ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు స్వల్ప ఊరట

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. మహిళనైన తనను ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించడాన్ని ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్ 20కి వాయిదా వేసింది. అప్పటి వరకు కవితకు సమన్లు జారీ చేయవద్దని ఈడీని ఆదేశించింది. విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసిన నేపథ్యంలో ఈడీ స్పందిస్తూ... సుప్రీంకోర్టు తుది నిర్ణయం వచ్చేంత వరకు కవితకు సమన్లను జారీ చేయబోమని తెలిపింది. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజారే ప్రారంభించిన ఉద్యమంలో కీలకనేతలుగా ఎదిగి, ఢిల్లీ ప్రజలను మెప్పించి అధికార పగ్గాలు చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ  నాయకులు అదే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయి జైలుపాలయ్యారు. రాజకీయ నాయకులు, లిక్కర్ వ్యాపారులు, పలు లిక్కర్ కంపెనీల నుంచి అధికార  పార్టీ నేతలకు వందలాది కోట్ల రూపాయలు ముడుపులుగా అందాయని, అందుకే ప్రయివేట్ వ్యక్తులకు అనుకూలంగా ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ అమలు చేసిందన్నది ప్రధానమైన ఆరోపణ. ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎక్సైజ్ కమిషనర్‌తో పాటు పలువురు నిందితులను గతంలో సీబీఐ అరెస్ట్ చేయగా,  ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ తో ఈ కుంభకోణం దేశ వ్యాప్తంగా సంచలనమైంది.  అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత పేరు ఈ స్కాంలో బయటకొచ్చింది. కెసీఆర్ ను దారిలో తెచ్చుకోవడంలో భాగంగా బిజెపి ప్రభుత్వానికి ఆయుధం దొరికినట్టయ్యింది. ఈడీ పలుమార్లు కవితకు సమన్లు పంపించింది. తనను ఈడీ కార్యాలయానికి పిలవడాన్ని కవిత జీర్ణించుకోలేకపోయారు.  సుప్రీంకోర్టు నాశ్రయించారు. కవిత తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. ఢిల్లీ కొత్త మద్యం పాలసీ ఆ రాష్ట్రానికి సంబంధించిందే అయినా, దక్షిణాదికి చెందిన పలువురు రాజకీయ నాయకులతోపాటు వారి సన్నిహితులకు కూడా ఈ అవినీతి, అక్రమాల్లో సంబంధం ఉందని దర్యాప్తు సంస్థలు చార్జిషీట్లలో పేర్కొన్నాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తె కవిత, ఆమె భర్తకు కూడా ఇందులో పాత్ర ఉందంటూ ఆమెను ఒకసారి విచారించడమే గాక సీబీఐ, ఈడీలు చార్జిషీట్లలో పలుమార్లు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ సిట్టింగ్ ఏంపీ మాగుంట శ్రీనివాసరెడ్డితోపాటు ఆయన కుమారుడికి కూడా సంబంధమున్నట్లు ఆరోపణలున్నాయి. సిసోడియా అరెస్టును ఖండించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కూతురిపై వచ్చిన ఆరోపణల విషయంలో మాత్రం ఇప్పటిదాకా నోరు మెదపలేదు.   ఏది ఏమైనా, నిజానిజాలు నిగ్గుతేలి, నేరం జరిగితే ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరూ జైలుపాలు కావాల్సిందే.

ఏపీలో మినీ ఎమర్జెన్సీ ?

ఆంధ్ర ప్రదేశ్ లో ఏం జరుగుతోంది ? తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్  వెనక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏమిటి? ఎన్నికలకు ఇక ఏడెనిమిది నెలలు మాత్రమే ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ‘నిప్పు’తో చెలగాట మాడే భయంకర నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అందుకు ఆయనలో ప్రవహించే ఫ్యాక్యనిస్ట్  బ్లడ్ మాత్రమే కారణమా? కేవలం కక్ష సాధింపు లక్ష్యంతోనే జగన్ రెడ్డి ఈ వినాశకర నిర్ణయం తీసుకున్నారా? అంటే,  అందులో కొంత నిజం ఉన్నప్పటికీ అదే పూర్తి సత్యం కాదంటున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే, 1975 జూన్ 26 ఉదయం సూర్యోదయం వేళ,  తనను అరెస్ట్ చేసేందుకు తలుపు తట్టిన, పోలీసులతో  జేపీ (సర్వోదయ ఉద్యమ నేత) అన్న మూడే మూడు ముక్కల మాట ... గుర్తుకు తెచ్చుకుంటే చంద్రాబాబును జగన్ రెడ్డి ఎందుకు, అరెస్ట్ చేశారు అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆరోజు జేపీ... అన్నఆ మూడు ముక్కలూ  ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అన్న మాటలు. ఇంచుమించుగా 48 ఏళ్ల  క్రితం.. అలహాబాద్ హై కోర్ట్  తన ఎన్నికల చెల్లదని తీర్పు ఇచ్చిన నేపధ్యంలో  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ  1977 జూన్  25 అర్థరాత్రి దేశంలో    ఇంటర్నల్ ఎమర్జెన్సీ విధించారు. జూన్ 26 తెల్లవారే సరికి  ఇందిరమ్మ పోలీసులు అప్పటికే ఇందిరా గాంధీ అవినీతి పాలనకు వ్యతిరేకంగా, సంపూర్ణ క్రాంతి ఉద్యమం పేరిట దేశవ్యాప్త ఆందోళనకు  పిలుపు ఇచ్చిన సోషలిస్ట్ నేత  జయప్రకాశ్ నారాయణ సహా వందల సఖ్యలో  ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు.  అలాగే  ఇప్పడు వైసీపీ అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా  తెలుగు దేశం, జనసేన పార్టీలు సాగిస్తున్న పోరాటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో జగన్ రెడ్డి  ఓటమి భయంతో, రాష్ట్రంలో అప్రకటిత  మినీ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే, జగన్ రెడ్డి పోలీసులు   2023 సెప్టెంబర్ 9వ తేదీ, ఉదయం 6 గంటలకు నద్యాలలో చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్ట్  చేశారు. ఇందిరమ్మ పోలీసులు చేసిన జేపీ, అరెస్ట్’,జగన్ రెడ్డి పోలీసులు చేసిన చంద్రబాబు అరెస్ట్ కు మధ్య కొన్ని సిమిలారిటీస్  ఉన్నాయి. అప్పుడు ఇందిరమ్మ పోలీసులు తెల్లవారుజామునే వచ్చి తపులులు తట్టారు, ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులుఇంచుమించుగా అదే చేశారు. అయితే అర్ధరాత్రి చంద్రబాబు బస చేసిన బస్సు తలుపు తట్టారు.  అప్పుడు ఇందిరమ్మ పోలీసులు జేపీని ఎందుకు,ఏ నేరానికి, ఏ చట్టం, ఏ సెక్షన్  పరిధిలో  అరెస్ట్ చేశారో చెప్పలేదు. ఇప్పడు జగన్ రెడ్డి పోలీసులూ అంతే  నేరం ఏమిటో, విచారణ ఏమిటో  చెప్పకుండానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారు. నంద్యాల పర్యటనలో ఉన్న తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబును, బస్సులోంచి దించి  ఎలాంటి కారణాలు చూపకుండానే అరెస్ట్ చేశారు. అలా అరెస్టు చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో జరిగినట్లు చెపుతున్న అవకతవకలు,అవినీతికి చంద్రబాబుకు సంబంధం ఏమిటో చెప్ప కుండానే, కేవలం సాంకేతిక అంశాల ఆధారంగ , విచారణ పేరుతొ వేధింపులకు గురి చేస్తోంది. అందుకే  చంద్రబాబు అరెస్ట్ విషయంలో  ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిజానికి అక్రమ అరెస్ట్ విషయంలోనే కాదు, అరెస్ట్ తరువాత తెలుగు దేశం నేతలు, కార్యకర్తలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేయడం, నిరసన తెలిపేందుకు లేకుండా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు చేయడం.  అదే విధంగా  చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున నిరసనలను ఉక్కుపాదంతో అణచివేయడం,  దీక్షలను భగ్నం చేయడం చూస్తుంటే, ఏపీలో మినీ ఎమర్జెన్సీ అమలులో వుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొత్త పెట్టుబడులు రావు.. ఉన్నవి నిలవవు!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్ రుణచక్రబంధంలో ఇరుక్కుపోయిందన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలా నిబంధనలకు విరుద్ధంగా పరిమితులకు మించి అప్పులు ఎలా పొందగలుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పొరుగునే ఉన్న సంపన్న రాష్ట్రం తెలంగాణకు అడుగడుగునా ఆంక్షలు, అడ్డంకులు ఎదరౌతుంటే.. ఏపీకి మాత్రం ఎలాంటి పరిమితులూ లేకుండా అప్పులు ఎలా దక్కుతున్నాయి? ఈ ప్రశ్నలు సహజంగానే అన్నివర్గాలలోనూ వ్యక్తం అవుతున్నాయి.  కేంద్రంలో అధికారంలో ఉన్నది మోడీ నాయకత్వంలోని ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్. ఆ సర్కార్ రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో రాష్ట్రానికి ఒక్క తీరుగా వ్యవహరించడం వెనుక రహస్యం ఏమిటి అన్న ప్రశ్నకు ఇందులో రహస్యం ఏముంది అంటూ పరిశీలకులు అంటున్నారు. తెలంగాణ సర్కార్ మోడీని చాలెంజ్ చేస్తున్నది. ఆ సర్కార్ విధానాలను తప్పుపడుతున్నది. అదే సమయంలో ఏపీలోని జగన్ సర్కార్ మోడీ అడుగులకు మడుగులొత్తుతోంది. మోడీ సర్కార్ విధానాలను ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను మించి మరీ సమర్ధిస్తున్నది. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నది. ఈ కారణంగానే ఏపీ విషయంలో ఒకలా, తెలంగాణ విషయంలో మరోలా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ సర్కార్ కేంద్రంలోని మోడీ సర్కార్ అండ చూసుకుని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నది. అడ్డగోలు పన్నులు, ఇష్టారీతిన అప్పులు, పాలన అంటే పంచడం, వెనకేసుకోవడం అన్న చందంగా జగన్ తీరు మారిపోయింది. సర్కార్ తీరును ప్రశ్నించినా, విధానాలను వ్యతిరేకించినా జైళ్లు నోళ్లు తెరిచే సీమలా ఏపీ మారిపోయింది.  కర్నాటకలో బీజేపీ సర్కార్ పరాజయానికి ఆ సర్కార్  కమిషన్ల సర్కార్ గా మారిపోయిందన్న ఆరోపణలను జనం నమ్మడం ఒక ముఖ్య కారణంగా చెబుతారు. అలాగే జగన్ సర్కార్ కూడా ఏపీ వైపు పారిశ్రామికవేత్తలు చూడాలంటేనే భయపడేలా వ్యవహరిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తతున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబు అరెస్టు కారణంగా ఏపీ సర్కార్ అంటేనే ఇన్వెస్టర్లు, ఇండస్ట్రియలిస్టులు పారిపోయే పరిస్థితి ఏర్పడిదనడంలో సందేహం లేదు. అయితే అంతకంటే ముందు నుంచీ కూడా జగన్ సర్కార్ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రంలోకి పెట్టుబడులు, పరిశ్రమల సంగతి అటుంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోతున్న పరిస్థితి. ఇక కొత్తగా వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమల గురించి మాట్లాడకుండా ఉండడమే ఉత్తమం. అయినా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం  2019 నుంచి 2022 వరకు రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ. 5751 కోట్లు ..  అంటే, దేశం మొత్తం పెట్టుబడులలో 0.4 శాతం. ఇంత తక్కువగా పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని అంటున్నారు. పరిస్థితి ఇంత అధ్వానంగా ఉన్నా.. గత మార్చిలో జగన్ రెడ్డి ప్రభుత్వం ఘనంగా  విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్  నిర్వహించింది. ఆ విషయం జగన్ కు కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వంలోని వారికి కానీ గుర్తుందో లేదో కానీ... అదే  గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు వేదికగా  రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తున్నదని గొప్పగా ప్రకటించారు. అలాగే ఉద్యోగాలు కూడా కుప్పతెప్పలుగా వస్తాయని సీఎం జగన్ అప్పట్లో సెలవిచ్చారు.  ఇక ఆ గ్లోబల్ సమ్మిట్ లో  20 రంగాలకు సంబంధించి  340 ఎంవోయూ(అవగాహన ఒప్పందాలు)లు  కుదుర్చుకున్నామని, వాటి ద్వారా రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులు, ఓ ఆరు లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయని, ముఖ్యమంత్రి  జగన్ రెడ్డి, తమ ట్రేడ్ మార్క్ అయిన షిక్కటి చిరునవ్వుతో సెలవిచ్చారు.  సరే అవి వచ్చాయా? వస్తే వాటి వివరాలేంటి? అన్న ప్రశ్నకు మాత్రం బదులుండదు. పైపెచ్చు ఆ ప్రశ్న అడిగితే అదేదో మహాపాపమన్నట్లు మాట్లాడే పరిస్థితి. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారంటూ కేసులు, ఆరెస్టులతో చెలరేగుతున్నారు.   అయితే వాస్తవమేమిటంటే..  విశాఖ సమ్మిట్ తర్వత కాదు, జగన్ రెడ్డి నాలుగేళ్ళ పై చిలుకు పాలనలో రాష్టానికి కొత్తగా వచ్చిన పెట్టుబడుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదని పరిశీలకులు అంటున్నారు.  జగన్ రెడ్డి పాలనలో పెట్టుబడుల విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అధోగతికి చేరింది. అట్టడుగు నుంచి ప్రథమ స్థాయిలో ఉంది.   అయితే ఈ మాటలు ఎవరో జగన్ రెడ్డి వ్యతిరేకులో, విపక్షాలో చెబుతున్నవి కాదు.. జగన్ రెడ్డి ప్రభుత్వానికి అన్ని విధాలుగా అండదండలు అందిస్తున్న కేంద్రం వెల్లడించిన వివరాలు.  సరే జగన్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమయ్యారని సరిపెట్టుకుందాం? కానీ గత ప్రభుత్వ అంటే చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు పలువురు జగన్ రెడ్డి అరాచక విధానాల కారణంగా రాష్ట్రం నుంచి తరలి వెళ్లిపోయారు. నిజానికి చంద్రబాబు హయాంలో రాష్ట్రంలోనికి పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు వెల్లువలా తరలి వచ్చారు. విభజిత ఏపీలో చంద్రబాబు హయంలో అంటే 2014 నుంచి 2019 వరకూ ఆరులక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. జగన్ పాలనలో వచ్చిన ఇన్వెస్ట్ మెంట్లు కేవలం 5751 కోట్ల రూపాయలు మాత్రమే.   రాష్ట్ర విభజన తరువాత    చంద్రబాబు నాయుడు హయాంలో  ప్రపంచంలోనే గుర్తింపు ఉన్న అనేక కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కట్టాయి.  అందులో భాగంగానే కియా లాంటి అతి పెద్ద కంపెనీ అనంతపురంకు వచ్చింది.  చిత్తూరులో అనేక మొబైల్ తయారీ కంపెనీ వచ్చాయి, విశాఖపట్నంలో ఐటి కంపెనీలు వచ్చాయి, విజయవాడలో హెచ్సీఎల్ లాంటి పెద్ద కంపెనీ వచ్చింది. వీటితో పాటుగా, రిలయన్స్ జియో, ఆదానీ డేటా సెంటర్, ఏపీపీ పేపర్ మిల్, లూలు గ్రూప్ ఇవి కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి.  జగన్ రెడ్డి పాలనలో  సింగపూర్ ప్రభుత్వం అమరావతి స్టార్ట్ అప్ నుంచి వెళ్ళిపోయింది, లూలు గ్రూప్ లాంటి సంస్థకు ఇచ్చిన భూమిని జగన్ ప్రభుత్వం రద్దు చేయడంతో  ఆ గ్రూప్, రూ.2200 కోటల పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో పాటుగా ఇప్పుడున్న పరిస్థితిలో అంటే జగన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఏపీలో ఎలాంటి పెట్టుబడులు పెట్టేది లేదని కుండబద్దలు కొట్టేసింది.   చిత్తూరు జిల్లాకు చెందిన అమర రాజా కంపెనీ జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులను తట్టుకోలేక రూ,9500 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తరలించేసింది. ఇలా చెప్పాలంటే చాలా చాలా ఉంది అదే  ఒక్క మాటలో ముగించాలంటే ... జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో కొత్త పెట్టుబడులు రావు  ..ఉన్న పెట్టుబడులు నిలవవు అని చెప్పాలి.  పెట్టుబడులు రానిదే రాష్ట్రం ముందుకు సాగదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవు ... అప్పులు మాత్రమే మిగులుతాయి.. వాటిని అంటే అప్పులను ఎలా పెంచాలో, ఎలా రాబట్టాలో జగన్ రెడ్డికి బాగా తెలుసు. మరి రాష్ట్ర భవిష్యత్ మాటేమిటి అంటారా?  ప్రజలే నిర్ణయించుకోవాలి.  ఓటు ఆయుధం ఉన్నది వారి చేతుల్లోనే మరి.   

