లోపం లేని మనిషి

ఒక ఊరిలో జనమంతా కలిసి తమకి ఇష్టమైన దేవుని శిల్పాన్ని ప్రతిష్టించాలనుకున్నారు. అందుకోసం చుట్టుపక్కల అంతా వాకబు చేసి ఒక శిల్పిని రప్పించారు. శిల్పి వచ్చీరాగానే తన పనిని ప్రారంభించాడు. శిల్పం కోసం సరైన శిలను ఎన్నకున్నాడు. ఊరి ప్రజల అభీష్టాన్నీ అనుసరించి వారి ఇష్టదైవాన్ని ఆ శిల్పంలో తొలవడం మొదలుపెట్టాడు. రోజులు గడిచాయి. రోజులు వారాలుగా మారాయి. వారాలు కాస్తా రెండు నెలలయ్యాయి. శిల్పి చెక్కుతున్న శిల్పం తుదిరూపుకి చేరుకుంది. కానీ మనసులో ఏం తోచిందో ఏమో కానీ, ఒక రోజున ఆ శిల్పాన్ని కాస్తా పక్కనపెట్టేశాడు శిల్పి. విగ్రహాన్ని చెక్కే పనిని మళ్లీ మొదటినుంచి మొదలుపెట్టాడు. ఒక రోజు శిల్పిని వెతుక్కుంటూ అతని స్నేహితుడు వచ్చాడు. దీక్షగా విగ్రహాన్ని చెక్కుతూ కూర్చున్న శిల్పిని చూశాడు. ఆ పక్కనే పడేసి ఉన్న విగ్రహమూ అతనికి కనిపించింది. ‘‘ఆ విగ్రహం ఇంచుమించుగా పూర్తయిపోయింది కదా! మళ్లీ రెండో విగ్రహాన్ని చెక్కుతున్నావేంటి’’ అంటూ వాకబు చేశాడు స్నేహితుడు. ‘‘ఆ విగ్రహం సరిగా రాలేదు’’ అంటూ బదులిచ్చి తన పనిలో నిమగ్నం అయిపోయాడు శిల్పి. ఆ మాటలకు స్నేహితుడు శిల్పం దగ్గరకి వెళ్లి పరీక్షగా చూశాడు. ఎంతగా చూసినా అతనికి ఎలాంటి లోపమూ కనిపించలేదు. ‘‘అదేంటి శిల్పం అద్భుతంగా వచ్చింది కదా! నేను చూసిన గొప్ప శిల్పాలలో ఇది ఒకటని ఖచ్చితంగా చెప్పగలను,’’ అన్నాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో ‘‘ఒక్కసారి ఆ శిల్పం కళ్లని పరీక్షగా చూడు. అవి సరిగ్గా కుదరలేదు,’’ అని చెప్పాడు. స్నేహితుడు మరోసారి ఆ శిల్పాన్ని పరీక్షగా చూస్తే ఆ మాట నిజమేననిపించింది. కానీ అంత చక్కటి శిల్పాన్ని పక్కన పెట్టడాన్ని అతని మనసు ఇంకా ఒప్పుకోలేదు. ‘‘ఆ శిల్పాన్ని ఎక్కడ ఉంచుతున్నారు!’’ అని అడిగాడు స్నేహితుడు. ‘‘ఈ ఊరి దేవాలయంలో, పది అడుగుల ఎత్తైన పీఠం మీద,’’ బదులిచ్చాడు శిల్పి. ‘‘నీకేమన్నా మతి పోయిందా! పది అడుగుల ఎత్తైన పీఠం మీద, మరో పది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహంలోని కళ్లలో చిన్నపాటి లోపం ఎవరికి కనిపిస్తుంది. పైగా కాస్త రంగు పూశావంటే ఆ ఉన్న కాస్త లోపమూ ఎవ్వరికీ తెలియనే తెలియదు. దాని కోసం రెండు నెలలుగా పడ్డ కష్టాన్ని వృధా చేసుకుంటావా! ఈ పల్లెటూరి బైతుల కోసం ఇంత కష్టం అవసరమా!’’ అంటూ దులిపేశాడు స్నేహితుడు. శిల్పి చిరునవ్వుతో- ‘‘ఈ విగ్రహంలో లోపం ఎవ్వరికీ, ఎప్పటికీ తెలియకపోవచ్చు. కానీ నాకు తెలుసు కదా! ఒక లోపంతో ఉన్న శిల్పాన్ని చెక్కానన్న విషయం నా మనసులో నిలిచిపోతుంది. అది జీవితాంతం నా వృత్తి మీద ఒక మచ్చగానే మిగిలిపోతుంది. ఇక కష్టాన్ని వృధా చేసుకోవడం అంటావా... అది నా దృష్టిలో పనితీరుని మరింతగా మెరుగుపరుచుకోవడమే! మనం చేసే పనికి ఎంత ధర వస్తోంది? ఎవరి కోసం పనిచేస్తున్నాం? అన్న విషయం ఎప్పుడూ ముఖ్యం కాదు. మనసుకి తృప్తి కలిగించేలా పనిని పూర్తిచేశామా లేదా అన్నదే ముఖ్యం. ఆ తృప్తి కోసం పడే తపన మన పనిని మరింతగా మెరుగుపరుస్తుంది. అదే చివరివరకూ నిలుస్తుంది,’’ అంటూ చెప్పుకొచ్చాడు. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

అనుకున్నది సాధించాలంటే!

అనగనగా ఓ మహా పర్వతం. ఆ పర్వతం మీద ఓ దుర్మార్గమైన తెగ ఉండేది. ఆ తెగ ఓసారి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చింది. కింద మైదాన ప్రాంతాల్లో ఉండే ఓ గ్రామం మీద దాడి చేసంది. దాడి చేయడమే కాదు... వెళ్తూ వెళ్తూ తమతో పాటు ఓ పసిపిల్లవాడిని కూడా ఎత్తుకు వెళ్లిపోయింది. ఆ దాడితో గ్రామంలోని జనమంతా బిత్తరపోయారు. కాస్త తేరుకున్న తరువాత, తమ పిల్లవాడిని ఎలాగైనా సరే తిరిగి తెచ్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఎలాగా! వాళ్లు ఎప్పుడూ ఆ పర్వతాన్ని ఎక్కనే లేదయ్యే! అదో దుర్గమమైన కొండ. ఆ కొండ మీద ఉండే తెగకి తప్ప మిగతా మానవులెవ్వరికీ దాని శిఖరాన్ని చేరుకోవడం సాధ్యం కాదు. అయినా పిల్లవాడి కోసం ప్రాణాలకు తెగించి బయల్దేరారు.   గ్రామంలోని ఓ పదిమంది నిదానంగా కొండని ఎక్కడం మొదలుపెట్టారు. ఎక్కడ ఏ మృగం ఉంటుందో, ఎటువైపు నుంచి ఏ రాయి దొర్లిపడుతుందో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ బయల్దేరారు. ఎలాగొలా కొండ శిఖరాన్ని చేరుకున్నా, అక్కడ శత్రువుల కళ్లుగప్పి, వారి చెర నుంచి పిల్లవాడిని తీసుకురావడం ఎలాగా అంటూ బితుకు బితుకుమంటూ నడుస్తున్నారు.   ఒక రోజు గడిచింది, రెండు రోజులు గడిచాయి.... నాలుగు రోజులు గడిచాయి. కానీ తాము ఎటు పోతున్నామో వాళ్లకి అర్థం కాలేదు. ఒక అడుగు పైకి వెళ్తే నాలుగు అడుగులు కిందకి జారిపోతున్నారు. క్రూరమృగాలని తప్పించుకోలేక సతమతమైపోతున్నారు. తెచ్చుకున్న ఆహారం కాస్తా అయిపోయింది. ఇక మరొక్క అడుగు ముందుకు వేసే ధైర్యం లేకపోయింది. దాంతో పిల్లవాడి మీద ఆశలు వదిలేసుకుని నిదానంగా వెనక్కి తిరిగారు. తిరిగి తమ ఇళ్లకు చేరకుంటే చాలు దేవుడా అన్న ఆశతో తిరుగుప్రయాణం కట్టారు.   వాళ్లు తిరిగి వస్తుండగా దారిలో ఆ పిల్లవాడి తల్లి కనిపించింది. ‘ఎక్కడికి వెళ్తున్నావు! ఈ కొండ శిఖరాన్ని చేరుకోవడం మనవల్ల కాదు. నీ పిల్లవాడి ఆయువు ఇంతే అనుకో! అక్కడే అతను క్షేమంగా ఉంటాడని కోరుకో. మాతో పాటు వచ్చేసేయి,’ అంటూ ఆమెను చూసి అరిచారు. వారి మాటలు విన్న తల్లి మారు మాటాడకుండా దగ్గరకు వచ్చి నిల్చొంది. ‘నేను పైకి వెళ్లడం లేదు. పై నుంచి కిందకి దిగి వస్తున్నాను,’ అంటూ వెనక్కి తిరిగి తన వీపుకి కట్టుకుని ఉన్న పిల్లవాడిని చూపించింది.   ‘ఇంతమంది వల్ల కాని పని నీ ఒక్కదాని వల్ల ఎలా సాధ్యమైంది. ఇంత అసాధ్యమైన కొండని ఎక్కి, శత్రువుల కళ్లుగప్పి నీ బిడ్డను ఎలా తెచ్చుకోగలిగావు,’ అని వారంతా ఆశ్చర్యపోయారు. దానికి ఆ తల్లి చిరునవ్వుతో ‘నా పిల్లవాడిని తీసుకురావడం అంటే మీకు బాధ్యత మాత్రమే! కానీ నాకు మాత్రం జీవిత లక్ష్యం. పిల్లవాడు లేనిదే నా జీవితం అర్ధరహితం అనుకున్నాను. అందుకనే వాడి కోసం బయల్దేరాను. ఈ కొండని ఎక్కడం నాకు అంత కష్టం అనిపించలేదు. శత్రువు కళ్లుగప్పడం అసాధ్యంగా తోచలేదు,’ అంటూ చెప్పుకొచ్చింది. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ఓ బాధ్యతగా కాకుండా జీవన గమనంగా సాగిస్తే ఏదైనా సాధించవచ్చని ఆ తల్లి నిరూపిస్తోంది. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.  

