ర్యాలీల రగడ..చితగ్గొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు!

తెలంగాణ ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.  ఏది ఏమైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతుండగా.. ఈసారి ఎలాగైనా జెండా పాతి కారుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ముందస్తు సర్వేలలో కాంగ్రెస్ కు అనుకూల పవానాలు వీస్తున్నట్లు తేలడంతో  కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే సమయంలో తోమిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్  అస్త్ర శస్త్రాలను ఉపయోగించి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నది.  రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకోవడంతో   ఏ పార్టీ కూడా  ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు సైతం నెలకొంటున్నాయి. కీలక దశకు చేరుకున్న తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగున్నది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం (నవంబర్ 10) తో గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే బుధవారం  ఇరుపార్టీలకు చెందిన పలువురు సభ్యులు  నామినేషన్లు దాఖలు చేశారు.  సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారంతా గురువారం నాడే తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు.  అయితే, నామినేషన్ వేసే సమయంలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు  ఓకేసారి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి  వచ్చారు. ఇద్దరూ భారీ ర్యాలీతో ఓకేసారి ఒకే మార్గంలో రావడం ఘర్షణకు కారణమైంది. ర్యాలీల  సందర్భంగా   వ్యాఖ్యలతో మొదలైన గొడవ చివరికి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. హైదరాబాద్  శివార్లలోని   ఇబ్రహీంపట్నం  బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణతో రణరంగం అయ్యింది.  ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురెదురు పడ్డాయి. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయటంతో ముందు గొడవ మొదలైంది. అది కాస్తా ముదిరి రెండు వర్గాలు జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయగా.. ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై ఉన్న బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు  రాళ్ల వర్షం కురిపించారు. దొరికిన వారిని దొరికినట్లుగా జెండా కర్రలతోనే చితకబాదడంతో ఇరవై మందికి పైగా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. నలుగురైదుగురు పోలీసులను కూడా కార్యకర్తలు చితకబాదారు. చివరికి భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి లాఠీలకు పనిచెప్పడంతో  పరిస్థితి అదుపులోనికి వచ్చింది.  ఇరు పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు వస్తున్నారని తెలిసినా, ఇరు పార్టీల కార్యకర్తలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తారని తెలిసినా.. రెండు ర్యాలీలు ఎదురెదురు పడతాయని తెలిసినా పోలీసులు   ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా  బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా బూడిదయ్యేంత వేడి కనిపిస్తున్నది. ఇలాంటి సమయంలో  అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది. 

జనం కోసం కాదు.. జగన్ కోసమే సీఐడీ!

ఏపీలో దాదాపుగా అన్ని వ్యవస్థలు వాటి స్వరూప స్వభావాలను,  మార్చేసుకున్నాయి.    ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేయడమే వాటి పనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  రాజ్యాంగం, వ్యక్తి స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు వంటి ప్రాథమిక హక్కులు, సూత్రాలను కూడా ప్రభుత్వం కాలరాస్తున్నా.. న్యాయం చేయాల్సిన అధికారులే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తారా లేదా వేధించమంటారా అని బెదిరింపులకు దిగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి  పాలనలో ప్రశ్నించిన పాపానికి నానా రకాలుగా వేధింపులు గురైన వారు ఎందరో ఉన్నారు. ప్రశ్నించినందుకు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టినందుకు పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులు అసంఖ్యాకం.  రాజధాని అమరావతి విషయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఏడు పదుల వయస్సున్న వృద్ధురాలిపై కూడా కేసులు పెట్టి వేధించిన ఘనత  జగన్  ప్రభుత్వానిది.   అయితే, ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, సీఎం వ్యతిరేక కథనాలపై పోలీసులు ఎలా స్పందిస్తారు? ఎలా ట్రాక్ చేస్తారు అనేది పెద్దగా ఎవరికీ అవగాహన ఉండేది కాదు. వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా  పోస్టులు పెడితే హింసిస్తాం అని పబ్లిక్ గా హెచ్చరికలు చేసేసింది. బరితెగింపునకు ఇంతకు మించి ఉదాహరణ ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా తీవ్రమైన చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. అంతేకాదు  ఇష్టం వచ్చినట్లు మీడియా సంస్థలు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు, వార్తలు రాస్తే.. ఆస్తులు జప్తు చేసేందుకు కూడా వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అసలు ఏపీ సీఐడీ ప్రజల కోసం పనిచేస్తున్నదా.. జగన్ కోసం పనిచేస్తున్నదా అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని ఏపీ సీఐడీ తీవ్రంగా పరిగణిస్తున్నదని.. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌ హెచ్చరిక వెనుక ఉన్నదెవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  కొందరు  ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులపై అనుచిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని బెజవాడలో బుధవారం (నవంబర్ 8) మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి ఆస్తుల్ని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని.. మీడియా పేరుతో పరిధి దాటి ముఖ్యమంత్రి పైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా కామెంట్లు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను గుర్తించలేమని అనుకుటే పొరపాటు పడినట్లేనని.. వాటిని నడిపే వారితో పాటు ప్రోత్సహించే వారిపైనా చర్యలు తప్పవన్నారు. పోస్టులు పెట్టే వారు విదేశాలలో ఉన్నా ఎంబసీలతో మాట్లాడి వారిని అరెస్ట్ చేస్తామన్నారు. సంజయ్ చేసిన ఈ హెచ్చరికలపై మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. మాధ్యమం ఏదైనా అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీడియా కూడా అంతే.  ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ నిర్ణయాలలో తప్పులుంటే ఎండగట్టడం మీడియా బాధ్యత. కానీ, ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కును ఏపీ సర్కార్ కాలరాస్తున్నది. అందుకు సీఐడీని పావుగా వాడుకుంటున్నది.    సీఐడీ చీఫ్ తాజా వ్యాఖ్యలు చూస్తే అసలు ఏపీ సీఐడీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వాచ్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. చట్ట పరిధిలో తనకు ఎన్నో విధులు ఉన్నా సీఐడీ జగన్ ప్రభుత్వం చెప్పిన వారిపై మాత్రమే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే వేధించడం, వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు పెట్టడానికే పరిమితమైందని అంటున్నారు.   

సిని‘మా’.. ఎలక్షన్లు ఎప్పుడు?

గడువు దాటి పోయినా.. టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఊసే లేకుండా పోయింది.   ప్రతీ రెండేళ్లకు ఒక సారి ‘మా ’ఎన్నికలు జరుగుతాయన్న సంగతి అందరికి తెలిసిందే.  ఆ క్రమంలో 2021, అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంటే.. అక్టోబర్ 16వ తేదీన ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంత వరకు ఓకే.  కానీ ఇది జరిగి రెండేళ్లు పూర్తి అయింది. మళ్లీ ‘మా’ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ విషయంపై టాలీవుడ్ పెద్దలు ఎవరూ పెదవి విప్పక పోవడంపై ఫిలింనగర్ వర్గాలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.  టాలీవుడ్‌లో దాదాపుగా ప్రతీ రోజు ఎక్కడో.. అక్కడ.. సినిమా షూటింగ్, ఫ్రారంభోత్సవం,  ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో, ట్రైలర్ విడుదల ఫంక్షన్లు, సినిమా విడుదల ఫంక్షన్లు, సినిమా సక్సెస్ మీట్లు ఉంటూ... ఉంటాయి. ఆయా కార్యక్రమాల్లో టాలీవుడ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రముఖులంతా హాజరువుతారు. మరి వారి మధ్య ‘మా ’ఎన్నికల అంశం చర్చకు రావడం లేదా?.. ఓ వేళ ఈ అంశంపై చర్చ వచ్చినా.. మనకు ఎందుకులే అని వదిలేస్తున్నారా? అన్న చర్చ సినీవర్గాలలో జోరుగా సాగుతోంది. అయినా టాలీవుడ్‌లో వెండితెరపై నవరసాల్ని పండించగల నటీనటులు ఉన్నారని.. కానీ వారు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఫిలింనగర్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మా అధ్యక్షుడిగా మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఉన్నాడు. దీంతో మళ్లీ మా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకొంటే.. మంచు ఫ్యామిలీతో పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందనే భావనలో టాలీవుడ్ ఉందా? అనే సందేహాన్ని సైతం ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. అలాగే గతంలో జరిగిన మా ఎన్నికలు అంటే.. 2021 అక్టోబర్ 10వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను తలపించాయన్న విషయం అందరికీ తెలిసిందేనని. ఈ ఎన్నికల్లో అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు మా అధ్యక్ష అభ్యర్థులగా బరిలో దిగిడంతో.... వీరి మధ్య మాటల దాడులు, విమర్శలు, ప్రతీ విమర్శలతో  ఎన్నికల వేడి అమాంతంగా పెరిగిపోయిందని... దీంతో ఆ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారి... ప్రపంచంలోని తెలుగు వారంతా.. ‘మా’పై దృష్టి సారించిన విషయాన్ని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.  అలాంటి వేళ.. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే మా అధ్యక్షుడిగా తాను ఎన్నిక అయితే.. చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేపడతానంటూ ఆయన బహిరంగంగానే ప్రకటించారు. మరి ఆ కార్యక్రమాలు పూర్తి అయినాయా? లేదా? అనేది మాత్రం టాలీవుడ్‌లోని వారికే తెలియాల్సి ఉందనే ఓ చర్చ సైతం ఫిలింనగర్ వర్గాల్లో కొనసాగుతొంది.    మరో వైపు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా గతంలో ఎన్నికల ప్రమేయమే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు కోకొల్లులుగా ఉన్నాయని.. అలాంటిది 2021లో జరిగిన ఈ ఎన్నికలు మాత్రం.. చాలా రసవత్తరంగా జరిగాయని.. మరి అలాంటిది మా  అధ్యక్షుడిగా కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా మా ఎన్నికలపై టాలీవుడ్ టాప్ హీరోలు  మౌనంగా ఉండడం దేనికి సాంకేతమనే ఓ చర్చ సైతం ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.  అదీకాక.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో నవంబర్ మాసమంతా ఈ హడావుడితోనే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందనే ఓ ఆశాభావం ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓ వేళ.. మా ఎన్నికలు నిర్వహిస్తే.. ఈ ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారు?  మళ్లీ ఈ ఎన్నికలు.. దాదాపుగా పోలిటికల్ హీట్‌ను తలపించేలా జరుగుతాయని ఫిలింనగర్ వర్గాల్లో ఓ టాక్ అయితే వినిపిస్తుంది.

