పులివెందులలో జగన్ కు పరాభవం!?.. రోడ్లు కావాలి.. మా గోడు వినాలి అంటూ జనం నినాదాలు!
posted on Nov 10, 2023 @ 2:40PM
వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న పులివెందులలో ఆయనకు నిరసన సెగ తగింది. కంచుకోటలాంటి పులివెందులలోనే ఆయన జనానికి ఎదురుపడలేక ముఖం చాటేశారు. రోడ్లు కావాలి, మా సమస్యలు వినాలి అని జనం నినాదాలు చేస్తుంటే జగన్ మాత్రం తన షిక్కటి చిరునవ్వును చెరగనీయకుండా దూరం నుంచే వారికి దండం పెట్టి వెళ్లిపోయారు. ఈ సంఘటన శుక్రవారం(నవంబర్ 10) పులివెందులలో జగన్ పర్యటన సందర్భంగా చోటు చేసుకుంది. దీంతో పులివెందులలో జగన్ కోటలు బీటలు వారుతున్నాయా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరందుకుంది. తన సొంత నియోజకవర్గంలో జగన్ పట్టు కోల్పోతున్నారా? ఇంత కాలం బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలు ఇక ఆయనను నిలదీయడానికి సిద్ధమైపోయారా అంటే పరిశీలకుల నుంచి ఔననే సమాధానం వస్తున్నది. సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్ తన పట్టు, ప్రతిష్ట కోల్పోతున్నారా అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. కాగా పులివెందులలో జగన్ పట్టు కోల్పోతున్నారని తెలుగువన్ ఎనిమిది నెలల కిందటే చెప్పింది. జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకా దారుణ హత్యకు గురై ఈ ఏడాది మార్చి 15కు సరిగ్గా నాలుగేళ్లు అయ్యింది. ఆ సందర్భంగా వివేకా కుమార్తె డాక్టర్ సునీత పులివెందుల్లోని తండ్రి సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరన్న దానిపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన వివేకా వర్థంతి కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన వారు కొందరు హాజరయ్యారు. అంతే కాదు వైయస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందులో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
ఆ ఫ్లెక్సీల్లో వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన భార్య విజయమ్మ, వారి కుమార్తె షర్మిల, వివేకా కుమార్తె సునీతతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు వైయస్ రాజారెడ్డి దంపతుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ఆ ఫ్లెక్సీలలో ఎక్కడా ముఖ్యమంత్రి జగన్ ఫొటో కనిపించలేదు. అదొకటి అలా ఉంటే ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార వైసీపీ అభ్యర్థికి ఇక్కడ అతి తక్కువ ఓట్లు పోల్ కావడం కూడా పులివెందులపై జగన్ పట్టు జారిపోయిందనడానికి నిదర్శనంగా పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పుడు పులివెందులలో జగన్ పర్యటన సందర్భంగా జనం సమస్యలపై గళమెత్తడం, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, జగన్ దండం పెట్టి వెళ్లిపోవడం చూస్తుంటే.. పులివెందులతో జగన్ పట్టు జారిపోతోందనే అనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.