ఆలోచన మీద అదుపు లేకపోతే

అనగనగా ఇద్దరు స్నేహితులు. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగారు, కలిసి చదువుకున్నారు. ఒకరు తన పొలాని చూసుకుంటూ ఊరిలో జీవనాన్ని సాగిస్తుంటే, వేరొకరు రాజధానిలో ఉద్యోగాన్ని పొందారు. రాజధానిలో ఉన్న ఉద్యోగి ఓసారి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. రాకరాక వచ్చిన నేస్తాన్ని చూసి అతనికి సకల మర్యాదలూ చేశాడు పల్లెటూరి మిత్రుడు. పల్లెటూరి స్నేహితుడు మహా ఉదారమైన మనిషి. ‘చూడూ! నా దగ్గర రెండు గుర్రాలు ఉన్నాయి. నాకేమో ఒక్క గుర్రం చాలయ్యే! నీకు ఉద్యోగరీత్యా తెగ తిరగాల్సిన అవసరం ఉంటుంది కదా! హాయిగా నా రెండో గుర్రాన్ని తీసుకుని వెళ్లి వాడుకో,’ అన్నాడు.   పల్లెటూరి నేస్తం పెద్ద మనసు చూసి రాజధాని నేస్తం గుండె నిండిపోయింది. వందలసార్లు కృతజ్ఞతలు చెబుతూ ఆ గుర్రాన్ని బహుమతిగా అందుకున్నాడు. ఇలా ఓ పది రోజులు గడిచాయో లేదో... రాజధాని నేస్తం మళ్లీ పల్లెటూరికి తిరిగివచ్చాడు. ‘నేస్తం ఎలా ఉన్నావు. నువ్వు మళ్లీ రావడం సంతోషంగా ఉంది. ఏదన్నా పని మీద వచ్చావా లేకపోతే నన్ను చూసిపోదామని వచ్చావా?’ అని అడిగాడు పల్లెటూరి నేస్తం.   ‘నిన్ను చూసి నాకు కూడా సంతోషంగా ఉంది. కాకపోతే నేను అనుకోకుండా ఇక్కడికి రావల్సి వచ్చింది. నువ్వు నాకిచ్చిన గుర్రం ఉంది చూశావూ? అది మా గొప్పగా నాకు సాయపడుతోంది. కానీ నిన్న రాత్రి దాన్ని ఎక్కగానే, దానికి ఏం బుద్ధి పుట్టిందో ఏమో! ఎంత వారిస్తున్నా వినకుండా మీ ఊరి వైపుకి దూసుకువచ్చేసింది,’ అని వాపోయాడు రాజధాని మిత్రడు. ‘చిన్నప్పటి నుంచీ పుట్టి పెరిగిన ఊరు కదా! అందుకనే దాని మనసు ఇటు మళ్లి ఉంటుంది. ఎలాగూ వచ్చారు కదా! ఓ రెండు రోజులు ఉండి వెళ్లండి,’ అంటూ మరోసారి తన చిన్ననాటి మిత్రునికి ఆతిథ్యాన్ని అందించాడు పల్లెటూరి నేస్తం.   ఇది జరిగి ఓ పదిరోజులు గడిచాయి. పది రోజుల తర్వాత మళ్లీ గుర్రంతో ప్రత్యక్షం అయ్యాడు రాజధాని మిత్రడు. ‘రావోయ్‌ నేస్తం! నీ గుర్రం గాలి మళ్లీ ఇటువైపు మళ్లిందా ఏమిటి?’ అని అడిగాడు పల్లెటూరి స్నేహితుడు. ‘అవును ఇవాళ ఉదయం దీన్ని ఎక్కి కూర్చున్నానా! ఎంత ప్రయత్నించినా ఆగకుండా పరుగుపరుగున మీ ఊరి వైపుగా దూసుకువచ్చింది,’ అని బిక్కమొగంతో చెప్పాడు రాజధాని ఉద్యోగి.   ‘మరేం ఫర్వాలేదు! ఓ రెండు రోజులు నా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి,’ అంటూ ఆహ్వానించాడు పల్లెటూరి నేస్తం. అది మొదలు ప్రతి పది రోజులకి ఓసారి ఆ గుర్రం యజమానితో సహా తను పుట్టిపెరిగిన పల్లెటూరికి చేరుకోవడం మొదలుపెట్టింది. పల్లెటూరి నేస్తం చిరునవ్వు చెదరకుండా తన రాజధాని మిత్రుడికి ఆతిథ్యం ఇవ్వసాగాడు. ఇలా కొన్నిసార్లు జరిగిన తర్వాత ‘చూడు నేస్తం. నీ మనసు ఎంత ఉదారమైందో నాకు తెలియంది కాదు. కానీ ఇలా మాటిమాటికీ నీ ఇంటికి వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. పైగా అకస్మాత్తుగా ఇలా రెండేసి రోజులు మాయమైపోవడం వల్ల నా ఉద్యోగానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. దీనికేమన్నా ఉపాయం చూడు,’ అని ప్రాథేయపడ్డాడు రాజధాని ఉద్యోగి.   పల్లెటూరి నేస్తం కాసేపు ఆలోచించి ‘ఈసారి నువ్వు ఓ నెలరోజుల పాటు నా దగ్గరే ఉండు. ఈ నెల రోజుల్లోనూ గుర్రం మీద పూర్తిగా పట్టు సాధించేందుకు అవసరమయ్యే మెలకువలన్నీ నేర్పుతాను. గుర్రం పూర్తిగా నీ చెప్పుచేతల్లోకి వచ్చేలా తగిన శిక్షణ ఇస్తాను,’ అని చెప్పాడు. అన్నట్లుగానే ఆ నెల రోజుల్లోనూ గుర్రం పూర్తిగా రాజధాని మిత్రుని మాట వినేలా తీర్చిదిద్దాడు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆ గుర్రం తిరిగి పల్లెటూరి వైపు పరుగులెత్తలేదు.   మన జీవితం కూడా ఆ గుర్రం లాంటిదే! దాని మీద అదుపులేకపోతే తనకి కావల్సిన చోటుకి బలవంతంగా లాక్కుపోతుంది. బలహీనతల్లోకి జారిపోతుంది. వ్యసనాల వైపుగా ఈడ్చుకుపోతుంది. మన దారికి వచ్చిందిలే అనుకునేలోగా చేజారిపోతుంటుంది. అలా కాకుండా దాని మీద పూర్తిగా అదుపు తెచ్చుకున్న రోజున మన చెప్పుచేతల్లోనే ఉండిపోతుంది. దేవుడు మనిషికి ఆలోచన అనే బహుమతిని ఇచ్చాడు. ఆ బహుమతి మీద అదుపు లేకపోతే... దారి తప్పిన గుర్రంలా మారిపోతుంది. అదుపు సాధిస్తే అద్భుతాలకి దారి చూపిస్తుంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

సంతోషం కావాలా - దానం చేయండి!

మనిషి సంఘజీవి. ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ, ఒకరి బాధను వేరొకరు గమనించుకుంటూ సాగినప్పుడే ఆ జీవితానికి పరమార్థం. అందుకే మతాలన్నీ కూడా దానగుణానికి ప్రాధాన్యత ఇచ్చాయి. అయితే ఇలా దానం చేసినప్పుడు మన మెదడు ఎలా స్పందిస్తుంది అన్న అనుమానం వచ్చింది కొందరు పరిశోధకులకి. తనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల మన మనసుకి కష్టం కలుగుతుందా, తృప్తి లభిస్తుందా అని తెలుసుకోవాలని అనుకున్నారు. అలా చేపట్టిన ఓ పరిశోధన ఇచ్చిన ఫలితం ఇదిగో...   స్విట్జర్లాండ్లోని జూరిచ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనని చేపట్టారు. ఇందుకోసం వారు ఓ 50 మంది అభ్యర్థులను ఎన్నుకొన్నారు. వీరందరికీ కూడా కొంత డబ్బు ఇస్తానని వాగ్దానం చేశారు. అయితే ఇలా ఇచ్చిన డబ్బుని స్వంతానికి వాడుకోవచ్చునని కొంతమందికి చెప్పారు. ఆ డబ్బుని వేరొకరికి బహుమతి ఇచ్చేందుకు ఉపయోగించవచ్చని మరికొందరికి చెప్పారు. ఈ రెండురకాల వ్యక్తుల మెదడులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో గ్రహించే ప్రయత్నం చేశారు.   దానంతో అభ్యర్థుల మెదడులో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మార్పు కనిపించింది. మన సామాజిక ప్రవర్తనను నియంత్రించే temporoparietal junction, మనలోని సంతోషాన్ని సూచించే ventral striatum, మనం నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పడే orbitofrontal cortex... ఈ మూడింటిలోనూ అనూహ్యమైన మార్పులు వచ్చాయట! అభ్యర్థులలో ఎంత డబ్బు దానం చేయాలి, ఎలా చేయాలి అన్న ఆలోచనలు మొదలవడంతోనే ఈ మార్పులు కనిపించాయి.   మనకి ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల ఎనలేని తృప్తి లభిస్తుందని సామాజికవేత్తలు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. పాశ్చాత్యదేశాలలో కొందరు ధనవంతులు తమ సంపదను దానం చేసేయడం వెనుక కూడా ఇదే కారణం కనిపిస్తుంది. ప్రతిదీ మనకే కావాలి, చేతిలో ఉన్నదాన్ని మనమే దాచుకోవాలి అనే స్వార్థం మన మెదడు మీద ప్రతికూల ప్రభావాన్నే చూపుతుంది. అయితే పరిశోధకులు దానగుణం మంచిది అన్నారు కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేయాల్సిన అవసరం ఏమీ లేదట! ఇతరులకి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఆలోచనే చాలా సంతోషాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. - నిర్జర.

అంతరంగంలోనే సంతోషాల నిధి...

