బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు

  బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్ పిటీ షన్ దాఖలు చేసిన పిటీషనర్ పై హైకోర్టు సీరియస్ అయింది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మేరకు హైకోర్టులో విచారణ జరిగింది. నేడు కోర్టు బీసీ రిజర్వేషన్ పిటిషన్ దాఖలు చేసిన పిటి షనర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పిటిషనర్ అర్హతను ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా కాపీ ఇచ్చిందా?అని హైకోర్టు పిటిషనర్ ను ప్రశ్నించింది. కేవలం పేపర్ క్లిప్పింగ్స్ లో వచ్చిన ఆర్టికల్స్ లను ఆధారంగా చేసు కుని ఎలా పిటిషన్ వేస్తారు అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పేపర్ క్లిప్పింగ్స్ లో వచ్చిన ఆర్టికల్స్ ను బేస్ చేసుకొని పిటీషన్ వేయడం సరికాదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం చట్టవిరుద్ధమంటూ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలైంది. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 285ఏ ప్రకారం రిజర్వేషన్లు కల్పించి ఆ మేరకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలంటూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరుకు చెందిన జలపల్లి మల్లవ్వలు పిటిషన్‌ దాఖలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనతోపాటు అదే సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పిటిషనర్లు పేర్కొన్నారు  

రేవంత్ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట

తెలంగాణ సర్కార్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.  టీజీపీఎస్సీ ఫలితాలపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును  డివిజన్ బెంచ్ బుధవారం (సెప్టెంబర్ 24) సస్పెండ్ చేసింది.  గ్రూప్ 1 అభ్యర్ధుల విషయంలో గతంలో ప్రభుత్వం ప్రకటించిన ర్యాంకుల ఆధారంగా ఉద్యోగ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే..  నియామకాలు తుది తీర్పుకు లోబడే ఉండాలని  పేర్కొంది.  గ్రూప్ వన్ మెయిన్స్ ర్యాకింగ్స్ లో  అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో  కొందరు అభ్యర్ధులు దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సింగిల్ బెంచ్ ర్యాంకులను రద్దుచేస్తూ ఈ నెల 9న తీర్పు వెలువరించిన సంగతి విదితమే.  ఫలితాలకు సంబంధించి అభ్యర్ధులు రాసిన జవాబుపత్రాలను రీవాల్యుయేషన్ నిర్వహించాలని, అది కుదరకుంటే పరీక్షలను మళ్లీ నిర్వహించాలని సింగిల్ బెంచ్ తన తీర్పులో పేర్కొంది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ ర్యాంకులు సాధించిన కొందరు అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు.   వారి పిటిషన్ ను విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పును  సస్పెండ్ చేస్తూ.. ర్యాంకుల ఆధారంగా నియామకాలు చేపట్టడానికి ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తరుపరి విచారణను వాయిదా వేసింది.  

రైల్వే ఉద్యోగులకు దీపావళి బోనస్....ఎంతో తెలుసా?

  రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా,  దీపావళి పండుగ సందర్బంగా  గ్రూప్‌ C, గ్రూప్‌ D ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది. ఈ బోనస్ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.1,866 కోట్లను కేటాయించింది. గ్రూప్‌ D (లెవెల్‌ 1 స్టాఫ్‌) ఉద్యోగులకు ఈ బోనస్‌ వర్తించనుంది.  అలాగే, రైల్వే ప్రొడక్షన్ యూనిట్లు, రైల్వే వర్క్‌షాపులు, ఇతర సహాయ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ బోనస్‌ అందనుంది. ప్రతి సంవత్సరంలా, ఈసారి కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే ఉద్యోగుల కోసం పండుగ బోనస్‌ను ప్రకటించడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో10.91 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.  

ఈ ఫార్ములా రేస్ కేసు.. ఇక అధికారుల అరెస్టేనా?

