ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.  విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది.  పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా  ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన ప‌లువురిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య,  రామ‌చంద్ర‌నాయ‌క్‌,  రాందాస్ పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు  దాస్యం విన‌య్ భాస్క‌ర్,  మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోద‌య్యాయి. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని గౌర‌వించాల‌ని సూచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గ‌మ‌నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోని  జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం జరిగిన శక్తిమంతమైన పేలుడులో   12 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులలో అత్యధికులు న్యాయవాదులేనని తెలుస్తోంది.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.   ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఈ  దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చేయబోయిన దాడిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. టీటీపీ నాయకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రతి లైబ్రరీలోనూ అందెశ్రీ నిప్పుల వాగు.. రేవంత్

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ప్రజానీకం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.   అంతిమయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.   అనంతరం   మీడియాతో మట్లాడిన రేవంత్ రెడ్డి.. ఓ కళాకారుడిగా, రచయితగా అందెశ్రీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని చెప్పిన రేవంత్ రెడ్డి, అందెశ్రీ పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారు. ఆయనను కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు.  అందెశ్రీ రాసిన ప్రతీ పాట తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే ఆయన రాసిన  జయ జయహే తెలంగాణ  గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందెశ్రీ పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే ఆయన పాటల సంకలనం  నిప్పుల వాగు  ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి మార్గదర్శకంగా పయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి అందుకే నిప్పుల వాగు పుస్తకాన్ని తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో  అందుబాటులో ఉంచుతామన్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన పాటలతో అలుపెరుగని కృషి చేసిన అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

ఢిల్లీ పేలుడు కేసు...ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

    పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారు మొదట ఎండీ సల్మాన్ సొంతం, కానీ నదీమ్ కు అమ్మివేయబడింది, తరువాత అతను దానిని ఫరీదాబాద్ లోని రాయల్ కార్ జోన్ అనే యూజ్డ్ కార్ డీలర్ కు విక్రయించాడు. తరువాత దీనిని తారీఖ్ కొనుగోలు చేశాడు. తారీఖ్ ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు కానీ పుల్వామాకు చెందినవాడు. 2900 కిలోల ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న డాక్టర్ ముజ్జామిల్ షకీల్ కూడా ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు మరియు పుల్వామాకు చెందినవాడు కూడా. ఇవన్నీ ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది.  డాక్టర్ ముజ్జామిల్ ను అరెస్టు చేసి ఎర్రకోట దాడిని నిర్వహించిన తర్వాత తారీఖ్ భయపడినట్లు కనిపిస్తోంది, బహుశా ఇది ఒక ఫిదాయీన్ చర్య కావచ్చు.  మరోవైపు పేలుడు కేసును కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి  అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై ఏన్ఐ అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైంది.  లక్నోకు చెందిన డాక్టర్ షాహీనా షాహిద్ ను అదుపులోకి తీసుకున్నారు  

ఢిల్లీ బ్లాస్ట్.. బీహార్ ఎలక్షన్స్!

