కాయ్ రాజా కాయ్.. నిమ్మకాయ్.. మిరపకాయ్..

అయితే నువ్వు గెలవాలి.. లేకుంటే నేను గెలవాలి.. అంతే కానీ మరొకరు గెలువ కూడదనే ఓ స్పష్టమైన నిబంధన విధించుకొని.. బీఆర్ఎస్, బీజేపీలు  ఈ ఎన్నికల వేళ తెలంగాణలో కలిసి పని చేస్తున్నాయన్న ప్రచారం పోలిటికల్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. అందుకు రాష్ట్రంలో చోటు చేసుకొన్న తాజా పరిణామాలనే ఉదాహరణగా చూపుతున్నాయి. అక్టోబర్ 7వ తేదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్ బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్బంగా కేసీఆర్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. అయితే ఆ విమర్శలు చాలా జాగ్రత్తగా బీఆర్ఎస్ కు నొప్పి కలగకుండా ఉండేలా ఆచి తూచి చేశారన్న చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, కేసీఆర్ కుటుంబ పాలన, కుటుంబ అవినీతి అన్నారే తప్ప మేడిగడ్డ రిజర్వాయర్‌లో పిల్లర్లు కుంగడంపై ప్రధాని మోదీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు, అలాగే కేసీఆర్ పాలనపై  కూడా మోడీ తీవ్ర విమర్శలు చేయలేదని అంటున్నారు.  అదే 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నిజామాబాద్ వేదికగా జరిగిన సభలో ఇదే సీఎం కేసీఆర్‌పై ఇదే ప్రధాని మోదీ సెటైర్ల వర్షం కురిపించారని.. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలనలో ఆయన ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయలేదని..  మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి గోదావరి జలాలు అందిస్తానన్నారని.. అదీ పూర్తి కాలేదని..  అలాగే పాలన పక్కన పెట్టి... యజ్జాలు, యాగాలు చేస్తున్నారని.. కేసీఆర్‌కి నిమ్మకాయలు, మిరపకాయలే ముఖ్యమంటూ మోదీ సైటెర్లు సంధించారు.   అటువంటిది ఇప్పుడు మాత్రం సీఎం కేసీఆర్ తన ఫ్యామిలీతో కలిసి ఏపీ సీఎం, ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్థాన స్వామిజీ స్వామి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో రాజ శ్యామలా యాగం చేసినా ఆ విషయాన్ని మోడీ    ప్రస్తావించనే లేదని అంటున్నారు. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నారని.. రేపో మాపో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవుతారనే ఓ ప్రచారం జరుగుతోందని... కానీ ఈ కేసులో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న తెలంగాణ సీఎం,  బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్  కుమార్తె  కల్వకుంట్ల కవిత మాత్రం నేటికి అరెస్ట్ కాలేదని గుర్తు చేస్తున్నారు. అయితే ఇదే కేసులో కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతోపాటు ఈ మద్యం కుంభకోణంలో అన్ని తానై వ్యవహరించిన శరత్ చంద్రారెడ్డి తీహర్ జైలుకు వెళ్లి... బెయిల్‌పై విడుదలయ్యారని.. మరి ఈ కేసులో కవిత ఇప్పటి వరకు అరెస్ట్ కాకపోవడం వెనుక బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీల మధ్య కుదిరిన కెమిస్ట్రీయే కారణమా అని ప్రశ్నలు సంధిస్తున్నారు.  ఈ రెండు పార్టీల మధ్య వ్యవహారం పైన కుస్తీ లోన దోస్తీ అన్న చందంగా ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  తృతీయ ఫ్రెంట్ అంటూ టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్... దేశవ్యాప్తంగా కారు స్టీరింగ్ తిప్పకుండా.. బీజేపీ కోసం.. బీఆర్ఎస్ అనబడే తన జాతీయ పార్టీని  కేవలం తెలంగాణకే పరిమితం చేశారని చెబుతున్నారు.   మరోవైపు తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ  బలంగా పుంజుకుని బీఆర్ఎస్ కు ఊహించని రీతిలో గట్టిపోటీని ఇస్తోంది. ఈ ఎన్నికల్లో హస్తం పార్టీ హల్‌చల్ చేసి... అధికార పీఠాన్ని హస్తగతం చేసుకొంటుందంటూ సర్వేలు సైతం వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ జోరు చూస్తుంటే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందనీ, ఈ విజయం వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై   ప్రభావం చూపేలా ఉందనీ,  ఇప్పటికే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  గెలుపుతో.. తెలంగాణ కాంగ్రెస్  శ్రేణుల్లో  కొత్త ఉత్సాహం ఉరకలేస్తోందని, ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారం చేపడితే.. హస్తినలో తన పీఠానికే ఎసరు వస్తుందన్న భావనతో  ప్రధాని మోదీ సైతం తెలంగాణలో  కాంగ్రెస్ ఓటమి కోసం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారన్న  ప్రచారం   పోలిటికల్ సర్కిల్స్ లో  జోరుగా సాగుతోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ గెలవకూడదనే ఓ స్పష్టమైన ప్రణాళికలో భాగంగానే.. ఆ పార్టీ తరఫున బరిలో నిలిచిన అభ్యర్థులు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలు, ఫార్మ్ హౌసులపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయని.. ఎన్నికల ప్రచారం ముగిసే లోపు.. మరింత మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నివాసాలపై కూడా దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.  అయితే బీఆర్ఎస్‌తో బీజేపీ బంధం బలపడిందని... అదే లేకుంటే.. కారు పార్టీ అభ్యర్థుల నివాసాలపై ఎందుకు ఐటీ దాడులు జరగడంలేదన్న భావన తెలంగాణ సమాజంలో వ్యక్తమౌతోంది.  ఓ వేళ తెలంగాణలో   కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. కర్ణాటకతో మార్పు మొదలైందని.. అది తెలంగాణలో  స్పష్టమైందని.. ఇక లోక్‌సభ ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు పునరావృతమవుతాయంటూ.. ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు.. ప్రజల్లోకి దూసుకు వెళ్లి.. వాళ్లకు అనుకూలంగా ప్రచార చేస్తారని.. ఆ క్రమంలో ఫలితాలు వాళ్లకు అనుకూలంగా వస్తే.. ఆ తర్వాత  బీజేపీ అధికార పీఠానికి దూరం కాక తప్పదని... అందుకే ప్రధాని మోదీ, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఓ స్పష్టమైన అవగాహనకు వచ్చారని.. దీంతో తెలంగాణలో కేసీఆర్ వస్తే.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ గెలిస్తే.. తెలంగాణ సీఎం పదవిని తనకు కుమారుడు కేటీఆర్‌కి కట్టబెట్టి.. ఉప ప్రదాని పోస్ట్‌లో కేసీఆర్ కూర్చోవచ్చుననే ఓ ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్లు ఓ చర్చ సైతం నడుస్తోంది.  అదీకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఉన్నప్పుడు... తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. బిడ్డా కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగే వారని.. కానీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. బీజేపీ, బీఆర్ఎస్‌ల మధ్య విమర్శల పదును దాదాపుగా తగ్గిపోయిందనే విషయం అవగతం అవుతుందని... ఏదీ ఏమైనా.. తెలంగాణలో హస్తం పార్టీ గెలుపును అడ్డుకోవడం కోసం.. బీఆర్ఎస్, బీజేపీలు తమదైన పంధాలో అడుగులు వేస్తున్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లోనే కాకుండా.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో సైతం రచ్చ రచ్చ అవుతోంది. ఇక మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై నోరెత్తవద్దంటూ.. పార్టీ శ్రేణులకు ఇప్పటికే సీఎం కేసీఆర్ హుకూం జారీ చేశారని... అందుకే మోదీ సైతం ఈ అంశంపై స్పందించలేదనే ఓ ప్రచారం సైతం పోలిటికల్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

అయ్యయ్యో వై నాట్ 175 అంటే అర్థం ఇదా?

