జగన్ ముంచేశారు!
posted on Nov 9, 2023 @ 1:10PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్పలా మార్చేసింది. ఈ మాట ఏపీలో ప్రతిపక్షాలు అన్నదో.. గిట్టని వాళ్ళు చేసిన విమర్శో కాదు. ఇప్పటికే ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని బట్టబయలు చేయగా.. కేంద్ర ప్రభుత్వం కూడా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. పలు జాతీయ సంస్థలు ఇదే విషయంపై ఆందోళన వ్యక్తం చేశాయి. కానీ ఇప్పటికీ జగన్ సర్కార్ ఈ హెచ్చరికలను లెక్క చేయకుండా కొత్త అప్పుల కోసం తెగ వేటాడుతుంది. ఏకంగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకొని ప్రతి నెలా కొత్త అప్పుల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నది. అప్పుల మీద అప్పులు.. అప్పులకు వడ్డీ కట్టేందుకు మళ్లీ కొత్త అప్పులు అన్నట్లు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం బాండ్ల నుండి ప్రభుత్వ ఆస్తుల వరకూ అన్నిటినీ తనఖా పెట్టేసింది. చివరికి మద్యం మీద రాబోయే ఆదాయాన్ని చూపుతూ కూడా పెద్ద ఎత్తున అప్పు చేసేసింది. ఇప్పటికే ఒక రాష్ట్రం చేయాల్సిన అప్పు పరిధికి మించి ఏపీ ప్రభుత్వం చాలా చాలా అప్పులు చేసేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అప్పుల విషయంలో రాష్ట్రం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్లిపోయింది.
చివరికి ఏపీ అంటే అప్పుల మయం, దివాళా తీసిన రాష్ట్రం అంటూ బోర్డు కట్టేసే పరిస్థితికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ కాదు అప్పులప్రదేశ్ అంటూ జాతీయ స్థాయిలో ముద్ర పడిపోయింది. ఏటేటా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మితిమీరిన అప్పుల కారణంగా దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు స్థాయికి చేరింది. ఏడాదికి ఏడాది ఆదాయం పడిపోవడం.. అప్పులపైనే ప్రభుత్వం నడవాల్సి రావడం.. పాత అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కూడా కొత్త అప్పులే దిక్కు కావడంతో ఇదీ ప్రస్తుతం ఏపీ దయనీయ స్థితి. తాజాగా ఫైనాన్స్ రేటింగ్ ఏజెన్సీలు కూడా ఏపీని డౌన్ గ్రేడ్ కింద జమ కట్టేశాయి. ఏపీ ఆర్ధికంగా దిగజారిపోయిందని.. కొత్తగా అప్పులు ఇస్తే రిస్క్ అంటూ ఫైనాన్స్ ఏజెన్సీలు రేటింగ్ ఇస్తున్నాయి. దీంతో ఏపీ పరువు మరోసారి గంగలో కలిసింది.
ఏపీ ప్రభుత్వం గతంలో జారీ చేసిన సీఆర్డీఏ బాండ్స్ రిస్క్ అంటూ క్రిసిల్ డౌన్ గ్రేడ్ చేసింది. అంతేకాదు, రేటింగ్ నెగెటివ్ వాచ్ లిస్ట్ లో పెట్టింది. దీనికి కారణం ఏపీ ప్రభుత్వ తప్పిదాలేనని తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించి బీఎస్ఏ, డీఎస్ఆర్ఏ అకౌంట్స్‌లో రూ.525 కోట్లు మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెయిన్ చెయ్యాల్సి ఉంది. కానీ, ఏపీ ప్రభుత్వం ఆ మినిమమ్ బ్యాలెన్స్ కూడా లేకుండా వాడేసుకుంది. దీంతో డౌన్ గ్రేడ్ చేసినట్లు క్రిసెల్ వెల్లడించింది. పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డెఫిషిట్ 43 వేల కోట్లకి చేరినట్లు వెల్లడించగా.. స్థూల రాష్ట్ర ఉత్పత్తిలో అప్పు 42% చేరుకుందని వెల్లడించారు. ఈ కారణాలతోనే ఏపీ సీఅర్‌డీఏ బాండ్స్ నెగెటివ్‌లో పెట్టామని క్రిసెల్ వెల్లడించింది. ఇది పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆర్ధిక పతనానికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చంద్రబాబు సీఆర్డీఏ బాండ్లు రూ.1300 కోట్లకి రిలీజ్ చేస్తే.. కేవలం గంటలోనే ఓవర్ సబ్‌స్క్రైబ్ అవడం విశేషం. ఆ వెంటనే 2000 కోట్లకి బాండ్స్ రిలీజ్ చేస్తే అవి కూడా హాట్ కేకుల్లా సబ్‌స్క్రైబ్ అయిపోయాయి. అదీ విశ్వసనీయత అంటే..
చంద్రబాబు హయంలో బాండ్లు రిలీజ్ చేసే సమయానికి దేశవ్యాప్తంగా ఉన్న మునిసిపల్ కార్పొరేషన్లు అన్నీ కలిపి రూ.1800 కోట్లకు బాండ్స్ చేయగా.. చంద్రబాబు సర్కార్ కేవలం గంటలో రూ.2000 కోట్లు బాండ్స్ జారీ చేసింది. అలాంటి పరిస్థితి నుంచి నేడు ఏపీ బాండ్స్ తో జాగ్రత్త అనే పరిస్థితికి జగన్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక స్థితిని దిగజార్చేసింది. బీబీబీ ప్లస్‌కు క్రిసెల్ రేటింగును తగ్గించే స్థాయికి తీసుకొచ్చింది. (బిబిబి ప్లస్ రేటింగ్ అంటే డిఫాల్ట్ రిస్క్ ఉంది అని అర్ధం) ఒక రాష్ట్రం ఆర్ధికంగా పతనమైందని ఏజెన్సీలు లిస్ట్ అవుట్ చేస్తే దాని ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతుంది. అసలే ఇప్పటికే ఏపీలో ప్రజల జీవన స్థాయి దిగజారిపోతోంది. ఉపాధి కరువై ప్రజలు వలస బాట పడుతున్నారు. ఒకవైపు అప్పు దొరికితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏజెన్సీలు కూడా రాష్ట్రాన్ని లిస్ట్ అవుట్ చేస్తే ఇక పూర్తిగా దిగజారిపోయినట్లే.