విశాఖ సదస్సుకు పటిష్ఠ భద్రతా వలయం.. వంగలపూడి అనిత

విశాఖలో శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సుకు ప్రభుత్వం అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సు కోసం 3 వేల 500 మంది పోలీసులతో భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. గురువారం (నంబర్ 13) ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆమె  భద్రత విషయంలో ఇసుమంతైనా రాజీపడే పశక్తే లేదన్నారు. భాగస్వామ్య సదస్సుకు హాజరయ్యే వీఐపీలు, ఇన్వెస్టర్లు, ఇతర ప్రముఖులు విశాఖ విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి తిరిగి వారి వారి గమ్యస్థానాలకు చేరే వరకూ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఇటీవల ఢిల్లోలో పేలుడు నేపథ్యంలో  రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అప్రమత్తత ప్రకటించామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. తీవ్రదాదంతో పాటు రాజకీయ ఉగ్రవాదం పట్ల కూడా తమ ప్రభుత్వం సీరియస్ గా ఉందని చెప్పారు.  ఇక వైసీపీ సోషల్ మీడియాలో విశాఖ భాగస్వామ్య సదస్సుపై జరుగుతున్న విష ప్రచారాన్ని ఉపేక్షించబోమని అనిత హెచ్చరించారు.   

భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. మొహదీపట్నం పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్త ఆపరేషన్ లో భారీగా నకిలీ కరెన్సీ నోట్లను పట్టుకున్నారు. ఈ సందర్భంగా నాలుగు ద్విచక్రవాహనాలతో పాటు ఓ కారును, తొమ్మది మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.  కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు కస్తూరి రమేష్ బాబు తన సోదరితో కలిసి తాండూరులో స్కానర్, ల్యాప్ టాప్, ఫొటోషాప్ సాఫ్ట్ వేర్ సాయంతో నకిలీ నోట్లను తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నకిలీ నోట్లను అసలు నోట్లతో ఒకటి ఈజ్ టు నాలుగు నిష్పత్తిలో చెలామణి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.  రమేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా కస్టమర్లను సంప్రదించి నకిలీ నోట్లను విక్రయించేవాడు. అతని ద్వారా వహీద్‌, తహా, సోహైల్‌, ఫహాద్‌, ఇమ్రాన్‌, ఒమర్‌, అల్తమాష్‌ తదితరులు చైన్‌ సిస్టమ్‌లో నకిలీ నోట్లను విస్తరించారు. పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు  వారిపై నిఘా పెట్టి...ఈద్గా గ్రౌండ్స్‌, ఫస్ట్‌ లాన్సర్‌ వద్ద దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. అనంతరం  కోర్టులో హాజరుపరిచి , రిమాండ్ కి తరలించారు.  

అది ఉగ్ర చర్యే.. ఢిల్లీ పేలుడుపై కేంద్రం అధికారిక ప్రకటన

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం  ఉగ్రచర్యగా   ప్రకటించింది. ఈ నెల 10న జరిగిన ఈ దుర్ఘటనలో 13 మంది మరణించగా 20 మంది గాయపడిన సంగతి తెలిసిందే.  ఈ కేసు దర్యాప్తులో  వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఈ పేలుడు ఘటన ఉగ్ర చర్యేనని కేంద్రం ధృవీకరించింది.    ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం (నవంబర్ 12) కేబినెట్ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కేంద్రం ఢిల్లీ పేలుడును ఉగ్ర చర్యగా ప్రకటించింది.  ఈ ఘటనపై ఇప్పటికే యూఏపీఏ, ఉగ్రవాద నిరోధక చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో  అరెస్టయిన డాక్టర్ల ఫోన్లలోని టెలిగ్రామ్ చాట్ల ద్వారా ఈ ఘటన వెనుక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం బయటపడిందని దర్యాప్తు సంస్థలు చెప్పాయి.    

హైదరాబాద్ బిర్యానీకి గుర్తింపు చంద్రబాబు చలవే!

అరకు కాఫీ గురించిన ప్రస్తావన ఎక్కడ ఎప్పుడు వచ్చినా ఎవరైనా సరే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండరు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారనడంలో సందేహం లేదు. అయితే అంతకు చాలా కాలం ముందే హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి చంద్రబాబు కృషి చేశారు. ీ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు.  . అవును  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది తానేనని చెప్పారు. అంతే కాదు.. దేశ విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చే పర్యాటకులు పాత బస్తీలో షాపింగ్ చేసేలా అక్కడి ముత్యాల గురించి ప్రమోట్ చేసింది కూడా తానేనని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ వేల్యూను పెంచేందుకు తీసుకున్న అనేక చర్యలలో భాగంగా హైదరాబాద్ బిర్యానీ, పాతబస్తీ ముత్యాలను ప్రమోట్ చేశానన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను హైదరాబాద్ ను ఐటీ హబ్ గా ప్రపంచ దేశాల ప్రముఖ ఐటీ సంస్థలన్నీ హైదరాబాద్ కు క్యూకట్టేలా చేసేందుకు కృషి చేశాననీ, అలాగే హైదరాబాద్ బ్రాండ్ ను ఇనుమడింపచేసేలాంటి హైదరాబాద్ బిర్యానీనీ, ఓల్డ్ సిటీలో ముత్యాల షాపింగ్ ను కూడా ప్రమోట్ చేశానని చెప్పారు.  విజయవాడలో జరిగిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో మాట్లాడిన చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర చెరిపివేయలేనిదన్నారు. 

తిరుమలశ్రీవారి భక్తుల కోసం ఏఐ ఆదారిత చాట్ బాట్!

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత మెరుగైన సేవలందించే దిశగా కీలక ముందడుగు వేసింది.  అత్యాధునిక  సంకేతికతను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా..  మరింత మెరుగైన, సులభమైన సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రముఖ టెక్నాలజీ సంస్థ అమెజాన్ వెబ్ సర్విసెస్‌ భాగస్వామ్యంతో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.  ఈ ఏఐ చాట్‌బాట్‌ ద్వారా భక్తులు శ్రీవారి దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు తదితర సేవలకు సంబంధించిన సమాచారాన్ని క్షణాల్లో అందించనుంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌలభ్యం కోసం ఈ సేవలను ఏకంగా 13 భాషల్లో అందించనున్నారు. అంతేకాకుండా భక్తులు తమ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను కూడా ఈ చాట్‌బాట్‌ ద్వారా సులభంగా టీటీడీ దృష్టికి తీసుకెళ్లే వెసులుబాటు కలగనుంది.  ఈ చాట్‌బాట్‌లో స్పీచ్ టు టెక్ట్స్, టెక్ట్స్ టు స్పీచ్ వంటి ఆధునిక సదుపాయాలు ఉంటాయి. దీని వల్ల భక్తులు వాయిస్ కమాండ్ల ద్వారా కూడా సమాచారాన్ని పొందగలరు. ఈ అత్యాధునిక చాట్‌బాట్‌కు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ అభివృద్ధి చేస్తున్నది.  అలాగే, పారదర్శకత పెంచడంతో పాటు, ఎస్వీబీసీ ఛానల్ ప్రసారాలను మరింత మెరుగుపరిచేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపడుతోంది.  

మరింత పెరగనున్న బంగారం ధరలు!

