బ్యాటింగ్ కాదు విధ్వంసం!

వీడెవ‌డండీ బాబూ! వంద మంది వీరేంద్ర సెహ్వాగ్ లు ఒకే సారి బ్యాటింగ్ చేస్తున్నట్లు..   యాభై మంది రిష‌బ్ పంత్ ల ఇన్నింగ్స్ ఇన్ స్పిరేష‌న్ గా తీస్కున్న‌ట్టు.. ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం.. ప్ర‌తి  రెండో బాల్ కి ఒక సిక్స్ కొడుతూ..  స్కోర్ బోర్డుకు ర‌న్నింగ్ రేస్ నేర్పిస్తున్న‌ట్టు  ప్ర‌తి బాల్ నీ ఫోర్ గానీ సిక్స్ గానీ వెళ్లేలా చేస్తూ.. ఆ మాట‌కొస్తే.. బాలు ఉన్న‌దే తాను ఫోర్లూ సిక్స్ లు కొట్టేందుక‌న్న‌ట్టు.. క‌ల‌లో రాకుమారుడుగానీ బ్యాటు ప‌ట్టుకుని ఫ‌టా ఫ‌టా బాదిన‌ట్టూ.. పుస్త‌కాల్లో మాత్ర‌మే క‌నిపించే కామిక్ క్యారెక్ట‌ర్ గానీ మాయ‌లూ మంత్రాలు  చేసిన‌ట్టు.. ఇలా ఒక‌టా రెండా ఆ విశేష‌ణాలు అన్నీ ఇన్నీ కావు.. యూఏఈ తో ఇండియా ఏ జ‌ట్టు ఆడిన ఈ ట్వంటీ ట్వంటీలో స్టేడియంలో కూర్చున్న‌దే ప‌ట్టుమ‌ని పాతిక మంది.. వారంతా క‌ల‌సి వైభ‌వ్ సూర్య‌వంశీ ఆడుతుంటే..స్టేడియం నిండా జ‌న‌మున్న‌ట్టు ఆ అరుపులేంటి  కేక‌లేంటి..??? జ‌స్ట్ 17 బంతుల్లో హాఫ్ సెంచురీ, జ‌స్ట్ 32 బంతుల్లో సెంచురీ.. ప్ర‌తి బంతినీ ఆకాశం చూడాలా అన్న‌ట్టు చిత‌క‌బాదుతూనే వెళ్లాడంటే న‌మ్మండీ.. అబ్బ‌బ్బ‌బ్బ 10 ఫోర్లు 15 సిక్సులూ.. ఇలా చెబుతూ పోతుంటే ఆ ఇన్నింగ్స్ లో వైభ‌వ్ సూర్య‌వంశీ పారించిన ప‌రుగుల వ‌ర‌ద‌కు ఒక అంతే లేదా అన్న‌ట్టు మారింది అత‌డి బ్యాటింగ్ సెన్సేష‌న్.   అస‌లు వీ అన్న అక్ష‌రంతో పేరున్న వాళ్లంతా  ఒక్కో వీరేంద్ర సెహ్వాగ్ లా  చెల‌రేగుతారా? అన్న‌ట్టుగా సాగిందా విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్. కేవ‌లం 41 బంతుల్లో 144 ప‌రుగులు చేసి.. ఎట్ట‌కేల‌కు అత‌డు ఔట్ అయితే ప్ర‌దత్య‌ర్ధి ప్లేయ‌ర్లు కూడా హ‌ర్ట్ అయ్యారంటే ప‌రిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవ‌చ్చు.. అది కోత కాదు.. మామా ఊచ కోత‌!  అత‌డు ఆడిన మొద‌టి బంతికే ఇచ్చిన క్యాచ్ ని ఎందుకు డ్రాప్ చేశామా? అని ప్రత్యర్థి జట్టు ఫీల‌వ‌లేదంటే ఒట్టు. ఒక స‌మ‌యంలో ఆ క్యాచ్ ప‌ట్టి ఉంటే ఇంత‌టి  విధ్వంస‌క‌ర  ఇన్నింగ్స్ ని  మ‌నం కూడా  చూడ‌లేక పోయే వాళ్లం  క‌దాని  యూఏఈ జ‌ట్టు ఆట‌గాళ్లు కూడా  ఫీల‌య్యేలా చేశాడు పట్టుమ‌ని ప‌దిహేను ఏళ్లు కూడా లేని వైభ‌వ్ సూర్య‌వంశీ.