ఈ ఫార్ములా రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల అరెస్టుకు రంగం సిద్ధమౌతోందా? అంటే పరిశీలకుల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. తెలంగాణలో రాజకీయ హీట్ ను అమాంతంగా పెంచేసిన ఈ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ రికమెంట్ చేసింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్ ను అనుమతి కోరుతూ ఏసీబీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి విదితమే. దీనిపై విజిలెన్స్ కమిషన్ విచారణ జరిపి ఈ ఇద్దరు అధికారుల ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది.   ఏసీబీ నివేదిక ఆధారంగా వీరిపై చర్యలకు విజిలెన్స్ కమిషన్ చర్యలకు సిఫారసు చేయడంతో  వీరి అరెస్టు ఖాయమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది. అయితే ఇదే కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాసిక్యూషన్  కు గవర్నర్ నుంచి ఎటువంటి అనుమతీ ఇంకా రాలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎ1గా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ఏసీబీ ఇప్పటికే రెండు సార్లు విచారించింది. కాగా..  ఐఏఎస్‌ అధికారులు అరవింద్‌, బీఎల్ఎన్ రెడ్డిలను మూడేసి సార్లు విచారించింది. 

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం

  తెలంగాణలో సంచలన సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.  అధికారులపై చర్యలు  తీసుకునేందుకు విజిలెన్స్ సిఫార్సు చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పట్లో హెచ్‌ఎండీఎ కమీషనర్‌‌గా కొనసాగిన  ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలపై చర్యలకు విజిలెన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో పెద్ద ఎత్తున మనీ లాండ రింగ్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఈ ముగ్గురిని విచారణ చేసి ప్రభుత్వానికి నివేది కను పంపింది. అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించిన నివేదికను గవర్నర్ కి సమర్పించారు.  ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ కమిషన్ ఫార్ములా ఈ కార్ రేస్ లోని అధికారు లపై ఒక కీలక నిర్ణయం తీసు కుంది. ఇప్పటికే ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి తో పాటు మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా పలుమార్లు విచారణ చేశారు .ఈమేరకు విజిలెన్స్ కమిషన్ ఏసిబి ఇచ్చినా నివేదికపై విచారణ జరిపి ఇద్దరు అధికారులపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వం నుంచి విజిలెన్స్ కమిషన్ నివేదిక ఏసీబీకి చేరింది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ అధికారులు గవర్నర్‌కు నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటివరకు గవర్నర్  ఫార్ములా ఈ కార్ రేస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

విద్యుత్ శాఖ ఏడిఈ అంబేద్కర్ పై సస్పెన్షన్ వేటు

విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్( ఏడిఈ) అంబేద్కర్ పై సస్పెన్షన్  వేటు పడింది.ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విద్యుత్ శాఖలో ఏ డి ఈ గా పని చేస్తున్న అంబేద్కర్ ఇంట్లో కొద్ది రోజుల కిందట ఏసీబీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.  ఆ సందర్భంగా ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు తేలింది. అంబేద్కర్ పై పలు ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అంబేద్కర్ ఇంటి తోపాటు బినామీ, బంధువుల ఇళ్లల్లో కూడా సోదాలు కొనసాగించారు.  విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బాధ్యతలు కొనసాగిస్తూనే మరోవైపు నార్సింగ్ డివిజన్ కూడా ఏ డి ఈ గా వ్యవహరించారు.   ఈ నేపథ్యంలోనే మణికొండ నార్సింగ్ పరిధిలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం జరుగుతుండగా వాటి అనుమతుల కోసం వచ్చిన వారి వద్ద నుండి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. ఏసీబీ అధికారుల సోదాల్లో అంబేద్కర్ ఇంట్లో భారీ ఎత్తున నగదు తో పాటు బంగారం విలువైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్ ప్రకారం 500 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అంబేద్కర్ బినామీ ఇంట్లో రికార్డు స్థాయిలో రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైనది. ఒక వైపు ప్రభుత్వ అధికారిగా ఉంటూనే మరో వైపు ప్రవేటు సంస్థలను స్థాపించిన అంబేడ్కర్ వాటికి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు.     ఏసిబి అధికారులు ఇప్పటికే అంబే ర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నేపథ్యంలోనే  విద్యుత్ శాఖ ఏడిఈ అంబే ద్కర్ ను సస్పెండ్  చేస్తూ  ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

