ష్.. గప్ చుప్.. ప్రచారంలో కాళేశ్వరం పేరెత్తొద్దు.. పార్టీ నేతలకు కేసీఆర్ హుకుం!

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇంత కాలం గొప్పగా చెప్పుకుంటూ జబ్బలు చరుచుకున్న బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ఇక ఆ ప్రాజెక్టు పేరే ఎత్తరా? ష్ గప్ చుప్ అంటూ కాళేశ్వరం మాటెత్తకుండానే వచ్చే ఎన్నికల ప్రచారం కానిచ్చేస్తారా? ఈ ప్రాజెక్టు రూపకల్పన, డిజైనింగ్ నుంచి ప్రతి దానికీ కర్తా, కర్మా, క్రియా అంతా తానేనని చాటుకున్న కేసీఆర్.. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పేరెత్తడానికి కూడా జంకుతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినందుకు అపర భగీరథుడు అంటూ ఇంత కాలం కేసీఆర్ ను కీర్తించిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఆ ఊసెత్తడానికే వణికి పోతున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇక బీఆర్ఎస్ ఘనతలలో కాళేశ్వరం పేరే వినిపించకపోవచ్చునని అంటున్నారు.  నిర్మాణంలో, డిజైనింగ్ లో లోపాల వల్లే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోయాయని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్టు కేసీఆర్ నే కాదు, మొత్తం బీఆర్ఎస్ నే ఆత్మరక్షణలో పడేసిందని పరిశీలకులు అంటున్నారు.  మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు ఇసుకలో వచ్చిన కదలికల వల్ల అనీ, కుట్రకోణం అనీ రకరకాల కారణాలు చెప్పిన బీఆర్ఎస్ తీరా సేఫ్టీ అథారిటీ నివేదిక తరువాత ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో పడింది. కేంద్ర నిపుణుల కమిటీ నివేదిక తరువాత మేడిగడ్డపై మాట్లాడతానన్న కేసీఆర్ నిపుణుల కమిటీ నివేదిక తరువాత ఆ విషయమే ఎత్తడం లేదు.  మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటు తరువాత కాళేశ్వరం బ్యారేజీ గురించి ఏం మాట్లాడినా.. ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు రావడం తథ్యమని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు జనంలోకి రావడానికీ, కాళేశ్వరం పేరెత్తడానికీ జంకుతున్నారు. అందుకే కాళేశ్వరంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా బదులివ్వడానికి ముందుకు రావడం లేదు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంపై ఎవరూ మాట్లాడవద్దని ఆదేశించారని పార్టీ శ్రేణులలో చర్చ జరుగుతోంది.  అసలు తొలి నుంచీ కాళేశ్వరం నాణ్యతపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉంది, బీజేపీ కూడా కాళేశ్వరం కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎంగా మారిందంటూ విమర్శలు చేసింది. ఒక్క భారీ వరదకే కాళేశ్వరం పంపులు నీట మునిగిన సందర్భంగా కాళేశ్వరం నాణ్యతపై, భద్రతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మేడిగడ్డ పిల్లర్లు కుంగటం, నాణ్యతా, డిజైనింగ్ లోపాలే ఇందుకు కారణమని సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక వచ్చిన తరువాత బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారింది. నివేదిక తరువాత వారు కాళేశ్వరం ప్రాజెక్టు పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇక కేసీఆర్ అయితే దీనిపై పూర్తి మౌనం వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గానే సెఫ్టి అథారిటీ రిపోర్టును కేసీఆర్ చూస్తున్నట్లు చెబుతున్నారు. ఆ నివేదికను అధ్యయనం చేసి.. రిపోర్టును తప్పుపట్టే అవకాశాలున్నాయా అని కేసీఆర్ ఇరిగేషన్ నిపుణులను కోరినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. వారి నుంచి అభిప్రాయం వచ్చే వరకూ కాళేశ్వరం ఊసెత్తవద్దని కేసీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశించారని అంటున్నారు.  ఈ సారి  ఎన్నికల ప్రచారంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఘనతను గొప్పగా ప్రచారం చేసుకోవాలని భావించిన బీఆర్ఎస్ కు ప్రాజెక్టు నాణ్యత, డిజైనింగ్ పై కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక ఊహించని శరాఘాతంగా మారింది. సంక్షేమం, అభివృద్థి గురించి ఎంతగా చెప్పుకున్నా.. లక్ష కోట్ల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిరర్ధకంగా మారే అవకాశాలున్నాయంటూ వస్తున్న వార్తలు బీజేపీకి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి నెట్టేసింది. అందుకే కేసీఆర్ కూడా తన ప్రసంగాలలో కాళేశ్వరం మాట కూడా రాకుండా జాగ్రత్త పడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

 సుప్రీం మెట్లెక్కిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదం

 తెలంగాణ ఎన్నికలకు ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన  ఎన్నిక చెల్లదని న్యాయవాది  రాఘవేంద్ర రాజు చేస్తున్న పోరాటం సుప్రీం మెట్లెక్కింది.  2018 ఎన్నికలలో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎమ్మెల్యేగా గెలిచినట్లు అదే జిల్లాకు చెందిన న్యాయవాది  ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. దీనిపై  హైకోర్టు విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది.  శ్రీనివాస్ గౌడ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అఫిడవిట్ సరిగ్గానే ఉందని తన తీర్పులో హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది సుప్రీంనాశ్రయించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.   2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవలే పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో, హైకోర్టు తీర్పును రాఘవేంద్రరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాఘవేంద్రరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరాజు పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి షాక్ తప్పదా?