జగన్ ముంచేశారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చేసింది. ఈ మాట ఏపీలో ప్రతిపక్షాలు అన్నదో.. గిట్టని వాళ్ళు చేసిన విమర్శో కాదు. ఇప్పటికే ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని బట్టబయలు చేయగా.. కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పలు జాతీయ సంస్థలు ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ  ఇప్పటికీ జగన్ సర్కార్   ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా కొత్త అప్పుల కోసం తెగ వేటాడుతుంది. ఏకంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా కొత్త అప్పుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నది. అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ కొత్త అప్పులు అన్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేసింది. చివరికి మద్యం మీద రాబోయే ఆదాయాన్ని చూపుతూ కూడా పెద్ద ఎత్తున అప్పు చేసేసింది.  ఇప్పటికే ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పు పరిధికి మించి ఏపీ ప్రభుత్వం చాలా చాలా అప్పులు చేసేసింది.  జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అప్పుల విషయంలో రాష్ట్రం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది.  చివరికి ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్‌ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయింది. ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. ఏడాదికి ఏడాది  ఆదాయం పడిపోవడం.. అప్పులపైనే ప్రభుత్వం నడవాల్సి రావడం.. పాత అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కూడా కొత్త అప్పులే దిక్కు కావడంతో ఇదీ ప్రస్తుతం ఏపీ దయనీయ స్థితి. తాజాగా  ఫైనాన్స్ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఏపీని డౌన్ గ్రేడ్ కింద జమ కట్టేశాయి. ఏపీ ఆర్ధికంగా దిగజారిపోయిందని.. కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ ఇస్తున్నాయి. దీంతో ఏపీ పరువు మరోసారి గంగలో కలిసింది. ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. అంతేకాదు, రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వ తప్పిదాలేనని తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉంది. కానీ, ఏపీ ప్రభుత్వం ఆ మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకుంది. దీంతో డౌన్ గ్రేడ్ చేసినట్లు  క్రిసెల్ వెల్లడించింది. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిషిట్ 43 వేల కోట్లకి చేరినట్లు వెల్లడించగా.. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పు 42% చేరుకుందని వెల్లడించారు. ఈ కారణాలతోనే ఏపీ సీఅర్‌డీఏ బాండ్స్ నెగెటివ్‌లో పెట్టామని క్రిసెల్ వెల్లడించింది. ఇది పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పతనానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే 2000 కోట్లకి బాండ్స్ రిలీజ్ చేస్తే అవి కూడా హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. అదీ విశ్వసనీయత అంటే.. చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లు అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ చేయగా.. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ బాండ్స్ తో జాగ్రత్త అనే పరిస్థితికి జగన్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చేసింది.  బీబీబీ ప్లస్‌కు క్రిసెల్ రేటింగును తగ్గించే స్థాయికి తీసుకొచ్చింది.  (బిబిబి ప్లస్ రేటింగ్ అంటే డిఫాల్ట్ రిస్క్ ఉంది అని అర్ధం) ఒక రాష్ట్రం ఆర్ధికంగా పతనమైందని ఏజెన్సీలు లిస్ట్ అవుట్ చేస్తే దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. అసలే ఇప్పటికే ఏపీలో ప్రజల జీవన స్థాయి దిగజారిపోతోంది. ఉపాధి కరువై ప్రజలు వలస బాట పడుతున్నారు. ఒకవైపు అప్పు దొరికితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏజెన్సీలు కూడా రాష్ట్రాన్ని లిస్ట్ అవుట్ చేస్తే ఇక పూర్తిగా దిగజారిపోయినట్లే.

కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. బిజెపి, బిఆర్ఎస్ హస్తం? 

ఈ నెల 30 వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. బిజెపికి బి టీం అని ప్రచారంలో ఉన్న బిఆర్ఎస్ కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది. బిఆర్ఎస్ కు ప్రధాన శత్రువు అయిన కాంగ్రెస్ ను కేంద్రం టార్గెట్ చేస్తోంది.శత్రువు శత్రువు మిత్రుడు అని చాణక్య రాజనీతి చెబుతుంది. ఇది అక్షరాల నిజమవుతోంది.బిఆర్ఎస్ కు బిజెపి పూర్తి అండగా నిలుస్తోంది.   గత గురువారం  రంగారెడ్డి జిల్లాలోని బడంగ్ పేట మాజీ మేయర్ పారిజాత రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో  ఐటీ సోదాలు  ప్రారంభమయ్యాయి. అదే రోజు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్షారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అప్పట్నుంచి నేటివరకు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం 18 చోట్ల ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న మాజీ మంత్రి జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి హైదరాబాద్ లోని ఇంట్లో, కార్యాలయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.ఏ వ్యక్తి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే ఆ వ్యక్తి ఆత్మ స్థయిర్యం దెబ్బతింటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్దమయ్యారు. బిఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం బిఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. పోలింగ్ కు ఇంకా 20 రోజుల ముందు(నవంబర్ 9) పాలేరు  కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో  ఐటీ, ఈడీ  సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదట సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.   ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు.ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగా 24  గంటల వ్యవధిలో ఇది జరిగిందని కాంగ్రెస్ నేతలు  వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు.  నామినేషన్ వేయడానికి చివరి రోజు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఒత్తిడికి లోనవుతున్నారు.

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఊరట.. క్వాష్ పై సుప్రీం తీర్పు ఎప్పుడంటే?

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు తీర్పు దిపావళి సెలవుల తరువాతేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్  తీర్పును జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.  కోర్టకు దసరా సెలవుల అనంతరం ఈ తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే తీర్పును  దీపావళి సెలవుల అనంతరం వెలువరించనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. సుప్రీం కోర్టులో గురువారం (నవంబర్ 9) ఫెబర్ నెట్ కేసులో  చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిలు పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేసిన సుప్రీం కోర్టు.. అప్పటి వరకూ ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది.  కాగా స్కిల్ కేసులో ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల నిర్బంధం అనంతరం ఆయన మధ్యంతర బెయిలుపై విడుదలయ్యారు. అయితే స్కిల్ కేసులో ఆయన దాఖలు చేసిన  క్వాష్ పిటిషన్  ను ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన తరువాత ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ పిటిషన్ ను విచారించిన  జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల  ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సుప్రీం అనుమతిస్తే ఒక్క స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన  ఇన్నర్ రింగ్ రోడ్డ్, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ సహా అన్ని కేసులూ రద్దౌతాయి. ఒక వేళ సుప్రీం ఆయన క్వాష్ పిటిషన్ ను తిరస్కరిస్తే.. చంద్రబాబు సీజేఐ బెంచ్ ను ఆశ్రయించే అవకాశం ఉంటుంది.  స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం లో వాదనలు ప్రధానంగా 17ఎ సెక్షన్ పైనే జరిగాయి. స్కిల్ కేసులో చంద్రబాబుకు సెక్షన్ 17ఎ వర్తిస్తుందని న్యాయనిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.   