శ్రీశైలంలో కోటి దీపోత్సవం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆలయ అధికారులు ఆలయ ప్రధాన మాడవీధి నుండి నంది మండపం వరకు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయం ముందు 45 అడుగుల భారీ కైలాసం సెట్టింగ్  ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాయంత్రం 6.30 గంటలకు కైలాస వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, దశవిధ హారతులను సమర్పించారు.  గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు భక్తులు పెద్ద ఎత్తున కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులకు ప్రమిదలు, పూజా సామాగ్రిని  దేవస్థాన అధికారులు ఉచితంగా అందజేశారు.  భక్తులు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కార్తీక దీపాలను వెలిగించారు. అధ్యంతం ఆధ్యాత్మిక భావనతో సాగిన కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. శ్రీశైలం క్షేగ్రంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి.  

కాశ్మీర్ లో భారీ పేలుడు.. 13 మంది మృతి

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో భారీ పేలుడు సంభవించింది. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం (నవంబర్ 14) అర్ధరాత్రి సంభవించిన ఈ పేలుడులో కనీసం 12 మంది మరణించారు. అర్ధరాత్రి సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ కారు పేలుడు సంఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం.   కాగా నౌగామ్ పోలీసు స్టేషన్ లో జరిగిన పేలుడులో గాయపడిన వారిని ఇస్పత్రికి తరలించారు. సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఇలా ఉండగా పేలుడు జరిగిన నౌగామ్ సీఎస్ భద్రతా పరంగా అత్యంత కీలకమైన, సున్నితమైనదని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగానే వ్యూహాత్మకంగా ఉగ్రవాదులు ఈ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారని భావిస్తున్నారు.  కాగా పేలుడు అనంతరం ఆ పోలీసు స్టేషన్ పరిశర ప్రంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి.  

12 మంది సైబర్ నిందితుల అరెస్టు

డిజిటల్‌ అరెస్టు పేరిట  దోచుకుంటున్న 12 మంది సైబర్‌ ముఠా సభ్యులను పులివెందుల పోలీసులు శుక్రవారం (నవంబర్ 14) అరెస్టు చేశారు.   కడప  ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ ఆ వివరాలు వెల్లడించారు.  నిందితులు వేంపల్లెకు చెందిన రిటైర్డ్‌ ఎంఈవో వీరారెడ్డికి ఏడు నెలల కిందట వీడియోకాల్‌ చేసి ఆయన పేరుతో ఉన్న సిమ్‌ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతోందంటూ ఢిల్లీలో కేసు నమోదైందని పేర్కొంటూ.. ఇందుకు సంబంధించిన ఆధారాలంటూ  ఫేక్‌ సుప్రీంకోర్టు కాపీలు వాట్సప్‌ ద్వారా పంపించి డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించారు. ఈ అరెస్టును తాత్కాలికంగా వాయిదా వేసేందుకు డబ్బు చెల్లించాలని చెప్పడంతో వారి మాటలకు భయపడిన వీరారెడ్డి తన అకౌంటులోని డబ్బు పంపించారు. అలా దాదాపు ఏడు నెలల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు. చివరికి వీరారెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వీరారెడ్డి వద్ద డబ్బులు వసూలు చేసేందుకు నిందితులు వేంపల్లెకు వచ్చినట్టు సమాచారం రావడంతో 12 మంది అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు.

విశాఖలో పెట్టుబడుల సదస్సు..తొలి రోజు రికార్డు స్థాయిలో ఎంవోయూలు

విశాఖ వేదికగా జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు శుక్రవారం (నవంబర్ 14) రికార్డు స్థాయిలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  నిర్వహిస్తున్న ఈ భాగస్వామ్య సదస్సుకు అద్భత స్పందన లభించింది. రెండు రోజుల సదస్సులో మొత్తం 400 ఎంఓయూల ద్వారా దాదాపు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయన్నది ప్రభుత్వ అంచనా. ఇందులో భాగంగా తొలి రోజు సదస్సులో రూ. 8. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు వివిధ కంపెనీలతో ఏపీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఎంఓయూల ద్వారా  12.05 లక్షల ఉాద్యోగాలు వస్తాయన్నది అంచనా.  అంతే కాకుండా పరోక్షంగా లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.   ఇక రెండో రోజు అంటే ఆదివారం  41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో జరగనున్న ఈ ఎంవోయూల ద్వారా  4.16 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.  ఇక మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు జరుగుతాయని  తెలిపాయి.   