  సంతోషంగా వుండాలి. ఇదే అందరి కోరిక. అలా సంతోషంగా వుండాలంటే ఏమి కావాలి? ఏం చేయాలి అని తీవ్రంగా ఆలోచిస్తారు. ఏవేవో సూత్రాలు, ప్రణాళికలు చెబుతారు, వింటారు. సంతోషంగా వుండటం ఎలా అని నాలాగా ఎవరైనా వాళ్ళకి తోచింది రాస్తే అర్జెంటుగా చదివేస్తారు ఏమన్నా సీక్రెట్ తెలుస్తుందేమో అని. సంతోషపు నిధి తాళం దొరుకుతుందేమో అని. కానీ, దానికి యూనివర్సల్ సూత్రాలు అంటూ ఏవి వుండవు. వ్యక్తికీ వ్యక్తికి అవి మారిపోతుంటాయి. వాళ్ళవాళ్ళ మనస్తత్వాల బట్టి. ఎన్ని మాట్లాడుకున్నా, ఎన్ని తెలుసుకున్నా, లోపలి నుంచి నమ్మనిది ఏదీ ఆచరణలో కలకాలం నిలవదు. అందుకే ఒక్కసారి లోపలి నుంచి తర్కించి చూసుకోండి, అంతర్ముఖులుగా మారండి, మీతో మీరు వాదించుకోండి. ఏది నిజంగా మీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నది తెలుసుకోండి. గుర్తించండి.  అర్జెంటుగా ఈ విషయం కోసం ఇంత ఆలోచించాలా? అనిపిస్తే ఒక్క ప్రశ్న వేసుకోండి! ఇప్పుడు నేను సంతోషంగా వున్నానా? దానికి సమాధానం టక్కున అవును అని వస్తే సరే. లేదంటే తరచి చూసుకునే పని మొదలు పెట్టండి. "సంతోషం గా ఉండటానికి చాలా చాలా కావాలి, అవన్నీ వుంటే అప్పుడు పూర్తి సంతోషం నా స్వంతం" అంటూ చాలా లిస్టు చెబుతారుచాలా మంది. కానీ ఓటి కుండ ఎప్పుడూ నిండదు  అంటారే అలానే సంతోషంగా ఉండటమన్నది మన ఛాయస్ తప్ప అది ఛాన్స్ కానేకాదని తెలియని వారికి ఇప్పుడే కాదు వాళ్ళు కోరినవన్నీ దొరికినా సంతోషం మాత్రం దరిచేరదు. జీవితాన్ని జీవించటం అంటారు చూసారా? అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ , ఆనందిస్తూ, ఆ ఆనందాన్ని వేరొకరికి కూడా పంచుతూ అలా జీవించే వాళ్ళకి సంతోషం ' ఐ లవ్ యు ' అంటూ తోడుగా నిలిచిపోతుంది. అంతర్ముఖులు కావటం అవసరం అని ఇందాక చెప్పుకున్నాం కదా ! ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక్కరే కూర్చుని, ప్రకృతితో మమేకం అవుతూ, ఏ ఆలోచనలూ లేకుండా ఒక్క రెండు నిముషాలు గడిపి చూడండి. మన లోపలకి మనం చేసే జర్నీనే అతి కష్టమయినది. అది చేయగలిగితే చాలు జీవిత ప్రయాణం ఏంతో  సులువు. ఆ జర్నీలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి., జవాబులు ఎలా అనుకోవద్దు, ఎందుకంటే మన లోపలి శక్తికి అన్ని ప్రశ్నలకి సమధానం తెలుసు. కళ్ళు మూసుకోగానే నిజనిజాలని మన ముందు ఉంచుతుంది. మనం చేయాల్సిందల్లా ఆ లోపలి శక్తిని పలకరించటమే. ఒక్కసారి ఆ లోపలిదాకా  ప్రయాణం చేసి వస్తే చాలు. ఏవీ సమస్యలుగా కనిపించవు, ఎవరూ శత్రువులుగా తోచరు. ఈ రెండు లేకపోతే చాలు సంతోషం పరిగెట్టుకు వచ్చేస్తుంది. చకచకా పరుగులు పెడుతూ, బడ బడా మాట్లాడేస్తూ , ప్రపంచంతో ఎంతో మమేకం  అయిపోతూ మనకి మనం దూరం అయిపోతున్నాం.  మన లోపలి మనిషిని ఒంటరిని చేసేస్తున్నాం. సంతోషం చిరునామా తెలియలేదంటూ వాపోతున్నాం. మనలోనే వున్న దాని కోసం బయటి ప్రపంచమంతా వెతుకుతున్నాం. -రమ

దైర్యాన్ని పెంచుకోవడం ఎలా!!!

అనగనగా ఓ ఊళ్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతను చచ్చేంత పిరికివాడు. తన పిరికితనంతో జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోయాడు ఆ కుర్రవాడు. అంతేకాదు… భయంతో ఎక్కడికీ వెళ్లేవాడు కాదు, ఏ పనీ చేసేవాడు కాదు. ఇంతలో అతనికి ఓ విషయం తెలిసింది. తన ఊళ్లోకి యుద్ధ విద్యలను నేర్పే ఓ గురువుగారు వచ్చారట. ఆయన దగ్గరకి వెళ్లి యుద్ధవిద్యలన్నీ నేర్చేసుకుని బోలెడంత దైర్యాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు ఆ కుర్రవాడు. వెంటనే ఈ గురువుగారి దగ్గరకు వెళ్లి `గురువుగారూ ఎంత కష్టమైనా సరే నేను మీ దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకుంటాను`అని ప్రాథేయపడ్డాడు.   `అదెంత భాగ్యం! కానీ అంతకంటే ముందు నువ్వో పని చేయాల్సి ఉంటుంది.` అన్నారు గురువుగారు. `మీ దగ్గర విద్యని సాధించేందుకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే!`అన్నాడు కుర్రవాడు. `అయితే వెంటనే ఈ ఊరిని ఆనుకుని ఉన్న నగరానికి వెళ్లు. ఓ నెల రోజులు అక్కడే ఉండు. ప్రతిరోజూ నగరంలోకి వెళ్లి నీకు ఎదుటపడే మనుషుల కళ్లలోకి చూస్తూ గట్టిగా `నేను పిరికివాడిని`అని చెప్పు` అన్నారు గురువుగారు. ఆ మాటలు విని, గురువుగారికి మతిగానీ పోయిందా అనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇప్పుడిక వెనుకడుగు వేయలేడు. వేస్తే గురువుగారు ఊరుకునేట్లు లేరు. అందుకని ఆయన చెప్పినట్లుగానే మూటాముల్లే సర్దుకుని నగరానికి బయల్దేరాడు. తన గురువుగారు చెప్పినట్లుగానే తనకి ఎదురుపడినవారితో `నేను పిరికివాడిని`అని చెప్పాలనుకున్నాడు ఆ కుర్రవాడు. కానీ ఓ రెండు రోజులపాటు నోరు పెగలనే లేదు. చివరికి మూడో రోజున ఓ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ `నేను పిరికివాడిని` అని చెప్పేశాడు. ఆశ్చర్యం! తన గొంతు అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదు. రోజులు గడిచేకొద్దీ తనకి ఎదురుపడినవారికల్లా `నేను పిరికివాడిని`అని చెప్పడం మొదలుపెట్టాడు ఆ కుర్రవాడు. విచిత్రమేమిటంటే కాలం గడిచేకొద్దీ తన గొంతు మరింత స్పష్టంగా మారింది. తను ఇతరుల కళ్లలోకి సూటిగా చూడగలుగుతున్నాడు. చెప్పాలనుకున్నది దృఢంగా చెప్పగలుగుతున్నాడు. `నేను పిరికివాడిని` అంటున్నాడే కానీ తనలో పిరికితనం పోయిందనిపిస్తోంది. అనిపించడం ఏంటి! ఓ మూడు వారాలు పూర్తయేసరికి అతనిలో ఇక పిరికితనమే మిగల్లేదని అర్థమైపోయింది! నెలరోజుల గడువు పూర్తయిన తరువాత కుర్రవాడు తన గురువుగారి దగ్గరకు తిరిగి వెళ్లాడు. `గురువుగారూ మీరు పెట్టిన పరీక్ష అద్భుతంగా పనిచేసింది. కానీ అదెలా సాధ్యం!` అని అడిగాడు అయోమయంగా. `మరేం లేదు. పిరికితనం అనేది ఒక అలవాటు మాత్రమే! ఆ అలవాటు ఎంత బలంగా ఉంటే నువ్వు అంత బలహీనంగా మారిపోతావు. నీ మనసులో ఉన్న మాటని చెప్పాలన్నా, ఎదుటివారితో మాట్లాడాలన్నా, వారిని ఎదుర్కోవాలన్నా… నువ్వు తెగ భయపడిపోయేవాడివి. అందుకే నీకు ఆ పరీక్ష పెట్టాను. నువ్వే పని చేయడానికైతే భయపడ్డావో ఆ పనిని చేయించాను. ఎలాగైతే పిరికితనం ఓ అలవాటో ధైర్యం కూడా అలవాటే! అది ఇప్పడు నీకు అబ్బింది. భయం అనే మార్గాన్ని నువ్వు దాటి ధైర్యం అనే ప్రపంచంలోకి అడుగుపెట్టేశావు!` అంటూ చిరునవ్వుతో జవాబిచ్చారు గురువుగారు.

బద్ధకం కూడా ఓ అంటురోగమే!

తెలివి, బద్ధకం, అసహనం ఇవన్నీ వ్యక్తిగతమైన లక్షణాలని మన నమ్మకం. మనిషికీ మనిషికీ ఈ లక్షణాలలో తేడా ఉంటాయని మన అంచనా! ఇటు మనస్తత్వ శాస్త్రమూ, అటు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతూ ఉంటాయి. కానీ వీటిలో కొంతవరకు మాత్రమే నిజం ఉందంటున్నారు పరిశోధకులు. తన చుట్టూ ఉండే వ్యక్తులని బట్టి ఈ లక్షణాలు ప్రభావితం అవుతాయని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.   పారిస్ నగరానికి చెందిన కొందరు పరిశోధకులు మన వ్యక్తిగత లక్షణాల మీద ఇతరుల ప్రభావాన్ని తేల్చేందుకు ఓ 56 మంది వ్యక్తులను ఎన్నుకొన్నారు. ఇతరుల ప్రవర్తను గమనించినప్పుడు వీరిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గమనించారు. అటు సైకాలజీనీ, ఇటు గణితాన్నీ ఉపయోగించి వీరి మనస్తత్వంలో వస్తున్న మార్పులను లెక్క కట్టారు. వీరిలో నిర్ణయాలను తీసుకోవడం, శ్రమించడం, పనులు వాయిదా వేయడం... లాంటి స్వభావాలు అవతలివారి ప్రవర్తని బట్టి మారడాన్ని గమనించారు.   వ్యక్తిగతం అనుకున్న లక్షణాలు ఇంత బలహీనంగా ఉండటం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది. కానీ అందుకు స్పష్టమైన కారణమూ కనిపించింది. మన చుట్టూ ఉండేవారు ఏం చేస్తే అదే నిజం కాబోసు అన్న సందేహం మనలో ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ మనం అతిజాగ్రత్త కలిగిన మనస్తత్వం ఉండీ, అవతలివారు కూడా అదే తరహాలో ఉంటే... అదే సురక్షితమైన మార్గం అని మనసుకి తోస్తుంది. అలా కాకుండా మనం దూకుడుగా ఉండి, మన చుట్టూ ఉండేవారంతా అతిజాగ్రత్త పరులై ఉంటే... మనలో ఏదో లోపం ఉందేమో అనిపించి సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాము. ఎలా చూసినా, మనకి తెలియకుండానే పదిమందితోనూ కలిసి నడిచే ప్రయత్నం చేస్తామన్నమాట!   దురదృష్టం ఏమిటంటే మనలో ఈ పక్షపాత ధోరణ ప్రభావితం చేస్తున్నట్లు మనకి కూడా అనుమానం రాదు. అది మన సహజమైన వ్యక్తిత్వమే అన్నంతగా ఇతరుల వల్ల ప్రభావితం అయిపోతాము. అందుకేనేమో పెద్దలు ‘అర్నెళ్లు సావాసం చేస్తే, వారు వీరవుతారు’ అని అంటుంటారు. ఈ విషయాన్ని కాస్త మనసులో ఉంచుకుని పదిమంది దారినీ పక్కన పెట్టి మన విచక్షణకు పదునుపెట్టడం ఎంత అవసరమో కదా! - నిర్జర.  

మనసులోని మాట దిగమింగుకోవడమే మనం చేసే తప్పా?

ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలసి వుండటానికి ప్రేమ ఎంతో ముఖ్యమని అందరికీ తెలిసిందే. ఏరికోరి పెళ్ళిని ప్రేమతో ముడివేసుకున్న వాళ్ళు కూడా ఒకోసారి పెళ్ళి తర్వాత ఆ ప్రేమ కోసం వెతుకులాడటం చూస్తుంటాం... ఎందుకని? ఇద్దరు వ్యక్తులు కలసి బతకడంలో ఎక్కడో ఆ ప్రేమని జారవిడుచుకుంటారు. అందుకు కారణం నువ్వంటే నువ్వని వాదించుకుంటారు. మార్పు ఎదుటి వ్యక్తిలో రావాలని ప్రగాఢంగా నమ్ముతారు. ఖాళీ మనసులతో, నిర్జీవంగా మారిన బంధంతో, సర్దుకోలేక అసంతృప్తితో నలిగిపోతారు. మరి దీనికి పరిష్కరం లేదా అంటే... సమాధానం ‘ఉందనే’ చెప్పాలి. భార్యాభర్తల మధ్య ‘ప్రేమ’ ఎప్పటికీ తాజాగా నిలవాలంటే అందుకు నిపుణులు చేస్తున్న కొన్ని సూచనలు వినండి..  https://www.youtube.com/watch?v=d9D5pVYSowk&t=2s  

బలమా! బలహీనతా!

ఒక ప‌న్నెండేళ్ల పిల్ల‌వాడు ఏదో ఘోర‌మైన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. అత‌ని కుడి చేయి ఎందుకూ ప‌నికిరాకుండా పోయింది. కానీ ఆ పిల్ల‌వాడికి చిన్న‌ప్పటి నుంచీ ఓ కోరిక ఉండేది. ఎలాగైనా తను క‌రాటేలో గొప్ప ప్ర‌తిభావంతుడిని కావాలన్న‌దే ఆ కోరిక‌! కానీ ఇప్పుడేం చేసేది? త‌న కుడి చేయి ఇక క‌రాటేకి స‌హ‌క‌రించ‌దు క‌దా! అయినా ఆశ చావక తన బ‌డిలో ఉంటున్న క‌రాటే మాస్ట‌రు ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు.   `నేను ఇంక జీవితంలో క‌రాటేని నేర్చుకోలేమోన‌ని అనిపిస్తోందండీ` అన్నాడు బాధ‌గా. ఆ మాస్ట‌రుగారు ఒక్క‌నిమిషం ఆలోచించి `నీలో క‌నుక నిజంగా ప‌ట్టుద‌ల ఉంటే త‌ప్ప‌కుండా క‌రాటేలో గొప్ప నేర్పును సాధిస్తావు. కానీ నేనేం చెబితే నువ్వు అలాగే చేయ‌వ‌ల‌సి ఉంటుంది. స‌రేనా!` అని అన్నాడు. `నా చిన్న‌ప్ప‌టి కోరిక‌ను నెర‌వేర్చుకునేందుకు నేను ఎలాంటి క‌ష్టాన్నైనా భ‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాను.' అంటూ సంతోషంగా ఒప్పుకున్నాడు పిల్ల‌వాడు. మ‌రుస‌టి రోజు నుంచి పిల్ల‌వాడు రోజూ క‌రాటే మాస్టరుగారి ద‌గ్గ‌ర‌కు వెళ్లసాగాడు. కానీ విచిత్రంగా ఆ కరాటే మాస్ట‌రు రోజూ పిల్ల‌వాడికి ఒక‌టే కదలికని నేర్పేవాడు. ఎన్నిరోజులు చేసినా అదే ప‌ని. అదే కదలిక‌ని అభ్యాసం చేసీ చేసీ పిల్ల‌వాడు అలసిపోయేవాడు. ఎప్పుడూ ఒక‌టే ర‌కం భంగిమ‌తో అత‌నికి చిరాకు వేసేది. కానీ ఏం చెప్పినా చేయాల్సిందే అన్న గురువుగారి మాట‌కి క‌ట్టుబ‌డి ఊర‌కుండిపోయేవాడు. కొన్నాళ్ల‌కు ఇంక ఉండ‌బ‌ట్ట‌లేక `కరాటే అంటే ఇంతే కాదు క‌దా! ఇంకా వేరే ఏమైనా నేర్పుతారా?` అని అడిగాడు. `నువ్వు ఈ ఒక్క కదలిక‌నే సాధ‌న చేస్తూ ఉండు. చాలు!` అంటూ క‌స్సుమ‌న్నారు గురువుగారు. ఇంక మారుమాట్లాడ‌కుండా అదే భంగిమ‌ను సాధ‌న చేస్తూ ఉండిపోయాడు పిల్లవాడు. ఇలా ఉండ‌గా కొన్నాళ్ల‌కి ఆ బ‌డిలో కరాటే పోటీలు మొద‌లుపెట్టారు. `నువ్వు కూడా ఈ పోటీల‌లో పాల్గోవాలి!` అన్నారు గురువుగారు. `ఏదీ ఈ ఒక్క భంగిమ‌న‌తోనా!` అంటూ ఉక్రోషంగా బ‌దులిచ్చాడు పిల్ల‌వాడు.   గురువుగారు ఓ చిరున‌వ్వు న‌వ్వి ఊరుకుండిపోయారు. ఆశ్చర్యంగా పిల్ల‌వాడు త‌న‌కి పోటీలో ఎదుట‌ప‌డిన ఇద్ద‌రు ప్రత్యర్థుల‌నీ చాలా తేలికగా మ‌ట్టి క‌రిపించేశాడు. పోటీలో ముందుకు వెళ్తున్న కొద్దీ మ‌రింత బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థులు ఎదురుపడ‌సాగారు. కానీ ఎలాగొలా చివ‌రిక్ష‌ణంలో అయినా వాళ్ల‌ని ఓడించగ‌లిగాడు. పోటీలో ఒకో అంచె ముందుకు వెళ్తున్న కొద్దీ అత‌నిలో విశ్వాసం పెరిగిపోసాగింది. చివ‌రికి ఎలాగైతేనేం... ఆ పోటీలో అత‌నే విజేత‌గా నెగ్గాడు. `గురువుగారూ! జ‌రిగింది న‌మ్మ‌లేక‌పోత‌న్నాను. నేనీ ఒక్క క‌ద‌లిక‌తోనే విజ‌యాన్ని సాధిస్తాన‌ని మీరు ఎలా అనుకున్నారు?` అని అడిగాడు ఆశ్చ‌ర్యంగా. `మ‌రేం లేదు! నీకు నేర్పిన ఈ క‌ద‌లిక క‌రాటేలోనే చాలా క‌ష్ట‌మైన‌ది. అందుక‌ని చాలామంది దాన్ని నేర్చుకోవ‌డానికి వెనుకాడ‌తారు. ఇక‌పోతే చాలామంది కుడిచేత్తో పోరాడినంత బ‌లంగా ఎడ‌మ‌చేత్తో పోరాడ‌లేరు. అందుక‌నే ఆ ఒక్క పట్టుతోనే నువ్వు విజ‌యాల‌ను సాధించ‌గ‌లిగావు` అన్నారు గురువుగారు. ఎంత‌సేపూ త‌న బ‌ల‌హీన‌త గురించి ఆలోచించే ఆ పిల్ల‌వాడు, ఆ బ‌ల‌హీన‌త‌ని సైతం బ‌లంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు నేర్చుకున్నాడు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. కానీ ఒకోసారి దాన్నే తన బలంగా మార్చుకోవడమో లేక ఇతర మార్గాలను అన్వేషంచడమో చేస్తే విజయం తప్పక దక్కుతుంది.  

ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి ఫోన్లు వస్తుంటే!

ఆఫీసులో మంచి పనిలో తలమునకలైపోయి ఉంటామా! ఇంటి దగ్గర్నుంచీ ఫోన్ వస్తుంది. అలాగని అదేమీ ఎమర్జన్సీ ఫోన్ కూడా కాదు. ఎలా ఉన్నారో ఓసారి పలకరించేందుకో, సాయంత్రం వచ్చేటప్పుడు కందిపప్పు తెమ్మని గుర్తుచేసేందుకో... చేసిన పోన్. ఇక ఇంట్లో ఫ్యామిలీతో కలిసి హాయిగా భోజనం చేసే సమయంలో సాటి ఉద్యోగుల నుంచి వచ్చే ఫోన్లకీ కొదవ ఉండదు. అది కూడా ఏమంత ఎమర్జన్సీ కాదు. పక్క సీట్లో సుబ్బారావు గురించో, పెరగకుండా మిగిలిపోయిన జీతాల గురించో కావచ్చు.   ఇలా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు ఫోన్లు, ఆఫీసులో ఇంటి ఫోన్ల వల్ల... ఇటు కుటుంబ జీవితం, అటు ఉద్యోగ జీవితం ఎంతవరకు ప్రభావితం అవుతున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఈ విషయాన్ని తేల్చేందుకు ఓ 121 మంది ఉద్యోగులను పదిరోజుల పాటు డైరీ రాయమని అడిగారు. ఆఫీసులో ఏం జరుగుతోంది- దాని వల్ల తన పనితీరు ఎలా ప్రభావితం అయ్యింది, ఇంట్లో ఏం జరుగుతోంది- దాని వల్ల తన కుటుంబ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది... తదితర వివరాలన్నీ ఈ డైరీలో నమోదు చేయమని అడిగారు.   ఆఫీసులో ఇంటి ఫోన్లు, ఇంట్లో ఆఫీసు ఫోన్ల వల్ల అటు లాభమూ ఇటు నష్టమూ రెండూ ఉన్నట్లు తేలింది. ఆఫీసులో వచ్చే ఫోన్లతో జాబ్ శాటిస్ఫాక్షన్ లేకపోవడం, పని మీద శ్రద్ధ తగ్గడం, చిరాకు... లాంటి పర్యవసానాలు కనిపించాయి. కానీ కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఇంటి నుంచి వచ్చే ఫోన్లతో పనిఒత్తిడి తగ్గడం, కుటుంబసభ్యుల మధ్య అనుబంధం పెరగడాన్ని గమనించారు. పనికీ పనికీ మధ్య ఖాళీ సమయంలోనో, భోజన విరామంలోనో, ఇంటికి వెళ్లే దారిలోనో ఇంటికి చేసే ఫోన్లతో అటు వారితో మాట్లాడినట్లూ ఉంటుంది, ఇటు ఉద్యోగానికీ ఇబ్బంది ఉండదట.   ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆఫీసు ఫోన్ల విషయంలో తగినంత జాగ్రత్త ఉండాలంటున్నారు. పక్కన ఎవరూ లేని సమయంలోనో, పిల్లలు పడుకున్న తర్వాతనో సాగే ఆఫీసు ఫోన్లతో పెద్దగా నష్టం ఉండదని సూచిస్తున్నారు. అంతేకాదు! ఆఫీసు అవసరాలకి అనుగుణంగానే తమకు ఫోన్ చేయవలసిందిగా సాటి ఉద్యోగులకి తెలియచేయమంటున్నారు. చిన్న చిన్న విషయాలకి మెయిల్ చేయమనీ, విషయం వెంటనే తెలియాలి అనుకున్నప్పుడు మెసేజ్ చేయమనీ, అత్యవసరం పరిస్థితులలో అయితేనే ఫోన్ చేయమనీ సాటి ఉద్యోగులకు చెప్పి ఉంచమంటున్నారు. - నిర్జర.  

MANGO TOURISM గురించి విన్నారా!