 గజ్వేల్, కామారెడ్డి లో కెసీఆర్ నామినేషన్ 

ఓటమి భయంతో రెండు చోట్ల పోటి చేస్తున్న ముఖ్యమంత్రి కెసీఆర్ గురువారం మధ్యాహ్నం(నవంబర్ 9 )  స్వంత నియోజకవర్గం గజ్వేల్ లో  నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి. ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ నుంచి గజ్వేల్ కు కేసీఆర్ హెలికాప్టర్ లో వెళ్లారు.  కెసీఆర్ ను ఎలాగైనా ఓడించి తీరుతానని శపథం చేసిన బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీతో  వెళ్లిన ఈటెల ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.  నామినేషన్ దాఖలు చేసిన అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి  కేసీఆర్ బయల్దేరారు. మధ్యాహ్నం 2 గంటల లోపు అక్కడ నామినేషన్ వేయనున్నారు. అనంతరం అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నుంచి కేసీఆర్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

కిషన్ రెడ్డి ఇరుక్కున్నట్లేనా.. కాళేశ్వరం అవినీతిపై బీజేపీ విమర్శలకే పరిమితమా?

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలకు ఊహించని విధంగా గట్టి రాటార్డ్ వచ్చింది.  కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీఎం కేసీఆర్‌ ముందుకు వచ్చి లేఖ రాస్తే.. తాను రెండుగంటల్లో సీబీఐ విచారణ చేయిస్తానని కిషన్ రెడ్డి  చెప్పారు. అలా చెప్పడం ద్వారా  కేంద్రం నేరుగా కాళేశ్వరం అవినీతిపై చేయగలిగిందేమీ లేదని అంగీకరించేసినట్లైంది. అయితే  సీబీఐ మాజీ డెరెక్టర్ నాగేశ్వరరావు కిషన్ రెడ్డి తప్పించుకోవడానికే ఇలా చెప్పారని కుండబద్దలు కొట్టేశారు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య బంధాలు ఉన్నాయనీ, అవి పరస్పరం సహకారం అందించుకుంటున్నాయనీ ఇంత కాలం ఉన్న అనుమానాలను బలపరిచే విధంగా నాగేశ్వరరావు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై దర్యాప్తునకు కేసీఆర్ లేఖ అవసరం లేదంటూ ఆయన విస్పష్టంగా తేల్చేశారు.  కాళేశ్వరంపై సీబీఐ విచారణకు  తెలంగాణ సీఎం కేసీఆర్‌ అనుమతి అవసరం లేదనీ, ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చింది కేంద్రానికి చెందిన సంస్థలేననీ, అది కూడా ఒకటీ రెండూ కాదు ఏకంగా పది ఏజెన్సీలు అనుమతులు మంజూరు చేశాయనీ నాగేశ్వరరావు తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై కేంద్ర జలవనరుల శాఖ సీబీఐకి ఫిర్యాదు చేస్తే చాలనీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించేయొచ్చనీ స్పష్టం చేశారు.   దీంతో కేంద్రం కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ పై, ఆయన ప్రభుత్వంపై విమర్శలకే పరిమితమౌతుంది తప్ప సీబీఐ దర్యాప్తునకు ఆదేశించి..నిగ్గు తేల్చే ఉద్దేశంలో లేదని స్పష్టమైపోయింది.  దీంతో  కేసీఆర్ లేఖ రాస్తే తప్ప సీబీఐ దర్యాప్తు కోరలేమంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఆయనను చిక్కుల్లో పడేసినట్లైంది. కేంద్ర మంత్రిగా కేసీఆర్ లేఖ కోసం ఎదురు చూడకుండా ఆయన కేంద్ర జలశక్తి శాఖ  ద్వారా సీబీఐకి లేఖ రాయించడమో, ఫిర్యాదు  చేయడమో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న ఉత్పన్నమైంది.  ఈ ప్రశ్నే బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధాన్ని బట్టబయలు చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎన్నికల వేళ ఈ పరిస్థితి కచ్చితంగా కిషన్ రెడ్డికే కాదు, బీజేపీకి కూడా ఇబ్బందికరమే. దీంతో కిషన్ రెడ్డి ఏం చేస్తారన్న ఆశక్తి సర్వత్రా వ్యక్తం అవుతోంది. సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు కాళేశ్వరం అవినీతిపై ఏయే సెక్షన్ల కింద రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందో వివరంగా వెల్లడించిన తరువాత కూడా మీనమేషాలు లెక్కిస్తే.. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీల బండారం బయటపడిపోవడమే కాకుండా ఆ రెండు పార్టీల ప్రతిష్ట మసకబారడం ఖాయం అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. మద్యం లిక్కర్ కేసులో ఆప్ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను జైలుకు పంపడానికి ఇసుమంతైన సంకోచించని కేంద్ర దర్యాప్తు సంస్థలు కవిత విషయంలో ఎందుకు వెనక్కు తగ్గాయో కూడా కాళేశ్వరం అవినీతిపై సీబీఐ దర్యాప్తు విషయంలో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైనట్లేనన్న విమర్శలు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి.   కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లిన బృందానికి కిషన్‌రెడ్డి నాయకత్వం వహించారు. మేడిగడ్డ కుంగుబాటును పరిశీలించారు.   అవినీతిపై ఆరోపణలు గుప్పించారు.  అయినా  సీబీఐ విచారణకు మాత్రం అవినీతికి పాల్పడ్డారని తాము ఆరోపిస్తున్న కేసీఆర్ అనుమతి కావాలనడమేమిటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్‌ఎస్‌కు బీజేపీ బీ టీము కాబట్టే లిక్కరు కేసులో కవితను ఇప్పటిదాకా అరెస్టు చేయలేదని , ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని   ఆరోపిస్తూ కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం లేదనీ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది.  ఈ పరిస్థితుల్లో సీబీఐ మాజీ డైరెక్టర్ కాళేశ్వరంపై దర్యాప్తునకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి అవసరం లేదని సెక్షన్లతో సహా చెప్పిన తరువాత కిషన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది.  

తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత.. దేనికి సంకేతం?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ మత ధర్మాన్ని నమ్మినా, ఆచరించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ  అన్ని మత విశ్వాసాలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో  భక్తుల విశ్వాసాలకు భంగం కలిగేలా జరుగుతున్న చర్యల పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.  అవును జగన్ పాలనలో  హైంధవ ధర్మానికి అపచారాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో  హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఆరోపిస్తున్నారు. ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ  కూడా ఉన్నారు.  సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజానికి స్వామీజీ సింహాచలం చందనోత్సవంలో చోటు చేసుకున్న అపచారాలపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేసినా..  జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన అనేకం ఉన్నాయని పరిశీలకులు సైతం చెబుతున్నారు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, మరెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో ఆధ్మాత్మిక వాదులు లెక్కలతో సహా చెబుతున్నారు. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారిని  ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ    తీసుకుంటున్న  నిర్ణయాల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం  అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు  ఆరోపించాయి. ఆరోపిస్తున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో బలంగా వ్యక్తమౌతోంది ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో  దోపిడీకి పాల్పడుతోందని  భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది,  దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.    ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు విస్మయపరుస్తున్నాయి. కొండపై ఏడుకొండల దేవుడి చారిత్రక ఆధారాలను నాశనం చేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పని చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీవారు వేటకు వెళ్లినప్పుడు ఉపయోగించినట్లుగా భక్తులు విశ్వసించే పార్వేట మంటపాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త నిర్మాణం పూర్తి చేశారు. వందల ఏళ్ల పురాతన భవనాన్ని ఇష్టారీతిగా కూల్చేసి.. పురాతన భవనం కనుక కూల్చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. అలాగే ఇప్పుడు అలిపిర వద్ద ఉన్న మరో మండపం విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. టీటీడీ తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత వెనుక తిరుమల ప్రాభవం, ప్రాశస్థ్యం తగ్గించేసే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కూల్చివేతలపై ఇప్పటికే  ప్రధాని కార్యాలయం ఆరాతీసినట్లు చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ పాలనలో తిరుమలలో ఆరాచకాలు హద్దు లేకుండా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

అవును.. వై ఏపీ నీడ్స్ జగన్!

