శ్రీశైలంలో నేటి నుంచి దసరామహోత్సవాలు

శ్రీశైలంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం(సెప్టెంబర్ 22)  ప్రారంభమైన దసరామహోత్సవాలు వచ్చే నెల 2వ తేదీ వరకూ జరుగుతాయి. దసరా మహోత్సవాల సందర్భంగా మల్లన్న ఆలయాన్ని ముస్తాబు చేశారు. శ్రీశైలం క్షేత్రమంతా విద్యుత్ దీపాలతో అలంకరించారు.  శ్రీశైలం మల్లన్న ఆలయం లోపలి పరివార ఆలయాలు, ప్రధాన గోపురాలను కూడా కన్నుల పండువగా వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరించారు.  దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయం బయట స్వామి అమ్మవారు వహనసేవలో గ్రామోత్సవంగా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చే ప్రధాన మాడవీధులు,రథశాలను  కూడా అంగరంగవైభవంగా అలంకరించి ముస్తాబు చేశారు.   సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అక్టోబర్ 2వరకు 11 రోజులు పాటు దసరా దేవి శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. ఉదయం 9 గంటలకు స్వామి, అమ్మవారి యాగ శాల ప్రవేశంతో ఆలయ అర్చకులు, వేదపండితులు,ఈవో శ్రీనివాసరావు దసరా మహోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఇక  సాయంత్రం అమ్మవారు శైలపుత్రిగా దర్శనమివ్వనున్నారు. అలానే స్వామి అమ్మవారు భృంగివాహనంపై గ్రామోత్సవంగా క్షేత్రపురవిధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శన మివ్వనున్నారు.

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచీ భక్తులు తిరుమలకు వచ్చి వేంకటేశ్వరుడిని దర్శించుకుంటారు. అలాంటి తిరుమలలో సోమవారం (సెప్టెంబర్ 22) భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంది. సోమవారం (సెప్టెంబర్ 22) ఉదయం  శ్రీవారి దర్శనం కోసం ఒక కంపార్ట్ మెంట్ లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.  ఇక ఆదివారం (సెప్టెంబర్ 21) శ్రీవారిని మొత్తం 67 వేల 408 మంది దర్శించుకున్నారు. వారిలో 16 వేల 597 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 73 లక్షల రూపాయలు వచ్చింది. 

వన్ నేషన్...వన్ ట్యాక్స్ కల సాకరం : ప్రధాని

  దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభవార్త అందించారు. నవరాత్రుల తొలి రోజైన సెప్టెంబర్ 22 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభమవుతుందని ప్రధాని తెలిపారు . కొత్తగా అమలు చేస్తున్న జీఎస్టీ సంస్కరణలతో వస్తువుల ధరలు గణనీయంగా తగ్గి, ప్రజలకు ఇది “పొదుపు పండగ” అవుతుందని మోదీ వివరించారు. దేశ ఆర్థిక చరిత్రలో కొత్త అధ్యాయానికి ఇదే నాంది అని ఆయన పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కొత్త జీఎస్టీ రేట్లతో ప్రజలు తమకు ఇష్టమైన వస్తువులను మరింత చవక ధరల్లో సులభంగా కొనుగోలు చేయగలరని ప్రధాని తెలిపారు. “ఇది ప్రతి భారతీయుడికి జీఎస్టీ పొదుపు పండగలాంటిది” అని ఆయన అన్నారు. పన్ను తగ్గింపు ముఖ్యంగా పేదలు, నూతన మధ్యతరగతి వర్గాలకు రెండింతల ప్రయోజనం చేకూరుస్తుందని మోదీ వెల్లడించారు. ఈ సంస్కరణలు రైతులు, చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు), మహిళలు, యువత, మధ్యతరగతి కుటుంబాలకు నేరుగా మేలు చేస్తాయని ఆయన వివరించారు. “జీఎస్టీ 2.0” పేరుతో ప్రవేశపెట్టిన ఈ విధానంలో పన్ను నిర్మాణాన్ని సులభతరం చేశారు. ఇకపై 5% మరియు 18% అనే రెండు ప్రధాన శ్లాబులు మాత్రమే ఉండగా, అత్యంత విలాసవంతమైన లేదా హానికరమైన వస్తువులపై అదనంగా 40% పన్ను విధించనున్నారు. సెప్టెంబర్ 4న ప్రకటించిన ఈ తగ్గింపులు, 2017 జూలైలో జీఎస్టీ అమలు తర్వాత పరోక్ష పన్నుల వ్యవస్థలో జరిగిన అతిపెద్ద సంస్కరణలుగా నిలిచాయి. కేంద్రం–రాష్ట్రాల సంపూర్ణ ఏకాభిప్రాయంతో 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. ఈ సంస్కరణలు సహకార స్ఫూర్తికి నిదర్శనమని, వస్తువులు చౌక కావడంతో పాటు పరిశ్రమలకు ఉత్సాహం లభించి, భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

గురజాడ గృహం ఆధునీకరణకు పవన్ చర్యలు

  విద్యలనగరం సమున్నత కీర్తి శిఖరం గురజాడ వేంకట అప్పారావు గృహం స్థితిగతులపై డిప్యూటీ సీఎం పవన్ స్పందించారు. కన్యాశుల్కం వంటి కీర్తిశేషం పుట్టిన ఆ ఇంటి గోడలు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గురజాడ వారసులు ప్రసాద్, ఇందిర… తమ సొంత నిధులతో గోడలపై మట్టిని పూస్తూ, పైకప్పు వర్షం తడవకుండా కాపాడుతూ ఎంతకాలం లాగగలిగారో అంతవరకే సాగించారు. సహాయం కోసం కార్యాలయాల గడప తట్టినా, ఫలితం పెద్దగా రాలేదు. చివరికి పోస్టు కార్డు ఉద్యమం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇంతలో ఒక చొరబాటు సంఘటన ఆ ఇంటి అస్థిరతను మరింత రేగదీసింది.  అదే సమయంలో ఓ ప్రముఖ దిన పత్రికలో వచ్చిన న్యూస్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కంటపడింది. వెంటనే ఆయన స్పందించి గురజాడ ఇంటిని పూర్తిగా పునరుద్ధరిస్తాం, రచనలను డిజిటలైజ్ చేస్తాం, సమీపంలో ఆడిటోరియం కడతాం” అని హామీ ఇచ్చారు. విజయనగరంలో ఇప్పటికే సింహాచలం మేడ, మహారాజా ఆస్పత్రి, సంగీత కళాశాల వంటి ఎన్నో చారిత్రక కట్టడాలు కాలం వలలో కనుమరుగయ్యాయి. గురజాడ గృహం కూడా అదే మార్గంలో పోవచ్చనే భయం అందరిలో ఉంది.  కానీ ఈసారి ఒక ఆశాకిరణం కనిపించింది. పవన్ కళ్యాణ్ మాటలకు కార్యరూపం వస్తే గురజాడ అప్పారావు స్మృతి, ఆయన స్ఫూర్తి మరింత బలపడతాయి. విజయనగరం ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటారు. పైడితల్లి జాతర నాటికి ఆ గృహం పూర్వ వైభవం తిరిగి తెచ్చి నిలబెట్టే రోజును అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ రోజు రాగానే, గురజాడ ఇంటి చరిత్ర కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది.

తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సిద్దం

  తెలంగాణ అంతటా బతుకమ్మ పండుగ సంబరాలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. మహాలయ అమావాస్య సందర్భంగా నేటి (ఆదివారం) నుంచి పల్లెపల్లెల్లో, పట్టణాలన్నిట్లో తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఆటపాటల సందడి నెలకొననుంది. సకల వర్గాల ప్రజలు ఏకతాస్ఫూర్తిని చాటుకుంటూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రకృతిని ఆరాధిస్తూ, పూలను పూజిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలు తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై, చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పాటలతో, ఆటలతో రాష్ట్రం పండుగ మూడ్‌లో తేలనుంది. హైదరాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు చేసినట్టు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. నగర వ్యాప్తంగా 384కి పైగా బతుకమ్మ కుంటలు, చెరువులు, తాత్కాలిక కుంటలు, ట్యాంకులు సిద్ధం చేశామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యం కోసం 82 తాత్కాలిక మరుగుదొడ్లు, 45 వేల లైట్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. వేడుకల ప్రాంగణాల్లో 1,450 శానిటేషన్ సిబ్బంది పనిచేయనున్నారని చెప్పారు. పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, ఎల్‌బి స్టేడియం, జలవిహార్, కాప్రా చెరువు, ఉప్పల్ నల్ల చెరువు, సరూర్‌నగర్ చెరువు, చార్మినార్, రాజేంద్రనగర్, మెహదీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, ముషీరాబాద్, అంబర్‌పేట్, సికింద్రాబాద్, బేగంపేట్, సేరిలింగంపల్లి తదితర ప్రాంతాలు ప్రధాన వేదికలుగా సిద్ధం చేశామని అధికారులు స్పష్టం చేశారు.  చెరువుల వద్ద శుభ్రత, దోమల నివారణ స్ప్రేలు, భద్రతా చర్యలతో పాటు మహిళా సంఘాలు, వాలంటీర్లు, స్థానిక సంఘాల సహకారంతో ఈసారి బతుకమ్మ వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.మరో వైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సిద్దిపేట జిల్లా చింతమడకకు చేరుకున్నారు. ఆమెకు స్థానిక మహిళలు, జాగృతి నేతలు ఘన స్వాగతం పలికారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలో కవిత పాల్గొననున్నారు

ఏపీలో బంగారు గనుల తవ్వకం షురూ... ఏటా 750 కిలోల గోల్డ్ ఉత్పత్తి

  భారతదేశ బంగారం ఉత్పత్తి పటంలో ఆంధ్రప్రదేశ్‌ త్వరలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి గోల్డ్ ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది. జొన్నగిరి గని నుంచి తొలినాళ్లలో ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు.  రానున్న రెండు, మూడేళ్లలో ఈ ఉత్పత్తిని 1,000 కిలోల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఏటా కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో, ఏటా సుమారు 1,000 టన్నుల పసిడిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరిలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో మొదలైతే, దేశీయంగా బంగారం లభ్యత పెరిగి దిగుమతుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  

ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం

  వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. కాజీపేట అయోధ్య పురానికి చెందిన జ్యోతి ఈ నెల 17న తీవ్ర జ్వరంతో ఎంజీఎం ఆస్పత్రిలో చేరికైంది. చికిత్స నిర్వహించిన వైద్యులు రక్తం ఎక్కించాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో జ్యోతి రక్త నమూనాలను  సేకరించి పరీక్షలు నిర్వహించారు. రక్తం తక్కువగా ఉండడం రక్త కణాల సంఖ్య పడిపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించాలని జ్యోతి బంధువులకు సూచించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని రక్త నిధి నుండి రక్తాన్ని తీసుకురాగా ఓ పాజిటివ్ కు బదులుగా వైద్యులు బి పాజిటివ్ ఎక్కించారు.  ఈ క్రమంలో జ్యోతి ఒంటిపై దురద రావడంతో వైద్యులకు తన సమస్యను వివరించడంతో.. మరోసారి రోగికి రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ  పాజిటివ్ కు బదులుగా మరో గ్రూప్ రక్త లెక్కించడంపై కంగుతున్న వైద్యులు గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు చికిత్స నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇది ఇలా ఉంటే వైద్యులు సిబ్బంది లక్ష్యం కారణంగా తమ కూతురు ఆరోగ్యం ఓ క్రమంలో ముఖ్యమంగా మారిందని జ్యోతి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

స్వర్ణ నారావారి పల్లెకు స్కోచ్ గోల్డెన్ అవార్డు

  స్వర్ణ నారావారిపల్లి గ్రామం ప్రతిష్టాత్మక స్కోచ్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. ప్రతి ఇంటికీ సౌర రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయించుకున్న దేశంలోని తొలి గ్రామంగా ఈ గౌరవం దక్కింది. కేవలం 45 రోజుల్లోనే 1,600 ఇళ్లపై సోలార్ ప్యానెల్‌లను అమర్చి, గ్రామమంతా విద్యుత్ వెలుగులు నింపారు. కర్బన ఉద్గారాలను తగ్గించి, హరిత స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించేందుకు ప్రారంభించిన ఈ ప్రాజెక్టులో, ప్రతి ఇంటికి ఉచితంగా సౌర ప్యానెల్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం 3,396 కిలోవాట్ల సామర్థ్యంతో, ఏటా సుమారు 4.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవనుంది. దీని విలువ దాదాపు ₹3.39 కోట్ల వరకు ఉంటుంది. ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును విజయవంతం చేశాయి. గ్రీన్ ఎనర్జీ వినియోగంలో సంపూర్ణంగా ముందడుగు వేసిన గ్రామంగా, స్కోచ్ సంస్థ ఈ గోల్డెన్ అవార్డును ప్రకటించింది. తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర నాయుడు ఢిల్లీలో ఈ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు “ఎక్స్” వేదికగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయానికి తోడ్పడిన ప్రజలు, అధికారులు అందరికీ అభినందనలు తెలియజేశారు.  