వైసీపీ కనీసం క్యాడర్ నైనా కాపాడుకోవడానికి వైనాట్ 175 అన్న ప్రచారాన్ని గట్టిగా వాడుకుంటోంది. అయితే అదేమంత సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనిపించడం లేదు. ఆ పార్టీ ప్రస్తుతం నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర కు జనాలు సరే.. పార్టీ కార్యకర్తలు కూడా ముఖం చాటేస్తున్నారు. ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ వైనాట్ 175 అన్న జగన్  నినాదాన్ని నెటిజన్లు సెటైర్లతో ఏకి పారేస్తున్నారు. సామాజిక బస్సు యాత్ర సభల కోసం పెద్ద సంఖ్యలో కుర్చీలు వేసి ఆర్భాటంగా ఏర్పాట్లు చేస్తుంటే.. ఆ కుర్చీల్లో కూర్చునేందుకు పదుల సంఖ్యలో కూడా జనం ఉండటం లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వై నాట్ 175 అనడం తరువాత.. ముందు సాధికార బస్సుయాత్ర సభలలో 175 కుర్చీలు నిండటం లేదు చూసుకోండంటూ ఎద్దేవా చేస్తున్నారు.  వైసీపీ ఇన్ చార్జీలు, పార్టీ స్థానిక నాయకులు, మంత్రులు ఇలా అంతా కలిసి బస్సుయాత్రలు చేస్తున్నా జనం అటుకేసి కూడా చూడటం లేదు. ఈ తతంగాన్నంతా సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ చేస్తున్న నెటిజన్లు.. జగన్ పదేపదే చెబుతున్న వై నాట్ 175కు అసలైన అర్ధం సామాజిక సాధికార బస్సు యాత్ర సభలలో కనీసం 175 కుర్చీలనైనా నింపండి అనేనా అంటున్నారు. వైసీపీ సభలకు 175 సీట్లు నిండటం లేదు కానీ.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో వైసీపీ విజయం సాధించాలంటూ పార్టీ నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే.. ఉట్టికెగరలేనమ్మ సామెత గుర్తుకు వస్తోందంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజనులు.  

సుప్రీం ఆవరణలో మిట్టీ కెఫె.. ప్రారంభించిన సీజేఐ

అందరికీ సమానావకాశాలు దిశగా సుప్రీం కోర్టు ఒక ముందడుగు వేసింది. దివ్యాంగులతో నడిచే మిట్టీ కెఫేను సుప్రీం కోర్టు ఆవరణలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ శుక్రవారం (నవంబర్ 9)న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ మాట్లాడుతూ.. ‘ఈ కెఫేను నడిపేవారంతా ప్రత్యేక అవసరాలున్నవారనీ, వీరి ఆధ్వర్యంలో  దేశవ్యాప్తంగా ‘మిట్టీ కెఫే’ 38 కేఫ్‌టేరియాలను నిర్వహిస్తోందని వివరించారు. ఈ మిట్టీ కెఫే  కరోనా సమయంలో 60 లక్షల భోజనాలను అందించిందనీ,  ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కెఫే ప్రారంభమవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రత్యేక వెంచర్‌కు బార్‌ సభ్యులంతా మద్దతుగా ఉండాలని, ఉంటారనీ ఆకాంక్షించారు. సహచర న్యాయమూర్తులతో కలిసి కేఫ్‌టేరియాకు వెళ్లిన ఆయన.. అక్కడ టీ తాగి , సమోసా తిన్నారు.  

నటుడు చంద్రమోహన్ ఇక లేరు

టాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ శనివారం (నబంబర్ 11) కన్నుమూశారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1966లో రంగులరాట్నం చిత్రం ద్వారా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తరువాత ఇక వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఆయన నటనకు గాను రెంుడ ఫిల్మ్ ఫేర్ అవార్డులు, ఆరు నందులు అందుకున్నారు. ఏ కొత్త హీరోయిన్ అయినా తొలుత చంద్రమోహన్ సరసన నటిస్తే ఆమెకు ఇక తిరుగుండదనీ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతారన్న నమ్మకం చిత్రపరిశ్రమలో ఉండేది. ఏ పాత్రనైనా సునాయాసంగా నటించి మెప్పించగలిగిన ప్రతిభ చంద్రమోహన్ సొంతం. పదహారేళ్ల వయస్సు, ప్రాణం ఖరీదు వంటి చిత్రాలలో ఆయన నటన అనితర సాధ్యం అన్నట్లు ఉంటుంది.  చంద్రమోహన్ స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా పమిడిముక్కల. 1943లో జన్మించిన ఆయన తన ఐదున్నర దశాబ్దాల నట జీవితంలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మొత్తం 932 చిత్రాలలో నటించారు. 

రేవంత్ విద్యుత్ వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు చిక్కులు?!