కదిలితే కేసు.. మెదిలితే అరెస్టు.. ప్రస్తుతం ఏపీలో ఉన్న పరిస్థితి ఇది. నిత్యంనరకం అనుభవిస్తున్నా.. నోరెత్తితే కటకటాల పాలు చేస్తారన్న భయంలో జనంబతుకుతున్నారు. అలా భయపెట్టి.. జనాలను భయంలోనే ఉంచి.. వచ్చేఎన్నికలలో గెలిచి మరోసారి అధికారంలోకి వచ్చేయవచ్చని కలలు కంటోందిజగన్ పార్టీ. అయితే.. సర్వేలైతేనేం, ఎక్కడికక్కడ జనంతిరగబడుతుండటంతో.. కేవలం బెదరింపులతో పని కాదని అర్దమైన అధికారపార్టీ అగ్రనాయకత్వానికి.. అధికారంపై ఆశలు అడుగంటాయి. ఇక గోబెల్స్ నేనమ్ముకున్నారు. అందుకే..   అబద్ధాలను నిజమని నమ్మించే ప్రయత్నానికి ఒడిగట్టారు. ఏపీలో కనీవినీ ఎరుగని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారు.ఇందు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ఇంటింటికీ, గడపగడపకీ,వీధి వీధికీ పంపుతున్నారు. ఏపీ ప్రజలు జగన్ హయాంలో జరిగినఅభివృద్ధిని చూడలేకపోతున్నారనీ, కానీ ప్రపంచం మొత్తం ఏపీవైపుచూస్తోందనీ చెప్పుకుంటున్నారు.  వాస్తవానికి  పేద, మధ్య తరగతి, మేధావులే కాదు గత ఎన్నికల్లో ఏదో ఆశించి, వైసీపీకి ఓటేసి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిన వైసీపీ ఓటర్లు కూడా.. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. 2019 ఎన్నికలలో చేసిన తప్పును దిద్దుకోవాలని పట్టుదలగా ఉన్నారు.  ఎంత త్వరగా ఎన్నికలొస్తే రాష్ట్రానికి అంత మంచిదని భావిస్తున్నారు.  అంతే కాదు  చివరకు క్షేత్ర స్థాయి వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా బహిరంగంగా కాకపోయినా, అంతర్గత సంభాషణల్లో ఈ సారి మన పని అయిపోయినట్లేనని ఒకరికొకరు చెప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. సామాజిక సాధికార బస్సుయాత్రకు కార్యకర్తలు ముఖం చాటేయడమే ఇందుకు  నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో చంద్రబాబు అంతటి  సీనియర్ నాయకుని, అక్రమంగా, అరెస్ట్ చేసి, జైలుకు పంపి వేధింపులకు గురిచేయడాన్ని, ఆయనతో పాటుగా,ఆయన్ని అయన కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేస్తున్న తీరును,పార్టీలకు అతీతంగా సామాన్య ఓటర్లు చాలా తీవ్రంగా   వ్యతిరేకిస్తున్నారు. చట్టాని చుట్టేసి, ఇష్టారాజ్యంగా రాజ్యంగ విరుద్ధ పరిపాలన సాగిస్తున్న జగన్ రెడ్డి పాలనపై విసుగెత్తిన ప్రజలు, ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా వైసీపీ ప్రభుత్వాన్ని వదిలించుకోవచ్చనే ఆలోచన సర్వట్రా వ్యక్తమవుతోంది.ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, వైసీపీ మంత్రులు, నాయకులు చేస్తున్న ప్రకటనలతో జనంలో ఇప్పటికే జగన్ సర్కార్ పట్ల ఉన్న వ్యతిరేకత మరింత పెరిగింది. గతంలోలా వ్యతిరేకతను మనసులో ఉంచుకుని మౌనంగా ఉండటం కాకుండా ఆ వ్యతిరేకతను బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. కేసులు, అరెస్టులపై భయాన్ని వదిలేశారు.  నిజాన్ని సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత రాష్ట్రంలో  పరిస్థితులపై సి ఓటర్ నిర్వహించిన సర్వేలో   చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీకి విపరీతమైన సానుభూతి వచ్చిందని తేలింది. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కుట్రలో భాగమేనని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని, ఈ అరెస్ట్‌తో జగన్‌లో అభద్రతాభావం పెరిగిపోయిందని సి ఓటర్ సర్వే తేల్చింది. చంద్రబాబు అరెస్ట్ వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపడం తథ్యమని వెల్లడించింది. జనసేన పొత్తుతో చంద్రబాబు మరోమారు, ముఖ్యమంత్రిగా సభలో కలుపెట్టడం ఖాయమని సర్వే తేల్చింది. ఆయన అరెస్ట్ తో తెలుగు దేశం పార్టీకి, పెద్దగా నష్టం జరగదని వైసీపీ నేతలే అభిప్రయా పడుతున్నారని పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెపుతే వినే రకం కాదు కాబట్టి, వాస్తవ పరిస్థితిని వారు ఆయన ముందు ఉంచలేకపోతున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలే స్వయంగా అంగీకరిస్తున్నారు.  ఇప్పటికే వైసీపే నాయకులు ఓటమికి మానసికంగా సిద్దం అయిపోయారని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.    ఈ నేపథ్యంలో జనం అంటున్న వై ఏపీ నీడ్స్ జగన్ అంటున్న మాటనే కార్యక్రమంగా మార్చి ఏపీకి జగనే ఎందుకు అవసరమో వివరించేందుకు వైసీపీ నేతలను జగన్ మరోసారి జనం ముందుకు పంపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. ఏపీలో జరిగిన, జరుగుతున్న బ్రహ్మాండమైన అభివృద్ధిని ప్రపంచం అంతా గుర్తించినా రాష్ట్ర ప్రజలు మాత్రం చూడలేకపోతున్నారని తెగ బాధపడిపోయారు. అసలు జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మించిన అభివృద్ధి ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. అందుకే వై ఏపీ నీడ్స్ జగన్ పేరుతో గురువారం(నవంబర్9) నుంచి జగన్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. జగన్ చేసిన అభివృద్ధిని చూడలేకపోవడం జనం తప్పే అని తేల్చేశారు. తప్పు అన్నట్లు సజ్జల మాట్లాడారు. ఇంత అభివృద్ధి చేసినా ఎక్కడుంది అభివృద్ధి అన్నట్లు విమర్శలు చేస్తుంటే కేసులు పెట్టమా అని ఎదురు ప్రశ్నిస్తున్నారు.   అసలు వైసీపీ కార్యక్రమాలన్నీ పోలీసులను అడ్డం పెట్టుకుని జనాలను బెదరించడానికే అన్నట్లు ఉంటున్నాయని ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన తెలిపిన వారిపై కేసులు, పథకాలు ఆపేస్తామన్న బెదరింపులను పరిశీలకులు ఉదాహరణగా చూపిస్తున్నారు.  ఇంటింటికీ తిరిగి  మా నమకం, మా భవిష్యత్‌ నువ్వే జగన్  స్టిక్కర్స్ అంటించారు. సామాజిక సాధికార యాత్ర పేరుతో బస్సులు వేసుకొని తిరిగారు. ఇంత చేసిన తరువాత  కూడా ఇప్పుడు ఏపీకి జగన్ ఎందుకు (వై ఏపీ నీడ్స్ జగన్) అని జనం ప్రశ్నిస్తున్నారు. అదే వైసీపీకి మింగుడు పడటం లేదు. దీంతో వారు వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ ఓ కార్యక్రమాన్ని మొదలెట్టేశారు. ఇక జనానికి కనిపించని అభివృద్ధి గురించి ఉదరగొట్టేస్తారు. బటన్ నొక్కడం కంటే అభివృద్ధి ఏముంటుందని జనానికి చెప్పేందుకు రెడీ అయిపోయారు. రోడ్లు ఎందుకు బటన్ నొక్కి సొమ్ములు పందేరం చేస్తుంటే ఇక రోడ్లు ఎందుకు అని చెప్తారు. ధరలు ఎంత విపరీతంగా పెరిగినా బాధెందుకు మీకు సొమ్ములు ఇస్తున్నాం కదా అంటారు. విద్యుత్ చార్జీలు పెరిగితే ఏమైంది.. మీఖాతాలలో సొమ్ములు పడుతున్నాయిగా అని చెప్పుకుంటారు.  రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు నెలనెలా జీతాలు చెల్లించలేకపోతోంది కదా అంటే వారు మా ఓటర్లు కాదని అంటారేమో. ఎందుకంటే.. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి తరువాత ఇదే సజ్జల గారు మా ఓటర్లు వేరే ఉన్నారని చెప్పిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ఆర్ధిక, పారిశ్రామిక, ఐ‌టి. వ్యవసాయ, సాగునీటి రంగాలలో అభివృద్ధి అడుగంటిపోయిన సంగతి, కనీసం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దయనీయ పరిస్థితి గురించి జనం అడిగితే వాటి సంగతి మీ కెందుకు మీకు జగన్ బటన్ నొక్కి సొమ్ములను ఖాతాలలో వేస్తున్నారుగా.. అందుకే ఏపీ నీడ్స్ జగన్ అని చెబుతారా అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద పదే పదే మందీ మార్బలంతో అధికార పార్టీ నేతలు జనం ఇళ్ల మీద పడి బెదరించి, భయభ్రాంతులకు గురి చేసి దట్స్ వై ఏపీ నీడ్స్ జగన్ అంటారేమో అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

