కాకుండా చెడగొట్టేవారిని రాక్షసులనే అంటారు. గతంలో దేవతలు యజ్ఞయాగాదులు చేస్తుంటే జగనాసురుడి వంటి రాక్షసులు ఇలాగే వ్యవహరించేవారు. జగన్ కూడా సరిగ్గా ఇలాగే అనిపిస్తున్నారు. సంకల్పం ఉంటే అన్నీ జరుగుతాయి. కానీ ఏదో ఒక వంక పెట్టి ఇటు జనానికి ఏదో ఇస్తున్నట్టు బిల్డప్ ఇచ్చి. ఆపై తాను బీభత్సంగా దోచుకుని.. చివరికి రాష్ట్రానికంటూ ఒక రాజధాని లేకుండా చేయడంలో మెయిన్ విలన్ గా జగన్ని తప్పక పరిగణించాల్సిందేనంటారు పరిశీలకులు. ఇలాంటి వారిని శాశ్వతంగా దూరం పెడితే తప్ప.. రాష్ట్రం రాజధాని బాగుపడదన్న మాట వినిపిస్తోంది. ,,,,,,,,,,,,,,,,,,,

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ ఛైర్మన్‌

  తిరుమల శ్రీవారి దర్శన విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వినియోగంపై మాజీ సీఎస్, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలను  టీటీడీ  ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ఖండించారు. తిరుమల  దర్శన విషయంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో సామాన్య భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా గూగుల్, టీసీఎస్‌లతో పాటు ఇతర సంస్థల సహకారంతో ఆధునాతన ఏఐ టెక్నాలజీ ఉపయోగించాలని నిర్ణయించామని  టీటీడీ  ఛైర్మన్‌ వెల్లడించారు. భక్తులకు 2 గంటలలోపు భక్తులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలక మండలి ముందుకు వెళ్తున్న సమయంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. గంటలు, రోజులు తరబడి షెడ్ల, కంపార్డ్‌మెంట్లలో భక్తులు పడిగాపులు కాయడం మంచిదా ఉచితంగా చేస్తున్నా అలా అనడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. భక్తుల్లో గందరగోళం సృష్టించేలా తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. ప్రపంచం మొత్తం ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్న తరుణంలో తిరుమల్లో కూడా వాడటంలో ఎలాంటి తప్పులేదు.’’ అని బీఆర్‌ నాయుడు పేర్కొన్నారు.  

లిక్కర్ స్కాంలో జగన్ అరెస్ట్ కావడం ఖాయం

  లిక్కర్ స్కాంలో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఢిల్లీ మద్యం కుంభ కోణం కన్నా ఇదీ పెద్దదని అంతటా ఆన్లైన్ పేమెంట్ జరుగుతుంటే ఇక్కడి లిక్కర్ షాపులో మాత్రం క్యాష్ తీసుకొని మద్యం అమ్మకాలు చేశారని ఖచ్చితంగా స్కాం జరిగిందని విచారణ జరుగుతుందని అందరు శిక్ష అనుభవిస్తారని టీజీ భరత్ అన్నారు.  సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో కలిసి సింగపూర్‌లో పర్యటించామని గత ప్రభుత్వం సింగపూర్ ను తప్పుడు విధంగా చిత్రీకరించి వారి మంత్రులు విచారణ, అవినీతి ఆరోపణలు చేసి ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి రాష్ట్రంపై ఉన్న అపోహలు తొలగించారని త్వరలోనే సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.  తమకంటూ విజన్ ఉందని దానికి అనుగుణంగా పనిచేస్తూ వెళ్తున్నామని, సింగపూర్,గుజరాత్ లో స్థిరంగా ప్రభుత్వం కోసగడంతో అభివృద్ధి చెందడానికి అవకాశం వచ్చిందన్నారు. ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వం స్థిరంగా కొనసాగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని,తాము కుదుర్చుకున్న ఒప్పందాలను త్వరలోనే వెల్లడిస్తామని, రాష్ట్రంలో పారిశ్రామిక ప్రోత్సాహాలు సంబంధించి మంత్రి నారా లోకేష్ త్వరలోనే సంచలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని టీజీ భరత్ వెల్లడించారు.