అరెస్టు చేసేశాం..ఇప్పుడు అవినీతి జరిగిందో లేదో పరిశోధిస్తాం.. సీఐడీ వింత వాదన!

జరిగిన అవినీతి చూపాల్సిన అవసరం లేదు. అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలను అరెస్టు చేసి, ఆ తరువాత దర్యాప్తు చేసి నిరూపిస్తామంటూ సీఐడీ వితండ వాదన చేస్తున్నది. అవును చంద్రబాబు అరెస్టు విషయంలో సీఐడీ తీరు ఇలాగే ఉంది. ఎలాగా అరెస్టు చేసేశాం కదా.. ఇక కస్టడీకి ఇవ్వండి, విచారించి అవినీతి జరిగిందో లేదో తేలుస్తాం అని కోర్టు ముందు చెబుతోంది. చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో సీఐడీ అనుసరించిన విధానం అదే. ఏవో సెక్షన్  పెట్టి కేసు  నమోదు చేయడం, అరెస్టు చేసిన తరువాత ఎఫ్ఐఆర్ లో పేరు చేర్చడం ఆ సెక్షన్ల ఆధారంగానే అరెస్టు  చేశామని కోర్టుల్లో వాదించడం సీఐడీకి రివాజుగా మారిపోయింది.  స్కిల్ స్కాం జరిగిందని కానీ, చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని కానీ ఎలాంటి ఆధారం చూపకుండా వాటన్నిటినీ అరెస్టు చేశాం కదా ఇక విచారించి నిరూపిస్తాననడం చూస్తుంటే.. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఎవరినైనా సరే అరెస్టు చేస్తాం..మా కేంటి అడ్డు అన్నట్లుగా ఏపీ సీఐడీ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఇక అన్నిటి కంటే విచిత్రం ఏమిటంటే.. చంద్రబాబును అరెస్టు చేయడానికి అవసరమైన అన్ని ఆధారాలూ ఉన్నాయి కనుకనే అరెస్టు చేశామంటూ ఊరూరా తిరిగి మీడియా సమావేశాలు పెట్టి మరీ ఊదరగొడుతున్న సీఐడీ.. కోర్టుల్లో మాత్రం ఒక్క ఆధారమూ చూపడంలేదు.. సరికదా.. చంద్రబాబును కస్టడీకి ఇవ్వండి ఆయనను ఇంటరాగేట్ చేసి ఆధారాలను ఎస్టాబ్లిష్ చేస్తామని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ సీఐడీ చేసిన అరెస్టులన్నీ దాదాపు ఇదే విధంగా ఉన్నాయి.  ఏపీ సీఐడీ అడ్డగోలు తీరుపై గతంలో కోర్టులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి కూడా అయినా ఆ దర్యాప్తు సంస్థలో ఇసుమంతైనా మార్పు రాలేదు.  ఇక ఇప్పుడు చంద్రబాబు అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అందుకు అనుసరించిన తీరు తీవ్ర విమర్శలకు గురౌతోంది.  స్కిల్ కేసులో నగదు మళ్లింపు జరిగిందనీ, చంద్రబాబు షెల్ కంపెనీలకు ఆ నగదు చేరిందనీ సీఐడీ తీవ్ర ఆరోపణలు చేసింది.  అయితే నిధులు ఎలా దారి మళ్లాయి, మళ్లి ఎక్కడికి చేరాయి.. వంటి వివరాలేమీ సీఐడీ కోర్టుల ముందు చూపలేకపోతోంది.  నోట్ ఫైల్స్ లో  అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ ఏదో రాశారంటూ.. ఆ కొద్ది భాగం లీక్ చేసి వైరల్ చేస్తున్న సీఐడీ అధికారులు కోర్టులలో మాత్రం నిధుల మళ్లింపు, షెల్ కంపెనీల ఊసెత్తడం లేదు. ప్రజా ధనం దుర్వినియోగమైందనీ, అది ఎలా దుర్వినియోగం అయ్యిందన్నది రుజువు చేయాలని, అది రుజువు చేయడం కోసం చంద్రబాబును ఇంటరాగేట్ చేయాలి ఇదే సీఐడీ  కోర్టులకు చెబుతున్న మాట.  అసలేమీ లేని కేసులో చంద్రబాబును అరెస్టు చేసి ఇప్పుడు ఆధారాల కోసం వెతుకుతున్నామని సీఐడీ చెబుతోంది.   చంద్రబాబును అరెస్టు చేయాలి అన్న సింగిల్ పాయింట్ అజెండాతో ఏపీ సీఐడీ వ్యవహరిస్తున్నట్లు ఉందని పరిశీలకులే కాదు, న్యాయనిపుణులు సైతం అంటున్నారు. అంతే కాదు సామాన్య జనం సైతం చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తున్నారు. తన నాలుగేళ్ల పాలనలో  జగన్ మూటగట్టుకున్న ప్రజా వ్యతిరేకతకు రెట్టింపు ప్రజావ్యతిరేకత  చంద్రబాబు అరెస్టు తరువాత ఈ 18 రోజులలో జగన్ సర్కార్ పై వ్యక్తమౌతోందని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. ఎన్ని తప్పులు చేసిన శ్రీకృష్ణుడు శిశుపాలుడి వందో తప్పు వరకూ ఎదురు చూసినట్లు జనం జగన్ ఇప్పటి వరకూ చేసిన అక్రమాలను సహించారనీ, చంద్రబాబు అరెస్టుతో ఒక్కొక్కరూ ఒక్కో కృష్ణుడిగా ఓటు అనే ఆయుధంతో జగన్ సర్కార్ శిరచ్ఛేదం చేయడానికి రెడీ అయిపోయారనీ అంటున్నారు. 