జేపీ మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్  ఓ సంచలన విషయాన్ని ప్రకటించింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయని అంచనా వేసింది. వచ్చే ఏడాది చివరి నాటికి ఔన్స్ బంగారం ధర 5 వేల 200 నుంచి 5 వేల 300 డాలర్లకు చేరవచ్చని అంచనా వేసింది. ఇదే నిజమైతే ప్రస్తుతమున్న ధరలతో పోల్చితే ఏకంగా 20 నుంచి 25 శాతం బంగారం ధరలు పెరగడం తథ్యం. ఈ ఏడాది ఇప్పటికే బంగారం ధర ఓసారి రికార్డ్‌ను క్రియేట్ చేసింది. అక్టోబర్‌లో ఔన్స్‌ బంగారం ధర 4 వేల 380 డాలర్లను తాకింది. ఆ తర్వాత 4 వేల డాలర్లకు పడిపోయింది. కానీ ప్రస్తుతం మళ్లీ 4 వేల 130 డాలర్ల వరకు చేరింది. ఈ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆ బ్యాంకు అంచనా వేసింది. రానున్న రోజుల్లో కాస్త తగ్గినా.. ఆ తర్వాత  మాత్రం క్రమక్రమంగా పెరిగే అవకాశమే ఉందన్నది ఆ అంచనా. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ వార్ పుణ్యమా అని గోల్డ్‌కు డిమాండ్ పెరిగింది. అన్ని దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ గోల్డ్ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌లోనే  634 టన్నుల బంగారాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌లు కొనుగోలు చేశాయి. ఈ ఏడాది చివరి నాటికి ఆ మొత్తం 750 నుంచి 900 టన్నులకే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   చైనా, భారత్‌తో పాటు పోలాండ్, టర్కీ, కజక్‌స్థాన్ కూడా తమ గోల్డ్‌ రిజర్వ్‌లను పెంచుకుంటున్నాయి. డాలర్‌ రిజర్వ్‌లను కొనసాగిస్తూనే బంగారంపై దేశాలు ఆధారపడుతున్నాయి. అయితే అమెరికా-చైనా మధ్య ట్రేడ్‌ డీల్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బంగారం ధర కాస్త తగ్గినా కానీ.. మళ్లీ ఇప్పుడు పెరగడం ప్రారంభమైంది.  ప్రస్తుతమున్న పరిస్థితుల్లో గోల్డ్‌పై ఇన్వెస్ట్‌ చేసేందుకే ఇన్వెస్టర్లు ఇంట్రెస్ట్ చూపుతారని అంచనా వేస్తున్నారు. రానున్న రోజుల్లో డిమాండ్ పెరగడానికి ఇదే కారణం కాబోతుందని చెబుతున్నారు. ఇప్పటికే కొండెక్కి కూర్చున్న బంగారం ధర.. రానున్న రోజుల్లో మరింత పెరిగి ఆకాశానికి చేరడం ఖాయమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.  

జూబ్లీ బైపోల్.. సునీతకు మాగంటి అభిమానుల సహాయ నిరాకరణ?

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది.  ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కాంగ్రెస్ అభ్యర్థికే అనుకూలంగా వచ్చాయి. జూబ్లీహిల్స్ ఓటర్లు అధికార పార్టీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన అన్ని సంస్థలూ అంచనావేశాయి.   మాగంటి మరణం తర్వాత అనివార్యంగా జరిగిన జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అందరికంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టింది. సిట్టింగ్ సీట్‌ను ఎలాగైనా దక్కించుకునేందుకు, తిరిగి మాగంటి కుటుంబానికే జూబ్లీహిల్స్ టికెట్ కన్ ఫర్మ్  చేసింది బీఆర్ఎస్ అధిష్టానం. సెంటిమెంటే తమ అస్త్రంగా మాగంటి సునీత, ఆమె కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు. అయినా కూడా మాగంటి సునీతకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ వర్గాలలో దీనిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి.  జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం నుంచి వరుసగా  మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపినాథ్ కు అనేకమంది అనుచరులు, అభిమానులు ఉన్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన ఈ ఉపఎన్నికలో మాత్రం గోపినాథ్ భార్య మాగంటి సునీతకు ఆయన అనుచరులు, అభిమానులు ఎవరూ  గ్రౌండ్ లెవల్ లో సహకరించలేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాగంటి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే చాలు ఆయన అభిమానులే ఎన్నికల భారమంతా తమ భుజాల మీద మోస్తూ గోపీనాథ్ ను గెలుపించుకునేవారు. కానీ, ఈ ఉపఎన్నికలో మాత్రం వారంతా నామమాత్రంగానే పనిచేశారనీ, అందుకే సునీత వెనుకంజలో ఉన్నారని గులాబీ పార్టీలో టాక్ నడుస్తోంది.  మాగంటి సునీత విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ ఎలాగైనా ఆమెను గెలుపించుకోవాలని శతవిధాల ప్రయత్నించింది. ప్రచార బాధ్యతను మొత్తం ఒంటిచేత్తో లాక్కొచ్చిన కేటీఆర్, కింది స్థాయి నాయకత్వాన్ని సమన్యయపరచడానికి సరైన కార్యచరణ చేయలేకపోయారని, మాగంటి గోపీనాథ్ అనుచరులను సునీత విజయం  కోసం పనిచేసేలా మోటివేట్ చేయడంలో విఫలమయ్యారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే సునీత విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డ కేటీఆర్ నాయకుల్లో సమన్వయం తీసుకురావడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారట. మాగంటి గోపీనాథ్‌ది సహజ మరణం కాదంటూ, ఆయన మరణం వెనుక ఏదో కారణం ఉందంటూ.. గోపీనాథ్ అభిమానుల పేర్లతో జూబ్లీహిల్స్ లో వెలిసిన పోస్టర్లు.. మాగంటి మొదటి భార్య, కొడుకు హైదరాబాద్ కు వచ్చి చేసిన ఆరోపణలు, గోపీనాథ్ తల్లి మహానంద కుమారి ఏకంగా కేటీఆర్ పైనే ఆరోపణలు చేయడం.. ఇవన్నీ సునీత ఓటమికి కారణాలు అయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    గోపీనాథ్ అభిమానులు, అనుచరులు ఈ ఉప ఎన్నికలో సునీత విజయం కోసం అంకిత భావంతో పని చేయకపోవడం  బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బగా మారిందని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.  మరి చూడాలి ఈ ఉపఎన్నిక ఫలితం ఎలా ఉంటుందో..  మాగంటి సునీతకు ఎంతమేర ఓటు పర్సెంటేజ్ నమోదవుతుందో?

పాకిస్థాన్, శ్రీలంకల వన్డే సిరీస్ రద్దు?

పాకిస్థాన్, శ్రీలంక మధ్య పాకిస్థాన్‌లో జరుగుతున్న వన్డే సిరీస్‌ రద్దయ్యే పరిస్థితులు ఏర్పాడ్డాయి. పాక్‌లో పర్యటిస్తోన్న లంక జట్టులోని ఎనిమది మంది ఆటగాళ్లు  గురువారం (నవంబర్ 13) స్వదేశానికి వెళ్లిపోయారు. తాజాగా ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో 12 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఈ ఆటగాళ్లు తమ భద్రతపై ఆందోళన చెందుతున్నారని క్రికెట్‌ శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితుల్లో గురువారం రావల్పిండిలో జరగాల్సిన రెండో వన్డే జరిగే అవకాశం లేకుండా పోయింది.  మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలోనే జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ గెలిచింది. మూడో వన్డేకూ రావల్పిండి ఆతిథ్యమివ్వాల్సింది. షెడ్యూలు ప్రకారం వన్డే సిరీస్‌ తర్వాత శ్రీలంక, జింబాబ్వే, పాకిస్థాన్‌లతో పాక్‌లోనే ముక్కోణపు సిరీస్‌ ఆడాల్సి ఉంది.  ఇస్లామాబాద్‌కు చాలా దగ్గర్లోనే రావల్పిండి ఉండడం భద్రతపై తమ క్రికెటర్లు ఆందోళన చెందడానికి కారణమని ఓ శ్రీలంక బోర్డు అధికారి చెప్పాడు. దాంతో పాక్‌-శ్రీలంక సిరీస్‌ రద్దైనట్లే. 2009లో లాహోర్‌లో గడాఫీ స్టేడియానికి వెళ్తుండగా శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. అజంత మెండిస్, చమింద వాస్, మహేల జయవర్దనే సహా చాలా మంది ఆటగాళ్లు ఈ దాడిలో గాయపడ్డారు. అనేక మంది భద్రత సిబ్బంది మృతి చెందారు. ఆ దాడి నేపథ్యంలో దాదాపు దశాబ్దం పాటు ఏ విదేశీ క్రికెట్ జట్టూ   పాకిస్థాన్‌కు వెళ్లలేదు. విశేషమేంటంటే.. 2019 డిసెంబరులో శ్రీలంక పర్యటనతోనే పాకిస్థాన్‌కు తిరిగి విదేశీ జట్ల రాక మొదలైంది. ఇప్పుడు తాజా పేలుళ్లతో విదేశీ జట్లు పాక్‌లో పర్యటనకు సంశయించే పరిస్థితి తలెత్తింది.

ఈమె ఎవరో తెలుసా?

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గంగా స్నానమాచరించడానికి వచ్చిన ఓ యువతికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఒక సాధారణ ప్రయాణీకురాలిగా వారణాసి చేరుకున్న ఆమె అంతే సాదాసీదాగా గంగాస్నారం ఆచరించింది. ఆ సందర్భంగా అత్యంత సామాన్యురాలిగా మెట్ల మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంది. ఆ తరువాత అంతే నిశ్శబ్దంగా వారణాసిలో రైలు ఎక్కి స్వస్థలానికి వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియోను ఓ యూట్యూబర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే క్షణాల్లో ఆ వీడియో వైరల్ అయ్యింది.  ఇంతకీ ఆమె ఎవరంటే.. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఏకైన సోదరి బసంతి బెన్ మోడీ. అయినా ఆమె కాశీ ప్రయాణం ఆద్యంతం అత్యంత నిరాడంబరంగా సాగింది. ఎక్కడా వీఐపీ రాచమర్యాదలు లేవు. ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఒక సాదాసీదా మహిళగా రైల్లో వచ్చారు. గంగాస్నానమాచరించి తిరిగి వెళ్లిపోయారు.  చేతిలో ఓ సంచీ, భుజాలపై శాలువాతో కనిపించిన ఆమె ప్రధాని నరేంద్రమోడీ ఏకైక సోదరి. పైగా వారణాసి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంటు నియోజకవర్గం.  ఆమె నిరాడంబరతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

ఐదు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ దాడులు!

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాలలో గురువారం (నవంబర్ 13) దాడులు నిర్వహించింది.    గుజరాత్ ఉగ్రవాద కుట్రలో  బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వలసదారుల ప్రమేయం ఉన్నట్లుగా అనుమానిస్తున్న ఎన్ఐఏ   పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాలలో దాదాపు పది చోట్ల గురువారం (నవంబర్ 13) విస్తృత తనిఖీలు నిర్వహించింది.  అనుమానితులు, వారి సహచరులకు సంబంధించిన స్థలాల్లో ఎన్ఐఏ బృందాలు సోదాలు నిర్వహించాయి. గుజరాత్ లో ఈ కేసు 2023లో నమోదైంది. నలుగురు బంగ్లాదేశ్ జాతీయులు మొహమ్మద్ సోజిబ్ మియాన్, మున్నా ఖలీద్ అన్సారీ, అజ్రుల్ ఇస్లాం, అబ్దుల్ లతీఫ్ పేర్లు ఈ కేసులో ఉన్నాయి. ఈ నిందితులు ఫేక్ ఐడీలను ఉపయోగించి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు.వారికి నిషేధిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది.   బంగ్లాదేశ్ లోని అల్-ఖైదా కార్యకర్తల కోసం నిధులు సేకరించడమే కాకుండా, ఆ నిధులను వారికి బదిలీ చేసినట్లుగా తేలింది. అలాగే ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన  ఎన్ఐఏ నవంబర్ 10, 2023న అహ్మదాబాద్లోని ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. గతంలో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్  నిషేధిత ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, భారత ఉపఖండంలోని అల్-ఖైదా  తో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ పుణేకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ను అరెస్టు చేసింది. అలాగే థానేకు చెందిన ఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించింది.  

ఢిల్లీ లాల్ కిల్లా మెట్రో స్టేషన్ నిరవధిక మూసివేత

హస్తినలో సోమవారం కారు బాంబు పేలుడు ఘటన తర్వాత  మూతపడిన లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ఇంకా తెరుచుకోలేదు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మెట్రో స్టేషన్ ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఢిల్లీలోని అన్ని రైల్వే స్టేషన్లూ యథావిధిగా పని చేస్తున్నాయి. అయితే లాల్ కిల్లా మెట్రో స్టేషన్ ను మాత్రం తదుపరి ఉత్తర్వులు వెలువడేవరకూ మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్టు చేసింది. సోమవారం జరిగిన పేలుడు ఘటనలో 13 మంది మరణించిన సంగతి తెలిసిందే.  