ప్రపంచంలో అత్యంత భయానక రహస్య సరస్సులు

ప్రపంచం అనేక అద్భుతాల సమాహారం. అందమైన జలపాతాలు, అలరించే అడవులు, చిత్రకారుణి కుంచెను మించిన అపూర్వమైన దృశ్యాలు ఎన్నో ఎన్నెన్నో.. అయితే కొన్ని అద్భుతాల వెనుక భయంకరమైన వాస్తవాలు దాగి ఉన్నాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ప్రపంచంలోని అందమైన సరస్సులే కాదు అత్యంత భయానక సరస్సులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రాణాలను హరిస్తాయి. ముందుగా వీటి గురించి తెలుసుకోవడం వల్ల ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం సాధ్యమవుతుంది. మరి ఆ భయానక రహాస్య సరస్సుల విశేషాలు ఏంటో చూద్దామా... 1. బ్లూ లేక్, రష్యా రష్యాలోని వింతైన సరస్సు ఇది. ఈ సరస్సులోకి నీరు వర్షం ద్వారా ఈ సరస్సులోని నీరు  ప్రవాహాల నుంచి,  నదుల నుంచి ఇందులోకి చేరదు. భూగర్భ నీటి బుగ్గల ద్వారా సరస్సులోకి నీళ్లు చేరుతాయి. అయితే నీటిలో హైడ్రోజన్ సల్ఫైడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా నీటి రంగు నీలం రంగులో కనిపిస్తుంది.  సరస్సు 258 మీటర్ల లోతులో ఉంది. ఇది 75 మీటర్ల ఎత్తున ఉన్న సీటెల్ స్పెస్ కూడా ఈజీగా ఇందులో మునిగిపోతుంది. ఈ సరస్సు నీరు రాళ్ళను సైతం కోస్తూ వెళ్లడంతో సరస్సు రోజురోజుకు లోతుగా మారుతోంది. ఈ నీలం సరస్సు ప్రపంచంలోని అతిపెద్ద గుహలను తనలో నిక్షిప్తం చేసుకుందని కొంతమంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2. లేక్ నాట్రాన్, టాంజానియా తూర్పు ఆఫ్రికాలో లోతైన సరస్సు ఇది.  టాంజానియా కథలలో ఈ సరస్సు ప్రస్తావన ఉంటుంది.  ప్రజల జీవితాలను ఇది ప్రభావితం చేస్తుంది. అయితే ఈ సరస్సు ఒడ్డున ఫ్లెమింగోలు, చిన్న పక్షులు, గబ్బిలాలు ప్రాణములేని స్థితిలో కనిపిస్తాయి. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ప్రాణాలు కోల్పోయిన అన్ని జీవుల శరీరాలు భద్రపరచబడి కనిపిస్తాయి. నీటిలోని సోడియం కంటెంట్ కారణంగా సరస్సు పసుపు రంగును కనిపిస్తుంది. అయితే ఇందులో ఉండే అనంతమైన సూక్ష్మజీవుల కారణంగా ఈ జలాలు నారింజ రంగులో ఉంటాయి. కానీ నెమ్మదిగా నారింజ రంగు మరింత ముదురుగా మారి, నీటి రంగు ప్రకాశవంతమైన ఎరుపు రంగులోకి మారుతోంది. ఈ సరస్సులో నాట్రాన్ పుష్కలంగా ఉంది, సహజంగా సంభవించే సోడియం సమ్మేళనం సోడియం కార్బోనేట్, బైకార్బోనేట్, క్లోరైడ్ మరియు సల్ఫేట్ల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ సరస్సు చుట్టూ వాతావరణం రంగురంగుల ల్యాండ్ స్కేప్ మాదిరిగా కనిపిస్తోంది. 3. మిచిగాన్ లేక్, యుఎస్ఎ అమెరికాలో ఉన్న ఐదు గొప్ప సరస్సుల్లో మిచిగాన్ లేక్ ఒకటి. ఈ సరస్సు వందలాది మంది ప్రాణాలను తీసిన విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సరస్సులో ఎలాంటి రాక్షసులు లేరు. అంతేకాదు మరణించినవారు నీటికి దూరంగా ఉన్నప్పుడే మరణించారు. అయితే ఇక్కడి అలలను ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఒడ్డుకు వచ్చే అలలు, నీటి ప్రవాహాలు ఊహించని విధంగా ప్రాణాలను హరిస్తాయి. అంతేకాదు గజ ఈతగాళ్లు కూడా  మిచిగాన్ ఒడ్డున ప్రవాహాలను ఎదుర్కోలేరని, ఇవి చాలా ప్రమాదకరమైనవి అంటారు. సమ్మర్ సీజన్ లో ఇక్కడికి ఈతకు వచ్చి అనేక మంది ప్రాణాలు కోల్పోతారు.  ఆ నిర్దిష్ట సమయంలో నీటి ప్రవాహం, అలల తాకిడి ఎక్కువ కావడంతో ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. శరదృతువు ఈ సరస్సు వాతావరణం పడవలు, మత్స్యకారులకు ప్రమాదకరం.  నీటి ఉపరితలంపై హఠాత్తుగా పెరుగుతున్న ప్రవాహాలు ప్రాణాంతక తరంగాలకు కారణమవుతాయి. 4. న్యోస్ కామెరూన్ సరస్సు ఈ సరస్సు అనేక పొరుగు గ్రామాలకు అనేక శతాబ్దాలుగా నిశ్శబ్దంగా నీటిని అందించింది. కానీ దాని ఉపరితలం కింద, ఒక రహస్యం ఉంది. ప్రకృతి ప్రాణాంతక శక్తిని అకస్మాత్తుగా విడుదల చేసిన తరువాత సరస్సు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందింది. ఈ సంఘటన ఆగస్టు 21, 1986 న జరిగింది. సరస్సు నుండి అధిక శక్తితో కూడిన వాయువు మేఘం పెరిగింది. సమీపంలో నివసించే ప్రతిదీ ప్రజలు, పశువులు, పక్షులు మొదలైనవి ఏమీ ఈ విపత్తు నుంచి బయటపడలేదు! సరస్సు చుట్టూ నివసించే చిన్న కీటకాలు కూడా కుళ్ళిపోయాయి. ఈ సంఘటన సుమారు 1746 మంది మానవుల ప్రాణాలను తీసింది.  ప్రపంచం నలుమూలల శాస్త్రవేత్తలు ఈ ప్రదేశాన్ని సందర్శించారు, సరస్సులో అగ్నిపర్వత బిలం ఉన్నట్లు వారు కనుగొన్నారు. 5.కరాచాయ్ సరస్సు, రష్యా రష్యా లోని యురల్స్ లో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలో అత్యంత కలుషితమైన వాటిలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సరస్సు ఒడ్డున కేవలం రెండు గంటలు గడపడం వల్ల మీరు రెండు గంటలు ఎక్స్‌రే మెషీన్‌లో కూర్చున్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాదు అది కూడా సీసంతో కప్పబడిన కవరింగ్ లేకుండా ఉంటుంది. రేడియేషన్ పాయిజనింగ్ ద్వారా చాలా నెమ్మదిగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సరస్సు 1950 లలో జరిగిన యుద్ధం కారణంగా నాశనమైంది. ఆ తర్వాత ఈ సరస్సును ద్రవ రేడియోధార్మిక వ్యర్థాల నిల్వ కోసం ఉపయోగించారు.  

ఆమె తూర్పు.. అతను పడమర...

మౌలికంగా స్త్రీ, పురుషుల ఆలోచనా విధానంలోనే తేడా వుంటుంది. అందుకే ఒకరు చేసేది మరొకరికి నచ్చదు అంటున్నారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. భార్యాభర్తల బంధంలో ‘అర్థం చేసుకోవడం’ అనేది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఎవరు ఎవర్ని అర్థం చేసుకోవాలన్నదే సమస్య. నన్ను అర్థం చేసుకుని నాకు నచ్చినట్టు నడిస్తే బావుంటుందని ఎవరికి వారు కోరుకుంటారుట భార్యాభర్తలిద్దరూ. అదిగో అక్కడే మొదలవుతుందిట సమస్యంతా. భార్యాభర్తల గొడవల్లో ఎక్కువగా వినిపించే కారణం ‘అర్థం చేసుకోలేకపోవడం’. అయితే ఒకే విషయానికి స్త్రీ, పురుషులు స్పందించే తీరు వేరే వేరేగా వుంటుంది. అది సర్వ సాధారణం. ఈ ఒక్క విషయాన్ని గ్రహించగలిగితే ఎన్నో కుటుంబాలలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వుండవు అంటున్నారు పరిశోధకులు. వీరు స్త్రీ, పురుషుల మనస్తత్వాలు, వివిధ సందర్భాలలో వారు స్పందించే విధానంపై ఓ అధ్యయనం చేపట్టారు. ఏ విషయం వారిని ఎక్కువగా బాధిస్తుంది అన్న విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో తేడా వుందని గుర్తించారు. స్త్రీలు ఎక్కువగా సన్నిహిత సంబంధాలు, బంధుత్వాల విషయంలో చాలా సున్నితంగా వుంటారుట. ఆ సన్నిహితుల విషయంలో, సంబంధాల విషయంలో ఏవైనా వైఫల్యాలు ఎదురైతే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు అంటున్నారు పరిశోధకులు. అదే మగవారిని ఆ విషయాలు అంతగా కదిలించవట. తమ ఉద్యోగం, సంపాదన, తన మాటకి విలువ, గౌరవం, సమాజంలో, కుటుంబంలో గుర్తింపు వంటివి మగవారికి ముఖ్యమైన అంశాలుగా నిలుస్తాయట. వీటిల్లో వచ్చే హెచ్చుతగ్గులు వారిని డిప్రెషన్‌కి గురి చేస్తాయట. డిప్రెషన్‌కి గురైన స్త్రీలు నిస్సహాయంగా, నిరాశగా, ఒంటరిగా గడపటానికి ఇష్టపడుతుంటే, మగవారు మాత్రం కోపం, పంతం వంటి లక్షణాలు కనబరుస్తారని గుర్తించారు టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు. అలాగే పగ, కసి, శత్రుత్వం వంటి లక్షణాలు మగపిల్లల్లో టీనేజ్ నుంచే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా వీరి పరిశోధనలో తేలింది. దీనిని దృష్టిలో పెట్టుకుని మగపిల్లల తల్లిదండ్రులు వారి ప్రవర్తన, మానసిక స్థితి వంటివాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ వుండాలని కూడా హెచ్చరిస్తున్నారు వీరు. నిరాశ, నిస్పృహ వంటివి మనిషిని కృంగదీసినప్పుడే మరో వ్యక్తి తోడు, ఆసరా అవసరం అవుతాయి. ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో భార్య భర్త నుంచి ఓదార్పుని, తోడ్పాటుని కోరుకుంటే భర్త తన భార్య సహనంగా అర్థం చేసుకోవడాన్ని కాంక్షిస్తాడుట. స్త్రీలు నేనున్నానంటూ భరోసాని కోరుకుంటారు. కానీ, మగవారు తమ భార్యలు వారి సమస్యలలో తల దూర్చకుండా, సలహాలు ఇవ్వకుండా ఉండాలని ఆశిస్తారుట. దాదాపు కొన్ని వందల జంటలపై దీర్ఘకాలం సాగిన ఆ పరిశోధనలో బయటపడిన కొన్ని ఆసక్తికర అంశాలివి. -రమ