బిహార్‌‌లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం... బీజేపీకి అత్యధిక స్థానాలు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయభేరి మోగించింది. ప్రస్తుతానికి 199 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మరో 4 స్థానాల్లో లీడ్‌లో ఉంది. దాదాపు 203 సీట్లు గెలిచే అవకాశం ఉంది. బీజేపీ 90 స్థానాల్లో గెలిచి అతి పెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 82 సీట్లు గెలిచాయి. మరో మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్‌జేపీ 18 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో కొనసాగుతుంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 35  స్థానాల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది.  ఆర్జేడీ 23 స్థానాల్లో గెలిచి మరో స్థానంలో లీడ్‌లో ఉంది. కాంగ్రెస్ ఐదు స్థానల్లో గెలిచి మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్‌లో బలీయమైన రాజకీయ శక్తిగా ఉన్న ఆర్జేడీ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ప్రస్తుత ఎన్నికల్లోనూ అన్ని పార్టీల కంటే ఆర్జేడీ ఓటు బ్యాంకు ఎక్కువగా నమోదైంది. తాజా ఫలితాల్లో ఆర్జేడీకి 22.9 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 20.1 శాతం, జేడీయూకు 19.24 శాతం ఓట్లు వచ్చాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్ధి ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ విజయం సాధించారు. అతి చిన్న వయస్సులో ఆమె బీహార్ అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు సృష్టించారు. అలీనగర్ నుంచి ఆమె తన సమీప ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.రాఘోపూర్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగిన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జేడీ) నేత తేజస్వీ యాదవ్ విజయం సాధించారు. 1,04,065 ఓట్లు సాధించిన ఆయన.. ప్రత్యర్థి బీజేపీ నేత సతీశ్ కుమార్‌పై 14,532 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

బిహార్‌లో జంగిల్ రాజ్ ఎప్పటికీ తిరిగిరాదు : ప్రధాని మోదీ

  బిహార్‌లో ప్రజలు వికసిత్ భారత్ కోసం ఓటేశారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మాట్లాడుతూ.. బిహార్‌ ప్రజలు అతి పెద్ద విజయం అందించారన్నారని.“బిహార్‌లో ఇవాళ ప్రతి ఇంట మఖానా పాయసం వండుకునే ఆనందం కనిపిస్తోంది. ఒకప్పుడు ‘జంగిల్‌ రాజ్‌’ అన్న మాట వచ్చినప్పుడు ఎలాంటి వ్యతిరేకత లేదని… ఇక ఆ రోజులు తిరిగి రానివ్వమని ప్రజలు తేల్చిచెప్పారు” అని మోదీ తెలిపారు. తాము ప్రజలకు సేవకులమని, వారి మనసులు గెలుచుకోవడమే లక్ష్యమని ఆయన అన్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌ చేసి ఎన్డీఏకి ప్రజలు ఘనవిజయం అందించారని అభినందించారు.  జంగిల్‌ రాజ్‌ కాలంలో జరిగిన దోపిడీలు, అక్రమాలు, హింసను ప్రజలు మరచిపోలేరని… ఈసారి వచ్చిన ఫలితాలతో ఎన్నికల కమిషన్‌పై ప్రజలకు మరింత విశ్వాసం పెరిగిందని ప్రధాని తెలిపారు. ఒకప్పుడు బిహార్‌లో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఎన్నికలు మధ్యాహ్నం 3 గంటలకే ముగిసేవని… ఇప్పుడు ప్రజలు ధైర్యంగా, స్వేచ్ఛగా బయటకు వచ్చి రికార్డు స్థాయిలో ఓటింగ్‌ చేసిన పరిస్థితి బిహార్‌ మార్పుకు నిదర్శనమని మోదీ పేర్కొన్నరు. నూతన సంకల్పంతో బీహార్ అభివృద్ధికి పని చేసేందుకు ఈ చరిత్రక విజయం మరింత శక్తినిస్తుందన్నారు. యువశక్తి, మహిళా శక్తి ఉజ్వల భవిష్యత్తు కోసం తగిన అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విజయం వెనుక సీఎం నితీశ్ కుమార్ కృషి ఎంతో ఉందని ప్రశంసించారు. ఎన్డీయే కూటమి సభ్యులకు ప్రధాని అభినందనలు తెలిపారు.