దిశ యాప్.. దిశ ఏంటి?.. బలవంతపు డౌన్లోడ్ల మర్మమేంటి?

ఏపీలో దిశ యాప్ పేరిట మరో దుమారం రేగుతుంది. మహిళల రక్షణ కోసం అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ దిశ చట్టానికి చట్టబద్దత లేదని ఎప్పుడో తేలిపోగా.. దిశా పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ అంటూ ప్రభుత్వం హడావుడి మాత్రం ఆగలేదు. అసలు ఈ దిశ పోలీస్ స్టేషన్లు ఎక్కడో ఉన్నాయో.. దిశ పోలీసులు ఎలా పనిచేస్తున్నారో ఎవరికీ అర్ధం కావడం లేదు కానీ.. దిశ యాప్ ను ప్రజల మొబైల్ ఫోన్లలో బలవంతంగా ఇన్ స్టాల్ చేయిస్తున్నారు. మగాళ్ల ఫోన్లలో కూడా దిశా యాప్ ఇన్ స్టాల్ చేయాలంటూ పోలీసులతో బలవంతంగా హింస పెడుతున్నారు. దిశ యాప్ మాకెందుకు అంటే పోలీసులు ప్రజలపై దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనే అనకాపల్లిలో చోటు చేసుకుంది. ఓ సైనికోద్యోగి దేశసరిహద్దు నుండి సొంత గ్రామానికి వెళ్తుండగా అనకాపల్లి పోలీసులు అతని మొబైల్ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయమని బలవంతం చేశారు. అతను ససేమీరా అనడంతో నలుగురు పోలీసులు కలిసి అతన్ని చితకబాదారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దిశ యాప్ ఇంత బలవంతంగా ఇన్ స్టాల్ చేయించడం వెనక మరేదైనా కారణాలున్నాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సయ్యద్ అలీముల్లా అనే వ్యక్తి దువ్వాడలో సెక్టార్ 10లో నివసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో 52 రాష్ట్రీయ రైఫిల్ క్యాంప్ సోల్జర్ గా పనిచేస్తున్నాడు. సెలవుపై వచ్చిన ఆయన సొంతూరు ఎలమంచిలి మండలం రేగుపాలెం వెళ్లేందుకు పరవాడ సంతబయల బస్టాప్ లో వేచి ఉన్నాడు. ఆయన వద్దకెళ్లిన ఓ మహిళా కానిస్టేబుల్‌ అతని ఫోన్‌ లో దిశ యాప్ ఇన్ స్టాల్ చేయాలని కోరింది. అతను తనకు అవసరం లేదని చెప్పడంతో మహిళ కానిస్టేబుల్ బలవంతంగా అతని నుండి ఫోన్ తీసుకొని దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసింది. అంతలో అతను అనుమానించి అసలు మీరు పోలీసులేనా ఐడీ కార్డు చూపించండి.. నేమ్ ప్లేట్ లేదు మీ పేరేంటని అడుగగా ఆమె ఫోన్ వెనక్కి ఇచ్చేసింది. అంతలో ఫోన్‌కొచ్చిన వన్‌టైం పాస్‌వర్డ్ చెప్పాలని కానిస్టేబుల్‌ కోరడంతో అతను ససేమిరా అన్నాడు. పాస్‌వర్డ్‌ను తానే ఎంటర్‌ చేస్తానని కానిస్టేబుల్ చేతిలోని ట్యాబ్ ఇవ్వాలని కోరాడు. దీంతో ఆగ్రహించిన మహిళా కానిస్టేబుల్‌ అతడిపై చేయి చేసుకుంది. దీంతో నిర్ఘాంతపోయిన సైనికుడు దేశ సరిహద్దు కాశ్మీర్లో పనిచేసే తనకు దిశ యాప్ ఎందుకని ఎదురు తిరిగి ప్రశ్నించాడు. స్థానికులు కూడా ఆయనకు సపోర్ట్‌ చేయడంతో మహిళా కానిస్టేబుల్ తో పాటు వచ్చిన మరో కానిస్టేబుల్‌ స్టేషన్ కి ఫోన్ చేశాడు. నలుగురు సిబ్బంది హుటాహుటిన అక్కడకు అటోలో చేరుకుని సైనికుడిపై దాడికి దిగారు. చుట్టుపక్కల ప్రజలు వారించినా వినకుండా అతని చేతులు కాళ్ళు విరిచి ఆటో ఎక్కించే ప్రయత్నం చేశారు. దేశ సరిహద్దులో యుద్ధం చేసే సైనికుడు కదా పోలీసుల ఆటలు సాగలేదు. మరోవైపు చుట్టూ ప్రజలు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. మగాళ్ల ఫోన్ లో దిశాయాప్ ఎందుకని, పోలీసులైనా ఓటీపీ చెప్పాల్సిన అవసరం లేదంటూ స్థానికులు వాదించినా మహిళా కానిస్టేబుల్ మా ఇష్టం అనే రీతిలో స్పందించింది. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతుండగా.. సీపీ ఇప్పటికే ఆ నలుగురు కానిస్టేబుళ్లను వీఆర్ కు పంపినట్లు ప్రకటించారు. అయితే, అసలు ఇంత బలవంతంగా దిశ యాప్ ఇన్ స్టాల్ చేయించడం, మగాళ్ల ఫోన్లలో కూడా ఇన్ స్టాల్ చేయాలని బలవంతం చేయడం, ఓటీపీలు స్టోర్ చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్పందించిన తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. దిశ యాప్ పేరుతో ఏదో దందా నడుస్తోందని సందేహం వ్యక్తం చేశారు. పురుషుల మొబైల్స్ లో ఆ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. జగనాసుర పాలనలో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయని.. ప్రభుత్వం తెచ్చిన దిశ చట్టానికే దిక్కూ మొక్కూ లేదు.. మహిళల భద్రత కోసమని తెచ్చిన దిశ యాప్ ను బలవంతంగా డౌన్ లోడ్ చేయించడమేంటని ప్రశ్నించారు. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టే సైనికుడు రాష్ట్రానికి వస్తే ఆయన ప్రాణానికే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పోలీసులే గుండాల్లాగా దాడులు చేయడం ఏంటని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్ ఆరోపణల తర్వాత రాజకీయ వర్గాలలో ఇది చర్చగా మారింది. ఇప్పటికే పలు మార్గాల ద్వారా వైసీపీ సర్కార్ ప్రజల డేటాను స్టోర్ చేసుకుంటుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దిశ యాప్ కూడా అందులో మరొకటిగా మారిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సీఎం కేసీఆర్ హెలికాప్టర్ లో మళ్లీ సాంకేతిక లోపం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలకు హెలికాప్టర్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ప్రయాణించే హెలికాప్టర్ లో తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం ఆందోళన కలిగిస్తున్నది.   ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ సోమవారం (నవంబర్ 6) దేవరకద్రకు బయలుదేరారు. హెలికాఫ్టర్ బయలుదేరిన కొద్ది సేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్ ను వెనక్కు ఎర్రవల్లిలోని సీఎం ఫామ్ హౌస్ కు మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.   ఆ తరువాత ఏవియేషన్ అధికారులు సీఎం పర్యటన కోసం మరో హెలికాప్టర్ పంపించారు అది వేరే విషయం. కానీ ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే మరోసారి అదే పరిస్థితి రిపీట్ అయ్యింది.  బుధవారం (నవంబర్ )కూడా ఆయన హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది.   సిర్పూర్ కాగజ్‌నగర్‌లో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ టేకాఫ్ కాలేదు. సాంకేతిక సమస్య తలెత్తడంతో చాపర్ ను పైలట్ వెంటనే నిలిపివేశాడు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. తిరిగి బయలు దేరే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్డు మార్గంలో  ఆసిఫాబాద్‌కు వెళ్లారు.  సీఎం ప్రయాణించే హెలికాప్టర్ లో స్వల్ప వ్యవధిలోనే రెండు సార్లు సాంకేతిక లోపం తలెత్తడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు సైతం వ్యక్తం చేస్తున్నాయి. 

