ర్యాలీల రగడ..చితగ్గొట్టుకున్న బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు!
posted on Nov 9, 2023 @ 3:51PM
తెలంగాణ ఎన్నికలు అధికార, విపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా మరోసారి అధికారం దక్కించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఆరాటపడుతుండగా.. ఈసారి ఎలాగైనా జెండా పాతి కారుకు చెక్ పెట్టాలని కాంగ్రెస్ విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ఇప్పటికే ముందస్తు సర్వేలలో కాంగ్రెస్ కు అనుకూల పవానాలు వీస్తున్నట్లు తేలడంతో కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే సమయంలో తోమిదేళ్ళ పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అస్త్ర శస్త్రాలను ఉపయోగించి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తున్నది. రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా తీసుకోవడంతో ఏ పార్టీ కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలు సైతం నెలకొంటున్నాయి.
కీలక దశకు చేరుకున్న తెలంగాణ ఎన్నికలలో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగున్నది. నామినేషన్ల దాఖలుకు శుక్రవారం (నవంబర్ 10) తో గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే బుధవారం ఇరుపార్టీలకు చెందిన పలువురు సభ్యులు నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటి వారంతా గురువారం నాడే తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. అయితే, నామినేషన్ వేసే సమయంలో ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డిలు ఓకేసారి నామినేషన్ వేసేందుకు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఇద్దరూ భారీ ర్యాలీతో ఓకేసారి ఒకే మార్గంలో రావడం ఘర్షణకు కారణమైంది. ర్యాలీల సందర్భంగా వ్యాఖ్యలతో మొదలైన గొడవ చివరికి ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకూ వెళ్లింది.
హైదరాబాద్ శివార్లలోని ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణతో రణరంగం అయ్యింది. ఇబ్రహీంపట్నం సెంటర్ దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ ర్యాలీలు ఎదురెదురు పడ్డాయి. ఈ సందర్భంగా ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేయటంతో ముందు గొడవ మొదలైంది. అది కాస్తా ముదిరి రెండు వర్గాలు జెండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేయగా.. ఇరు పార్టీల కార్యకర్తలు రెచ్చిపోవడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. వేలాది మంది కార్యకర్తలు రోడ్లపై ఉన్న బస్సులు, లారీల అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్ల వర్షం కురిపించారు.
దొరికిన వారిని దొరికినట్లుగా జెండా కర్రలతోనే చితకబాదడంతో ఇరవై మందికి పైగా కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో మహిళా కార్యకర్తలు కూడా ఉన్నారు. నలుగురైదుగురు పోలీసులను కూడా కార్యకర్తలు చితకబాదారు. చివరికి భారీ సంఖ్యలో పోలీసులు రంగంలోకి లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి అదుపులోనికి వచ్చింది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్ వేసేందుకు వస్తున్నారని తెలిసినా, ఇరు పార్టీల కార్యకర్తలు వేల సంఖ్యలో రోడ్ల మీదకి వస్తారని తెలిసినా.. రెండు ర్యాలీలు ఎదురెదురు పడతాయని తెలిసినా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా బూడిదయ్యేంత వేడి కనిపిస్తున్నది. ఇలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహించారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.