ఏపీలో రెండు రోజుల్లోనే రూ.7.15 లక్షల కోట్ల పెట్టుబడులు

  విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో తొలి రోజు  మొత్తంగా 40 కంపెనీలతో రూ. 3,49,476 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్నాయి. సీఐఐ భాగస్వామ్య సదస్సులో హజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను, ప్రభుత్వ దార్శనికతను ప్రపంచ పారిశ్రామికవేత్తల ముందు ఆవిష్కరించామని తెలిపారు.  త్వరలోనే ఏపీ నుంచి డ్రోన్ ట్యాక్సీలను ప్రారంభిస్తామని, విశాఖలో 'ఆంధ్రా మండపం' నిర్మిస్తామని ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు చేశారు. ఈ సదస్సుకు 72 దేశాల నుంచి 522 మంది విదేశీ ప్రతినిధులతో పాటు మొత్తం 2,500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ అత్యంత సుందరమైన, సురక్షితమైన నగరమని, ఇక్కడి ప్రకృతి వనరులు, బీచ్‌లు, కొండలు ఎంతో ప్రత్యేకమైనవని సీఎం కొనియాడారు. ఈ ఒప్పందాల ద్వారా 4,15,890 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. నిన్న 35 ఒప్పందాల ద్వారా రూ. 3,65,304 కోట్ల పెట్టుబడులు, 1,26,471 ఉద్యోగాలు వచ్చాయని స్ఫష్టం చేశారు.  నిన్న, ఇవాళ కలిపి 75 ఎంఓయూల ద్వారా రూ.7,14,780 కోట్ల పెట్టుబడులు, 5,42,361 ఉద్యోగాలు కల్పించనున్నారు. రిలయెన్స్ ఇండస్ట్రీ సంస్థ ఈడీ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావుతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ సంస్థ అంగీకారం తెలిపింది. ఏఐ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఏపీపై నమ్మకం ఉంచి... భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టిన ముఖేష్ అంబానీకి సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

లులూ గ్రూప్‌తో ఏపీ ప్రభుత్వం ఎంవోయూ

  ఏపీలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ ఇంటర్నేషనల్ గ్రూప్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందుకు సంబంధించి విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో శుక్రవారం సీఎం చంద్రబాబు, లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఆ సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.  అనంతరం  చంద్రబాబు మాట్లాడుతూ గత పాలకులు నిలిపోసిన ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చామని అన్నారు. గూగుల్, ఆర్సెల్లార్ వంటి సంస్థలు విశాఖ రావడం లులూ సంస్థకు సానుకూల అంశమని సీఎం చెప్పారు. మూడేళ్లలోగా మాల్ నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. లులూ మాల్ కేవలం షాపింగ్ మాల్ మాత్రమే కాదని, విశాఖ పర్యాటకానికి దోహదపడుతుందని చెప్పారు.  అలాగే ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా మాల్స్ నిర్వహిస్తున్న లులూ సంస్థ ఇందుకు అవసరమ్యే వ్యవసాయ ఉత్పత్తులను రాష్ట్రంలోని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా లులూ చైర్మన్‌ను కోరారు. ఫుడ్ ప్రాసెసింగ్‌ రంగంలోనూ   లులూ సంస్థ ఒప్పందాలు చేసింది.  మామిడి, జామ పల్ప్‌తో పాటు మసాలా దినుసులు రాష్ట్రం నుంచి సేకరించి ఎగుమతి చేస్తామని లులూ సంస్థ వెల్లడించింది వచ్చే జనవరి నుంచి ఏపీ నుంచి ఎగుమతులు ప్రారంభిస్తామని స్పష్టం చేసింది.  త్వరలోనే లాజిస్టిక్ ప్రొక్యూర్మెంట్ ఎక్స్‌పోర్ట్ కేంద్రాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయనున్నట్టు లులూ గ్రూప్ చైర్మన్, ఎండీ యుసుఫ్ అలీ ప్రకటించారు. విశాఖ నగరంలో లులూ సంస్థ 13.83 ఎకరాలు, 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,066 కోట్లతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ వరల్డ్ క్లాస్ మాల్‌తో 5 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ప్రస్తుతం విశాఖ లో నిర్మించనున్న మాల్ దేశంలో భారత్ లో 9వ దని రాష్ట్రంలో  మొట్టమొదటిదని లులూ సంస్థ వెల్లడించింది.  