తెలంగాణలో అనూహ్యంగా పుంజుకుని అధికారం దిశగా రేసుగుర్రంలా దౌడు తీస్తున్న కాంగ్రెస్ కు ఇప్పుడు విద్యుత్ చిక్కులు ఎదురౌతున్నాయి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షడు రేవంత్ రెడ్డి కొద్ది రోజుల కిందట 24 గంటల విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బూమరాంగ్ అయ్యాయా అని పరిశీలకులు అనుమానిస్తున్నారు. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందంటూ ఆయన చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ఆయన ఏ సందర్భంగా చేశారో, అసలు వాస్తవంగా ఆయన ఉచిత విద్యుత్ పేర ప్రభుత్వ దోపిడీపై ఆయన విమర్శలు ఏమిటి? అన్నది మరుగున పడిపోయి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ అన్న ఒక్క మాటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నది.  రేవంత్ రెడ్డి గతంలో అమెరికాలో ఓ  కార్యక్రమంలో మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్​ సరిపోతుందని చేసిన వ్యాఖ్యకు ముందు, తరువాత ఏం మాట్లాడారన్నది పట్టించుకోకుండా  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు ఉండదని బీఆర్ఎస్​ నేతలు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత కాంగ్రెస్​ పాలనలో విద్యుత్​ సమస్యలు ఉండేవని గుర్తు చేస్తూ, ప్రజలను కాంగ్రెస్ వస్తే నిజంగానే విద్యుత్ కష్టాలు తప్పవని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ తెలంగాణ పర్యటనలో  తాము కర్ణాటకలో ఐదు గంటల కరెంట్​ ఇస్తున్నామని  చేసిన వ్యాఖ్య లు కూడా కాంగ్రెస్ కు ఒకింత ఇబ్బంది తెచ్చిపెట్టాయి.   తాను వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలని తాను అనలేదని రేవంత్​  ఎంతగా విడమరిచి చెబుతున్నా.. బీఆర్ఎస్ నేతల విమర్శల ముందు అవి జనానికి పెద్దగా చేరినట్లు కనిపించడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణలో విద్యుత్ అన్నది చాలా తీవ్రమైన అంశమే కాకుండా సున్నితమైన అంశం కూడా. ఇక్కడ వ్యవసాయ పనుల కోసం రైతులు అధికంగా విద్యుత్ పైనే ఆధారపడతారు. ఇదే విద్యుత్ అంశం గతంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును సైతం ఇబ్బందుల పాలు చేసిన విషయం తెలిసిందే.   ఇక పోతే తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా విద్యుత్ కు సంబంధించి పలు చర్చలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, అప్పటి కాంగ్రెస్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే.. చీకట్టేనని అప్పట్లో హెచ్చరికలు సైతం చేశారు.  అందుకు సంబంధించిన పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ సైతం ఇచ్చారు. అయితే కారణాలు ఏమైతేనేం.. తెలంగాణ ఆవిర్బావం తరువాత తెలంగాణలో విద్యుత్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారనే చెప్పాలి. ఆయన హయాంలో రాష్ట్రంలో పెద్దగా విద్యుత్ కోతలు లేవు. వ్యవసాయినికి ఉచిత విద్యుత్  సరఫరా విషయంలోనూ ఆయన విజయం సాధించారనే చెప్పాలి.  అయితే 24 గంటల విద్యుత్​ పేరుతో కేసీఆర్ సర్కార్ పాల్పడిన అవినీతిని వివరించే సందర్భంలో రేవంత్ రెడ్డి అన్న ఒక్క మాట.. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది.    రేవంత్​ వ్యాఖ్యలను బీఆర్ఎస్​ ప్రచారాస్త్రంగా మలుచుకుంటే, ఆ ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టే విషయంలో కాంగ్రెస్ ఒకింత వెనుకబడిందని పరిశీలకులు చెబుతున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్​, మంత్రులు కేటీఆర్​, హరీశ్​ రావు మొదలకుని.. ద్వితీయ శ్రేణి నాయకుల వరకూ అంతా మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలనే ప్రధానంగా తమ ప్రచారానికి తురఫు ముక్కగా వాడుకుంటున్నారు.  ఈ సమయంలో కర్నాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్​ తమ రాష్ట్రంలో ఐదు గంటలు విద్యుత్ అంటూ చెప్పడంతో సమస్య మరింత జఠితమైనట్లైంది.  అసలు ఉచిత విద్యుత్ తీసుకువచ్చిందే కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తున్నాయన్నది అనుమానంగానే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  బీఆర్ఎస్ మాత్రం రేవంత్ మూడు గంటల విద్యత్​ వ్యాఖ్యను నిత్యం చర్చలో ఉండేలా జాగ్రత్త పడుతోంది.   కేసీఆర్​ చేతికి కాంగ్రెస్​ నేతలు విద్యుత్ అనే ఆయుధాన్ని చేజేతులా అందించినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మూడు గంటల విద్యుత్ అన్న రేవంత్ వ్యాఖ్యలు ప్రజలపై ముఖ్యంగా రైతులపై ఏ మాత్రం ప్రభావాన్ని చూపాయన్నది తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందేనంటున్నారు. మొత్తం మీద రేవంత్ వ్యాఖ్యలు ఏదో మేరకు కాంగ్రెస్ కు నష్టం చేశాయన్న అభిప్రాయమే అత్యధికుల్లో వ్యక్తమౌతోంది. 

దీపావళి ఆంక్షలు.. ఉల్లంఘాస్తే చర్యలు.. సీపీ శాండిల్య

దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్పులపై హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సందీప్​ శాండిల్య కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో భారీ శబ్ధాలు చేసే బాణాసంచ కాల్చడంపై నిషేధం విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహానగర ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు. జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో క్రాకర్స్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్న ఆయన రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య మాత్రమే శబ్ధం చేసే క్రాకర్స్ కాల్చాలని సూచించారు. నవంబర్ 12వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15వ తేదీ ఉదయం 6 గంటల మధ్య ఈ ఆంక్షలు అమలు అవుతాయని శాండిల్య తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.  

సొంత తల్లి, చెల్లికే నమ్మకం లేదు.. ఇక జనాలు ఎలా నమ్ముతారు?

