తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత.. దేనికి సంకేతం?
posted on Nov 9, 2023 @ 10:15AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ మత ధర్మాన్ని నమ్మినా, ఆచరించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ అన్ని మత విశ్వాసాలకూ సమ ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలలో భక్తుల విశ్వాసాలకు భంగం కలిగేలా జరుగుతున్న చర్యల పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అవును జగన్ పాలనలో హైంధవ ధర్మానికి అపచారాలు జరుగుతున్నాయని ఎప్పటి నుంచో హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఆరోపిస్తున్నారు. ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్న వారిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ కూడా ఉన్నారు. సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజానికి స్వామీజీ సింహాచలం చందనోత్సవంలో చోటు చేసుకున్న అపచారాలపై మాత్రమే ఆగ్రహం వ్యక్తం చేసినా.. జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన అనేకం ఉన్నాయని పరిశీలకులు సైతం చెబుతున్నారు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో అన్యమత ప్రచారం మొదలు, మరెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో ఆధ్మాత్మిక వాదులు లెక్కలతో సహా చెబుతున్నారు.
వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. వారిని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకుంటున్న నిర్ణయాల వరకు తిరుమల తిరుపతి దేవస్థానం అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు ఆరోపించాయి. ఆరోపిస్తున్నాయి. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులలో బలంగా వ్యక్తమౌతోంది
ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో పద్దతిలో దోపిడీకి పాల్పడుతోందని భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి దప్పికలు తీర్చేందుకు గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం లేకుండా పోయింది, దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.
ఇదంతా ఒకెత్తు అయితే తాజాగా టీటీడీ తీసుకున్న నిర్ణయాలు, చర్యలు విస్మయపరుస్తున్నాయి. కొండపై ఏడుకొండల దేవుడి చారిత్రక ఆధారాలను నాశనం చేయడమే లక్ష్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పని చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శ్రీవారు వేటకు వెళ్లినప్పుడు ఉపయోగించినట్లుగా భక్తులు విశ్వసించే పార్వేట మంటపాన్ని కూల్చేసి దాని స్థానంలో కొత్త నిర్మాణం పూర్తి చేశారు. వందల ఏళ్ల పురాతన భవనాన్ని ఇష్టారీతిగా కూల్చేసి.. పురాతన భవనం కనుక కూల్చేశామని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది. అలాగే ఇప్పుడు అలిపిర వద్ద ఉన్న మరో మండపం విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. టీటీడీ తీరుపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తిరుమలలో చారిత్రక కట్టడాల కూల్చివేత వెనుక తిరుమల ప్రాభవం, ప్రాశస్థ్యం తగ్గించేసే కుట్ర ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కూల్చివేతలపై ఇప్పటికే ప్రధాని కార్యాలయం ఆరాతీసినట్లు చెబుతున్నారు. మొత్తం మీద జగన్ పాలనలో తిరుమలలో ఆరాచకాలు హద్దు లేకుండా సాగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.