జూబ్లీహిల్స్ గెలుపు మరింత బాధ్యతను పెంచింది : సీఎం రేవంత్‌

  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గురించి తను మాట్లాడనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో లేరని హెల్త్ అంతంత మాత్రంగా ఉన్న నాయకుడిని విమర్శించడం భావ్యం కాదని రేవంత్‌రెడ్డి  అన్నారు.  అయితే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అహంకారం పోలేదని, మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం తగ్గించుకోవాలని హితవు పలికారు.  స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు సందర్బంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు తమ బాధ్యతను మరింతగా పెంచిందని రేవంత్‌రెడ్డి అన్నారు.  రెండేళ్లు పూర్తి చేసుకున్న తమ పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారని పేర్కొన్నరు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పోలైన ఓట్లలో దాదాపు 51 శాతం కాంగ్రెస్‌కి, 38 శాతం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌కు, 8 శాతం బీజేపీకి వచ్చాయన్నారు. దీని ద్వారా గత రెండేళ్ల తమ పాలనను ప్రజలు పరిశీలిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  

బీఆర్‌ఎస్ ఓటమి ....కవిత షాకింగ్ ట్వీట్

  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రిజల్డ్స్  వెలువడిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన ట్వీట్  చేసింది. కర్మ హిట్స్‌ బ్యాక్‌’’ అంటూ ఎక్స్‌ వేదికగా ఆమె పేర్కొన్నది. దండం పేట్టే ఎమోజీలతో ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఇవాళ వెలువడిన జూబ్లీ ఫలితాల్లో బీఆర్‌ఎస్  ఓటమి చవి చూసిన సంగతి తెలిసిందే.  ఇటీవల కవిత బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన ఆమె అధినేత కేసీఆర్ మినహా మిగతా నేతలపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్‌ఎస్  అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోలయ్యాయి.

పడిలేచిన కెరటాలు...ఏపీలో పవన్ బీహార్‌లో చిరాగ్

  బీహార్ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వన్  లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ దూసుకెళ్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 29 స్థానాల్లో పోటీ చేసిన ఎల్‌‌జేపీ 19 స్థానాల్లో ముందంజలో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే పోత్తులో భాగంగా పోటీ చేసిన 5  ఐదు ఎంపీలు విజయం సాధించి పట్టు నిలుపుకున్నాది. సరిగ్గా ఐదేళ్ల కిందట దారుణ పరాజయాన్ని చవిచూశారు.  2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు పైగా పోటీ చేసి కేవలం ఒకేఒక స్ధానంలో గెలిచారు. బాబాయ్‌తో విభేధాలు 2021లో పార్టీ చీలిక తర్వాత తట్టుకుని నిలబడ్డారు. ఈ విజయాన్ని ఏపీలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ జనసేన విజయంతో పోలుస్తున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ఎన్డీయేలోని కీలక పార్టీలైన బీజేపీ 43 స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం మరో 49  స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. జేడీయూ 17 స్థానాల్లో గెలిచి మరో 61 స్థానాల్లో లీడ్‌లో ఉంది.  మహాగఠ్‌బంధన్ 31 సీట్లలో ముందంజలో ఉంది.విపక్ష ఆర్జేడీ 26, కాంగ్రెస్ 3, వామపక్షాలు 2 సీట్లలో గెలుపును ఖాయం చేసుకోగా, తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ ఖాతా కూడా తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. ఏఐఎంఐఎం 6, ఇతరుల ఒక స్థానంలో అధిక్యంలో ఉంది.నితీష్ కుమార్ వరుసగా తొమ్మిదో సారి బిహార్ సీఎంగా పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది. నితీష్ ప్రణాణస్వీకారానికి ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ వస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో ఎన్డీయే 205 సీట్లలో జయకేతనం ఎగురవేసింది.  