గ్రానైట్ క్వారీ ప్రమాదంపై.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

  బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో ప్రమాదం జరిగింది. గ్రానైట్ రాళ్లు విరిగిపడటంతో ఒడిశాకు చెందిన ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో క్వారీలో 15 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రిక తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్మికులు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులతో మాట్లాడిన ఆయన, ప్రమాదానికి గల కారణాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.  గాయపడిన వారికి తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదే సమయంలో, ఈ ప్రమాదం జరగడానికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను సీఎం ఆదేశించారు.

రష్యాలో భారీ భూకంపం.. బద్దలైన అగ్నిపర్వతం

  రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత  7.0గా నమోదైనట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొన్నాది. పలు ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో తాజా ప్రకంపనలు చోటుచేసుకోవడం గమనార్హం. గత భూకంపం ప్రభావంతోనే తాజా ప్రకంపనలు సంభవించి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.  మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.ఇదిలా ఉండగా, కమ్చట్కా ద్వీపకల్పంలో శనివారం అర్ధరాత్రి అగ్నిపర్వతాలు బద్దలయ్యాయి. దాదాపు 600 సంవత్సరాలుగా నిద్రాణంగా ఉన్న క్రాషెన్నినికోవ్ అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఈ విస్ఫోటనంతో సుమారు 6,000 మీటర్ల ఎత్తు వరకు బూడిద ఎగసిపడినట్లు రష్యా అధికారులు తెలిపారు. దీనితో పాటు, అత్యంత చురుగ్గా ఉండే క్ల్యూచెస్కీ అగ్నిపర్వతం కూడా బద్దలైనట్లు స్థానిక మీడియా పేర్కొంది.

పోక్సో కేసులో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ అరెస్ట్

  టాలీవుడ్ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడని కృష్ణ మాస్టర్‌పై ఆమె కుటుంబసభ్యులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కృష్ణ మాస్టర్ బెంగళూరులో తలదాచుకుంటున్నట్లు గుర్తించిన  పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు. గతంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా యువతులను మోసం చేసినట్లు కృష్ణ మాస్టర్‌పై అభియోగాలున్నాయి. అతన్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న కృష్ణ.. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బెంగళూరిలోని తన అన్న నివాసంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో అక్కడి వెళ్లి అరెస్ట్‌ చేసి  అనంతరం కంది జైలుకు తరలించారు.ఇటీవల కృష్ణకు పెళ్లి అయింది. దీంతో భార్యకు సంబంధించిన రూ. 9.50 లక్షల నగదు తీసుకొని కృష్ణ బెంగళూరికి వెళ్లినట్లు తెలుస్తంది. గతంలో కూడా కృష్ణపై పలు ఆరోపణలు ఉన్నాయి. 

గ్రానైట్‌ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురి మృతి

  బాపట్ల జిల్లా బల్లికురవలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్ క్వారీలో బండరాళ్లు మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పదహారు మంది కార్మికులు క్వారీలో పని చేస్తుండగా అకస్మాత్తుగా బండరాళ్లు కిందపడ్డాయని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. దీంతో ఆరుగురు కార్మికులు రాళ్ల కింద పడి నలిగిపోయారని వివరించారు. చనిపోయిన వారంతా ఒడిశాకు చెందిన వారని అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరపడంతోనే ఈ ప్రమాదం జరినట్లు తెలుస్తోంది.  

