విజయవాడ ప్రజల ఆతిథ్యం హృదయాన్ని తాకింది : ఉపరాష్ట్రపతి
విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ఆకాంక్షించారు. విజయవాడ పున్నమి ఘాట్‌లో అంగరంగ వైభవంగా నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025 లో ఉపరాష్ట్రపతి పాల్గొనన్నారు. తెలుగు భాష అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ప్రశంసిస్తూ, “అందమైన తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయిని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సాహిత్యభరితంగా, సంగీతభరితంగా ఉండటమే తెలుగు భాషను ప్రత్యేకం చేస్తోంది” అని అన్నారు.
నవరాత్రి ఉత్సవాల ప్రత్యేకతను గుర్తుచేశారు. “దేశవ్యాప్తంగా దుర్గా నవరాత్రులు ఎంతో ప్రత్యేకం. తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తితో పూజించే సంప్రదాయం భారతీయుల అదృష్టం. ఇది సాంప్రదాయానికి, సంస్కృతికి అద్దం పడుతోంది” అని పేర్కొన్నారు. మహిళా శక్తిని గౌరవించడం భారతీయ సంప్రదాయమని, అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా కొలవడం ద్వారా శక్తి, భక్తి రెండూ లభిస్తాయి అని ఉపరాష్ట్రపతి చెప్పారు.విజయవాడ ప్రత్యేకతపై మాట్లాడుతూ ఆయన, “విజయవాడ హాటెస్ట్ సిటీ, కూల్ పీపుల్. రాబోయే రోజుల్లో విజయవాడ దేశంలోనే అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోంది” అని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పై మాట్లాడుతూ, “విద్య, వైద్యం రంగాల్లో రాష్ట్రం ముందుకు సాగుతోంది. వికసిత భారత్ అనేది ఒక కల కాదు, అది నిజం. సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది. శాస్త్ర, సాంకేతిక, వైద్య, విద్య రంగాల్లో కూడా రాష్ట్రం విశేష పురోగతిని సాధిస్తోంది” అని అన్నారు.
ఉపరాష్ట్రపతి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మొదటి అధికారిక పర్యటన విజయవాడకే రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన, “విజయవాడలో అద్భుతమైన గౌరవం లభించింది. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణం. కనకదుర్గ అమ్మ పేరులోనే అనుగ్రహం, ప్రేమ, అమృతం నిక్షిప్తమై ఉంది” అని భావోద్వేగంగా తెలిపారు.
మంత్రులు, అధికారులు అందరూ కలసి రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరుతూ, రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అంతేకాక, ఉత్సవ వేదికపై గాయని గీతా మాధురి పాడిన పాటలను ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగం, విజయవాడ ఉత్సవ్ లో పాల్గొన్న వేలాది మంది ప్రజల్లో ఉత్సాహాన్ని నింపగా, నగర అభివృద్ధి పై ఆయన విశ్వాసపూర్వక మాటలు హాజరైన వారందరిలో ఆనందాన్ని కలిగించాయి.