సిని‘మా’.. ఎలక్షన్లు ఎప్పుడు?
posted on Nov 9, 2023 @ 2:07PM
గడువు దాటి పోయినా.. టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల ఊసే లేకుండా పోయింది. ప్రతీ రెండేళ్లకు ఒక సారి ‘మా ’ఎన్నికలు జరుగుతాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఆ క్రమంలో 2021, అక్టోబర్ 10వ తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంటే.. అక్టోబర్ 16వ తేదీన ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంత వరకు ఓకే. కానీ ఇది జరిగి రెండేళ్లు పూర్తి అయింది. మళ్లీ ‘మా’ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ఆ విషయంపై టాలీవుడ్ పెద్దలు ఎవరూ పెదవి విప్పక పోవడంపై ఫిలింనగర్ వర్గాలు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
టాలీవుడ్‌లో దాదాపుగా ప్రతీ రోజు ఎక్కడో.. అక్కడ.. సినిమా షూటింగ్, ఫ్రారంభోత్సవం, ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో, ట్రైలర్ విడుదల ఫంక్షన్లు, సినిమా విడుదల ఫంక్షన్లు, సినిమా సక్సెస్ మీట్లు ఉంటూ... ఉంటాయి. ఆయా కార్యక్రమాల్లో టాలీవుడ్‌లోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రముఖులంతా హాజరువుతారు. మరి వారి మధ్య ‘మా ’ఎన్నికల అంశం చర్చకు రావడం లేదా?.. ఓ వేళ ఈ అంశంపై చర్చ వచ్చినా.. మనకు ఎందుకులే అని వదిలేస్తున్నారా? అన్న చర్చ సినీవర్గాలలో జోరుగా సాగుతోంది.
అయినా టాలీవుడ్‌లో వెండితెరపై నవరసాల్ని పండించగల నటీనటులు ఉన్నారని.. కానీ వారు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ఫిలింనగర్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మా అధ్యక్షుడిగా మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ఉన్నాడు. దీంతో మళ్లీ మా ఎన్నికల విషయంలో జోక్యం చేసుకొంటే.. మంచు ఫ్యామిలీతో పెద్ద యుద్దమే చేయాల్సి ఉంటుందనే భావనలో టాలీవుడ్ ఉందా? అనే సందేహాన్ని సైతం ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.
అలాగే గతంలో జరిగిన మా ఎన్నికలు అంటే.. 2021 అక్టోబర్ 10వ తేదీన జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు.. దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలను తలపించాయన్న విషయం అందరికీ తెలిసిందేనని. ఈ ఎన్నికల్లో అటు ప్రకాష్ రాజ్, ఇటు మంచు విష్ణు మా అధ్యక్ష అభ్యర్థులగా బరిలో దిగిడంతో.... వీరి మధ్య మాటల దాడులు, విమర్శలు, ప్రతీ విమర్శలతో ఎన్నికల వేడి అమాంతంగా పెరిగిపోయిందని... దీంతో ఆ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారి... ప్రపంచంలోని తెలుగు వారంతా.. ‘మా’పై దృష్టి సారించిన విషయాన్ని ఫిలింనగర్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. అలాంటి వేళ.. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే మా అధ్యక్షుడిగా తాను ఎన్నిక అయితే.. చిత్ర పరిశ్రమకు సంబంధించి పలు కార్యక్రమాలు చేపడతానంటూ ఆయన బహిరంగంగానే ప్రకటించారు. మరి ఆ కార్యక్రమాలు పూర్తి అయినాయా? లేదా? అనేది మాత్రం టాలీవుడ్‌లోని వారికే తెలియాల్సి ఉందనే ఓ చర్చ సైతం ఫిలింనగర్ వర్గాల్లో కొనసాగుతొంది.
మరో వైపు.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులుగా గతంలో ఎన్నికల ప్రమేయమే లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భాలు కోకొల్లులుగా ఉన్నాయని.. అలాంటిది 2021లో జరిగిన ఈ ఎన్నికలు మాత్రం.. చాలా రసవత్తరంగా జరిగాయని.. మరి అలాంటిది మా అధ్యక్షుడిగా కాల పరిమితి ముగిసిన తర్వాత కూడా మా ఎన్నికలపై టాలీవుడ్ టాప్ హీరోలు మౌనంగా ఉండడం దేనికి సాంకేతమనే ఓ చర్చ సైతం ఫిలింనగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది.
అదీకాక.. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో నవంబర్ మాసమంతా ఈ హడావుడితోనే సరిపోతుంది. ఈ నేపథ్యంలో మా ఎన్నికలు డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందనే ఓ ఆశాభావం ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓ వేళ.. మా ఎన్నికలు నిర్వహిస్తే.. ఈ ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారు? మళ్లీ ఈ ఎన్నికలు.. దాదాపుగా పోలిటికల్ హీట్‌ను తలపించేలా జరుగుతాయని ఫిలింనగర్ వర్గాల్లో ఓ టాక్ అయితే వినిపిస్తుంది.