జూబ్లీ బైపోల్ కౌంటింగ్ రేపు.. ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబర్ 14)న వెలువడనున్నాయి. పోలింగ్ ఈ నెల 11న అంటే మంగళవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తధ్యం అని అంచనా వేసినా, తుది ఫలితం కోసం పార్టీలూ, అభ్యర్థులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో కూడా తీవ్ర ఉత్కంఠ, ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఈ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన తరువాత కేంద్ర బలగాల మూడంచెల భద్రత నడుమ కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో భద్రంగా ఉంచారు. శుక్రవారం (నవంబర్ 14) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభమౌతుంది.  ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయి.  ఇక కౌంటిగ్ కోసం  42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. 10 రౌండ్లలోనే  కౌంటింగ్ పూర్తి అవుతుంది.  ఒక్కో టేబుల్ వద్ద ముగ్గురు అధికారులు కౌంటింగ్‌లో పాల్గొంటారు. అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌లో నుంచి ఈవీఎంలను తీసుకొచ్చి కౌంటింగ్ ప్రారంభిస్తారు.  ఈ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు రాకపోవడంతో.. ముందుగా హోం ఓటింగ్ ఓట్లు లెక్కిస్తారని తెలుస్తోంది.  హోం ఓటింగ్ కోసం 103 మంది నుంచి అప్లికేషన్లు రాగా, 101 మంది ఓటు వేశారు. ఈవీఎంలో ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. చివరగా ఎర్రగడ్డ డివిజన్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్ పూర్తయిన వెంటనే ఫలితాల వివరాలను ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. మరోవైపు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4,01,365 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఇందులో 1,94,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 99,771 మంది పురుషులు, 94,855 మహిళలు, ఇతరులు ఐదుగురు ఉన్నారు. మొత్తం 48.49 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.  ఇక మధ్యాహ్నానికల్లా ఫలితం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. 

సెల‌బ్రిటీస్ సారీ..గామా!

ఒకే రోజు మూడు సారీలు. లారీల నిండా సారీలు. వారిలో టాప్ ప్లేస్ కి చెందిన సారీ చెప్పిన వారు.. మంత్రి కొండా సురేఖ‌. ఈమె గ‌తంలో అంటే తాను మంత్రి అయిన తొలి రోజుల్లో  నాగార్జున ఫ్యామిలీకి సంబంధించి ఒక అబాంఢం వేశారు. దీంతో  నాగార్జున న్యాయాన్ని ఆశ్ర‌యించారు కూడా. ఆపై సురేఖ మంత్రిపదవి ఊడిపోతుందేమో అన్నంతగా వ్య‌వ‌హారం అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది.  అయితే.. , బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటారే అలా వెంట్రుక వాసిలో  అప్పట్లో వేటు నుంచి కొండా సురేఖ త‌ప్పించుకున్నారు.  ఆమె మంత్రిగా ఉండి కూడా  ప్రభుత్వంలో తమను   తొక్కేస్తున్నార‌ని ఆరోపణలు గుప్పించి కూడా  పదవిని భద్రంగా కాపాడుకోగలుగుతున్నారు. అది వేరే విషయం.  అప్ప‌టి నుంచీ కూడా సురేఖ సైలెంట్ మోడ్ లో కి వెళ్లిపోయాన‌ని అంటారు. తానేదైనా అంటే  అది మ‌రొక‌టిగా రూపాంత‌రం చెందుతోంద‌ని.. ఫీల‌య్యి మీడియాతో మాట్లాడ్డ‌మే మానేశాన‌ని చెప్పుకొచ్చారీ మ‌ధ్య ఒక మీడియా చిట్ చాట్ లో. ఇప్పుడు కూడా సురేఖ‌.. ట్వీట్ చేసి స‌రిపుచ్చారు త‌ప్ప‌.. మీడియా ముందుకు రాకుండా జాగ్ర‌త్త వ‌హించారు చూశారా!? ద‌టీజ్ కొండంత సారీల సురేఖ‌  అంటే. ఇక  రెండో బిగ్గెస్ట్ సారీ ఆఫ్ ద ఏపీ విష‌యానికి వ‌స్తే.. మాజీ ఐఏఎస్ ప్ర‌వీణ్ ప్ర‌కాశ్. ఒక స‌మ‌యంలో షాడో సీఎం గా వ్య‌వ‌హించార‌న్న పేరుండేది. అప్ప‌ట్లో ఇద్ద‌రి ప‌ట్ల తాను ఎంతో దారుణంగా ప్ర‌వ‌ర్తించాన‌నీ ఆయ‌న ఇప్పుడు తాజాగా ప‌శ్చాత్తాపం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ వారెవ‌రో చూస్తే మాజీ ఐపీఎస్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు, ఐఆర్ఎస్ జాస్తి కిషోర్ కుమార్. ఈ ఇద్ద‌రి ప‌ట్ల తాను అలా వ్య‌వ‌హ‌రించి ఉండ‌కుండా ఉండాల్సింద‌న్న కోణంలో ఆయ‌న చేసిన ఒక వీడియో ప్రెజంటేష‌న్ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.  అప్ప‌ట్లో జ‌గ‌న్ ఏదంటే  అది అన్న మాట‌క‌న్నా, ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ ఏదంటే అదీ అన్న టాక్ వినిపించేది. ఒక ద‌శ‌లో ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ మీద ఉపాధ్యాయులంతా  క‌ల‌సి కంప్ల‌యింట్ చేశారంటే ప‌రిస్థితి ఏమిటో ఊహించుకోవ‌చ్చు. అలాంటి ప్ర‌వీణ్ ప్ర‌కాశ్ నుంచి  సారీ.. అది  కూడా ఇద్ద‌రు ఉన్న‌తాధికారుల‌కు అందింది.  ఒక మూడో సారీ..  న‌టుడు ప్ర‌కాష్ రాజ్చెప్పారు.   బేసిగ్గా ప్ర‌కాష్ రాజ్ ఎంత అగ్రెసివ్ గా ఉంటారంటే.. జ‌స్ట్ ఆస్కింగ్ పేరిట ఏకంగా ప్ర‌ధాన మంత్రినే ఏ ప్ర‌శ్న‌లంటే ఆ ప్ర‌శ్న‌లు అడిగే బాప‌తు. దేశంలో ఏ చిన్న విష‌య‌మైనా స‌రే ఆయ‌న నిగ్గ దీసి అడుగు- ఈ సిగ్గులేని స‌మాజాన్ని అనే టైపు. అలాంటి ప్ర‌కాశ్ రాజ్ బెట్టింగ్ యాప్స్ ప్ర‌మోష‌న్ చేసినందుకుగానూ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తనకే పాపం తెలీదంటే అది త‌ప్పు అవుతుందని అన్నారు.  అయితే.. తాను గ‌తంలో చేసిన బెట్టింగ్ యాప్ ప్ర‌చారానికిగానూ సారీ చెబుతున్నా! అంటూ మీడియా ముఖంగా చెప్పారు. దీంతో ఒకే రోజు ముగ్గురు ప్ర‌ముఖుల నుంచి మూడు సారీలు వెలువ‌డ్డంతో ఇదో స‌రికొత్త రికార్డు  సృష్టించింది. వీరంతా మామూలోళ్లు కారు. అలాంటి మొండి- జ‌గ‌మొండి ఘ‌టాల నుంచి ఇలాంటి క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వం ఈ స‌మాజం చూస్తుంద‌నుకోలేదు. కాబ‌ట్టే ఇంత ఎగ్జ‌యిట్ మెంట్. ఇందులో ఏదైనా త‌ప్పుంటే సారీయే..!

అమెరికా షట్ డౌన్ ఎత్తివేస్తూ బిల్లుపై ట్రంప్ సంతకం

అమెరికా లో 43 రోజుల ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది.   షట్‌డౌన్‌ క్లోజ్ చేసే బిల్లును అమెరికా కాంగ్రెస్  ఓటింగ్ ద్వారా ఆమోదించింది. ఈ ఓటింగ్ లో 222-209 ఓట్ల తేడాతో షట్‌‌డౌన్ ఎత్తివేత బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదముద్ర వేసింది.   అమెరికా అధ్యక్షుడు షట్ డౌన్ ఎత్తివేత ఫైలుపై సంతకం చేశారు.   ప్రభుత్వం షట్‌డౌన్‌తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది. వేతనాలు లేకుండా పని చేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు షట్ డౌన్ ఎత్తివేస్తూ అగ్రరాజ్యాధినేత ట్రంప్ సంతకం చేయడంతో అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడినట్లేనని అంటున్నారు.  అయితే ఈ ఎత్తివేత ఆమెదం బిల్లు ద్వారా వచ్చే ఏడాది  జనవరి 30 వరకు ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమైన నిధులను మాత్రమే కల్పిస్తుంది. ఆ తరువాత మరోసారి అమెరికా షట్ డౌన్ అయినా ఆశ్చర్యం లేదని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి.  

విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు లోకేష్ శంకుస్థాపన

విశాఖలో మరో భారీ ప్రాజెక్టుకు గురువారం (నవంబర్ 13) శంకుస్థాపన జరగనుంది. దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. శుక్రవారం (నవంబర్ 14) నుంచి రెండు రోజుల పాటు జరగనున్న భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే అంటే గురువారం (నవంబర్ 13) లోకేష్ విశాఖ రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విశాఖలో నిర్మించనున్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తారు. విశాఖ ఎండాడలోని మనోరమ హిల్స్ సమీపంలో పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. దీని వల్ల కనీసం 15 వేల మందికి ఉపాధి లభిస్తుందని భావిస్తున్నారు.  

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి, నగదు, ఎలక్ట్రానిక్ గూడ్స్ స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కష్టం సార్ అధికారులు నిఘా నేత్రాలతో ప్రతి ఒక్క ప్రయాణికుడి కదలికలను పర్యవేక్షిస్తునా కూడా ఏ మాత్రం భయం, బెరుకు లేకుండా స్మగ్లర్లు అక్రమరవాణాకు ప్రయత్నిస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు.  తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో మూడు వేర్వేరు సంఘటనల్లో అక్రమంగా తీసుకువస్తున్న భారీ మొత్తంలో నగదు, గంజాయి, సెల్ ఫోన్ లను అధికారులు సీజ్ చేశారు. ఈ మూడు ఘటనలూ మంగళవారం (నవంబర్ 11) జరగాయి. వివరాలిలా ఉన్నాయి. బ్యాంకాక్ నుండి వచ్చిన ఒక ప్రయాణికుడి కదలికలకు అనుమానాస్పదంగా ఉండటంతో అతడి బ్యాగును తనిఖీ చేసిన అధికారులకు ఆ బ్యాగులో పెద్ద ఎత్తున హైడ్రోపోనిక్ గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు వెంటనే  అతడిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 4 కోట్ల రూపాయల విలువైన 4.3 కిలోల   హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.ఇంకా ఇక అదే రోజు  మరో  ప్రయాణికుడి బ్యాగు నిండా ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. అతని వద్ద నుండి పది ఐఫోన్ 17 ప్రో మాక్స్, 55  ఐఫోన్ 17 ప్రో, పది ఆపిల్ వాచ్ ఎస్ఇ,  పది ఐ వాచ్ ఎస్ఇ,  ఎనిమిది డీజేఐ ఎయిర్ 3ఎస్ డ్రోన్లు, నాలుగు  నింటెండో స్విచ్ 2, ఒక  శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 7, ఒక  హెచ్ఎండీ ఫోన్  ఒక నంబర్ గూగుల్ పిక్సెల్ వాచ్ 3 లను  స్వాధీనం  చేసుకున్నారు. అలాగే అదే రోజు అబుదాబి నుండి వచ్చిన ఇద్దరు ప్రయాణీకుల చెక్-ఇన్ బ్యాగేజీ నుండి రూ.71,71,407ల నగదును కస్టమ్స్ అధికారులు స్వాదీనం చేసుకున్నారు.  

అంబటి రాంబాబుపై కేసు నమోదు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ బుధవారం (నవంబర్ 12) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలోనూ నిరసన ర్యాలీలు నిర్వహించిన సంగతి విదితమే. అందులో భాగంగానే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు విధులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.  అంబటి పోలీసుల విధులను అడ్డుకోవడమే కాకుండా, వారిని బెదరించారనీ, అలాగే అనుమతి లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పేర్కొంటూ  బీఎన్ఎస్స సెక్షన్లు 132, 126(2), 351(3), 189(2), రెడ్‌ విత్‌ 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన ర్యాలీలు

  రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయటాన్ని నిరసిస్తూ  వైసీపీ 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలో పలు నియోజకవర్గాల్లో కీలక నేతల ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం పేరిట నిరసనలు చేపట్టారు. రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. కోవూరులో ఈ ఉద్యమ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. బుధవారం వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోవూరులో  నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కోవూరు బజార్ సెంటర్ నుంచి తాలూకా ఆఫీస్ వరకు జన సందోహంతో ఈ ర్యాలీ నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రయివేటికరణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటికరణ అడ్డుకుంటామని వారు తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.