మధ్యమధ్యలో కాలుకదపితే... ఆయుష్షు పెరుగుతుంది!

Sedentary lifestyle.  అబ్బో ఈ మాటని ఈమధ్య చాలా ఎక్కువగానే వింటున్నాం. ఎలాంటి శారీరిక శ్రమా లేకుండా, నిరంతరం కూర్చుని ఉండే జీవనశైలిని sedentary lifestyle అంటారని మనకి తెలుసు. నిరంతరం కూర్చుని కూర్చుని ఉంటే, ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. గంటల తరబడి కూర్చుని ఉండటం వల్ల పొట్ట మీద ఒత్తిడి పెరిగి జీర్ణవ్యవస్థ పాడైపోవడం, మెదడుకి చేరే రక్తప్రసారంలో లోపం ఏర్పడటం, వెన్నెముక బలహీనపడిపోవడం, ఇన్సులిన్‌ ఉత్పత్తి దెబ్బతినడం, గుండెజబ్బులు రావడం, ఎముకలు పెళుసుబారిపోవడం వంటి నానాసమస్యలూ దరిచేరతాయి. ఇవి డయాబెటిస్‌, పక్షవాతం, గుండెపోటు లాంటి తీవ్రమైన ప్రమాదాలకి దారితీస్తాయి.   కూర్చుని ఉండటం వెనుక ఎన్నో ప్రమాదాలు దాగిఉన్నాయని తేలిపోయింది. పోనీ రోజూ కాసేపు వ్యాయామం చేద్దామా అంటే... అది అందరికీ కుదరకపోవచ్చు. కాబట్టి అసలు కూర్చోవడంలోనే ఏమన్నా మార్పు తీసుకురావచ్చునేమో గమనించే ప్రయత్నం చేశారు. ఇందుకోసం దాదాపు ఎనిమిదివేల మందికి ఓ యంత్రాన్ని అమర్చారు. ఆ యంత్రం ద్వారా వారి శరీరకదలికల మీద నిఘా ఉంచారు.   ఎనిమిదివేల మంది అభ్యర్థులలో దాదాపు 77 శాతం మంది నిరంతరం కూర్చునే ఉంటున్నారని తేలింది. వీరి రోజులో సగభాగం కూర్చునే సాగిపోతోందట. మరో నాలుగేళ్లు గడిచిన తర్వాత వీరిలో ఓ 340 మంది చనిపోయారు. అయితే దఫాకు ఓ గంట నుంచి గంటన్నర పాటు కదలకుండా కూర్చునేవారే తొందరగా చనిపోతున్నట్లు తేలింది. అరగంటకి ఓసారి లేచి అటూఇటూ తిరిగేవారి ఆయుష్షు ఎక్కువగానే ఉన్నట్లు గమనించారు. అంటే రోజంతా కూర్చునే ఉన్నాకూడా, మధ్యమధ్యలో లేస్తూ ఉండటం వల్ల మన ఆయుష్షు పెరుగుతుందన్నమాట. వినడానికి బాగానే ఉంది కదా! మరింకేం ఆచరించేస్తే సరి. - నిర్జర.  

ప్రపంచంలోని అత్యంత విలువైన నాణెలలో ఆరు

ప్రపంచం డిజిటల్ మనీ, ఈ మనీ వైపు పరుగులు తీస్తుంది. కానీ, వేలాది సంవత్సరాలుగా డబ్బుగా చెలామణి అయినవి నాణెలు మాత్రమే.  లోహంతో తయారు చేయబడి  చెలామణిలో ఉన్న నాణెలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే  కాగితం కరెన్సీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ నాణెల ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది.  ప్రపంచంలో అరుదైన నాణెలుగా రికార్డు సృష్టించిన నాణెలు ఎన్నో ఉన్నాయి. వాటి విలువ కోట్లాది రూపాయల్లో ఉంటుంది. మరి వాటి వివరాలు ఎంటో చూద్దామా.. 6. లిబర్టీ హెడ్ నికెల్ మోర్టన్ స్మిత్ ఎలియాష్ బర్గ్ (1913 ) ఖరీదు 4.5మిలియన్ డాలర్లు (33,33,96,675  రూపాయలు) ఈ నాణెం ఖరీదు 2018లో వేలం ద్వారా 4,560000 డాలర్లకు చేరుకుంది. అత్యంత ప్రసిద్ధ చెందిన ఈ నాణెం ఈ భూగ్రహం మీద ఉనికిలో ఉన్న నాణెం ఐదు నమూనాలలో ఇది ఒకటి. వేలంపాటతో ధర పెరుగుతూ వచ్చి 2018లో 4.5మిలియన్ డాలర్లకు మించి ధర పలికింది. ఈ నాణెం పై భాగం నునుపుగా అద్దం వలే కనిపిస్తుంది. ఇలాంటి ఫినిషింగ్ ఉన్న నాణెం అరుదుగా ఉంటుంది. దీని  విలువ  ఎక్కువగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. అంతేకాదు ఈ నాణెం ముద్రణ గురించి  అధికారిక రికార్డులు లేనందున ఇది ఏ కాలం నాటిది అన్న విషయంపై చాలా వివాదాలు ఉన్నాయి.  కేవలం ఐదు లిబర్టీ నికెల్ నాణాలు మాత్రమే లభించాయి.  ఇవన్నీ అనధికారంగా తయారుచేశారంటారు. అయితే 1913 లో లిబర్టీ నికెల్ నాణెలను తయారు చేయడానికి  చట్టం అనుమతించింది. కాని కొంతమంది  మింట్ ఉద్యోగులు కొన్ని అక్రమ నమూనాలను ముద్రించారన్న ఆరోపణ ఉంది. ఈ ప్రసిద్ధ నాణెం 1972 నుండి రికార్డులను బద్దలు కొడుతున్నాయి. 100,000 కు అమ్ముడైన మొదటి నాణెం ఇదే. ఆ తర్వాత 1996 లో దీని ధర  ఒక మిలియన్ డాలర్లు పలికింది.  ప్రస్తుత రికార్డ్ హోల్డర్ ఎలియాస్‌బర్గ్ స్పెసిమెన్, గ్రేడెడ్ పిసిజిఎస్ పిఎఫ్ 66.  ఇది 2018 లో  4.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. 5.ఎడ్వర్డ్ 111 ఫ్లోరిన్ (1343) ఖరీదు 6.8 మిలియన్ డాలర్లు(50,37,99,420 రూపాయలు) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణాల్లో ఇది ఒకటి. అంతేకాదు చాలా పురాతనమైన నాణెం.  దాదాపు 670ఏండ్ల చరిత్ర ఉంది. ఈ నాణెం విలువ ఎక్కువగా ఉండడానికి మరో ముఖ్యమైన కారణం ఇది అతి పురాతన నాణెం కావడం. ఒకే విధమైన నాణాల్లో మూడు మాత్రమే అనేక శతాబ్దాల నుంచి చెక్కుచెదరకుండా ఉన్నాయి. అంటే ఇది చాలా విలువైనది మాత్రమే కాదు, అరుదైనది కూడా. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నాణెలు ఇప్పటి వరకు కనుగొనబడలేదు.  ఈ నాణెం 2006 సంవత్సరంలో వెలుగులోకి వచ్చింది. అదే సంవత్సరంలో వేలంపాట ద్వారా దీన్ని విక్రయించారు. ఆ తర్వాత 1857 లో టైన్ నదిలో కనుగొనబడిన మిగిలిన రెండు నాణేలు ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. 4.బ్రషర్ డబులూన్ (1787) ఖరీదు 7.4 మిలియన్లు(54,82,50,830 రూపాయలు) న్యూయార్క్ రాష్ట్రంలో నాణాల తయారిలో బంగారం బదులు రాగిని ఉపయోగించాలన్న బ్రషర్ లక్ష్యం  మేరకు రూపుదిద్దుకున్న నాణెలు. అయితే బంగారానికి బదులుగా రాగి నాణెలు తయారుచేయాలన్న ఎఫ్రియం బ్రషర్ల ప్రతిపాదనను ఆ రాష్ట్రం ఒప్పుకోలేదు. బంగారు నాణెలనే చెలామణిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. అయితే  బ్రషర్ ప్రతిభావంతుడైన స్వర్ణకారుడు. అతను స్టేట్ చేసిన సూచనను విస్మరిస్తూ కొత్త నాణెలను ముద్రించాడు. వాటిలో ఎక్కువ భాగం కాంస్యంతో తయారు చేయబడ్డాయి. వాటిలో కొన్ని 22 క్యారెట్ల బంగారంతో కూడా తయారుచేశాడు. ఈ నాణెలు చాలా అరుదుగా లభిస్తాయి. అంతేకాదు ఆసక్తి గల  కథ వీటిపై ఉంటుంది. కాబట్టి, అవి చాలా విలువైనవి.  ఒక వాల్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ 2011 లో  వేలంలో 7.4 మిలియన్ డాలర్లకు ఒక నాణెం కొనుగోలు చేసింది. 3.సెయింట్ గౌడెన్స్ బబుల్ ఈగిల్ (1907) ఖరీదు 7.6 మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) ఈ నాణాలను ఎక్కువ పరిమాణంలో ఉత్పత్తి చేయడం అనుకున్న దానికన్నా చాలా కష్టమని తేలింది. సంక్లిష్టమైన రూపకల్పన కారణంగా  వీటి ఉత్పత్తిని నిలిపివేశారు.  ఆ తర్వాత కొన్ని మార్పు చేశారు. యు.ఎస్. మింట్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించే చార్లెస్ బార్బర్ ఈ నాణెం పై దేవుడిని మేం విశ్వసిస్తున్నాం అన్న పదాలను తొలగించాడు. నాణెం మార్పులో,  తయారీ బాధ్యత పూర్తిగా అతనే తీసుకున్నాడు.  కానీ దీన్ని సమావేశంలో అంగీకరించలేదు. అయినప్పటికీ నాాణెం తయారీ మాత్రం ఆగలేదు.  ఇప్పుడు అది అత్యంత విలువైన నాణెంగా రికార్డు నెలకొల్పింది. 2. డబుల్ ఈగల్ (1933) ఖరీదు 7.6మిలియన్ డాలర్లు(56,30,62,340 రూపాయలు) డబుల్ ఈగిల్ 1933 అనేది యునైటెడ్ స్టేట్స్ 20 డాలర్ల బంగారు నాణెం. ఈ నాణెం రెండో ముద్రణ 1933లో జరిగింది. అయితే ఇవి చెలామణిలోకి రాలేదు. అప్పటివరకు సాధారణ ప్రజల మధ్య వాడకంలో ఉన్న ఈ నాణెలు కరిగించబడ్డాయి. అంతేకాదు అమెరికా అధ్యక్షుడైన థియోడర్ రూజ్‌వెల్ట్ ప్రజలు బంగారం కలిగి ఉండకుండా ఈ నాణాలను నిషేధించాడు. ఆ సమయంలో నెలకొనిఉన్న బ్యాంకింగ్ సంక్షోభానికి ఇది సహాయపడుతుందని అతను భావించాడు.  అయితే  కొద్ది మొత్తంలో ఈ నాణాలు ముద్రణాలయం నుంచి బయటకు వచ్చాయి.  ఏలా వచ్చాయి అన్నది మాత్రం స్పష్టం తెలియదు. కానీ, ఈ నాణాలను కలిగి ఉండటం అనేది చట్టవిరుద్ధం. ఎవరితోనైనా ఈ నాణెం ఉందని తెలస్తే దాన్ని వెంటనే స్వాధీనం చేసుకునేవారు. కానీ, ఎక్కడ నాణెలు ఉన్నాయి అన్నది తెలుసుకునే లోగానే ఇది ఒక కాయిన్స్ కలెక్టర్ వద్దకు చెేరింది. అవుతుంది. ఏదేమైనా, ఒక ప్రైవేట్ యజమాని ఒక నాణెం పొందగలిగాడు. ఇది మొదట ఈజిప్ట్ రాజు ఫరూక్ దగ్గర ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ వ్యక్తి దీన్ని పొందాడు. నాణెం  విక్రయించి లాభాలను యుఎస్ మింట్ కు తో విభజించాడు. ఏదీ ఏమైనా 4,455.,000 నాణెలు ముద్రించబడినప్పటికీ ఏదీ అధికారిక నాణెంగా వాడుకల్లోకి రాలేదు. 1. ఫ్లోయింగ్ హెయిర్ సిల్వర్, కాపర్ డాలర్ (1794) ఖరీదు 10 మిలియన్ డాలర్లు (74,21,43,500 రూపాయలు) ప్రపంచంలోనే అత్యంత విలువైన నాణెం ఇది. పరిశోధకుల అంచనా ప్రకారం వెండితో తయారుచేయబడిన మొదటి నాణెం ఇది.  యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం చేత ముద్రించబడి ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మొదటి వెండి నాణెంగా గుర్తింపు పొందింది. అంతేకాదు  2013 లో ఈ నాణెం మరో రికార్డు సాధించింది. ఇది ఇప్పటివరకు అమ్మకానికి వచ్చిన అతి ఖరీదైన సింగిల్ కాయిన్ గా ప్రపంచ కొత్త రికార్డును సృష్టించింది. వెండి నాణేల ముద్రణకు వెళ్ళేముందు మింట్ 1792లో ముద్రణకు సంసిద్ధం అయ్యింది.  రాగి, వెండి నమూనా నాణేలను మాత్రమే తయారు చేసింది. అయితే ఈ నాణాలను సేకరించేవారు ఈ చారిత్రాత్మక,  అత్యంత విలువైన నాణెంను 200 సంవత్సరాలకు పైగా సంరక్షించారు. నాణేల ముద్రణ వెనుక ఉన్న కథ దాని విలువను పెంచుతుంది. చాలా సార్లు అంతకన్నా ఎక్కువే ఉంటుంది.

కోపం ఒక శాపం!

ఓ ఊళ్లో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతను పేరుకి మాత్రమే ప్రశాంత్‌. కోపం మాత్రం ముక్కుమీదే ఉండేది. రోజూ ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం, అవతలి వాళ్ల వయసుకీ, వ్యక్తిత్వానికీ గౌరవం ఇవ్వకుండా నానా మాటలు అనడం… ఇదీ ప్రశాంత్‌ గుణం. ప్రశాంత్‌ చూడటానికి ముచ్చటగా ఉండేవాడు, ఏ పనిని మొదలుపెట్టినా సమర్థవంతంగా పూర్తిచేసేవాడు. కానీ ఏం లాభం! కోపం వస్తే విచక్షణ లేని పశువుగా మారిపోతాడు. ప్రశాంత్‌ గురించి ఊరంతా చెడుగా చెప్పుకుంటుంటే అతని తల్లిదండ్రులకు బాధగా ఉండేది. కానీ నయాన భయాన ఎంతగా నచ్చచెప్పినా వాళ్లు ప్రశాంత్‌లో మార్పుని తీసుకురాలేకపోయారు. చివరికి ప్రశాంత్‌ తండ్రికి ఓ ఉపాయం తట్టింది. ఆ సాయంత్రం ప్రశాంత్‌ను పిలిచి “ఎన్నిరోజులు ఎదురుచూసినా నీలో మార్పు రావడం లేదు బాబూ!” అన్నాడు దీనంగా. “ఏం చేసేది నాన్నా! కోపం వస్తే నన్ను నేను మర్చిపోతాను. కోపాన్ని అదుపుచేసుకోవడం నా వల్ల కావడం లేదు” అని అంతే దీనంగా బదులిచ్చాడు ప్రశాంత్‌. “సరే దీనికి నేనో ఉపాయాన్ని ఆలోచించాను విను. నీకు ఎప్పుడైతే కోపం వస్తుందో మన పెరటిగోడ దగ్గరకి వెళ్లి నీ బలమంతా ఉపయోగించి ఓ మేకుని కొట్టు. అలా నీ కోపం చల్లారుతుందేమో చూద్దాం” అన్నాడు తండ్రి. తండ్రి చెప్పిన ఉపాయం ప్రశాంత్‌కి నచ్చింది. తనకి కోపం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పెరటిగోడ దగ్గరకి వెళ్లి తన కోపమంతా ఉపయోగించి ఓ మేకుని గోడలోకి కొట్టేవాడు. ఆశ్చర్యంగా, రోజులు గడుస్తున్న కొద్దీ అతనిలో తెలియని ఓ ప్రశాంతత అవహించింది. రోజురోజుకీ అతను కొట్టే మేకుల సంఖ్య తగ్గసాగింది. ఒకో రోజైతే అసలు మేకుని కొట్టాల్సిన అవసరమే రావడం లేదు! “నాన్నాగారూ! మీరు చెప్పిన ఉపాయం భలే పనిచేసింది. నాకు ఇప్పుడు కోపం వచ్చినప్పుడు అదుపు చేసుకోగలుగుతున్నాను” అన్నాడు ఓ రోజు ప్రశాంత్‌ తన తండ్రితో. “మంచిది! ఇప్పుడో పని చేద్దాం. నువ్వు ఒక రోజంతా నీ కోపాన్ని అదుపుచేసుకున్నప్పుడు, దానికి గుర్తుగా ఇప్పటివరకూ కొట్టిన మేకులలో ఒకదాన్ని బయటకి తీయి” అని సూచించాడు తండ్రి. “ఓస్‌ అదెంత భాగ్యం! తొందరలోనే ఆ గోడకి ఉన్న మేకులన్నీ ఖాళీ అయిపోతాయి చూడండి” అన్నాడు ప్రశాంత్‌ గర్వంగా. అన్నమాట ప్రకారమే కొన్నాళ్లకి ఆ మేకులన్నింటినీ బయటకు లాగిపారేసే అవకాశం వచ్చింది ప్రశాంత్‌కు. ఒక శుభదినాన ఆ గోడంతా ఖాళీ అయిపోయింది. ఆబగా తన తండ్రిని ఆ గోడ దగ్గరకు లాక్కువచ్చి “చూశారా నాన్నా! ఈ గోడ ఒకప్పటిలాగే ఉంది. నా కోపం మీద పూర్తిగా పైచేయి సాధించాను” అన్నాడు గొప్పగా! ప్రశాంత్‌ మాటలకు అతని తండ్రి చిరునవ్వు నవ్వుతూ “ఇంకొకసారి జాగ్రత్తగా చూడు బాబూ! ఈ గోడ ఒకప్పటిలాగానే ఉందా!” అని అడిగాడు. లేదు! ఆ గోడు ఒకప్పటిలా అందంగా లేదు. దాని మీద కొట్టిన మేకుల దెబ్బలకి గోడ మొత్తం తూట్లు పడిపోయి ఉంది. “మన కోపం కూడా ఇంతే బాబూ! కోపంలో మనం నానా మాటలూ అంటాం. విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తాం. కానీ కాలం గడిచి ఆ కోపం చల్లారాక జరిగిన నష్టాన్ని నివారించలేం. అప్పటికే మనం అన్న మాటలు ఒకరి మనసుని నొప్పించి ఉంటాయి. మన ప్రవర్తన ఎవరికో బాధ కలిగించి ఉంటుంది. ఆ తరువాత నువ్వు ఎన్ని క్షమాపణలు వేడుకున్నా కాలాన్ని వెనక్కి మళ్లించలేవు కదా!” అన్నాడు అనునయంగా. తండ్రి మాటలతో తన ఒకప్పటి ప్రవర్తనను గుర్తుతెచ్చుకుని కుమిలిపోయాడు కొడుకు. 

ప్రపంచంలో ఖరీదైన నివాసభవనాలు

తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం... అంటిలియా - ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా  అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ.  ఆంటీలియాను  డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్  నిర్మించారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి.  అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం. జెకె హౌస్,  గౌతమ్ సింఘానియా ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా  సొంతం చేసుకుంది.  ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా  నివాసగృహం వెలుగులోకి వచ్చింది.   j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు.  భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన  jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది.   16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు.  పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో  స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు  ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.  ఈ సంస్థ  రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు  ఫాస్ట్ కార్లు,  ఆధునిక పడవలు,  లగ్జరీ రివేట్ జెట్‌లపై అమితమైన ఆసక్తి.  ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ  సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం  అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. అడోబ్, అనిల్ అంబానీ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన  గృహాలలో ఒకటిగా  చెప్పవచ్చు. ఈ  ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు.  ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ,  దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది.  అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ  జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది.  మన్నాట్, షారుఖ్ ఖాన్ ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం.  ఈ భవనం పై నుంచి  అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది.  ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది.  గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది  నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన  గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది.  13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని  విలువ 200 కోట్ల రూపాయలు.  స్కై హౌస్, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా   పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది.  40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను  విజయ్ మాల్యా  నిర్మించుకున్నారు.  35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది.   బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ -  నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో  నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని  మాల్యా  వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు.  ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్,  వైన్ సెల్లార్,  సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన  సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది  ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ.  స్కై హౌస్ విలువ గతంలో   135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.

తేనెటీగలూ నేర్పుతాయి తియ్యటి పాఠాలు

తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని...   కలిసికట్టుగా శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది.   పరిస్థితులకు అనుకూలంగా తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది!   ప్రకృతికి సాయం తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు.   జ్ఞానాన్ని సంపాదించడం తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది.   ఆత్మరక్షణకు సాటిలేదు తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది. - నిర్జర.  

ప్రతిభను పెంచే - Pygmalion effect

ఓ పిల్లవాడు తరగతిలో అందరికంటే వెనకబడిపోయి ఉంటాడు. ఒకో తరగతీ దాటే కొద్దీ అతను మొద్దుగా పేరు తెచ్చేసుకుంటాడు. ఇక అతన్ని బాగు చేయడం ఎవరి తరమూ కాదని అంతా నిశ్చయించుకుంటారు. ఇంతలో ఒక ఉపాధ్యాయుడి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. కాస్త ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే ఆ పిల్లవాడు ఓ ఆణిముత్యంగా మారతాడన్న ఆశ ఉపాధ్యాయుడికి ఏర్పడుతుంది. అంతే! అక్కడి నుంచి ఆ పిల్లవాడి జీవితమే మారిపోతుంది. ఎందుకూ పనికిరానివాడు కాస్తా... అద్భుతమైన ఫలితాలు సాధించడం మొదలుపెడతాడు.   వినడానికి ఇదంతా ఏదో సినిమాకథలాగా తోస్తోంది కదా! కానీ నిజజీవితంలో ఇది నూటికి నూరుపాళ్లూ సాధ్యమే అంటున్నారు. ఈ ప్రభావానికి ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు కూడా పెట్టారు. పిగ్మేలియన్ ఒక గ్రీకు పురాణ పాత్ర పేరు. అతను ఓ గొప్ప శిల్పకారుడట. ఏ అమ్మాయి వంకా కన్నెత్తయినా చూడని, చూసినా ఆకర్షింపబడని ప్రవరాఖ్యుడట. అలాంటి పిగ్మేలియన్‌ ఓ అందమైన అమ్మాయి శిల్పాన్ని చెక్కుతాడు. తాను చెక్కిన శిల్పాన్ని చూసి తనే మనసు పారేసుకుంటాడు. చివరికి దేవుడి కరుణతో ఆ శిల్పానికి ప్రాణం వస్తుంది. అలా ప్రాణం వచ్చిన శిల్పాన్ని పిగ్మేలియన్ వివాహం చేసుకోవడంతో అతని కథ సుఖాంతం అవుతుంది. మన ఆశలకు అనుగుణంగా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం అన్న ఆలోచనతో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ అన్న పేరు పెట్టారన్నమాట!   రోసెంతాల్‌, జాకబ్‌సన్‌ అనే ఇద్దరు పరిశోధకులు 1968లో ‘పిగ్మేలియన్ ఎఫెక్ట్‌’ ప్రతిపాదన చేశారు. తమ ప్రతిపాదనని నిరూపించడం కోసం వారు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. ఇందుకోసం వారు కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలని ఎంచుకొన్నారు. ఆ పాఠశాలలో పిల్లలందరి ఐక్యూలని నమోదు చేశారు. ఆ తర్వాత వారి ఉపాధ్యాయుల దగ్గరకు వెళ్లి వారిలో కొందరు పిల్లలు ఐక్యూ చాలా అద్భుతంగా ఉందనీ... ఆ పిల్లలు ఎప్పటికైనా మంచి ఫలితాలు సాధిస్తారనీ చెప్పారు. నిజానికి వాళ్లు సేకరించిన వివరాలు వేరు, ఉపాధ్యాయులకు చెప్పిన వివరాలు వేరు. కానీ పరిశోధకులు చెప్పిన వివరాలను నమ్మిన ఉపాధ్యాయులు, తమ నమ్మకానికి అనుగుణంగానే ప్రవర్తించడం మొదలుపెట్టారు. తెలిసో, తెలియకో అద్భుతాలు సాధించగలరు అనే పిల్లల మీద ఎక్కువ దృష్టి పెట్టారు. కొంతకాలం గడిచిన తర్వాత ఉపాధ్యాయులు దృష్టి పెట్టిన పిల్లలు నిజంగానే మంచి ప్రతిభను కనబరిచారు.   ఈ పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ కేవలం బడిలోనే కాదు- ఆఫీసులో, ఇంట్లో, రాజకీయాల్లో... ఇలా మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సత్ఫలితాలను సాధిస్తుందని చెబుతున్నారు. ఎదుటివ్యక్తి పనికిమాలినవాడు అన్న భావనతో ఉంటే, అతనితో మన ప్రవర్తన అలాగే ఉంటుంది. అలా కాకుండా అతనేదో సాధించగలడు అన్న నమ్మకంతో ఉంటే, అతని పట్ల మన ప్రవర్తించే తీరు మారిపోతుంది. మన ఆకాంక్షలు అతని మీద తప్పకుండా ప్రభావం చూపుతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు, అవతలివ్యక్తి కూడా ఓ నాలుగడుగులు ముందుకు వేసే ప్రయత్నం చేస్తాడు. పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ ఇద్దరు వ్యక్తులకి మాత్రమే పరిమితం కాదు. ఒకోసారి మనమీద మనం నమ్మకాన్ని ఏర్పరుచుకున్నప్పుడు కూడా అనూహ్యమైన ఫలితాలను సాధించగలం. దీన్నే self-fulfilling prophecy అంటారు.   పిగ్మేలియన్‌ ఎఫెక్ట్‌ ఏ మేరకు పనిచేస్తుంది? అది అనవసరమైన ఆకాంక్షలకు కారణం అవుతుందా! ఎదుటివ్యక్తి మీద మరింత ఒత్తిడిని కలిగిస్తుందేమో! లాంటి సందేహాలు లేకపోలేదు. అయితే జీవితంలో ఏమీ సాధించలేము అని నిరాశ చెందే సందర్భాలలోనూ, అవతలి వ్యక్తి ఎందుకూ పనికిరాడన్న అభిప్రాయానికి వచ్చేసినప్పుడూ ఈ పిగ్మేలియన్ ఎఫెక్ట్‌ని కాస్త పరీక్షిస్తే తప్పకుండా భిన్నమైన ఫలితం వచ్చి తీరుతుందంటున్నారు.   - నిర్జర

