ఐ బొమ్మ రవి.. ఐదేళ్లలో వంద కోట్ల సంపాదన!

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొత్తం పైరసీ రవి ఒక్కడే చేసినట్లు విచారణలో బయటపడింది.  ఈ పైరసీ ద్వారా రవి ఐదేళ్లలో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు  సంపాదించినట్లు గుర్తించారు. సినిమాలను కొనుగోలు చేసి వాటిని తన ఐబొమ్మలో పోస్ట్ చేసినట్లు గుర్తించారు. తనకున్న వెబ్ డిజైనింగ్ టెక్నాలజీతో కొత్త కొత్త రూపంలో డిజైనింగ్ చేసి ఆ మేరకు డబ్బులు సంపాదించారని పోలీసుల విచారణలో తేలింది. అలాగే   ఐ బొమ్మ లో సినిమా చూసే అందరి   రవి తస్కరించి ఆ మేరకు ప్రమోషన్స్ నిర్వహించు కున్నట్లు తేలింది.  తన దగ్గర 55 లక్షల మంది సంబంధించిన డేటా ఉందని చెప్పి బెట్టింగ్ గేమింగ్,  మ్యాట్రిమోనీ డాట్ కామ్ ల నుంచి యాడ్స్ రూపంలో కూడా సొమ్ములు సంపాదించినట్లు పోలీసులు కనుగోన్నారు.   పైరసీ వెబ్‌సైట్‌  ఐబొమ్మ  వ్యవహారంలో అరెస్టైన రవిని ఐదు రోజుల పాటు కస్టడీలో విచారించిన సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రవిని నాంపల్లి కోర్టులో హాజరు పరిచి అక్కడ నుంచి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ ఐదు రోజుల విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రవి బ్యాంకు ఖాతాల్లో దాదాపు 30 కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు జరిగాయనీ, అతడికి మొత్తం 36 బ్యాంకు ఖాతులు ఉన్నట్లు గుర్తించారు.  .విచారణలో రవి టెలిగ్రామ్‌ ఛానళ్ల ద్వారా సినిమాల కొనుగోలు– అమ్మకం జరిపినట్టు బయటపడింది. యాప్స్‌ ద్వారానే బేరసారాలు జరిపి, డాలర్ల రూపంలో  వ్యక్తులకు చెల్లింపులు చేసినట్టు పోలీసులు గుర్తించారు. కొనుగోలు చేసిన సినిమాలను ఐబొమ్మలో అప్‌లోడ్ చేసి కొన్ని గంటల్లోనే భారీ ఆదాయం ఆర్జించినట్టు వెలుగులోకి వచ్చింది.  ఐబొమ్మలో సినిమా ఓపెన్‌ చేయగానే వినియోగదారులు 15 వరుస యాడ్స్‌కు రీడైరెక్ట్ అయ్యేలా రవి సిస్టమ్‌ను రూపొందించినట్టు  తేలింది. మ్యాట్రీమోని, బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌తో పాటు,  పలు ప్రకటనలకు లింకులు ఇచ్చి కోట్లలో ఆదాయం సంపాదించినట్టు పోలీసులు వెల్లడించారు. ఏపీకే ఫైళ్ల ద్వారా బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్‌ చేసి  మనీ సర్క్యులేషన్‌ చేసినట్టు గుర్తించారు.అభ్యంతరకర లావాదేవీలను దాచేందుకు రవి ఐడీఎఫ్ సీ  బ్యాంక్ ఖాతాను వినియోగించగా, అందులో వచ్చిన నిధులను యూఎస్డిటి రూపంలో క్రిప్టో కరెన్సీకి మార్చినట్టు కూడా అధికారులు కనుగొన్నారు. రవి స్నేహితుడు నిఖిల్‌కు భారీగా డబ్బులు బదిలీ చేసిన వివరాలు బయటపడ్డాయి. రవి  అతడి స్నేహితుడు కలిసి వెబ్‌సైట్ ఆపరేషన్స్, డొమైన్ నెట్‌వర్క్స్, ఐపీ మాస్కింగ్, వీపీఎన్ హైడింగ్, డేటా స్క్రాంబ్లింగ్ వంటి టెక్నికల్ కార్యకలాపాలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. ఐబొమ్మ రవిపై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇప్పటికే 5 కేసులు నమోదయ్యాయి. నిర్మాతలు చేసిన ఫిర్యాదుల ఆధారంగా మరిన్ని కేసుల్లో పీటీ వారెంట్ దాఖలైంది.   రవిని మరోసారి విచారించేందుకు సైబర్ క్రైమ్ అధికారులు సిద్ధమవుతున్నారు.ఇలా ఐబొమ్మ కేసుపై హైదరాబాద్ సీపీ సజ్జనర్ మీడియా మంగళవారం (నవంబర్ 26) మీడియాతో మాట్లాడతారు.  

మహిళల కబడ్డీ వరల్డ్ కప్.. విజేత భారత్

భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో చైనీస్ తైపీ జట్టుపై భారత్ 35–28 తేడాతో  విజయం ఘన విజయం సాధించింది. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ విజేతగా నిలవడం వరుసగా ఇది రెండో సారి. ఈ టోర్నమెంట్ ఆద్యంతం భారత జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది. తొలుత   గ్రూప్ మ్యాచ్‌లన్నీ అలవోకగా గెలిచిన భారత మహిళల జట్టు సెమీఫైనల్‌లో ఇరాన్‌పై 33–21 తేడాతో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టింది. మరోవైపు, చైనీస్ తైపీ కూడా తమ గ్రూపులో అజేయంగా నిలిచి, సెమీస్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. సెమీస్ వరకూ అజేయంగా నిలిచి సమ ఉజ్జీలుగా భారత్, చైనీస్ తైపీ జట్టు ఫైనల్ లో తలపడ్డాయి. అయితే భారత మహిళల జట్టు చైనీస్ తైపీ జట్టుపై కూడా సునాయాస విజయాన్ని సాధించింది. టోర్నీ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా నిలిచి ప్రపంచ చాంపియన్ ట్రోఫీని ముద్దాడి ప్రపంచ కప్ ను నిలబెట్టుకుంది.    ఈ టోర్నమెంట్‌లో మొత్తం 11 దేశాలు పాల్గొన్నాయి.   భారత మహిళల కబడ్డీ జట్టు మరోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఢాకా వేదికగా జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్‌ ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును ఓడించి వరుసగా రెండోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తుదిపోరులో 35-28 పాయింట్ల తేడాతో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. భారత మహిళల కబడ్డీ జట్టు ప్రపంచ విజేతగా నిలవడం పట్ల ప్రధాని మోడీ స్పందించారు. భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుత అంకిత భావాన్ని ప్రదర్శించిందని ప్రశంసించారు. ఈ విజయం అనేక మంది యువతులను కబడ్డీ ఆడే దిశగా ప్రోత్సహిస్తుందని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. ఈ చారిత్రక విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ,  భారత జట్టుకు అభినందనలు తెలిపారు. పట్టుదల, సత్తా ఈ అద్భుత విజయాన్ని సాధించిపెట్టాయన్నారు. భారత మహిళల జట్టు ప్రపంచకప్ ను వరుసగా రెండు సార్లు గెలవడం దేశానికి గర్వించదగ్గ విషయం అని ఎక్స్ లో పేర్కొన్నారు. జట్టు సభ్యులకు అభినందనలు తెలిపారు.  అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల కబడ్డీ జట్టుకు అభినందనలు తెలిపారు.   మన మహిళల కబడ్డీ జట్టు వరుసగా రెండోసారి మహిళా కబడ్డీ ప్రపంచకప్‌ను గెలవడం భారతదేశానికి ఎంతో గర్వకారణమన్న లోకేష్,  జట్టులో ఉన్న  క్రమశిక్షణ, పట్టుదల,   ప్రతిభకు ఇది నిదర్శనమన్నారు.  ప్రపంచ వేదికపై మరోసారి భారతదేశ ప్రతిష్టను ఉన్నత స్థాయికి చేర్చిన మన క్రీడాకారిణులకు నా హృదయపూర్వక అభినందనలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.