జగన్‌కు మరో బిగ్ షాక్.. అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు నోటీసులు!

సరిగ్గా ఎన్నికలకు ముందు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసు కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. 16 నెలల జైలు తర్వాత బెయిల్ మీద విడుదలైన జగన్.. పదేళ్లుగా  లాగోలా కేసు విచారణ నుండి తప్పించుకుంటూ వస్తున్నారు. కానీ, ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈ కేసులో కదలిక వచ్చి ఆయనకు చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తోంది.  జగన్ అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ (తెలంగాణ)నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలని రఘురామ కోరారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని, కేసుల విచారణ బదిలీ పిటిషన్‌ ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని  సీబీఐని ఆదేశించింది. అలాగే సీఎం జగన్ కు కూడా  సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి  వాయిదా వేసింది.   ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన   పిటిషన్ ఆధారంగా వచ్చే ఏడాది ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులు విచారణకు వస్తాయా అన్న చర్చ జరుగుతుండగానే.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా జగన్ కు షాక్ ఇచ్చింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య దాఖలు చేసిన పిల్ పై  విచారణకు ఆదేశించింది. తెలంగాణ ఛీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్ వి శ్రావణ్ కుమార్ ధర్మాసనం విచారణ పిల్‌గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణకు స్వీకరించింది. హరిరామ జోగయ్య పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించి ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు  అంగీకారం తెలిపింది. అంతేకాదు, హరి రామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించిన హైకోర్టు.. ప్రతివాదులు జగన్ మోహన్ రెడ్డి, సీబీఐకి నోటీసులు ఇచ్చింది.  సీబీఐ కోర్టులో వైఎస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోరుతూ హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జగన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కనుక ఆయనపై అక్రమాస్తుల కేసులు పెండింగ్ లో ఉండకూడదని, జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని హరిరామ జోగయ్య పిల్ లో కోరారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద జోగయ్య లాయర్ ఈ పిల్ దాఖలు చేశారు. అయితే ఈ పిల్‌లో ప్రజాప్రయోజనం లేదని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం ఛేయగా ధర్మాసనం విచారణ జరిపింది. అఫిడవిట్‌ను సవరించాలని జోగయ్యను ఆదేశించిన తెలంగాణ హైకోర్టు.. దీని కోసం రెండు వారాల గడువు కూడా ఇచ్చింది. ఈ గడువులోగా డాక్యుమెంట్లపై వివరణతో అఫిడవిట్‌ను సవరించి కేసుల స్థాయి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలని కోర్టు ఆదేశించింది. విచారణలో భాగంగా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు ధర్మాసనం.. జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఇదే అక్రమాస్తుల కేసులో  జగన్ కు నోటీసులు అందగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని నోటీసులు జారీ చేసింది. దీనిపై వైసీపీ స్పందన ఏమిటన్నది వెంటనే తెలియరాలేదు. అయితే తెలుగురాష్ట్రాలలో  ఇప్పుడు జగన్ అక్రమాస్తుల కేసులో కదలికపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. కోర్టులు కూడా  జగన్ కేసుల విచారణపై దృష్టి సారించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.   ఎన్నికల సమయంలో ప్రతి వారం కోర్టు విచారణకు హాజరవ్వాల్సి రావడం జగన్ కు కచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశమే అవుతుందనడంలో సందేహం లేదు.   ప్రతిపక్షాలు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ విమర్శలు గుప్పించడం ఖాయం. అసలే చంద్రబాబు అక్రమ అరెస్ట్ తర్వాత ప్రజలలో సహజంగానే జగన్ కేసులపై చర్చ జరుగుతున్నది. ఇప్పుడు ఆ కేసుల విచారణ కూడా ప్రారంభమైతే జగన్ ఇమేజ్ పాతాళానికి పడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

లబ్ధిదారులకు తెలియకుండానే టిడ్కో ఇళ్లు తాకట్టు.. జగన్మాయ!

ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేసిన మరో భారీ మోసం బయటపడింది. పేదలను నమ్మించి ముంచిన ప్రభుత్వం చివరికి ఇప్పుడు ప్రజల ఇళ్లను కూడా వేలానికి తెచ్చింది. ఒక్క రూపాయికే ఇల్లు అంటూ గొప్పలు చెప్పుకున్న జగన్ సర్కార్.. వక్ర మార్గంలో వాళ్ళకు ఇప్పుడు లక్షలకు లక్షలు కట్టాలని నోటీసులు ఇచ్చింది. డబ్బులు కట్టకపోతే మీ ఇల్లు వేలం వేస్తామంటూ బ్యాంకు అధికారులు నోటీసులు ఇవ్వడంతో గగ్గోలు పెడుతున్న పేద బాధితులు బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. దీంతో పేదల ఇళ్ల పేరిట జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన మరో భారీ మోసం బయటపడింది. బాధితుల తరపున ప్రతిపక్ష పార్టీల నేతలు బ్యాంకు అధికారులు, ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. ఇప్పటికిప్పుడు లక్షలు తెచ్చి కట్టమంటే ఎక్కడి నుండి తెచ్చి కట్టాలని బాధితులు వాపోతున్నారు. ఇల్లు ఇచ్చినట్లే ఇచ్చి సీఎం జగన్ ఇంతటి మోసానికి ఒడిగడతాడని ఊహించలేదని బాధితులు సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఈ టిడ్కో ఇళ్ల పేరిట జగన్ ప్రభుత్వం చేసిన మోసం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. గత ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు పేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో పలు జిల్లాలలో టిడ్కో ఇళ్ల సముదాయాల నిర్మాణం చేపట్టారు. ఈ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించినా అందులో ప్రజల భాగస్వామ్యం కూడా ఉంటుంది. కొంత మొత్తం లబ్ధిదారులు కడితే మిగతా మొత్తాన్ని ప్రభుత్వం భరించేలా ఈ గృహాల నిర్మాణం మొదలు పెట్టారు. పలు జిల్లాలలో 80 నుండి 90 శాతం గత ప్రభుత్వంలోనే నిర్మాణాలు పూర్తవగా.. మరికొన్ని వంద శాతం పూర్తయి లబ్దిదారులకు అందించడమే మిగిలింది. ఈ లోగా ఎన్నికలు ముంచుకొచ్చాయి. కాగా, ఎన్నికల సమయంలో లబ్ది దారుల భాగస్వామ్యం కూడా ప్రభుత్వమే చెల్లించేలా అన్ని పార్టీలు హామీలు ఇచ్చాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అయితే.. కేవలం ఒకే ఒక్క రూపాయితో టిడ్కో ఇళ్లను లబ్ది దారులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక అంతా రివర్స్ అయింది. 10 నుండి 20 శాతం పెండింగ్ ఉన్న గృహా సముదాయాల నిర్మాణాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన జగన్ ప్రభుత్వం నిర్మాణం పూర్తయిన గృహాలను రంగులు మార్చి మూడేళ్ళ తర్వాత లబ్ది దారులకు అందించారు.  ముందుగా చెప్పినట్లే ఒక్క రూపాయికే లబ్ధిదారులకు అధికారులు ఇళ్లను అప్పగించారు. అంతకు ముందు ఈ ఇళ్ళు కేటాయించిన వారికే అధిక భాగం ఇళ్లను కేటాయించారు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి ఈ లబ్ది దారులకు బ్యాంకుల నుండి నోటీసులు అందాయి. మీ ఇంటి బాకీకి గాను ఏడాది నుండి ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని.. ఏడాది కాలంగా ఉన్న ఈఎంఐలను ఇప్పటికిప్పుడు చెల్లించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులలో పేర్కొన్నారు. ఇదేంటి ప్రభుత్వం ఒక్క రూపాయికే ఇళ్ళు అప్పగిస్తే ఈ బ్యాంకు అధికారులేంటి ఇలా నోటీసులు ఇచ్చారని బ్యాంకుకు వెళ్తే అసలు విషయం బయటపడింది. ఒక్క రూపాయికే ఇళ్ళు ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఇళ్లను బ్యాంకులలో తాకట్టు పెట్టి లోన్ తీసుకుంది. ఆ లోన్ బకాయిలను లబ్దిదారులు కట్టేలా ఒప్పందం చేసుకుంది. ఈ బండారం బయటపడకుండా రెండేళ్ల పాటు లబ్ధిదారులను ఈఎంఐ అడగకుండా ఉండాలని బ్యాంకులను కోరింది. అప్పటికి ఎన్నికలు పూర్తవుతాయని ప్రభుత్వం భావించింది. కానీ, బ్యాంకు అధికారులు ఏడాదికే ఈఎంఐ చెల్లించాలని నోటీసులు ఇవ్వడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఇలాంటి వ్యవహారాన్ని టీడీపీ నేత, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు వెలుగులోకి తీసుకొచ్చారు. పాలకొల్లులో జగన్ ప్రభుత్వం 59 మందికి గృహాలను మంజూరు చేసింది. అయితే ఇటీవల వారికి నోటీసులు అందాయి. దీంతో బాధితులు పరుగు పరుగున బ్యాంకుకు చేరుకున్నారు. రూపాయి కడితే చాలు ఇల్లు ఇస్తామని ఈ రోజు లక్షల రూపాయలు కట్టాలంటూ నోటీసులు ఇవ్వడం ఏంటని నిలదీశారు. అయితే, ప్రభుత్వం పేదల పేరుపై బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుందని.. అది కూడా నేరుగా లబ్ధిదారుడికి చేరకుండా ప్రభుత్వ ఖాతాకు వెళ్లిందని అధికారులు వివరణ ఇచ్చారు. లబ్ధిదారులు రెండేళ్ల తర్వాత ఈఎంఐ కడతారని ప్రభుత్వం చెప్పినా.. బ్యాంకులు ససేమీరా అంటూ గడువు సంవత్సరానికి కుదించి ఏడాది ఈఎంఐలను ఒకేసారి కట్టాలని నోటీసులు పంపించారు. దీంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో గృహ లబ్ధిదారుడు రూ. లక్షల్లో డబ్బులు చెల్లించాలని లేదంటే ఇల్లు  వేలం వేస్తామని అధికారులు బెదిరిస్తున్నారు. ఫస్ట్ ఈఎంఐ నుంచి నోటీసులు ఇస్తే కట్టే వారమని, ఇప్పుడు నోటీసులు ఇస్తే లక్షలు ఒక్కసారే ఎలా కట్టాలని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకు చెప్పకుండానే తమ సంతకాలు తీసుకొని తమ పేరుమీద  లోన్లు తీసుకోవడం ఏంటని బాధితులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాబు క్వాష్ పిటిషన్.. సుప్రీం తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టు బుధవారం(నవంబర్8) తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. స్కిల్ కేసులో  జగన్ సర్కార్ చంద్రబాబునాయుడిని అక్రమంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 52 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ లో ఉన్న  చంద్రబాబు.. తాను ఎటువంటి తప్పూ చేయలేదనీ, తనపై కేసు రాజకీయ ప్రేరేపితమనీ, రాజకీయ కక్ష సాధింపులో భాగమని పేర్కొంటూ క్వాష్ చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు ఆయన క్వాష్ పిటిషన్ ను కొట్టివేశాయి. దీంతో ఆయన సుప్రీం ను ఆశ్రయించారు. సుప్రీంలో సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు రిజర్వ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు బుధవారం (నవంబర్8)న వెలువడనుంది. ఈ తీర్పు పై ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు క్వాష్ ను సుప్రీం అనుమతిస్తే.. స్కిల్ కేసే కాదు.. ఆయనపై జగన్ సర్కార్ నమోదు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, ఇసుక, మద్యం పాలసీ ఇలా అన్ని కేసులూ రద్దౌతాయి. ఒక వేళ సుప్రీం కోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఆయన సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వం సీజేఐ ధర్మాసనాన్ని ఆశ్రయింస్తుందని అంటున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ.. ఈ కేసులో చంద్రబాబు పాత్రకు సంబంధించి ఇప్పటి వరకూ ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది.   స్కిల్ సెంటర్ల ఏర్పాటు, వాటిలో మౌలిక సదుపాయాలు, సాఫ్ట్ వేర్ వంటి అంశాలను కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపని సీఐడీ.. స్కాం జరిగింది. ఎలా జరిగింది? చంద్రబాబు పాత్ర ఉందా లేదా? అన్నది ఆయనను అరెస్టు చేశాం కనుక ఆయనను ప్రశ్నించి రాబడతామని చెబుతోంది.  ఇలా ఉండగా న్యాయనిపుణులు మాత్రం ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని స్పష్టంగా చెబుతున్నారు.   ఇక పోతే సుప్రీంలో ఈ కేసు విచారణ సందర్భంగా.. ఆధారాలు లేకుండా కేసు పెట్టి అక్రమంగా ఆయనను అరెస్టు చేశారని ఇన్ని రోజులుగా   ప్రభుత్వ న్యాయవాదుల పసలేని వాదనతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. తొలుత అర్ధరాత్రి ఆయనను చుట్టుముట్టి అరెస్టు చేసినప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలూ ఉలిక్కిపడ్డాయి. ఆ తరువాత తెలుగు రాష్ట్రాలలోనే కాదు.. దేశ విదేశాలలో తెలుగువారున్న ప్రతి చోటా ఆందోళనలు మిన్నంటాయి. నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బెయిలు తీసుకుని బయటకు రావడం కాకుండా అసలు తన అరెస్టు, తనపై కేసే తప్పని చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. ఏసీబీ కోర్టు, హైకోర్టులలో క్వాష్ పిటిషన్ ను కొట్టివేసినా ఆయన దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తున్నారు. అక్కడ చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ప్రభుత్వ న్యాయవాదులు, చంద్రబాబు న్యాయవాదులు తమతమ వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న వారంతా  ఇంత అడ్డగోలుగా  ఒక ప్రజా ప్రతినిథిని అరెస్టు చేసేయొచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. ఆధారాలు చూపమని న్యాయస్థానం ఆదేశిస్తే.. ఆ ఒక్కటీ  అడక్కండి అన్నట్లుగా ఏపీ  సర్కార్ తరఫున వాదించిన ముకుల్ రోహత్గీ  వాదనలు ఉన్నాయంటున్నారు. అవినీతి జరిగింది. దానిలో  చంద్రబాబు  పాత్ర ఉందా లేదా అన్నది ఆయనను విచారించి  తెలుసుకుంటాం అన్నట్లుగా ముకుల్ రోహత్గీ చెబుతున్నారు. ఇక చంద్రబాబు అరెస్టు అక్రమమనీ, ఆయనను విచారించాలన్నా, అరెస్టు చేయాలన్నా గవర్నర్ అనుమతి తీసుకోవడం తప్పని  సరి  అనీ  చంద్రబాబు  తరఫు న్యాయవాది హరీష్ సాల్వే  కోర్టుకు తెలిపారు. 17ఏ సెక్షన్ చంద్రబాబుకు వర్తిస్తుందని చెబుతూ అందుకు ఉదాహరణగా పలు కేసులలో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులను ఉటంకించారు. పలు సందర్భాలలో హరీష్ సాల్వే వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించారు. ఒక సందర్భంలో అయితే ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తిస్తుందని అనిపిస్తోందని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. 

