సీవీ ఆనంద్ వివరణ.. ఎమోజీ వివాదానికి తెర!
posted on Nov 17, 2025 9:15AM
సోషల్ మీడియా వేదికగా నెలకొన్న అపోహలపై హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ క్లారిటీ ఇచ్చారు. గత రెండు నెలలుగా హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు సీవీ ఆనంద్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు కారణం సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో సీవీ ఆనంద్ పోస్టు చేసిన ఒక ఎమోజీయే. దీనిపై వివరణ ఇచ్చిన సీవీ ఆనంద్..
దాదాపు రెండు నెలల క్రితం తన పోస్టు కారణం గా బాలకృష్ణ అభిమా నులు–విమర్శకుల మధ్య చర్చలు, వాగ్వాదాలు జరిగాయనీ, తనపై కూడా విమర్శలు వచ్చాయనీ పేర్కొన్న ఆయన నగర పోలీసు వ్యవహారాలు, కేసులు, వివిధ ఘటనలకు సంబంధించిన అప్‌డేట్స్‌ను సోషల్ మీడియాలో పెట్టేందుకు తన కార్యాలయంలో పని చేస్తున్న ఒక సోషల్ మీడియా హ్యాండ్లర్ చేసిన పొరపాటు అది అని వివరణ ఇచ్చారు. సెప్టెంబర్ 29న జరిగిన ప్రెస్ మీట్ అనంతరం బాలకృష్ణపై వచ్చిన ఒక పోస్టుకు అతడు ఇచ్చిన ఎమోజీ రిప్లై పూర్తిగా అనవసరమైనదనీ, అది తనకు తెలియకుండానే జరిగిందని సీవీ ఆనంద్ విచారం వ్యక్తం చేశారు.
ఈ వివాదం గురించి తనకు తెలిసిన వెంటనే ఆ పోస్టును తొలగించడమే కాకుండా.. వ్యక్తిగతంగా బాలకృష్ణకు ఒక సందేశం ద్వారా క్షమాపణ తెలిపానని ఆనంద్ పేర్కొన్నారు. బాలయ్య, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున సినిమాలు చూసి పెరిగానన్న ఆయన వారందరిపట్ల తనకు గౌరవం, అనుబంధం ఉందన్నారు. ఆ ఎమోజీ పోస్టు చేసిన తన సోషల్ మీడియా హ్యాండ్లర్ ను తొలగించినట్లు తెలిపారు. దయచేసి ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని ఆయన బాలయ్య అభిమానులు, నెటిజన్లను కోరారు.