చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ 15కు వాయిదా
posted on Nov 10, 2023 @ 10:16AM
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ పై విచారణకు ఏపీ హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరికీ ఇప్పటికే న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేశాయి. ఒక్క చంద్రబాబు బెయిలు విషయంలోనే న్యాయస్థానాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. శుక్రవారం కూడా ఈ పిటిషన్ విచారణకు రాగా హైకోర్టు ఈ నెల 15కు వాయిదా వేసింది. ఇటీవల చంద్రబాబుకు హెల్త్ గ్రౌండ్స్ పై నాలుగు వారాల మధ్యంతర బెయిలు మంజూరైన సంగతి విదితమే. అయితే రెగ్యులర్ బెయిలుపై మాత్రం హైకోర్టు ఇంకా నిర్ణయం వెలవరించలేదు.
అంతే కాకుండా స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ అయ్యింది. సుప్రీం కోర్టుకు దీపావళి సెలవులు కనుక ఆ తరువాత తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఒక వేళ సర్వోన్నత న్యాయస్థానం చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను అనుమతిస్తే.. ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న కేసులన్నిటిలోనూ ఉరట లభించినట్లే అవుతుంది.
ఈ నేపథ్యంలోనే ఆయన బెయిలు పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేస్తున్నదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక సుప్రీం కోర్టు కూడా చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసినప్పటికీ దానిని వెలువరించడంలో జాప్యానికి సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న భరత్ భూషణ్ కేసే కారణమని అభిప్రాయపడుతున్నారు.
సెక్షన్ 17ఏను రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది భరత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోందనీ, ఆ కేసులో సుప్రీం తీర్పు దీపావళి సెలవుల అనంతరం వచ్చే అవకాశం ఉందనీ అంటున్నారు. మొత్తం మీద స్కిల్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరినీ న్యాయస్థానాలు బెయిలు మంజూరు చేయగా.. ఒక్క చంద్రబాబు విషయంలోనే బెయిలు మంజూరు కాకపోవడం ఉత్కంఠకు దారి తీస్తోంది. మొత్తం మీద స్కిల్ కేసు సహా చంద్రబాబు పై ఏపీ సర్కార్ నమోదు చేసిన అన్ని కేసులూ సుప్రీం తీర్పుతో తెలిపోతాయన్న అభిప్రాయమే న్యాయ నిపుణుల నుంచి వ్యక్తం అవుతోంది.