ప్రభంజనం.. దద్దోజనం!
posted on Nov 10, 2023 8:37AM
తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అన్నాడో సినీ కవి. కానీ రాష్ట్ర విభజన అనంతరం తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనదని అందామన్నా.. అనుకుందామన్నా మనస్సు మాత్రం ఒప్పుకోవడం లేదని తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచానికి కరోనా వైరస్ పట్టి పీడించి రెండేళ్ల పాటు దశల వారిగా కొన్ని కోట్ల మంది జీవితాలను పుట్టి ముంచితే.. తెలుగు జాతికి మాత్రం ఏం తెగులు పుట్టిందో ఏమో కానీ పోరాట పటిమను మరిచిపోయిందనే ఓ సంశయాన్ని సైతం వారు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాగాణి భూముల్లో ధాన్యం రాశులు, నీటి ప్రాజెక్టుల్లో జల సిరులతో.. ఇంకా చెప్పాలంటే.. అష్టలక్ష్ములు తమ రెండు హస్తాల్లో నిండు కుండలతో కళ కళలాడుతోండేవని.. కానీ రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత.. ఈ తెలుగు రాష్ట్రాలపై జేష్ట్యాదేవి చూపు సోకి.. దరిద్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాయని.. దీంతో అభివృద్ధి అనేది లేక ఆయా రాష్ట్రాలు అధ:పాతాళంలోకి జారి పోయాయనీ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. రేపో మాపో ఆ సంస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోనుంది. ఈ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. విశాఖ వేదికగా చేపట్టిన.. ఆందోళనలు, నిరసనలు నవంబర్ 8 తేదీతో వెయ్యి రోజులు పూర్తి చేసుకొన్నాయి. విశాఖ ఉక్కు - ఆంధ్రల హక్కు అనే నినాదంతో 32 మంది ఆత్మ బలిదానాలతో తెచ్చుకొన్న ఈ విశాఖ ఉక్కు పరిశ్రమ ఎంతో మంది జీవితాలతో పెన వేసుకొని పోయిందని.. ఇంకా చెప్పాలంటే.. తెలుగు వాడి సంకల్పం ఉక్కు అని ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా దేశానికి తేటతెల్లమైందని.. అలాంటి సంస్థను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం కానీ.. ప్రజా ప్రతినిధులు కానీ ఏ మాత్రం ఊలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడాన్ని చూస్తేంటే.. వాళ్లని చూసి ప్రజలు సిగ్గుపడాలా? లేకుంటే.. మన నాయకులు ఇలాంటి వాళ్లని తలదించుకోవాలా? అర్థం కాకుండా ఉందనే వారు పేర్కొంటున్నారు.
ఇక రాష్ట్ర విభజన జరిగి మరికొద్ది రోజులకు దశాబ్దం పూర్తి కావొస్తోందని... విభజన బిల్లులో పొందుపరిచిన అన్ని హామీలు అమలు అయ్యాయా.. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందా? రాష్ట్రానికి రాజధాని లేక.. పరిశ్రమలు రాక.. ఉద్యోగాలు లేక.. రాష్ట్రవ్యాప్తంగా గాండాంధకారం అలుముకోవడంతో.. తాను బతకడం కోసం.. తమ వారిని బతికించకోవడం కోసం నిలువెత్తు నిటారుతో కదులుతోన్న వెన్నుముక జీవులు ఇతర ప్రాంతాలకు వలస బాట పట్టారు.. పడుతున్నారు.
ఇక విడిపోయి.. వెలిగిపోతామంటూ తెచ్చుకొన్న తెలంగాణ రాష్ట్రం సైతం అన్ని విధాలా పాలన చేతకానీ పాలకులతో నిండా మునిపోయింది. ధనిక రాష్ట్రం.. ధనిక రాష్ట్రం అంటూ జబ్బలు చరుచుకొన్న నేతలు.. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల వేళ.. తెలంగాణను అప్పుల ఊబిలో నిలువునా ముంచేశారని తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు సోదాహరణగా వివరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అధికారమనే అందలమెక్కిన పాలకులు.. ప్రజా క్షేమం కోసం పాటు పడకుండా.. ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో.. వారు కట్టిన పన్నులనే వారికి పైసల రూపంలో విదిల్చి.. కుర్చి ఎక్కిన ఎలికలు మాత్రం ప్రజల పన్నులతో సర్వ భోగాలను అనుభవిస్తున్నారు. పాలకులు చేస్తున్న.. చేయిస్తున్న అరాచకాలు, అక్రమాలన్నీ తెలిసినా ప్రజలు మాత్రం.. ప్రశ్నించే గుణాన్ని కోల్పోయి.. పాలకుల దయా.. మన ప్రాప్తం అన్న చందంగా మసులుకొవడం చూస్తుంటే.. ప్రభంజనంలా ఉవ్వెత్తున ఎగసిపడాల్సిన జనం.. దద్దోజనంలాగా ముద్దగా ఇంకా చెప్పాలంటే అన్ని అవయువాలు దివ్యంగా పని చేస్తూ కూడా దివ్యాంగుల్లా ఉండిపోతున్నారనే అభిప్రాయం సైతం సదరు ప్రముఖుల్లో వ్యక్తమవుతోంది.
గతంలో తమకు అన్యాయం జరిగితే.. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పది పైసలు పెంచినా, కరెంట్ చార్జీలు పెంచినా.. రాష్ట్రంలో ఏ మారు మూల ప్రాంతంలో అత్యాచారం జరిగినా.. పాలకుల అవినీతి అక్రమాలు బహిర్గతమైనా... ప్రతిపక్ష రాజకీయ పార్టీల నేతలు, పార్టీల శ్రేణులు, ప్రజా సంఘాలు, సమాజ హితం కాంక్షించే వారు రోడ్ల పైకి దూసుకొచ్చి.. ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు తమదైన శైలిలో చేసి.. వారి నిరసనను ప్రభుత్వాలకు తెలిపేవారు. కానీ నేడు ఆ పరిస్థితి.. భూతద్దం పెట్టి వెతికినా.. ఎక్కడా కానరావడం లేదని వారు వాపోతున్నారు. తెలుగు ప్రజల్లో గతంలో ఉన్న ఉక్కు సంకల్పం కాస్తా.. తుక్కు సంకల్పమైపోయిందని.. దీంతో ప్రశ్నించడం, పోరాడడం వంటి గుణాల్ని వారు కోల్పోయారని.. తెలుగు సమాజ హితాన్ని కాంక్షించే వారు వివరిస్తున్నారు.