జనం కోసం కాదు.. జగన్ కోసమే సీఐడీ!
posted on Nov 9, 2023 @ 2:31PM
ఏపీలో దాదాపుగా అన్ని వ్యవస్థలు వాటి స్వరూప స్వభావాలను, మార్చేసుకున్నాయి. ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేయడమే వాటి పనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజ్యాంగం, వ్యక్తి స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు వంటి ప్రాథమిక హక్కులు, సూత్రాలను కూడా ప్రభుత్వం కాలరాస్తున్నా.. న్యాయం చేయాల్సిన అధికారులే ప్రభుత్వం తరపున వకాల్తా పుచ్చుకొని ప్రభుత్వ ఆజ్ఞలను పాటిస్తారా లేదా వేధించమంటారా అని బెదిరింపులకు దిగుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగున్నరేళ్ల జగన్ రెడ్డి పాలనలో ప్రశ్నించిన పాపానికి నానా రకాలుగా వేధింపులు గురైన వారు ఎందరో ఉన్నారు. ప్రశ్నించినందుకు, ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టినందుకు పోలీసులు అక్రమంగా బనాయించిన కేసులు అసంఖ్యాకం. రాజధాని అమరావతి విషయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడిన కారణంగా ఏడు పదుల వయస్సున్న వృద్ధురాలిపై కూడా కేసులు పెట్టి వేధించిన ఘనత జగన్ ప్రభుత్వానిది.
అయితే, ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు, సీఎం వ్యతిరేక కథనాలపై పోలీసులు ఎలా స్పందిస్తారు? ఎలా ట్రాక్ చేస్తారు అనేది పెద్దగా ఎవరికీ అవగాహన ఉండేది కాదు. వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిపై ప్రభుత్వం దాడులు చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఏకంగా పోస్టులు పెడితే హింసిస్తాం అని పబ్లిక్ గా హెచ్చరికలు చేసేసింది. బరితెగింపునకు ఇంతకు మించి ఉదాహరణ ఉండదని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి సోషల్ మీడియాలో సీఎం జగన్ వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా.. ఏపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసినా తీవ్రమైన చర్యలు తప్పవని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. అంతేకాదు ఇష్టం వచ్చినట్లు మీడియా సంస్థలు ప్రభుత్వ వ్యతిరేక కథనాలు, వార్తలు రాస్తే.. ఆస్తులు జప్తు చేసేందుకు కూడా వెనకాడబోమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో అసలు ఏపీ సీఐడీ ప్రజల కోసం పనిచేస్తున్నదా.. జగన్ కోసం పనిచేస్తున్నదా అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని ఏపీ సీఐడీ తీవ్రంగా పరిగణిస్తున్నదని.. ఈ క్రమంలో ఎవరి మీద పోస్టులు చేసినా వదలబోమని ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరిక వెనుక ఉన్నదెవరన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ముఖ్యమంత్రి, వారి కుటుంబసభ్యులపై అనుచిత పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారు ఎక్కడ ఉన్నా కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని బెజవాడలో బుధవారం (నవంబర్ 8) మీడియా సమావేశం పెట్టి మరీ హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలు చేసే వారి ఆస్తుల్ని సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని.. మీడియా పేరుతో పరిధి దాటి ముఖ్యమంత్రి పైనా.. ఆయన కుటుంబ సభ్యులపైనా కామెంట్లు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లను గుర్తించలేమని అనుకుటే పొరపాటు పడినట్లేనని.. వాటిని నడిపే వారితో పాటు ప్రోత్సహించే వారిపైనా చర్యలు తప్పవన్నారు. పోస్టులు పెట్టే వారు విదేశాలలో ఉన్నా ఎంబసీలతో మాట్లాడి వారిని అరెస్ట్ చేస్తామన్నారు. సంజయ్ చేసిన ఈ హెచ్చరికలపై మీడియాలోనూ.. రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ పాలనపై ప్రజలు స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంది. మాధ్యమం ఏదైనా అది ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మీడియా కూడా అంతే. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, ప్రభుత్వ నిర్ణయాలలో తప్పులుంటే ఎండగట్టడం మీడియా బాధ్యత. కానీ, ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కును ఏపీ సర్కార్ కాలరాస్తున్నది. అందుకు సీఐడీని పావుగా వాడుకుంటున్నది. సీఐడీ చీఫ్ తాజా వ్యాఖ్యలు చూస్తే అసలు ఏపీ సీఐడీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి వాచ్ డిపార్ట్ మెంట్ గా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పరిశీలకులు అంటున్నారు. చట్ట పరిధిలో తనకు ఎన్నో విధులు ఉన్నా సీఐడీ జగన్ ప్రభుత్వం చెప్పిన వారిపై మాత్రమే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే వేధించడం, వ్యతిరేక పోస్టులు పెడితే కేసులు పెట్టడానికే పరిమితమైందని అంటున్నారు.