Read more!

పాలసీలు బహుపరాక్!! 


ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇప్పుడు పాలసీ అనేది కామన్ అయిపోయింది. ఏ రోజు సంపాదన ఆరోజు సరిపోయి ఏదో జీవితం అట్లా సాగుతున్నవాళ్ళు తప్ప పేదల నుండి, మధ్యతరగతి, ధనవంతుల వరకు ఈ పాలసీలలో మునిగి తేలుతున్నారు. ఇంకా చెప్పాలంటే మధ్యతరగతి వారి మీదనే ఈ పాలసీ సంస్థలు కూడా నడుస్తున్నాయంటే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ధనవంతులకు ఈ పాలసీలు ఉన్నా లేకపోయినా ఏమి సమస్య లేదు. పెద్దలు వెనుకేసిన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్సులు, వ్యాపార లాభాలు వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల వారికి పాలసీల గురించి పెద్ద ఆసక్తి కూడా తక్కువే. 

అయితే వ్యక్తి నుండి వాహనాలకు, వస్తువులకు, ఇళ్లకు, సంస్థలకు ఇన్సూరెన్స్ చేయించడం అనేది మొదలయ్యాక ఈ ధనవంతులు కూడా వీటితో బాగానే ప్రయోజనాలు పొందుతున్నారు. ఇకపోతే చాలా చోట్ల చాలా కుటుంబాలలో కనిపించే అతి సాధారణ సమస్య ఒకటుంది.

శ్రీరామ్ చిట్స్

ఎల్.ఐ.సి

హెచ్.డి.ఎఫ్.సి

ఇంకా ఇంకా వివిధరకాల బోలెడు సంస్థలు ఎన్నో ఇన్సూరెన్స్ లు అందిస్తున్నాయి. వీటిలో పాలసీలు తీసుకుని వాటిని కడుతున్న వారిలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉంటాయి. అయితే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య పాలసీ చెల్లింపు గడువు రాగానే పైసల కోసం వెతుక్కోవడం. నిజానికి ఈ పాలసీలు కట్టడం మొదలుపెట్టినప్పుడు తప్ప మిగిలిన సందర్భాలలో డబ్బు సమకూర్చుకోవడం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనిక్కారణం సరైన ప్లానింగ్ లేకపోవడమే అనేది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు.


సగటు మధ్యతరగతి వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి మూడువేల రూపాయల పాలసీ కట్టడానికి నిర్ణయించుకుంటే అతడి నెలవారీ సంపాదనలో ఐదువందల రూపాయలను పక్కన పెడుతుండాలి. ఆ ఆరు నెలల మొత్తం పాలసీ చెల్లింపును ఎలాంటి ఆందోళన లేకుండా చేస్తుంది. కానీ మధ్యతరగతి వాళ్ళు ఈ విషయం గూర్చి ఎక్కువ ఆలోచించరు. తీరా చెల్లింపు గడువు ముందుకొచ్చినప్పుడు అప్పు చేసో లేక వేరే చెల్లింపుల నుండి దీనికి డబ్బు మరల్చడమో చేస్తుంటారు. ఫలితంగానే ఒకవైపు ఇన్సూరెన్స్ లు కడుతూ మరోవైపు అప్పులు చేస్తూ ఉంటారు. ఇదీ సగటు మధ్యతరగతి పాలసీదారుని పితలాటకం.

హెల్త్ ఇన్సూరెన్స్ లు వచ్చినప్పటి నుండి ఓ ఆలోచన పురుగులా మెదడును తొలిచేది. చావుకు అగ్రిమెంట్ రాసుకున్నట్టు చస్తే ఆ ఇన్సూరెన్స్ తాలూకూ డబ్బులు బోల్డు వస్తాయని కదా ఇవన్నీ అని. కానీ నిజానికి  పేద, మధ్యతరగతి వ్యక్తులు ఎప్పుడూ ఇంతే కదా కుటుంబచట్రంలో ఇరుక్కుపోయిన జీవులు కదా అనిపిస్తుంది.


ఇకపోతే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇలాంటి ఆలోచనలు చేసే మధ్యతరగతి జీవుల వల్ల హాయిగా తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాయి.  సంవత్సరంలో ఈ పాలసీలు కట్టాలనే కోణంలో తమ సంతోషాలు కూడా వధులుకుంటున్న మధ్యతరగతి కుటుంబాలు కోకొల్లలు ఉన్నాయి. మనిషికోక పాలసీ, కానీ సంపాదన ఒకే ఒకరిది. ఇబ్బందులున్నా కట్టడానికే ముందుకు వెళ్తారు. కారణం భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉండటమే. 

పాలసీలతో జాగ్రత్త!!

కొందరుంటారు. ఈ పాలసీ సంస్థలలో పనిచేసే ఎంజెంట్లు. వీళ్ళు పాలసీలు తీయించడం, డబ్బులు వసూలు చేయడం పనిగా చేస్తుంటారు. అదే వారి ఉద్యోగం కూడా. అయితే పాలసీ తీయించేటప్పుడు 90% మంది ఆ పాలసీ వల్ల లాభాలు మాత్రమే చెబుతారు. కానీ దాని వల్ల వచ్చే నష్టాలు ఎవరూ ఏమీ చెప్పరు. చివరకు దానివల్ల ఏదో ఒక నష్టం ఎదురయ్యే దాకా దాని గురించి పాలసీదారుడికి తెలియదు కూడ. ఇలాంటి సంఘటనలు బోలెడు జరుగుతూ ఉంటాయి. సగటు మధ్యతరగతి ఒక సంస్థమీద ఎంతకని పోరాడతాడు. కాబట్టి ఒకటికి బట్టి నాలుగైదు సార్లు తిరుగుతాడు, ఆ తరువాత మోసం చేసిన వాడి నాశనం వాడిదే  అనుకుని కొన్నిరోజులు బాధపడి తిరిగి జీవితమనే పోరాటంలో పడిపోతాడు. కానీ నిజానికి ఆ సంస్థవాడు హాయిగా తన వ్యాపారాన్ని పెంచుకుంటూ ఉంటాడు. కాబట్టి పాలసీ తీసుకునేటప్పుడు అందులో ప్లస్ పాయింట్స్ మాత్రమే కాదు మైనస్ పాయింట్స్ ఏంటి అనేది మొదట అందరూ తెలుసుకోవాలి.

పైన చెప్పుకున్న విషయమంతా చదివాక పాలసీ అంటే భరోసా ఇవ్వాలి కానీ అది చిరాకు పెట్టించేదిగా ఉండకూడదని అందరికీ ఆర్గమయ్యే ఉంటుందనుకుంటా!!

◆ వెంకటేష్ పువ్వాడ