కొన్ని దేశాలలో ద్రాక్ష తోటల్లో పర్యటకులని అనుమతిస్తుంటారు. ఆ తోటల్లో తిరుగుతూ, ద్రాక్షపళ్లతో ఆడుకుంటూ, ద్రాక్ష సారాయిని తయారుచేస్తూ పర్యటకులు సంబరపడిపోతుంటారు. వీళ్ల సరదా ద్రాక్షతోటల యజమానులకి కాసులను కురిపిస్తుంటుంది. మన రైతులకి కూడా ఇలాంటి అవకాశం ఉంటే బాగుంటుంది కదా! అందుకోసం మన దగ్గర ద్రాక్షతోటలు లేకపోతే ఏం... పళ్లకు రారాజైన మామిడి తోటలు ఉన్నాయి కదా!   మేంగో టూరిజం (mango tourism) ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రచారం పొందుతోంది. మహారాష్ట్రలోని రైతులు ఇప్పటికే ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగా... ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, పశ్చిమబెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఈ ఏడాది విస్తృతంగా మేంగో టూరిజంని అందిపుచ్చుకునే ఆశతో ఉన్నాయి. ఇంతకీ ఈ మేంగో టూరిజంలో ఏం చేస్తారంటారా! అబ్బో చెప్పుకోవాలంటే బోలెడు విశేషాలే ఉన్నాయి!   - మేంగో టూరిజంలో భాగంగా, విశాలమైన మామిడి తోటలలోకి పర్యటకులను అనుమతిస్తారు. కొన్ని సందర్భాలలో ప్రభుత్వమే కొందరు మామిడి రైతులో ఒప్పందం చేసుకొని, వారి తోటల దగ్గరకు యాత్రికులకు రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.   - మామిడి తోటల్లోకి ప్రవేశించిన పర్యటకులను రైతులు తమ తోటలన్నీ తిప్పి చూపిస్తారు. మామిడి చెట్లను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, పూత కాయగా మారేవరకు ఎంత శ్రద్ధగా చూసుకుంటారు, కాయలను ఎలా మగ్గపెడతారు... లాంటి వివరాలన్నింటినీ ఓపికగా చెబుతారు.   - పర్యటకులకు కావల్సిన అల్పాహారం, టీ కాఫీలు, భోజనం... అన్నీ కూడా రైతులే ఏర్పాటు చేస్తారు. వాటివల్ల అటు రైతులకీ ఆదాయం కలుగుతుంది, ఇటు యాత్రికులకీ స్వచ్ఛమైన పల్లె ఆహారం తిన్నట్లుంటుంది.   - మామిడి తోటల్లో తిరగడమే కాదు... మామిడి కాయలు కోసుకోవడానికి కూడా పర్యటకులకు స్వేచ్ఛ ఉంటుంది. అందుకోసం ఎలాంటి మామిడిపళ్లను ఎంచుకోవాలో రైతులు సలహా కూడా ఇస్తారు. కాకపోతే ఇలా కోసుకున్న పండ్లని చివరికి తూకం వేసి, వాటికి సరిపడా ధరని చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పర్యటకులకు తాజా పళ్లు, రైతులకి తగిన గిట్టుబాటు ధరా లభిస్తాయి.   - కేవలం పళ్లే కాదు! చాలా తోటల్లో మామిడితాండ్ర, జాం, జ్యూస్, పచ్చళ్లు.. ఇలా మామిడితో చేసిన పదార్థాలన్నీ కూడా దొరికే అవకాశం ఉంటుంది.   - తోటల్లో తినడం, తిరగడంతోనే కాలం గడిపేస్తే మజా ఏముంటుంది! అందుకే చాలాచోట్ల ఎడ్లబండి మీద ప్రయాణం, మామిడి పళ్లని తినే పోటీలు పెట్టడం, జానపద నృత్యాలు ప్రదర్శించడం లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఇవేవీ ఇష్టం లేకపోతే హాయిగా నులకమంచం మీద చెట్టు కింద పడుకుని సేదతీరే అవకాశం ఎలాగూ ఉంటుంది.   - ఒక్క రోజులో హడావుడిగా గడిపేస్తే ఎలా అనుకునేవారికి... తోటల్లోనే ఒకటి రెండు రోజులు సేదతీరే సదుపాయాలూ కొన్ని చోట్ల ఉన్నాయి.   అదీ విషయం! మొత్తానికి ఏదో ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ఈ మేంగో టూరిజం ఇప్పుడు రైతులకీ, ప్రభుత్వానికీ కాసులు పండిస్తోంది. అటు కొత్తదనం కోరుకునే పర్యటకులకీ సరికొత్త అనుభూతిని అందిస్తోంది. అందుకనే ఈ తోటల్లో విహరించేందుకు విదేశాల నుంచి కూడా యాత్రికులు వస్తున్నారట. మరి మామిడి పంటకు ప్రసిద్ధమైన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి టూరిజం మొదలైతే భలే ఉంటుంది కదా! - నిర్జర.  

మెదడు వందేళ్లు పనిచేయాలంటే!

వయసు మీదపడుతున్న కొద్దీ మెదుడు చురుగ్గా పనిచేయదన్నది మన ఆలోచన. మెదడులోని న్యూరాన్లు బలహీనపడటమే ఇందుకు కారణమంటారు శాస్త్రవేత్తలు. కేలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన రేచెల్ అనే శాస్త్రవేత్త ఇందుకు పరిష్కారం ఏమన్నా ఉందేమో కనుగొనే ప్రయత్నం చేశారు. దాదాపు 50 ఏళ్లపాటు చేసిన పరిశోధన ఫలితంగా రేచెల్ ఈ సమస్యకి ఒక పరిష్కారం సాధించానని చెబుతున్నారు.   చిన్నప్పుడు మనం ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా, కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఈ తరహా విధానానికి ‘Broad learning’ అని పేరు పెట్టారు రేచెల్. ఇక పెద్దయ్యేకొద్దీ మనం నేర్చుకునే తీరు మారిపోతుంది. ఈ విధానానికి ‘specialised learning’ అని పేరు పెట్టారు. వాటి మధ్య తేడాలని ఆరు రకాలుగా వివరించే ప్రయత్నిం చేశారు.   1 - చిన్నప్పుడు ఏదన్నా కొత్త విషయాన్ని నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటాము (open mindedness). కానీ పెద్దవారిలో ఇలాంటి విశాల దృక్పథం ఉండదు. ఏదన్నా కొత్త విషయం నేర్చుకొనేందుకు వారి అభిప్రాయాలు, విచక్షణ, అహంకారం... మాటిమాటికీ అడ్డం వస్తుంటాయి.   2- చిన్నతనంలో అయితే తెలియని విషయాన్ని చెప్పేందుకు టీచర్లు, పెద్దలు ఉంటారు. ఏదన్నా అనుమానం వచ్చినా ఠక్కున వారిదగ్గరకు వెళ్తాము. కానీ పెద్దయ్యాక ఇలా మరొకరి సాయం తీసుకునేందుకు మొహమాటం అడ్డువస్తుంది.   3 – కాస్త కష్టపడితే ఏదన్నా నేర్చుకోవచ్చనే నమ్మకం చిన్నతనంలో ఉంటుంది. కానీ పెద్దయ్యాక నమ్మకం మారిపోతుంది. ప్రతిభ పుట్టుకతో రావాలే కానీ, ఎంత కష్టపడినా ఉపయోగం ఉండదన్న నిర్వేదం పెద్దల్లో కనిపిస్తుంది.   4 – చిన్నతనంలో పొరపాట్లు చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కాబట్టి పిల్లలు పడుతూలేస్తూ, తప్పులు చేస్తూ నేర్పు సాధించే అవకాశం ఉంటుంది. కానీ పెద్దయ్యాక మనం చేసే పని ఎక్కడ తప్పుగా మారుతుందో, అది ఏ ఫలితానికి దారితీస్తుందో అన్న భయం నిరంతరం వెంటాడుతూ ఉంటుంది.   5 – పిల్లల్లో ఏదన్నా నేర్చుకునేందుకు ఆసక్తి మొదలైతే... అది సాధించేదాకా ఊరుకోరు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా పట్టిన పట్టు విడవరు. కానీ పెద్దలు అలా కాదు కదా! ఏదన్నా హాబీ మొదలుపెట్టారంటే ఓ రెండు నెలల్లోనే దాన్ని చాప చుట్టేస్తారు.   6 – పిల్లలు రకరకాల నైపుణ్యాలని ఒక్కసారిగా నేర్చుకునేందుకు (multiple skills) భయపడరు. ఒక పక్క బొమ్మలు గీస్తూనే మరో పక్క డాన్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకో పక్క చదువుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్లు అలా కాదు! ఏదన్నా ఒక విషయం మీద శ్రద్ధ పెడితే, మరో విషయాన్ని పట్టించుకుంటే ఎక్కడ తమ ఏకాగ్రత తప్పిపోతుందో అన్న భయంతో ఉంటారు.   ఈ ఆరు విషయాలనీ గమనించి... చిన్నతనంలో మనం ఎలాగైతే నేర్పుని సాధించే ప్రయత్నం చేసేవారమో గుర్తుచేసుకోమంటున్నారు రేచెల్. అవే పద్ధతులని పెద్దయ్యాక కూడా పాటిస్తే వృద్ధాప్యం వయసుకే కానీ మెదడుకి రాదని భరోసా ఇస్తున్నారు. - నిర్జర.  

కోపం ఒక విషవలయం!

హరి మనసేం బాగోలేదు. పొద్దున లేవగానే భార్యతో గొడవైంది. మాటామాటా పెరిగింది. ఆ గొడవతో అతని భార్య స్వాతి మనసు కూడా చిరాకుగా మారిపోయింది. హరి ఆఫీసుకి వెళ్లేసరికి అక్కడ సురేష్‌ నవ్వుతూ ఎదురుపడ్డాడు. అతను హరి పక్కనే కూర్చుని ఏదో జోక్‌ చేయబోయాడు. కానీ హరి దాన్ని ఆస్వాదించే మూడ్‌లో లేడు. సురేష్‌ మాటలకి చాలా ముభావంగా స్పందించాడు. పైగా ‘నన్ను కాస్త ఒంటరిగా వదిలెయ్!’ లాంటి మాటేదో వాడేసాడు. హరి ముభావంగా ఉండటం, పుల్లవిరుపుగా మాట్లాడటం చూసి సురేష్‌కి కూడా చిరాకు మొదలైంది. ‘వీడి దగ్గరకి వెళ్లి కాలక్షేపం చేయడానికి నాకేంటి పని!’ అనుకున్నాడు. ఆ చిరాకుతోనే తన డెస్క్‌ దగ్గరకి వెళ్లి సిస్టమ్‌ ఆన్‌ చేశాడు. ఆ చిరాకుతోనే అస్తవ్యస్తంగా పనిచేయసాగాడు. చూస్తూ చూస్తుండగానే అతనికి తన పని మీదా, ఆ ఆఫీసు మీదా, ఉదయం క్యారియర్‌ ఇవ్వని తన భార్య మీదా కోపం మొదలయ్యాయి. క్యారేజీ సర్దని తన భార్యతో మనసులోనే వాదించడం మొదలుపెట్టాడు. సురేష్‌ మెదడు మాంచి వేడిగా ఉన్న సమయంలో, తన భార్య నుంచి ఫోన్‌ వచ్చింది- ‘భోజనం చేశారా?’ అంటూ! అంతే, పుండు మీద కారం చల్లినట్లయ్యింది. ఫోన్‌లోనే ఒక్కసారిగా విరుచుకుపడిపోయాడు. ‘నేను పస్తులుండటమేగా నీకు కావాల్సింది!’ అంటూ దెప్పిపొడిచాడు. సురేష్‌ మాటలకి అతని భార్య మీనా కళ్లు చెమర్చాయి. వండుకున్న అన్నం కూడా తినకుండా అలాగే పడుకుండిపోయింది. ఈలోగా మీనా ఇంటి తలుపు ఎవరో తట్టారు. కళ్లు తుడుచుకుని చూస్తే పనిమనిషి. ‘పనికి రావాల్సిన సమయమేనా ఇది! మిట్టమధ్యాహ్నం భోజనాలు చేసి, అంతా పడుకునే సమయానికి వచ్చి ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఇప్పుడెందుకు వచ్చినట్లు!’ అనిపించింది ఆ మనిషిని చూసిన వెంటనే. అసలే భర్త చేతిలో చివాట్లు తిన్న చిరాకులో ఉన్న మీనా... పనిమనిషిని ఎడాపెడా దులిపేయడం మొదలుపెట్టింది. మీనా మాటలన్నీ పనిమనిసి కిక్కురుమనకుండా విన్నది. ఆపై తను ఎందుకంత ఆలస్యంగా వచ్చిందో చెప్పుకొచ్చింది. తన భర్త అనారోగ్యం గురించీ, కుటుంబ పోషణ కోసం తను పడుతున్న కష్టం గురించీ చెప్పుకొచ్చింది. మీనా కాస్త శాంతించిన తర్వాత తన సహజశైలిలో సరదాగా కబుర్లు చెబుతూ పనిచేయడం మొదలుపెట్టింది. ఆ మాటా ఈ మాటా చెబుతూ చకచకా పని సాగించింది. ఓ పదినిమిషాలు గడిచేసరికి మీనా మనసులోని దిగులు కాస్తా తీరిపోయినట్లు తోచింది. తను కూడా మాటలు కలుపుతూ, నవ్వడం మొదలుపెట్టింది. కానీ మనసులో ఏదో ఒక మూల తన భర్త నొచ్చుకున్నాడన్న దిగులు మాత్రం అలాగే ఉండిపోయింది. ఆ దిగులుని పోగొట్టుకునేందుకు మరోసారి భర్తకి ఫోన్‌ చేసింది. ఆపాటికే సురేష్‌ బయట సుష్టుగా భోజనం చేసి తన డెస్కులోకి చేరుకున్నాడు. తన భార్య మీద నోరు పారేసుకున్నందుకు నొచ్చుకుంటున్నాడు. మళ్లీ సాయంత్రం తనతో ఎలా మాటలు కలపాలా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. ఆ సమయానికి భార్యే ఫోన్‌ చేయడంతో అతని మనసు కాస్తా తేలికపడిపోయింది. ఫోన్లో ఓ రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఉదయం పోయిన హుషారు తిరిగి వచ్చినట్లయ్యింది. సురేష్‌ తన పనిలో ఉండగానే హరి మరోసారి ఎదురుపడ్డాడు. ‘పొద్దున్న పాపం ఏదో చిరాకులో ఉన్నట్లున్నాడు. నేనే అనవసరంగా అతన్ని ఇబ్బంది పెట్టాను!’ అనిపించింది. అందుకనే మళ్లీ సరదాగా హరిని కబుర్లోకి దింపే ప్రయత్నం చేశాడు. ఒకటికి రెండుసార్లు సురేష్‌ తనతో సరదాగా ఉండే ప్రయత్నం చేసి హరి మనసు కూడా తేలికపడింది. తాను కూడా సురేష్‌తో మాట కలిపాడు. తను కూడా నాలుగు సెటైర్లు వేసే ప్రయత్నం చేశాడు. చూస్తూచూస్తుండగానే ఆఫీసు సమయం అయిపోయింది. పెద్దగా పని ఒత్తిడి లేకుండానే ఆ రోజు ఆఫీసు గడిచిపోయింది. కానీ తన భార్యతో పడిన గొడవ తాలూకు ఒత్తిడి మాత్రం అతని మనసు మీద ఇంకా పనిచేస్తూనే ఉంది. ‘ఛా! ఒక్క చిన్న మాటతో మొదలైన గొడవ కాస్తా రాద్ధాంతం అయిపోయింది. నాకు ఈమధ్య  కోసం ఎక్కువైపోతోంది,’ అనుకున్నాడు. తన భార్యకి సారీ చెప్పడం కోసం ఫోన్‌ చేతిలోకి తీసుకున్నాడు. ఈ కథలో అయిదు పాత్రలే ఉన్నాయి. కానీ మన జీవితంలో అంతకు లెక్కకు మించిన మనుషులు ఎదురుపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరిదీ ఒకో కష్టం, ఒకో సమస్య, ఒకో వ్యక్తిత్వం. ఆ క్షణంలో వారు ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అనేదాని వెనుక అనేక కారణాలు. ఈ నిమిషానికి వారితో మనకి ఉన్న సమస్యని అర్థం చేసుకునో, పరిష్కరించుకునో... రెండూ కుదరకపోతే కాసేపు పక్కకు తప్పుకునో ఉంటే మన జీవితం సాఫీగా సాగిపోతుంది. లేకపోతే ఎక్కడికక్కడ కొత్త వివాదం మొదలవుతూనే ఉంటుంది. ప్రతి బంధమూ బరువైపోతుంది. అంతేకాదు! ఆ కోపాన్ని, దుఃఖాన్నీ మనసులో నింపుకుని ముందు సాగితే... మన చిరాకుని చుట్టుపక్కల వారితో కూడా పంచుకున్నాట్లు అవుతుంది. వారి జీవితాలని కూడా ప్రభావితం చేస్తుంది. వీలైతే మన కోపానికి పరిష్కారాన్ని వెతుక్కోవాలి. లేదా కనీసం దాన్ని ఇతరులకి బదలాయించుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మన దగ్గరకే ఎవరన్నా చిరాకుతో వస్తే ఆ విషవలయాన్ని అక్కడితో ఛేదించాలి. - నిర్జర.

డబ్బు విలువ

అతను ఓ పెద్ద వ్యాపారి. తన కష్టానికి అదృష్టం కూడా కలిసిరావడంతో పట్టిందల్లా బంగారం అయ్యింది. దాంతో తన జీవితంలో ఎలాంటి లోటూ లేకుండా పోయింది. అంతా బాగానే ఉంది. కానీ తన తర్వాత వ్యాపారం పరిస్థితి ఏమిటా అన్న బెంగ మొదలైంది వ్యాపారస్తునికి. ఎందుకంటే తన కొడుకు ఎలాంటి కష్టమూ తెలియకుండా పెరిగాడు. అతనికి వ్యాపార సూత్రాలు కానీ, డబ్బు విలువ కానీ ఏమాత్రం తెలియవు. కష్టపడే తత్వం ఇసుమంతైనా లేదు. అలాంటి కొడుక్కి బుద్ధి చెప్పడం ఎలా? అని తెగ ఆలోచించాడు వ్యాపారస్తుడు. ఆలోచించగా... ఆలోచించగా... అతనికి ఓ ఉపాయం తట్టింది. మర్నాడు వ్యాపారస్తుడు తన కొడుకుని పిలిచాడు. ‘చూడు! నువ్వు ఎందుకూ పనికిరాకుండా పోతున్నావు. డబ్బు తగలెయ్యడం తప్ప సంపాదించడం చేతకావడం లేదు. అందుకని నీకో పరీక్ష పెడుతున్నాను. ఇవాళ నువ్వు ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించుకుని వస్తేనే రాత్రికి భోజనం పెడతాను. లేకపోతే ఖాళీ కడుపుతో పడుకోవాల్సిందే!’ అని తేల్చి చెప్పాడు. తండ్రి మాట విన్న కొడుకుకి ఏం చేయాలో పాలుపోలేదు. ఇన్నాళ్లూ తనకి కష్టం అంటే ఏమిటో తెలియదు. అసలు కష్టపడాల్సిన అవసరం తనకేముందని? అందుకని బిక్కమొహం వేసుకుని తల్లి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు సమస్య విని తల్లి తల్లడిల్లిపోయింది. తన భర్త ఇంక కర్కశంగా ప్రవర్తిచాడేమిటా అనుకుంది. వెంటనే తన పెట్టెలోంచి ఒక బంగారు నాణెం తీసి కొడుకు చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి మీ నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. తల్లి ఇచ్చిన బంగారు నాణెం తీసుకుని కొడుకు సంతోషంగా తండ్రి దగ్గరకి వెళ్లాడు. ఆయన చేతిలో బంగారు నాణేన్ని ఉంచి, తనే ఆ నాణాన్ని సంపాదించానని చెప్పాడు. తండ్రి మహా తెలివైనవాడు. అందుకే ఆ నాణెం ఎక్కడి నుంచి వచ్చిందో చటుక్కున గ్రహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే నువ్వు సంపాదించుకుని రావాలి. అప్పుడే నీకు రేపు రాత్రి భోజనం దక్కుతుంది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ బంగారు నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేలోగా, భార్యని ఏదో పని మీద ఊళ్లోకి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో కొడుక్కి ఆ రోజు సంపాదన ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు. వెంటనే తన అక్క దగ్గరకి వెళ్లాడు. తమ్ముడి కష్టం విన్న అక్క తెగ బాధపడిపోయింది. తండ్రి ఎందుకిలా తయారయ్యాడా అని తెగ మధనపడిపోయింది. వెంటనే తన పెట్టెలోంచి ఒక వెండి నాణెం తీసి తమ్ముడి చేతిలో పెట్టింది. ‘ఇది తీసుకువెళ్లి నాన్నగారికి ఇవ్వు. దాన్ని నువ్వే సంపాదించానని చెప్పు!’ అంది. అక్క ఇచ్చిన వెండి నాణేన్ని తీసుకుని తమ్ముడు సంతోసంగా తండ్రి సముఖానికి చేరుకున్నాడు. ఆయన చేతిలో నాణేన్ని పెట్టి తానే దానిని సంపాదించానని చెప్పాడు. తండ్రి తక్కువవాడా! ఆ నాణెం ఎక్కడిదో ఊహించేశాడు. ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి, రేపు సాయంత్రం ఇలాగే సంపాదించుకుని రా! అప్పుడే నీకు రేపు రాత్రి తిండి పెట్టేది,’ అని చెప్పాడు. తండ్రి చెప్పినట్లుగానే ఆ వెండి నాణేన్ని బావిలో పడేశాడు కొడుకు. మర్నాడు కొడుకు నిద్రలేచేసరికి భార్యనీ, కూతురినీ చుట్టాలింటికి పంపేశాడు వ్యాపారస్తుడు. దాంతో ఇక కొడుక్క అసలు సమస్య మొదలైంది. బంధువులని డబ్బు అడిగితే తండ్రికి తెలిసిపోతుంది. తెలిసినవారిని అడగాలంటే మొహమాటం అడ్డు వచ్చింది. దాంతో ఎలాగొలా ఆ ఒక్కరోజూ కష్టపడదామని నిర్ణయించుకున్నాడు. ఆ కొట్టూ ఈ కొట్టూ తిరుగుతూ పనికోసం ప్రాథేయపడ్డాడు. కొంతమంది లేదన్నారు. కొంతమంది ఛీత్కరించారు. కొంతమంది తరిమికొట్టారు. పాపం ఇలాంటి అనుభవాలన్నీ అతనికి కొత్త. మరోవైపు కడుపు నకనకలాడిపోతోంది. చివరికి మధ్యాహ్నం ఎప్పటికో ఓ పుణ్యాత్ముడు అతనికి పని ఇచ్చాడు. కొట్టు బయట ఉన్న కట్టెలన్నీ తీసి లోపల పడేస్తే ఓ పదిరూపాయలు ఇస్తానన్నాడు. ఆ మాట వినగానే కొడుకు మొహం వెలిగిపోయింది. కానీ ఒకో కట్టెముక్కా తీసుకుని లోపలకి వేస్తుంటే అతని ఒళ్లు హూనమైపోయింది. వీపు దోక్కుపోయింది. చేతులు పుళ్లుపడిపోయాయి. చివరికి ఎలాగోలా తనకి అప్పచెప్పిన పనిని పూర్తిచేశాడు. పదిరూపాయల నాణెం తీసుకుని తండ్రి దగ్గరకి వెళ్లి నిల్చొన్నాడు. కొడుకు వాలకం చూడగానే తండ్రికి విషయం అర్థమైపోయింది. అయినా అతను చెప్పాలనుకున్న పాఠం ఇంకా పూర్తికాలేదు. అందుకనే- ‘దానిని తీసుకుపోయి బావిలో పడెయ్యి,’ అని చెప్పాడు. ఆ మాట వినగానే కొడుకు మనసు తరుక్కుపోయింది. ‘ఇంతా కష్టపడి సంపాదించిన డబ్బుని బావిలో పడెయ్యాలా! వద్దు నాన్నా!’ అని వేడుకున్నాడు. ఆ మాటలకి తండ్రి చిరునవ్వుతో- ‘చూశావా! ఎవరో ఇచ్చిన సంపద- అది బంగారమైనా, వెండైనా సరే... దాని విలువ మనకి తెలియదు. అందుకే బావిలో పారేసినట్లుగానే ఖర్చు చేసి పారేస్తాం. అదే రక్తం ధారపోసి సంపాదించినది రూపాయి అయినా సరే... దానిని జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటాం. ఈ రోజుతో నీకు డబ్బు విలువ తెలిసొచ్చింది. ఇక మీదట నువ్వు నా వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉండు,’ అని చెప్పాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

