పేట్రేగిపోతున్న వైసీపీ బకాసురులు! ;పోలవరం కాల్వనే తవ్వేస్తూ మట్టిదందా!
posted on Nov 10, 2023 @ 1:30PM
ఏపీలో అధికార వైసీపీ నేతల అక్రమాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అక్రమ రిజిస్ట్రేషన్ల స్కాం ను స్వయంగా వైసీపీ నేతే బయటపెట్టగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పదిమందిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లే కాదు.. అక్రమ మైనింగ్, అక్రమ ఇసుక రవాణా, అక్రమంగా మట్టి తవ్వకాలు, అనుమతులు లేకుండానే కొండలను పిండిచేసి తవ్వేయడం ఇలా ఎన్నో అక్రమాలు వైసీపీ సర్కార్ అండతో వైసీపీ నేతలు పాల్పడుతున్న సంఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు వైసీపీ నేతల చీకటి వ్యాపారం మరొకటి వెలుగులోకి వచ్చింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు రాత్రికి రాత్రి పోలవరం కుడికాలువను తవ్వుకొని మట్టి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న వైనాన్ని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ తన అనుచరులతో కలిసి బట్టబయలు చేశారు. దెందులూరు నియోజకవర్గంలో పలు చోట్ల రాత్రయితే చాలు వైసీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో చీకటి వ్యాపారం మొదలవుతుందన్న ఆరోపణలున్నాయి. ప్రతి రోజూ రాత్రి 10 గంటల తర్వాత మొదలయ్యే ఈ అక్రమ మైనింగ్ వ్యవహారం ఉదయం 6 గంటల వరకూ సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ చీకటి వ్యాపారంలో భాగంగానే గత కొంత కాలంగా పెదవేగి మండలంలో పలు చోట్ల రాత్రిపూట పోలవరం కుడికాలను తవ్వుకొని యథేచ్ఛగా మట్టిని అమ్ముకుంటున్నారని చెబుతున్నారు. గురువారం(నవంబర్ 9) రాత్రి కూడా వైసీపీ మట్టి మాఫియా లారీలు, జేసీబీలతో పోలవరం కుడి కాలువను తవ్వేస్తుంటే.. స్థానిక టీడీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి సమాచారం ఇచ్చారు. తన అనుచరులు, గ్రామస్థులతో పోలవరం కాలువ వద్దకు చేరుకున్న చింతమనేని తవ్వకాలను అడ్డుకున్నారు. దీంతో మా వాహానాలే ఆపుతారా అంటూ వైసీపీ నాయకులు రెచ్చిపోయి దుర్భాషలాడారు. వైసీపీ మట్టి మాఫియాపై గురువారం అర్ధరాతి అధికారులకు పోలీసులకు సమాచారం ఇచ్చినా వారు స్పందించలేదు. దీంతో గ్రామస్థులు, టీడీపీ కార్యకర్తలు సహా చింతమనేని తెల్లవారే వరకూ అక్కడే వేచి ఉన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక రెవిన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం తొమ్మిది టిప్పర్లు, రెండు జేసీబీలు, రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి పెదవేగి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
పెదవేగి మండలంలో ఈ అక్రమ తవ్వకాలు ఈనాటివేమీ కాదు. గత ఏడాది జనవరిలోనే పోలవరం కుడి కాలువ అక్రమ తవ్వకాలను చింతమనేని వెలుగులోకి తెచ్చారు. పగటి సమయంలో మీడియాను తీసుకెళ్లి మట్టి తవ్విన ప్రాంతాలను చూపించారు. అక్రమ తవ్వకాలపై రెవెన్యూ అధికారులు, పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కానీ అప్పటి నుండి అధికారుల నుండి ఎలాంటి చర్యలూ లేవు. ఈ ఏడాదిన్నరగా తెగ రెచ్చిపోయిన వైసీపీ మట్టి బకాసురులు యథేచ్ఛగా రాత్రిళ్ళు కాలువను తవ్వేస్తున్నారు. స్థానికులు, గ్రామస్థులు ఇదే విషయంపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలోనే వైసీపీ నేతలు ఈ మైనింగ్ మాఫియాకు తెగబడుతున్నాయనీ, ఆ కారణంగానే అధికారులు, పోలీసులు ఈ వ్యవహారాన్ని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారని స్థానికులు అంటున్నారు. అయితే ఇప్పుడు తవ్వకాలు జరుగుతుండగానే చింతమనేని ఆధ్వర్యంలో గ్రామస్థులతో కలిసి తెలుగుదేశం పట్టుకోవడంతో ఇక తప్పక అధికారులు వాహనాలను సీజ్ చేశారని అంటున్నారు.
కాగా అక్రమ తవ్వకాలను అడ్డుకున్న చింతమనేని, గ్రామస్థులపై వైసీపీ నేతలు తీవ్ర దుర్భాషలకు దిగారు. ఇదంతా మీడియా కవర్ చేస్తున్నా.. వీడియో రికార్డ్ అవుతున్నా లెక్క చేయని వైసీపీ నేతలు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. పెదవేగి మండలంలో అక్రమ తవ్వకాలు, వైసీపీ నేతల దౌర్జన్యాలు అంటూ చింతమనేని సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి పాలనలో వైసీపీ నేతలు ఎంతగా అక్రమాలకు పాల్పడుతున్నారో ఈ వీడియో మరోసారి కళ్లకు కట్టిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. అలాగే యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు కూడా వెనకాడకుండా బరితెగిండంపై ప్రజలు విస్తుపోతున్నారు. ఇలాంటి జగన్ పాలన ఇంకానా వద్దు వద్దు అంటున్నారు. వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ వైసీపీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ డోంట్ నీడ్ జగన్ అంటూ రిటార్డ్ ఇస్తున్నారు.