కారు .. సారు ... బేజారు!

ఆయన మాటే శాసనం..అవును, బీఆర్ఎస్ లో కేసీఆర్ మాటే శాసనం, కాదని తోక జాడిస్తే, వారు ఎంతటి వారైనా... అంతే సంగతులు. నిముషాల్లో  తోక తెగిపడుతుంది. అది ఎంతటి వారైనా సరే వేటు అనివార్యం అవుతుంది. గతంలో అటు ఉద్యమంలో ఇటు ప్రభుత్వంలో కేసీఆర్’కు కుడి భుజంగా ఉన్న ఈటల  రాజేందర్ పై ఏవిధంగా వేటు వేసింది అందరికీ తెలిసిందే.  ఈటల కంటే ముందు చాలామందే కోదండ రామ్ సార్ ..సహా చాలామందే  ఆ జాబితాలో ఉన్నారు. అయినా  ఈటల పై వేటు  కేసీఆర్  దొర  నైజానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ గా నిలుస్తున్నదని అంటారు. నిజానికి  ఈటల మనసులో ఆ భావన  బాధ ఉన్నాయో లేవో కానీ  ఏదో సందర్భంలో  గులాబీ జెండాకు అసలు ఓనర్లం మేమే  అంటూ బడుగుల తరపున ఒక  ధిక్కార  ప్రకటన లాంటింది చేశారు. అంతే  ఇక ఆ  తర్వాత ఏమి జరిగిందో చరిత్ర.  అది అందరికీ తెలిసిన విషయమే.  అయితే ఇప్పడు పరిస్థితి అది కాదంటున్నారు.కారు జోరుకు హస్తం బ్రేకులు వేస్తున్న నేపథ్యంలో  కేసీఆర్  స్టైల్ మారిందని అంటున్నారు. నినమొన్నటి దాకా, ముఖ్య నేతలు , మంత్రులకే ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ అసాధ్యం అనే పరిస్థితి ఉంటే  ఇప్పడు అడిగిందే తడవుగా  ముఖ్యనేతలకే కాదు, మరెందరికో , ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అడిగిన వారందరికీ  ముఖ్యమంత్రి అప్పాయింట్ మెంట్ లభిస్తోందని అంటున్నారు.అంతే కాదు  కొందరికైతే, ప్రగతి భవన్  నుంచే ఆహ్వానాలు అందుతున్నాయంటున్నారు. ఇది ముఖ్యమంత్రిలో మార్పుకు సంకేతమని అస్మదీయులు  ఆనంద పడుతుంటే, తస్మదీయులేమో, ఇదంతా ఎన్నికల జిమ్మిక్కని, కొట్టి పారేస్తున్నారు. అయితే, ముఖ్యంత్రిలో మార్పుకు రాష్టంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలే ప్రధాన కారణమని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ జోరు పెరిగి కమలం కనుమరుగై పోతున్న నేపధ్యంలో సార్.. బేజారవుతున్నారని అంటున్నారు. నిజానికి  కాంగ్రెస్ లో జోష్ పెరగడం కంటే, బీజేపీ,  బ్యాక్ టూ స్క్వేర్ వన్  అనగా ఒక్క సీటు స్థాయికి జారుకోవడం కేసీఆర్ ను కలవరపాటుకుకు గురిచేస్తోందని అంటున్నారు. తొమ్మిదేళ్ళ తెరాస/బీఆర్ఎస్ పాలనతో విసిగి పోయిన జనం ప్రభుత్వ వ్యతిరేక  ఓటు ఏకమైతే కర్ణాటక ఫలితమే తెలంగాణలోనూ తప్పదని, అందుకు తగట్టుగానే  కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక ఫార్ములానే ఇక్కడ ఫాలో అవుతున్న నేపధ్యంలో ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయనే, ప్రచారం జరుగుతోంది. అందుకే కారులో కలకలం మొదలైనదని చెబుతున్నారు. అందుకే బేజారైన కేసీఆర్ సారు... బుజ్జగింపులకు తెర తీశారని అంటున్నారు. అందులో భాగంగానే, అసంతృప్తులకు  స్వయంగా ప్రగతిభవన్‌  నుంచి ఆహ్వానాలు వస్తున్నాయంటున్నారు. బుజ్జగిస్తూ కేసీఆర్ పదవుల ఎర వేస్తున్నారని అంటున్నారు. నిజానికి ఒక వ్యూహం ప్రకారమే, ముఖ్యంత్రి కేసీఆర్ ముందుగా  నాలుగు స్థానాలు మినహా మిగిలిన అన్ని స్థానాలకూ  అభ్యర్ధులను ప్రకటించారు. అయితే టికెట్‌ ఆశించి భంగపడ్డ వారు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయారు. ఆ సందేశాలు ప్రగతి భవన్ కు   చేరాయి.  అయినా  బీఆర్ఎస్ పెద్దలు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ తమకు ‘రియల్ థ్రెట్’ గా మారుతోందని గుర్తించారో, ఇక అక్కడి నుంచి  కేసీఆర్  మారి పోయారని అంటున్నారు.  అందుకే వ్యూహం మార్చి బుజ్జగింపులు ప్రారంభించారని అంటున్నారు., జనగాం, స్టేషన్‌ ఘన్‌పూర్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య విషయంలో ఇదే జరిగింది. అధిష్ఠానం వీరికి టికెట్లు నిరాకరించడంతో.. రాజయ్య ఒక దశలో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు ఆ ఇరువురిని ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించారు. ఒకరికి రాష్ట్ర రైతుబంధు సమితి చైర్మన్‌ పదవి, మరొకరికి ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇస్తామని ఆశల హామీ ఇచ్చారు. అలాగే ఇతర నియోజకవర్గాల్లో కూడా పార్టీకి తీరని నష్టం కలిగిస్తారనుకున్న వారిని పిలిచి మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చివరి దశకు చేరుకున్న సమయంలో.. ఏళ్లుగా భర్తీ చేయని పదవుల పందేరానికి కూడా శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నూతన చైర్మన్‌, సభ్యులను నియమించారు. అయితే, కేసీఆర్  లో వచ్చిన మార్పునకు మురిసి పోవలసిన అవసరం లేదని, కొందరు ముఖ్య నేతలు, మరీ  ముఖ్యంగా అసంతృప్తులు అంటున్నారు. అందితే జుట్టు అందకే పొతే .. కాళ్ళు పట్టుకోవడం రాజకీయాల్లో అందరూ ఆచరించే సంప్రదాయమే అయినా ఈ విద్యలో కేసేఆర్ రెండు కాదు పది ఆకులు  ఎక్కువ చదివారని ముఖ్య నేతలు అంటున్నారు. అలాగే  ముఖ్యమంత్రి కేసీఆర్  కు ఎక్కడ నెగ్గాలో  మాత్రమే కాదు  ఎక్కడ తగ్గాలో కూడా తెలుసునని అంటుంటారు. అందుకే  కేసీఆర్ మరి పోయారని, ఇక పై  ప్రగతి భవన్ గేట్లు 24/7 బార్లా తెరిచి ఉంటాయని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే అవుతుందని, లోగుట్టు తెలిసిన పెద్దలు చెపుతున్నారు.

మోడీ, షాలకు ఏపీ గండం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏదో ఒక మేరకు పట్టు సాధించాలంటే.. చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీని బలహీన పరచడం ఒక్కటే మార్గం అని కమలం అధినేతలు తలపోశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అరెస్టు వెనకాల ఉన్నది బీజేపీ వ్యూహమేనని విశ్లేషిస్తున్నారు. కేంద్రంలో తమ అధికారం పదిలంగా ఉండాలన్నా.. ఏపీలో తమ పెత్తనం సాగాలన్నా చంద్రబాబును రాజకీయంగా బలహీన పరచడం ఒక్కటే మార్గమని మోడీ భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే ఏపీలో జగన్ సర్కార్ అడ్డగోలు విధానాలకూ, పరిమితులకు మించిన అప్పులకూ, నియమనిబంధనలకు తిలోదకాలిచ్చి సాగిస్తున్న అరెస్టులకు అనుమతులు ఇస్తూ.. ఏపీలో దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థను, పతనమౌతున్న జగన్ ప్రతిష్టను వేడుక చూస్తున్నట్లు కమలనాథులు చూస్తున్నారని అంటున్నారు.  అయితే బీజేపీ రాష్ట్ర శాఖ రాష్ట్రంలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పార్టీ హై కమాండ్ కు నివేదికలు అందిస్తుండటంతో.. ఏమో ఎటువైపు పోయి ఎటువైపు వస్తుందోనన్న జంకుతో ఇప్పటి వరకూ తెలుగుదేశంతో పొత్తు అంశాన్ని సజీవంగా ఉంచుతూ వచ్చింది. అడపాదడపా చంద్రబాబను హస్తినకు పిలిపించుకుని మాట్లాడటం ద్వారా పోత్తు అవకాశాలున్నాయన్న సంకేతాలు ఇవ్వడం, అదే సమయంలో జగన్ సర్కార్ అడ్డగోలు అప్పులకు సై అంటూ.. ఏపీలో బీజేపీ డ్యుయెల్ రోల్ పాటిస్తూ వచ్చింది.  అయితే ఎప్పుడైతే స్కిల్ స్కామ్ పేరిట చంద్రబాబు అక్రమ అరెస్టును బీజేపీ అధినాయకత్వం ఖండించలేదో.. అప్పుడే సర్వులకూ బీజేపీ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పూర్తిగా బోధపడింది. దీంతో ఏపీలో బీజేపీ స్టేక్ పూర్తిగా జీరో అయ్యింది. నోటీతో పోటీపడి గత ఎన్నికలలో తెచ్చుకున్న ఒక శాతం ఓటు కూడా ఈ సారి అనుమానమే అంటున్నారు.  వాస్తవానికి ఏపీలో తమకు ఉన్నదీ, పోయేదీ ఏమీ లేదని కమలనాథులకు స్పష్టంగా తెలుసు.. అయినా జనసేనానిని మిత్రుడిగా చెప్పుకుంటూ.. ఆయనను సీఎం అభ్యర్థిగా ముందు పెట్టి వెనకుండి డ్రామా నడిపిద్దామనుకున్న కమలం అధినేతలకు తన పయనం తెలుగుదేశంతోనే.. కలిసి వస్తుందా? రాదా? అన్నది బీజేపీ ఇష్టం అంటూ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొటేయడంతో బీజేపీ వ్యూహాలు, ఎత్తుగడలూ పూర్తిగా దెబ్బతిన్నాయి.  ఇప్పటికే 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి సింగిల్ గా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిన మెజారిటీ వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. అంతే కాకుండా.. బీజేపీ ఏతర కూటమి ఇండియా.. సమష్టిగా ఉంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో సొంతంగా ఓ పుంజీడు స్థానాలు తెచ్చుకోగలిగిన పార్టీలు కాగడా పెట్టి వెతికినా కనిపించని పరిస్థితిది. అందుకే ఏపీలో ఎటు పోయి ఎటు వచ్చినా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు తెచ్చుకుని తెలుగుదేశం అధికారంలోకి రావడమే ఖాయంగా అత్యధిక పార్లమెంటు స్థానాలలో కూడా విజయం సాధించి.. కేంద్రంలో కీలక భూమిక పోషించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న పరిశీలకుల విశ్లేషణలు బీజేపీని గాభరాపెడుతున్నాయి. ఆ కారణంగానే స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్టుకు జగన్ సర్కార్ కు వెనుకనుంచి అవసరమైన అండదండలందించిందనీ, ఎన్నికల సమయంలో చంద్రబాబు జైలులో ఉంటే పార్టీని ముందుండి నడిపించే సారథి అందుబాటులో లేని తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు పకడ్బందీగా సమాయత్తం కాలేదనీ, అలాగే బాబు ప్రెజెన్స్ లేకుండా తెలుగుదేశం, జనసేనల మధ్య సీట్ల సర్దు బాటు, ఓట్ల బదలీ సజావుగా సాగే అవకాశం ఉండదనీ బీజేపీ భావిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే బీజేపీ ఆశించినదానికి భిన్నంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచ దేశాలలోనూ కూడా ఆందోళనలు మిన్నంటలం, ఆఖరికి సొంత పార్టీ నేతల నుంచి కూడా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకటనలు వెలువడటంతో బీజేపీ కంగుతింది. అన్నిటికీ మించి చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కారు.. ఆయన నిర్దోషిగా, స్వచ్ఛంగా బయటకు వస్తారు అని బీజేపీ సీనియర్ నేత.. మోడీ కేబినెట్ లో స్వతంత్రంగా పని చేసే ఏకైక మంత్రి నితిన్ గడ్కరీ కుండబద్దలు కొట్టినట్లు చెప్పడంతో మోడీ, షాల మౌనం వెనుక ఉన్న కుట్ర కోణం బహిర్గతమైందని అంటున్నారు. ఇక ఇప్పుడు  ఏపీలో బీజేపీ ఎదుగుదల సంగతి పక్కన పెడితే ఉనికి కూడా ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి వచ్చిందని అంటున్నారు.  రాజకీయ స్వార్థంతో.. ఒక బలమైన పార్టీని బలహీనం చేయాలన్న దురుద్దేశంతో బీజేపీ ఆడిన కుట్ర క్రీడకు ఆ పార్టీయే బలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

బాబుదే జయం.. ఇది ఖాయం!

స్కిల్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన క్షణం నుంచీ వైసీపీ శ్రేణులు ఆత్మరక్షణలో పడ్డాయి. అరెస్టు సక్రమమని చెప్పలేక, తమ అధినేతను ధిక్కరించే ధైర్యం చేయలేక గింజుకుంటున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం జగన్ కు పార్టీ నేతలు, కార్యకర్తలూ అవసరం లేదనీ, వారి పని ఘనత వహించిన పోలీసు అధికారులే చేసేస్తున్నారనీ అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తూ, తమ భవిష్యత్ పై బెంగటిల్లుతున్నారు. ఇప్పటి వరకూ రాజకీయాలలో ఇటువంటి కక్ష సాధింపు తీరును ఎన్నడూ చూడలేదని అంటున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగిందని  నమ్మించేందుకు సర్కార్ ఎంతగా గొబెల్స్ ప్రచారం చేస్తున్నా సొంత పార్టీ క్యాడరే ఆ విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అదే సమయంలో అదే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పుణ్యమా అని తమ పిల్లలు బాగుపడ్డారనీ, మంచి ఉద్యోగాలలో సెటిలయ్యారనీ వైసీపీ క్యాడరే అంటోంది.  అన్నిటికీ మించి గత పక్షం రోజులుగా కేసు తీరు తెన్నులను,  సీఐడీ చీఫ్ పత్రికా సమావేశాలను గమనిస్తున్న వారంతా రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే అంటున్నారు.    క్షేత్ర స్థాయిలో ప్రజాభిప్రాయాన్ని, ప్రజాగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసిన, చూస్తున్న నేతలైతే.. వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వెళ్లడం అసాధ్యమని బాహాటంగానే చెబుతున్నారు.  చంద్రబాబును అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి పార్టీ పాలిట, తమ పాలిట భస్మాసురుడుగా మారారనీ, ఆయనతో తమకు కూడా రాజకీయంగా మరణశాసనం రాసేశారనీ చెబుతున్నారు. చంద్రబాబును అరెస్టు చేసి జైలులో పెడితే.. అది ఎంత అక్రమంగానైనా సరే.. తెలుగుదేశం పార్టీ కుదేలౌతుందనీ, ఆ పార్టీ ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు అవసరమైన దిశ, దశ అందిచే నాయకుడు దూరమై నిస్తేజమైపోతుందనీ జగన్ ఊహించారనీ, అయితే ఆయనే కాదు.. అసలు ఎవరూ ఊహించనంత తీవ్రంగా ఆయన అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ఆందోళనలతో జగన్ రెడ్డి, ఆయన పార్టీయే ఏం చేయాలో తెలియని అయోమయస్థితిలో, ఏం చేసినా ఇక లాభం లేదన్న నిస్తేజంలో మునిగిపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రోటిలో తలపెట్టేశాం.. ఎన్నికలలో రోకటి పోటు తినాల్సిందే అన్న నిశ్చితాభిప్రాయానికి వైసీపీ నేతలూ, క్యాడర్ వచ్చేశారని అంటున్నారు.   ఈ నేపధ్యంలోనే 2019 ఎన్నికల్లో, ఒక్క ఛాన్స్   వ్యూహంతో వైసీపీని గెలిపించిన, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్’కిశోర్ సైతం  చంద్రబాబు అరెస్ట్ తరువాత జగన్ని తప్పు చేశావ్ అని హెచ్చరించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు ముందే జగన్ కు నో అనదర్ చాన్స్ అన్న నిర్ణయానికి వచ్చేసిన ఏపీ ప్రజలు.. ఇక ఇప్పుడు జగన్ ను ఓడించేందుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా, చంద్రబాబు అప్పటికీ రిమాండ్ లోనే తెలుగుదేశం పార్టీని గెలిపించుకునేందుకు తెగించి బయటకు వస్తామని జనం స్వచ్చందంగా చెబుతున్నారు. ఈ విషయం తాజా సీఓటర్ సర్వే పేర్కొంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా విజయం తెలుగుదేశం పార్టీదేనని ఆ సర్వే పేర్కంది.   చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను  స్పందిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆర్థిక, రాజకీయ, సినీ పరిశ్రమలకు చెందిన వారు స్వచ్ఛందంగా చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ.. జగన్ సర్కార్ తీరును ఖండిస్తున్నారు. ప్రాంతీయ, భాషా బేధాలకు అతీతంగా అన్ని వైపుల నుంచీ, అన్ని వర్గాల నుంచీ చంద్రబాబుకు సంఘీభావం వ్యక్తం అవుతున్నది. 

    మళ్లీ మొదటికొచ్చిన గవర్నర్, కేసీఆర్  మధ్య కోల్డ్ వార్

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై మధ్య విభేధాలు ఇంకా సమసిపోలేదా?  తాజా పరిణామాలు  చూస్తుంటే గవర్నర్ తమిళ సై, కేసీర్ ప్రభుత్వం మధ్య ఇంకా కోల్డ్ వార్ మళ్లీ మొదలైందని తెలుస్తోంది.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అధికార పార్టీకి షాకిచ్చారు! గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను ఆమె తిరస్కరించారు. కొన్నిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాల సిఫార్సులను ఆమె తిరస్కరించారు. ఇటీవలె సచివాలయంలోని రెండు ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి  రావాలంటూ రాజ్ భవన్ కు వెళ్లి ఆహ్వానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తో మళ్లీ  సఖ్యత కుదిరిందని అందరూ భావించారు. ఎన్నికలు కూత వేటు దూరంలో ఉన్నప్పుడు గవర్నర్ తో విభేధాలు అంత మంచిది కాదని కేసీఆర్ భావించడం వల్లే రాజీకి వచ్చినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎంఎల్ సీ పదవి ఇవ్వాలంటూ బిఆర్ ఎస్ అధిష్టానం  చేసిన సిఫారసును గవర్నర్ తమిళ సై తిరస్కరించడంతో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీటౌతుంది. అప్పుడు ఒక ఎంఎల్సి కౌషిక్ రెడ్డికి చేసిన సిఫారసును తిరస్కరిస్తే ఇప్పుడు ఇద్దరు ఎంఎల్సి అభ్యర్థులను గవర్నర్ తమిళ సై తిరస్కరించడం పెను సంచలనమైంది.  గవర్నర్ కోటాలో ఎంఎల్సీ నియామకం అంత ఆషామాషీ కాదు . సామాజిక కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించిన వారికి  గవర్నర్ కోటాలో ఎంఎల్ సీ పదవి ఇవ్వడం సాంప్రదాయం. దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణ ప్రస్తుతం యాక్టివ్ పొలిటిక్స్ లో ఉన్నారు. ఈ కారణంగానే వారి సిఫారసులను  గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. ఇదే విషయాన్ని గవర్నర్ ప్రకటించారు కూడా. వీరిద్దరి సామాజిక కార్యక్రమాలు పెద్దగా ఏమి లేవని గవర్నర్ వ్యాఖ్యానించారు. 

కాంగ్రేస్ కు పెరిగిన గ్రాఫ్ నిండా మునిగిన కేసీఆర్ 

అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో నష్టపోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందే ప్రారంభించిన బీఆర్ఎస్ అభ్యర్థులు జమిలీ ఎన్నికల టాక్ తో పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేయాలని అభ్యర్థులకు ఆదేశించారు. కేంద్రం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు అనౌన్స్ చేయడంతో 20 రోజుల పాటు ప్రచారాన్ని బిఆర్ఎస్ తన ప్రచారాన్ని నిలిపి వేసింది. ఈ సమయంలోనే కాంగ్రెస్ పుంజుకుంది.  ఈ మధ్య వచ్చిన సర్వేల్లో బిఆర్ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. జమిలీ ఎన్నికల ఊసు కేంద్రం ఎత్తకపోవడంతో బిఆర్ఎస్ ఖంగుతింది. కేంద్రం అంచనాలను పసి గట్టడంలో బిఆర్ఎస్ విఫలమైందన్న విమర్శలు వస్తున్నాయి.  ప్రచారానికి విరామం ఇవ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగింది అని పరిశీలకులు అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత సోనియాగాంధి ఈ నెల 17న హైదరాబాద్  తుక్కుగూడకు వచ్చి తాయిలాలు ప్రకటించారు. సిక్స్ గ్యారెంటీస్ ప్రకటన తర్వాత కాంగ్రెస్ ఇమేజ్ తెలంగాణలో పెరిగింది. కర్ణాటక డిప్యూటీసీఎం, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తదితరులంతా తుక్కుగూడకు తరలిరావడం, తెలంగాణ ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడానికి కారణమైంది.  కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది. నెల రోజుల క్రితం బిఆర్ఎస్ జాబితా ప్రకటించిన తర్వాత అటు అసమ్మతి వాదులను బుజ్జగించడం, అభ్యర్థులను గెలిపించుకోవడమే బిఆర్ఎస్ ముందున్న టాస్క్ గా ఉండేది . కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అసమ్మతి పెరిగిపోయింది. పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయావకాశాలు సన్నగిల్లాయి. బిఫామ్ మీద ఆశలు పెట్టుకున్న అభ్యర్థులు మెండుగానే ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందే 115 మంది అభ్యర్థులను బిఆర్ఎస్ ప్రకటించింది. కానీ ప్రచారాన్ని ప్రారంభించలేకపోయింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలకమైన మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ ఆ ప్రభావం ఈ ఎన్నికల్లో ఉండకపోవచ్చు. 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ ప్రకారం ప్రకటిస్తారు. మహిళా బిల్లు అమలుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత ముందు వరసలో నిలిచారు.  మహిళా బిల్లు వల్ల తన సీటు పోయిన పర్వాలేదని కేటీఆర్ ప్రకటించారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. బిఆర్ఎస్ అసమ్మతివాదులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇచ్చి ప్రోత్సహించాలని చూస్తోంది. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే , బిఆర్ఎస్ నేత ఇప్పటికే కేసీఆర్ పార్టీకి రాజీ నామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దమయ్యారు. జమిలీ టాక్ తో   అభ్యర్థుల ఎన్నికల ఖర్చు తగ్గించాలన్న ఉద్దేశ్యంతో కేసీఆర్ ప్రచారాన్ని నిలుపుదల చేయాలని ఆదేశించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. సిక్స్ గ్యారెంటీస్  సోనియాగాంధీ ప్రకటించడం, సీడబ్ల్యూసి సమావేశాలు జరగడం  కాంగ్రెస్ పార్టీ  జనాల్లో వెళ్లింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు.  కానీ బిఆర్ఎస్ లో మాత్రం నెగెటివ్ టాక్ ఎక్కువగా వచ్చేసింది. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పుకునే కేసీఆర్ కు నూకలు చెల్లినట్లేనని పరిశీలకులు భావిస్తున్నారు.  రెండు సార్లు అధికారంలో వచ్చిన కేసీఆర్ పార్టీ హ్యట్రిక్ కొట్టడం కల్ల అవుతుందని వారు అంటున్నారు. 

సంపద సృష్టితోనే అభివృద్ధి, సంక్షేమం.. బాబు తారకమంత్రం అదే!

కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న  రోజులలో ఒకే ఒక్కడుగా ఐటీ పరిశ్రమ కోసం ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా శ్రమించారు. యువత ఉజ్వల భవిష్యత్ కోసం కలలుగని, ఆ కల నెరవేర్చుందుకు శ్రమించి, తపించి సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా మార్చారు. అది చాలదా..? ఒక్క ఐటీ పరిశ్రమ వల్ల ఒక్క సారిగా ఏపీ ముఖచిత్రమే మారిపోయింది. వేలు, లక్షల మందికి జీవితంలో స్థిరపడేలా ఐటీ ఉద్యోగాలు వచ్చాయి. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. మంచి జీతాలతో ఉద్యోగాలు పొందిన వారు వెంటనే సొంతింటి నిర్మాణంపై దృష్టిసారించాయి. దీంతో వారు హోంలోన్ లు తీసుకున్నారు. బ్యాంకింగ్ రంగం వృద్ధి చెందింది. అపార్ట్ మెంట్ల నిర్మాణం జోరందుకుంది. నిర్మాణ రంగం పరుగులు తీసింది. వారి కొనుగోలు శక్తి పెరిగింది. బ్రాండెడ్ దుస్తుల కొనుగోళ్లు పెరిగి టెక్స్ టైల్ ఇండస్ట్రీ వృద్ధి చెందింది.  వీకెండ్ విహారాలు పెరిగాయి. పర్యాటక రంగం జోరందుకుంది. అంతేనా ఎంటర్మైన్ మెంట్, ఏవియేషన్ ఇండస్ట్రీ అభివృద్ధిలో, పురోగమనంలో కొత్త పుంతలు తొక్కాయి. సొంత ఇంటిని సుందరంగా తీర్చిదిద్దుకోవడం, హంగుల ఏర్పాటుపై ఐటీ ఉద్యోగులు దృష్టి పెట్టారు. టీవీ, గృహోపకరణాల కొనుగోళ్లు పెరిగాయి, హోంఅప్లయెన్సెస్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరుకాయలుగా, శాఖోపశాఖలుగా విస్తరించింది.  అంతేనా ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగాయి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. ఫుడ్ ఇండస్ట్రీ అనూహ్యంగా జోరందుకుంది. ఇలా ఒకటేమిటి.. ఇప్పుడు దేశంలో కనిపిస్తున్న ప్రతి పురోగతి వెనుకా చంద్రబాబు విజనే ఉంది.  ప్రజల ఆర్థిక ప్రమాణాలు పెరగడం టాక్స్ పేయర్ల ను పెంచింది. దిగువ మధ్యతరగతి మధ్యతరగతిగా ఎదిగింది. మధ్యతరగతి ఎగువ మధ్య తరగతిగా ఎదిగింది. ఇలా ఎదిగిన ప్రతి కుటుంబమూ మా వాడికి, మా అమ్మాయికీ ఐటీ ఉద్యోగం వచ్చింది, మంచి జీతం వస్తోంది అందుకే బాగుపడ్డాం అని చెబుతారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ లక్షలాది మంది తెలుగు యువకులను విదేశాలకు వెళ్లి లక్షల్లో వేతనాలు సంపాదించేలా చేసింది. ఉభయ తెలుగురాష్ట్రాలలో లక్షల కుటుంబాలు చెప్పే జవాబులు ఇవే. అంతే కానీ ఎవరూ కూడా ఫలానా ఉచిత పథకం వల్ల మా దశ తిరిగింది. మేం బాగుపడ్డాం అని చెప్పే పరిస్థితి లేదు. అందుకే చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మాట సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాజాభివృద్ధికి అవసరం. అభివృద్ధి ద్వారా సృష్టించిన సంపదని సమాజానికి పంచాలి. తప్ప అప్పులు, పన్నులు ద్వారా కాదు. అందుకే జనం ఆలోచించాలి.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవాలి  తాత్కాలిక లబ్దిపై వల్ల ప్రయోజనం ఉండదు. దీర్ఘకాలిక దృష్టి ఉండాలి. చంద్రబాబులో ఉన్నది అదే. అందుకే ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తే ఆయన దార్శనికత కారణంగా బాగుపడిన ప్రతి యువకుడూ ఆవేదన చెందుతున్నారు. తమ కంఫర్ట్ జోన్ ను వదిలి పోలీసు ఆంక్షలను సైతం లెక్క చేయకుండా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ సంఘీభావం తెలుపుతున్నారు. 

ఐయామ్ విత్ బాబు.. ఏపీ అంతటా ఇదే నినాదం.. ఎన్నికలోస్తే తడాఖా చూపుతామంటన్న జనం

స్కిల్ స్కాం అంటూ చంద్రబాబుపై మోపిన అభియోగాలు కోర్టుల్లో నిలవవని న్యాయనిపుణులు, మాజీ ఐఏఎస్ లు, చివరాఖరికి సుప్రీం కోర్టు మాజీ న్యాయవాదులు కూడా బలంగా చెబుతున్నారు. కానీ విచిత్రంగా ఆ నిలబడని అభియోగాల కారణంగానే ఆయన గత పక్షం రోజులుగా రాజమహేంద్రవరం జైలులో ఉన్నారు. దేశ విదేశాలలో ఆయన అరెస్టును నిరసిస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని చోట్లా ఆందోళనలు నిరాటంకంగా కొనసాగుతుంటే.. తెలుగు రాష్ట్రాలలో మాత్రం ఆంక్షల నడుమ.. ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, తెలుగుదేశం శ్రేణులూ పట్టువదలకుండా ఉద్యమిస్తున్నారు. లాఠీలకు, అరెస్టులకు బెదరకుండా నిలబడుతున్నారు. ఈ మధ్యలో ఇటు ఏసీబీ కోర్టు, అటు హైకోర్టులో చంద్రబాబుకు ఊరట లభించలేదు. ఏసీబీ కోర్టు చంద్రబాబును రెండు రోజులు సీబీఐ కస్టడీకి అనుమతించగా, హై కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక రెండు రోజుల సీఐడీ విచారణ పూర్తయిన తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబు రిమాండ్ ను పొడిగించింది. మరో వైపు చంద్రబాబు హైకోర్టు  తన  క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. అలాగే ఏసీబీ కోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండూ కూడా సోమవారం ( సెప్టెంబర్ 25)న విచారణకు రానున్నాయి. దీంతో రాజకీయవర్గాలే కాకుండా సామాన్యులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విధానం అత్యంత అప్రజాస్వామికంగా, అక్రమంగా, అన్యాయంగా ఉందన్న విషయంలో ఎవ్వరిలోనూ భిన్నాభిప్రాయమే కనిపించడం లేదు. చివరాఖరికి వైసీపీలోకి కొందరు నేతలు, శ్రేణులూ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కూడా. అసలే తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రబాబును అప్రజాస్వామికంగా, అక్రమంగా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టుతో తమ పరిస్థితి మరింత దయనీయంగా మారిందనీ, ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న గెలుపు ఆశలు కూడా ఆవిరైపోయాయనీ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రైవేటు సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అరెస్టు తరువాత చంద్రబాబు పక్షం రోజులుగా జైలులో ఉండటం.. జనం స్వచ్ఛందంగా ఐయామ్ విత్ బాబు అంటూ రోడ్లపైకి రావడం, పోలీసులు మొత్తం రాష్ట్రాన్నే జైలుగా మార్చేసినట్లుగా, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ విధించిన విధంగా ఆంక్షలు అమలు చేయడంతో జనంలో ఆగ్రహజ్వాలలు ఎగసి పడుతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయా? జగన్ సర్కార్ ను ఎప్పుడు గద్దెదించుదామా అని ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు వారి వారి నియోజకవర్గాల ఎమ్మెల్యేల ముఖంమీదనే చెప్పేశారంటే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.  ఇక స్కిల్ కేసు విషయానికి వస్తే చంద్రబాబు బెయిలుపై బయటకు రావడం కంటే.. ఈ కేసులో తాను నిర్దోషిననీ, కనీసంగా కూడా పద్ధతులు, ప్రొసీజర్, నిబంధనలు పాటించకుండా అరెస్టు చేశారనీ నిరూపించుకునే బయటకు రావాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ కొట్టివేసినా.. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. న్యాయనిపుణుల అభిప్రాయం ప్రకారం హైకోర్టు క్వాష్ పిటిషన్ ను మెకానికల్ గా కొట్టివేసిందంటున్నారు. దర్యాప్తులో జోక్యం చేసుకోరాదంటూ ఎప్పుడో సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఆధారం చేసుకునే ఈ తీర్పు ఇచ్చిందనీ, అరెస్టు తీరే అక్రమం అంటూ చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనను పరిగణనలోనికి తీసుకోలేదనీ చెబుతున్నారు.  ఇక సామాన్యజనమైతే.. చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేత.. వివేకా హత్యకేసులో నిందితుడు భాస్కరరెడ్డికి బెయిలును పోలుస్తూ.. జగన్ సర్కార్ వ్యవస్థలను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తోంది అనడానికి అదే తార్కానంగా చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వివేకా హత్య కేసులో ఏ8ను అరెస్టు చేయడానికి వెళ్లి కూడా సీబీఐ రిక్తహస్తాలతో వెనుదిరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఆధారాలున్నాయి, అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలి  అని కోర్టులో సీబీఐ విస్పష్టంగా చెప్పి, అందుకు కోర్టు అనుమతి తీసుకున్న తరువాత కూడా స్థానిక పోలీసుల సహకారం లేదు, శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ సాకులు చెప్పి ఆయనను అరెస్టు చేయకుండా వదిలేసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. జగన్ సర్కార్ పూర్తిగా నియంతృత్వ ధోరణిలో, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నదనీ, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించేవారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిటికీ మించి మంత్రులు కూడా తరువాత ఎవరెవరి అరెస్టు కాబోతున్నారో బహిరంగంగా ప్రకటిస్తుండటం, సీఐడీ చీఫ్ స్కిల్ కేసు దర్యాప్తు వివరాలను ఊరూరా మీడియా సమావేశాలు పెట్టి మరీ వివరిస్తుండటంతో రాష్ట్రంలో రాజ్యాంగం అమలు అవుతోందా? అన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.   రాష్ట్రంలో ఒక విధమైన ఎమర్జెన్సీ అమలులో ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తం అవుతున్నది. 1975లో ఎమర్జెన్సీ అనుభవించని జనం ఆ తదుపరి ఎన్నికలలో అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే చిత్తుచిత్తుగా ఓడించారో.. వచ్చే ఎన్నికలలో జగన్ సర్కార్ ను అలాగే చిత్తుచిత్తుగా ఓడిస్తాం అని ప్రతిన పూనుతున్నారు. ఇప్పటి వరకూ రాజకీయాలతో సంబంధం లేని తటస్థులు కూడా రోడ్లపైకి వచ్చి చంద్రబాబుకు సంఘీభావం తెలపడం చూస్తుంటే.. సామాన్య  ప్రజానీకం నుంచి మేధావులు మధ్య తరగతి ప్రజలు మొదలు, అన్ని వర్గాల ప్రజల నుంచి జగన్ సర్కార్ పట్ల వ్యక్తం అవుతున్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతోంది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తున్నా జగన్ మాత్రం తన ప్రసంగాలలో, పార్టీ సమావేశాలలో,శాంతి భద్రతల సమీక్షల్లో ఇంకా అరెస్టులు ఉంటాయి అంటూ పేర్లతో సహా ప్రస్తావిస్తూ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే నిండా మునిగిపోయాం.. ఇక చలేమిటి? అని సంకేతాలిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీ నేతలు, శ్రేణులూ కూడా తమ నాయకుడు జగన్ రెడ్డి తాను మునిగిపోవడమే కాకుండా, పార్టీనీ, తమనూ కూడా ముంచేయడానికే రెడీ అయిపోయారని అంటున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో చంద్రబాబు అరెస్టు ప్రభావం అధికార వైసీపీపై తీవ్ర ప్రతికూలత చూపడం ఖాయమని ఇటీవలి సీఓటర్ సర్వే తేల్చి చెప్పేసింది. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రేనని జనం భావిస్తున్నారని కుండబద్దలు కొట్టేసింది. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం విజయం ఖాయమనీ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ఖాయమనీ సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు పలువురు ఓటమికి మాసికంగా సిద్ధమైపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