జీవితం బోర్ కొట్టేస్తోందా!

నిమిషం ఖాళీ లేని జీవితం.... ఇంటినిండా కావల్సినన్ని వస్తువులు. అయినా ఏదో వెలితి. ఆ వెలితి ఒకోసారి హద్దులు దాటి జీవితం అంటేనే బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అలాగని ఉన్న ఉద్యోగాన్నీ వదులుకోలేము, సమాజానికి దూరంగానూ పారిపోలేము. కాకపోతే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఆ నిస్సత్తువ నుంచి కాస్త బయటపడవచ్చని అంటున్నారు నిపుణులు... కదిలి చూడండి ఒక రెండు రోజులు సెలవు పెట్టి ఏ ఊరికో వెళ్లి చూడండి. అదీ కాదంటారా! దగ్గరలోనే ఉన్న చూడదగ్గ ప్రదేశాలన్నీ ఓ చూపు చూసి రండి. కాదూ, కూడదంటారా! ఊళ్లోనే ఉన్న స్నేహితుల ఇళ్లకు వెళ్లి పలకరించి రండి. మొత్తానికి మీరున్న చోట నుంచి కదిలే ప్రయత్నం చేయండి. రోజూ కళ్ల ముందు కనిపించే వాతావరణం నుంచి కాస్త దూరం జరగండి. సృజనకు పదునుపెట్టండి లోలోపల గూడు కట్టుకుపోయి ఉన్న చిరాకులను వెలికితీయాలన్నా, మనసు కాస్త సేదతీరాలన్నా సృజనలో తప్పకుండా సాంత్వన లభిస్తుంది. బొమ్మలు వేయడమో, పాత వస్తువులని కొత్తగా తీర్చిదిద్దడమో... ఆఖరికి ఏ సుడోకుని ఆడటమో చేసే ప్రయత్నం చేస్తే మనసుకి కాస్త ఊరటగా ఉంటుంది. రొటీన్కు భిన్నంగా చేయాలనుకుంటే మన చుట్టూ చాలా పనులే ఉంటాయి. వాటిపట్ల మనకి అభిరుచి లేకపోవడం వల్ల మనం దూరంగా ఉంటామంతే! వంట చేయడం, మొక్కలు పెంచడం, డైరీ రాయడం... ఇవన్నీ మనసుని కాసేపు పట్టి ఉంచే పనులే. ఎప్పుడన్నా బోర్ కొట్టినప్పుడన్నా వీటివైపు మళ్లే ప్రయత్నం చేయండి. కావల్సినంత కాలక్షేపం దొరుతుంది. మనసుకి కూడా తృప్తిగా ఉంటుంది. నలుగురిలో కలవండి మనసులోని చిరాకుని పంచుకోవాలన్నా, ఒంటరితనం నుంచి తప్పించుకోవాలన్నా... మరో మనిషితో మాట్లాడాల్సిందే! అది ఎదురింటివారైనా కావచ్చు, పాత పరిచయస్తులైనా కావచ్చు. కాసేపు అలా నలుగురి మధ్యలోకీ వెళ్లి వారితో నాలుగు కబుర్లు చెప్పి, కాసేపు నవ్వుకొంటే మనసు తేలికపడుతుంది. శారీరిక శ్రమ ఏ పనీ లేనప్పుడు మనసంతా ఏవో ఒక ఆలోచనలతో క్రుంగిపోతుంటుంది. అందుకే శరీరాన్ని కాస్త కష్టపెడితే మనసు కూడా కుదుటపడుతుంది. వ్యాయామం చేయడమో, కాస్త దూరం నడవడమో, ఇల్లు సర్దుకోవడమో చేస్తే శరీరం అలసిపోతుంది. మనసుకి ఆలోచించుకునే సమయం ఉండదు. కాలక్షేపం చేయండి అప్పటికప్పుడు మనసుని కాస్త ఉల్లాసపరుచుకోవాలంటే... ఏదన్నా కాలక్షేపం చేయాల్సిందే! పుస్తకం చదవడమో, టీవీ చూడటమో, సినిమాకి వెళ్లడమో... ఇలా కాలాన్ని కాసేపు సరదాగా గడిపేయండి. మనసుని లయం చేయండి మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కష్టమైన పనే. కానీ ప్రయత్నిస్తే తప్పేమీ లేదుగా! సంగీతం వినడమో, ధ్యానంలో మునిగిపోవడమో, గుడికి వెళ్లి కాసేపు సేదతీరడమో చేస్తే... మన సమస్యలన్నీ తాత్కాలికమే అన్న ధైర్యం కలుగుతుంది. ఏతావాతా అప్పుడప్పుడూ బోర్ కలగడం మంచిదే! మన జీవితంలో ఎక్కడో ఏదో పొరపాటు దొర్లుతోందనే సత్యాన్ని అది తెలియచేస్తుంది. ఆ సమయంలో ఒక్క క్షణం ఆగి మన జీవనవిధానాన్ని తరచి చూసుకుంటే... ఒకోసారి మన గమ్యాన్నే మార్చుకునే అవకాశం కలుగుతుంది. - నిర్జర.

కదిలితేనే జీవితం కనిపిస్తుంది

ఒక రాజుగారికి దూరదేశాల నుంచి ఎవరో రెండు డేగలను బహుమతిగా పంపించారు. తన రాచరికాన్ని చాటుతూ ఆ రెండు డేగలూ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే రాజుగారికి భలే సరదాగా ఉండేది. అవి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరినప్పుడల్లా తన కీర్తిపతాక ఎగిసిపడినంతగా మురిసిపోయేవారు రాజుగారు. కానీ అందులోని ఒక డేగ అకస్మాత్తుగా ఎగరడమే మానేసింది. నిరంతరం ఓ చెట్టు కొమ్మ మీదే కూర్చుని తన దగ్గరకు విసిరేసిన మాంసం ముక్కలను తింటూ కాలం గడపడం మొదలుపెట్టింది.   డేగని సాధారణ స్థితికి తీసుకురావడానికి రాజభటులు చేయని ప్రయత్నం లేదు. వైద్యులు వచ్చి పరీక్షిస్తే ఆ డేగలో లోపమేదీ లేదని తేలింది. పక్షులకు శిక్షణ ఇచ్చేవారు వచ్చినా పెద్దగా ఉపయోగం లేకపోయింది. సమస్య చిన్నదే అయినా అది ఎందుకనో రాజుగారి మనసుని బాధించడం మొదలుపెట్టింది. ఒక మామూలు పక్షినే తాను మార్చలేనివాడు ఇక ప్రజలను ఏం పాలిస్తానన్నంతగా విరక్తి మొదలైంది. రాజుగారి బాధని తీర్చేందుకు నలుగురూ నాలుగు రకాలుగా సలహాని ఇచ్చారు. కానీ అవేవీ పనిచేయలేకపోయాయి. రాజుగారి వ్యధని తగ్గించేందుకు నలుగురూ నాలుగు వేదాంతపు మాటలు చెప్పారు. కానీ అవేవీ ఆయనకు ఉపశమనాన్ని కలిగించలేకపోయాయి.   ఇక ఆఖరి ప్రయత్నంగా ఒక వేటగాడిని పిలిపించి చూద్దామనుకున్నారు రాజభటులు. వేటగాళ్లు నిరంతరం అడవుల్లోనే బతుకుతుంటారు కాబట్టి వారికి పక్షుల గురించి, వాటి స్వభావం గురించి తెలిసి ఉంటుంది కదా! అలా ఓ వేటగానికి వెతికి పట్టుకుని రాజుగారి ఉద్యానవనంలోకి తీసుకువచ్చారు. ఎగరలేని డేగని చూపించి సమస్యను వివరించారు. ‘ఓస్‌ అంతేకదా! ఈ రాత్రికి నన్ను ఈ ఉద్యానవనంలో వదిలేయండి’ అన్నాడు వేటగాడు.   ఉదయాన్నే తన కిటికీలోంచి ఉద్యానవనంలోకి తొంగిచూసిన రాజుగారి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నిన్నటివరకూ స్తబ్దుగా ఉన్న డేగ ఇప్పుడు అంతెత్తున ఎగురుతూ కనిపించింది. వెంటనే ఆ వేటగాడిని పిలిపించారు- ‘‘ఇంతమంది ఇన్ని ప్రయత్నాలు చేసిన వృధా అయిపోయాయి. ఆ డేగని అంగుళం కూడా కదిలించలేకపోయారు. నీ చేతిలో ఏం మహిమ ఉందో కానీ ఒక్కరాత్రిలోనే దాని రెక్కలకు పనిపెట్టావు. ఇంతకీ ఏం చేశావేంటి?’’ అని ఆసక్తిగా అడిగారు రాజుగారు.   ‘‘రాజా! ఆ డేగ మీ ఆతిథ్యంలోని సుఖాన్ని మరిగింది. నోటి దగ్గరకు వచ్చే ఆహారానికి అలవాటు పడింది. అందుకనే దానికి కదలాల్సిన అవసరం లేకపోయింది. నిన్న రాత్రి మాటిమాటికీ దాని మీద దాడి చేశాను, అది కూర్చున్న కొమ్మనల్లా నరికివేశాను. అప్పుడది ఎగరక తప్పలేదు. మనిషి కూడా ఆ డేగలాంటివాడే! తానున్న ప్రదేశం సుఖంగా, తృప్తిగా ఉంటే మిగతా ప్రపంచంలోకి తొంగిచూడడు. ప్రపంచంలో ఇంకెన్ని అవకాశాలు ఉన్నాయో, ఇంకెంత సంతోషం ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించడు. వాడి ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడే తన మేధకు పనిపెడతాడు. తనలో లోతుల్లో ఉన్న శక్తిని ఉపయోగిస్తాడు,’’ అంటూ చెప్పుకొచ్చాడు వేటగాడు. వేటగాడి మాటల్లో జీవితసత్యం కనిపించింది రాజుగారికి.   - నిర్జర.

నిబ్బరంగా ఉండకపోతే

అది ఓ పెద్ద పడవ. ఆ పడవలో వందమందికి పైగా ప్రయాణికులు పయనిస్తున్నారు. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమైపోయింది. చూస్తూ చూస్తుండగానే చిరుజల్లు మొదలైంది. ఆ చిరుజల్లు కాస్తా క్షణాల్లో పెనుతుపానుగా మారిపోయింది. పడవలోని ప్రయాణికులంతా బిక్కుబిక్కుమంటూ ఆ పరిస్థితిని గమనిస్తున్నారు. తాము ఎలాగైనా సురక్షితంగా బయటపడితే బాగుండురా భగవంతుడా! అని ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థిస్తున్నారు. కానీ ఒక ప్రయాణికుడు మాత్రం ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. అరుపులు, ఏడుపులు, శాపనార్థాలతో గోల పెట్టడం మొదలుపెట్టాడు. అతను అలా అటూ ఇటూ కదలడం వల్ల పడవకి మరింత ప్రమాదం అని ఎందరు చెప్పినా ఊరుకోలేదు. తన పెడబొబ్బలకి పసిపిల్లలు భయపడతారని వారించినా వెనక్కి తగ్గలేదు.   పడవ యజమానికి ఏం చేయాలో తోచలేదు. ఆ ఒక్క ప్రయాణికుడు స్థిమితంగా లేకపోవడం వల్ల ప్రయాణికులంతా భయంలో, ప్రమాదంలో పడుతున్నారని అతనికి తెలుసు. కానీ ఏం చేయడం? నయానా భయానా ఎంతగా వారించేందుకు ప్రయత్నించినా ఆ కంగారు ప్రయాణికుడు మాత్రం తన గొంతుని తగ్గించడంలేదు.   ఇదంతా గమనిస్తున్న ఓ స్వామిజీ నిదానంగా పడవ యజమాని దగ్గరకు వెళ్లాడు. ‘మీరు కనుక అనుమతిస్తే, నేను ఆ ప్రయాణికుడిని శాంతింపచేయగలను,’ అని సూచించాడు. యజమాని సరే అనగానే పడవ నడిపేవారి వద్దకు వెళ్లి, వారి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే పడవ నడిపేవారంతా కలసి.... గగ్గోల పెడుతున్న ప్రయాణికుడిని ఒక్కసారిగా నీటిలో పడేశారు. దాంతో ఆ ప్రయాణికుడు చేతులు కాళ్లు కొట్టుకుంటూ, నడిసముద్రంలో ప్రాణాల కోసం అర్తనాదాలు చేయడం మొదలుపెట్టాడు. జరుగుతున్న తంతుని తోటి ప్రయాణికులంతా దిగ్భ్రాంతితో గమనించసాగారు. ఇలా ఓ రెండు నిమిషాలు గడిచిన తరువాత, ఆ ప్రయాణికుడిని పడవలోకి చేర్చమని అడిగారు స్వామీజీ.   ప్రయాణికుడిని తిరిగి పడవలోకి చేర్చగానే అతను ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాడు. అప్పటివరకూ కేకలు వేసినవాడల్లా నిస్తేజంగా ఉండిపోయాడు. అతడిని చూస్తూ స్వామిజీ చిరునవ్వుతో ‘మనం ఉన్న పరిస్థితి ఎంత సురక్షితంగా ఉందో అన్న విషయం, అంతకంటే దారుణమైన ప్రమాదంలోకి చేరుకుంటే కానీ తెలియదు. కాస్తంత మబ్బులు కమ్ముకోగానే నువ్వు భయపడిపోయావు. కానీ ఇంత నడిసముద్రంలో నీకంటూ నీడగా ఓ పడవ ఉందనీ, నిన్ను కాపాడేందుకు వందల మంది మనుషులు ఉన్నారనీ మర్చిపోయావు. ఒక్క గంట గడిస్తే చాలు తీరాన్ని చేరుకుంటానని కూడా నీకు తట్టలేదు. నీటిలో పడగానే, ఈ నావే నీకు ఆధారం అన్న విషయం నీకు గుర్తుకువచ్చింది. ఇంతకుముందు ఆ విచక్షణ లేకపోవడం వల్ల నీతోపాటు తోటి ప్రయాణికులను కూడా భయపెట్టేశావు. పడవ మునిగిపోయే పరిస్థితులు కల్పించావు. నీ పట్ల నమ్మకం, నువ్వున్న పరిస్థితుల మీద కృతజ్ఞత లేకపోతే... నువ్వు ఏ తీరాన్నీ చేరుకోలేవు,’ అంటూ చెప్పుకొచ్చారు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

గతం!

అనగనగా ఓ చిట్టి పావురం ఉండేది. దానిదో స్వేచ్ఛా జీవితం! ఆకలేస్తే ఇన్ని గింజలు తినడం. ఆశాశంలోకి రివ్వుని ఎగరడం. అలా జీవితాన్ని ఆడుతూ పాడుతూ గడిపేస్తున్న పావురానికి ఓ అలవాటు మొదలైంది. తన మనసుని ఎవరైనా నొప్పిస్తే ఆ విషయాన్ని సహించలేకపోయేది. ఆ విషయాన్ని గుర్తుంచుకునేందుకు ఓ వింత పద్ధతిని మొదలుపెట్టింది. తన మనసు నొచ్చుకున్న ప్రతిసారీ ఓ గులకరాయిని మూటగట్టుకునేది. తను ఎక్కడికి వెళ్లినా ఆ రాళ్లను కూడా తనతో పాటు తీసుకువెళ్లేది. తరచూ ఆ రాళ్లని చూసుకుంటు కాలక్షేపం చేసేది పావురం. అందులో ఏ రాయి ఏ సందర్భంలో పోగేసిందో దానికి గుర్తే! రోజులు గడిచేకొద్దీ రాళ్ల బరువు కూడా పెరిగిపోయింది. ఇదివరకులా వాటిని మోసుకుంటూ ఎక్కువ దూరం వెళ్లలేకపోయేది పావురం. కానీ దాని అలవాటు మానుకోలేదు సరి కదా… చిన్ని చిన్న విషయాలకే రాళ్లను పోగేయడం మొదలుపెట్టింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా! పావురం ఉండే చోటకి కరువు వచ్చిపడింది. చెట్లన్నీ మలమలా ఎండిపోయాయి. చెరువులన్నీ అడుగంటిపోయాయి. `మనం ఆ కనిపించే కొండల వైపుకి వెళ్లిపోదాం పద నేస్తం` అని మన పావురానికి ఓ నేస్తం సలహా ఇచ్చింది. `నాక్కూడా అక్కడికి వెళ్లాలనే ఉంది. కానీ ఇంత బరువుని మోసుకుని కదల్లేకపోతున్నాను` అని బదులిచ్చింది పావురం. `అలాంటప్పుడు వాటిని మోసుకుంటూ తిరగడం ఎందుకు. అవతల పారేయరాదా` అంది నేస్తం. `పారేయడానికనుకున్నావా నేను పోగేసుకుంది. వీటిలో ప్రతి ఒక్కటీ నా గాయాలకు ప్రతీక` అంది పావురం. `పాత గాయాలను పోగేసుకుంటూ ఉంటే వాటి బరువుతో ముందుకు పోలేవు. నా మాట విని వాటిని వదిలెయ్యి` అంది నేస్తం. `అసంభవ౦. వాటిని వదిలి నేనుండలేను. అవి నా జీవితంలో భాగమైపోయాయి. వాటిని వదులుకోవడమంటే నా గతాన్ని వదులుకోవడమే. అంత ధైర్యం నేను చేయలేను` అంది పావురం.   పావురాన్ని వదిలేసి నేస్తం ఎగిరిపోయింది. పావురం మాత్రం తను పోగేసిన రాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. కరువు విజృంభించింది. పావురానికి ఎండుగింజలు సైతం దొరకలేదు. నోరు తడుపుకునేందుకు చుక్కనీరు కూడా మిగల్లేదు. అయినా తన గతం తాలూకు బరువుని వదిలి వెళ్లేందుకు దానికి మనసు రాలేదు. అక్కడే ఆ పాత చోటే అర్థంతరంగా తన జీవితాన్ని ముగించుకుంది.

కాగితాలతో ప్రపంచం నాశనం!