చెవిరెడ్డికి మళ్లీ అనారోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను హుటాహుటిన  విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెవిరెడ్డి భాస్కరరెడ్డి సోమవారం (నవంబర్ 24) ఛెస్ట్ పెయిన్ అంటూ కంప్లైంట్ చేయడంతో ఆయనను విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స  అందించారు. గతంలో కూడా పలు మార్లు చెవిరెడ్డి భాస్కరరెడ్డి తనకు ఆరోగ్యం బాలేదంటూ చెప్పడంతో ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించిన తరువాత తిరిగి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. కాగా గతంలో తనను ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ గా చేర్చి చికిత్స అందించాలంటూ చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.  ఇలా ఉండగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబ ఆస్తుల జప్తునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో చెవిరెడ్డి ఆందోళనకు గురై అస్వస్థతకు గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆస్తులను జప్తే చేయవద్దనీ, తాను ఎంత కాలం కావాలంటే అంత కాలం జైలులో ఉంటానంటూ చెవిరెడ్డి భాస్కరరెడ్డి శనివారం (నవంబర్ 22)న ఏసీబీ కోర్టులో న్యాయవాదికి మొరపెట్టుకున్న సంగతి తెలిసిందే.  వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట‌యిన చెవిరెడ్డిని పోలీసులు శనివారం (నవంబర్  22) ఏసీబీ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా కోర్టు ఆయ‌న‌కు మ‌రో 14 రోజ‌లు పాటు రిమాండ్ విధించింది.   ఈ స‌మ‌యంలో చెవిరెడ్డి న్యాయాధికారిని ఉద్దేశించి మాట్లాడుతూ, త‌న‌పై అన‌వ‌స‌రంగా కేసు న‌మోదు చేశార‌ని.. ఇది రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని చెప్పారు. ఇటీవ‌ల త‌న ఆస్తుల‌ను జ‌ప్తు చేస్తూ.. ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింద‌న్నారు. అయితే.. అవ‌న్నీ తాను నీతి, నిజాయితీతో సంపాయించుకున్న ఆస్తుల‌ని.. ఒక్క‌రూపాయి కూడా అవినీతి లేద‌ని  వీటిని జ‌ప్తు చేయ‌డం  ధ‌ర్మం కాద‌ంటూ వేడుకున్నారు.  కావాలంటే  కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నాళ్ల‌యినా త‌న‌ను జైల్లో పెట్టుకోవ‌చ్చ‌న్నారు. అయితే ఆస్తులను మాత్రం జప్తు చేయవద్దంటూ కన్నీటి పర్యంతం అయ్యారు.  అయితే, ఈ విష‌యం త‌మ ప‌రిధిలో లేద‌ని, సిట్ అధికారులు ఆస్తుల జప్తుకు పిటిషన్ దాఖలు చేయాల్సి ఉందని   కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఆస్తుల జప్తు ఆందోళనతోనే చెవిరెడ్డి అనారోగ్యానికి గురై ఉంటారని జైలు అధికారులు భావిస్తున్నారు.  

అర్థ‌రాత్రి పెట్రోలింగ్ వాహ‌నంలో స‌జ్జ‌నార్.. ఏం చేశారు? ఎక్కడికెళ్లారంటే?

హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదివారం (నవంబర్ 23) అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో ఎక్క గస్తీ తిరిగారు. ముఖ్యంగా లంగర్ హౌజ్, టోలీ చౌకీ ప్రాంతాలలో ఆయన పెట్రోల్ వాహనంలో తిరిగారు.  సైరన్ లాంటి ఆర్బాటాలేం లేకుండా పెట్రోల్ వాహనంలో తిరుగుతూ,  లంగ‌ర్ హౌజ్ పీఎస్ ప‌రిధిలోని ఎండీ లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లో నివాసం ఉంటున్న రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో నిద్రపోతున్న రౌడీ షీటర్లను లేపి మరీ వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి, ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై ఆరా తీశారు.   మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడమే కాకుండా, నేర ప్ర‌వృత్తి వీడి సన్మార్గంలోకి రావాల‌ని హిత‌వు ప‌లికారు.  సౌత్ వెస్ట్ జోన్‌లో నగర సీపీ  సజ్జనార్ ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము మూడు గంటల వరకూ లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నిత ప్రదేశాలలో గస్తీ తిరుగుతూ పరిశీలించారు.  టోలిచౌకి పరిధిలో రాత్రిపూట తెరిచి ఉన్న హోటళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల్లోకి వెళ్లి  నిబంధనలకు విరుద్ధంగా రాత్రివేళల్లో షాపులు తెరిచి ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. అలాగే పెట్రో లింగ్ సిబ్బంది అప్రమత్తతను కూడా పరిశీలించారు.  అలాగే పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టౌలీచోకీ పీఎస్ లో స్టేషన్ జనరల్ డైరీ, రాత్రి చేసిన ఎంట్రీలు, డ్యూటీలో ఉన్న సిబ్బంది హాజరు వివరాలు, వారికి అప్పగించిన బాధ్యతలను  పరిశీలించారు.  ఈ సందర్భంగా సజ్జనార్  రాత్రి వేళల్లో పోలిసింగ్‌ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకే తాను పెట్రోలింగ్ వాహనంలో ఇలా ఆకస్మిక పర్యటన చేసినట్లు తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్‌లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బందిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యత పెరిగేందుకు దోహదం చేస్తాయన్నారు. విజిబుల్ పోలిసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయనీ సందర్భంగా పోలీసు సిబ్బందికి సూచించారు.   

బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు

ప్రముఖ  బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర ఈ రోజు తుదిశ్వాస విడిచారు.  అమీర్ ఖాన్ సహా పలువురు బాలీవుడ్ ప్రముఖ నటులు ఆయన భౌతిక కాయానికినివాళులర్పించారు. ఆయన భౌతికకాయానికి   షోలోలే ధర్మేంద్ర సహ నటుడు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్, అభిషేక్ బచ్చన్ సహా పలువురు ప్రముఖ  నివాళులర్పించారు.   షోలే సహా 300కు పైగా చిత్రాల్లో  నటించిన ధర్మేంద్ర ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం,  పద్మభూషణ్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.  హీ మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ గా పేరుపొందిన ధర్మేంద్ర మృతిలో సినీ ప్రపంచం శోక సంద్రంలో మునిగిపోయింది. కొద్ది రోజుల కిందటే బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన ధర్మేంద్ర ఈ ఉదయం మరణించడం పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ధర్మేంద్ర డిసెంబర్ 8, 1935లో పంజాబ్ లో జన్మించాడు. 1960లో వచ్చిన దిల్ భీ తేరా హమ్ భీ తేరే మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 65 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్లో 300కుపైగా సినిమాల్లో నటించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ధర్మేంద్రకు 2012లో పద్మభూషణ్ అవార్డ్ వచ్చింది. అలాగే 1997 సంవత్సరంలో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. ధర్మేంద్ర భార్య, అలనాటి డ్రీమ్ గర్ల హేమమాలిని రాజ్యసభ మాజీ సభ్యురాలు. ధర్మేంద్ర కుమారులు సన్నీ డియోల్, బాబీ డియోల్ లు కూడా సినీ నటులే. అలాగే ధర్మేంద్ర కుమార్తెలు ఇషా కూడా సినీ రంగంలోనే ఉన్నారు. 

ఒకే రోజు పాతిక బ్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన.. అమరావతి వేగం అనూహ్యం కదా!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అభివృద్ధి వేగం వాయువేగాన్ని మించి సాగుతోంది. తెలుగుదేశం కూటమి  ప్రభుత్వం అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా మలచేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాజధాని కేంద్రంగా పెట్టుబడులు ఆకర్షించేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా భారీగా ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే అమరావతిలో ఆర్థిక కార్యకలాపాల వేగం పెరిగేందుకు తీసుకున్న చర్యలలో భాగంగా ఆర్బీఐ రీజనల్ బ్యాంక్ సహా పాతిక ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు అమరావతిలో ఏర్పాటు కానున్నాయి. ఆయా బ్యాంకులకు ఇప్పటికే స్థలాలు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ దిశగా మరో  కీలక ముందడుగు పడనుంది. ఆర్బీఐ సహా  పాతిక, ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల ప్రాంతీయ కార్యాలయాల నిర్మాణానికి ఒకే రోజు శంకుస్థాపన జరగనుంది. ఈ నెల 28న జగరగున్న ఈ బ్యాంకుల భవనాల నిర్మాణానికి జరగనున్న శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.  రాజధానిలోని సిఆర్డిఏ ప్రధాన కార్యాలయం వద్ద అన్ని బ్యాంకులకు ఒకేసారి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే పలు  బ్యాంకులు తమ స్థలాలను సిద్ధం చేసుకుని నిర్మాణాలకు రెడీ అయ్యాయి.ఈ బ్యాంకుల ఏర్పాటుతో అమరావతి రాష్ట్ర ఆర్థిక కేంద్రంగా ఎదుగుతుందనడంలో సందేహం లేదు. బ్యాంకుల ఏర్పాటుతో అమరావతికి పెట్టుబడులు వెల్లువెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.  

మారిపోతాం..లొంగిపోతాం.. ముందు కూంబింగ్ ఆపండి.. మావోయిస్టుల లేఖ

మావోయిస్టులు ఆయుధాలు విసర్జించి లొంగిపోయేందుకు రెడీ అయ్యారు. ఈ విషయంపై మావోయిస్టు పార్టీ మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ సీఎంలకు ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్రఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం విశ్వభూషణ్ సాహు, ఛత్తీస్ గడ్ సీఎం విష్ణుదేవ్ సాయిలకు రాసిన ఆ లేఖలో మావోయిస్టులు లొంగిపోతాం, మారిపోతాం.. ముందు మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన కూంబింగ్ ను నిలిపివేయండి అంటూ విజ్ణప్తి చేశారు. లొంగుబాటుపై ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుందని ఆ లేఖలో పేర్కొంది. ముఖ్యంగా ఇటీవల పార్టీ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బసవరాజ్  ఎన్ కౌంటర్ తరువాత పార్టీ పార్టీ పునర్‌నిర్మాణం, వ్యూహాత్మక మార్పులు అవసరమని గుర్తించామని పేర్కొంది. కూంబింగ్ ఆపివేతస్తే ఆయధ విరమణపై ఒక స్పష్టమైన తేదీని ప్రకటిస్తామని మావోయిస్టు పార్టీ ఆ లేఖలో పేర్కొంది.  ఇప్పటికే ఈ విషయమై పార్టీ  జోనల్ కమిటీలకు సమాచారం ఇచ్చినట్టు తెలిపింది. ఆపరేషన్ కగార్ లో భాగంగా జరుగుతున్న కూంబింగ్ లో భాగంగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూంబింగ్ ఆపివేస్తే లొంగిపోతాం, ఆయుధాలను వదిలేస్తామంటూ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేత్రి  బేగం ఖలీదా జియా  ఆదివారం (నవంబర్ 23) రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో భాధపడుతున్నారని తెలిపారు.   ప్రస్తుతం ఆమెకు ఢాకాలోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో జరుగుతున్న చికిత్సను   అమెరికాలోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ ఆసుపత్రి నిపుణులు   వర్చువల్‌గా పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. కాగా బేగం ఖలీదా జియా తీవ్ర అస్వస్థతకు గురయ్యారన్న సమాచారం తెలియగానే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలూ  పెద్ద సంఖ్యలో ఆమో చికిత్స పొందుతున్న ఆస్పత్రివర్దకు చేరుకున్నారు.  

సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్  సోమవారం (నవంబర్ 24) ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. ఇలా ఉండగా సుప్రీం కోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్ ఆ పదవిలో  2027 ఫిబ్రవరి 9 వరకూ కొనసాగుతారు. సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన సూర్యకాంత్  స్వస్థలంహర్యానా. హర్యానా నుంచి సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్.

కాలుష్య వ్యతిరేక ర్యాలీలో హిడ్మా అనుకూల పోస్టర్లు, నినాదాలు

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా జరిగిన భారీ ర్యాలీలో ఇటీవల ఏపీలో  ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మాకు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. ఢిల్లీలోని  ఇండియా గేట్ వద్ద ఆదివారం (నవంబర్ 24) సాయంత్రం వాయు కాలుష్యానికి వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా హిడ్మాకు అనుకూలంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు.  కాగా అనుమతి లేకుండా ఇండియా గేట్ వద్ద నిరసనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు నిలువరించడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో కొందరు నిరసనకారులు పోలీసులపై పెప్పర్ స్ప్రై ప్రయోగించారు. దీంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. కాగా పోలీసులపై నిరసనకారులు  పెప్పర్ స్ప్రే ప్రయోగించడం చాలా అసాధారణమైన ఘట‌నగా ఢిల్లీ డీసీపీ  తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 15 మంది నిరసనకారులను అదుపులోనికి తీసుకున్నారు.   కాలుష్య వ్యతిరేక నిరసనలలో హిడ్మా అనుకూల నినాదాలు, పోస్టర్లపై కూడా విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.  

మనవడి మృతిని తట్టుకోలేక అమ్మమ్మ మృతి

మనవడు మరణించాడన్న వార్త వినగానే అమ్మమ్మ ఒక్కసారిగా కూప్ప కూలి పడిపోయి మృతి చెందిన ఘటన  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.  స్నేహితులతో కలిసి సరదాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వా రావుపేటకు సరిహద్దులో కామయ్యపాలెం  సమీపంలోని  సంఘం వాగులో  ఈతకు వెళ్లిన పదవ తరగతి విద్యార్థి పదిహేనేళ్ల యశ్వంత్‌  ఆ వాగులో మునిగి మరణించాడు.   మనవడి ఆకస్మిక మరణ వార్త విన్న యశ్వంత్‌ అమ్మమ్మ వెంకటమ్మ (60) తీవ్ర విషాదంలో మునిగిపోయి, రోదిస్తూ  ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు విడిచింది.  ఒకే రోజు ఒకే కుటుంబంలో రెండు మరణాలు సంభవించడంతో అశ్వారావుపేటలో విషాద ఛాయలు ముసురుకు న్నాయి. 

బెంగుళూరు దోపిడీ కేసులో ముగ్గురు హైదరాబాద్ లో అరెస్టు

బెంగళూరులో జరిగిన భారీ దోపిడీ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు.  బెంగళూరులో జరిగిన 7.1 కోట్ల దోపిడీ కేసులో ముగ్గురు నిందితులను హైదరాబాద్‌ లో స్పెషల్ ఆపరేషన్ ద్వారా అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో పట్టుబడ్డ ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా  బెంగు ళూరు పోలీసుల ప్రత్యేక బృందం హైదరాబాద్‌ వచ్చి ఈ అరెస్టులు చేసింది. దోపిడి తర్వాత ముగ్గురు నిందితులు బెంగళూరు నుంచి కారులో  నేరుగా హైద రాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరిన తర్వాత ఈ ముగ్గురు నిందితులు నాంపల్లి ప్రాంతంలోని ఒక లాడ్జ్‌లో బస చేశారు. ఈ సమాచారంతో బెంగుళూరు పోలీసులు సిసిఎస్ హైదరాబాద్ బృందం సహకారంతో లాడ్జ్ పరిసరాల్లో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసులు చేరుకునేలోపే ముగ్గురు నిందితులు లాడ్జ్‌ను విడిచి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 58లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.  అరెస్టు చేసిన వారిని బెంగళూరు తరలించారు. 