దుర్గమ్మ దసరా ఉత్సవాల షెడ్యూల్ విడుదల

  విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దసరా ఉత్సవాలు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శినా నాయక్  తెలిపారు. మొత్తం 11 రోజుల పాటు 11 అలంకారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.దుర్గగుడి స్థానాచార్య శివప్రసాద్ శర్మ వివరాల ప్రకారం అమ్మవారి అలంకారాలు ఈ విధంగా ఉంటాయి సెప్టెంబర్ 22 న బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ. 23 న గాయత్రీ దేవి గా  24 న అన్నపూర్ణాదేవి గా  25 న కాత్యాయని దేవి గా  26 న మహాలక్ష్మి గా  27న లలితా త్రిపుర సుందరి దేవి గా 28న  మహాచండి దేవి గా 29 న సరస్వతి దేవి గా  30 న దుర్గాదేవి గా  1న మహిషాసుర మర్దిని దేవిగా 2 న రాజరాజేశ్వరి దేవి గా భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ. అక్టోబర్ 2 వ తేదీ 9:30 కు పూర్ణాహుతి తో దసరా ఉత్సవాలు ముగియనున్నాయి. అదేరోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణ నది లో హంస వాహన తెప్పోత్సవం జరగనున్నాది. సెప్టెంబర్ 29 వ తేదీ మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుండి 4:30 మధ్య సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.  

రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంక్‌లో రూ.65 లక్షలు స్వాహా

    అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. రాజంపేటలోని ఆర్టీసీ పెట్రోల్ బంకులో చోటు చేసుకున్న అక్రమాలపై విచారణ పూర్తి కావడంతో పలువురి సిబ్బందిపై వేటు పడింది. సుమారు రూ. 62 లక్షలు మేర రాజంపేటలో ఆర్టీసీ పెట్రోల్ బంకులో అక్రమంగా నిధులు గోల్ మాల్ జరిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్దారించారు. రాజంపేట డిపో మేనేజర్ తో సహా మరో ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. గతంలో బంక్ నిర్వహణ లో పని చేస్తున్న 29 మందిపై కేసు నమోదు చేశారు.  గత ఏడాది డిసెంబర్ 7న రాజంపేటలో పెట్రోల్ బంక్ ప్రారంభించారు. పెట్రోల్ బంక్ నిర్వహణకు వచ్చిన వాహనాలకు పెట్రోల్ నింపేందుకు నంద్యాలకు చెందిన చంద్రమోహన్ అనే వ్యక్తికి కాంట్రాక్ట్ ఇచ్చారు. అతను ఆర్టీసీ అధికారులతో పాటు మరికొంత మంది ప్రైవేట్ వ్యక్తులను  సిబ్బందిగా నియమించుకుని పెట్రోల్ బంకు నిర్వహణ చేపట్టారు.  ఈ నిర్వహణలో కాంట్రాక్టర్ భారీ అవినీతికి పాల్పడి కంప్యూటర్ పరిజ్ఞానంతో పెట్రోల్ బంక్ లో నిర్వహిస్తున్న స్కానర్లను మార్చడంతో పాటు ఫోన్ పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్ లను పకడ్బందీగా రిజిస్టర్లో నమోదు చేసి లెక్కలు సరిపోయే విధంగా చూపించి అవినీతికి పాల్పడ్డారు. ప్రతి నెల నష్టాలు రావడంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.. అందులో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించి అన్నమయ్య జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల క్రితం కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ బాధ్యులైన ఆర్టీసీ డియం రమణయ్యతో పాటు 5 మందిని సస్పెండ్ చేశారు.  

చావు బతుకుల మధ్య డీఎస్పీ నళిని

  డీఎస్పీ నళిని .. తెలంగాణ ఉద్యమ సమయంలో మార్మోగిన పేరు. తెలంగాణ కోసం ఉద్యమించే నా అన్నాచెల్లెళ్లపై లాఠీ ఝుళిపించలేనంటూ ఉన్నతాధికారులకు తేల్చి చెప్పారు. తన డీఎస్పీ కొలువునే వదిలేసుకున్నారు. 2012లో చోటు చేసుకున్న ఈ ఘటన యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. పాలకులను కదిలించింది. ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసి ఉద్యమంలో భాగమయ్యారు నళిని. ఢిల్లీలో రెండుసార్లు దీక్షకు సైతం కూర్చున్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకు డీఎస్పీ నళిని బహిరంగ లేఖ వీలునామా మరణ వాంగ్మూలం రాసింది. ఒక అధికారిణిగా, ఉద్యమకారిణిగా, రాజకీయవేత్తగా,  ఆయుర్వేద ఆరోగ్య సేవిక గా, ఆధ్యాత్మిక వేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది.  నాఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం  క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. మూడు(3)రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. ఆర్థరైటిస్ కారణాలు?  ఎనిమిది ఏండ్ల క్రితం సోకిన ఆర్థరైటిస్ అనే విలక్షణ కీళ్ల జబ్బు మరియు గత రెండు నెలలుగా టైపాయిడ్ , డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కనకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకా కీలు విరిచేసినట్లు నొప్పి తట్టుకోలేక పోతున్నాని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది 2018 లో ఈ జబ్బు ప్రారంభం అయినప్పుడు ఇలాంటి స్థితి యే ఏర్పడ్డపుడు,మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రాందేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలల తరబడి  ఉంటూ నన్ను నేను బాగుచేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు  అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదని నళిని పేర్కొన్నారు.                   25 ఏండ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్  యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మసిస్టు ను కూడా. కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన RA ఫ్యాక్టర్  అత్యధికంగా 900 కు చేరినా స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ, యోగ,ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయి కి చేర్చాయి.                 నా గతమంతా వ్యధ భరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహం లోంచి బయట పడితే, డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసితీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక, నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయవల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని, అందులో విశేషమైన కృషి చేస్తూ, యజ్ఞ బ్రహ్మగా ( వేద యజ్ఞ పరిరక్షణ సమితి) సంస్థాపకురాలుగా ఎదిగి, హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని,నా దారిని రహదారిగా పూల బాటగా మలచుకున్నాను. నళిని మళ్ళీ వికసించింది.            ఇలాంటి తరుణంలో నేటి కాంగ్రెస ప్రభుత్వం  అధికారంలోకి రాగానే నా ఫైల్ ను  ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నెండ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అల్లోవెన్స్ లెక్క కట్టి( సుమారు 2 కోట్లు) ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను.  వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను.  రెండోది  వారి పార్టీ పాలసీ కి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైంది అని తెలిసింది. నా ఆఫీస్ కాపీ ని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు.               మీడియా మిత్రులకు విజ్ఞప్తి. నేను చస్తే ఎవరూ సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్,కవయిత్రి ,యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంభోదించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి . బ్రతుకుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్టుమస్ అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి  బయలుదేరే రాష్ట్ర నాయకులకు  ఒక వినతి. బ్రతుకుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ  లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు.            ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో  ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే ,నాకు సరైన , ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయట పడతాను. లేదంటే .  ..ఇంకా 3,4 పుస్తకాలు రచించాలని ,100 వీఐపీ యజ్ఞాలు పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం  చేయాలని ... ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు.                నా పేరు పై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం వేద యజ్ఞ పరిరక్షణ సమితికు చెందుతుంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేక పోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్ళీ జన్మలో కొనసాగిస్తాని నళిని పేర్కొన్నారు.