చుట్టూ ఎన్ని కంప్యూటర్లు వచ్చినా, ప్రపంచం ఎంత డిజిటల్ విప్లవాన్ని సాధించినా... పేపరు వాడకం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. 90 శాతానికి పైగా కాగితాలని చెట్ల నుంచి తయారుచేయాల్సిందే! ఇలా టన్నులకొద్దీ కాగితాలను తయారుచేయడానికి ఏటా 300 కోట్లకు పైగా చెట్లని నాశనం చేయవలసి వస్తోంది. ఇక కాగితం తయారీకి కావల్సిన నీటి సంగతి చెప్పనవసరం లేదు. ఒక కిలో కాగితం తయారుచేయడానికి 300 లీటర్ల నీరు కావాలి. ఇక కాగితం తళతళ్లాడిపోయేలా చేయడం దగ్గర నుంచీ దాని మీద ప్రింటింగ్ చేయడం వరకూ నానారకాల రసాయనాలనూ ఉత్పత్తి చేయక తప్పదు.   కాగితాన్ని ఉత్పత్తి చేసేందుకు కొన్ని చెట్లను ప్రత్యేకించి పెంచుతూ ఉంటారు. కానీ తయారీ కోసం నరికే చెట్లలో ఇవి కొద్ది శాతం మాత్రమే. కాబట్టి కాగితం వాడకాన్ని తగ్గించకపోతే నీరు, గాలి కలుషితం కావడం అటుంచి... భూమ్మీద చెట్టనేదే లేకుండా పోతుంది. మన వంతుగా తీసుకునే చిన్న చిన్న చర్యలు కూడా కాగితం వృధా కాకుండా అడ్డుకుంటాయని చెబుతున్నారు నిపుణులు.   - ఏటీఎం, మెడికల్ షాప్, సూపర్ మార్కెట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఒకో బిల్లు తెచ్చుకోవడం మనకి అలవాటు. కొనేది ఒకటి రెండు వస్తువులే అయినా, బిల్లు విషయంలో అనుమానం లేకపోయినా, స్క్రీన్ మీద అంతా కనిపిస్తున్నా... బిల్లు లేకుండా బయటకు రాలేం. ఈ బిల్లుల కోసం కాగితం తయారీ, వాటి మీద ఇంకు... రెండూ కూడా పర్యావరణానికి నష్టమే! ఇలాంటి చోట బిల్లు అవసరం లేదన్న ఒక్క మాట కాగితం వృధాని ఆపుతుంది.   - ఇప్పుడు ప్రతి పుస్తకమూ ఈ-బుక్ రూపంలో లభిస్తోంది. అయినా పాత అలవాటుని వదులుకోలేకనో, పుస్తకం ఇచ్చే సాంత్వన కోసమో జనం ఏటా కోట్ల పుస్తకాలు కొంటూనే ఉన్నారు. ఈ పద్ధతి మారేందుకు కొన్నాళ్లు పడుతుందేమో! కానీ మళ్లీ చదవాల్సిన అవసరం లేదు అన్న పుస్తకాన్ని మరొకరికి ఇచ్చేస్తే సరి.   - మన కంటి ముందున్న ప్రతి కాగితమూ ఈ లోకాన్ని నాశనం చేస్తూ పుట్టింది అన్న అవగాహన ఉన్నప్పుడు... చిన్నపాటి కాగితాన్ని కూడా వృధా చేయం. కాగితాన్ని రెండువైపులా వాడటం, ఏదన్నా నోట్స్ రాసుకునేందుకు చిన్నపాటి కాగితాలను ఉపయోగించడం లాంటి చర్యలు చాలా కాగితాన్నే ఆదా చేస్తాయి.   - ఇంట్లో ఓ నలుగురు చేరినా కూడా కాగితం ప్లేట్లు, పేపరు కప్పులు వాడేస్తుంటాం. ఇవి చూసేందుకు సోగ్గా కనిపించవచ్చు. కానీ పేపరు కప్పులలో ఏం పోసిన తడిసిపోకుండా ఉండేందుకు వాటిలో నానారకాల రసాయనాలు కలుపుతారు. వీటి వల్ల ఆరోగ్యం ఎలాగూ దెబ్బతింటుంది. పైగా వీటిని రీసైకిల్ చేయడం కూడా కష్టమైపోతుంది.   - ఆఫీసులో మనం ఎంత కాగితం వాడుతున్నామో అడిగేవారు లేకపోవచ్చు. పైగా చేతిలో ప్రింటర్ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అంతగా ఆలోచన లేకుండానే కిలోల కొద్దీ కాగితాన్ని వాడేస్తుంటాం. ఈమెయిల్స్, వర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా చక్కబెట్టే పనులకి కాగితాన్ని వాడకపోవడం, ప్రింట్ అవుట్ అవసరం అయినా చిన్నపాటి కాగితాలని ఉపయోగించడం, రెండువైపులా ప్రింట్ ఔట్ తీసుకోవడం వంటి చర్యలతో కాగితం వృధా కాకుండా ఉంటుంది. ఆపీసులో కాగితం వాడకానికి కూడా ఒక చిన్నపాటి ఆడిట్ జరిగితే... వీలైనంత వృధా తగ్గిపోతుంది. - నిర్జర.    

తమ డబ్బు మొత్తాన్ని కోల్పోయిన 5 మంది బిలియనీర్లు

సంపద తెలియకుండానే టెంకాయ లోపలి నీరు వచ్చినట్లు వస్తుంది. సంపద తెలియకుండానే ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలె   మాయమవుతుంది అంటూ సుమతీశతకంలో చెప్పారు. ఈ విషయం కొంతమంది జీవితాలను చూస్తే నిజమే అనిపిస్తుంది. చాలా తక్కువ సమయంలో కోట్లకు పడగలెత్తిన వారు అంతే తక్కువ సమయంలో పాతాళానికి పడిపోతారు. అలాంటి కొందరు బిలియనీర్ల గురించి తెలుసుకుందాం... ఐకే బాటిస్టా బ్రెజిలియన్ వ్యాపారవేత్త, కానీ అతను దురదృష్టవశాత్తు తన డబ్బు మొత్తాన్ని కోల్పోయాడు. మైనింగ్ , చమురు పరిశోధన పరిశ్రమలో రాణించిన అతను రెండు దశాబ్దాల కాలంలో తన వైభవాన్ని దానిని కోల్పోయాడు. 2011 సంవత్సరంలో అతని ఆస్తుల విలువ  30 బిలియన్ డాలర్లు.  ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో ఎనిమిదో వ్యక్తిగా నిలిచాడు, బ్రెజిల్‌లో అత్యధిక సంపన్నుడి స్థాయిని అందుకున్నాడు. అయితే మైనింగ్ పరిశ్రమలో అకస్మాత్తుగా పతనం ప్రారంభమైంది. తన అతిపెద్ద కంపెనీలలో ఒకటైన ogx కుప్పకూలింది. ఆ తర్వాత సంపద తగ్గిపోతూ బిలియనీర్ స్థాయి పడిపోయింది. 2013 సంవత్సరంలో, ఫోర్బ్స్ ప్రకారం దాదాపు 20 బిలియన్ల ఆస్తులను అతను కోల్పోయాడు. కేవలం ఒక సంవత్సరంలోనే విపరీతమైన నష్టాలను చవిచూశాడు. ఆ తర్వాత అతని అపారమైన అప్పులు,  పడిపోతున్న కంపెనీ స్టాక్ కారణంగా ఆస్తులన్నీ కోల్పోయాడు. తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని అమ్మేశాడు. 2017 సంవత్సరంలో బ్రెజిల్ అధికారులు అతన్ని 100 మిలియన్ డాలర్ల మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేశారు. అలెన్ స్టాన్ఫోర్డ్ ఈ వ్యక్తి మాజీ బిలియనీర్, ఫైనాన్షియర్. అయితే ఇప్పుడు మాత్రం శ్రీకృష్టుడి జన్మస్థానంలో ఉన్నాడు.  2009లో అతనికి 110 సంవత్సరాల జైలు శిక్ష ఖరారు కాగా ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు.   ఆర్థిక కుంభకోణంలో దోషిగా నిర్ధారించబడిన తరువాత శిక్ష పడింది. అతను ఇప్పుడు వాడుకలో లేని ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ స్టాన్ఫోర్డ్ ఫైనాన్షియల్ గ్రూప్ చైర్మన్. 136 వివిధ దేశాలలో  కనీసం 30,000 మంది ఖాతాదారులలో 8.5 బిలియన్ డాలర్లు ఉన్న సహాయక సంస్థలలో ఒకటి. ఈ సంస్థ  2009 లో ప్రారంభమైంది.  అయితే ఈ కంపెనీ ప్రారంభమైన సెకన్ లోనే  అలెన్ స్టాన్ఫోర్డ్ పై అన్వేషణ ప్రారంభించింది. 8 బిలియన్ డాలర్ల అధిక దిగుబడి ధృవీకరణ పత్రాలను అక్రమంగా విక్రయించినందుకు అతనిపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.  మనీలాండరింగ్, చీటింగ్ తదితర ఆరోపణలతో 2009 జూన్ లో అరెస్ట్ చేశారు. విచారణ తర్వాత 110 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. ఎలిజబెత్ హోమ్స్ ఎలిజబెత్ అమెరికన్ ఆవిష్కర్త , ఎంటర్ ప్రెన్యూర్,   ఆమె హెల్త్ కేర్ టెక్నాాలజీ కార్పోరేషన్ ప్రారంభించిన తర్వాత  2015లో సెల్ఫ్ మెడ్  మహిళా బిలియనీర్ గా రికార్డ్ సృష్టించారు.  ఆ సంస్థ 9 బిలియన్ డాలర్ల విలువకు చేరుకోవడంతో పాటు భారీగా లాభాలు ఆర్జించింది. 2015 నాటి 100 మంది అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో  ఆమె పేరు చేరడంతో  సెలబ్రిటీ అయ్యారు. ఆ తర్వాత ఎలిజబెత్ కంపెనీపై అన్వేషణ జరిగింది. కొత్త ఇన్వెంటివ్ బ్లడ్ టెస్టింగ్ టెక్నాలజీ గురించి పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత  ఆమెపై విశ్వసనీయత, ఆమె వ్యక్తిగత ఆస్తులు రెండూ తగ్గిపోవడం ప్రారంభమైంది.  . ప్రపంచంలోని అత్యంత నిరాశపరిచిన నాయకులలో ఒకరిగా హోమ్స్ పేరును ఫోర్బ్స్ పేర్కోంది.  మెడికేర్ , మెడిసిడ్ సేవలు అందించే ఆమె కంపెనీలో రెండు సంవత్సరాలు ఎలాంటి పోజిషన్ ఇవ్వలేదు. బెర్నార్డ్ మాడాఫ్ పోంజీ పథకాలకు(చైన్ లింక్) రూపకల్పన చేసిన వ్యక్తి బెర్నార్డ్.   2008 లో అరెస్టు అయ్యేవరకు దాదాపు 20 ఏళ్ళపాటు మార్కెట్ లో చైన్ లింగ్ సామాజ్యాన్ని పరిపాలించాడు. స్ప్లిట్ స్ట్రైక్ కన్వర్షన్ అనే తన వెంచర్ వ్యూహంతో అతను వేలకొలది బిలియన్ డాలర్ల పెట్టుబడిదారులను విజయవంతంగా మోసం చేశాడు. అతను తన ఖాతాదారులకు అధిక , స్థిరమైన రాబడిని ఇస్తానని వాగ్దానం చేశాడు. తన నిధులను ఒకే బ్యాంకు ఖాతాలో జయ చేయడం ద్వారా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించేవాడు. అయితే  2008 ఆర్థిక సంక్షోభ సమయంలో అతని పథకం విఫలమైంది.  మార్కెట్లలో ఎక్కువ మంది ఖాతాదారులను ఆకర్షించలేకపోయాడు. ఆ తర్వాత అతని 64.8 బిలియన్ డాలర్ల మోసం బయటపడింది. దాదాపు  బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టినట్లు అంచనా. విజయ్ మాల్యా భారతీయ వ్యాపారవేత్త ,  మాజీ బిలియనీర్, అతను ప్రస్తుతం ఆర్థిక నేరాల నుంచి తప్పించుకునేందుకు బ్రిటన్ లో తలదాచుకున్నాడు. అతనిని UK నుండి భారతదేశానికి అప్పగించే అంశంపై చర్యలు జరుగుతున్నాయి. విజయ్ మాల్యా  28 ఏళ్ళ వయసులో తన తండ్రి  సంస్థను స్వాధీనం చేసుకున్నాడు.  ఆ తర్వాత వ్యాపారాన్ని విస్తరిస్తూ కింగ్ ఫిషర్ బ్రాండ్ మద్యం మార్కెట్ లోకి తీసుకువచ్చి సంపన్నుల జాబితాలో చేరాడు.  మద్యం  వ్యాపారాన్ని మల్టీ బిలియన్ డాలర్ల సంస్థగా మార్చాడు. కానీ దురదృష్టవశాత్తు, అతని విమానయాన సంస్థలు నష్టాల బాటపట్టింది.  బ్యాంకులతో తీసుకున్న అప్పులు ఎగవేతకు పాల్పడ్డాడు. యునైటెడ్ స్పిరిట్స్ అని పిలువబడే తన సంస్థపై నియంత్రణను కోల్పోయాడు . చైర్మన్ పదవి నుండి తప్పుకోవలసి వచ్చింది. అతని ఆస్తులు వేలం వేయమని ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం అతనిని యూకె నుంచి భారత్ కు రప్పించడానికి చర్చలు జరుగుతున్నాయి.