తెలుగు సినిమాను వదలని పైరసీ భూతం

తెలుగు సినీమాను పైరసీ భూతం వదల నంటోంది. ఇటీవలే ఐబొమ్మ రవిని అరెస్టు చేసి.. అతడికి సంబంధించిన పైరసీ సైట్లను మూసేసిన సంగతి తెలిసిందే. అయితే అంతలోనే మీవీరూల్జ్ వైబ్ సైట్ పైరసీ సినిమాలతో రెచ్చిపోయింది.  మూడు కొత్త సినిమాలు ప్రేమంటే, 12ఏ రైల్వే కాలనీ, రాజా వెడ్స్ రాంబాయి గత శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు ఇలా విడుదలయ్యాయో లేదో, అలా గంటల వ్యవధిలో ఈ మూడు సినిమాల పైరసీలు మూవీరూల్జ్ లో ప్రత్యక్షమయ్యాయి.   ఒ క్కరోజులోనే, సినిమాలు విడుదలైన గంటల వ్యవధిలోనూ ఆ సినిమాల ప్రింట్లు అప్ లోడ్ కావడం సినీపరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా, తీవ్ర ఆందోళనకు లోను చేసింది.   థియేటర్లలో ప్రదర్శన జరుగుతున్న సమయంలోనే క్యాం కార్డర్‌తో రహస్యంగా రికార్డ్ చేసిన వీడియోలని మూవీరూల్జ్ వెబ్ సైట్ అప్ లోడ్ చేసినట్లు గుర్తించారు.  ఈ కమ్‌కామ్ ప్రింట్లు బయటకు రావడమే కాకుండా వేల సంఖ్యలో డౌన్‌లోడ్ అవు తుండటం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతోంది. పైరసీ కేసుల్లో కీలక పాత్రధారిగా ఉన్న ఐబొమ్మ రవి కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా సాగుతున్న ఈ సమయంలో  మూవీరూల్జ్ పైరసీ సినిమాలను ప్రసాదం చేసి సవాల్ విసరడం గమనార్హం.   టాలీవుడ్ సినిమాలు పైరసీ చేసి సినీ పరిశ్రమనే గడగడలాడించిన ఐబొమ్మ రవికి జనంలో హీరో రేంజ్ గుర్తింపు వచ్చంది.   రవిని సామాన్య జనం, కొందరు సినీ జనం కూడా  రాబిన్‌హుడ్‌తో పోలుస్తుండటం వెనుక సినీమా టికెట్ల ధరలు సామాన్యులు ధియోటర్లకు వెళ్లి సినిమా చూడాలంటే భయపడే రేంజ్ లో ఉండటమే కారణమంటున్నారు.   ఒకవైపు రవిని అరెస్టు చేసి పోలీసులు విచారణ చేస్తుండగా మరోవైపు కొత్తగా మరో వెబ్ సైట్ మూవీరూల్జ్  విడుదలైన మూడు సినిమాలు గంటల వ్యవధిలోనూ ప్రసారం చేయడం గమనార్హం.  

భారత్ లో ఏఐ సమ్మిట్.. ఎప్పుడో తెలుసా?

భారత్ ఏఐ సమ్మిట్ కు ఆతిథ్యం వహించనుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.   దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న మోడీ  కీలక ప్రసంగం చేయడంతో పాటు, పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జపాన్ ప్రధాని సనే టకాయిచిలతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.  అందరికీ న్యాయమైన,  నాణ్యమైన భవిష్యత్ అనే అంశంపై ప్రసంగించిన మోడీ,  టెక్నాలజీ వినియోగం ఆర్థిక కేంద్రంగా కాకుండా మానవ కేంద్రంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఆయన  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో  సర్వజనం హితాయ, సర్వజనం సుఖాయ అనే నినాదంతో భారత్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. ఆ సదస్సుకు   జీ20 దేశాలను ఆహ్వానించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో పారదర్శకత, మానవ పర్యవేక్షణ, దుర్వినియోగాన్ని అరికట్టడం వంటి సూత్రాలతో ప్రపంచ ఒప్పందం అవసరమని మోడీ అన్నారు.  ఈ సదస్సులో భాగంగా ప్రధాని మోడీ  దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో  ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో  వాణిజ్యం, పెట్టుబడులు, ఏఐ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్యా సహకారంపై చర్చించారు.  అలాగే ఇటలీ, కెనడా, జపాన్ ప్రధానులతోనూ మోదీ వేర్వేరుగా భేటీ అయ్యారు.  

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కిడ్నాప్, దాడి

యువతలో రీల్స్, కామెంట్లు, లైకుల పిచ్చి వెర్రితలలు వేస్తున్నది. సోషల్ మీడియాలో తాము పోస్టు చేసిన రీల్స్ కు మామెంట్లు, లైకుల కోసం ఎంతకైనా తెగిస్తోంది. తమ ప్రాణాలను ఫణంగా పెట్టడమే కాకుండా, తెలియని వారిపై దాడులు, కడ్నాప్ లకు పాల్పడడానికి కూడా వెనుకాడటం లేదు. తాజాగా మధ్య ప్రదేశ్ లో ఇద్దరు బాలికలు, ఓ యువతి సోషల్ మీడియాలో లైకుల కోసం ఓ గ్యాంగ్‌గా ఏర్పడి,  యువతులను కిడ్నాప్ చేసి దారుణంగా కొడుతూ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంఘటన జబల్ పూర్ లో వెలుగు చూసింది.     ఓ యువతిని ఈ గ్యాంగ్ కిడ్నాప్ చేసి,  ఆమె జుత్తు పట్టుకుని విచక్షణారహితంగా కొడుతూ, కాళ్లతో తన్నుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యింది. బాధితురాలి ఫిర్యాదులో రంగంలోని దిగిన పోలీసులు ఆ గ్యాంగ్ ను అరెస్టు చేశారు. ఆ గ్యాంగ్ లో 17 ఏళ్ల బాలికలు ఇద్దరు, ఓ యువతి ఉన్నారు. సామాజిక మాధ్యమంలో సెలిబ్రిటీలుగా మారాలన్న ఉద్దేశంతోనే వారీ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరు ఇంతకు ముందు కూడా ఇదే తరహాలో మరికొందరు యువతులపై దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

ప్రతి 20 రోజులకూ ఓ సారి విదేశీ ప్రయాణం.. ఐబొమ్మ రవి విచారణలో వెలుగులోకి కీలక అంశాలు

ఐ బొమ్మ నిర్వాహకుడు రవి సినీ ప్రముఖులను గజగజ వణికించాడు.... పోలీసుల చేతికి చిక్కకుండా చుక్కలు చూపిస్తూ పోలీసులకే సవాళ్లు విసిరాడు. ఎంతటి కరుడుగట్టిన నేరస్తుడైన సరే ఏదో ఓ రోజు పోలీసుల చేతికి చిట్కాల్సిందే... అలాంటిది పోలీసులకే సవాలు విసిరిన వాడిని వదిలేస్తారా... లేదు కదా... తగ్గేదేలే అనే టైపులో పోలీసులు కూడా విశ్వప్రయత్నం చేసి ఎట్టకేలకు ఐ బొమ్మ రవిని అరెస్టు చేయడమే కాకుండా కస్టడీలోకి తీసుకొని కూడా విచారణ చేస్తున్నారు. ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ వ్యవహారంలో అరెస్టైన రవి కస్టడీ మూడో రోజుకు చేరుకున్న నేపథ్యంలో విచారణ తీవ్రత పెరిగింది.ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ సీపీ సజ్జనార్  సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకుని రవిని స్వయంగా విచారించారు. ప్రశ్నించారు. అనంతరం పోలీసులు రవిని బషీర్ బాగ్ లోని సీపీ ఛాంబర్‌కు తీసుకెళ్లి మరీ విచారించారు. ఈ సందర్భంగా  హైదరాబాద్ అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్   విచారణకు రవి సహకరించడం లేదనీ,  పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడని చెప్పారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారం రాబడుతున్నట్లు వెల్లడించారు.    సర్వర్ ఐపీలు నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాల్లో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ, ఎథికల్ హాకర్ల సహాయంతో వీటిని  గుర్తించే  ప్రక్రియ సాగుతోందన్నారు. త్వరలో అంతర్జాతీయ ఏజెన్సీలతో కలిసి సర్వర్ డేటా ఎక్స్‌ట్రాక్షన్ చేపట్టనున్నట్లు చెప్పారు. విచారణలో రవి ఆర్థిక వ్యవహారాలు కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రతి 20 రోజులకు ఒకసారి రవి విదేశీ ప్రయాణాలు చేసినట్లు రికార్డులు లభ్యమయ్యాయన్నారు.   పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను   క్రిప్టో ద్వారా స్వీకరించి వెంటనే ఖర్చు చేయడం రవి అలవాటని గుర్తించారు. రవి పేరుతో ఉన్న బ్యాంక్ అకౌంట్లు, విదేశీ ఖర్చులపై   దర్యాప్తు జరుగుతోంది. ఐబొమ్మ రవికి సహాయం చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. రవి స్నేహితుడు నిఖిల్ వెబ్‌సైట్‌లో ఉపయోగించిన పోస్టర్లు, ప్రమోషనల్ మెటీరియల్ డిజైన్ చేసినట్లు గుర్తించారు.అదే విధంగా నిఖిల్, రవి వాళ్ల  చెల్లెలి ఖాతాకు పలుసార్లు డబ్బు ట్రాన్స్ఫర్ చేసినట్లు లావాదేవీల్లో బయటపడింది. ఈ ట్రాన్సాక్షన్ల నేపథ్యం ఏంటన్నదానిపైకూడా విచారణ జరుగుతోంది. అంతర్జాతీయ సర్వర్లు, విదేశీ లావాదేవీలు, క్రిప్టో ఫ్లోలు సహా అన్ని అంశాలపై సంయుక్తంగా సాగుతున్న  ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుందని అధికారులు చెబుతున్నారు. ఐబొమ్మ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను త్వరలోనే బట్టబయలు చేస్తామని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు.   