కేఏ పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు... కేసు నమోదు

  ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ ఓ యువతి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పాల్‌ ఆఫీసులో పనిచేస్తున్న ఒక యువతి.. తనను లైంగికంగా వేధిస్తున్నారని షీ టీమ్స్‌ను ఆశ్రయించింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలను షీ టీమ్స్‌‌కు అందచేసినట్లు బాధితురాలు తెలిపింది. ఈ నేపథ్యంలో షీ టీమ్ కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేసింది

ద‌క్షిణాది దాదా సాహెబ్స్ వీరే!!!

  మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్‌కి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వ‌చ్చింది. దీంతో మ‌రో సౌతిండియ‌న్ ఈ అవార్డు ద‌క్కించుకున్న‌ వారిగా ఆయ‌న చ‌రిత్ర సృష్టించారు. ఇంత‌కీ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ద‌క్కించుకున్న‌ ఫ‌స్ట్ సౌతిండియ‌న్ ఎవ‌ర‌ని చూస్తే ఆయ‌న బీఎన్ రెడ్డి. తెలుగులో ప‌దిహేను సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈయ‌న తొలి సౌతిండియ‌న్ దాదాసాహెబ్ ఫాల్కే విన్న‌ర్. సెకండ్ దాదా సాహెబ్ ఫాల్కే విన్న‌ర్స్ కోవ‌లోకి వ‌చ్చే మ‌రో ద‌క్షిణాది న‌టుడు పైడి జయ‌రాజ్. నటుడు-దర్శకుడు జైరాజ్ భారతీయ చారిత్రక పాత్రల చిత్రణకు ప్రసిద్ధి. ఎన్నో ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సైతం పొందారు జ‌య‌రాజ్. మూడో వ్య‌క్తి విష‌యానికి వ‌స్తే న‌టుడు, ద‌ర్శ‌క నిర్మాత కూడా అయిన ఎల్వీ ప్ర‌సాద్. ఈయ‌న‌ సైతం ద‌క్షిణాది దాదా సాహెబ్ అవార్డు విజేత‌ల్లో ఒక‌రు. ప్ర‌సాద్ మూడు భాష‌ల్లో నిర్మించిన తొలి టాకీలో న‌టించ‌డం ద్వారా ప్ర‌త్యేక‌త సాధించారు. హిందీ ఆలం అరా, త‌మిళ కాళిదాసు, తెలుగు భ‌క్త ప్ర‌హ్లాద‌.. ఇవ‌న్నీ 1931లో రిలీజ‌య్యాయి. 1965లో ప్రసాద్ స్టూడియోస్ తో పాటు 1976లో క‌ల‌ర్ ఫిల్మ్ లాబ‌రేట‌రీ స్థాపించారు. ప్రసాద్ స్టూడియోస్ వివిధ భారతీయ భాషలలో 150కి పైగా చిత్రాలను నిర్మించడం గ‌మ‌నార్హం.  ఇక బి నాగిరెడ్డి. ఈ పేరు ఆ రోజుల్లో ఒక బ్రాండ్. విజ‌య వాహిని స్టూడియోస్ స్థాప‌కులు నాగిరెడ్డి. ఆ స‌మ‌యంలో ఏసియాలోనే ఇదే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియో కావ‌డం విశేషం. దీంతో నాగిరెడ్డికి సైతం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వ‌రించింది.   అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. తెలుగు సినిమా రెండు క‌ళ్ల‌లో ఒక‌రు. ఎన్టీఆర్ తో స‌మానంగా తొలినాళ్ల‌లో తెలుగు తెర‌ను ఏలిన  న‌టుడు. 250కి పైగా సినిమాల్లో న‌టించారు. అంతే కాదు అన్న‌పూర్ణ స్టూడియో ద్వారా ఇప్ప‌టికీ తెలుగు సినిమాకు సేవ‌లందిస్తూనే ఉన్నారు. నాగేశ్వ‌ర‌రావుకు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చి స‌త్క‌రించింది కేంద్ర ప్ర‌భుత్వం. ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ పొందిన మ‌రో న‌టుడు క‌న్న‌డ కంఠీర‌వ రాజ్ కుమార్. 200 పైగా సినిమాల్లో న‌టించారాయ‌న. 1992లో ఉత్త‌మ పురుష నేప‌థ్య గాయ‌కుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్న ఘ‌న‌త రాజ్ కుమార్ సొంతం. దీంతో పాటు రాజ్ కుమార్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు. శివాజీ గ‌ణేశ‌న్. ద‌క్షిణాది.. మ‌రీ ముఖ్యంగా త‌మిళ సినిమా మార్క్ న‌ట‌న‌కు ముఖ‌చిత్రం లాంటి న‌టుడు. భావ వ్య‌క్తిక‌ర‌ణ‌, ప్ర‌తిధ్వ‌నించే స్వ‌రానికి ప్ర‌తీక‌. 1960లో ఆఫ్రో ఏషియ‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్ లో బెస్ట్ యాక్ట‌ర్ గా అవార్డు పొందారు శివాజీ  గ‌ణేశ‌న్. ఇలాంటి అంత‌ర్జాతీయ అవార్డు పొందిన తొలి  భార‌తీయ న‌టుడు కూడా. ద‌క్షిణాది మార్ల‌న్ బ్రాండోగా అభివ‌ర్ణించింది ది లాస్ ఏంజిల్స్ టైమ్స్. శివాజీ గ‌ణేశ‌న్ కూడా ద‌క్షిణాది దాదాసాహెబ్ ల‌లో ఒక‌రిగా నిలిచారు. ఆదూర్ గోపాల్ కృష్ణ‌న్. మ‌ల‌యాళ సినిమాలో కొత్త ర‌కం సినిమా ఉద్య‌మానికే మార్గ‌ద‌ర్శ‌కుడిగా నిలిచిన ద‌ర్శ‌కుడు. తొలి చిత్రం స్వ‌యంవ‌రంకే ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా జాతీయ అవార్డు పొందారాయ‌న‌. ఎంతో క్లిష్ట‌త‌ర‌మైన స‌మ‌స్య‌ల‌ను స‌ర‌ళీక‌రించి చిత్రించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. దీంతో ఆదూర్ సైతం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. యాభై ఏళ్ల సుదీర్ఘ తెలుగు చ‌ల‌న చిత్ర ప్ర‌యాణంలో డి. రామానాయుడిది ఒక ప్ర‌త్యేక అధ్యాయం.. వివిధ భార‌తీయ భాష‌ల్లో 130కి పైగా చిత్రాల‌ను నిర్మించారు. వీటిలో ఎక్కువ భాగం తెలుగులో నిర్మించిన‌వే. 