తెలంగాణలో బతుకమ్మ షెడ్యూల్ విడుదల

  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగ బతుకమ్మను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నెల 21న హైదరాబాద్ శివార్లలో మొక్కల నాటే కార్యక్రమంతో వేడుకలకు శ్రీకారం చుడతారు. అదే రోజు సాయంత్రం హన్మకొండలోని చారిత్రక వేయిస్తంభాల ఆలయం ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బతుకమ్మ ఉత్సవాలను ప్రారంభించనున్నారు. బతుకమ్మ సంబరాల షెడ్యూల్ 22 సెప్టెంబర్: హైదరాబాద్ శిల్పారామం, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి వద్ద ఉత్సవాలు. 23 సెప్టెంబర్: నాగార్జునసాగర్ బుద్ధవనం. 24 సెప్టెంబర్: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, కరీంనగర్ సిటీ సెంటర్‌లో వేడుకలు. 25 సెప్టెంబర్: భద్రాచలం, ఆలంపూర్ జోగులాంబ ఆలయాల్లో బతుకమ్మ. 26 సెప్టెంబర్: నిజామాబాద్ అలీసాగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో సంబరాలు; హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో సైకిల్ ర్యాలీ. 27 సెప్టెంబర్: ఉదయం నెక్లెస్ రోడ్డులో మహిళల బైక్ ర్యాలీ, సాయంత్రం ఐటీ కారిడార్‌లో బతుకమ్మ కార్నీవాల్. 28 సెప్టెంబర్: ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల బతుకమ్మను ఏర్పాటు చేసి, 10 వేల మందికి పైగా మహిళలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు లక్ష్యంగా వేడుకలు. 29 సెప్టెంబర్: పీపుల్స్ ప్లాజాలో ఉత్తమ బతుకమ్మ పోటీలు, స్వయం సహాయక సంఘాల కార్యక్రమాలు. 30 సెప్టెంబర్: ట్యాంక్‌బండ్‌పై గ్రాండ్ ఫ్లోరల్ పరేడ్, వింటేజ్ కార్ల ర్యాలీ, బతుకమ్మ లైటింగ్ ప్రదర్శన, జపాన్ కళాకారుల ఇకెబానా ప్రదర్శన, సచివాలయంపై 3డీ మ్యాప్ లేజర్ షో. ఇక, 25 నుండి 29 వరకు హైదరాబాద్ స్టేట్ గ్యాలరీలో బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ కూడా నిర్వహించనున్నారు.  

నటుడు మోహన్ లాల్‌‌కు అరుదైన గౌరవం

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌‌కు అరుదైన గౌరవం దక్కింది. కేంద్రం ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించింది. 2023 సంవత్సరానికి గానూ కేంద్రం ఆయన్ను ఎంపిక చేసింది. ఈ నెల 23న 71వ జాతీయ సినిమా అవార్డును ప్రధానం చేయనున్నారు. కాగా, మోహన్ లాల్ ఇప్పటికే పద్మభూషణ్ పురస్కారం, పద్మశ్రీ అందుకున్నారు. జాతీయ స్థాయిలో ఐదు పురస్కారాలు స్వీకరించారు. ‘భరతమ్’ ‘వానప్రస్థం’ సినిమాలకు గాను రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పురస్కారాన్ని దక్కించుకున్నారు.  ‘వాన ప్రస్థం’ మూవీగాను బెస్ట్ చిత్ర నిర్మాతగా నేషనల్ అవార్డు అందుకున్నారు. వీటితో జాతీయ స్థాయిలో రెండు సార్లు స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సహా అన్ని భాషల సినిమాల్లో మోహన్ లాల్ నటించారు. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమలో విశేష ప్రతిభచూపిన మోహన్‌లాల్‌ను తాజాగా కేంద్ర ప్రభుత్వం దాదాసాహేబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.   ఫాల్కే అవార్డుకు ఎంపికైన మోహన్ లాల్ కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. దశాబ్దాల కృషితో మలయాళ సినిమా, నాటక రంగంలో మోహన్ లాల్ ఉన్నత శిఖరాలు అధిరోహించారు. కేరళ సంస్కృతి పట్ల ఆయనకు ఉన్న మక్కువ అభినందనీయమని..తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ చిత్రాలలో కూడా మోహన్ లాల్ అద్భుతమైన చిత్రాలు చేశారని ప్రధాని పేర్కొన్నారు. ఆయన సాధించిన విజయాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటుని ప్రధాని అక్షాంక్షించారు