సైబర్ టవర్స్ @ 24 ఏళ్ళు!

ఒక్క ఆలోచన.. ఒకే ఒక్క ఆలోచన యావత్ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అందుకే కంప్యూటర్లు కూడు పెడతాయా అని హేళన చేసి ఉంటారు. భవిష్యత్ కాలాన్ని నడిపించే ఆయుధాన్ని చేతికి అందిపుచ్చుకోవడానికి ఎంతో ముందు చూపు అవసరం. ముందుచూపుతో ఆ దార్శనికుడికి జాతిని నడిపించే ఆలోచన రావడం.. ఎన్నో విమర్శల మధ్య ఆ ఆలోచనను శ్రమకోర్చి ఆచరించడం అనితరసాధ్యమైన విషయం. అన్నిటినీ అధిగమించి నాడు నాటిన ఓ విత్తనం ఇప్పుడు భారీ వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలు అందిస్తున్నది.. ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాల ఇంజనీర్లకు మార్గదర్శనంగా నిలుస్తుంది. అదే సైబర్ టవర్స్.. ఆ దార్శనికుడు పేరే నారా చంద్రబాబు నాయుడు. నేటితో సైబర్ టవర్స్ ప్రారంభమై 24 ఏళ్ళు పూర్తైంది. సరిగ్గా 23-09-1999న సైబర్ టవర్స్ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ ప్రస్థానం మొదలైంది. ఇప్పుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఐటీ నిపుణులతో కళకళలాడుతున్న సైబరాబాద్ ఒక‌ప్పుడు అడవిలా ఉండేది. సైబర్ టవర్స్ ఉన్న ప్రాంతం ఓ కుగ్రామంలా కనిపించేది. ఇప్పుడు అతి భారీ కట్టడాలతో, మెలికలు మెలికలు తిరిగిన వంతెనలతో కనిపిస్తున్న ఈ విశ్వనగరంలో అప్పుడు ఎటు చూసినా అంతా రాళ్లు రప్పలే కనిపించేవి. జ‌న‌సంచారం కూడా ఉండేది కాదు. గేదెలు మేపుకొనే కొండ ప్రాంతంగా కనిపించిన ఆ ప్రదేశంలో ఓ నాయకుడికి మాత్రం సిరులు పండించే ఆధునిక నగరం కనిపించింది. అప్పుడు ఆ నాయకుడి ఊహే ఇప్పుడు నిజమై  ఆ ప్రాంతం రెండు తెలుగు రాష్ట్రాలకు కాస్ట్లీ ఏరియాగా అవతరించింది. హైద‌రాబాద్ ఇన్ ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అండ్ ఇంజినీరింగ్ క‌న్స‌ల్టెన్సీ సిటీగా నామకరణం చేసుకొని హైటెక్ సిటీగా పిలువబడెతొంది. ఎందరో యువ ఇంజనీర్ల భవిష్యత్  బాటగా మారింది.    సైబర్ టవర్స్ ప్రారంభం తర్వాత ఎంతోమంది ఐటీ దిగ్గజాల క‌న్ను హైద‌రాబాద్ పై ప‌డింది. ఐటీ రంగానికి మ‌రో సిలికాన్ సిటీగా నిలిచింది. అంతకు ముందు హైదరాబాద్ అంటే చారిత్రక గుర్తులే చిహ్నం. సైబర్ టవర్స్, హైటెక్ సిటీ నిర్మాణం తర్వాత బ్రతుకును నడిపించాల్సింది చరిత్ర కాదు భవిష్యత్ అనేది అవిష్కృతమైంది. అంత‌ర్జాతీయ స్థాయిలో భాగ్య‌న‌గరానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిపెట్టిన హైటెక్ సిటీ ముమ్మాటికీ చంద్ర‌బాబు నాయుడి మాన‌స పుత్రిక‌నే. ఇందులో కొందరు ఎన్నో వాదనలు, అంతకు మించిన విమర్శలు చేసినా చంద్రబాబు విజనరీని ఇసుమంతైనా తగ్గించి చూపలేవు. ప్ర‌పంచ పుట‌ల్లో హైద‌రాబాద్ ను ఓ వెలుగు వెలిగేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని ఈనాటి తెలంగాణ పాలకులు సైతం ఒప్పుకున్న సత్యం. ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చి, నేడు ప్రపంచానికే తలమానికంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఐటీ దిగ్గజ సంస్థల పెద్దలే చెప్తుంటారు.  ప్రస్తుతం 67 ఎక‌రాల్లో విస్త‌రించిన ఈ హైటెక్ సిటీ తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో అత్యంత కీలక పాత్రం వహిస్తున్నది. ఇక్కడ త‌మ కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తున్న ఐటీ కంపెనీలతో ఎంతో మందికి ప్రత్యేక, పరోక్ష ఉపాధి కలిగిస్తుంటే తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఆదాయం తెచ్చిపెడుతున్నది. దేశానికి చెంద‌న‌వారే కాదు.. విదేశాల‌కు చెందిన ఎంతోమంది ప్రపంచ నలుమూలన నుండి భాగ్యనగరాన్ని వెతుక్కుంటూ వస్తున్నారంటే నాడు నాటిన సైబర్ టవర్స్ విత్తనం ఏ స్థాయిలో  వృద్ధి చెంది, విస్తరించి ఫలాలు అందిస్తున్నదో ఊహించుకోవచ్చు. అంతకు ముందు దక్షణాదిన ఐటీకి కేరాఫ్ అడ్రస్ అంటే బెంగుళూరు అనే అంతా భావించారు. కానీ ఇప్పుడు బెంగళూరుకు దీటుగా భాగ్య‌న‌గ‌రంలో ఐటీ హ‌బ్ కనిపిస్తున్నది. ఎక్కడెక్కడి నుండో ఇంజనీర్లు ఇక్కడకి చేరుకోవడంతో హైటెక్ సిటీ చుట్టూ ప‌లు వ్యాపార సంస్థ‌లు వాలిపోయాయి. దేశవిదేశాలకు చెందిన స్టార్ హోటల్స్, హాస్పిట‌ల్స్ ఏర్పాటుతో రియ‌ల్ ఎస్టేట్ మూడు పూవులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. ఫలితంగా ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా హైటెక్ సిటీ గుర్తింపు తెచ్చుకుంది. అంతటికీ మూలం ఆ టార్చ్ బేరర్. ఆ విజనరీ, ఆ దార్శనికుడు చంద్రబాబు. ఆయన మేధోపుత్రిక హైటెక్ నేడు ఆదాయం పెంచే, పంచే కల్పవృక్షంగా మారింది. 