జీవితమే ఒక ఆట అయితే

ఆటలు జీవితంలో ఒక భాగం కావచ్చు. శారీరక వ్యాయామానికో, మనసు సంతోషంగా ఉండటానికో వాటిని మనం ఆడుతూ ఉండవచ్చు. కానీ ఆ ఆటని కనుక నిశితంగా గమనిస్తే, అందులోంచి నేర్చుకునేందుకు ఎంతో కొంత ఉంది అనిపిస్తుంది.   స్పష్టమైన లక్ష్యం - ప్రతి ఆటగాడికీ ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. బౌలర్ అయితే వీలైనంత త్వరగా వికెట్ తీయాలనుకుంటాడు. బ్యాట్స్మెన్ అయితే వీలైనన్ని పరుగులు చేయాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటగాడైతే గోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అదే గోల్ కీపర్ అయితే... ఇలా ప్రతి ఒక్కరికీ తనదైన లక్ష్యం ఉంటుంది. లేకపోతే ఆట వృధాగా మారిపోతుంది. జీవితం కూడా అంతే! ఏ లక్ష్యమూ లేని మనిషి, మైదానంలో అయోమయంగా తిరిగే ఆటగాడితో సమానం.   సమస్యని ఎదుర్కోవాల్సిందే - బరిలోకి దిగాక మన సత్తువనంతా ప్రదర్శించాల్సిందే! సమ ఉజ్జీలాంటి సమస్య ఎదురుపడినప్పుడు మన శాయశక్తులా పోరాడితేనే ఫలితం దక్కేది. కళ్లు మూసుకుని అది దాటిపోతుందిలే అనుకుంటే విలువైన అవకాశం కాస్తా చేజారిపోతుంది.   పైపై మెరుగులు పనికిరావు - ఆటలోకి దిగాక డాంబికాలతో ఫలితాలు రావు. ఏదో కాసేపు పని జరుగుతుందేమో కానీ ఆఖరు విజయం మాత్రం అర్హుడికే దక్కుతుంది.   గెలుపు ఓటములను స్వీకరించాలి - ఆడే ప్రతి ఆటలోనూ గెలుపు సాధ్యం కాదు. గెలిచేవాడుంటే ఓడిపోయేవాడు కూడా ఉండి తీరాల్సిందే. ఓడిపోయాను కదా అని క్రుంగిపోతే ఇక ఎప్పటికీ అతని మనసు గెలుపు మీద లగ్నం కాలేదు. గెలిచానని విర్రవీగినా అతనికి విలువ ఉండదు. ఓడినప్పుడు మరోసారి కసిగా ఆడేందుకు ప్రయత్నించాలి. గెలిస్తే వినయంతో దాన్ని స్వీకరించాలి.   జట్టు గురించి ఆలోచించాలి - తానొక్కడినే గెలవాలి అన్న స్వార్థం చివరికి వేదననే మిగులుస్తుంది. జట్టుతో కలిసి ఆడితేనే అసలైన విజయం లభిస్తుంది. Live and Let Live అన్న సూత్రంతోనే జీవితానికైనా, ఆటకైనా అర్థం ఉంటుంది.   లోపాలను జయించాలి - ఎంతటి ఆటగాడైనా కానీ ఓ చిన్నపాటి లోపం ఉంటే చాలు, అతనిలోని నైపుణ్యాలన్నీ పనికిరాకుండా పోతాయి. స్వీయవిశ్లేషణతో ఆ లోపాలను గ్రహించి, వాటిని అధిగమించినప్పుడే విజేతగా నిలవగలడు.   క్రమశిక్షణ - సచిన్, వినోద్ కాంబ్లి ఇద్దరూ సరిసమానమైన ఆటగాళ్లే. కానీ కాంబ్లి వెనకబడిపోవడానికి కారణం అతనిలోని క్రమశిక్షణాల లేమి అంటారు. ఆటైనా, జీవితమైనా తగిన క్రమపద్ధతిలో లేకుండా అరాచకంగా సాగిపోతే ఎదుగుదలలో ఎదురుదెబ్బలు తప్పవు. - నిర్జర.

మాటే మంత్రం

అనగనగా ఓ అందమైన రాజ్యం. ఆ రాజ్యానికి ఓసారి పెద్ద ఆపద వచ్చింది. శత్రుదేశం వారు తమ రాజుని బంధించి తీసుకుపోయారు. ఆ శత్రుదేశపు కోటలోకి అడుగుపెట్టి, రాజుగారిని విడిపించుకుంటే కానీ... తమ రాజ్యానికి భవిష్యత్తు ఉండదు. కానీ ఎలా ఆ శత్రుదేశం సాధారణమైనది కాదు. ఆ దేశానికి ఉన్న కోటగోడలు ఆకాశాన్ని తాకేంత పెద్దవి. ఆ కోటగోడలను దూకి ఎలాగైనా లోపలకి ప్రవేశించేందుకు ఓ వందమంది యోధులు బయల్దేరారు. అంత పెద్ద కోట గోడని ఎవ్వరూ ఎక్కి రాలేరులే అన్న ధీమాతో శత్రుసైనికులు కోట లోపలే ఏదో పండుగ సంబరాలలో మునిగిపోయి ఉన్నారు. కోటగోడను చేరుకున్న తర్వాత తల పైకెత్తి చూసిన యోధులకు కళ్లు తిరిగిపోయాయి. ‘అబ్బే ఈ గోడని ఎక్కడం మన వల్ల కాదెహే!’ అంటూ ఓ యోధుడు ముందుగానే కూలబడిపోయాడు. మరికొందరు ఓ నాలుగడుగులు పైకెక్కి.... ‘అబ్బే ఈ గోడ నున్నగా జారిపోతోంది. దీన్ని ఎక్కడం అసాధ్యం,’ అంటూ చెట్ల కిందకి చేరుకున్నారు. అలా ఒకొక్కరే కోటగోడను ఎక్కే ప్రయత్నాన్ని విరమించుకోసాగారు. పైగా ఎక్కుతున్నవారితో కూడా ‘ఆ కోటని ఎక్కడం మానవమాత్రులకు సాధ్యం కాదు. ఇంత ఎత్తైన కోట గోడల వల్లే, ఈ రాజ్యం ఇంత గొప్పదయ్యింది,’ అని అరుస్తూ నిరుత్సాహపరచసాగారు.   ఒకవేళ ఆ మాటలు వినిపించుకోకుండా ఎవరన్నా మరికాస్త పైకి ఎక్కే ప్రయత్నం చేస్తే- ‘చెబుతోంది నీకే! బతికుంటే మరో రాజుని ఎన్నుకోవచ్చు. అనవసరంగా ఈ గోడని ఎక్కి నీ ప్రాణాలు కోల్పోవద్దు,’ అంటూ అరిచి గీపెట్టారు. కానీ అదేం విచిత్రమో కానీ, ఒక వ్యక్తి మాత్రం తనకి వినిపించే మాటలను ఏమాత్రం ఖాతరు చేయకుండా క్రమంగా పైకి ఎక్కసాగాడు. అలా ఎక్కే ప్రయత్నంలో, నాలుగడుగులు పైకి ఎక్కితే పది అడుగులు కిందకి జారిపోతున్నాడు. కాళ్లూ చేతులూ దోక్కుపోయి రక్తం ఓడుతున్నాడు. అయినా పట్టువిడవకుండా గోడ ఎక్కుతూనే ఉన్నాడు. అతను మూర్ఖుడనీ, చావుకి సిద్ధపడుతున్నాడనీ కింద ఉన్నవాళ్లు అరుస్తూనే ఉన్నారు. ఎట్టకేళకు ఓ అయిదు గంటలు గడిచిన తర్వాత... ఆ వ్యక్తి కోట గోడను చేరుకున్నాడు. శత్రువుల కంట పడకుండా కోట తలుపులు తీసి తన తోటివారిని లోపలకి తీసుకువెళ్లాడు.   వందమంది యోధులూ కలిసి శత్రుసైనికులను తుదముట్టించారు. తమ రాజుగారిని విడిపించుకుని విజయంతో తమ రాజ్యానికి చేరుకున్నారు. ‘ఎవరు ఎంతగా నిరుత్సాహపరిచినా కూడా ఇతగాడు వెనక్కి తగ్గలేదు ప్రభూ! కోట గోడని ఎక్కేదాకి తన ప్రయత్నాన్ని విరమించలేదు,’ అంటూ ఆ ఒక్క వీరుడినీ రాజుగారికి పరిచయం చేశాడు సేనాధిపతి. తన ముందు నిలబడిన ఆ వీరుని చూసిన రాజుగారు తెగ ఆశ్చర్యపోయారు. కారణం... అతను చెవిటివాడు. ‘ఒకోసారి మనల్ని నిరుత్సాహపరిచే మాటలు చెవిన పడకపోవడమే మంచిది మహారాజా! కోటగోడను ఎవ్వరూ ఎక్కలేరంటూ తోటివారంతా అరిచిన అరుపులు ఇతనికి వినపడకపోవడం వల్లే, తన లక్ష్యాన్ని చేరుకోగలిగాడు. ఒకోసారి మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చెవిటివాడిలాగా ఇతరుల మాటలను వినిపించుకోకపోవడమే మంచిదేమో!’ అన్నాడు సేనాధిపతి. (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.

అప్పటికప్పుడు టెన్షన్ తగ్గాలంటే!

