నో ఫ్లై జోన్ గా తెలంగాణ సెక్రటేరియట్
posted on Sep 19, 2025 @ 6:26PM
తెలంగాణ సచివాలయంపై భద్రతా చర్యలను మరింత పటిష్టం చేస్తూ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాన్ని నో ఫ్లై జోన్‌గా ప్రకటిస్తూ, ఆ ప్రాంతంలో డ్రోన్లు, ఇతర ఎగురే పరికరాలను నిషేధించింది. భద్రతా విభాగం సూచనల మేరకు ఈ ఆదేశాలు వెలువడ్డాయి. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న నేపధ్యంలో, ప్రజల రాకపోకలు పెరగనుండటంతో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.
సచివాలయం చుట్టూ స్పష్టంగా కనిపించేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. పండుగ సమయంలో బతుకమ్మలను తీసుకువచ్చే మహిళలు, కుటుంబాలు అధికంగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, పోలీసులు ప్రత్యేక భద్రతా బందోబస్తు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం పరిసరాల్లో సీసీ కెమెరాల సంఖ్యను పెంచి, పర్యవేక్షణను 24 గంటలూ కొనసాగిస్తున్నారు. డ్రోన్ నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజల భద్రతే ముఖ్యమని, అందరూ ఈ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది.