హైదరాబాద్‌లో యువకుడి గొంతు కోసిన చైనా మాంజా
హైదరాబాద్‌లో చైనా మాంజా వాడకం వల్ల ఏర్పడుతున్న ప్రాణాంతక ప్రమాదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. చైనా మాంజా గొంతుకు చుట్టుకోవడంతో ఒక మైనర్ బాలుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ఘటనలో బాలుడి గొంతు పాక్షికంగా తెగిపోగా, వైద్యులు అత్యవసరంగా 22 కుట్లు వేసి ప్రాణాలను కాపాడారు. తీవ్ర రక్తస్రావం, ప్రాణాంతక పరిస్థితుల్లో చికిత్స పొందిన బాలుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే, హెచ్చరికలు మరియు చర్యలు కొనసాగుతు న్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమ తయారీ, అమ్మకాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు నా బిడ్డ మెడకు ప్రమాదం జరిగింది. రేపు అది మీది కావచ్చు. మీ పిల్లలు కూడా ఇదే నగరంలో, ఇదే రోడ్లపై నడుస్తున్నారు. చైనా మాంజాను కొనుగోలు చేసే వారికీ బాధ్యత ఉందని, అక్రమ వ్యాపారానికి డిమాండ్ పెంచుతున్నది వినియోగదారులేనని వారు స్పష్టం చేశారు.“కేవలం వినోదం కోసం అమాయకుల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మానవ ప్రాణాలకంటే ఆ వినోదం విలువైనదా?” అని బాలుడి తల్లిదండ్రులు ప్రశ్నించారు.
ఈ వ్యాపారం హరామ్ మరియు చట్టవిరుద్ధమని పేర్కొంటూ, పౌరులు ఎవరూ ఇలాంటి ప్రమాదకర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. మీరు నిజంగా బాధ్యతా యుతమైన తల్లిదండ్రుల పిల్లలైతే, చైనీస్ మాంజాను కొనకండి. నగరంలో చైనా మాంజాతో ఎగిరే గాలిపటం పిల్లల ప్రాణాలు తీస్తోంది” అని బాలుడి తల్లిదండ్రులు హెచ్చరించారు.
నగర పరిధిలో చైనా మాంజాతో గాలిపటాలు ఎగురవేసే వారిపై కఠిన శిక్షలు విధించేలా చట్టాలు తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డికి తల్లిదండ్రులు వినయ పూర్వకంగా అభ్యర్థించారు. గాలిపటాలు ఎగురవేయ డాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా, కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితం చేయాలని సూచించారు.
చైనీస్ మాంజాతో జరిగే ప్రాణనష్టాలను అడ్డుకోవాలంటే సహనం, కఠిన అమలు మరియు ప్రజల బాధ్యత అత్యవస రమని ఈ ఘటన మరోసారి స్పష్టంగా చెబుతోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో చైనా మాంజా అమ్ముతున్నట్లు మా దృష్టికి తీసుకొస్తే రూ.5 వేల బహుమతి ఇస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మితే పోలీసులతో కేసులు పెట్టిస్తాని దానం హెచ్చరించారు. దయచేసి ఎవరూ చైనా మాంజా విక్రయించ వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు