ఈ విషయాలు తెలుసుకుంటే చాలు.. భార్యాభర్తల మధ్య ఎంత గొడవ జరిగినా పరిష్కారమవుతుంది..!
posted on Sep 9, 2025 @ 9:30AM
రెండు వేర్వేరు కుటుంబాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో ఒక్కటవుతారు. అయితే మూడు ముళ్లు పడినంత సులువుగా ఇద్దరు వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు కలవవు. వివాహం తర్వాత భార్యాభర్తలు ఎన్నో విషయాలను సర్దుబాటు చేసుకుంటూ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భిన్న దృవాల్లాంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో ఒక గొడవ, వాదన రావడం చాలా సహజం. అయితే ఎలాంటి వాదనలు జరిగినా, ఎంత గొడవలు అయినా సరే.. అవి సులువుగా పరిష్కారం కావాలన్నా.. భార్యాభర్తల బంధం ఎప్పటికీ దృఢంగా ఉండాలన్నా కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. ఇవి తెలుసుకుని అర్థం చేసుకుంటే ఆ బంధం ఇక సేఫ్ జోన్ లో ఉన్నట్టే.. భార్యాభర్తలు కొట్టుకునే స్టేజ్ కు వెళ్లినా సరే.. ఆ తర్వాత ఇద్దరూ హాయిగా కలిసిపోతారు. ఇంతకీ భార్యాభర్తలు ఇద్దరూ తెలుసుకుని, అర్థం చేసుకోవాల్సిన ఆ 5 విషయాలు ఏంటంటే..
మాట్లాడటం ఆపకూడదు..
ఎంత పెద్ద గొడవ జరిగినా భాగస్వామితో మాట్లాడటం మానేయకూడదు. మాట్లాడటం మానేయడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా భాగస్వామితో మాట్లాడవద్దని సలహా ఇచ్చినా సరే.. వారి మాటలు పట్టించుకోకుండా భాగస్వామితో మాట్లాడాలి. గొడవ కారణంగా కోపం ఉంటే.. కోపం తగ్గిన వెంటనే.. కూర్చుని భాగస్వామితో మాట్లాడాలి. సమస్య పెరగకుండా ఉంటుంది.
తప్పులను ఎత్తి చూపడం మానుకోవాలి..
గొడవ జరిగితే ఒకరినొకరు నిందించుకోవడం ఎక్కువమంది చేసే పని . కానీ ఇలా నిందించుకుంటే పరిస్థితి మరింత దిగజారిపోతుంది. "ముఖ్యంగా నువ్వు ఇలా చేసావు", "నీ వల్లే ఇలా జరిగింది" లాంటివి గొడవను పెంచుతాయి. కాబట్టి అలాంటి మాటలు అనకూడదు.
సమయం తీసుకోవాలి..
చాలా మందికి గొడవ తర్వాత విరామం అవసరం అవుతుంది. కాబట్టి వారికి సమయం ఇవ్వాలి. కోపంతో ఎప్పుడూ ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదు. కోపంతో తీసుకున్న నిర్ణయం జీవితంలో చాలా పెద్ద సమస్యలు తెస్తుంది. గొడవ తర్వాత ఎప్పుడూ టైం తీసుకొని ఆలోచించి, ఆపై మాట్లాడాలి. విషయం ప్రశాంతమైన తర్వాత మాత్రమే ఒకరితో ఒకరు మాట్లాడుకోండి.
పాత విషయాలను పునరావృతం చేయవద్దు..
భార్యాభర్తలు గొడవ పడుతున్నప్పుడు తరచుగా ఏం చేస్తారంటే.. నువ్వు ఇంతకు ముందు ఇలాగే చేసావు, గతసారి కూడా అదే తప్పు చేశావు. నువ్వు ఎప్పుడూ ఇలాగే చేస్తావు.. ఇలాంటి మాటలను గొడవలో ప్రతిసారీ పాత తప్పులను ఎత్తి చూపడం వల్ల ఒకరి మీద మరొకరికి నమ్మకం దెబ్బతింటుంది. ప్రస్తుతం ఏం జరిగింది? దాని గురించి మాత్రమే మాట్లాడాలి. దాని గురించే డిస్కస్ చేయాలి. పాత విషయాలు ప్రస్తావించి గొడవను పెంచేలా చేయకూడదు.
క్షమించడం, క్షమాపణ చెప్పడం..
అహంకారం భార్యాభర్తల బంధాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అవసరమైనప్పుడు క్షమించడం, క్షమాపణ చెప్పడం సంబంధంలో బలాన్ని, బంధాన్ని పదిలంగా ఉండేలా చేస్తుంది. క్షమించడం, క్షమాపణ చెప్పడం ఎప్పుడూ తమను తాము తక్కువ చేసుకున్నట్టు కాదు. ఇది పరిణితి చెందిన వ్యక్తిత్వానికి సంకేతం. కాబట్టి కొన్నిసార్లు తలవంచి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. భాగస్వామి క్షమాపణలు కోరుతుంటే వారిని క్షమించడం కూడా చాలా ముఖ్యం. మూడవ వ్యక్తి సలహాలతో ఎప్పుడూ భాగస్వామిని దూరం పెట్టడం చేయకూడదు. ఇది చాలా తప్పు.
*రూపశ్రీ