గత ఎన్నికలలోజగన్ మోహన్ రెడ్డికి ఎన్ని అంశాలు కలిసి వచ్చాయో ఇప్పుడు అంతకు మించి మరెన్నో అంశాలు ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయి. 2019 ఎన్నికల సమయంలో అవినీతి కేసులలో జైలుకు వెళ్లిన సెంటిమెంట్ కలిసి వస్తే.. ఇప్పుడు అదే అవినీతి కేసులు జగన్ కు ప్రతికూలంగా మారాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ నాలుగేళ్లుగా కనీసం విచారణకు కూడా హాజరుకాకుండా  తప్పించుకుంటున్నారని జనం బాహాటంగానే చెబుతున్నారు. కోడికత్తి కేసు, బాబాయ్ హత్యకేసులకు సంబంధించి జగన్ చేసినవన్నీ డ్రామాలే అనేలా ఇప్పుడు ముద్రపడిపోయింది. ఇక అన్నిటికీ మించి గత ఎన్నికలలో జగన్ కు అతి పెద్ద ప్లస్ పాయింట్ కుటుంబం. తల్లి విజయమ్మ ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ జగన్ కు దగ్గర చేసి  అండగా ఉండేలా చేశారు. ఇక చెల్లి షర్మిల అయితే అన్న జైల్లో ఉండగా అప్పుడే తొలిసారి ప్రజల మధ్యకి వచ్చి పాదయాత్రతో పార్టీ కార్యకర్తలలో ఒక నమ్మకాన్ని కలిగించారు. ఇక బావ బ్రదర్ అనిల్ కుమార్ కూడా వెనకుండి రాష్ట్రవ్యాప్తంగా క్రైస్తవ సోదరులను జగన్ వైపు మళ్లేలా చేశారు. కానీ, ఇప్పుడు వాళ్ళెవరూ జగన్ తో లేరు. కారణాలు ఏవైనా కానీ తల్లి, చెల్లి ఇప్పుడు జగన్ తో సంబంధాలు తెంచేసుకుని దూరంగా వెళ్లిపోయారు.  ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూనే ఉంటారనే సంగతి తెలిసిందే. జగన్ విషయంలో కూడా అంతే. బహిరంగ సభలలో ఆయన చిరునవ్వులు చిందిస్తూ తానేం చెప్పినా జనం నమ్మేసి తన వెంటే అనుకుంటే అది పొరపాటే అవుతుంది. బాబాయ్ వివేకా హత్యకేసు విచారణ, నిందితులను పక్కనే ఉంచుకొని వారికి అండగా నిలవడం, కోడికత్తి కేసులో నిందితుడిని జైలుకు పరిమితమయ్యేలా కోర్టు విచారణకు హాజరు కాకపోవడం వంటివన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇక, జగన్ కుటుంబం దూరమవడంపై కూడా ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూనే ఉంది. తన విజయం కోసం ఎంతో చేసిన చెల్లి షర్మిలను పక్క రాష్ట్రానికి వెళ్లేలా చేయడం, అక్కడ కూడా ఆమె రాజకీయంగా ఎదగకుండా తెరవెనక కుట్రలు చేశారనే ఆరోపణలు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు షర్మిలను విమర్శించడం వెనుక ఉన్న కారణాలు.. ఇలా ప్రతి విషయాన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు.  అందుకే, ఇప్పుడు జగన్ మాట్లాడే ప్రతి మాటను గమనిస్తున్న ప్రజలు సోషల్ మీడియాలో విపరీతంగా కౌంటర్లు ఇస్తున్నారు. గతంలో ఎన్నికలకు ముందు బాబాయ్ వివేకా హత్యకేసు, కోడికత్తి కేసులకు సంబంధించి జగన్ మాట్లాడిన మాటల వీడియోలను   ఇప్పుడు మళ్ళీ షేర్ చేసుకుంటున్న నెటిజన్లు అప్పటికి ఇప్పటికీ తేడాలపై   కామెంట్లు చేస్తున్నారు. అదే మాదిరిగా ఇప్పుడు వైసీపీ ఎన్నికల ప్రచారం కోసం రూపొందించిన కార్యక్రమాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఏపీ నీడ్స్ జగన్ లాంటి కార్యక్రమంపై మీమర్లు గట్టి కౌంటర్లు వదులుతున్నారు. ఇక మా నమ్మకం నువ్వే అంటూ కొన్నాళ్ళుగా వైసీపీ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.   ఏడాది క్రితమే మొదలైన ఈ కార్యక్రమానికి సంబంధించి స్టిక్కర్లు కూడా తయారు చేయించి వాలంటీర్లతో ఇంటింటికి అంటించేలా చేశారు. అయితే, ఇప్పుడు ఈ కార్యక్రమంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ట్రెండింగ్ లో ఉంది.  మా నమ్మకం నువ్వే జగన్ అనే నినాదానికి నెటిజన్లు కొత్త లాజిక్కులు తెచ్చి ప్రశ్నిస్తున్నారు. జగన్ మీద సొంత తల్లి, చెల్లికే నమ్మకం లేక పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయారు.. రాష్ట్ర ప్రజలు ఎలా నమ్మాలని ప్రశ్నిస్తున్నారు. తండ్రి రాజశేఖరరెడ్డి మరణం ఒక మిస్టరీ అని వైసీపీ నేతలే ఆరోపిస్తారు. బాబాయ్ హత్య చేసింది అబ్బాయిలేనని సీబీఐ ఆధారాలతో సహా తేల్చేసింది. తల్లి కొడుకుతో ఉండలేక కూతురుతో వెళ్ళిపోయింది. సొంత చెల్లి రాష్ట్రం వదిలే వెళ్ళిపోయింది. బాబాయ్ కూతురైన మరో చెల్లి అన్న అధికారంలో ఉన్నా రాష్ట్రంలో న్యాయం దొరకట్లేదని  తన తండ్రి హత్యకేసుపై దర్యాప్తు పక్క రాష్ట్రాంలో జరిపించాలని న్యాయపోరాటం చేసి మరీ సాధించుకున్నారు.  ఇంత మంది సొంత వారికి నమ్మకం ఇవ్వలేని జగన్ ఇక రాష్ట్ర ప్రజలకు ఎలా నమ్మకం కలిగిస్తారని.. ఇంకా మా నమ్మకం నువ్వే లాంటి స్లొగన్స్ ఇస్తే ప్రజలు నవ్వుకుంటున్నారంటూ మీమ్స్ తయారు చేసి వదులుతున్నారు. లాజిక్ కరెక్టే కదా అంటూ నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. దీంతో ఏపీ సీఐడీని రంగంలోకి దింపిన జగన్ సోషల్ మీడియాలో జగన్ పై వ్యతిరేక పోస్టులు పెడితే ఆస్తులు జప్తు చేస్తామంటూ బెదరిస్తున్నారు. మంత్రాలకు చింతకాయలు, బెదరింపులకు ఓట్లు రాలతాయా? అని నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. 

పులివెందులలో జగన్ కు పరాభవం!?.. రోడ్లు కావాలి.. మా గోడు వినాలి అంటూ జనం నినాదాలు!

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ కు ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న పులివెందులలో ఆయనకు నిరసన సెగ తగింది. కంచుకోటలాంటి పులివెందులలోనే ఆయన జనానికి ఎదురుపడలేక ముఖం చాటేశారు. రోడ్లు కావాలి, మా సమస్యలు వినాలి అని జనం నినాదాలు చేస్తుంటే జగన్ మాత్రం తన షిక్కటి చిరునవ్వును చెరగనీయకుండా దూరం నుంచే వారికి దండం పెట్టి వెళ్లిపోయారు. ఈ సంఘటన శుక్రవారం(నవంబర్ 10) పులివెందులలో  జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో పులివెందులలో జగన్ కోటలు బీటలు వారుతున్నాయా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరందుకుంది.  తన సొంత నియోజకవర్గంలో జగన్ పట్టు కోల్పోతున్నారా?  ఇంత కాలం బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలు ఇక ఆయనను నిలదీయడానికి సిద్ధమైపోయారా అంటే  పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది.  సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్ తన పట్టు, ప్రతిష్ట కోల్పోతున్నారా అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు.   కాగా పులివెందులలో జగన్ పట్టు కోల్పోతున్నారని తెలుగువన్  ఎనిమిది నెలల కిందటే చెప్పింది.  జగన్ సొంత బాబాయ్  వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై ఈ ఏడాది మార్చి 15కు సరిగ్గా నాలుగేళ్లు అయ్యింది. ఆ సందర్భంగా వివేకా కుమార్తె  డాక్టర్ సునీత పులివెందుల్లోని తండ్రి సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరన్న దానిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన వివేకా వర్థంతి కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారు కొందరు  హాజరయ్యారు. అంతే కాదు  వైయస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో వైఎస్ కుటుంబ సభ్యులు  దివంగత ముఖ్యమంత్రి,  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన భార్య  విజయమ్మ, వారి కుమార్తె షర్మిల,  వివేకా కుమార్తె  సునీతతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు వైయస్ రాజారెడ్డి దంపతుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ ఫొటో  కనిపించలేదు.   అదొకటి అలా ఉంటే ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ అభ్యర్థికి ఇక్కడ అతి తక్కువ ఓట్లు పోల్ కావడం కూడా పులివెందులపై జగన్ పట్టు జారిపోయిందనడానికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు పులివెందులలో జగన్ పర్యటన సందర్భంగా జనం  సమస్యలపై గళమెత్తడం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, జగన్ దండం పెట్టి వెళ్లిపోవడం చూస్తుంటే.. పులివెందులతో జగన్ పట్టు జారిపోతోందనే అనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పేట్రేగిపోతున్న వైసీపీ బకాసురులు! ;పోలవరం కాల్వనే తవ్వేస్తూ మట్టిదందా!