బీజేపీలో కాంగ్రెస్ సంస్కృతి పెరిగిపోతున్నదని ఆ పార్టీ నేతలే  భావిస్తున్నారు. పార్టీలో వ్యక్తి పూజ తారస్థాయికి చేరిందనీ, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం స్థానంలో  నియంతృత్వం ప్రవేశించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కారణంగానే పార్టీ ప్రతిష్ట, వైభవం వేగంగా దిగజారిపోతున్నాయని భావిస్తున్నారు. అదే సమయంలో అంతర్గత కుమ్ములాటలకు, గ్రూపు రాజకీయాలకూ నెలవుగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ ఐక్యత ప్రస్ఫుటమౌతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నదని చెబుతున్నారు. నిజమే..  2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు లిట్మస్ టెస్ట్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది.  ఏ ఒక్క రాష్ట్రంలోనూ కూడా ఆ పార్టీకి  గెలుపు ధీమా కనిపించడంలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా  పార్టీ రాష్ట్ర శాఖలలో క్రమశిక్షణారాహిత్యం, అధిష్ఠానం మితిమీరిన జోక్యం, స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచేలా తీసుకున్న నిర్ణయాలే ఆయా రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి దిగజారడానికి కారణమని అంటున్నారు. ఇక ప్రీపోల్ సర్వేలు కూడా బీజేపీ విజయావకాశాలు మృగ్యమనే చెబుతున్నాయి.  వీక్లీ ట్రాకర్ తాజా అంచనా ప్రకారం ఐదు రాష్ట్రాలకు జరగనున్న అసెబ్లీ ఎన్నికలలో ఏ రాష్ట్రంలోనూ కూడా బీజేపీ అధికారాన్ని దక్కించుకునే పరిస్థితి లేదు.  ముందుగా తెలంగాణ విషయం తీసుకుంటే.. 119 స్థానాలున్న తెలంగాణలో ఈ నెల 30న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలు ఉన్నాయి. వీక్లీ ట్రాకర్ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 74 నుంచి 78 స్థానాలను దక్కించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రెండో్ స్థానంలో బీఆర్ఎస్ 36 నుంచి 38 స్థానాలలో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఆ పార్టీ రెండు స్థానాలకు పరిమితమౌతుందని వీక్లీ ట్రాకర్ పేర్కొంది.  ఇక ఈశాన్య రాష్ట్రమైన మిజొరంలో కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ ఆధిక్యత కనబరుస్తుంది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఈ నెలలో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ 27 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని కైవశం చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇక మొజోరం నేషనల్ ఫ్రంట్ 7 స్థానాలలో, జడ్ పిఎమ్ 5, ఇతరుల ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.  ఛత్తీస్ గఢ్ లో కూడా అదే పరిస్థితి ఉందని.. ఆ రాష్ట్రంలో ఈ నెల 7 ,17 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. 90 స్థానాలున్నఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో ఈ సారి కాంగ్రెస్ 67 నుంచి 75 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి.  ఇక బీజేపీ అయితే 15 నుంచి 19 స్థానాలకు పరిమితమౌతుందని అంటున్నాయి. ఈ రాష్ట్రంలో బీఎస్పీ 2 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని అంటున్నారు.   ఇక మధ్య ప్రదేశ్ లో కూడా బీజేపీ గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నదని సర్వేలు పేర్కొంటున్నాయి. ఆ రాష్ట్రంలో 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.  ఈ రాష్ట్రంలో నవంబర్ 17న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలో  ఉన్న బీజేపీ సర్కార్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా పుంజుకుంది. ఈ సారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ  134 నుంచి 142 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందని వీక్లీ ట్రాకర్ తాజాగా పేర్కొంది. ఇక బీజేపీ 65 నుంచి 73 స్థానాలకు పరిమితమయ్యే అవకాశం ఉండగా, ఇతరులు 20 నుంచి 26 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి.  రాజస్థాన్ లో కూడా బీజేపీ గడ్డు పరిస్థితినే ఎదుర్కొంటున్నది. ఈ రాష్ట్రంలో  అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడటంలోనూ, ప్రజా వ్యతిరేకతను  అనుకూలంగా మార్చుకోవడంలోనూ బీజేపీ విఫలమైంది. ప్రజాదరణ ఉన్న వసుంధరారాజె వంటి నేతలను దూరం పెట్టడం ద్వారా బీజేపీ హై కమాండ్ రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలను చేజార్చుకుంది. రాజస్థాన్ లో ఈ నెల 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. వీక్లీ  ట్రాకర్ మేరకు రాజస్థాన్ లో కాంగ్రెస్ 110 నుంచి 122 స్థానాలలో విజయం సాధించే అవకాశాలుండగా, బీజేపీ 70 నుంచి 80 స్థానాలకు పరిమితమౌతుంది.  ఇతరులు 8 నుంచి 12  స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి. 

ఈటలకు బీజీపీలో మళ్లీ ఉక్కపోత.. గజ్వేల్ నుంచి పోటీకి విముఖత

తెలంగాణ బీజేపీలో  ఏదో జరుగుతోంది. అధికారం కోసం పడుతున్న తాపత్రయంలో  ఆ పార్టీ అధిష్ఠానం తప్పుటడుగులు వేస్తూ బలమైన నేతలను కూడా దూరం చేసుకుంటోంది. బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్ర బీజేపీ బలంగా ఉంది. అధికార బీఆర్ఎస్ ను, కాంగ్రెస్ ను కూడా దీటుగా ఎదుర్కొంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని అప్పట్లో పరిశీలకులు కూడా భావించారు. కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం నుంచీ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి సర్కస్ లో జారుడుబండ మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్న జోకర్ లా మారిపోయింది. అధికారం అన్న ధీమా నుంచి.. రాష్ట్రంలో హంగ్ వస్తే చాలు చక్రం తిప్పేద్దామన్న స్థాయికి పడిపోయింది. ఇక సాధారణంగా బీజేపీలోకి బయట నుంచి వచ్చి చేరిన వారు ఇమడ లేరు. హిందుత్వ భావజానం, ఆర్ఎస్ఎస్ బీజేపీకి మెంటార్ గా వ్యవహరించడం.. అన్నిటికీ మించి బీజేపీలోకి బయటి పార్టీలకు వచ్చిన వారిని తొలి నుంచీ పార్టీలో ఉన్నవారు మనస్ఫూర్తిగా కలుపుకునే పరిస్థితి లేకపోవడం సహజపరిణామంగా అంతా భావించేవారు. అయితే బీజేపీ నాయకత్వం మోడీ, షా చేతులలోకి వచ్చిన తరువాత పార్టీలో ఆ పరిస్థితి మారిపోయింది. సిద్ధాంతం కంటే ఓట్లు, సీట్ల లెక్కలకే బీజేపీ హైకమాండ్ ప్రాధాన్యం ఇవ్వడంతో దేశ వ్యాప్తంగా బీజేపీకీ ఇతర పార్టీలకీ, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ కూ తేడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీలో తొలి నుంచి ఉన్నవారూ, తరువాత వచ్చి చేరిన వారి మధ్య అగాధం ఏర్పడింది. అది పెరుగుతూ వస్తోంది. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈ పరిస్థితి మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం వెనుక ఈటల వంటి వారి అసంతృప్తే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆ తరువాత ఎన్నికలు దగ్గరపడిన తరువాత బండి సంజయ్ ప్రాధాన్యతను ఒకింత ఆలస్యంగానైనా గుర్తించిన బీజేపీ అధిష్ఠానం ఆయనకు స్టార్ క్యాంపెయినర్ హోదా ఇచ్చి.. ప్రచారం కోసం హెలికాప్టర్ కూడా కేటాయించింది. ఇక ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఈటలకు ప్రాధాన్యత తగ్గించింది. దీంతో కేసీఆర్ ను ఓడించేందుకు గజ్వేల్ బరిలో నిలబడతానని ప్రకటించి, అందుకు అధిష్ఠానాన్ని సైతం ఒప్పించిన ఈటల ఇప్పుడు వెనక్కు తగ్గినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇందుకు కారణం.. తనను నమ్ముకు వచ్చిన వారికి పార్టీ అధిష్ఠానం పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఈటల అలకబూనడమే అంటున్నారు. అంతే కాకుండా హుజూరాబాద్ లో గతంలో జరిగిన ఉప ఎన్నికలో తన విజయానికి దోహదపడిన సానుభూతి ఇప్పుడు పని చేయదనీ, ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బలమైన అభ్యర్థులను దింపడంతో విజయం కోసం తాను చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉందనీ ఈటల చెబుతున్నారు. అయితే ఈటల గజ్వేల్ లో వెనక్కు తగ్గడానికి బీజేపీ అధినాయతక్వం తీరుపై అసంతృప్తే కారణమని అంటున్నారు. పార్టీ టికెట్ల విషయంలో తనను నమ్ముకుని వచ్చిన వారికి అన్యాయం జరిగిందని ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఆ కారణంగానే ఆయన గజ్వేల్ నుంచి పోటీకి నో అంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఛత్తీస్ గఢ్ ఎన్నికలలో విజయం కాంగ్రెస్ దే.. పీపుల్స్ పల్స్ సర్వే

ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ ముందంజలో ఉందని, ఆ పార్టీ మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  ఐదేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలలో అసంతృప్తి లేకపోవడం ఒక కారణం కాగా.. ప్రధాన కారణం మాత్రం రాష్ట్రంలో బీజేపీ నిర్మాణాత్మక విపక్ష పాత్ర పోషించకపోవడమేనని అంటున్నారు.  దీంతో రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. బీజేపీలో అంతర్గత కలహాలు, భూపేష్ కు ప్రత్యామ్నాయంగా బలమైన నేతను తెరపైకి తీసుకురావడంలో బీజేపీ విఫలమైంది. అంతే కాకుండా రాష్ట్ర పార్టీపై బీజేపీ అధిష్ఠానం పట్టు పూర్తిగా సడలిపోవడంతో ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ కు దీటుగా ఎదగడంలో బీజేపీ ఘోరంగా విఫలమైంది. ఇంత ప్రతికూలతలో కూడా గత ఎన్నికల కంటే బీజేపీ ఒకింత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో ఆ పెరిగిన బలం రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు ఇసుమంతైనా దోహదపడదని చెబుతున్నాయి.   ఛత్తీస్ గఢ్ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ నిర్వహించిన ప్రీపోల్ సర్వే మేరకు కాంగ్రెస్ రాష్ట్రంలో 55 నుంచి 60 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం 38 నుంచి 34 స్థానాలకు పరిమితం అవుతుంది. బీఎస్పీ, ఇతరులు కలిసి రెండు స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.  90 స్థానాలున్న ఛత్తీస్ గఢ్ లో అధికారం చేపట్టాలంటే కనీసం 46 స్థానాలు సాధించాల్సి ఉంటుంది. పీపుల్స్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఆ స్థానాలు సాధించడం నల్లేరుమీద బండి నడకే. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఉన్నా రెండింటి మధ్యా అంతరం మాత్రం భారీగా ఉందనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకోవడం ఖాయమనీ పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   ఇలా ఉండగా గత ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ ఓటు శాతం కూడా పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2018 ఎన్నికలలో కాంగ్రెస్ 43 శాతం ఓట్లు దక్కించుకుంటే ఈ సారి అది 47శాతానికి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా గత ఎన్నికలలో 33 శాతం ఓట్లు దక్కించుకున్న బీజేపీ ఇప్పడు 42 శాతం ఓట్లు దక్కించుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.    

నేపాల్ ను కుదిపేసిన భూకంపం.. 128 మంది మృతి

నేపాల్‌ భీరీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత6.4గా నమోదైంది. ఈ భూకంపం కారణంగా నేపాల్ లో వందల సంఖ్యలో మరణాలు సంభవించాయని చెబుతున్నారు. అధికారికంగా మృతుల సంఖ్య 128 అని ప్రకటించినప్పటికీ.. ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  పశ్చిమ నేపాల్‌లోని జాజర్‌కోట్ ,రుకుమ్ జిల్లాల్లో  భారీ నష్టం సంభవించినట్లు చెబుతున్నారు.   జాజర్‌కోట్‌లోని లామిదండా ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు  తెలిపారు. శుక్రవారం అర్ధ రాత్రి సంభవించిన ఈ భూ కంప ప్రకంపనలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోనూ కనిపించాయి.   భూకంపం వల్ల దైలేఖ్, సల్యాన్, రోల్పా జిల్లాలతో సహా పలు జిల్లాల్లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. హిమాలియన్ నేషన్ అయిన నేపాల్ లో  తరచుగా భూకంపాలు సంబవిస్తుంటాయి. గతంలో అంటే నవంబర్ 2022 లో దోటి జిల్లాలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించి ఆరుగురు మరణించారు. అంతకు ముందు 2015లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల పన్నెండు వేల మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే. 

బిఆర్ఎస్ లో చేరిన కాసాని

తెలంగాణ  ఎన్నికల్లో టిడిపి వైదొలగడంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బిఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ శుక్రవారం (నవంబర్ 3) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, తనకు పాతమిత్రుడైన కాసాని ఎప్పుడో పార్టీలోకి రావాల్సిందని, కాకపోతే కాస్త ఆలస్యమైందని అన్నారు. బండ ప్రకాశ్‌తో పాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవాడినని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్‌లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ముదిరాజ్ సామాజికవర్గ నాయకులకు చాలా అవకాశాలు కల్పిస్తామని, రాజ్యసభ, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు ఇలా ఎన్నో పదవులు వరిస్తాయన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి ప్రభుత్వపరంగా ఎన్నో పథకాలను అమలు చేశామని, రాజకీయంగానూ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈటల రాజేందర్ వంటి వ్యక్తులు పార్టీ నుంచి వెళ్లినా అంతకంటే పెద్దనాయకులు కాసాని, మిగతా నాయకులు, అతని అనుచరులంతా బీఆర్ఎస్ కుటుంబంలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఆరుగురితో మజ్లిస్ తొలి జాబితా విడుదల... పెండింగ్ లో మూడు 

 అందరికంటే ముందే బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటిస్తే బిఆర్ఎస్ మిత్ర పక్షమైన మజ్లిస్ పార్టీ మాత్రం అందరికంటే చివర్లో అభ్యర్థులను వెల్లడించింది.ఇవ్వాల తొలి జాబితాను విడుదల చేసినప్పటికీ మూడుస్థానాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను రంగంలో దింపే మజ్లిస్ పార్టీ స్వంత రాష్ట్రంలో మాత్రం కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. దీనికి కారణం లేకపోలేదు. మతతత్వ పార్టీ ముద్ర ఉన్న భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ బి టీం అనే ప్రచారం ఉంది. బిఆర్ఎస్ కు మజ్లిస్ సపోర్ట్ చేయడంతో ముస్లిం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. పైగా మజ్లిస్ పోటీ చేయలేని స్థానాల్లో మాత్రం బిఆర్ఎస్ కు ఓటు వేయాలని మజ్లిస్ అధినేత పిలుపునివ్వడాన్ని ముస్లిం మత పెద్దలు తప్పు పడుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు. పాత బస్తీలో మాత్రం మజ్లిస్ పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హాయంలో  భాగ్య లక్ష్మి వివాదంలో ఓవైసీ సోదరులను జైల్లో పెట్టారు. అప్పట్లో మజ్లిస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో మైత్రిని కొనసాగించలేకపోయింది. తర్వాత టిఆర్ఎస్ పార్టీతో మైత్రి కొనసాగించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లకు ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు. గత ఎన్నికల్లో ఈ ఇద్దరు అభ్యర్థుల నియోజక వర్గాలను ఎక్స్ చేంజ్ చేసినప్పటికీ ఈ సారి పార్టీ అధినేత ఇద్దరికి మొండి చేయి చూపారు. గత ఎన్నికల్లో ముంతాజ్ ఖాన్ యాకుత్ పురా నియోజకవర్గం నుంచి ఓటమి చెందుతారన్న సర్వే రిపోర్ట్ ఆధారంగా మార్చాల్సి వచ్చింది.  ఎంఐఐం తొలి జాబితా: చాంద్రాయణగుట్ట - అక్బరుద్దీన్ ఒవైసీ నాంపల్లి - మజీద్ హుస్సేన్ మలక్ పేట్ - అహ్మద్ బలాలా యాకుత్ పురా - జాఫర్ హుస్సేన్ చార్మినార్ - జుల్ఫికర్ కార్వాన్ - కౌసర్ మొహియుద్దీన్ బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.

జగన్‌కు సుప్రీం నోటీసులు.. సీన్ సితారేనా?!

ఏపీ సీఎం జగన్‌ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆర్ఆర్ఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని, ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని రఘురామ ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛ ఇచ్చారని.. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. తమిళనాడు  ముఖ్యమంత్రిగా పని చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో విచారణ జరపాలని ఎంపీ తన పిటీషన్‌లో కోరారు.  సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామ పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిగింది.  ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సీఎం జగన్ కు షాకిచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐకి నోటీసు జారీ చేసిన సుప్రీం, కేసుల్లో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. ఇదే క్రమంలో రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్‌ ను ఎందుకు విచారించకూడదో కూడా చెప్పాలని ఆదేశించింది. ఈ పిటిషన్ కు సంబంధించిన ప్రతివాదులైన సీఎం జగన్ కు సైతం నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేసును మాత్రం వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. అంటే ఈలోగా సీబీఐ ఈ కేసును దర్యాప్తు మొదలు పెట్టాలి. లేదా ఎందుకు ఆలస్యమవుతుందో సుప్రీంకు సమాధానం చెప్పాలి. అలాగే  మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో కూడా సీబీఐ వివరణ ఇవ్వాలి. సీబీఐ వివరణకు సుప్రీం ధర్మాసనం సమంజసమనుకుంటే జగన్ అక్రమాస్తుల కేసు హైదరాబాద్ లోనే ఉంటుంది. లేకపోతే మరో రాష్ట్రానికి బదిలీ అవుతుంది. అయితే  జనవరి ఈ కేసులో ఎలాంటి కదలిక వచ్చినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఎదురుదెబ్బేననడంలో సందేహం లేదు. సుప్రీంలో సమాధానం చెప్పుకోవడానికి, తాము వేగం పెంచామని చూపడానికీ..  సీబీఐ ఈ కేసు విచారణలో సీబీఐ వేగం పెంచినా.. లేక జనవరిలో సుప్రీం ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసినా.. వేగంగా దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలిచ్చినా అది  జగన్ మోహన్ రెడ్డికి ప్రతికూలమే అవుతుంది. వచ్చే ఏడాది జనవరి అంటే సరిగ్గా ఎన్నికల సమయం. మహా అయితే ఎన్నికలకు రెండు మూడు నెలల సమయం మాత్రమే ఉంటుంది. ఆ సమయంలో అక్రమాస్తుల కేసు విచారణకు వస్తే వైసీపీ పరిస్థితి దారుణంగా మారనుంది. జగన్ కేసులు విచారణకు వస్తే జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి అంశాలపై జనంలో చర్చ జరగడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత ఒక్క ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా జగన్ అక్రమాస్తుల కేసు, పదేళ్లుగా బెయిలుపై ఉండటం వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. జరుగుతోంది. ఇక సుప్రీం నోటీసుల నేపథ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు తీవ్రంగా భగం వాటిల్లడం ఖాయం. ఎన్నికల వేళ సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది. ఇప్పుడున్న ఈ కేసు విచారణ ప్రకారం చూస్తే జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. గత నాలుగేళ్లుగా జగన్ విచారణకు హాజరు కావడం లేదు. కనుక జనవరిలో ఈ కేసులో కదలిక వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని.. హాజరు కాకపొతే అరెస్ట్ చేయాల్సి వస్తుందని తీర్పు వస్తే జగన్ ప్రతిష్ట టోటల్ డ్యామేజ్ కానుంది. ఇప్పుడంటే బీజేపీతో సఖ్యత కారణంగా జగన్ ఈ కేసు విచారణ పరంగా ముందుకెళ్ళకుండా మ్యానేజ్ చేయగలుగుతున్నారన్నది జగమెరిగిన సత్యం. అయితే ఎన్నికల ముందు బీజేపీతో జగన్ మైత్రి ఎలా ఉండబోతుందన్న దానిపై కూడా ఈ కేసు విచారణ ఆధారపడి ఉండనుంది. అయితే, దాదాపుగా ఇప్పటికే సంవత్సరాల తరబడి ఈ కేసు సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీవ్రంగానే స్పందించే అవకాశం కనిపిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

వర్మ వ్యూహం విడుదలకు నోచుకునేనా?

టాలీవుడ్ ఒకప్పటి స్టార్ దర్శకుడు, ఇప్పుడు జీరో స్థాయికి మించి అగాధంలోకి పడిపోయిన  రామ్ గోపాల్ వర్మ తాజాగా వ్యూహం అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే.   ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా తెరకెక్కించిన ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు, టీజర్లు వివాదాస్పదమయ్యాయి. ఏపీ సీఎం జగన్ రెడ్డికి అనుకూలంగా,  తెలుగుదేశం అధినేత చంద్రబాబును నెగటివ్ గా చూపించేందుకే వ్యూహం సినిమా తెరకెక్కించారు.  ఈ విషయాన్ని పలు సందర్భాలలో స్వయంగా రామ్ గోపాల్ వర్మే ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కూడా చెప్పేశారు. వైఎస్ఆర్ మరణం నుండి జగన్ సీఎం అయ్యేవరకు జరిగిన కథతో తెరకెక్కిన ఈ సినిమాలో చంద్రబాబే  మెయిన్ విలన్ అన్నట్లుగా కథ నడిపించినట్లు ప్రచారంలో ఉంది. మధ్య మధ్యలో ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ వంటి వారికి సంబంధించి కూడా వ్యతిరేకంగానే చూపారని సినీ వర్గాలలో ప్రచారం  అయ్యింది.  మొత్తంగా వక్రీకరించిన కథతో సినిమా తెరకెక్కిస్తే అది ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది తెలిసిందే. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్  వంటి సినిమాలకు లభించిన ఆదరణ అందరికీ విదితమే. అది పక్కన పెడితే..  అసలు వ్యూహం విడుదలకు నోచుకుంటుందా?   సెన్సార్ అందుకు అనుమతిస్తుందా? అన్న  అనుమానాలు సర్వత్రా  ఈ  సినిమా  ప్రకటించిన సమయం నుంచీ వ్యక్తం అవుతూనే వస్తున్నాయి.    ఇప్పుడు అందరూ భావిస్తున్నట్లే  ఈ సినిమాకు సెన్సార్ బ్రేకులు వేసింది. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా సెన్సార్‌ బోర్డ్‌ ఈ చిత్రానికి సర్టిఫికెట్‌ ఇవ్వకుండా రివైజింగ్‌ కమిటీకి రిఫర్‌ చేసింది.  లోకేష్ వ్యూహం సినిమా పై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ  సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కి లేఖ రాశారు.దీనితో సెన్సార్ బోర్డు ఈచిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. అంతే కాకుండా.. రివైజింగ్ కమిటీకి ఎప్పుడు పంపిస్తారు.. కమిటీ ఎప్పుడు రివ్యూ చేస్తుంది అన్నది కూడా సెన్సార్ బోర్డు మెన్షన్ చేయలేదు. దీనిపై స్పందించిన దర్శకుడు వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమా విడుదలపై కోర్టులకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని చెబుతున్నారు. అది వేరే సంగతి.   ఈ లోగా మరో నిర్మాత నట్టి కుమార్ ఈ సినిమాపై స్పందించారు. ప్రస్తుతం సెన్సార్ రివైజింగ్ కమిటీ సభ్యురాలిగా ఉన్న సినీ నటి, దర్శక నిర్మాత, రాజకీయాలలో కూడా పాత్ర ఉన్న జీవితను 'వ్యూహం’ సినిమా   సెన్సార్‌ రివైజింగ్ కమిటీలో  లేకుండా చూడాలని   నిర్మాత నట్టి కుమార్‌ ఓ లేఖ రాశారు. అందుకు కారణాలు కూడా వివరిస్తూ లేఖ విడుదల చేశారు.   నట్టి కుమార్ ఈ సినిమా విడుదల ఆపాలని ఎన్నికల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో ఏపీ సీఎం జగన్ ను, వైసీపీని గొప్పగా చూపించి, విపక్షాలను తక్కువ చేసి చూపించారని నట్టి కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. వర్మ వ్యూహం సినిమాలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోనియా గాంధీ వంటి రాజకీయ నేతలందరినీ తక్కువ చేసి చూపించడమే కాకుండా.. వారంతా కుట్రలు పన్నే నేతలుగా చూపించే ప్రయత్నం చేశారని నట్టి కుమార్ ఆరోపించారు. త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నందున తెలంగాణలోనూ ఈ సినిమా ప్రభావం చూపించే అవకాశం ఉందని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా  ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో ఉన్న వైసీపీలో జీవిత రాజశేఖర్‌ నాయకురాలిగా ఉన్నందున్న ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరం లేకుండా సెన్సార్‌ చేయమని సహజంగానే వత్తిడి చేస్తారనీ,  ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని వ్యూహం సినిమా సెన్సార్‌ రివైజింగ్ కమిటీ  నుంచి జీవితని తప్పించాలని నట్టి కుమార్‌ సెన్సార్ బోర్డును కోరారు. అయితే తనపై నట్టి కుమార్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన జీవిత..  ప్రస్తుతం తాను బీజేపీలో ఉన్నానని గతంలో వైసీపీలో పని చేశానని, ఇప్పుడు తనకు వైసీపీ పార్టీతో ఎలాంటి సంబంధాలు లేదని.. వైసీపీకి ఓ దండం పెట్టి బయటకు వచ్చేశాననీ చెప్పారు. వర్మ సినిమాను కూడా  అన్నీ కూడా  సినిమాలు చూసినట్లుగానే చూస్తానని జీవిత పేర్కొన్నారు.  తాను వైసీపీలో ఉన్నట్లుగా ప్రస్తుతం మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు కొంతకాలం కిందటివనీ, అప్పుడు తాను వైసీపీలో ఉన్నాననీ, అయితే ఇప్పుడు మాత్రం తనకు ఆ పార్టీతో ఎలాంటి సంబంధం లేదనీ వివరణ ఇచ్చారు.  మొత్తంగా దర్శకుడు వర్మ జగన్ కోసం వ్యూహం పన్ని తెరకెక్కించిన ఈ సినిమాను వర్మ ప్రత్యర్థులే ప్రతి వ్యూహం పన్ని విడుదల కాకుండా అడ్డుకుంటున్నారు. అవాస్తవాలను అవకాశానికి అనుగుణంగా నిజాలని నమ్మించే ప్రయత్నం చేసే ఇలాంటి సినిమాలను ఆదరించే పరిస్థితి లేకపోగా.. అసలు  ఇలాంటి సినిమా విడుదల కాకుండా సెన్సార్ కమిటీ అడ్డుకోవడం స్వాగతించదగ్గ పరిణామమేనని పరిశీలకులు అంటున్నారు. అయితే  ఈ సినిమా విడుదలకు పడిన బ్రేకు తాత్కాలికమా? లేక శాశ్వతమా అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. 

తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న షర్మిల

తెలంగాణ ఎన్నికల బరి నుంచి షర్మిల తప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం  లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అనంతరం ఆమె ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. గెలవడం కంటే త్యాగం చేయడం గొప్ప విషయం అని చెప్పిన షర్మిల.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనను అంతమొందించే లక్ష్యంతో పోటీ నుంచి వైదొలగి కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.  కాగా షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు మృగ్యమన్న విషయాన్ని తెలుగువన్ ముందే చెప్పింది. తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమె అడుగులు ఏపీ వైపు పడతాయని కూడా సరిగ్గా అంచనా వేసింది. తెలుగువన్ చెప్పినట్లుగానే తెలంగాణ ఎన్నికల బరి నుంచి వైదొలగి, కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల అనంతరం ఆమె ఏపీలో అడుగుపెట్టే అవకాశాలున్నాయని అవగతమౌతున్నది. తెలంగాణ ఎన్నికల తరువాత షర్మిల అడుగులు ఏపీవైపు.. హస్తం ఆహ్వానించేనా? అసలు వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలన్న ప్రతిపాదన వచ్చిన క్షణం నుంచీ షర్మిలను ఏపీ పగ్గాలు చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ కోరుతూ వస్తున్నది. వైఎస్ వారసత్వం కాంగ్రెస్ కు తెలంగాణలో మైనస్ అవుతుందని భావించిన కాంగ్రెస్.. ఏపీలో అదే ప్లస్ అవుతుందని భావిస్తోంది. అందుకే తెలంగాణ రాజకీయాలలో వేలు పెట్టకుండా ఏపీకి పరిమితం కావాలని అప్పట్లోనే సూచించింది. అయితే అప్పటికి తిరస్కరించిన షర్మిల.. తెలంగాణ ఎన్నికలలో వైఎస్సార్టీపీ ప్రభావం చూపే అవకాశం ఇసుమంతైనా లేదని గ్రహించి.. ఇక్కడ కాంగ్రెస్ కు బేషరతు మద్దతు పలుకుతూ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం ద్వారా.. ఏపీలో కాంగ్రెస్ ప్రతిపాదనకు అంగీకరించినట్లు చెప్పకనే చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

చంద్రబాబు పేరు వింటేనే జగన్ సర్కార్ గజగజ!

వైసీపీ ఓటమి ఖరారైంది..   జగన్ మోహన్ రెడ్డిని ఈసారి ప్రజలు తిరస్కరించి  ప్యాలెస్ కి పరిమితం చేయడం గ్యారంటీ.  తెలుగుదేశం అధికారంలోకి రావడం తధ్యమన్న ప్రజా నాడి సర్వేల రూపంలో బయటపడింది. పడుతోంది. వైసీపీకీ ఎక్కడిక్కడ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో సొంత నేతలే పార్టీకి మొహం చాటేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడే ఉంటే ఘోర పరాజయం చవిచూడాల్సి వస్తుందనే భయంతో నేతలలో చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఎన్నికల సమయానికి కనీసం చాలా స్థానాలలో డిపాజిట్లు కూడా దక్కవనే భయం అధిష్టానం పెద్దలను కూడా వెంటాడుతుంది. దీంతో ఎలాగైనా ప్రతిపక్షాలను కట్టడి చేసేందుకు వైసీపీ సర్కార్ ఎంతకైనా తెగించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా అక్రమమా.. సక్రమమా, మంచా, చెడ్డా అన్నది  అనేది పక్కన పెట్టి తప్పుడు  కేసులతో చంద్రబాబును  జైలుకు పరిమితం చేసేలా కుట్రలు పన్నారు. పన్నుతున్నారు.  కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పేరు లేని స్కిల్  కేసులో చంద్రబాబును ఇరికించి 52 రోజుల పాటు జైలుకు పరిమితం చేశారు. ఈ కేసు నేటికీ విచారణలోనే ఉండగా మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు.  స్కిల్ కేసులో ఆయనకు బెయిల్ వస్తుందని భావించగానే ఏపీ సర్కార్ అప్పటికపుడు ఆయనపై వరస కేసులను సిద్ధం చేసింది. స్కిల్ స్కాం పేరుతో అక్రమ అరెస్ట్ చేసిన సమయంలోనే ఆయన ఎక్కడ జైలు నుండి బయటకి వస్తారోనని.. అమరావతి రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్ల అల్లర్ల కేసు అంటూ  వరసగా అక్రమ కేసులు బనాయించి ఒక కేసులో ఆయన బయటపడినా మరో కేసులో అరెస్ట్ చేసేలా వల పన్నారు. అయితే, స్కిల్ కేసు తర్వాత ఏ కేసులో నూ  జగన్ సర్కార్, ఏపీ సీఐడీ కుట్రలు పారలేదు.   అంతటితో ఆగని జగన్ సర్కార్ చంద్రబాబుకు బెయిల్  వస్తుందన్న సమాచారంతో అప్పటికప్పుడు మద్యం అక్రమ అనుమతులు అంటూ మరో కేసును తెరమీదకి తెచ్చారు. ఈ కేసులో చంద్రబాబు తరఫున్యాయవాదులు ముందే న్యాయస్థానాల తలుపు తట్టడంతో సీఐడీ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయబోమని కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. ఆ కేసులో అయితే వెనక్కు తగ్గారు కానీ.. వదల బాబూ అంటూ సీఐడీ మాత్రం  చంద్రబాబు అరెస్టుకు కుట్రపూరితంగా వరస కేసులను నమోదు చేస్తూనే వస్వోంది.  లిక్కర్ కేసులో పసలేదని తేలిందో లేదో  వెంటనే  ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానం వల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ మరో కేసును తెరపైకి తెచ్చారు.  గత ప్రభుత్వ హయంలో ఇసుక రవాణా, అనుమతులు ఎలా సాగాయన్నది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి అతి ముఖ్యమైన ఇసుకను ఉచితంగా అందించి చంద్రబాబు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. చంద్రబాబు సర్కారు 2016-2019 వరకు పేదలకు ఉచిత ఇసుక విధానం అమలు చేసింది. కానీ  ఇప్పుడు అందులోనే జగన్‌ సర్కారుకు కుట్రకోణం కనిపించింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల గనుల శాఖ సీనరేజీ ఫీజు, కన్సిడరేషన్‌ ఫీజు, ఇతర ఫీజుల రూపంలో నష్టం వాటిల్లిందని పేర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. తాము అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకం ద్వారా 766 కోట్ల ఆదాయాన్ని సంపాదించామని చెబుతోంది.  గత నెల అక్టోబర్ 3వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఈ కేసును ఫైల్ చేసినట్లు తెలుస్తుంది. ఈ కేసులో తెలుగుదేశం ముఖ్య నేతలతో పాటు అప్పటి సీఎం చంద్రబాబును ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.  జగన్ సర్కార్ తీరు చూస్తే ఒక్క విషయం స్పష్టంగా తెలిసిపోతున్నది. తప్పు ఒప్పు,  నియమం, నిబంధన అంటూ ఏమీ అక్కర్లేదు..  వరుస కేసులతో చంద్రబాబును ఏలాగోలా అరెస్టు చేసి జైలుకు పరిమితం చేయడమే  జగన్ సర్కార్ లక్ష్యంగా కనిసిస్తోంది.  రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు బయట ఉంటే కష్టమని జగన్ భయపడుతున్నారని అందుకే  ఏదో ఒకటి చేసి ఆయనను జైలుకు పరిమితం చేసి ఎన్నికల పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకోసం ఎన్ని అడ్డదారులైనా తొక్కేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నదని చెబుతున్నారు. అందుకే ఇలా వరస అక్రమ కేసులతో చంద్రబాబును ఇబ్బంది పెట్టే కుట్రకు తెరతీశారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ప్రజల్లో పెరిగిన సానుభూతికి అడ్డుకట్ట వేయడానికి కూడా తిరిగి జగన్ సర్కార్ అడ్డదారినే నమ్ముకోవడం చూస్తుంటే వైసీపీ ఎంతకైనా దిగజారడానికి రెడీ అయిపోయిందని తేటతెల్లమౌతోందని పరిశీలకులు అంటున్నారు. నాలుగేళ్లుగా ఇసుకను అప్పనంగా దోచేస్తున్నదెవరో ప్రజలకు తెలియదా? ఉచిత ఇసుక కూడా జగన్ కు కుట్రగా కనిపించడం అంటే తనకు అంటిన అవినీతి మరకలన్నీ కూడా చంద్రబాబు అంటించాలన్న దురుద్దేశమే కనిపిస్తున్నదంటున్నారు.   వేధించు.. బాధించు.. భయపెట్టు అనే సిద్ధాంతాలను నమ్ముకున్న జగన్ మోహన్ రెడ్డి అవాస్తవ కథనాలు వండి వార్చి అక్రమ కేసులు బనాయించినా జనం నమ్మే పరిస్థితి ఏ మాత్రం కనిపించడం లేదన్నది వాస్తవం.  వరుస కేసులతో మరింత ప్రజా వ్యతిరేకతను ప్రొది చేసుకోవడం తప్ప జగన్, ఆయన ప్రభుత్వం సాధించగలిగేదేమీ ఉండదని చెబుతున్నారు. 