అంబర్ పేటలో విషాదం.. కుటుంబం ఆత్మహత్య

ఓ  కుటుంబం మొత్తం ఆత్మహ్యకు పాల్పడిన విషాదఘటన హైదరాబాద్ లోని అంబర్ పేటలో చోటు చేసుకుంది.   బాగ్ అంబర్ పేటలోని మల్లికార్జున్ నగర్‎లో శ్రీనివాస్,  విజయలక్ష్మి దంపతులు వారి కుమార్తె శ్రావ్య నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.    శ్రీనివాస్, విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా ఇటీవలే వారి పెద్ద కుమార్తె ఆత్మహత్య చేసుకుని మరణించింది. అంత వరకూ రామ్ నగర్ లో నివాసం ఉండే వీరు పెద్ద కుమార్తె మరణం తరువాత అక్కడ నుంచి అంబర్ పేటకు మారారు.  సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకు న్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీంతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి..? ఏమైనా వివాదాలు ఉన్నాయా అని స్థానికులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. స్థానికుల సమాచారం మేరకు పెద్ద కుమార్తె మరణం తరువాత నుంచీ శ్రీనివాస్ కుటుంబం డిప్రషన్ లో ఉంది. తమను దేవుడు పిలుస్తున్నాడు, మేం కూడా మా పెద్ద కుమార్తె దగ్గరకు వెళ్లిపోతామని తరచూ చెబుతుండేవారు. దీంతో శ్రీనివాస్ కుటుంబం ఆత్మహత్యకు మూఢ నమ్మకాలే కారణమని పోలీసులు పోలీసులు అనుమానిస్తున్నారు.  మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మూఢ నమ్మకాలతోనే చనిపోయారా..? మరేదైనా కారణం ఉందా..? అన్న కోణంలో పోలీ సులు ఆరా తీస్తున్నారు.  

కుప్పంలో డ్వాక్రా మహిళల ఛాయ్ రాస్తా అవుట్ లెట్.. ప్రారంభించిన నారా భువనేశ్వరి

ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపార వేత్త రావాలని, అందులోనూ మహిళలు ఎంటర్ పెన్యూర్ లుగా ఎదగాలన్న చంద్రబాబు సంకల్పం సాకారం అయ్యే దిశగా కుప్పంలో అడుగుపడింది.  కుప్పంలో డ్రాక్రా మహిళల నెలకొల్పిన చాయ్‌ రాస్తా అవుట్‌లెట్‌ శనివారం ఆరంభమైంది. ఈ రాస్తా చాయ్ ఔట్ లెట్ ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రారంభించారు.  .ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంలో భాగంగా చాయ్‌ రాస్తా  రూపొందిందన్నారు. మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కావాల్సిన సహకారాన్ని ప్రభుత్వం అందిస్తోందనీ,  దీనిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.   కుప్పం డెవలప్‌మెంట్ ఆధారిటీ (కడా) మద్దతుతో   కుప్పంలో ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్ ప్రారంభం కావడం శుభపరిణామంగా అభివర్ణించిన భువనేశ్వరి, మహిళలు స్వశక్తితో ఎదిగేందుకు ఇటువంటి అధునాతన వ్యాపారాలు ఎంతో దోహపదపడతాయన్నారు. రుచి, శుచి, నాణ్యత ప్రధానంగా కార్పొరేట్ తరహాలో ఏర్పాటైన ఈ ఛాయ్ రాస్తా అవుట్ లెట్‌ను ప్రారంభించిన భువనేశ్వరి మొదటి ఛాయ్‌ని కోనుగోలు చేసి తాగారు.  చాయ్ రాస్తా అవుట్‌లెట్‌లో రుచి, శుచి చక్కగా ఉన్నాయని  ప్రశంసించారు.  ఐఐఎం, ఐఐటి గ్రాడ్యుయేట్ల భాగస్వామ్యంతో రూపొందిం చిన చాయ్ రాస్తా  చాలా సరికొత్తగా ఉందని  ఆమె అభినందించారు.