9 భాష‌ల‌లో సినిమాలు తీసినందుకు గిన్నిస్ రికార్డు కూడా సాధించిన రామానాయుడు సైతం ద‌క్షిణాది దాదా సాహెబ్స్ లో ఒక‌రిగా  నిలిచారు. ద‌క్షిణాది ద‌ర్శ‌క‌ దిగ్గ‌జం కే. బాల‌చంద‌ర్ సైతం దాదాసాహెబ్ అవార్డు విన్న‌రే. 1965లో మొద‌లైన ఆయ‌న కెరీర్.. లో వంద సినిమాల‌కు పైగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాదు 1981లో క‌వితాల‌యా అనే చిత్ర నిర్మాణ సంస్థ‌ను సైతం స్థాపించి.. త‌న‌దైన శైలిలో భిన్నమైన‌ కుటుంబ చిత్రాల‌కు కేరాఫ్ గా నిలిచారు. దీంతో బాల‌చంద‌ర్ కి సైతం దాదాసాహెబ్ అవార్డు వెతుక్కుంటూ వ‌చ్చింది. సౌండ్ రికార్డిస్ట్ గా ఫీల్డులో కెరీర్ మొద‌లు పెట్టిన కే. విశ్వ‌నాథ్ అర‌వై ఏళ్లు సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో.. ర‌క‌ర‌కాల చిత్రాల‌ను తెర‌కెక్కించారు. వీటిలో క‌ల్ట్ క్లాసిక్స్ అన‌ద‌గిన శంక‌రాభ‌ర‌ణం వంటి ఎన్నో చిత్రాలకు ప్రాణం పోశారు. ఒక స‌మ‌యంలో కే విశ్వనాత్ సినిమా అంటే ప‌డి చ‌చ్చిపోయే పిచ్చి ఫ్యాన్స్ ఉండేవారు.  దీంతో ఆయ‌న‌కు ఐదు జాతీయ అవార్డులు సైతం వ‌చ్చాయి. త‌న‌దైన సినీ నైపుణ్యానికి అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు సైతం పొందిన కేవీ.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును సైతం పొందారు. ఇక ర‌జ‌నీకాంత్ సంగ‌తి స‌రే స‌రి. అపూర్వ రాగంగ‌ళ్ అంటూ 1995లో మొద‌లైన ర‌జ‌నీ సినీ కెరీర్.. త‌ర్వాతి రోజుల్లో త‌మిళ మాస్ మూవీకే కేరాఫ్ గా నిలిచింది. సూప‌ర్ స్టార్ గా అవ‌త‌రించి త‌మిళ ప్రేక్ష‌ఖ హృద‌యాల్లో చోటు సంపాదించారు. ఇప్ప‌టికే ప‌ద్మ‌భూష‌ణ్, ప‌ద్మ‌విభూష‌ణ్ పొందిన ఆయ‌న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది ద‌క్షిణాది సినిమాకు మ‌రో గౌర‌వం తీసుకొచ్చి పెట్టారు. వ‌హీదా రెహ‌మాన్.. రోజులు మారాయి అనే సినిమాతో తెరంగేట్రం చేసిన వ‌హిదా రెహ‌మాన్ త‌ర్వాతి కాలంలో ఎన్నో హిందీ సినిమాల్లో న‌టించారు. ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ‌భూష‌ణ్ తో పాటు.. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు సైతం పొంది ద‌క్షిణాదికి గౌర‌వం తీసుకొచ్చి పెట్టారీ త‌మిళ‌నాడులో పుట్టిన న‌టీమ‌ణి. ప్ర‌స్తుతం ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మోహాన్ లాల్ సంగ‌తి చూస్తే.. త‌న ప‌ద్దెనిమిదేళ్ల వ‌య‌సులో.. 1978లో తెరంగేట్రం చేశారు. నాలుగు ద‌శ‌కాల‌కు పైగా త‌న సినీ ప్ర‌యాణంలో 350 సినిమాల్లో న‌టించారు. మ‌రీ ముఖ్యంగా మ‌ల‌యాళంలో మోస్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ గ‌ల న‌టుల్లో మోహ‌న్ లాల్ కూడా ఒక‌రు. అప్ప‌ట్లోనే ఆయ‌న‌కు సూప‌ర్ స్టార్ గా బిరుదుండేది. ఐదు జాతీయ అవార్డులు పొందారు.  వీటిలో రెండు ఉత్త‌మ నటుడు అవార్డులుండ‌గా.. ఒక జ్యూరీ అవార్డు కూడా ఉంది. ఇక 9 కేర‌ళ చ‌ల‌న‌చిత్ర అవార్డుల‌ను సైతం పొందారు మోహ‌న్ లాల్. 26 సంవ‌త్స‌రాల‌కే ఉత్త‌మ న‌టుడిగా నిలిచి ఈ కేట‌గిరీలో అతి పిన్న వ‌య‌స్కుడిగానూ పేరు సాధించారు. ఇక‌ 2011లో ప‌ద్మ‌శ్రీ.. 2019లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు సైతం పొందారు. ఇటు న‌టుడిగానే కాకుండా అటు నిర్మాత‌, డిస్ట్రిబ్యూట‌ర్, సింగ‌ర్, డైరెక్ట‌ర్ ప‌లు విభాగాల్లో మ‌ల‌యాళ సినిమాకు సేవ‌లందించారు మోహ‌న్ లాల్.  త‌న అభిమానుల చేత లాలెట్ట‌న్ అని ప్రేమ‌గా పిల‌వ‌బ‌డే మోహ‌న్ లాల్ గ‌త కొన్ని త‌రాలుగా మ‌ల‌యాళ సినిమాపై త‌న‌దైన ముద్ర వేస్తూ వ‌స్తున్నారు. ఆయ‌న డైలాగులు కేర‌ళ వాసుల నోళ్ల‌లో నానుతుంటాయంటే అతిశ‌యోక్తి కాదు. కేవ‌లం మ‌ల‌యాళ సినిమా మాత్ర‌మే కాకుండా భార‌తీయ దిగ్గ‌జ న‌టుల్లోనూ మోహ‌న్ లాల్ కి ఒక గుర్తింపు ఉంది. అలాంటి మోహ‌న్ లాల్ ప్ర‌స్తుతం ద‌క్షిణాది నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వారిలో చోటు ద‌క్కించుకున్నారు. ఎనీ హౌ కంగ్రాట్స్ మోహ‌న్ లాల్. వియ్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటోంది యావ‌త్ ద‌క్షిణాది సినీ అభిమాన లోకం!!!