టీటీడీ పరకామణిలో రూ.100 కోట్ల చోరీ : భాను ప్రకాష్ రెడ్డి

  తిరుమలలోని పరకామణిలో అవకతవకలపై టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.100కోట్లకు పైగా చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ కేసును సీఐడీ విచారణకు హైకోర్టు అప్పగించిందని.. నివేదికను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించిందని తెలిపారు. ఆ రోజు అధికారంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులకు ఇందులో వాటాలు వెళ్లాయి భాను ప్రకాష్ పేర్కొన్నారు. రూ.112 కోట్లు చోరీ జరిగితే కేవలం 9 నోట్లు మాత్రమే సీజ్ చేసినట్లు చూపించారు. ఈ కేసు పునఃవిచారణ చేయాలని డీజీపీకి విన్నవించమని ఇచ్చామని తెలిపారు. అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామివారి పేరుతో రూ.40 కోట్ల ఆస్తులను రాయించుకున్నారని ఆయన ఆరోపించారు.

శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు‌లో భారీగా గంజాయి పట్టివేత

  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో డీఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. దాదాపు రూ.12 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళ బ్యాగ్‌ను తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి కనిపించింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించిన ప్రయాణికురాలిని ఎన్డీపీఎస్ చట్టం 1985 కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. హైడ్రోఫోనిక్ గంజాయి ఒక నిషేధిత మత్తు పదార్థం. దీని అక్రమ రవాణా, నిల్వ, విక్రయంపై ఇండియాలో కఠినమైన శిక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేరం యొక్క తీవ్రతను బట్టి కోర్టు విచారణ కొనసాగుతోంది. హైడ్రోపోనిక్‌ గంజాయి అనేది మట్టి అవసరం లేకుండా ప్రత్యేక ప్రయోగశాలల్లో పండించే అధిక నాణ్యత గల గంజాయి రకం. ద్రవరూప పోషకాలు నేరుగా మొక్కల వేళ్లకు అందించడంతో, కృత్రిమ ఉష్ణోగ్రత, వెలుతురు నియంత్రణతో ఇవి వేగంగా పెరుగుతాయి. సాధారణ గంజాయితో పోలిస్తే ఇందులోని మత్తు పదార్థం టెట్రా హైడ్రోకెన్నబినోల్) శాతం ఎక్కువగా ఉండటం వల్ల దీని ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. విదేశాల నుంచి, ముఖ్యంగా థాయ్‌లాండ్‌ వంటి దేశాల నుంచి ఇది అక్రమంగా భారత్‌కు రవాణా అవుతోంది. కొన్ని దేశాల్లో సాగుపై నిబంధనలు సడలింపులు ఉండటంతో స్మగ్లింగ్‌ ముఠాలు దీన్ని అవకాశంగా మార్చుకుంటున్నాయి. ఒక్క కిలో హైడ్రోపోనిక్‌ గంజాయి ధర రూ.1 కోటి వరకూ చేరుతోంది. తరచుగా మహిళలను క్యారియర్లుగా ఉపయోగించి ఈ గంజాయిని తరలిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుమారు రూ.53 కోట్ల విలువైన హైడ్రోపోనిక్‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