ఏపీలో అధికార  వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమ రిజిస్ట్రేషన్ల స్కాం ను స్వయంగా వైసీపీ నేతే బయటపెట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లే కాదు.. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా మట్టి తవ్వకాలు, అనుమతులు లేకుండానే కొండలను పిండిచేసి తవ్వేయడం ఇలా ఎన్నో అక్రమాలు వైసీపీ సర్కార్ అండతో వైసీపీ నేతలు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు వైసీపీ నేతల చీకటి వ్యాపారం మరొకటి  వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు రాత్రికి రాత్రి పోలవరం కుడికాలువను తవ్వుకొని మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి  బట్టబయలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో పలు చోట్ల రాత్రయితే చాలు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చీకటి వ్యాపారం మొదలవుతుందన్న ఆరోపణలున్నాయి. ప్రతి రోజూ రాత్రి 10 గంటల తర్వాత మొదలయ్యే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం ఉదయం 6 గంటల వరకూ సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ చీకటి వ్యాపారంలో భాగంగానే గత కొంత కాలంగా పెదవేగి మండలంలో పలు చోట్ల రాత్రిపూట పోలవరం కుడికాలను తవ్వుకొని యథేచ్ఛగా మట్టిని అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. గురువారం(నవంబర్ 9)  రాత్రి కూడా వైసీపీ మట్టి మాఫియా లారీలు, జేసీబీలతో పోలవరం కుడి కాలువను తవ్వేస్తుంటే.. స్థానిక టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సమాచారం ఇచ్చారు. తన అనుచరులు, గ్రామస్థులతో పోలవరం కాలువ వద్దకు చేరుకున్న చింతమనేని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో మా వాహానాలే ఆపుతారా అంటూ వైసీపీ నాయకులు రెచ్చిపోయి దుర్భాషలాడారు. వైసీపీ మట్టి మాఫియాపై గురువారం అర్ధరాతి అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. దీంతో గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు సహా చింతమనేని తెల్లవారే వరకూ అక్కడే వేచి ఉన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం తొమ్మిది టిప్పర్లు, రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి పెదవేగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. పెదవేగి మండలంలో ఈ అక్రమ తవ్వకాలు ఈనాటివేమీ కాదు. గత ఏడాది జనవరిలోనే పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలను చింతమనేని వెలుగులోకి తెచ్చారు. పగటి సమయంలో మీడియాను తీసుకెళ్లి మట్టి తవ్విన ప్రాంతాలను చూపించారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి నుండి అధికారుల నుండి ఎలాంటి చర్యలూ లేవు. ఈ ఏడాదిన్నరగా తెగ రెచ్చిపోయిన వైసీపీ మట్టి బకాసురులు యథేచ్ఛగా రాత్రిళ్ళు కాలువను తవ్వేస్తున్నారు. స్థానికులు, గ్రామస్థులు ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు ఈ మైనింగ్ మాఫియాకు తెగబడుతున్నాయనీ, ఆ కారణంగానే  అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే  ఇప్పుడు తవ్వకాలు జరుగుతుండగానే చింతమనేని ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి తెలుగుదేశం పట్టుకోవడంతో ఇక తప్పక  అధికారులు  వాహనాలను సీజ్ చేశారని అంటున్నారు.  కాగా  అక్రమ తవ్వకాలను అడ్డుకున్న చింతమనేని, గ్రామస్థులపై వైసీపీ నేతలు తీవ్ర దుర్భాషలకు దిగారు. ఇదంతా మీడియా కవర్ చేస్తున్నా.. వీడియో రికార్డ్ అవుతున్నా లెక్క చేయని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. పెదవేగి మండలంలో అక్రమ తవ్వకాలు,  వైసీపీ నేతల దౌర్జన్యాలు అంటూ చింతమనేని సోషల్ మీడియాలో  ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా.. అది   వైరల్ అయ్యింది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి  పాలనలో వైసీపీ నేతలు ఎంతగా అక్రమాలకు పాల్పడుతున్నారో ఈ వీడియో మరోసారి కళ్లకు కట్టిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు కూడా వెనకాడకుండా బరితెగిండంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి జగన్ పాలన ఇంకానా వద్దు వద్దు అంటున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ డోంట్ నీడ్ జగన్ అంటూ రిటార్డ్ ఇస్తున్నారు.  

ప్రభుత్వ అధికారులతో ఎన్నికల ప్రచారం.. జగన్ కొత్త ఎత్తుగడ!

గడ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం, మా న‌మ్మ‌కం నువ్వే జ‌గ‌న్,  సామాజిక సాధికార బస్సు యాత్ర, వైఏపీ నీడ్స్ జగన్, ఇలా  కార్యక్రమం ఏదైనా  ప్రజా స్పందన లేకపోవడమే ఫలితం అన్నట్లుగా మారింది ఏపీలో అధికార పార్టీ వైసీపీ పరిస్థితి.  మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రజల మధ్యకి వెళ్లేలా వైసీపీ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది.  ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జనం నేతల మొహం మీదనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మా ఇళ్లకు రావద్దని ముఖం మీదే చెప్పేస్తున్నారు. ఇదిగో మీకు ఇంత సంక్షేమం అందించామని నేతలు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మమ్మల్ని పీడించి పీల్చి పిప్పి చేసి వసూళ్లు చేసిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వడం కూడా గొప్పేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. తాకట్టు పెట్టిన ప్రభుత్వ ఆస్తులు, తెచ్చిన అప్పులు, ఆగిపోయిన అభివృద్ధిపై కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో ప్రజల వద్దకు వెళ్లేందుకు  వైసీపీ నేతలకు మొహం చెల్లడం లేదు. కానీ వైసీపీ పెద్దలు మాత్రం తప్పదు ప్రజల వద్దకు వెళ్లాల్సిందే అంటూ రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని మూడు ప్రాంతాలలో వైసీపీ బస్సు యాత్ర నిర్వహిస్తుండగా.. ఈ కార్యక్రమానికి కూడా ప్రజల నుండి వ్యతిరేకత రావడమే కాదు, సొంత పార్టీ కార్యకర్తలే మొహం చాటేస్తున్నారు. దీంతో ఇప్పుడు వైసీపీ మరో ఎత్తుగడ వేస్తున్నది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో ఎన్నికల ప్రచారం చేసేలా ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  వై  ఏపీ నీడ్స్ జగన్ అనే కార్య‌క్ర‌మాన్ని అధికార పార్టీ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే  ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో నడిపిస్తోంది.  గురువారం (నవంబర్ 9) నుండి ఈ కార్య‌క్ర‌మం క్షేత్ర‌స్థాయిలో అన్ని జిల్లాల‌లో మొదలు కాగా.. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత  ఒక్కరూ కనిపించలేదు. ఎక్కడిక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ కార్యక్రమంలో కనిపించారు. కెలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులందరూ ఈ కార్యక్రమంలో పాల్గోవాలని ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తున్నది. ఈ అధికారులంతా ప్రజల వద్దకు వెళ్లి నాలుగున్నరేళ్లలో  వైసీపీ ప్రభుత్వం అందిన సంక్షేమం గురించి ప్రజలకు వివరించనున్నారు. ప్ర‌భుత్వం ఏ కుటుంబానికి ఎంత ఖ‌ర్చు చేసింది? కులాలు, మతాల వారీగా ఎన్ని నిధులు కేటాయించారు?  రానున్న ఆరు నెలలలో ఇంకెత సొమ్ము కేటాయించ‌నుంది? అనే విష‌యాల‌ను అధికారులు ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. లక్ష్యం అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీస్తున్నది.  జగన్ సర్కార్ ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకొనే నిర్ణయం తీసుకోవడంపై మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారిని సీఎం జగన్ మోహన్ రెడ్డి  చివరికి ఒక పార్టీ కార్యకర్తను చేసేశారంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ కార్యక్రమం కోసం జగన్ సర్కార్ రూపొందించిన బ్రోచర్ కూడా వివాదాస్పదమవుతోంది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి 24 పేజీల‌తో ఓ బ్రోచర్ రూపొందించింది జగన్ సర్కార్.  ఈ బ్రోచ‌ర్ రూపొందించేందుకు ప్ర‌భుత్వం రూ.10 కోట్ల‌ పైచిలుకు వ్య‌యం చేసింద‌ని  బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.  దీనిపై ఏపీ బీజేపీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర పెద్దలు కూడా  ఆరా తీస్తున్నారని చెబుతున్నారు.  ఒకవైపు ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం, ఒక్క బ్రోచర్ డిజైన్ కోసమే రూ.10 కోట్ల ఖర్చు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో దుమారం రేపుతోంది. గతంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాగే అధికారులను ఇష్టారాజ్యంగా వాడుకున్నాయి.  బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో మొదట ఈ తరహా ఫార్ములా అవలంబించగా.. ఇప్పుడు ఏపీలో వైసీపీ కూడా అదే ఫార్ములాను నమ్ముకున్నట్లు కనిపిస్తుంది. అయితే, ఇప్పటికే ఎంతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీపీ ఇప్పుడు అధికారులతో ఎన్నికల ప్రచారంతో మరింత వ్యతిరేకతను పొందడం ఖాయంగా కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విపక్షాలకు ఇది కూడా ఒక అస్త్రం కాబోతుందని అంటున్నారు. 

చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ విచారణ 15కు వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు  బెయిల్ పిటిషన్‌  పై విచారణకు ఏపీ హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది.  ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరికీ ఇప్పటికే న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేశాయి. ఒక్క చంద్రబాబు బెయిలు విషయంలోనే న్యాయస్థానాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. శుక్రవారం కూడా ఈ పిటిషన్ విచారణకు రాగా హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. ఇటీవల చంద్రబాబుకు హెల్త్ గ్రౌండ్స్ పై నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరైన సంగతి విదితమే. అయితే రెగ్యులర్ బెయిలుపై మాత్రం హైకోర్టు ఇంకా నిర్ణయం వెలవరించలేదు.  అంతే కాకుండా స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయ్యింది. సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు కనుక ఆ తరువాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తే.. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న కేసులన్నిటిలోనూ ఉరట లభించినట్లే అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిలు పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తున్నదని న్యాయనిపుణులు చెబుతున్నారు.  ఇక సుప్రీం కోర్టు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసినప్పటికీ దానిని వెలువరించడంలో జాప్యానికి సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న భరత్ భూషణ్ కేసే కారణమని అభిప్రాయపడుతున్నారు. సెక్షన్ 17ఏను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది భరత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందనీ, ఆ కేసులో సుప్రీం తీర్పు దీపావళి సెలవుల అనంతరం వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. మొత్తం మీద స్కిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేయగా.. ఒక్క చంద్రబాబు విషయంలోనే బెయిలు మంజూరు కాకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది.  మొత్తం మీద స్కిల్ కేసు సహా చంద్రబాబు పై ఏపీ సర్కార్ నమోదు చేసిన అన్ని కేసులూ సుప్రీం తీర్పుతో తెలిపోతాయన్న అభిప్రాయమే న్యాయ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది. 

బీజేపీ ఫైనల్ లిస్ట్ ఇదే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను బీజేపీ విడుదల చేసింది.  14 మందితో కూడిన తుది జాబితాను శుక్రవారం (నవంబర్ 10) ఉదయం అధిష్టానం ప్రకటించింది. నామినేషన్ల గడువు అదే తేదీతో ముగియనున్న సంగతి విదితమే.  ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇప్పటి  వరకూ పెండింగ్ లో పెట్టిన స్థానాలలో అభ్యర్థులను ప్రకటించింది. బెల్లంపల్లి నుంచి కోయెల ఎమాజీ, పెద్దపల్లి నుంచి దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి నుంచి డి. రాజేశ్వరరావులను బీజేపీ అభ్యర్థులుగా ప్రకటించింది. అలాగే మేడ్చల్ నుంచి ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్ గిరి అభ్యర్థిగా రామచంద్రరావు, శేరిలింగంపల్లి క్యాండెట్ గా రవికుమార్ యాదవ్ లను ప్రకటించింది. నాంపల్లి నియేజకవర్గానికి రాహుల్ చంద్రా, కంటోన్మెంట్ కు  గణేష్ నారాయణ్, దేవరకద్ర నుంచి కొండా ప్రతాప్ రెడ్డిలను అభ్యర్థులు గా ప్రకటించింది. అలాగే నర్సంపెట్ కు పుల్లారావు, వనపర్తి నియోజకవర్గానికి అనూగ్నారెడ్డి, అలంపూర్ కు మీరమ్మ, చాంద్రాయణ గుట్ట నుంచి కే. మహేందర్ బీజేపీ అభ్యర్థులుగా రంగంలో నిలుస్తారని బీజేపీ పేర్కొంది.  

కారు పార్టీ అధినేతకు కారే లేదు.. కేసీఆర్ ఆస్తులివే!