బెట్టింగ్ యాప్ లపై తెలంగాణ సీఐడీ నజర్.. ఇతర రాష్ట్రాల్లోనూ దర్యాప్తు

బెట్టింగ్ యాప్ లపై ఉక్కుపాదం మోపుతున్న తెలంగాణ సిఐడి ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ఆపరేషన్ లు నిర్వహిస్తున్నది. బెట్టింగ్ యాప్ లలో పెట్టుబడి పెట్టి మోసపోయిన వ్యవహారాన్ని సీరియస్ గా తీసు కున్న తెలంగాణ సిఐడి తెలంగాణలో పాటు మూడు రాష్ట్రాల్లోని ఆరు ప్రాంతాల్లో సోదాలు చేసి ఎనిమిది మంది కీలక సూత్రధారు లను అరెస్టు చేశారు. ఆరు యాప్ ల ద్వారా పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తెలంగాణ సిఐడి   ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై కొరడా ఝళిపించాలని నిర్ణయించుకుంది.  అందుకే దేశంలో తొలిసారి ప్రత్యేక ఆపరేషన్ లో భాగంగా తెలంగాణ సీఐడీ బృందాలు రాజ స్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రా ల్లోని 6 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిం చారు. ఆరు ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాలకు వెళ్లి  8 మందిని అరెస్టు చేశాయి.  సిఐడి బృందాలు ఈ సందర్భంగా అనేక హార్డ్ వేర్  పరికరాలు,  స్తృతమైన డేటా  స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారులు విదేశాల్లో ఉండే అవకాశముందన్న అంచనాతో  వారిని గుర్తించే దిశగా  దర్యాప్తు సాగుతోంది. 

శ్రీశైలంలో మూడో రోజు చంద్రఘంటా దుర్గ గా అమ్మవారు

శ్రీశైలంలో   శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజైన బుధవారం (సెప్టెంబర్ 24) అమ్మవారు చంద్రఘంటా దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణలో అమ్మవారు చంద్రవంక ఆకారంలో ఉండే గంటను శిరస్సున ధరించి, శివునితో కలయికను సూచిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక రెండో రోజైన మంగళవారం (సెప్టెంబర్ 23)  బ్రహ్మచారిణి అలంకారాంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత ముందుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బ్రహ్మచారిణి అలం కారంలో ఉన్న అమ్మవారికి పలురకాల పూలతో అలంకరించి  బిల్వాదళాలతో శాస్త్రోక్తంగా అర్చకులు వేదపండితులు వేదమంత్రాలతో మంగళవాయిద్యాల నడుమ, సుగంధ ద్రవ్యాలతో ధూపదీప నైవేద్యాలతో పూజించి మంగళ హారతులిచ్చారు. శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిని అలంకారంలో, అలానే మల్లికార్జునస్వామి అమ్మవారు మయూరవాహనంపై ఆశీనులను చేసి ప్రత్యేక పూజలు చేసి కర్పూరహారతులిచ్చరు. అనంతరం వైభవంగా గ్రామోత్సవానికి బయలుదేరగా ఉత్సవ మూర్తుల ముందు కోలాటాలు,బాజా బజంత్రీలు,కేరళ చండీ మేళం,కొమ్ము కోయ నృత్యం,స్వాగత నృత్యం,రాజభటుల వేషాలు, బ్యాండ్ వాయిద్యాల,చెంచు గిరిజనుల నృత్యాలు, వివిధ రకాల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోపలి నుంచి భాజా భజంత్రీలు బ్యాండు వాయిద్యాల నడుమ శ్రీస్వామి అమ్మవార్లు గ్రామోత్సవంగా విహారించగా,  కదలివస్తున్న స్వామి అమ్మవారిని భక్తులు దర్శించుకుని‌ కర్పూర నీరాజనాలర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస రావు దంపతులు, అర్చకులు, అధికారులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

ఏపీకి అతి భారీ వర్ష సూచన

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్యబంగాళా ఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి అనుభందంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటికి తోడుగా ఉత్తర బంగాళా ఖాతంలో గురువారం (సెప్టెంబర్ 25) మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతే కాకుండా ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని హెచ్చ రించింది. వీటి ప్రభావంతో  రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక పోతే బుధవారం (సెప్టెంబర్ 24) శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయనీ,  తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయనీ పేర్కొంది. వచ్చే ఐదు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.  

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో  గురువారం (సెప్టెంబర్ 24) నుంచి అక్టోబర్ 2వ తేదీ వ‌ర‌కు జరుగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం(సెప్టెంబర్ 23)  సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు. వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం. కాగా బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు రాత్రి 7.50 నిమిషాలకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శ్రీవారికీ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.

ఏంటో పిచ్చి జ‌నం.. జీఎస్టీ త‌గ్గింద‌ని ప‌రుగులు!

యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు పెంచి.. ఆపై దాన్ని డెబ్భై ఐదు రూపాయ‌ల‌కు డిస్కౌంట్ పేరిట‌ అమ్ముతుంటే ఎగ‌బ‌డి కొన‌డం మ‌న‌కు న‌ర‌న‌రాన జీర్ణించుకుపోయిన ఒకానొక దుర‌ల‌వాటు. అదే మ‌నం మ‌న ప‌క్కింటి కిరాణా షాపుల్లోని స‌రుకులు.. మ‌న అమ్మ‌మ్మ బామ్మ వంటి వారు వీధుల్లో కుప్ప‌లు పోసి అమ్మే కూర‌గాయ‌లు.. ఇవ‌న్నీ మ‌న‌కు చాలా  చాలా చౌక ధ‌ర‌లకే ల‌భిస్తుంటాయి.  కానీ మ‌నం ఎగేసుకుని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్తుంటాం. అక్క‌డ మ‌నం  పైన చెప్పుకున్న‌ట్టు యాభై రూపాయ‌ల వ‌స్తువును వంద‌కు ఎంఆర్పీ వేసి.. దాన్ని డెబ్భై ఐదుకు భారీ డిస్కౌంట్ పేరిట‌ అమ్మేస్తుంటే ఎగ‌బ‌డి మ‌న ట్రాలీలో వేసేసుకుంటాం. అదేమంటే డెడ్ చీపుగా డిస్కౌంట్లో వ‌చ్చింద‌ని బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభానికి మించిన బిల్డప్ ఇస్తుంటాం. ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వం నిర్మ‌లా  సీతారామ‌న్ అనే ఒక ద‌క్షిణాదికి చెందిన, తెలుగింటి కోడ‌లిగారి చేత చేయిస్తోన్న జీఎస్టీ గార‌డీ ఇదేనంటారు చాలా మంది ఆర్ధిక నిపుణులు. బేసిగ్గా  గుజ‌రాతీ బ‌నియా బుద్ది  ప్ర‌కారం  చూస్తే.. ప్ర‌జ‌ల చేతిలో విరివిగా ఏదీ ఉండ‌కూడ‌దు. ఉంచ కూడ‌దు. డ‌బ్బంతా ఖ‌జానాలో ఉండాలి. జ‌న‌మంతా డ‌బ్బు కోసం అంగ‌లార్చుతుండాలి. ఇదే వారి మెయిన్ ఫైనాన్షియ‌ల్ పాల‌సీ. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ పాల‌సీని అమ‌ల్లో పెట్ట‌డానికి ట్రంప్ టారీఫ్ ల క‌న్నా మించి.. వాడి  జ‌నం ర‌క్తం పీల్చి పిప్పి చేసేశారు. మ‌న‌మంతా ట్రంప్ మామ ఒక్క‌డే మ‌న‌ల్ని ఇంత‌గా పిండుతున్నాడ‌ని ఓ తెగ ఫీలై పోయాంగానీ.. మ‌న‌ల్నిఇక్క‌డ మోడీ తాత అంత‌క‌న్నా మించి పీల్చేసిన విష‌యం ఇటు జీఎస్టీలోనే కాదు అటు పెట్రోల్, గ్యాసు, మొబైల్ రీచార్జీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆనాటికీ ఈ నాటికీ ఎంతో ధ‌ర‌ల‌ తేడా క‌నిపిస్తుంది రెండు క‌ళ్లు పెట్టి చూస్తే. వీట‌న్నిటికీ ప్ర‌స్తుతం మ‌నం ఒక‌టికి రెండు మూడు రెట్లు ఎక్కువ‌గా చెల్లిస్తున్నాం. ఈ క్ర‌మంలో కాస్త ఊర‌ట‌నిచ్చేలా నాలుగు జీఎస్టీ స్లాబులు తీసేసి రెండు స్లాబులు మాత్ర‌మే ఉంచ‌డం అది కూడా ద‌స‌రా, దీపావ‌ళి ధమాకా పేరిట‌ ఇవ్వ‌డం చూస్తుంటే.. ఇదొక కార్పొరేట్ పాల‌సీగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందులో జ‌నం సొమ్ము జ‌నానికే పంచ‌డం ఏదైతే ఉందో అది న‌భూతో అంటున్నారు చాలా మంది అర్ధ‌శాస్త్ర నిపుణులు.  ఈ విష‌యం అర్ధం కాక టీవీలు, ఫ్రిడ్జిలు, కార్లు.. ఇత‌ర‌త్రా భారీగా త‌గ్గాయ‌ని ఎగేసుకుని వెళ్తున్నాం మ‌న‌మంతా.. దీన్నే అంటారు బ‌నియా టెక్నిక్ అని కామెంట్ చేస్తున్నారు కొంద‌రు సీఏ స్టూడెంట్స్.

తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్

దేశంలోనే తొలి ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 లో ఏర్పాటు కానుంది. ఎన్ఆర్ఐల వితరణతో ఏర్పాటు కానున్న ఈ కేంద్రానికి ముఖ్యమత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం (సెప్టెంబర్ 25) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, వీజీవో రాంకుమార్, టీటీడీ బోర్డు  సభ్యుడు నరేష్ పరిశీలించారు.   శ్రీవారి దర్శనానికి నిత్యం వచ్చే వేల మంది భక్తుల ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు  ఏఐ  ను వినియోగించాలన్న చైర్మన్ నిర్ణయం ప్రకారం ఎన్ఆర్ఐ ల దాతృత్వంతో దేశంలో తొలిసారిగా తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను టీటీడీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. వైకుంఠం క్యూ  కాంప్లెక్స్ 1 లోని 25 వ నంబర్ కంపార్టమెంటు లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా భక్తుల రద్దీ నియంత్రణ, వసతి, భద్రత పెంపొందిం చేందుకు చర్యలు చేపట్టనుంది.   ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి వస్తే  ఎలా ఉపయోగపడుతుందనే ఆంశాలను ఒకసారి పరిశిలిస్తే ఐసీసీసీలో పెద్ద డిజిటల్ స్క్రీన్ పై అన్ని విభాగాలకు చెందిన సీసీ టీవీ పుటేజీలు కనిపిస్తాయి. వీటిని 25 మందికి పైగా సాంకేతిక సిబ్బంది పర్యవేక్షిస్తూ.. అధికారులకు వాస్తవ పరిస్థితులను తెలియజేస్తారు. ప్రస్తుతం ఉన్న వాటితో పాటు కొత్తగా అమర్చిన ప్రత్యేక కెమెరాలతో అలిపిరి వద్ద నుంచే భక్తుల రద్దీని ఏఐ అంచనా వేస్తుంది. క్యూలైన్లలో ఎంతమంది భక్తులున్నారు? ఎంత సమయంగా వారు నిరీక్షిస్తున్నారు? సర్వదర్శనం పరిస్థితి.. తదితర అంశాలను ఏఐ ట్రాక్ చేస్తుంది. ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా భక్తు లను గుర్తిస్తుంది. చోరీలు, ఇతర అవాంచనీయ ఘటనలు చోటుచేసుకున్నా కనిపెడుతుంది. తప్పిపోయిన వారు ఎక్కడున్నారో తెలియజేస్తుంది. భక్తుల హావభావాల ఆధారంగా వారి ఇబ్బందులు తెలుసుకుంటుంది.  క్యూలైన్లు, వసతి, ఇతర సౌకర్యాలను వాస్తవ పరిస్థితులతో త్రీడీ మ్యాపులు, చిత్రా లతో చూపుతుంది. రద్దీ ఉన్న ప్రాంతాల్ని రెడ్ స్పాట్లుగా చూపడంతో పాటు చర్యలకు సంకేతాలిస్తుంది. ఆన్ లైన్ లో నిరంతరం పర్యవేక్షిస్తూ.. సైబర్ దాడులు, టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతినే సామాజిక మాధ్యమాల్లో పెట్టే అనుచిత పోస్టులు, ఆన్ లైన్ లో తప్పుడు సమాచారాలను అడ్డుకుంటుంది. ఎప్పటికప్పుడు భక్తుల అనుభవాలు తెలుసుకుని శ్రీవారి దర్శనాన్ని మరింత సౌకర్యవంతం చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో భక్తులను బయటకు తీసుకొచ్చే సమీప మార్గాలను చూపుతుంది.

అమరావతిపై ఫేక్ పోస్టు.. ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు

ఓ ఫేస్ బుక్ పోస్టు ఆ ప్రభుత్వోద్యోగి ఉద్యోగానికి ఎసరు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వరదల్లో మునిగిపోయిందంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై ప్రభుత్వం వేటు వేసింది.  వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అమరావతి ముంపునకు గురైందంటూ   ఫొటోలతో తిరుపతి జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు  అమరావతి మునిగిపోయిందని క్యాప్షన్ జోడించారు. ఈ పోస్ట్  వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ సుభాష్ పై నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం సుభాష్ ను వివరణ కోరింది. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని సుభాష్ వివరణ ఇచ్చారు. ఆ సమాధానంతో  సంతృప్తి చెందని కూటమి ప్రభుత్వం జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ ను  సస్పెండ్ చేసింది.  

ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే... ఎందుకంటే?

  ములుగు జిల్లా మంగపేట మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. మండల పరిధిలోని 23 గ్రామాలను గిరిజన గ్రామాలుగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గిరిజనేతరులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఆ గ్రామాలు గిరిజన పరిధిలో లేవని వాదనలు వినిపించారు.  అయితే 2013లో గిరిజన సంఘాలు హైకోర్టులో పిటిషన్ వేయగా, నిజాం ఆర్డర్ ఆధారంగా గిరిజన గ్రామాలుగా పరిగణించాలని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పెట్టి నిజాం ఆదేశాలను అనుసరించడం సరైంది కాదని గిరిజనేతరులు అభ్యంతరం తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న వేళ, తమ హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశ్యంతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌ల ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ఎన్నికలపై స్టే విధించింది.

హైకోర్టును ఆశ్రయించిన ఐఏఎస్ స్మితా సబర్వాల్

  కాళేశ్వరం పీసీ ఘోష్ రిపోర్ట్ లో తన పేరును తొలగించాలని తెలంగాణ హై కోర్టు లో  ఐఏఎస్ స్మితా సబర్వాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే స్మిత సబర్వాల్ చర్యలను.. పీసీ ఘోష్  కమిషన్ రిపోర్టులో పేర్కొ న్నారు. కాళేశ్వ రం నిర్మాణా లపై స్మితా సభర్వాల్ రివ్యూ చేసిందని కమిషన్ తెలపడమే కాకుండా బ్యారేజ్ లను సందర్శించిన  పలు ఫోటోలను, సైతం రిపోర్ట్ లో పొందుపరిచింది. కొన్ని జిల్లాలు తిరిగి ఫీడ్‌బ్యాక్ ను ఎప్పటి కప్పుడు అప్పటి సీఎంకు  స్మిత సభర్వాల్ చేరవేసిందని పీసీ ఘోష్ కమిషన్ తెలిపారు.  చీఫ్ మినిస్టర్ ఆఫీస్ స్పెషల్ సెక్రటరీ హోదాలో పలు సందర్భాల్లో స్మిత సభర్వాల్ మూడు బ్యారేజీలను సందర్శించింది. కాళేశ్వరం పై అడ్మినిస్ట్రేటివ్ అనుమతులు జారీ చేయడంలో స్మిత సభర్వాల్ కీలక పాత్ర పోషించింది. నిజా నిజాలను క్యాబినెట్ ముందు పెట్టనందుకు స్మిత సభర్వాల్ పై చర్యలు తీసుకో వాలని కమిషన్ రిపోర్ట్ లో పేర్కొ న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు స్మితా సబర్వాల్ వివరణ ఇచ్చేందుకు తనకు 8b,  8c నోటీసులు ఇవ్వలేదని పిటిషన్  దాఖలు చేశారు. పీసీ గోష్ కమిషన్ రిపోర్టును క్వాష్ చేయాలని  స్మితా సభర్వాల్ తెలంగాణ హైకోర్టును కోరారు.  

రాజకీయ నాయకుల విగ్రహాల కోసం ప్రజల సొమ్ము వాడొద్దు : సుప్రీంకోర్టు

  తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ నేతల విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజాధనాన్ని వినియోగించడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. "మీ మాజీ నాయకుల గొప్పతనాన్ని చాటుకోవడం కోసం ప్రజల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారు? దీనికి మేం అనుమతి ఇవ్వలేం" అని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం వద్ద దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డీఎంకే ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ. 30 లక్షల వరకు ఖర్చు చేసి, కొన్ని నెలల క్రితమే పనులు కూడా ప్రారంభించింది. అయితే, ప్రభుత్వ స్థలంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కొందరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, ప్రజా ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కొన్నిసార్లు ఈ విగ్రహాల వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయని పేర్కొంటూ, విగ్రహ నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పు సరైనదేనని సమర్థించింది. ప్రజాధనాన్ని ఇలాంటి పనుల కోసం దుర్వినియోగం చేయడాన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. వెంటనే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని, ఒకవేళ ఊరట కావాలనుకుంటే హైకోర్టునే ఆశ్రయించాలని ప్రభుత్వానికి సూచించింది.