చెత్తను తొలిగించి...చెత్త పాలిటిక్స్ క్లీన్‌ చేస్తాం : చంద్రబాబు

  గతంలో పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరగలేదని సీఎం చంద్రబాబు అన్నారు. ఇక్కడ పాలనంతా ముఠా నాయకులే చేశారని ముఖ్యమంత్రి తెలిపారు. మాచర్లలో ఎంతటి భయానక వాతావరణం ఉండేదంటే, తన లాంటి నాయకుడు కూడా ఇక్కడికి రాలేని దుస్థితి ఉండేదని  ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు ఎవరైనా స్వేచ్ఛగా ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితి కల్పించామని ఆయన తెలిపారు. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా మాచర్లలో నిర్వహించిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమం లో భాగంగా మాచర్లలో జరిగిన ‘ప్రజావేదిక’ బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చెత్తను మాత్రమే కాకుండా, చెత్త రాజకీయాలను కూడా పూర్తిగా శుభ్రం చేస్తామ‌ని స్పష్టం చేశారు.  “పల్నాడులో అరాచకాలు, దాడులు జరగనివ్వం. రౌడీయిజం, నేరాలు, ఘోరాల విషయంలో చూస్తూ ఊరుకోం. ప్రజల ఆస్తులను కాపాడేందుకు మేమే రక్షణగా నిలుస్తాం,” అని ఆయన హెచ్చరించారు.రాయలసీమలో గతంలో ముఠా సంస్కృతిని అణచివేశామని, పల్నాడులో కూడా అలాంటి పరిస్థితులకు తావివ్వబోమని ఆయన తేల్చిచెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు.  రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, దానిపై పన్ను విధించి ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పన్నును రద్దు చేశామని గుర్తుచేశారు.“చెత్తను రోడ్ల నుండి తొలగించడం మాత్రమే కాదు, మనసులలోని చెత్తను కూడా తొలగించాలి,” అని ఆయన పిలుపునిచ్చారు. మాచర్లలో ఇటీవల వరకు ప్రజాస్వామ్యానికి స్థానం లేకపోయిందని, ఎవరి ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు.

హెచ్ 1 బి వీసాలలో అమెజాన్ టాప్.. రెండో స్థానంలో టీసీఎస్

హెచ్1బి విసాలఫీజును భారీగా పెంచుతూ అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ల అమెరికా కలలను భగ్నం చేసిందనే చెప్పాలి. ఆ విషయాన్ని పక్కన  ట్రంప్ నిర్ణయం అమెరికాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న  భారతీయ   కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. ఇండియన్ ఐటీ సంస్థలు  నైపుణ్యం కలిగిన నిపుణులను అమెరికాలో నియమించుకోవడానికి H1-B వీసాపైనే ఎక్కువగా ఆధారపడతాయి. అలాగే  అమెరికన్ టెక్ దిగ్గజాలు కూడా ఈ వీసా   ద్వారా పెద్ద సంఖ్యలో భారతీయులను నియమించుకుంటాయి. ఈ పరిస్థితుల్లో వీసా ఫీజు భారీగా పెంచడం ద్వారా అటువంటి నియామకాలపై పెను ప్రభావం పడిందనే చెప్పాలి.  అమెరికా ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్  తాజా డేటా  ప్రకారం చూస్తే..  2024–25 ఆర్థిక సంవత్సరంలో అమెజాన్ అత్యధిక సంఖ్యలో H1-B వీసాలను అందుకుంది. ఇక  రెండో స్థానంలో టీసీఎస్ ఉంది.   అమెజాన్ డాట్ కామ్  సర్వీసెస్ 10,040 హెచ్1 బివీసాలను, టీసీఎస్ 5,505 హెచ్1బీ వీసాలను తీసుకున్నాయి. ఇక మూడో స్థానంలో  మైక్రోసాఫ్ట్ 5,189 వీసాలతో, మెటా 5,123, ఆపిల్ 4,202 వీసాలతో వరుసగా ఆ తరువాతి స్థానాలలో ఉన్నాయి. అలాగే దిగ్గజ టెక్ సంస్థలు  ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా  కూడా  పెద్ద సంఖ్యలోనే హెచ్1 బి వీసాల ఆధారంగా ఇండియన్స్ ను అక్కడ కొలువుల్లో చేర్చుకున్నాయి.  

వినాశకాలే విపరీత బుద్ధి!