బీహార్ లో కనీసం బోణీ కొట్టని ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్

అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందన్న సామెత చందంగా తయారైంది ప్రశాంత్ కిశోర్ పరిస్థితి. ఎన్నికల వ్యూహకర్తగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రశాంత్ కిశోర్ గత రెండు దశాబ్దాలుగా అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించి తన వ్యూహాలు, ప్రణాళికలతో  ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చేలా చేశారు. 2014 ఎన్నికలలో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికీ, అలాగే 2019లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికార పగ్గాలు చేపట్టడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలే కారణం. అలాగే పశ్చిమ బెంగాల్ లో మమత సర్కార్ కొలువుదీరడానికీ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలే కారణం అనడంలో సందేహం లేదు. అయితే ఆయన స్వయంగా ఒక రాజకీయ పార్టీ స్థాపించి తన సొంత రాష్ట్రం బీహార్ లో పోటీ చేస్తే.. పాపం ఘోర పరాజయమే ఎదురైంది.  జనసురాజ్ పార్టీ స్థాపించి స్వరాష్ట్రంలో కింగ్ లేదా కనీసం కింగ్ మేకర్ గానైనా నిలుద్దామన్న ప్రశాంత్ కిశోర్ ఆశలకు బీహార్ జనం గండి కొట్టారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలోని మొత్తం నియోజకవర్గాలలో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ వారిలో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు.  రాష్టరంలోని మొత్తం 243 స్థానాల్లో జనసురాజ్ అభ్యర్థులు నిలబడినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు. సోంత పార్టీ జన సురాజ్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు ఇసుమంతైనా పని చేయలేదు.   అనేక పార్టీలకు విజయం అందించిన ప్రశాంత్ కిషోర్ సొంత రాజకీయ ప్రస్థానం తొలి అడుగులోనే చతికిల పడిందని నెట్టింట సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి.  

ఏపీలో రిలయెన్స్ భారీ పెట్టుబడులు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ముందుకొచ్చింది. విశాఖ నగరంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో రిలయెన్స్ ప్రతినిధులు భేటీ అయ్యారు.  రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు ఈ భేటీ అనంతరం ఆ సంస్థ ప్రకటించింది. రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎంఎస్ ప్రసాద్, ఆర్ఐఎల్ సౌతిండియా మెంటార్ మాధవరావు సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సీఎంతే భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.  ఈ సందర్భంగా  ఒక గిగావాట్ సామర్థ్యంతో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన జీపీయులు, టీపీయులు, ఏఐ ప్రాసెసర్‌లతో కూడిన ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న రిలయెన్స్ ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా ఏపీలో ఈ సెంటర్ పనిచేస్తుదన్నారు. ఈ రెండు కేంద్రాలతో ఆసియాలోనే అత్యంత బలమైన ఏఐ నెట్‌వర్క్‌లలో ఒకటిగా రిలయెన్స్ అవతరించనుంది. ఈ ఏఐ డేటా సెంటర్ విద్యుత్ అవసరాల కోసం ప్రత్యేకంగా 6 గిగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును కూడా రిలయెన్స్ నిర్మించనుంది. దీంతో పాటు కర్నూలులో 170 ఎకరాల్లో ప్రపంచ స్థాయి ఆటోమేటెడ్ సౌకర్యాలతో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్రంపై నమ్మకంతో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయెన్స్ అధినేత ముఖేశ్ అంబానీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.  

బీహార్ లో గెలుపు ముంగిట ఎన్డీయే.. చంద్రబాబు హర్షం, అభినందన

బీహార్‌లో ఎన్డీయే కూటమి భారీ, చారిత్రక విజయం ముంగిట నిలవడం పట్ల  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో పాటు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్) తరఫున గెలుపొందిన, ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ  వికసిత భారత్ దార్శనికతకు, ఎన్డీయే ప్రగతిశీల పాలనకు ప్రజలు మరోసారి మద్దతు పలికారని సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా ఆయన పోస్టు చేశారు.  బీహార్‌లో ఎన్డీయే సాధించిన ఈ అద్భుతమైన విజయం, కూటమి అందిస్తున్న ప్రగతిశీల పాలనపై ప్రజలకు ఉన్న అపార విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.    ఈ సందర్భంగా ఆయన నితీశ్ కుమార్‌కు, బీజేపీ, జేడీయూ విజేతలకు   శుభాకాంక్షలు తెలిపారు.  తన పోస్టుకు చంద్రబాబు నరేంద్రమోడీ, నితీష్ కుమార్ పేర్లను కలుపుsp ఎన్ఎఎన్ఐ (NaNi)  #NaNiLandslideInBihar అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.  జాతీయ రాజకీయాల్లో కీలకమైన బీహార్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీయే మిత్రపక్ష నేతగా చంద్రబాబు స్పందించారు.  

సెంచరీకి చేరువలో రాహుల్ గాంధీ ఓటములు...బీజేపీ సైటర్లు

  బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంపై బీజేపీ సైటైర్లు సంధించింది. ఎక్కడ ఎన్నికలు జరిగిన ఓటములకు చిహ్నంగా రాహుల్ గాంధీ మారారని బీజేపీ నేత అమిత్‌ మాలవీయ విమర్శించారు. గత రెండు దశాబ్దాలలో జరిగిన ఎన్నికల్లో రాహుల్ 95 సార్లు ఓడిపోయారని తెలిపారు. 2004 నుంచి  2025 వరకు జరిగిన వివిధ ఎన్నికల్లో కాంగ్రెస్  ఓడిపోయిన  మ్యాప్‌ను కూడా మాలవీయ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరో ఎన్నిక, మరో ఓటమి ఎలక్షన్  ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే మొత్తం రాహుల్‌కే వస్తాయి అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.    బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే  కూటమి దుందుభి మోగించింది. ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ (122)ను దాటేసి, 192 స్థానాల్లో ముందంజలో ఉంది. మరోవైపు మహాగఠ్‌ బంధన్‌ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 84  జేడీయూ 78 ఎల్‌జేపీ 20 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌లో ప్రధాన పార్టీ ఆర్జేడీ 32 సీట్లలో ముందంజలో ఉండగా కాంగ్రెస్‌ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. బిహార్‌లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అధికార దుర్వినియోగంతోనే కాంగ్రెస్ విజయం.. జూబ్లీ ఫలితంపై కేసీఆర్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై ఘనవిజయం సాధించారు. ఈ పరాజయంతో బీఆర్ఎస్ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. జూబ్లీలో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన కేసీఆర్ కాంగ్రెస్  నాయకులు బెదిరింపులకు, అక్రమ మార్గాలకు, అధికార దుర్వినియోగానికీ పాల్పడ్డారనీ, ఆ కారణంగానే కాంగ్రెస్ పార్టీ గెలిచిందనీ అన్నారు.  ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం గడపదాటి రాని కేసీఆర్ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఆరోపణలు, విమర్శలు గుప్పించడంపై పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అధినేతగా ప్రచార బాధ్యతలను మోయాల్సిన కేసీఆర్.. అసలు ప్రచారానికే రాకపోవడం బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు.  ఒక జూబ్లీ ఓటమిపై మీడియా సమావేశంంలో స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్... జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్కి కొత్త ఉత్సాహాన్ని, బలాన్ని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారన్నారు. ఇకపైనా ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  గెలుపు ఓటములు సహజమన్న కేటీఆర్ 2014 నుండి 2023 వరకు జరిగిన 7 ఉప ఎన్నికల్లో అప్పటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్నిట్లో ఓడిపోయిందని గుర్తు చేశారు.  ఈ ఓటమితో పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్న ఆయన ప్రభుత్వాన్ని నిలదీయడంలో సక్సెస్ అయ్యామని చెప్పారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్స్ కు ఆయన ఈ సందర్భంగా కృతజ్ణతలు తెలిపారు. వచ్చే స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. 