ఒకప్పుడు రైళ్లు గంటకి పది మైళ్ల వేగంతో పరుగులు పెట్టేవి. ఇప్పుడో! గంటకి వంద మైళ్ల వేగం కూడా తక్కువగానే అనిపిస్తోంది. జీవితమూ అంతే... ఒకప్పుడు నిదానంగా సాగిన మన జీవితాలు ఇప్పుడు కుబుసాలు కదిలిపోయేంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఇంత వేగంలో ఒత్తిడి కూడా సహజమే. మరి ఆ ఒత్తిడిని చిటికెలో తప్పించేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...   - ఒత్తిడితో కూడిన మనసు మీద శబ్దం చూపే ప్రభావం అపారం. మీకు ఇష్టమైన పాటని హమ్ చేయడమో, ప్రకృతిని తలపించే శబ్దాలను వినడమో (ఉదా॥ కెరటాలు) చేస్తే ఒత్తిడి తేలిపోతుంది. గది మధ్యలో చైనీస్ చిరుగంటలని తగిలించి, వాటి మీద మనసుని లగ్నం చేయడం కూడా కొందరికి ఉపశమనంగా ఉంటుంది.   - కాసేపు అలా వాహ్యాళికి వెళ్లడం వల్ల కూడా మనసులోని ఒత్తిడి నిదానంగా కరిగిపోతుంది. ఒత్తిడిని కలిగించే ఆలోచనలను పక్కన పెట్టి, శ్వాస మీద దృష్టిపెడుతూ నడకని సాగిస్తుంటే ఒత్తిడి ఇట్టే మాయమవుతుంది. సమస్య గురించి కాకుండా దానికి పరిష్కారాల గురించీ, జీవితంలో అంతకంటే విలువైన విషయాల గురించీ ఆలోచించే అవకాశం దక్కుతుంది.   - ఒత్తిడిగా అనిపించినప్పుడు లేచి నిల్చోవాలి. తల, వెన్ను, భుజాలని నిటారుగా ఉంచుకొని నిదానంగా, దీర్ఘంగా ఊపిరి పీల్చుకోవాలి. బయటకి వదిలే ప్రతి ఊపిరితోనూ మీలోని ఉద్వేగం తగ్గిపోతున్నట్లుగానూ, లోపలకి తీసుకునే ప్రతి శ్వాసతోనూ మనసు తేలికపడుతున్నట్లు భావించాలి.   - ఓ అందమైన దృశ్యం లేదా సాంత్వన కలిగించే చిత్రాన్ని కాసేపు గమనించండి. కిటికీలోంచి బయట ప్రకృతిలోకి చూడటమో, మీకు ఇష్టమైన రంగులో ఉన్న వస్తువుని పరిశీలించడమో చేయవచ్చు. ఏదీ కుదరకపోతే కళ్లు మూసుకుని ఓ అందమైన ప్రకృతి దృశ్యాన్ని (ఉదా॥ జలపాతం) ఊహించుకోండి.   - ఉద్వేగం ఓ విషవలయం. ఉద్వేగంతో మన కండరాలన్నీ బిగుసుకుంటాయి. బిగుసుకుపోయిన కండరాలు మరింత ఉద్వేగానికి దారితీస్తాయి. కాబట్టి మనసు ఉద్వేగంగా ఉన్నప్పుడు ఆ ప్రభావం మన మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. అందుకోసం ఒక్కసారి మన శరీరం మీద ధ్యాస ఉంచాలి. నుదురు, పిడికిళ్లు బిగదీసి లేకుండా చూసుకోవాలి.   - ఉద్వేగాన్ని ఎదుర్కొనేందుకు నవ్వుని మించిన దివ్యౌషధం లేదు. నవ్వడం వల్ల మన శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ అనే రసాయనాల ఉత్పత్తి తగ్గి, వాటి బదులుగా ఆనందాన్ని రేకెత్తించే ఎండోమార్ఫిన్స్ అనే రసాయనాలు వెలువడతాయి. కాబట్టి మనస్ఫూర్తిగా నవ్వడమో, అలా నవ్వేందుకు ఇష్టమైన కామెడీ సన్నివేశాన్ని చూడటమో చేయవచ్చు.   - శబ్దమే కాదు, స్పర్శ కూడా ఉద్వేగాన్ని దూరం చేస్తుంది. మనకి ఇష్టమైన వస్తువుని పట్టుకుని ఉండటమో (ఉదా॥ టెడ్డీ బేర్), రబ్బర్ బాల్ని చేతితో నొక్కడమో, వేడి నీటితో స్నానం చేయడమో, వెచ్చటి దుప్పటిని కప్పుకోవడమో... ఉద్వేగం నుంచి తప్పకుండా దూరం చేస్తాయి.                     - నిర్జర.

చీమలు నేర్పే జీవితపాఠాలు

గ్రహించే మనసు ఉండాలే కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని అణువణువూ ఓ జీవితపాఠాన్ని నేర్పుతుందంటారు పెద్దలు. ఇందుకు చీమలనే ఓ ఉదాహరణగా తీసుకోవచ్చునేమో. విశ్లేషించడం అంటూ మొదలుపెడితే, చీమల నుంచి ఎన్నో విలువైన పాఠాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని...   పూర్తిస్థాయి సామర్థ్యం: తాము అల్పంగా ఉన్నాం కదా అని చీమలు వెనకడుగు వేయవు. ఎంతబరువు మోయగలవో అంత బరువునీ మోసేందుకు సిద్ధంగా ఉంటాయి. అందుకేనే చీమలు తమ బరువుకంటే దాదాపు 5000 రెట్లు అధికబరువుని మోయగలిగే సామర్థ్యాన్ని అలవర్చుకుంటాయని తాజా పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. కానీ మనుషులు అలా కాదు! ఎన్నో ఆలోచనలు చేయగల సామర్థ్యం, వాటిని అమలుపరిచే సత్తా ఉన్నా లేనిపోని పరిమితులను ఊహించుకుని గిరగీసుకుని తిరుగుతూ ఉంటారు. అలాంటివారికి చీమలు ఓ గొప్ప గుణపాఠం కదా!   వెనకడుగు వేసేది లేదు: ఆహారం కోసం బారులుగా బయల్దేరిన చీమలకి దారిలో ఏదన్నా అడ్డు వచ్చిందనుకోండి... అవి వెనక్కి వెళ్లడం జరగదు. ముందుకు వెళ్లేందుకు మరో మార్గం ఏముంటుందా అని అన్వేషిస్తాయి. అటుతిరిగీ ఇటుతిరిగీ ఎలాగొలా గమ్యానికి చేరుకుంటాయి. ఒకటి రెండు అడ్డంకులకు బెంబేలెత్తిపోయి చేతులెత్తేసే మనకి ఇలా నిరంతరం లక్ష్యం వైపుగా సాగిపోవడమే ధ్యాసగా ఉన్న చీమలు గొప్ప స్ఫూర్తి కదా!   కలసికట్టుగా: బలవంతమైన సర్పము/ చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! అంటాడు శతకకారుడు. చీమలు గొప్ప సంఘజీవులు అన్న విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. అవి తాము సేకరించిన ఆహారాన్ని మిగతా చీమలన్నింటితోనూ పంచుకునేందుకే ఇష్టపడతాయి. ప్రతి చీమా తనకు ఎదురుపడిన చీమతో దారుల గురించీ, ఆహారం గురించీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయని తేలింది. తన ఆకలి తీరడమే కాదు, తన తోటివారి కడుపు నిండినప్పుడే నిజమైన తృప్తి లభిస్తుందని చీమలు బోధిస్తున్నాయి.   దూరదృష్టి: చీమల దూరదృష్టి గురించి బోలెడు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడే అవి పుట్టలను నిర్మించుకుంటాయనీ, ఆహారాన్ని పోగేసుకుంటాయని అంటారు. వీటిలో ఎంతవరకు నిజం ఉందో కానీ దీర్ఘకాలం తిండికీ గూడుకీ ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా అవి తగిన ఏర్పాట్లు చేసుకుంటాయనే విషయంలో ఏ అనుమానమూ లేదు. ఒంట్లో సత్తువ ఉండగా శ్రమించడమే కాదు, అది లేని రోజు కోసం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలన్న ఆలోచనని చీమలు కలిగిస్తున్నాయి.   లక్ష్యం ఉంటుంది: చీమల్ని చూస్తే అవి నిరంతరం ఏదో వెతుకులాటలో ఉన్నట్లే కనిపిస్తాయి. ఆహారాన్ని వెతుక్కొంటూనో, దొరికిన ఆహారాన్ని మోసుకువెళ్తూనో, సాటి చీమలతో సమాచారాన్ని పంచుకుంటూనో వడివడిగా సాగుతుంటాయి. మనసుకి ఆలోచించే దమ్ము, ఒంట్లో పనిచేసే సత్తా ఉన్నంతవరకూ విశ్రమించవద్దంటూ మనకి సూచిస్తూ ఉంటాయి.   - నిర్జర.

ఉపనిషత్తులో చెప్పిన ప్రేమ

ప్రేమ ఎప్పుడూ మోహానికీ, దుఃఖానికీ కారణం అవుతుందంటారు. కానీ ప్రేమలో స్వార్థం నిండినప్పుడే అలా జరుగుతుందేమో! ఎందుకంటే నిజమైన ప్రేమ ఎదుటి మనిషికి నమ్మకం అనే రెక్కలనిస్తుందే కానీ, మోహం అనే సంకెళ్లతో తన ఎదుట బంధించుకోదు. నిజమైన ప్రేమ ఇవ్వగలిగినది ఇస్తుందే కానీ, ఫలితాన్ని ఆశించి బంధాన్ని వ్యాపారంగా మార్చేయదు. అలాంటప్పుడు ప్రేమ మోహానికీ, దుఃఖానికీ కారణం ఎలా అవుతుంది. కాదు గాక కాదు. పైగా తన ప్రేమతో ప్రతి జీవితాన్నీ వెలిగిస్తుంది. అలా వెలిగిన జీవితాలలో తన సార్థకతను చూసుకుంటుంది. ఇది ఎవరో ఒకరు చెప్పింది కాదు. ఏదో ఒక చోట అనుకునే గాలివాటు మాటా కాదు. ఆలోచన ఉన్న ప్రతి మనిషికీ తట్టిన భావం. కావాలంటే ఈ ఉపనిషత్తు మంత్రాన్ని చూడండి... యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్రకో మోహః కః శోక ఏకత్వమనుపశ్యతః అని చెబుతోంది ఈశావాస్యోపనిషత్తులోని ఒక మంత్రం. ఆత్మానుభూతిని పొందినవాడికి ఈ ప్రపంచంలోని జీవులన్నీ కూడా తనలోని భాగమే అనిపిస్తుందట. ప్రపంచంలోని ప్రతి జీవిలోనూ తానున్నానన్న భావన కలుగుతుందట. అలాంటప్పుడు ఇక తారతమ్యాలు ఎలా కలుగుతాయి? అందుకనే ఈ భావనతో ఉన్నవారికి దేనిపట్లా మోహం కానీ, దుఃఖం కానీ కలుగవు అని ఈ మంత్రం చెబుతున్న అర్థం. అదీ సంగతి! ఉపనిషత్కారులు ప్రేమని మరో మెట్టుని పైకి తీసుకువెళ్లారు. వారి దృష్టిలో ప్రేమ అంటే విశ్వజనీనమైనది. ప్రేమ అంటే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు భౌతికమైనది కాదు. మోహంతో బంధించేది, దక్కకపోతే దుఃఖించేది కాదు. ఈ లోకంలో ‘నేను’ అన్న పదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో ‘నువ్వు’ అన్న మాటకి అంతే అర్థం ఉందని గుర్తించడం. నువ్వు, నేను కలిస్తేనే ఈ లోకం అని భావించడం. ఆ భావనతోనే ప్రతి జీవినీ గౌరవించడం. అలాంటప్పుడు యాసిడ్‌ దాడులుండవు. అడ్డుగోడలుండవు. నేను గొప్ప, నువ్వు తక్కువ అన్న తారతమ్యాలు అసలే ఉండవు. ఇలాంటి ప్రేమ మన మనసులో నిండితే ప్రతిరోజూ ప్రేమకి పండుగే కదా! - నిర్జర.