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... నామిషన్ల పర్వం షురూ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగింది. అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో నేటి నుంచి నామినేషన్ల పర్వం షురూ అయింది.రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్‌లో కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉదయం 11 గంటలకు ఫారం-1 నోటీసులను అధికారులు జారీ చేసారు. దీంతో  నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల దాఖలు గడువు ఈ నెల 10తో ముగుస్తుంది. 13న నామినేషన్ల పరిశీలన, 15న ఉపసంహరణ ఉంటుంది. అభ్యర్థులు ఈసారి తమ నేరాలను దాచే ప్రయత్నం చేయడానికి వీల్లేదు. వాటిని స్పష్టంగా పేర్కొనాలంటూ ఎన్నికల సంఘం కొత్త నిబంధన తీసుకొచ్చింది. అంతేకాదు, వాటిని మూడుసార్లు వార్తా పత్రికల్లో యథాతథంగా ప్రచురించాలని కూడా ఆదేశించింది. అభ్యర్థి జైలులో కనుక ఉంటే అక్కడి అధికారుల ఎదుట ప్రమాణం చేసి, వారి ధ్రువీకరణతో పత్రాలు పంపాల్సి ఉంటుంది. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా మొత్తం 3.17 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. డిసెంబరు 3న ఫలితాలను వెల్లడిస్తారు. మొత్తం 119 స్థానాలకు గాను అధికార బీఆర్ఎస్ ఇప్పటికే 117 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్ 100, బీజేపీ 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి.

చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలు.. సీఐడీ అభ్యర్థనకు హైకోర్టు నో

చంద్రబాబు మధ్యంతర బెయిలులో అదనపు షరతులు విధించాలంటూ ఏపీ  సీఐడీ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వెలువరించింది. చంద్రబాబు కార్యకలాపాలపై నిఘాకుఇద్దరు డీఎస్పీలను నియమించాలన్న ఏపీ  సీఐడీ అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. అదనపు  షరతుల సంగతి పక్కన పెడితే.. చంద్రబాబునాయుడు స్కిల్ కేసుకు సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొంది. అలాగే రాజకీయ ర్యాలీలలో పాల్గొనకూడదంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలూ కొనసాగుతాయని హైకోర్టు  స్పష్టం చేసింది.  చంద్రబాబు మధ్యంతర బెయిలుపై సీఐడీ వేసిన అనుబంధ పిటిషన్ పై బుధవారం (నవంబర్ 1) విచారణ జరిపిన హైకోర్టు తీర్పును శుక్రవారానికి (నవంబర్ 3) వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తన అనుబంధ పిటిషన్ లో సీఐడీ బెయిలు షరతులను చంద్రబాబు ఉల్లంఘించారనీ, రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మీడియాతో మాట్లాడారనీ పేర్కొన్నారు. అలాగే షరతులను ఉల్లంఘించి రాజమహేంద్రవరం నుంచి ఉండవల్లి వరకూ భారీ ర్యాలీ తీశారని కూడా పేర్కొన్నారు. అయితే సీఐడీ వాదనలతో విభేదించిన చంద్రబాబు తరఫు న్యాయవాదులు.. చంద్రబాబు కోర్టు ఆదేశాలను అతిక్రమించలేదనీ, ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మాట్లాడటం ప్రాథమిక హక్కులో భాగమే తప్ప షరతుల అతిక్రమణ కాదని పేర్కొన్నారు.   అంతే కాకుండా సీఐడీ కోరుతున్న అదనపు షరతులు ప్రాథమిక హక్కులను హరించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు.  

ప్రభుత్వ ముసుగువేసుకున్న వైసీపీ కార్యకర్తలు?!

సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. ఈ రెండు పేర్లు గత 53 రోజులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో  చాలా ఎక్కువగా వినిపించిన పేర్లు. మీడియాలో ఎక్కువగా కనిపించిన పేర్లు. అయితే వీరేం రాజకీయ నాయకులు కారు. వీరిరువురిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఐడీ చీఫ్ కాగా.. మరొకరు ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్. తెలుగుదేశం అధినేత అక్రమ అరెస్ట్ నుండి స్కిల్ కేసు న్యాయస్థానాలలో విచారణ వరకూ ఈ ఇద్దరూ ఎక్కడా  నిబంధనలను పాటించలేదు. ప్రభుత్వ ఉద్యోగులు అన్నట్లుగా వ్యవహరించలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమమని అందరూ నిర్ధారించారు. 17ఏ సెక్షన్ కింద సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఒక నేతను అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి. కానీ  చంద్రబాబు అరెస్టు కనీసం గవర్నర్ కు సమాచారం కూడా ఇవ్వకుండానే అర్ధరాత్రి ఆయన బస చేసిన శిబిరాన్ని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అప్పటివరకూ అసలు ఎఫ్ఐఆర్ అనేదే లేకుండా ఈ అరెస్ట్ జరిగింది.  కోర్టులో విచారణ మొదలయ్యాక హడావుడిగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు చంద్రబాబును సీఐడీ విచారణకు అప్పగించినా ఈ కేసులో ఆయన పాత్ర లేకపోవడంతో సీఐడీ విచారణ కూడా వృధానే అయింది. మొత్తం 52 రోజులుగా ఏసీబీ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకూ ఈ కేసులో విచారణ సాగినా.. ఎక్కడా స్పష్టమైన ఆధారాలు సీఐడీ  న్యాయస్థానాలకు అందించలేకపోయింది.   పైగా జైల్లో చంద్రబాబు సదుపాయాలపై కూడా సీఐడీ ఎక్కడిక్కడ అడ్డుకొనేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. దీనిని బట్టి చూస్తే సీఐడీ కేవలం ప్రభుత్వ పెద్దల ఆనందం కోసమే పనిచేస్తున్నదనీ, ప్రభుత్వ కక్షసాధింపులో సీఐడీ పావుగా మారిందని అందరికీ స్పష్టంగా అర్ధమైంది. ఇంకా చెప్పాలంటే జగన్ సర్కార్ ఇలా వేధింపుల కోసమే సంజయ్ ను సీఐడీ చీఫ్ గా నియమించుకున్నారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అంతకు ముందు విపత్తు నిర్వహణ, ఫైర్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంజయ్ కు సీఐడీ అదనపు బాధ్యతలు అప్పగించి మరీ జగన్ సర్కార్ తీసుకొచ్చింది. గతంలో సంజయ్ పై రాయలసీమలో పనిచేసే సమయంలోనే వైసీపీ వాదిగా ముద్ర ఉంది.  ఇక ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కేసు మొదలైన దగ్గర నుండి ఈయన  ఏఏజీ లా కంటే.. వైసీపీ కార్యకర్తలానే ఎక్కువగా వ్యవహరించారు. ఈ కేసు విచారణ మొదలైన తొలి రోజు నుండే మీడియాకెక్కిన పొన్నవోలు నియమ నిబంధనలను తుంగలోకి తొక్కి చంద్రబాబు దోషి అంటూ రచ్చ రచ్చ చేశారు. కేసు దర్యాప్తులో ఉండగా.. అదే కేసులో వాదనలు వినిపించే న్యాయవాది కేసుకు సంబంధించి వివరాలను బహిర్గతం చేయకూడదనే నిబంధన తెలిసినా అడ్డగోలుగా మీడియా చర్చలో పాల్గొన్నారు. అసలు పసలేని కేసులో భారీ కుంభకోణం అనేలా చిత్రీకరించేందుకు సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు శాయశక్తులా కృషి చేశారు. నారా లోకేష్ ఢిల్లీలో మీడియా సమావేశాలు నిర్వహించి ఈ కేసు గురించి జాతీయ స్థాయి మీడియాకు వివరణ ఇచ్చిన అనంతరం సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు ప్రభుత్వ డబ్బుతో ఢిల్లీ వెళ్లి  అక్కడా చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్రవేసేందుకు కేసు వివరాలను వెల్లడిస్తూ మీడియా సమావేశాలలో మాట్లాడారు.   ఈ వ్యవహారంపై  హైకోర్టులో పిటిషన్  దాఖలైంది. స్కిల్  కేసు దర్యాప్తులో ఉండగా సీఐడీ చీఫ్ సంజయ్, ఏఏజీ సుధాకర్ రెడ్డిలు మీడియా సమావేశాలు ఏర్పాటు కేసు గురించి మాట్లాడారనీ, ఆ క్రమంలో  ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు  పిటిషన్ దాఖలు చేశారు.  ప్రజాధనం దుర్వినియోగంపై ఆర్టీఐ ద్వారా వివరాలు అడిగినా ఇవ్వలేదని పిటిషనర్ తెలిపారు. ఆ పిటిషన్ ను విచారించిన  హైకోర్టు ఆర్టీఐ కింద కోరిన సమాచారం ఇవ్వకపోవడం   చట్టవిరుద్ధమేనని పేర్కొంది. మరో సారి ఆర్టీఐని వివరాలు ఇవ్వాలని కోరాల్సిందిగా పిటిషనర్ కు సూచించింది.  ఇక తాజాగా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే విషయంలో కూడా హైకోర్టులో పొన్నవోలు వితండవాదం వినిపించారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకోలేదని పొన్నవోలు హైకోర్టులో తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయగా హైకోర్టు ఆగ్రహించింది. మార్గదర్శకాల ప్రకారమే తాము మధ్యంతర బెయిల్ మంజూరు చేశామని స్పష్టం చేసిన హైకోర్టు.. ఏవైనా అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళమని సూచించింది. అంతే కాదు  కోర్టు తీర్పులు ఎలా ఇవ్వాలో కూడా మీరే చెప్తారా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలిస్తే సీఐడీ సంజయ్, ఏఏజీ పొన్నవోలు అధికారుల ముసుగేసుకున్న వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరించారన్నది తేటతెల్లమౌతోందని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  

వైసీపీలో లోకేష్ టెన్షన్!

ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రాజకీయంగా పరిణితి చెందిన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఆయన  స్థైర్యం, ధైర్యం, నిముషాలలో నిర్ణయాలు తీసుకోవడం, వాటిని ఆచరణలో పెట్టడం, ప్రజలతో మమేకం కావడం, విశ్వసనీయత పెంచుకోవడం అన్నీ  చూస్తుంటే తండ్రికి తగ్గ తనయుడిగా అందరి మన్ననలూ పొందుతున్నారు. ఇప్పుడు అదే వైసీపీలో టెన్షన్ కు కారణమైంది.  మొన్నటి వరకూ ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. ముందు ముందు ఈ లెక్కలు ఇంకా ఇంకా మారతాయి అన్న భయం వారిని వెంటాడుతున్నట్లు కనిపిస్తున్నది. మొన్నటి వరకూ నారా లోకేష్ అంటే  తండ్రి చాటు తనయుడు. కానీ, ఇప్పుడు రాటుదేలిన నాయకుడు.. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని  కాపాడుకోగల సమర్ధుడు. పార్టీని ముందుండి నడిపించగలిగిన, ప్రత్యర్థుల విమర్శలకు వారి నోళ్లు మూతపడేలా సమాధానం ఇవ్వగల పరిణితి చెందిన నాయకుడు. ఇది  సగటు తెలుగుదేశం అభిమానుల మాట మాత్రమే కాదు.  పార్టీ సీనియర్లు, అంతెందుకు అధికార వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్న వాస్తవం. రాజకీయాలలో తొలి అడుగుపడిన నాటి నుంచి ఆయన మాట నుంచి ఆహారం, ఆహార్యం వరకూ ప్రతి అంశాన్ని ఎత్తి చూపుతూ ఎగతాళి చేసిన ఆ నోళ్లే ఇప్పుడు లోకేష్ మాట ఎత్తాలంటే భయపడే పరిస్థితికి వచ్చాయి.  ఆయన ప్రతి అడుగూ అధికార పార్టీ గుండెల్లో గుబులు పెంచుతోంది.   యువగళం పేరిట ఆయన పాదయాత్ర చేస్తుంటే.. ప్రతి అడుగులోనూ అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన జగన్ సర్కార్ ఆ ప్రయత్నంలో ఘోరంగా విఫలమైంది. ఆంక్షలు, అడ్డంకులను అధిగమిస్తూ ఆయన ముందకు సాగారు. పార్టీ అధినేత, తండ్రి నారా చంద్రబాబును అధికార మదంతో జగన్ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో అటు న్యాయపోరాటం, ఇటు పార్టీ సమన్వయం రెండూ ఏకకాలంలో చేసి నారా లోకేష్ ప్రత్యర్థి పాలిట సింహస్వప్నంగా మారారు. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో లోకేష్ పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ఇచ్చినా.. రాజకీయ క్షేత్రంలో తన ముద్రను బలంగా చాటారు.  ప్పుడు అధికార పార్టీ నేతలు నారా లోకేష్ ఏం చేస్తున్నారు.. ఎక్కడ ఉన్నారు.. ఎవరిని కలుస్తున్నారు.. ఏం మాట్లాడుతున్నారు. లోకేష్ ఏపీలోనే ఉన్నారా.. లేకపోతే  ఎప్పుడు వస్తారు అంటూ ఆంటూ ఆరా తీస్తున్నారు. ఔను.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు వింటేనే వైసీపీ నేతలు వణికి పోతున్నారు.     యువగళం పాదయాత్రతో లోకేష్ ఒక పొలిటికల్ లీడర్ గా ఎంతగా మార్పు చెందారో చూశారు. తన మాట, నడత, నడకను మలచుకుని మాస్ లీడర్ గా ఎదిగిన క్రమాన్ని చూశారు. పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించడం ద్వారా ఆయన ఎదుగుదలను అడ్డుకోగలమని భావించారు. సాధ్యం కాకపోవడంతో అడ్డగోలు విమర్శలతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని భావించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత కానీ లోకేష్ లోని రాజకీయ పరిణితి వారికి అవగతం కాలేదు. ఏపీలో కక్ష సాధింపు రాజకీయాలను జాతీయ మీడియా వేదికగా ఎండగట్టడం దగ్గర నుంచీ.. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేయడంలో కానీ లోకేష్ వ్యవహరించిన తీరు.. లోకేష్ లో మరో కోణాన్ని ఆవిష్కరించింది. ఢిల్లీ నడిబొడ్డున జాతీయ మీడియాతో చర్చకు కూర్చొని రాష్ట్రంలో వైసీపీ చేసే అరాచకాలను దుమ్మెత్తి పోస్తే.. అప్పటికప్పుడు సీఐడీ చీఫ్ సంజయ్, ప్రభుత్వ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీ వెళ్లి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ఢిల్లీలోనే ఎక్కువ గడపడంతో ఇక్కడ వైసీపీ నేతలు ఆయన పారిపోయారంటూ ప్రచారం చేసుకుని సంబరపడ్డారు.  కానీ జాతీయ స్థాయిలో ఏపీలో అరాచకపాలనపై అందరి దృష్టీ పడేలా చేయడంలో లోకేష్ సక్సెస్ అయిన వరువాత కానీ వైసీపీ పెద్దలకు అర్ధం కాలేదు.. ఆయన ఎంత నిర్మాణాత్మకంగా వ్యవహరించారన్నది.  ఇక చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన తరువాత కూడా.. లోకేష్   ఢిల్లీ వెళ్లారు. బుధవారం తిరిగి హైదరాబాదులో ప్రత్యక్షమయ్యారు. దీంతో వైసీపీ నేతలలో ఇదే పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఇటీవల చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో   మీడియాతో మాట్లాడిన నారా లోకేష్ జగన్ అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు.  ఇక నుండి మొదలవుతుంది అసలైన రాజకీయం అంటూ వైసీపీ అధినేతకు స్పష్టమైన హెచ్చరిక పంపారు. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ దక్కిన  సమయంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు జగన్ కేసులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ నేతలలో అలజడి మొదలైంది.  మరీ ముఖ్యంగా నారా లోకేష్ కదలికలను వైసీపీ పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు.  లోకేష్ ఢిల్లీ వెళ్లిన దగ్గర నుండి ప్రతి కదలికను నిఘా వర్గాల ద్వారా వైసీపీ సేకరిస్తున్నట్లు తెలుస్తుంది.  ఇకపై లోకేష్ ఏ చేయబోతున్నారన్నభయం ఆందోళన వారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కనీస ఆధారాలు లేని స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 52 రోజుల పాటు జైలులో ఉంచిన జగన్ సర్కార్..ఇప్పుడు ఆధారాలు ఉండి కూడా పదేళ్లుగా బెయిలుమీద ఉన్న జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక రావడంతో అధికార పార్టీ అగ్రనాయకత్వంవణికి పోతున్నదని అంటున్నారు. చంద్రబాబుపై ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయినా కేసుల మీద కేసులు అన్నట్లుగా ముందుకు వెడుతున్న జగన్ సర్కార్ తీరుపై, పాలనా వైఫల్యాలపై, అడ్డగోలు అప్పులపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగడం వెనుక ఉన్నది లోకేష్ అని అర్ధం అవ్వడంతో లోకేష్ ను లైట్ గా తీసుకుని ఎంత తప్పు చేశామో అర్ధమై భయపడుతోందంటున్నారు.  చంద్రబాబుపై కేసుల్లో కనీస ఆధారాలు కూడా సీఐడీ చూపలేకపోవడంపై ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. న్యాయవర్గాల్లోనూ ఈ అంశంపై లోకేష్ చర్చ పెట్టగలిగారని అంటున్నారు.  లోకేష్ ఢిల్లీ పర్యటలను తేలిగ్గా తీసుకోలేమని… ఏదో చేస్తున్నారని వైసీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. భయపడుతున్నాయని అంటున్నారు. 

కామారెడ్డిలో కేసీఆర్ కు పౌల్ట్రీ రైతుల నిరసన సెగ.. వంద నామినేషన్లు వేయడానికి నిర్ణయం

తెలంగాణ ఎన్నికల ముంగిట అధికార బీజేపీకి ఏదీ కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు. గజ్వేల్ తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేయాలని భావిస్తున్న కేసీఆర్ కు కామారెడ్డిలో రైతులు షాక్ ఇచ్చారు.  పౌల్ట్రీ రైతులు కేసీఆర్ కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో నామినేషన్స్ వేయడానికి సిద్ధపడుతున్నారు. కార్పొరేట్ శక్తుల తీరుతో అన్యాయానికి గురవుతున్నామని పేర్కొంటూ కామారెడ్డి నియోజకవర్గం నుంచి వంద మందికి పైగా పౌల్ట్రీ రైతులు నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు గురువారం (నవంబర్ 2)కామారెడ్డిలోని పద్మశాలీ సంఘం భవనంలో జరిగిన పౌల్ట్రీ ఫార్మర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.ఫౌల్ట్రీ రైతులకు  చికెన్ సెంటర్స్ అసోసియేషన్, ట్రేడర్స్ కూడా మద్దతు తెలిపారు. పౌల్ట్రీ రంగాన్ని పూర్తిగా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలన్న తమ డిమాండ్ కు అధికార బీఆర్ఎస్ పట్టించుకోలేదనీ, రైతాంగానికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగానే పౌల్ట్రీ రంగానికి కూడా ఉచిత కరెంట్ సరఫరా చేయాలని కోరినా ఫలిలం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గ్రో ఇన్ ఛార్జెస్ ప్రభుత్వమే నిర్ణయించాలనీ. గతంలో సెంట్రల్ బోర్డు ద్వారా 50 శాతం సబ్సిడీ ఇచ్చేవారనీ, ఆ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే పౌల్ట్రీ ధరలను రైతులే నిర్ణయించేలా అవకాశం ఇవ్వాలన్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం  కామారెడ్డిలో 100 నామినేషన్లు వేయాలని నిర్ణయించినట్ల పౌల్ట్రీ రైతులు చెప్పారు.శుక్రవారం (నవంబర్ 3) నుంచి మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియలో విడతల వారిగా 100 నామినేషన్లు వేయనున్నట్లు ప్రకటించారు.