తెలంగాణ ముఖ్యమంత్రి, ఎన్నికల గుర్తే కారుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సొంత కారు కూడా లేదు. ఈ విషయం ఆయన తాజాగా సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తమది వ్యవసాయ కుటుంబం అనీ, తాను రైతుననీ, తన ఫామ్ హౌస్ లో సాగు చేసి కోట్ల ఆదాయం సంపాదించాననీ చెప్పుకున్న ఆయన పేరు మీద సెంటు భూమి కూడా లేదు. ఇది కూడా ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ పేర్కొంది.   ఉన్న భూములన్నీ కుటుంబ ఉమ్మడి ఆస్తులుగానే ఉన్నాయని ఆయన అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే గడచిన ఐదేళ్లలో కేసీఆర్ బ్యాంకు డిపాజిట్లు మాత్రం రెట్టింపయ్యాయి.  2018 డిసెంబరు అంటే గత ఎన్నికల సమయానికి ఆయనకు బ్యాంకులో ఉన్న డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలు కలిపి మొత్తం 5 కోట్ల 63 లక్షల రూపాయలు ఉంటే.. ఇప్పుడు అంటే 2023 నవంబర్ నాటికి  బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ కలిపి   రూ. 11.16 కోట్లకు పెరిగాయి. ఇక ఆయన సతీమణి  శోభ కు గతంలో  సుమారు రూ.94 వేలు ఉన్న డిపాజిట్లు ఇప్పుడు  రూ. 6.29 కోట్లకు పెరిగాయి. ఇక బంగారు ఆభరణాలు  2.8 కిలోలు ఉన్నట్లు తాజాగా సమర్పించిన అఫిడవిట్‌లో కేసీఆర్ పేర్కొన్నారు. తాను పెదకాపుననీ, రైతుననీ, వ్యవసాయం చేస్తున్నాననీ చెప్పే కేసీఆర్ పేరు మీద సెంటు భూమి కూడా లేదు. ఉన్నదంతా కుటుంబ ఉమ్మడి ఆస్తే.. అయితే  ఇటీవల అంటే ఈ ఏడాది జూలైలో   మర్కూక్ మండలం వెంకటాపురం గ్రామంలో  పది ఎకరాల సాగుభూమిని కేసీఆర్ కొన్నారు. దీని విలువ సుమారు రూ. 28.47 లక్షలుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. స్థిర, చరాస్తుల రూపంలో కేసీఆర్‌కు రూ. 17.83 కోట్లు, 9.67 కోట్ల చొప్పున ఉంటే ఆయన భార్య పేరు మీద 7.78 కోట్ల చరాస్తులు మాత్రమేఉన్నాయి. ఉమ్మడి ఆస్తిగా రూ. 9.81 కోట్ల మేర చరాస్తులు ఉన్నాయి. ఇక అప్పుల విషయం చూస్తే కేసీఆర్ పేరు మీద రూ. 17.27 కోట్లు, కుటుంబం పేరు మీద రూ. 7.23 కోట్ల మేర ఉన్నాయి. సొంతంగా కారు, బైక్ లేకపోయినా ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, జేసీబీ తదితర 14 వాహనాలున్నాయి. వీటి విలువ రూ. 1.16 కోట్లుగా తేలింది. మొత్తంగా కేసీఆర్ కుటుంబానికి 53.30 ఎకరాల సాగుభూములు, 9.36 ఎకరాల మేర వ్యవసాయేతర భూములున్నాయిని ఆయన తన తాజా అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

ప్రభంజనం.. దద్దోజనం!

తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అన్నాడో సినీ కవి. కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనదని అందామన్నా.. అనుకుందామన్నా మనస్సు మాత్రం ఒప్పుకోవడం లేదని  తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టి పీడించి రెండేళ్ల పాటు దశల వారిగా కొన్ని కోట్ల మంది జీవితాలను పుట్టి ముంచితే.. తెలుగు జాతికి మాత్రం ఏం తెగులు పుట్టిందో ఏమో కానీ పోరాట పటిమను మరిచిపోయిందనే ఓ సంశయాన్ని సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాగాణి భూముల్లో ధాన్యం రాశులు, నీటి ప్రాజెక్టుల్లో జల సిరులతో.. ఇంకా చెప్పాలంటే.. అష్టలక్ష్ములు తమ రెండు హస్తాల్లో నిండు కుండలతో కళ కళలాడుతోండేవని.. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత.. ఈ తెలుగు రాష్ట్రాలపై జేష్ట్యాదేవి చూపు సోకి.. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయని.. దీంతో అభివృద్ధి అనేది లేక ఆయా రాష్ట్రాలు అధ:పాతాళంలోకి జారి పోయాయనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. రేపో మాపో ఆ సంస్థ  ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. విశాఖ వేదికగా చేపట్టిన.. ఆందోళనలు, నిరసనలు నవంబర్ 8 తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకొన్నాయి. విశాఖ ఉక్కు - ఆంధ్రల హక్కు అనే నినాదంతో 32 మంది ఆత్మ బలిదానాలతో తెచ్చుకొన్న ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతో మంది జీవితాలతో పెన వేసుకొని పోయిందని.. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వాడి సంకల్పం ఉక్కు అని ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశానికి తేటతెల్లమైందని.. అలాంటి సంస్థను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కానీ.. ప్రజా ప్రతినిధులు కానీ ఏ మాత్రం ఊలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడాన్ని చూస్తేంటే.. వాళ్లని చూసి ప్రజలు సిగ్గుపడాలా? లేకుంటే.. మన నాయకులు ఇలాంటి వాళ్లని తలదించుకోవాలా?  అర్థం కాకుండా ఉందనే వారు పేర్కొంటున్నారు.     ఇక రాష్ట్ర విభజన జరిగి మరికొద్ది రోజులకు దశాబ్దం పూర్తి కావొస్తోందని... విభజన బిల్లులో పొందుపరిచిన అన్ని హామీలు అమలు అయ్యాయా.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందా? రాష్ట్రానికి రాజధాని లేక.. పరిశ్రమలు రాక.. ఉద్యోగాలు లేక.. రాష్ట్రవ్యాప్తంగా గాండాంధకారం అలుముకోవడంతో.. తాను బతకడం కోసం.. తమ వారిని బతికించకోవడం కోసం నిలువెత్తు నిటారుతో కదులుతోన్న వెన్నుముక జీవులు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు.. పడుతున్నారు. ఇక విడిపోయి.. వెలిగిపోతామంటూ తెచ్చుకొన్న తెలంగాణ   రాష్ట్రం సైతం అన్ని విధాలా పాలన చేతకానీ పాలకులతో నిండా మునిపోయింది. ధనిక రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అంటూ జబ్బలు చరుచుకొన్న నేతలు.. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ.. తెలంగాణను అప్పుల ఊబిలో  నిలువునా ముంచేశారని తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు సోదాహరణగా వివరిస్తున్నారు.   తెలుగు రాష్ట్రాల్లో అధికారమనే అందలమెక్కిన పాలకులు.. ప్రజా క్షేమం కోసం పాటు పడకుండా.. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో.. వారు కట్టిన పన్నులనే వారికి పైసల రూపంలో విదిల్చి.. కుర్చి ఎక్కిన ఎలికలు మాత్రం ప్రజల పన్నులతో సర్వ భోగాలను అనుభవిస్తున్నారు. పాలకులు చేస్తున్న.. చేయిస్తున్న అరాచకాలు, అక్రమాలన్నీ తెలిసినా ప్రజలు మాత్రం.. ప్రశ్నించే గుణాన్ని కోల్పోయి.. పాలకుల దయా.. మన ప్రాప్తం అన్న చందంగా మసులుకొవడం చూస్తుంటే.. ప్రభంజనంలా ఉవ్వెత్తున ఎగసిపడాల్సిన జనం.. దద్దోజనంలాగా ముద్దగా ఇంకా చెప్పాలంటే అన్ని అవయువాలు దివ్యంగా పని చేస్తూ కూడా దివ్యాంగుల్లా ఉండిపోతున్నారనే అభిప్రాయం సైతం సదరు ప్రముఖుల్లో వ్యక్తమవుతోంది.  గతంలో తమకు అన్యాయం జరిగితే.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పది పైసలు పెంచినా, కరెంట్ చార్జీలు పెంచినా.. రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతంలో అత్యాచారం జరిగినా.. పాలకుల అవినీతి అక్రమాలు బహిర్గతమైనా... ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, పార్టీల శ్రేణులు, ప్రజా సంఘాలు, సమాజ హితం కాంక్షించే వారు రోడ్ల పైకి దూసుకొచ్చి.. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తమదైన శైలిలో చేసి.. వారి నిరసనను ప్రభుత్వాలకు తెలిపేవారు. కానీ నేడు ఆ పరిస్థితి.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎక్కడా కానరావడం లేదని వారు వాపోతున్నారు. తెలుగు ప్రజల్లో గతంలో ఉన్న ఉక్కు సంకల్పం కాస్తా..  తుక్కు సంకల్పమైపోయిందని.. దీంతో ప్రశ్నించడం, పోరాడడం వంటి గుణాల్ని వారు కోల్పోయారని.. తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు వివరిస్తున్నారు.

కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్.. మామూలుగా లేదుగా?!

తెలంగాణ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు సల్మాన్ ఖుర్షీద్, ఇమ్రాన్ ప్రతాప్, నాసిర్ హుస్సేన్ చేతుల మీదుగా గురువారం(నవంబర్9) మైనార్టీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే మైనార్టీల ఆర్ధిక అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను ఆ డిక్లరేషన్ లో పొందుపరిచింది.   ఇప్పటికే రైతు, యువ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పుడు తాజాగా ప్రకటించిన మైనారిటీ డిక్లరేషన్ లో మైనారిటీల అభ్యున్నతి కోసం పలు కార్యక్రమాలు పొందుపరిచింది.   ఉద్యోగాలు, విద్య, సంక్షేమ పథకాలలో మైనారిటీలతో సహా అన్ని వెనుకబడిన తరగతులకు న్యాయమైన రిజర్వేషన్లు,  మైనారిటీల సంక్షేమ బడ్జెట్‌  రూ.4,000 కోట్లకు  పెంపు, అలాగే  మైనారిటీల కోసం ప్రత్యేక  సబ్ ప్లాన్,  నిరుద్యోగ మైనార్టీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించడానికి  ఏడాదికి వెయ్యి కోట్లు,  విద్య మరియు ఉపాధి ఈక్విటీకి నిబద్ధత వంటి అంశాలను మైనారిటీ డిక్లరేషన్ లో పొందుపరిచింది. అలాగే అబ్బుల్ కలా తౌఫా ఏ తలీం పథకం కింద ఎంఫిల్ పూర్తి చేసిన మైనారిటీ యువతకు ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం,  పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత రూ.1 లక్ష, గ్రాడ్యుయేషన్‌కు రూ.25,000, ఇంటర్మీడియట్‌కు రూ.15,000/- మరియు 10వ తరగతికి రూ.10,000 సాయం, తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్‌ని స్థాపించి, మైనారిటీ సంస్థలలో ఖాళీలను భర్తీ, ఉర్దూ మీడియం ఉపాధ్యాయుల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ,  మతపరమైన హక్కులు, సంస్కృతి రక్షణ ఇమామ్‌లు, మ్యూజిన్‌లు, ఖాదీమ్‌లు, పాస్టర్‌లు మరియు గ్రంథిలతో సహా అన్ని మతాల పూజారులకు పదివేల రూపాయల నుంచి 12 వేల రూపాయల వరకూ గౌరవ వేతనం, వక్ఫ్ బోర్డు భూములు, ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్, ఆక్రమణకు గురైన ఆస్తుల రికవరీ, ముస్లిం మరియు క్రిస్టియన్ శ్మశాన వాటికల కోసం భూమి,  ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ఇళ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు,  మైనారిటీలకు చెందిన కొత్తగా పెళ్లైన జంటలకు లక్షా 60వేల రూపాయల ఆర్థిక సాయం,  సహాయం, సెట్విన్నైపుణ్యాభివృద్ధి శిక్షణ పునరుద్ధరణ, పాత బస్తీలో మౌలిక సదుపాయాల  అభివృద్ధి చేయడానికి కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు వంటి హామీలను కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్ లో పొందుపరిచింది. 

అద్దంకి దయాకర్ కు హస్తం హ్యాండ్!

అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ హ్యాండ్ ఇచ్చింది.  తుంగతుర్తి నుంచి పార్టీ టికెట్ ఆశించిన ఆయనకు రిక్త హస్తం చూపింది. గురువారం రాత్రి విడుదలైన కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితాలో తుంగతుర్తి నుంచి మందుల శామ్మూల్ కు టికెట్ లభించింది. మొత్తం మీద నామినేషన్ల దాఖలు గడువు ముగియడానికి ఒక రోజు ముందు తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఐదుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను గురువారం(నవంబర్9) రాత్రి అధిష్టానం విడుదల చేసింది. తుంగతుర్తి నుంచి మందుల సామేలు, పటాన్ చెరు అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్, చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్, మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, సూర్యాపేట అభ్యర్థిగా దామోదర్ రెడ్డిలకు టికెట్ ఖరారు చేసింది.     ఇప్పటికే పటాన్ చెరు నియోజకవర్గం నీలం మధు ముదిరాజ్‌కు కేటాయించిన కాంగ్రెస్ అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది. తుది జాబితాలో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా కాట శ్రీనివాస్ గౌడ్‌ను ఫైనల్ చేసింది. దీనిపై మధు, ఆయన అనుచరులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇంతకాలం తనకు టికెట్ వస్తుందని భావించిన తుంగతుర్తి నియోజకవర్గ నేత అద్దంకి దయాకర్‌కు హైకమాండ్ హ్యాండ్ ఇచ్చింది. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా మందుల శ్యామ్యూల్‌ను ఖరారు చేసింది. దీంతో అద్దంకి దయాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

నామినేషన్ ప్రక్రియలో  అపశృతి...  మంత్రి కెటీఆర్ కు స్వల్పగాయాలు 

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ప్రక్రియలో  అపశ్రుతి చోటు చేసుకుంది.  వాహనంపై నిల్చున్న మంత్రి కెటీఆర్ వెంటే ఆర్మూర్ బిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎంపీ సురేష్ రెడ్డి ఉన్నారు. వీళ్లు  ప్రజలకు అభివాదం  చేస్తున్న సమయంలో    డ్రైవర్ సడన్ బ్రేక్ వేసాడు.  ఎన్నికల ప్రచార వాహనం రెయిలింగ్ కూలి బీఆర్ఎస్ ఆర్మూర్ అభ్యర్థి జీవన్ రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేశ్ రెడ్డి తదితరులు వాహనం పైనుంచి కిందపడ్డారు. దీంతో కేటీఆర్‌కు స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. ప్రచార వాహనంపై ఉన్న రెయిలింగ్ ఆనుకుని బిఆర్ఎస్ నేతలు నిల్చోవడంతో బరువు  ఎక్కువై రెయిలింగ్ విరిగిపోయింది. దీంతో ఒక్కసారిగా బిఆర్ఎస్ నేతలు పడిపోయారు. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది.  ఆ వాహనం స్పీడ్ గా ముందుకు వెళ్తోంది. ఇంతలో అక్కడ కరెంటు తీగ అడ్డుగా ఉండటంతో వారి వాహనానికి ముందు ఉన్న వాహనాన్ని సడన్ గా ఆపివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.