జగన్ రెడ్డి బెయిలు జీవితానికి పదేళ్లు

లక్ష కోట్ల ప్రజాధనం దోచుకున్నారనే ఆరోపణలు, 42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేశారని దర్యాప్తు సంస్థ సీబీఐ నిర్ధారణ, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 ముద్దాయి, 16 నెలల సుదీర్ఘ కాలం జైల్లో గడిపిన పొలిటికల్ లీడర్, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బెయిల్ జీవితంలో కూడా అనితరసాధ్యమైన రికార్డ్ సృష్టించారనే చెప్పాలి.  అవును.. నిజమే.. ఆయన సృష్టించిన రికార్డు నభూతో.. నభవిష్యత్ వంటిదే మరి. అదేమిటంటూ..  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుండి బయటకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయింది.  ఔను ఆయన నేడు పదో బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలో.. సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య ఇదే  హాట్ టాపిక్ గా మారింది. ఈ పదేళ్లలో సీబీఐ కోర్టు ఎన్నిసార్లు విచారణకు పిలిచినా జగన్ మోహన్ రెడ్డి ప్రజా పాలన సాకుగా చెప్పుకుంటూ   విచారణకు హాజరు కావడం లేదు. ఫలితంగా ఈ కేసు దశాబ్దానికి పైగా సాగుతూనే ఉంది. పదేళ్ల కాలంలో జగన్ పలుమార్లు విదేశీ యాత్రలకు వెళ్లగా.. ప్రతిసారి కోర్టు అనుమతి తీసుకొని, కోర్టులో  సమర్పించిన పాస్ పోర్ట్ తీసుకొని వెళ్లడం, తిరిగి రాగానే మళ్ళీ కోర్టుకు అప్పగించడం చేస్తున్నారు. 42 వేల కోట్ల అక్రమ ఆస్తుల కేసులో ఏ1గా ఉన్న జగన్ పదేళ్లుగా బెయిల్ పై ఉండడంపై ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ పై టీడీపీ యువ నేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. జైలు మోహన్ రెడ్డికి  పదో బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు.  42 వేల కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడని నారా లోకేష్ మండిపడ్డారు. జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే, జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్ జైల్లో ఉన్నారని లోకేష్ చంద్రబాబు అరెస్టుపై ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ రెడ్డి జీవితంలో ఈరోజు అత్యంత సంతోషకరమైన రోజు అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా సెటైర్లు వేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన మాట్టాభి.. కోర్టు బెయిల్‌పై దర్జాగా జీవిస్తూ, తన బెయిల్ కాలాన్ని 10 ఏళ్లు పూర్తి చేసుకున్న ముఖ్యమంత్రి పట్టరాని ఆనందంతో పదవ బెయిల్ డే వార్షికోత్సవం జరుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి సాధించిన ఈ గొప్ప ఘనతను గుర్తించి, ‘ఎక్కువ కాలం బెయిల్‌పై జీవించిన వ్యక్తి’గా జగన్ రెడ్డిని గుర్తించి, ఆయనకు ఒక రికార్డ్ ఇవ్వాలని కోరుతూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి మెయిల్ పెట్టానని.. వారు త్వరలోనే జగన్ రెడ్డిని కలిసి ఆయన సాధించిన ఘనతకు సంబంధించిన సర్టిఫికెట్ అందిస్తారన్నారు. ఆ సర్టిఫికెట్‌ను జగన్ రెడ్డి పెద్దపెద్ద ఫ్రేములు కట్టించి తన ప్యాలెస్‌లతో పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టాలని వ్యాఖ్యలు చేశారు. మిగతా టీడీపీ సీనియర్ నేతలు, టీడీపీ శ్రేణులు జగన్ బెయిల్ డేపై సోషల్ మీడియాలో సెటైర్లు హోరెత్తిస్తున్నారు. కాగా, పదేళ్లుగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పైనే దర్జాగా తిరుగుతుండడంపై పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఇంతటి హై ప్రొఫైల్ కేసు, ఇంత ప్రజా ధనం దోచుకున్నారని దర్యాప్తు సంస్థలు గుర్తించిన ఈ కేసులో ఓ నిందితుడు ఇలా రాజ్యమేలడం, ఈ కేసు ఇప్పటికీ దర్యాప్తు దశలో ఉండడంపై పరిశీలకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి కేంద్రం అండదండలతోనే ఇంత కాలం పాటు ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా నిలువరించగలిగారని అంటున్నారు.  ఈ కేసులో దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచగానే జగన్ కేంద్రం తలుపు తట్టడం.. దర్యాప్తు మందగించడం.. పదేళ్లుగా ఇదే పరిపాటిగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి జగన్ అవినీతి, అక్రమాస్తుల కేసు ఎప్పటికి తేలుతుందో చూడాల్సి ఉంది.

చంద్రబాబును విచారిస్తున్న సీఐడీ!

స్కిల్  స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబును ఏసీబీ కోర్టు షరతులతో సీఐడీ కస్టడీకి అనుమతించిన నేపథ్యంలో  ఆయనను సీఐడీ అధికారులు రెండు రోజులు పాటు విచారింస్తారు. అందులో భాగంగానే శనివారం ఉదయం చంద్రబాబుకు రాజమహేంద్రవరం జైలులో వైద్య పరీక్షల అనంతరం సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులోనే విచారిస్తున్నారు.  ఈ విచారణలో ముగ్గురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ఒక ఏఎస్సై, ఒక కానిస్టేబుల్ పాల్గొన్నారు! వీరితో పాటు ఒక వీడియోగ్రాఫర్‌, ఇద్దరు మధ్యవర్తులు (ఎమ్మార్వో – వీఆర్వో) ఉన్నారు. కాగా చంద్రబాబును శనివారం, ఆదివారం( సెప్టెబర్ 23, 24) రెండు రోజుల పాటు సీఐడీ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారించనుంది. ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున విచారణను పర్యవేక్షించేందుకు ఇద్దరు న్యాయవాదులను కూడా కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే . రెండు రోజులూ కలిపి చంద్రబాబును సీఐడీ మొత్తం 15 గంటల పాటు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబు వయస్సు ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ప్రతి గంటకూ ఐదు నిముషాలు విరామం ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా చంద్రబాబు కోరితే  మరిన్ని విరామాలు కూడా తప్పవని న్యాయ నిపుణులు చెబుతున్నారు.  చంద్రబాబుపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని కస్టడీ ఉత్వర్వులు వెలువరించే సమయంలో ఏపీసీ కోర్టు విస్పష్టమైన ఆదేశాలను ఏపీ సీఐడీకి ఇచ్చింది. అలాగే చంద్రబాబు విచారణకు సంబంధించి ఫొటోలూ, వీడియోలు లీక్ అవ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. అంతే కాకుండా విచారణ గడువు ముగిసిన వెంటనే అంటే ఆదివారం (సెప్టెంబర్ 24) సాయంత్రం చంద్రబాబు విచారణను సీఐడీకి చెందిన వీడియోగ్రాఫర్ తో రికార్డు చేసిన వీడియోను సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి సమర్పించాలని ఆదేశించింది. కస్టడీ గడువు ముగిసిన తరువాత చంద్రబాబును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం సాయంత్రమే కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించింది. అంతకు ముందు చంద్రబాబును విచారించేందుకు 12 మందితో కూడిన బృందంలోని వారి పేర్లను సీఐడీ న్యాయస్థానానికి సమర్పించింది.  

విశాఖ జగన్ ఈగో శాటిస్ ‘ఫ్యాక్షన్ ’రాజధానేనా?

జగన్ మోహన్ రెడ్డి సర్కార్ విశాఖ కేంద్రంగా  పాలనకు సిద్ధమైంది. ఇందు కోసం దసరా ముహుర్తాన్ని కూడా నిర్ణయించింది. సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే  ఈ విషయాన్ని ఇటీవలి కేబినెట్ సమావేశంలో వెల్లడించారు.  ఇందుకోసం విశాఖలో ఇప్పటికే కార్యాలయాలు, సీఎం నివాసం కూడా సిద్దమవుతున్నట్లు ఆయనే చెప్పారు. రాబోయే ఎన్నికలను అక్కడి నుంచే ఎదుర్కోవాలని వైసీపీ నిర్ణయించింది. అందుకే ఇప్పటికిప్పుడు ఎలాగైనా పరిపాలన విశాఖ నుండే చేయాలని కసరత్తులు ప్రారంభించింది. నిజానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే మూడు రాజధానులంటూ ప్రకటించింది.  అనంతరం అమరావతి రైతుల నిరసనలు, కోర్టు చిక్కులు, కరోనా కారణంగా మూడు రాజధానులకు బ్రేకులు పడ్డాయి. కోర్టుల నుండి తీవ్ర ఒత్తిడితో మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం అదే అసెంబ్లీ సాక్షిగా వెనక్కి తీసుకుంది. ఇప్పుడు కూడా ఏపీ రాజధానిగా అమరావతి అంశం సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. అయినా  ప్రభుత్వం విశాఖ రాజధాని అంటూ ప్రకటనలు చేస్తూనే ఉంది. రాజధానుల అంశంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోర్టు చెప్పినా జగన్ సర్కార్ విశాఖలో రాజధాని ఏర్పాట్లు చేపడుతూనే ఉంది. కొన్ని నెలలుగా దసరా నుంచి విశాఖ కేంద్రంగా పాలిస్తామని ప్రకటిస్తున్న సీఎం జగన్ తాజాగా కేబినెట్లోనూ ఈ మేరకు ప్రకటన చేసేశారు. ఆ దిశగా విశాఖకు రాజధానిని తరలించేందుకు విజయదశమిని ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అంతే కాకుండా రుషికొండ వద్ద నిర్మిస్తున్న భవనాల పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. తొలుత ముఖ్యమంత్రి జగన్, కీలక హెచ్వోడీ కార్యాలయాలను విశాఖకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే కసరత్తు వేగంగా జరుగుతోంది. ఇదే విషయమై తాజాగా.. మంత్రి అమర్నాధ్ మాట్లాడుతూ అక్టోబర్ 23వ తేదీనుండి జగన్ వైజాగ్ లోనే ఉంటారని ప్రకటించారు.  ప్రస్తుతం విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం, క్యాంపు కార్యాలయం, మంత్రులు, ఉన్నతాధికారుల కార్యాలయాలు, నివాసాలు, అవసరమైన సిబ్బంది క్వార్టర్స్ తదితరాల ఏర్పాట్లలో ప్రభుత్వ అధికారులు బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం వారంలో రెండు రోజులు జగన్ వైజాగ్ లో ఉండబోతున్నట్లు తెలిసింది. అదికూడా గురు, శుక్ర వారాల్లో విశాఖపట్నంలో ఉంటారని మిగిలిన రోజుల్లో అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పర్యటనలు చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే, జగన్ ఏ ఉద్దేశ్యంతో విశాఖ నుండి పాలన చేయనున్నారన్న చర్చ ప్రజల మధ్య జరుగుతుంది. చట్ట పరిధిలో విశాఖకు రాజధాని తరలించడం సాధ్యమయ్యేది కాదు. కోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పగా.. చట్టాన్ని అతిక్రమించి రాజధాని తరలించే పరిస్థితి లేదు. రాజధాని అమరావతి కోసం స్థానిక రైతుల వద్ద తీసుకున్న భూములు, వారితో ప్రభుత్వం చేసుకున్న చట్టబద్దమైన ఒప్పందాల ప్రకారం అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి. లేదంటే రైతులకు కొన్ని వేల కోట్లు పరిహారం చెల్లించాలి. వీటిని ఉల్లంఘించి రాజధానిని తరలించడం సాధ్యం కాదని హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు చెప్పింది. అంతేకాదు దీనిపై చట్టాలు కూడా చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లేదని విస్పష్టంగా పేర్కొంది. ఈ అంశంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా కోర్టు నిర్ణయం డిసెంబర్ లో ప్రకటించే అవకాశం ఉంది. ఈలోగా రాజధాని తరలింపు సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనిని బట్టి చూస్తే జగన్ ఇప్పుడు విశాఖకు రాజధాని తరలింపు సాంకేతికంగా జరిగే పని కాదు. కానీ, సీఎం ఎక్కడ నుంచైనా పరిపాలన చేసే అవకాశం ఉంటుంది అని స్వయంగా జగనే చెబుతున్నారు కనుక విశాఖ నుండి పరిపాలన చేయాలని ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నారు. అయితే జగన్,  వైసీపీ చెప్తున్నట్లుగా ఇది రాజధాని తరలింపు కాదు కేవలం సీఎం ఇల్లు, ఆఫీసు. క్యాంప్ ఆఫీసు తరలింపు మాత్రమే. ఇది కూడా కేవలం విశాఖ నుండి పాలన చేశానని చెప్పుకోవడానికీ,  జగన్ తన పంతాన్ని నెగ్గించుకోవడం కోసం మాత్రమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర నుండి రాజకీయ లబ్ది పొందడం కోసమే ఎన్నికలకు ముందు కంటితుడుపుగా ఈ విశాఖ నుండి పాలన డ్రామా మొదలు పెట్టినట్లు చూడాల్సి ఉంటుంది. అయితే, సీఎం తన ఇల్లు, ఆఫీసు తరలిస్తే రాజధాని కాదు.. దానికి ఒక చట్టం ఉంది.. అనుమతులు కావాలి.. కేంద్రం నోటిఫై చేయాలి.. ప్రభుత్వ అధికారిక ముద్ర మారాలి. కానీ, అవేమీ లేని విశాఖ జస్ట్ జగన్ ఈగో శాటిస్ఫాక్షన్ రాజధాని మాత్రమే.

దార్శనికుడు చంద్రబాబుకు జైలు.. వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డికి బెయిలు!

ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయగా.. ఏసీబీ కోర్టు శుక్రవారం (సెప్టెంబర్ 22) ఆయన్ను సీఐడీ కస్టడీకి అప్పగించింది. గత నాలుగు రోజులుగా వాయిదాల పర్వంగా సాగిన ఈ తీర్పు శుక్రవారం రానే వచ్చింది. రెండు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే రెండు రోజుల కస్టడీ తేదీలను మాత్రం కోర్టు వెల్లడించలేదు. తేదీలను తర్వాత ప్రకటిస్తామని కోర్టు తెలిపింది. చంద్రబాబును ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టును సీఐడీ కోరగా ఐదు రోజులు కాకుండా రెండు రోజుల కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే విచారిస్తామని కోర్టుకు సీఐడీ తెలిపింది.   కాగా, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు, సీఎం జగన్ బాబాయ్ వివేకా హత్యకేసులో నిందితుడికి బెయిల్ లభించింది. వివేకా హత్య కేసును ఏళ్లుగా సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ఎంపీ, సీఎం జగన్ కు సోదరుడైన వైఎస్ అవినాష్ రెడ్డి.. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో   నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఎంపీ అవినాష్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్నారు. అయితే, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటి వరకూ హైదరాబాద్ లోని చంచల్ గూడ జైల్లో ఉండగా.. ఇప్పుడు ఆయనకు కూడా బెయిల్ మంజూరైంది. ప్రస్తుతం భాస్కర్ రెడ్డికి 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. భాస్కర్‌ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌ గూడ సూపరింటెండెంట్‌ రిపోర్ట్‌ ఇవ్వడంతో ఆయనకు వైద్య చికిత్స అందించాలని సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, భాస్కర్ రెడ్డికి హైదరాబాద్‌ లోనే చికిత్స పొందాలని, హైదరాబాద్‌ ను విడిచివెళ్లవద్దని సీబీఐ కోర్టు  షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తంగా భాస్కర్ రెడ్డి జైలు నుంచి శుక్రవారం (సెప్టెంబర్‌ 22)న విడుదలయ్యారు. 12 రోజుల బెయిల్ అనంతరం కూడా ఆయన ఆరోగ్యం సాధారణ స్థితికి రాకపోతే కనుక మరికొన్ని రోజులు బెయిల్ పొడిగించే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. అనారోగ్యం, చికిత్స పేరుతో ఇలా బెయిల్ పొడగించిన కేసులు ఇప్పటికే చాలా చూడగా.. ఇప్పుడు వివేకా హత్యకేసు నిందితుడు భాస్కర్ రెడ్డి బెయిల్ కథ కూడా ఇలా కొనసాగినా ఆశ్చర్యం లేదంటున్నారు.  కాగా, ఒకవైపు కనీసం ఎఫ్ఐఆర్ లో పేరు కూడా లేని స్కాంలో చంద్రబాబును అక్రమంగా, కేవలం కక్షపూరితంగా కేసులు పెట్టి ఆయనను జైలుకు తరలించి.. మాజీ మంత్రి వివేకాను క్రూరాతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపి గుండెపోటుగా చిత్రీకరించాలని ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను బెయిల్ పై బయటకి వదలడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక వైపేమో 43 వేల కోట్ల అవినీతి కేసులలో ఏ1 ముద్దాయిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు దశాబ్ద కాలంగా బెయిల్ పై ఉంటూనే రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. బెయిల్ పై ఉండే కోర్టుల అనుమతితో  దేశ విదేశాలకు విహారయాత్రలకు వెళ్తున్నారు. కనీసం నాలుగేళ్లుగా కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా సాకులు చెప్తున్నారు. ఇదే కేసులలో ఏ2గా ఉన్న విజయసాయి రెడ్డి ఢిల్లీలో పెత్తనం చెలాయిస్తున్నారు. ఈ అవినీతి కేసు ఎప్పటికి తెలుస్తుందో కూడా తెలియడం లేదు.  మరోవైపు వివేకా హత్యకేసులో నిందితులు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొన్న ఎంపీ అవినాష్ ఈసారి  ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మందీ మార్బలంతో స్థానికంగా చెలరేగిపోతూ రాజకీయ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పుడు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి కూడా అనారోగ్య కారణాలతో జైలు నుండి బయటకి వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరో యువతీ, యువకుల భవితకు బంగారు బాట వేసిన చంద్రబాబును మాత్రం జైలుకు తరలించారు. కనీసం ఒక్క అవినీతి ఆధారం చూపించలేకపోతున్న సీఐడీ కస్టడీకి అప్పగిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలపై నగరాలు, పట్టణాలు గ్రామాలలో రచ్చబండలు అన్న తేడా లేకుండా చర్చలు జరుగుతున్నాయి. చంద్రబాబుకు సంఘీభావంగా జనం స్వచ్చందంగా రోడ్ల పైకి వస్తున్నారు.  

కారు డ్రైవర్ ఖాతాలోకి 9వేల కోట్లు.. ఆ తరువాత ఏమైందో తెలుసా?

బ్యాంకు అధికారులు పొరపాటుగానో, గ్రహపాటుగానో చేసిన తప్పు వారికి పెద్ద తలనొప్పి తీసుకువచ్చింది. ఆ తప్పును సరిదిద్దుకోవడానికి 21 వేల రూపాయలను వదులుకోవడమే కాకుండా, ఓ వ్యక్తికి వాహన రుణం కూడా ఇవ్వాల్సి వచ్చింది. ఇంతకీ అసలు జరిగిందేమిటంటే.. చెన్నైలోని మర్కెంటైల్ బ్యాంకు పొరపాటుగా తొమ్మిదివేల కోట్ల రూపాయలను ఓ వ్యక్తి ఖాతాలో జమ చేసింది. వెంటనే జరిగిన పొరపాటును గ్రహించి సరిదిద్దుకునేందుకు ఆ వ్యక్తికి ఫోన్ చేసి మొత్తం సొమ్మును తమకు అప్పగించాలని కోరారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి అంత సొమ్ము తన ఖాతాలో ఎలా జమ అయ్యిందో.. అసలు అది నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి ఓ 21 వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేసి చూశాడు. ఆ తరువాతే అతడికి బ్యాంకు అధికారుల నుంచి ఫోన్ వచ్చింది. అదీ కథ.. అలా బ్యాంకు అధికారుల పొరపాటు వల్ల 9 కోట్ల రూపాయలు జమ అయిన ఖాతాదారులు ఓ కారు డ్రైవర్. అతడి పేరు రాజ్ కుమార్. ఈ నెల 9వ తేదీన అతడి మొబైల్ ఖాతాకు మర్కంటైల్ బ్యాంకు నుంచి 9వేల కోట్ల రూపాయలు జమ అయినట్లుగా మెసేజ్ వచ్చింది. కంగుతిన్న రాజ్ కుమార్ అసలా మెసేజ్ నిజమా కాదా పరీక్షించేందుకు తన స్నేహితుడికి 21 వేల  రూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తే ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో వేల కోట్ల రూపాయల అధిపతిని అయ్యానని ఆనందించే లోపే బ్యాంకు అధికారులు జరిగిన పొరపాటును వివరించి తక్షణమే ఆ సొమ్ము మొత్తం తమకు అప్పగించాలన్నారు. దీంతో రాజ్ కుమార్ ఓ న్యాయవాదిని సంప్రదించాడు. చర్చల తరువాత బ్యాంకు అధికారులు తమ పొరపాటుకు మూల్యం చెల్లించుకోవడానికి అంగీకరించారు. ఆ కారు డ్రైవర్ తన మిత్రుడికి ట్రాన్స్ ఫర్ చేసిన 21 రూపాయలూ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదనీ, అంతే కాకుండా మిగిలిన సొమ్మును తమకు అప్పగించినందుకు ప్రతిఫలంగా ఆ డ్రైవర్ కు వాహన రుణం ఇవ్వడానికీ అంగీకరించి ఒప్పందం చేసుకున్నారు. కథ సుఖాంతమైంది. అయితే ఇప్పుడు నెటిజన్లు మాత్రం అసలు ఆ 9 వేల కోట్ల రూపాయల సంగతేంటి? వాటి కథాకమామిషు ఏమిటని బ్యాంకును నిలదీస్తున్నారు. అంత సొమ్మును ఎవరికి చెందినదీ, దానికి సంబంధించి లెక్కలూ అవీ సక్రమంగా ఉన్నాయా. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. 

కోడికత్తి శీనుకు నో బెయిల్

కోడికత్తి శీనుకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఐదేళ్లు పూర్తియినా ఆయనకు బెయిలు రాలేదు. విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై కోడి కత్తితో దాడిచేశాడన్న అభియోగంపై కోడి కత్తి శీను అప్పటి నుంచీ జైళ్లోనే మగ్గుతున్నాడు. మామూలుగా అయితే ఏ కేసులోనైనా సరే  ఆరు నెలల తరువాత మామూలుగానే బెయిలు వచ్చేస్తుంది. అయితే అంతర్జాతీయ విమానాశ్రయంలో దాడి జరిగిందన్న ఒకే ఒక్క కారణం చేత అప్పట్లో జగన్ ఈ కేసు విచారణ ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) చేపట్టాలని పట్టుబట్టి సాధించుకున్నారు.  సాధారణంగా ఎన్ఐఏ ఉగ్రవాద కేసులను మాత్రమే చేపడుతుంది. ఈ కేసులలో బెయిలు రావడం అంత తేలిక కాదు. దాంతో కోడికత్తి కేసు ఎన్ఐఏ చేపట్టడం.. విచారణ ముగింపు దశకు వచ్చినా బాధితుడిగా కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిన జగన్ అందుకు విముఖంగా ఉండటంతో కోడికత్తి శీను జైలులోనే మగ్గుతున్నారు. గతంలో ఒక సాయి బెయిలు మంజూరైనా ఎన్ఐఏ గట్టిగా అభ్యంతరం చెప్పడంతో రద్దైంది.  ఇప్పుడు కోడి కత్తి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని ఎన్ఐఏ తేల్చేసింది. జగన్ కోర్టుకు హాజరై వాంగ్మూలం ఇస్తే ఇక కేసే ఉండని పరిస్థితి. ఈ స్థితిలో జగన్ ఎన్ఐఏ ఈ కేసు దర్యాప్తు సరిగా చేయలేదనీ, మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యం చేసే వ్యూహాలను జగన్ అవలంబిస్తున్నారని కోడికత్తి శీను తరఫు లాయర్ అంటున్నారు. ఈ దశలో విజయవాడ నుంచి ఈ కేసు దర్యాప్తును విశాఖకు మార్చారు.   తాజాగా కోడికత్తి శీను బెయిలు పిటిషన్ విచారించిన విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టు ఈ కేసులో బెయిలు ఇచ్చే అధికారం తమకు లేదనీ, బెయిలు కోసం హైకోర్టుకు వెళ్లాలనీ సూచించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి కోడికత్తి శీను తల్లి రెండు మార్లు లేఖలు రాసిన సంగతి విదితమే. అయితే ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఇదేళ్ల పాటు జైల్లో మగ్గిన కోడికత్తి కేసు నిందితుడు శీను ఇప్పుడు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించడం వినా మరో మార్గం లేదు. అక్కడ కూడా జగన్ ఎన్ఐఏ కోర్టులో బాధితుడిగా వాంగ్మూలం ఇస్తే తప్ప బెయిలు మంజూరయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.