ఈ చిన్న చిట్కాతో ఆరోగ్యం బాగుపడుతుంది!
posted on Aug 2, 2021 @ 9:30AM
రోజుల్లో మన జీవితాలు ఎలా గడుస్తున్నాయో చెప్పనవసరం లేదు. పొద్దున లేచిన దగ్గర నుంచీ, రాత్రి పడుకునే దాకా అంతా కూర్చునే బతుకుని వెళ్లదీస్తున్నాం (sedentary lifestyle). టీవీ ముందరా, కంప్యూటర్ ముందరా, డైనింగ్ టేబుల్ ముందరా కూర్చుని కూర్చుని ఒంట్లో కొవ్వుని పెంచేసుకుంటున్నాం. రేపటి నుంచి వాకింగ్ చేద్దాం, వచ్చేవారం షటిల్ ఆడతాం అనుకోవడమే కానీ... రోజువారీ హడావుడిలో పడి అలాంటి నిర్ణయాలు ఏవీ పాటించలేకపోతున్నాం. అయితే గుడ్డిలో మెల్లగా దీనికో పరిష్కారం ఉందంటున్నారు.
ఫిన్లాండుకి చెందిన కొందరు పరిశోధకులు... కూర్చునీ కూర్చునీ ఉండే జీవిత విధానంలో ఏదన్నా మార్పు తీసుకురావడం సాధ్యమా అని ఆలోచించారు. ఇందుకోసం ఓ 133 మందిని ఎన్నుకొన్నారు. వీరందరికీ, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరి జీవిత విధానాన్ని గమనించిన పరిశోధకులకు... వాళ్లంతా రోజుకి ఇదున్నర గంటలు ఆఫీసులోనూ, నాలుగు గంటలు ఇంట్లోనూ కూర్చునే గడిపేస్తున్నారని అర్థమైంది. ఇలా కూర్చుని ఉండే సమయంతో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందేమో చూడమని సదరు అభ్యర్థులందరికీ సూచించారు.
పరిశోధకుల సూచన మేరకు అభ్యర్థులంతా తమ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసే ప్రయత్నం చేశారు. పని మధ్యలో కాస్త లేచి అటూఇటూ పచార్లు చేయడం, ఇంట్లో చిన్నాచితకా పనులలో పాల్గొనడం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం లాంటి ప్రయత్నాలు చేశారు. ఇలా నెలా రెండు నెలలు కాదు.. దాదాపు ఏడాది పాటు ఈ ప్రయత్నం సాగింది.
ఏడాది తర్వాత సదరు అభ్యర్థులు జీవితాలని మరోసారి గమనించారు పరిశోధకులు. ఆ సందర్భంగా వారు కూర్చుని ఉండే సమయం, ఓ 21 నిమిషాల పాటు తగ్గినట్లు గ్రహించారు. ఓస్ ఇంతే కదా! 20 నిమిషాల తగ్గుదలతో ఏమంత మార్పు వస్తుంది అనుకునేరు. ఈ కాస్త మార్పుతోనే షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడం గమనించారు. కాలి కండరాలు కూడా మరింత బలంగా మారాయట. గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్లు బయటపడింది.
అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఓ పడీపడీ వ్యాయామాలే చేయనవసరం లేదు. ఎప్పుడో అప్పుడు వ్యాయామం చేయవచ్చు కదా అని నిర్లక్ష్యం చేసేలోగా పరిస్థితి అదుపు తప్పిపోతుంది కదా! అందుకని ఉన్నంతలోనే కాస్త కాలుని కదిపే ప్రయత్నం చేయమని ఈ పరిశోధన సూచిస్తోంది. అంతేకాదు! ఇంట్లో పెద్దలు కనుక ఇలా చురుకుగా ఉంటే... వారిని చూసి పిల్లలు కూడా కాస్త చురుకుగా మెదిలే ప్రయత్నం చేస్తారట.
- నిర్జర.