కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు.. బిజెపి, బిఆర్ఎస్ హస్తం?
posted on Nov 9, 2023 @ 11:48AM
ఈ నెల 30 వ తేదీన తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ప్రధాన పోటీ బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంది. బిజెపికి బి టీం అని ప్రచారంలో ఉన్న బిఆర్ఎస్ కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తోంది. బిఆర్ఎస్ కు ప్రధాన శత్రువు అయిన కాంగ్రెస్ ను కేంద్రం టార్గెట్ చేస్తోంది.శత్రువు శత్రువు మిత్రుడు అని చాణక్య రాజనీతి చెబుతుంది. ఇది అక్షరాల నిజమవుతోంది.బిఆర్ఎస్ కు బిజెపి పూర్తి అండగా నిలుస్తోంది. గత గురువారం రంగారెడ్డి జిల్లాలోని బడంగ్ పేట మాజీ మేయర్ పారిజాత రెడ్డి ఇంట్లో, కార్యాలయంలో ఐటీ సోదాలు ప్రారంభమయ్యాయి. అదే రోజు మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్షారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. అప్పట్నుంచి నేటివరకు తెలంగాణలోని కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. మొత్తం 18 చోట్ల ఐటీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. నిన్న మాజీ మంత్రి జానా రెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి హైదరాబాద్ లోని ఇంట్లో, కార్యాలయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి.ఏ వ్యక్తి ఆర్థిక మూలాలను దెబ్బతీస్తే ఆ వ్యక్తి ఆత్మ స్థయిర్యం దెబ్బతింటుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. అవినీతి ఆరోపణలు, ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తున్న బిఆర్ఎస్ ను గద్దె దించడానికి ప్రజలు సిద్దమయ్యారు. బిఆర్ఎస్ కు ప్రధాన పోటీ కాంగ్రెస్ ఇస్తున్న నేపథ్యంలో కేంద్రం బిఆర్ఎస్ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. పోలింగ్ కు ఇంకా 20 రోజుల ముందు(నవంబర్ 9) పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ, ఈడీ సోదాలు చేస్తున్నారు. గురువారం వేకువజామున 3 గంటల నుంచే ఖమ్మం పట్టణంలోని ఆయన నివాసాల్లో సోదాలు మొదలయ్యాయి. మొత్తం 8 వాహనాల్లో అధికారులు పొంగులేటి ఇంటికి చేరుకున్నారు. మొదట సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తనిఖీలు మొదలుపెట్టారని తెలుస్తోంది. ఖమ్మంతోపాటు హైదరాబాద్‌లోని నందగిరిహిల్స్‌లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి.
ఐటీ దాడులను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముందుగానే ఊహించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రోద్బలంతో తన నివాసంపై, తన కుటుంబ సభ్యుల ఇళ్లలో, తన అనుచరుల ఇళ్లలో ఐటీ సోదాలు జరగబోతున్నాయని బుధవారం మీడియా సమావేశంలో పొంగులేటి అన్నారు.ఈ ఆరోపణలకు బలం చేకూరే విధంగా 24 గంటల వ్యవధిలో ఇది జరిగిందని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన మాట్లాడిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం. కాగా గురువారం ఆయన నామినేషన్ వేయాలని భావించారు. నామినేషన్ వేయడానికి చివరి రోజు రేపటితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి ఒత్తిడికి లోనవుతున్నారు.