అమెరికా అధ్యక్షుడు హెచ్ 1 బి వీసా ఫీజులను భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వినాశకాలే విపరీత బుద్ధేగా అభివర్ణిస్తున్నారు బిజినెస్ ఎక్స్ పర్ట్స్. అసలు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాను భారీ ఆర్థిక సుడిగుండంలోకి నెట్టేస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  ట్రంప్‌ టారీఫ్ లు, విదేశీ విద్యార్థులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తాజాగా..  తాజాగా హెచ్1 బీ వీసాల ఫీజు ఏడాదికి లక్ష డాలర్లుగా ఖరారు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఏడాదికి లక్ష డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాలా 88 లక్షల రూపాయలు. అమెరికా కంపెనీలలో, అమెరికాలోని భారతీయ కంపెనీలలో ఈ హెచ్ 1 బీ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారి సంఖ్య లక్షలలో ఉంటుంది.  ఇంత కాలం ఈ విసాల ఫీజును  భారత ఉద్యోగులు పని చేస్తున్న కంపెనీలే భరిస్తున్నాయి. ఇకపై అంటే ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఆ పరిస్థితి ఉండక పోవచ్చు.  దీంతో ఆయా కంపెనీలు విదేశీయులను కొలువుల నుంచి తొలగించే నిర్ణయానికి రావచ్చు. ట్రంప్ కోరుతున్నది కూడా అదే. అలా కాకుంటే  పెద్ద  సంఖ్యలో ఉద్యోగులను తొలగించి నామమాత్రపు సిబ్బందికి వీసా ఫీజులు చెల్లించి కొనసాగించాల్సి ఉంటుంది. ఇవేవీ కాకపోతే.. విదేశీ ఉద్యోగులపై ఎక్కువగా ఆధారపడే కంపెనీలు.. అగ్రరాజ్యంలో తమ కార్యకలాపాలను నామమాత్రం చేసుకుని.. భారత్, చైనా వంటి దేశాలలో తమ కార్యకలాపాలను విస్తరించుకోవచ్చు. ఆర్థిక నిపుణుల అంచనాలు, విశ్లేషణలూ కూడా అమెరికాలో కార్యకలాపాలను తగ్గించుకోవడం అనే ఆప్షన్ కే మెజారిటీ కంపెనీలు మొగ్గు చూపుతాయి.   తమతమ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులకు ఇంత భారీ స్థాయిలో వీసాలు చెల్లించడం అన్నది ఆయా సంస్థలకు ఎంత మాత్రం ఫీజబుల్ కాదనడంలో సందేహం లేదు.  కనుక తొలుత ఉద్యోగుల తొలగింపు చేపట్టి ఆర్థిక భారం తగ్గిచుకున్నా..ముందు ముందు అమెరికాలో కార్యకలాపాలను క్రమంగా తగ్గించు కుంటూ విదేశాలలో అంటే అమెరికా బయట కంపెనీని విస్తరించడానికి ఎక్కువ ఐటీ కంపెనీలు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.  అమెరికా అధ్యక్షుడు హెచ్1 బి వీసా ఫీజును ఇంత భారీగా పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని బంగారు బాతు గుడ్డు కథతో పోలుస్తున్నారు ఆర్థిక నిపుణులు.  ఈ నిర్ణయం వల్ల రాబోయే కాలంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం కావడం ఖాయమని అంచనా వేస్తున్నారు. 

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఉచితంగా లడ్డూ ప్రసాదం

  విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవ ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకుంది. మూలా నక్షత్రం, దశమి రోజుల్లో టికెట్లు లేకుండా దర్శనం కల్పించడంతో పాటు దర్శన సమయం 22 గంటలకు పెంచింది. ఉచితంగా లడ్డూ ప్రసాదం, పంచ హారతిలో ప్రముఖుల ప్రత్యేక దర్శనాల రద్దు, అంతరాలయ దర్శనాల నిలిపివేత, రూ.500 టికెట్లు రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. కాగా ఈ నెల 22 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద జరిగే దసరా వేడుకల్లో ఈసారి ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. భద్రత కోసం ఏఐ ఆధారిత కెమెరాలు, డ్రోన్లు అమర్చనుండగా, చిన్నారుల రక్షణ కోసం రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ చేతి బ్యాండ్‌లు అందించనున్నారు. ఉత్సవాల వివరాలు, సేవలపై పూర్తి సమాచారం అందించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ మరియు చాట్‌బాట్‌ను రూపొందించారు. ‘దసరా–2025’ పేరుతో ఆ యాప్‌ ప్లే స్టోర్‌, ఐఓఎస్‌ యాప్‌ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. యాప్‌లో పొందుపరిచిన ఫీచర్లు, వినియోగదారులకు అందే సౌకర్యాల గురించి అమరావతి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ చింత అనిల్‌కుమార్‌ వివరించారు.  

ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట అమెరికా!

అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక మాంద్యం ముప్పు ముంగిట ఉందా? అగ్రదేశాధినేత ట్రంప్ అడ్డగోలు నిర్ణయాలు, విధానాల కారణంగా అగ్రరాజ్యం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోనుందా అంటే అంతర్జాతీయంగా అత్యంత పేరు ప్రఖ్యాతలున్న ప్రముఖ ఫైనాన్షియల్ రేటింగ్ కంపెనీ మూడీస్ ఔననే అంటోంది. మూడీస్ చీఫ్ మార్క్ జాండీ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోనుందని హెచ్చరించారు. ఆ దేశంలో పెట్టుబడులు మందగిస్తున్న సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలే ఇందుకు కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. కొన్ని దేశాలపై ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్.. ఆ దేశాలపై కంటే, అమెరికాపైనే తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతుందని మూడీస్ చీఫ్ మార్క్ జాండీ అభిప్రాయపడ్డారు.  అలాగే ట్రంప్ అనుసరిస్తున్న వలస విధానం కారణంగా దేశంలో ఉద్యోగ నియామకాలు తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని వివరించారు. ఇక ఫెడరల్ రిజర్వ్ విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వ్యాపార రంగం తీవ్రంగా ప్రభావితమౌతుందన్నారు. ఇప్పటికే పెట్టుబడులు మందగించి ఆర్థిక మాంద్యం సూచనలు కనిపిస్తు న్నాయని చెప్పారు. ఇప్పటికే నిర్మాణ రంగం, ఉత్పాదక రంగాలలో ఆ ఛాయలు కనిపిస్తున్నాయని ఉదహరించారు.  ట్రంప్ టారిఫ్ వార్ ప్రభావం ఇంకా అమెరికాలో వినియోగదారులపై పూర్తి స్థాయిలో పడలేదనీ, త్వరలో అది కూడా జరుగుతుందని హెచ్చరించిన మార్క్ జాండీ.. ఆర్థిక మాంద్యంలో ఏ స్టాక్ కూడా సురక్షితం కాదని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 

అన్నమయ్య జిల్లాలో వర్ష బీభత్సం.. రాయచోటిలో నలుగురు మృతి

అన్నమయ్య జిల్లా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా రాయచోటిలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. మూడు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపాయి. రాయచోటీలో భారీ వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తున్న కాలువలో ఓ తల్లి, కుమారుడు కొట్టుకుపోయారు. వారికి కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తి కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక రాయచోటిలోనే మరో ఘటనలో యామిని అనే చిన్నారి గల్లంతైంది. ఈ ఘటనలతో రాయచోటిలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం ప్రకారం షేక్ మున్నీతన కుమారుడితో పాటు  ఎస్ఎన్ కాలనీ అంగన్వాడీ సమీపంలో నడుస్తూ వెడుతుండగా కాలువపై రాతిపలక విరిగిపోవడంతో కాలువలో పడిపోయారు.  వారిని కాపాడేందుకు ప్రయత్నించిన గణేష్ కూడా ప్రవాహంలో కొట్టుకుపోయారు.  ఈ ముగ్గురి మృతదేహాలూ లభ్యమయ్యాయి. ఇక కే. రామాపురం పరిధిలోనొ ఓ కాల్వలో యామిని అనే ఏడేళ్ల చిన్నారి గల్లంతైంది. ఆమె కోసం గాలింపు కొనసాగుతోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచీ, విదేశాల నుంచీ కూడా భక్తులు వెంకటేశ్వరుడి దర్శనం కోసం వస్తుంటారు. శనివారం (సెప్టెంబర్ 20) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి  18 గంటల సమయం పడుతోంది.ఇక శుక్రవారం(సెప్టెంబర్ 19) శ్రీవారిని మొత్తం 71 వేల 249 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 901 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 4 లక్షల  రూపాయలు వచ్చింది.

ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్

  ఉల్లి రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. హెక్టారుకు రూ.50 వేల పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై  సచివాలయంలో ముఖ్యమంత్రి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు.  నేటి నుంచే క్వింటాకు రూ.1,200 చొప్పున రైతుల వద్ద నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం .ఉల్లికి గిట్టుబాటు ధర వచ్చే వరకూ కమ్యూనిటీ హాళ్లల్లో నిల్వ చేయడానికి రైతులకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. వచ్చే పది రోజుల్లో ఐదువేల మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు వివరించారు.  కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లల్లో విక్రయించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. తక్షణం ఉల్లిని కొనుగోలు చేసి అన్నదాతకు నష్టం రాకుండా చూడాలని ఆదేశించారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతుబజార్ల సంఖ్యను పెంచటంతోపాటు ఆధునికీకరణకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు  

సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్‌లో మరో ఏడుగురు అరెస్ట్

  సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది... దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కటక టాల వెనక్కి పంపించారు... మాజీ మంత్రివ ర్యులు ఆఫీసులో పనిచేసిన ఓ నిందితుడికి దురాశ పుట్టింది... దీంతో మరి కొంత మంది తో చేతులు కలిపి నకిలీ లబ్ధిదారులను పుట్టించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను జారీ చేసి వాటిని తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్ డ్రా చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు స్వాహా చేశారు.... ఈ కేసు కాస్త వెలు గులోకి రావడంతో జులై 15వ తేదీన పోలీసులు జోగులా నరేష్ కుమార్, బాలగుని వెంకటేష్, కొర్ల పతి వంశీ, పులిపాక ఓంకార్... అనే నలుగురు నిందితులను అరెస్టు చేసి ... జైలు కు పంపించారు. ఒకవైపు ప్రభుత్వం మరోవైపు నిజమైన బాధితులను మోసం చేసిన ఈ నిందితులపై ఐపిసి సెక్షన్ ప్రకారం 409,417,419,467,120(b) సెక్షన్లుIT act 66(c) కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు. అయితే ఈరోజు ఈ కేసులో పోలీసులు  పొట్ల రవి, జంగమ్మ నాగరాజు, మట్టేటి భాస్కర్, ధర్మవరం రాజు, కాంపల్లి సంతోష్, చిట్యాల లక్ష్మి, అసంపెల్లి లక్ష్మి మరో ఏడుగు రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే నిందితులు ఇప్పటివరకు  మొత్తం 8.71 లక్షల రూపాయలు అక్రమంగా  విత్‌డ్రా చేసినట్లు పోలీ సులు గుర్తించారు.  అయితే నిందితుల్లో ఒకరు మాజీ మంత్రి వర్యులు ఆఫీసులో పనిచేసేవారు. అతనిలో దురాశ పుట్టి... సీఎం ఆఫీస్ చెక్కులను దుర్విని యోగం చేసినట్లుగా పోలీసులు గుర్తిం చారు. ఈ నిందితు లందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరందరూ కలిసి నకిలీ లబ్ధిదారులు గా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తమ ఖాతాలో జమ చేసుకొని డబ్బులు విత్‌డ్రా చేసుకుని వారి ఇష్టానికి డబ్బు లను వాడుకు న్నారు. 2023 ఎన్నికల తర్వాత 230 చెక్కులను అక్రమంగా తీసు కొని గుట్టు చప్పుడు కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్19 చెక్కులను నకిలీ లబ్ధిదారుల పేర్లతో వారి ఖాతాలో జమ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... ఇంకా మిగతా నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారిని పట్టుకునేం దుకు  గాలింపు చర్యలు చేపట్టారు.  

ఏపీ లిక్కర్ కేసులో ఈడీ భారీ నగదు స్వాధీనం

  ఏపీ లిక్కర్ స్కామ్‌లో దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. హైదరాబాద్,  బెంగళూరు, చెన్నై, తంజావూరు, సూరత్, రాయ్‌పుర్, ఢిల్లీ, ఏపీలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. లెక్కల్లో చూపని రూ.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.   ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రభుత్వ  ఖజానాకు రూ.4వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది. సోదాల్లో పలు కీలకమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రధాన మద్యం బ్రాండ్ల స్థానంలో నిందితులు కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో సీఐడీ పేర్కొంది. దీని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టింది.   

పానీపూరీ కోసం వెక్కివెక్కి ఏడుస్తూ.... మహిళ నిరసన

  గుజరాత్‌ రాష్ట్రంలోని వడోదరకు చెందిన ఓ మహిళ సాయంత్రం వేళ బయట తిరుగుతూ పానీపూరీ బండి దగ్గరకు వెళ్లింది. రూ.20 ఇచ్చి ప్లేట్ కావాలని అడగగా, బండి యజమాని సాధారణంగా ఇస్తున్న ఆరు పూరీల బదులు కేవలం నాలుగు పూరీలు మాత్రమే ఇచ్చాడు. ధరలు పెరిగాయని, ఇకపై ఒక ప్లేట్‌లో నాలుగు పూరీలే ఇస్తున్నట్టు చెప్పాడు. దీనికి ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది.  “పూర్తి ప్లేట్ ఇవ్వకపోతే కదలను” అంటూ రోడ్డుపైనే కూర్చుంది. రెండు పూరీలు ఇచ్చేదాకా లేవనని పట్టుబట్టింది. దీంతో ఆ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలిసి పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ప్రశాంతపరిచారు. స్థానికులు కూడా ఆమెను అర్థం చేసుకునేలా ప్రయత్నించారు. చివరికి ఆ మహిళ బండి యజమానిని క్షమించమని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.  పానీపూరీ కోసం ట్రాఫిక్ నిలిపివేయడం సరైనదా కాదా అన్న దానిపై నెటిజన్లు వాదోపవాదాలు చేస్తున్నారు. కొందరు “ఇది చిన్న విషయం కోసం హడావిడి” అని వ్యాఖ్యానిస్తే, మరికొందరు “ధరలు పెరిగినా ముందే కస్టమర్లకు చెప్పాలి” అంటున్నారు.ఘటన అనంతరం బండి యజమాని “ధరలు పెరగడంతో నాలుగు పూరీలకే పరిమితం చేయాల్సి వచ్చింది, కానీ కస్టమర్లకు ముందే చెప్పకపోవడమే తప్పు” అని అంగీకరించాడు.

నో ఫ్లై జోన్ గా తెలంగాణ సెక్రటేరియట్

  తెలంగాణ సచివాలయంపై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ, ఆ ప్రాంతంలో డ్రోన్లు, ఇతర ఎగురే పరికరాలను నిషేధించింది. భద్రతా విభాగం సూచనల మేరకు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపధ్యంలో, ప్రజల రాకపోకలు పెరగనుండటంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.  సచివాలయం చుట్టూ స్పష్టంగా కనిపించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పండుగ సమయంలో  బతుకమ్మలను తీసుకువచ్చే మహిళలు, కుటుంబాలు అధికంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు ప్రత్యేక భద్రతా బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం పరిసరాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి, పర్యవేక్షణను 24 గంటలూ కొనసాగిస్తున్నారు. డ్రోన్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ముఖ్యమని, అందరూ ఈ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.  

మరోసారి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో వివాదం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్ సీఏలో వివాదాలకు అంతూ దరీ కనిపించడం లేదు. తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఆ అసోసియేషన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్ పై అసోసియేషన్ అఫ్లియేటెడ్ క్లబ్బుల కార్యదర్శులు బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ఫిర్యాదు చేయడం విశేషం.  బీసీసీఐ   వార్షిక సర్వసభ్య సమావేశం   ఈ నెల 28న ముంబైలో జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో పాల్గొనేందుకు అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేష‌న్‌ల‌కు బీసీసీఐ నుంచి ఆహ్వానాలు అందాయి. హెచ్‌సీఏకు కూడా ఈ ఆహ్వానం అందింది. అయితే ఈ సందర్భంలోనే హెచ్ సీఏ యాక్టింగ్ ప్రెసిడెంట్ పై పలు క్లబ్ ల కార్యదర్శులు బీసీసీఐకి లేఖలు రాశారు. అలాగే  ద‌ల్జిత్ పై సింగిల్ మెంబ‌ర్ కమిటీ జస్టిస్ నవీన్ రావ్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దల్జిత్ సింగ్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ బీసీసీఐ ఏజీఎంకు హెచ్ సీఏ ప్రతినిథిగా పాల్గొనడం నిబంధనలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.   దీంతో హెచ్ సీఏలో మరో వివాదం రగులుకున్నట్లైంది. బీసీసీఐ ఎన్నికలకు హెచ్ సీఏ ప్రతినిథిగా హాజరయ్యే అర్హత దల్జీత్ సింగ్ కు లేదని వారు ఆ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఆయనకు బీసీసీఐ ఎన్నికలలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిథిగా పాల్గొనేందుకు ఆధరైజేషన్ లేదనీ, అలా ఆథరైజేషన్ లేకుండా పాల్గొనడం లీగల్ వయలేషన్ అవుతుందనీ పేర్కొన్నారు.  .