కొడాలి నానికి బిగ్ షాక్

  మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై మరో కేసు నమోదు అయింది. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ కొడాలి నానిపై ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ త్రీ టౌన్ పోలీసులకు అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. ఐటీ యాక్టు U/s 353(2), 352, 351(4) సెక్షన్ల కింద సి.ఐ రమణయ్య అప్పట్లో కేసు నమోదు చేశారు.  ఆదివారం కృష్ణా జిల్లా గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లిన పోలీసులు విచారణకు రావాలని 41 సీఆర్‌పీసీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు చంద్రబాబు, లోకేశ్‌లను సామాజిక మాధ్యమాల్లో దుర్భాషలాడారని, ఓ మహిళగా ఆ తిట్లు భరించలేకపోయానని ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని అంజనప్రియ 2024లో విశాఖ త్రీటౌన్‌  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

యూపీలో ఘోర ప్రమాదం.. 11 మంది మృతి

  యూపీలోని గోండాలో ఘోర ప్రమాదం జరిగింది. 15 మంది యాత్రికులతో వెళ్లున్న బొలెరో అదనపు తప్పి కెనాలోకి దూసుకెళ్లింది. ఈఘటనలో 11 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. పృథ్వినాథ్‌ ఆలయానికి భక్తులను తీసుకెళుతున్న బొలేరో వాహనం అదపుతప్పి కాల్వలో బోల్తాపడింది. ఈ ప్రమాదం పరాసరాయ్‌-ఆలవాల్‌ డియోర మార్గంలోని రేహారి గ్రామం సరయూ కాల్వ వంతెన వద్ద చోటు చేసుకొంది.సరయూ నది నుంచి మృతదేహాలను వెలికి తీసినట్లు పోలీసులు వెల్లడించారు.  ప్రమాదం జరిగే సమయానికి వాహనంలో 15 మంది యాత్రికులు ఉన్నారు. నలుగురు వ్యక్తులను స్థానికులు కాపాడినట్లు పేర్కొన్నారు. మృతులు మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ నివాసితులు. వీరిలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య వంటి వారు ఈ ప్రమాదంలో మరణించారు. ఎక్కువ మంది ఒకే కుటుంబానికి చెందినవారు కావడం ఈ దుర్ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు చెప్పిన ప్రకారం, కారు డోరు తెరుచుకోక పోవడంతో ప్రయాణికులు బయటకు రాలేకపోయారు. లోపల ఉన్నవారు తమ ప్రాణాల కోసం వేడుకున్నా, కారు అద్దాలు పగలగొట్టి కొందరిని రక్షించే ప్రయత్నం జరిగినప్పటికీ, చాలా మందిని కాపాడలేకపోయారు. ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటన గురించి తెలుసుకుని, మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి, సరైన వైద్య సహాయం అందించాలని జిల్లా అధికారులకు సూచించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.ఈ దుర్ఘటన రోడ్డు భద్రతపై మరోసారి ఆలోచించేలా చేస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాల అదుపు కోల్పోవడం వంటి సమస్యలు ఇలాంటి విషాదాలకు దారితీస్తున్నాయి. ఈ ఘటన బాధిత కుటుంబాలకు మాత్రమే కాక, అనేక మందికి ఒక హెచ్చరికలా మారింది.

ఈ నెల 6న ఢిల్లీలో ధర్నా.. టీపీసీసీ పిలుపు

  తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నాట్లు టీపీసీసీ తెలిపింది. ఇందుకోసం  ఈనెల 4న ఉదయం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు బయల్దేరుతుందని పేర్కొంది. ఢిల్లీకి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు   తమ వెంట ఆధార్ కార్డు తెచ్చుకోవాలని సూచించింది. ఈ నెల 5న పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం  7న రాష్ట్రపతికి వినతి సమర్పణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపింది.  ప్రతి జిల్లా డీసీసీల నుంచి 25 మంది పేర్లను లిస్ట్ చేసి టీపీసీసీకి పంపించాలి. రైల్ తిరిగి 7వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. డీసీసీ అధ్యక్షులు పేర్లను సకాలంలో పంపించి సహకరించి ధర్నా పెద్దఎత్తున విజయవంతం చేయాలని పేర్కొన్నారు.  జిల్లా నుంచి వచ్చే 25 మందిని సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేర్చాలి. ఢిల్లీకి వచ్చే వారికి అక్కడ వసతి, రవాణా, భోజన సదుపాయాలను పార్టీ ఏర్పాటు చేసిందని పార్టీ అధిష్టానం పేర్కొంది.