కలలో ఏమి కనిపిస్తే దేనికి సంకేతం?
posted on Apr 10, 2023 @ 9:30AM
కలలు అందరికీ వస్తాయి. అయితే ప్రతి కలలో ఏదో ఒకటి కనబడుతూ ఉంటుంది అందరికీ. అలా కలలో కనిపించే వస్తువు, ప్రదేశం ఇతరం ఏదైనా సరే.. దాన్ని బట్టి మనిషికి కొన్ని విషయాలను సూచిస్తుంది మనిషి అంతరంగం. మనిషి కలలో ఏమి కనబడితే ఏమవుతుంది?? ఏది దేనికి సంకేతంగా భావించబడుతుంది?? దానికి వివరణలు ఏమిటి?? ఫ్రాయిడ్ తన సిద్ధం ద్వారా నిరూపించిన విషయాలు ఇవీ...
దేవదూత : కలగన్నవారు ఆధ్యాత్మిక శక్తి, ఉన్నతాత్మ, దివ్యగుణాలను (దయ, ప్రేమ, కరుణ, పవిత్రత) పొందాలనే ఆకాంక్షలకు ప్రతీక దేవదూత కలలో కనిపించడం.
శిశువు: కొత్త జన్మ, కొత్త ఆదర్శాలను గుర్తించడం, చిన్న పిల్లల్లాగా నిస్సహాయతను వ్యక్తం చేయడం దీనికి సంకేతం. అలాగే పిల్లలు లేనివారికి పిల్లలు కలగాలనే కోరిక, గర్భధారణ విషయంలో భయానికి ప్రతీక.
చెంపలు: ఇవి పిరుదులకు ప్రతీకలు, ఇవి కలలోకి వస్తే లైంగికేచ్చ అంతర్లీనంగా సంఘర్షణలో ఉన్నట్టు అర్థం. చెంపలు ఈ భావాన్ని వ్యక్తం చేస్తాయి.
కన్ను: దూరదృష్టిని, ఆప్రమత్తతను సూచిస్తుంది. జరగబోయే వాటి గురించి అప్రమత్తతను తెలియజేయడం దీని అర్ధం.
పెళ్లి కూతురు: స్త్రీల కలలలో ఎక్కువగా కనిపించేది పెళ్లి కూతురు. మగవాడు పెళ్ళికూతురు గురించి కలగనడు. పెళ్ళికూతురే కలలో పెళ్ళి కూతురిని చూస్తే ప్రేమను వేడుకొందన్న మాట. తల్లిదండ్రుల శృంఖలాల నుంచి బయటికి అడుగుపెట్టడం దీనికి సంకేతం.
దొంగ : విలువైనది దేనినైన తస్కరించేవాడు. స్త్రీల విషయంలో మానాన్ని, కలగన్న వాడే దొంగ అయితే తను చేసిన, చేయనున్న దోషాలను బయటపెట్టడం, దొంగ తండ్రిని సూచించవచ్చు. ఫ్రాయిడ్ ప్రకారం, దొంగల భయం శైశవంలో పాతుకుపోతుంది. మంచం ప్రక్కన నిలబడ్డ తండ్రిని, ఆకస్మికంగా నిద్ర లేచిన బిడ్డ చీకట్లో చూచి దొంగ అనుకొంటాడు.
శవం: ఇది ఎప్పుడూ మనుష్యులు చావడాన్నే సూచించదు. అవాంఛనీయ ఆశ. ప్రేమసంబంధాల అంతాన్ని సూచించవచ్చు. తను కాదనుకొన్నవారిని మరణం ద్వారా తొలగిస్తాడు. తానే శవమైతే అనారోగ్యాన్ని, మృత్యుభయాన్ని, తను అనుభవిస్తున్న రోగబాధను సూచించవచ్చు.
పోలీసు: అధికారం, శిక్ష, రక్షణ, అంతరాత్మ ఇవన్నీ విడివిడిగా లేదా కలిపి.
రాణి: రాణి కలలో కనిపిస్తే తల్లి కాబోతున్నట్టు సంకేతమట.
స్నానాల గది : లైంగిక, రుగ్మత, రహస్యకార్యమేదైన ఉంటే దానికి ఇది సంకేతం.
సేతువు : ఒక స్థితి నుంచి మరొక స్థితికి పరివర్తనం చెందటం. సేతువును దాటటమంటే కష్టాలను దాటడం.
శ్మశానం : తన లేదా ఇతరుల మరణ వాంఛ. ప్రేమ భంగం లేదా సంబంధం తెగిపోవడం కూడా దీనికి సంకేతం.
గుడి: ఆధ్యాత్మికంగా పైకి ఎదగడం, అపరాధాలను ప్రక్షాళనం చేసుకోవడం.
వ్యవసాయ క్షేత్రం : ప్రేమ, పెండ్లి, సంతానాలను సూచిస్తుంది.
హోటలు: హోటల్ కలలోకి రావడం అరుదే. అయితే ఇది పరివర్తన దశ. హోటలు తాత్కాలిక నివాసం. వాటి అంతస్తులు చేతనా చేతనలను సూచిస్తాయి.
ద్వీపం : ఏకాంత సూచకం. ఒంటరిగా మౌనంగా ఉండాలని అనుకోవడానికి ఇది సూచన.
ఊబి: పరిస్థితులు తనను ముంచుతున్నాయను కొంటాడు స్వాపి. ఇతరుల సహాయం లేక బయట పడలేననుకొంటాడు. ఊబి ఎలాగైతే మనిషిని తనలోకి లాక్కుని సజీవంగా మరణం తెస్తుందో అలాగే నిజంగా జరుగుతుందని భయాడతారు.
ఇలా కలలో కొన్ని విషయాలు కొన్ని సంకేతాలను ఇస్తాయి. అవన్నీ ఫ్రాయిడ్ తన సిద్ధాంత పరిశీలన ద్వారా రూపొందించినవి.
◆నిశ్శబ్ద.