ట్రంప్ మార్క్... మేక్ భార‌త్ గ్రేట్ అగైన్ స్టార్ట‌య్యిందా!?

  ఏ మాట‌కామాట‌.. ట్రంప్ కేవ‌లం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ చేయ‌డం లేదు. ఆల్ కంట్రీస్ మేక్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడు.  భారత ప్రభుత్వం యుగయుగాలుగా ప్రతిభను నిలుపుకోవడంపై దృష్టి పెట్టలేకపోయిందన్న మాట క‌ఠిక వాస్త‌వం... దీంతో అంద‌రూ కల‌సి అంద‌మైన జీతం కోసం అమెరికా బాట ప‌ట్టారు. బేసిగ్గా ప్ర‌పంచంలోని టాప్ మోస్ట్ ల‌లో అమెరికా శాల‌రీ ఒక‌టి. ఎందుకంటే ఇంగ్లండ్ హౌస్, ఫ్రెంచ్ వైన్, చైనీస్ వైఫ్, ఇండియ‌న్ ఆర్మీ, అమెరిక‌న్ శాల‌రీ ద బెస్ట్ గా చెబుతారు. దీంతో బెస్ట్ శాల‌రీ కావాల‌నుకున్న వారు ఏదో ఒక‌టి చేసి అమెరికా చెక్కేసేవారు. దీంతో అమెరికాలో భార‌తీయ మేధో సంప‌త్తి భారీ ఎత్తున పెరిగిపోయింది. ఇప్ప‌టికే మ‌న వాళ్లు అక్క‌డ స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ లో టాప‌ర్స్. వారికి ఇక్క‌డ రిజ‌ర్వేష‌న్ల రూపంలోనో లేక లోక‌ల్ పాలిటిక్స్ కార‌ణంగానో త‌గిన గౌర‌వ‌నీయ‌మైన ఉద్యోగ ఉపాధి అవ‌కాశాలు ల‌భించేవి కావు. అదే అమెరికాలో అయితే సాదా సీదా టాలెంట్ కి కూడా డాల‌ర్ల వేట చేయ‌డం సులువు. అమెరికాలో ఒక్క డాల‌ర్ ఇండియాలో 88 రూపాయ‌లు కావ‌డంతో జ‌నం పొలోమ‌ని అమెరికా బాట ప‌ట్ట‌డం మొద‌లైంది. దేశ స్వాతంత్రం వ‌చ్చిన తొలి నాళ్ల‌లోనే నెహ్రూ తీస్కున్ డెసిష‌న్ కి భార‌త్ అభివృధ్ధి నానాటికీ దిగ‌జార‌డం మొద‌లైంది. ఆ టైంలో అమెరిక‌న్ ప్రెసిడెంట్లు కంట్రీ ఫ‌స్ట్ నిర్ణ‌యం తీస్కుంటే,  అదే భార‌త్ లో నెహ్రూ ప‌బ్లిక్ ఫ‌స్ట్ డెసిష‌న్ తీస్కున్నారు.  దీంతో అక్క‌డ దేశం కోసం మ‌నిషి- త‌న స‌ర్వ‌స్వం త్యాగం చేయ‌డం మొద‌లుకాగా.. అదే ఇక్క‌డ మ‌నిషి కోసం దేశం- స‌ర్వ‌స్వం కోల్పోయే వ‌ర‌కూ వ‌చ్చింది ప‌రిస్థితి. దీంతో ఆనాడు గొప్ప‌గా ఉన్న రూపాయ కాస్తా, డాల‌ర్ ముందు మోక‌రిల్ల‌డం మొద‌లైంది. ఇప్పుడు చూస్తే డాల‌ర్ ఆకాశ‌మంత ఎత్తులో ఉంటే రూపాయ నేల‌ చూపులు చూస్తోంది. దీనంత‌టికీ కార‌ణం ఆయా కాలాల్లో ఆయా ప్ర‌భుత్వాలు తీస్కున్న నిర్ణ‌యాలు, ఓటు బ్యాంకు రాజ‌కీయాలు. ఇప్ప‌టికీ అమెరికాలో ఏదీ నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా జ‌ర‌గ‌దు. అదే ఇక్క‌డ వ‌యోలేష‌న్స్ ఒక రేంజ్ లో సాగుతుంటాయ్. దీంతో టాలెంట్ ఇక్క‌డ ఉండి మ‌న‌మేం సాధించ‌లేం అన్న కోణంలో విసిగి వేశారి.. యూఎస్ బాట ప‌ట్టింది యువ‌త‌. అక్క‌డకి మ‌న టాలెంట్ చేరుతూ రావ‌డంతో పాటు గ‌ణ‌నీయంగా టాక్స్ పేయ‌ర్స్ సంఖ్య పెరిగింది.  అమెరికాలో ట్యాక్స్ పే చేసే వారిలో ఇండియ‌న్స్ ది ఒక‌టిన్న‌ర శాతం. అదే సొమ్ము ఇక్క‌డ సంపాదించి- ఇక్క‌డ క‌డితే అదెంత ఉప‌యోగ‌ప‌డుతుంది? ఎందుకంటే భార‌త్ లో టోట‌ల్ టాక్స్ పేయ‌ర్స్ శాతం కేవ‌లం 2 శాతం మంది మాత్ర‌మే అంటున్నాయి గ‌ణాంకాలు. దీన్నిబ‌ట్టీ  చూస్తే మ‌న వాళ్లు ఆ దేశం కోసం ఎంత చెల్లిస్తున్నారో.. ఆ మొత్తం మ‌న దేశం ఏ స్థాయిలో కోల్పోతోందో ఊహించుకోవ‌చ్చు. ఒక‌ప్పుడు రిజ‌ర్వేష‌న్ల కార‌ణంగా త‌క్కువ మార్కులు వ‌చ్చిన వారికి అవ‌కాశాలు రావ‌డం, ఎక్కువ మార్కులు వ‌చ్చిన  వారికి ఏ ఉద్యోగం రాక పోవ‌డంతో విర‌క్తి చెందిన‌ యువ‌త ఇక్క‌డి నుంచి అమెరికా వ‌ల‌స వెళ్లడం మొద‌లైంది. ఆ త‌ర్వాతి కాలంలో ఇక్క‌డ ప‌ని చేయ‌డానికి త‌గిన టాలెంటే లేక పోయేద‌న్న మాట విన‌వ‌చ్చింది. మ‌రీ ముఖ్యంగా సాఫ్ట్ వేర్ బూమ్ రావ‌డంతో .. ఇండియాలో గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ చేయ‌డానికి ఎవ్వ‌రూ పెద్ద‌గా ఆస‌క్తి చూపే వారు కాదు.  దీంతో అమెరికా లోని హెచ్ వ‌న్ బీ వీసా హోల్డ‌ర్స్ లో 70 ప‌ర్సంట్ వ‌ర‌కూ మ‌న వాళ్లే ఉంటూ వ‌చ్చారు. ప్ర‌స్తుతం ట్రంప్ తీస్కున్న హెచ్ వ‌న్ బీ ఫీజు ల‌క్ష డాల‌ర్లకు పెంపు అనే ఈ డెసిష‌న్ కార‌ణంగా హైలీ టాలెంటెడ్ మాత్ర‌మే అక్క‌డికి వెళ్ల‌డం మాత్ర‌మే కాకుండా.. ఇక్క‌డే మిగిలి పోయే వారు త‌మ త‌మ ఉద‌ర పోష‌ణార్ధం త‌మ త‌మ టాలెంట్ చూపించ‌డం మొద‌లు పెడ‌తారు. దీంతో భార‌త్ తిరిగి విక‌సించ‌డం ప్రారంభ‌మ‌వుతుంది. ఇప్ప‌టికే స్టార్ట‌ప్ ట్రెండ్ ఒక‌టి మొద‌లైంది. దానికి తోడు ఇక్క‌డ కూడా మేకిన్ ఇండియా, ఆత్మ‌నిర్భ‌ర భార‌త్ వంటివి పురుడు పోసుకుని చాలా కాల‌మైంది.  కాబ‌ట్టి భార‌తీయ యువ‌త వ‌చ్చే రోజుల్లో త‌మ అమెరికా ప్ర‌యాణాలు ప‌క్క‌న పెట్టి, భార‌త్ లో రాణించ‌డం ఎలా? అన్న ప్రాక్టీస్ చేసినా చేస్తారు. వారికంటూ మంచి భ‌విష్య‌త్ నిర్మాణం జ‌ర‌గ‌టంతో పాటు దేశ‌ ఫ్యూచ‌ర్ కూడా మెరుగుప‌డే అవ‌కాశం క‌నుచూపు మేర క‌నిపిస్తోంది.  ఈ లెక్క‌న చూస్తే ట్రంప్ కేవ‌లం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాత్ర‌మే కాదు.. మేక్ ఎవ్రీ కంట్రీ మేక్ అగైన్, మ‌రీ ముఖ్యంగా భార‌త్ మేక్ అగైన్ అనే కాన్సెప్ట్ తీస్కున్న‌ట్టు తెలుస్తోంద‌ని చ‌మ‌త్క‌రిస్తారు కొంద‌రు విదేశీ వ్య‌వ‌హారాల‌ నిపుణులు.