తెలుగు దేశం, జనసేన కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణ రాజు! 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారు అనే చర్చ జరుగుతుంది. టిడిపి, జన సేన ఎన్నికల పొత్తు ఖరారైనప్పటికీ సీట్ల సర్దుబాటులో నరసాపురం ఏ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారు అనే విషయం తేలకుండానే రఘురామ కృష్ణరాజు ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.  రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ, జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ పై రఘురామరాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి పథకానికి జగన్ స్వంత డబ్బా కొట్టుకుంటున్నాడని, తన తండ్రి వైఎస్ఆర్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. పీఎం కిసాన్ పథకానికి కూడా వైఎస్సార్ రైతు భరోసా అని పేరు పెట్టారని మండిపడ్డారు. వైఎస్సార్ రైతు భరోసా పేరును తాటికాయంత అక్షరాలతో రాసి... పీఎం కిసాన్ పేరును కనిపించీ కనిపించనట్టు ముద్రిస్తున్నారని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తున్నట్టు తెలుసుకున్న కేంద్రం... రూ. 5,300 కోట్లను నిలిపివేసిందని రఘురామరాజు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఓవైపు ప్రధాని ఫొటో, మరోవైపు సీఎం ఫొటో వేసుకుంటే అభ్యంతరం లేదని... అలా కాకుండా ఏదో తన స్వంత జేబు నుంచి డబ్బు తీసి ఇస్తున్నట్టు ఆయన ఫొటో, ఆయన తండ్రి ఫొటో వేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

అక్కడా.. ఇక్కడా.. రెండు చోట్లానా?.. గజ్వేల్, కామారెడ్డిపై సర్వత్రా ఉత్కంఠ!

తెలంగాణ ముఖ్యమంత్రి గజ్వేల్ తో పాటు మరో నియోజకవర్గం కామారెడ్డి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుచుంటున్నట్లు ప్రకటించిన క్షణం నుంచే ఆయన గజ్వేల్ లో గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారా? అన్న అనుమానాలు పరిశీలకులలోనూ, రాజకీయ వర్గాలలోనూ బలంగా వ్యక్తమయ్యాయి. కామారెడ్డి ప్రజలు కోరినందునే అక్కడ కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. అది వేరే సంగతి ఇక ప్రస్తుతానికి వస్తే.. కేసీఆర్ కు గజ్వేల్ లోనూ, కామారెడ్డిలోనూ కూడా గట్టి పోటీయే ఎదురైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గజ్వేల్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆయనకు గట్టి ప్రత్యర్థి అని అంటున్నారు. అలాగే కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు గట్టి పోటీ ఇవ్వనున్నారని అంటున్నారు.   దీంతో కేసీఆర్ పరిస్థితి నిన్నటి దాకా ఒక లెక్క..ఇక నుంచీ మరో లెక్క అన్నట్లుగా తయారైంది. ఎన్నికల వ్యూహాలలోనూ ఎత్తుగడలలోనూ తిరుగులేదని ఇంత కాలం కేసీఆర్ విషయంలో ఆయన ప్రత్యర్థులు కూడా చెబుతూ ఉండేవారు. అయితే ఈ సారి ఎన్నికలలో మాత్రం ఆయనకే అందనంత వేగంగా కాంగ్రెస్ వ్యూహాలు ఉంటున్నాయి. ఆయన ఒక అడుగు వేసే లోగా రేవంత్ సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మూడడుగులు వేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ కూడా వ్యూహాత్మకంగా గజ్వేల్ నుంచి ఈటలను రంగంలోకి దింపడంతో రెండు చోట్లూ కూడా కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అనివార్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సారి ఎన్నికలలో ఆయన రెండు నియోజకవర్గాలలోనూ గట్టి పోటీ ఎదుర్కొంటుండటంతో.. రాష్ట్రంలో ఇతర నియోజకవర్గాలపై పూర్తిగా కాన్సన్ ట్రేట్ చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు.   ముందుగా గజ్వేల్ నియోజవకర్గం తీసుకుంటే.. ఇక్కడ ఈటల సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు గణనీయ సంఖ్యలో ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తో అడుగు కలిపి నడిచిన ఈటల ఈ తరువాత కేసీఆర్ సర్కార్ లో రెండు సార్లూ కూడా కీలక పదవులను నిర్వహించారు. ఈటలను మంత్రిపదవి నుంచి తప్పించిన తరువాత హుజూరాబాద్ ఉప ఎన్నికలో  ఈటలను ఓడించేందుకు కేసీఆర్ పన్నని వ్యూహం లేదు. ఆ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకు ముందు నెలల నుంచే మొత్తం పార్టీని అక్కడ మోహరించిన కేసీఆర్ ఈటల ఓటమికి పావులు కదిపారు. వ్యూహాలు రచించారు. అయితే  ఈటల వాటన్నిటినీ తిప్పి కొట్టారు.  మంత్రులూ, ఎమ్మెల్యేలూ సీనియర్ నాయకులూ అంతా హుజూరాబాద్ లోనే తిష్ట వేసి ఈటల ఓటమి కోసం పని చేసినా ఫలితం లేకపోయింది. ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. దీంతో అప్పట్లో   ఆ గెలుపు ఈటల విజయం కంటే.. కేసీఆర్ ఓటమిగానే పరిశీలకులు అభివర్ణించారు. ఇప్పుడు అదే ఈటల గజ్వేల్ లో కేసీఆర్ కు ప్రత్యర్థిగా నిలబడ్డారు. దీంతో హుజూరాబాద్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. ఇక్కడ రేవంత్ పోటీ కేసీఆర్ ను ఎందుకు గాభరాపెడుతోందో తెలుసుకోవాలంటే.. ముందుగా ఓటుకు నోటు కేసు గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉందే. నాడు ఓటుకు నోటు కేసులో రేవంత్ ను జైలుకు పంపిన సందర్భంలోనే రేవంత్ కేసీఆర్ ను  గద్దె దింపడమే లక్ష్యమని ప్రతిన పూనారు. ఒక నాయకుడు ప్రతిన పూనినంత మాత్రాన కేసీఆర్ లాంటి బలమైన నేత కంగారుపడతారా అన్న అనుమానం రావచ్చు. కానీ తెలంగాణలో రేవంత్ బలమైన నాయకుడిగా ఎదిగారు. వరుసగా రెండు ఎన్నికలతో డీలాపడిన, అంతర్గత కుమ్ములాటలూ, వలసలతో రాష్ట్రంలో పూర్తిగా బలహీనపడిన కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కూడగట్టడమే కాకుండా, పూర్వవైభవం సంతరించుకోవడం తథ్యమని పార్టీ శ్రేణులలో విశ్వాసం కలిగేలా చేసిన రేవంత్ రెడ్డి.. రాష్ట్రం కాంగ్రెస్ రేవంత్ అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి ముందు ఉనికి కోసం పాకులాడుతున్న పార్టీగా  ఉండేది. కానీ ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత మాత్రం అధికారానికి ఉరకలేసే స్థాయికి పెంచారు. పార్టీలో అంతర్గత కలహాలను నివారించారు. అసంతృప్తి జ్వాలలను చల్లార్చారు. ఈ నేపథ్యంలోనే  కామారెడ్డిలో రేవంత్ పోటీతో కేసీఆర్ విజయం నల్లేరుమీద బండి నడక అయితే కాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో ఫలితం ఎలా ఉండబోతోందన్న దానిపై భారీ స్థాయిలో బెట్టింగులు కూడా మొదలైనట్లు చెబుతున్నారు. కేసీఆర్ రెండు చోట్లా గెలుస్తారా.. లేక ఒక చోటా.. లేక రెండు స్థానాలలోనూ ప్రతికూల ఫలితం వస్తుందా? అన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జరుగుతోంది.

తెలంగాణ ఎన్నికల్లో జనసేన 8  స్థానాలు ఖరారు

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి, జనసేన కల్సి పోటీ చేస్తున్నాయి. పొత్తు, సీట్ల సర్దుబాటు విషయంలో ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చి జన సేనకు 8 సీట్లు కేటాయించాలని బిజెపి నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి అడుగులు వేస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే 100 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. జనసేనకు పొత్తులో భాగంగా ప్రస్తుతానికి ఎనిమిది స్థానాలను బీజేపీ కేటాయించింది. మరికొన్ని స్థానాలపై చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. జనసేన పోటీ చేసే స్థానాలు, అభ్యర్థులు ఇవే కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్,  తాండూరు - నేమూరి శంకర్ గౌడ్,  కోదాడ - మేకల సతీష్ రెడ్డి,  నాగర్ కర్నూలు - వంగ లక్ష్మణ్ గౌడ్,  ఖమ్మం - మిర్యాల రామకృష్ణ,  కొత్తగూడెం - లక్కినేని సురేందర్ రావు,  వైరా (ఎస్టీ) - డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్,  అశ్వారావుపేట (ఎస్టీ) - ముయబోయిన ఉమాదేవి పోటీ చేయనున్నారు.