పిల్లల్ని పెంచే తీరు ఇది కాదు

విజ్ఞానం పెరిగిపోతోంది. విద్యావంతుల సంఖ్యా పెరిగిపోతోంది. పిల్లలకి ఏం పెట్టాలి? వారిని ఎలా పెంచాలి? అనే విషయాల మీద ప్రతి ఒక్కరికీ స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ అవి సరైనవనా! మనం పిల్లల్ని పెంచుతున్న తీరులో ఏవన్నా తీవ్రమైన లోపాలు ఉన్నాయా? అంటే ఉన్నాయనే అంటున్నారు పరిశోధకులు.   తీరు మారింది.. అమెరికాలోని ‘నోట్ర డాం’ విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు ఒక పరిశోధనను చేపట్టారు. ఓ 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పటి పిల్లల్ని పెంచే తీరులో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పులు వారి వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అని తెలుసుకోవడమే ఈ పరిశోధన లక్ష్యం. ఈ పరిశీలనలో గమనించిన కొన్ని ముఖ్యమైన మార్పులు ఇవీ...   - పిల్లల్ని ఎత్తుకుని కాకుండా ఏదో ఒక చోట వారిని ఒంటరిగా వదిలివేయడం జరుగుతోంది. ఊయలలోనో, కారుసీట్ల మీదో, స్ట్రాలీల (strolley) మీదో పిల్లల్ని గంటల తరబడి ఉంచేస్తున్నారు. ఒకవేళ తమతో పాటు తీసుకువెళ్లినా కూడా ‘బేబీ కేరియర్ల’ సాయంతో వారిని కట్టేసి తీసుకువెళ్తున్నారు.   - అమెరికాలో కేవలం 15 శాతం తల్లులు మాత్రమే తమ పిల్లలకి ఏడాది వచ్చేవరకూ పాలు పట్టిస్తున్నారు. మిగతా వారంతా ‘infant formula’ పేరుతో కృత్రిమమైన ఆహారానికే ప్రాధాన్యతని ఇస్తున్నారు.   - 1970ల కాలంతో పోల్చుకుంటే ఉమ్మడి కుటుంబాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.   - పిల్లలు ఏడ్చిన వెంటనే వారిని బుజ్జగించడం అంత మంచిది కాదన్న అభిప్రాయం బలపడిపోయింది.   అన్నీ పొరపాట్లే.. పైన పేర్కొన్న విధానాలన్నీ కూడా పొరపాటే అంటున్నారు సైకాలజిస్టులు. పిల్లలకు పెద్దల స్పర్శ తగులుతూ ఉండటం, తల్లిపాలను అందించడం, నలుగురైదురు చేతుల్లో పెరగడం, వారు ఏడ్చిన వెంటనే ఎత్తుకుని లాలించడం... వంటి చర్యలన్నీ కూడా వారి మానసిక, శారీరిక వికాసానికి అవసరం అంటున్నారు. పిల్లలు ఏడుస్తున్న వెంటనే వారిని లాలించడం అనేది వారి వివేకం మీద ప్రభావం చూపుతుందట. స్పర్శ, లాలనల వల్ల వారిలో ఒత్తిడి తగ్గి, భావోద్వేగాలను నియంత్రించుకునే నేర్పు అలవడుతుందట. ఇక బందీగా ఉంచకుండా స్వేచ్ఛగా మెలసనివ్వడం వల్ల చొరవ, సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయని చెబుతున్నారు. నలుగురి చేతుల్లో పెరగడం వల్ల విచక్షణ, వినయం, సహానుభూతి ఏర్పడతాయట.   ఫలితాలు అనుభవిస్తున్నాం.. పిల్లల పెంపకంలో ఇలాంటి మానవీయ కోణాలు చెదిరిపోవడం వల్ల ఇప్పటి తరం దూకుడుగా, క్రూరంగా, ఆత్మసాక్షి లేకుండా, జాలిదయ వంటి లక్షణాలను అతీతంగా పెరుగుతున్నారని వాపోతున్నారు. పైగా చిన్నవయసులోనే ఉద్వేగం, క్రుంగుబాటు వంటి మానసిక సమస్యలతో సతమతమవుతున్నారని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు. మనలోని సహానుభూతి, విచక్షణ, స్వీయనియంత్రణ వంటి లక్షణాలను కుడివైపు ఉన్న మెదడు నియంత్రిస్తుందనీ... అది నిరంతరం మారుతూనే ఉంటుందనీ చెబుతున్నారు. కాబట్టి జీవితంలో ఏ క్షణంలో అయినా సరే తల్లిదండ్రులు తమ పెంపకంలోని లోటుని గమనించి వారితో అనుబంఢాన్ని దృఢపరచుకునే ప్రయత్నం చేస్తే పిల్లవాడిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని సూచిస్తున్నారు. - నిర్జర.  

అర్థం చేసుకునే మనసు

ఒక పిల్లవాడు కుక్కపిల్లలను అమ్మే షాపులోకి వచ్చాడు. ‘అంకుల్! నేను కుక్కపిల్లను కొనాలనుకుంటున్నాను. ఓ కుక్కపిల్లను కొనుక్కోవాలంటే ఎంత కావాలి?’ అని అడిగాడు. ‘కుక్కపిల్లను బట్టి 300 నుంచి 500 దాకా ఖర్చవుతుంది’ అని జవాబిచ్చాడు షాపు యజమాని.   ‘ప్రస్తుతానికి నా దగ్గర ఓ వంద రూపాయలే ఉన్నాయి కానీ, ఓసారి మీ దగ్గర ఉన్న కుక్కపిల్లను చూడవచ్చా!’ అని అడిగాడు పిల్లవాడు.   దానికి షాపు యజమాని పిల్లవాడిని లోపలికి తీసుకువెళ్లి, అక్కడ ఓ గదిలో ఆడుకుంటున్న కుక్కపిల్లలను చూపించాడు. వాటిలో ఒక కుక్కపిల్ల కదలకుండా అలాగే కూర్చుని ఉంది.   ‘ఆ కుక్కపిల్లకి ఏమైంది? ఏమన్నా జబ్బు చేసిందా!’ అని ఆందోళనగా అడిగాడు పిల్లవాడు. ‘జబ్బు కాదూ పాడూ కాదు! దానికి ఓ కాలు పనిచేయదు. కుంటుకుంటూ నడుస్తుంది’ అని చిరాగ్గా బదులిచ్చాడు యజమాని.   ‘అంకుల్! నాకు ఆ కుక్కపిల్లే కావాలి. దాని కోసం ఈ వంద రూపాయలు తీసుకోండి’ అన్నాడు పిల్లవాడు. ‘చవగ్గా వస్తుందని ఆ కుక్కపిల్ల కావాలనుకుంటున్నావేమో! అదెందుకూ పనికిరాదు. కావాలంటే ఉచితంగానే దాన్ని తీసుకుపో!’ అని కసురుకున్నాడు యజమాని.   ‘అబ్బే చవగ్గానో ఉచితంగానో వస్తుందని కాదు. దాన్ని నేను డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. ఇప్పుడు ఇచ్చే వంద రూపాయలే కాకుండా మళ్లీ వచ్చి మిగతా డబ్బులు కూడా ఇస్తాను’ అన్నాడు పిల్లవాడు.   పిల్లవాడి మాటలతో యజమానికి చెప్పలేనంత ఆశ్చర్యం వేసింది. ‘నీకేమన్నా పిచ్చా! ఆ కుక్కపిల్లనే కొనుక్కుంటానని అంటావేంటి? అది మిగతా కుక్కపిల్లల్లాగా పరుగులెత్తలేదు, గంతులు వేయలేదు... కనీసం చురుగ్గా నడవలేదు’ అని కోప్పడ్డాడు యజమాని.   యజమాని మాటలకి పిల్లవాడు ఒక నిమిషం పాటు ఏం మాట్లాడలేదు. ఆ తరువాత నిదానంగా తన ప్యాంటుని పైకి ఎత్తి చూపించాడు. అతని మోకాలి నుంచి అరికాలి వరకూ లోహపు పట్టీలు వేసి ఉన్నాయి. అప్పటిదాకా పిల్లవాడి అవిటితనాన్ని యజమాని గమనించనేలేదు. ‘శరీరంలో ఒక భాగం లేనంత మాత్రాన ఆ కుక్కపిల్ల విలువ తగ్గిపోవడం నాకిష్టం లేదు. పైగా అది కూడా నాలా పెద్దగా పరుగులెత్తలేదు కాబట్టి నాకు తోడుగా ఉంటుంది. నా బాధని తనన్నా అర్థం చేసుకుంటుంది’ అన్నాడు పిల్లవాడు కన్నీళ్లని ఆపుకుంటూ!   కష్టంలో ఉన్న జీవికి కావల్సింది ఓదార్పు, ప్రోత్సాహం.... అన్నింటికీ మించి ఆ కష్టాన్ని అర్థం చేసుకునే మనసు అని తెలిసొచ్చింది యజమానికి. ..Nirjara