బీహార్ లో ఎన్డీయే హవా

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. అయితే ట్రెండ్స్ ను బట్టి ఈ ఎన్నికలలో ఘన విజయంతో ఎన్డీయే రాష్ట్రంలో మరో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయంగా తేలిపోయింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతల ప్రకారం ఎన్డీయే కూటమి అభ్యర్థులు 191 స్థానాలలో ముందంజలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్   49 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనబరుస్తోంది.ఎన్డీయే కూటమిలో బీజేపీ  84 స్థానాల్లోనూ, జేడీయూ 80 స్థానాల్లో  ముందంజలో ఉన్నాయి.   శుక్రవారం(నవంబర్ 14) ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ ఎన్డీయే కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి ఎన్డీయే మెజారిటీ స్థానాలలో ఆధిక్యత ప్రదర్శిస్తున్నది.   కాగా ఈ ట్రెండ్ చూస్తుంటే ఏదో అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు రాజా అన్నారు. ప్రచారంలో మహాఘట్ బంధన్, తేజస్వీ యాదవ్ ల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు.  ఇక కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ బీహార్ ఫలితాలను చూసిన తరువాతైనా పార్టీలో ఆత్మపరిశీలన జరగాల్సి ఉందని వ్యాఖ్యానించారు. కేవలం ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోదనీ, కూర్చుని ఆలోచించాలనీ, ఎం తప్పు జరిగింది? ఎక్కడ జరిగింది అన్న విషయాలపై పార్టీలో విస్తృత చర్చ జరగాలని, వ్యూహాత్మక, సంస్థాగల తప్పులు ఏమిటన్నదానిపై అధ్యయనం జరగాలని శశిథరూర్ అభిప్రాయపడ్డారు.   ఇక బీహార్ ఎన్నికలలో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జన సురాజ్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. ఈ పార్టీ మొత్తం స్థానాలలో పోటీ చేసినా ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా ప్రభావం చూపలేకపోయింది. ఆ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా విఫలమయ్యాయి. 

వెనుకంజలో తేజస్వీ యాదవ్... లాలూ కంచుకోట బద్దలు

  బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో  మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన సొంత నియోజకవర్గం రాఘోపూర్‌లో వెనుకంజలో ఉన్నారు. 10 రౌండ్లు పూర్తయ్యేసరికి ఆయన 3,230 ఓట్ల తేడాతో రెండో స్థానంలో ఉన్నారు. ఈ స్థానంలో ప్రస్తుతం బీజేపీ అభ్యర్ధి సతీష్ కుమార్ అధిక్యంలో ఉన్నారు. ఆర్జేడీకి, లాలూ కుటుంబానికి కంచుకోటగా పేరొందిన రాఘోపూర్ నియోజకవర్గంలో తాజా పరిణామాలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి తర్వాత 2015 నుంచి తేజస్వి యాదవ్ ఇక్కడి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2020లో తేజస్వి ఇదే నియోజకవర్గం నుంచి 38,000 ఓట్ల మెజారిటీతో గెలిచి తన బలాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఈ స్థానం విషయంలో వెనుకంజలో ఉండటం అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. ఈసారి బీజేపీ వ్యూహాత్మకంగా సతీశ్ కుమార్ యాదవ్‌ను రంగంలోకి దించింది. సతీశ్ కుమార్ కూడా రాఘోపూర్‌లో గణనీయమైన ఆధారాన్ని కలిగి ఉన్నారు. ముఖ్యంగా, 2010లో జేడీయూ తరఫున పోటీ చేసి రబ్రీ దేవిని ఓడించడం ఆయనకు పెద్ద గుర్తింపు తీసుకువచ్చింది. ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని ‘జన్ సురాజ్’ పార్టీ కూడా అభ్యర్థిని నిలబెట్టగా, తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ స్థాపించిన ‘జనశక్తి జనతా దళ్’ తరఫున ప్రేమ్ కుమార్ పోటీలో ఉండటం గమనార్హం. ఈ బహుముఖ పోటీ వల్ల ఓట్లు విపరీతంగా చీలుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.