ఆడవేశం కట్టి స్నేహితుడి ఇంట్లో చోరీ

  అప్పులు చేసి వాటిని తీర్చలేక చివరకు స్నేహితుడి ఇంట్లోనే దొంగత నానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ నడిబొడ్డున చోటుచేసుకుంది. లింగంపల్లి కి చెందిన హర్షిత్, శివరాజు కొడుకు ఇద్దరు మంచి స్నేహి తులు... అయితే హర్షిత్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. ఆర్థిక సమస్యల కారణంగా లోన్ యాప్ ద్వారా డబ్బులను అప్పు తీసుకున్నాడు. అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నాడు. ఒకవైపు లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురి చేస్తూ ఉండగా మరోవైపు అప్పులు తీర్చే మార్గం కనిపించక హర్షిత్ దొంగతనం చేయా లని నిర్ణయించుకున్నాడు.  కానీ ఇలా చేయాలి ఎప్పుడు చేయాలి? ఎవరింట్లో చేయాలి? అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. అదే సమయంలోశివరాజ్ కుటుంబంతో నిజామాబాద్ కెళ్లగా.. ఈ విషయం శివరాజ్ కొడుకు లింగంపల్లి సిసి సమర టెక్నిషియన్ హర్షిత్ కి చెప్పాడు.. దీంతో హర్షిత్ పోలీసుల చేతికి కానీ మరెవరికి కానీ అనుమానం కలగకుండా ఆడవేషం వేసుకుని దొంగతనానికి బయలుదేరాడు. బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కు చెందిన శివరాజ్ ఇంట్లోకి ఈనెల16న వెళ్లి శివరాజ్ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్ళి 6.75తులాల బంగారం,1.10లక్షల నగదు చోరి చేసి అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు.  శివరాజ్ కుటుంబ సభ్యులు  ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా... తాళం పగిలిపెట్టి ఉండడంతో దొంగలు పడ్డట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి పోలీసులు వాటిని ఆధారంగా చేసుకుని హరీష్ ఇంటికి వెళ్లి ఆరా తీయడంతో ఈ దొంగతనం వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. దీంతో పోలీసులు వెంటనే హరీష్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. లోన్ ఆప్ అప్పులు తీర్చేందుకు హరీష్ ఆడవేషంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి దొంగతనం చేసినట్లుగా నిర్ధారణ అయింది. హరీష్ వద్ద నుండి 6.75తులాల బంగారం, 85వేల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితున్ని రిమాండ్ కు తరలించారు..

గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు...100 ఎకరాల భూమికి విముక్తి

  హైదరాబాద్ గాజుల రామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది.  సర్వే నంబర్ 397 పరిధిలో 100 ఎకరాలకు పైగా భూమిని కబ్జా చెర నుంచి విముక్తి చేసింది. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్‌కి కేటాయించిన భుమిలో బడాబాబుల ఆక్రమణలు, పేదవారి పేరు చెప్పి షేడ్లు వేయించారు. భారీగా పోలీసే బందోబస్తు మధ్య ఆ షెడ్ల కూల్చివేతలు హైడ్ర ప్రారంభించింది.   గాజులరామారం ప్రాంతంలో అధికారులు చేపట్టిన చర్యలను స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ దాదాపు రూ.4,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కబ్జాదారులు ప్రభుత్వ భూమిని చిన్నచిన్న (60–70 గజాల) ప్లాట్లుగా విభజించి, ఒక్కింటిని సుమారు రూ.10 లక్షలకు విక్రయించినట్టు హైడ్రా విచారణలో బయటపడింది. అందిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, హైడ్రా ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా ప్రాంతాన్ని పరిశీలించి, ఆక్రమణల తీవ్రతను అంచనా వేశారు. ప్రభుత్వ ఆస్తిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించి, ఆదివారం ఉదయం నుంచే భారీ భద్రత నడుమ కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతల సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి ఆపరేషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. హైడ్రా సిబ్బంది, పోలీసులు వారిని అడ్డుకుని పక్కకు తప్పించారు. ఆందోళనలు కొనసాగుతుండగానే అధికారులు కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్‌తో గాజులరామారం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

జన్మనిచ్చిన తల్లిపై ఫిర్యాదు చేసిన కొడుకు

  సాధారణంగా పిల్లలకు చదువుపై కన్నా ఆటలు, మొబైల్, స్నేహితులతో గడపడం మీదే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వారిని చదువుపై దృష్టి పెట్టేలా మందలించడం సహజం. చాలాసార్లు పిల్లలు భయంతో ఆ మాట విని తిరిగి చదువులో నిమగ్నం అవుతారు. అయితే, ఎన్టీఆర్ జిల్లాలో ఒక చిన్నారి మాత్రం తల్లి మందలించిందని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగించింది. సంఘటన వివరాలు విజయవాడ సత్యనారాయణపురం గులాబీతోట ప్రాంతానికి చెందిన ఒక మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఆమె ఒంటరిగా జీవిస్తూ, పెద్ద కుమారుడిని ఒక దుకాణంలో పనిచేయనిస్తుంది. తాను కూడా ఒక దుకాణంలో పని చేస్తూ వచ్చిన డబ్బుతో చిన్న కుమారుడి చదువుకు సహాయం చేస్తుంది. ఆరో తరగతిలో చదువుతున్న చిన్నారికి ఆమె మొబైల్ ఫోన్ కొనిచ్చింది. కానీ కొద్ది రోజులకే బాలుడు ఎక్కువ సమయం ఫోన్‌తో గడుపుతూ చదువుపై ఆసక్తి కోల్పోయాడు. దీంతో, అతన్ని దారిలో పెట్టేందుకు తల్లి కాస్త గట్టిగా మందలించింది. పోలీస్ స్టేషన్‌లో చిన్నారి తల్లిపై కోపంతో ఇల్లు వదిలి వచ్చిన బాలుడు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఏసీపీ దుర్గారావుకు ఫిర్యాదు చేశాడు. చిన్నారిని చూసి ఆశ్చర్యపోయిన ఏసీపీ, అతని తల్లిని పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. వాస్తవ పరిస్థితి తెలిసిన తర్వాత, ఏసీపీ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చదువుకోకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలు ఏవో వివరించి, తల్లి ఎంత కష్టపడి కుటుంబాన్ని నడుపుతుందో చెప్పారు. చివరికి చిన్నారి తన తప్పు గ్రహించి, ఇకపై చదువుపై దృష్టి పెడతానని హామీ ఇచ్చాడు.

తిరుమలలో భక్తుల రద్దీ

  తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 82,042 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,393 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి ఆదాయం రూ. 4.59 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. ఈ ఉదయం శ్రీవారిని ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రెడ్డి దర్శించుకున్నారు. తిరుమలను ప్రచార కేంద్రంగా, వివాదాస్పద స్థలంగా రాజకీయ అవసరాలకోసం చిత్రీకరించడం హేయమైన చర్య అని ఆయన పేర్కొన్నారు. టీటీడీలో చిన్న సంఘటన జరిగిన స్వార్థ ప్రయోజనాలకోసం పెద్ద ఎత్తున రాజకీయం చేయడం దురదృష్టకరమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.  ప్రపంచంలోనే అన్ని ఆలయాలకు తిరుమల శ్రీవారి ఆలయమే రోల్ మోడల్ ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రంగా కనిపిస్తాయి. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారు. మేము అధికారంలో లేము కాబట్టి ఏదైనా రాజకీయం చేయొచ్చు అనే ధోరణిలో ఉన్నారని ఆయన తెలిపారు. భక్తులకు, కోట్లాది హిందువులకు తిరుమలలో మంచి విషయాలు కనిపిస్తాయి…. ఏపీ రాజకీయ నాయకులకు మాత్రమే అన్ని అపవిత్రాలే కనిపిస్తున్నాయి విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.  ఇలాంటి నీచ రాజకీయాలకు విపక్ష పార్టీలు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు

ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్

  తెలంగాణ ఆడబిడ్డలందరికీ సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, మహిళల ఔన్నత్యానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, కష్టసుఖాలను కలిసి పంచుకునే వారి సామూహిక జీవన విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు.  రాష్ట్రంలోని ఆడపడుచులందరూ ఈ పూల పండుగను సంతోషంగా, కలిసికట్టుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ తొమ్మిది రోజుల ఉత్సవాలను రాష్ట్ర ప్రజలందరూ ఆటపాటలతో ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. మరోవైపు ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మాజీ సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తరతరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచేదే బతుకమ్మ పండుగ అని ఉద్ఘాటించారు. ప్రపంచ సంస్కృతీ, సంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతోందని తెలిపారు. ఆదివారం నుంచి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.