ఢిల్లీలో చాందినీ చౌక్, లాల్ ఖిలా, నయి దిల్లి రైల్వే స్టేషన్ కు అతి దగ్గర గా ,  పార్లమెంట్ కు కూడా పెద్దగా దూరం లేని ప్రాంతం లో కారు లో భారీ పేలుడు పదార్ధాలతో కూడిన ఆత్మహుతి దాడి జరిగింది.  కేంద్ర దర్యాప్తు సంస్థలు తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే తేలిందని చెబుతున్నాయి.   ఇక  బీహార్ లో అత్యంత కీలక మైన  రెండో, చివరి దశ పోలింగ్ జరుగుతోంది.  ఈ రెంటికీ లింక్ లేదు.. డిల్లి లో జరిగిన పేలుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద కుదుపునకు లోను చేసింది.  పహాల్ గావ్ ఘటన జరిగిన తరువాత.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు అత్యంత అప్రమత్తత తో పనిచేస్తున్నాయి అన్నది వాస్తవం.  అయినా వాటి నిఘా నీడ ను తప్పించుకొని డిల్లి లో కొన్ని కిలోల పేలుడు మెటీరియల్ ను తెచ్చి పేల్చడాన్ని నిఘావైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.  ఇకపోతే బీహార్ ఎన్నికల పై ఈ బ్లాస్ట్ ప్రభావం  ఉంటుందా? అన్నదో ప్రశ్న. సోమవారం  రాత్రి 7.30 నిముషాలకు జరిగిన బ్లాస్ట్ దేశం లో నిముషాల్లో పాకి పోయింది.. దీనికంటే ముందు ఒక  విషయం చెప్పుకోవలసి ఉంటుంది. 1991 లో రాజీవ్ గాంధీ పై మానవ బాంబుదాడి జరిగింది.. ఆ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు దేశం లో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి . దాదాపుగా కాంగ్రెస్ కు స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని ఎన్నికలు అవి. రాజీవ్ గాంధీ హత్య  అనంతరం   జరిగిన ఫేజ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. రాజీవ్ హత్యకు ముందు  జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ కు చాలా చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు ప్రజెంట్ బీహార్ ఎన్నికలకు వద్దాం..  తెల్లారి రెండోది చివరిది అయిన ఎన్నికల ఫేజ్.. మొదటి ఫేజ్ లో ఎన్ డీ ఏ కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనేది పబ్లిక్ టాక్ గా ఉంది.. రెండో ఫేజ్ పై దాని ప్రభావం పడి ఆర్ జేడి కి ఒక 135 స్థానాలు గ్యారంటీగా వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.. ఇప్పటి బ్లాస్ట్ ప్రభావం , దాని టైమింగ్ ఎన్నికల పై పడుతుందా అనేది పోల్ స్టర్స్ ను తొలుస్తున్న ప్రశ్న. పోలింగ ప్రారంభం కావడానికి కేవలం 12 గంటల ముందు, అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావం బీహార్ లో రెండో దశ పోలింగ్ పై  పడే అవకాశం కేవలం ఐదుశాతం మాత్రమే ఉంటుందంటున్నారు. ఆ ప్రభావం కూడా పట్టణాలూ, నగరాలకే పరిమితమౌతుందనీ అంటున్నారు. అయితే ఆ ఐదు శాతం ప్రభావమే..  సీట్ల లో భారీ తేడాను తెస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఘటబంధన్ ఆ ప్రభావం ను అడ్డుకోగలిగితే గెలుపు వాకిట్లో బోల్తా పడే పరిస్థితి నుంచి కూటమి బయటపడుతుంది

కన్న కొడుకును హతమార్చిన తండ్రి

  దురలవాట్లకు బానిసలయిన పిల్లలను భరించే స్థితి ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు డ్రగ్స్ మద్యం యువతరం జీవితాలను నాశనం చేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేస్తోంది దీంతో తల్లిదండ్రులు క్షణికావేశంలో కన్నా కొడుకులను కడతేర్చడానికి వెనుకాడడం లేదు. అలా విశాఖలో మద్యానికి బానిసైన  కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు(60) హతమార్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో  ఈనెల ఆరవ తేదీన  మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును   కర్రతో బలంగా తలపై కొట్టడంతో  మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని  ఆ మరుసటి రోజు  జోడిగుడ్లపాలెం  స్మశాన వాటికలో పూడిచిపెట్టాడు. మృతుడు ప్రసాదు  కు 2019లో వివాహం కాగా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య వై.రాజీ విజయవాడలో నివసిస్తున్నారు. విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు  ఆరి లోవ పోలీసులు దర్యాప్తు చేయగా  నిందితుడు కన్న తండ్రి లక్ష్మణరావు గా నిర్ధారించారు.  

నెల్లూరులో లారీ బీభత్సం..ముగ్గురు స్పాట్ డెడ్

  నెల్లూరు ఎన్టీఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న కంటైనర్‌ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన లారీ రోడ్డు పక్కన గల షాపులతో పాటు టాటా ఏస్,  3 బైక్‌లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది.ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.  . క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  పోలీసులు  సహాయక చర్యలు చేపట్టారు.ఎప్పుడూ చాలా రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.  

బీహార్ లో ప్రశాంతంగా పోలింగ్.. అంచనాలకు మించి ఓటెత్తిన జనం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో , చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌  సాయంత్రం 5 గంటల వరకు కొనగుతుంది.  ఈ విడతలో రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.. ఈ నెల 6న తొలి విడతలో 18 జిల్లాల్లో మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరిగిన విషయం తెలిసిందే. మలి విడతలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 45,399గా ఉన్నాయి. 3 కోట్ల 70 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు . 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.   ఉదయం 9 గంటలకే 14.55 శాతంగా నమోదైన పోలింగ్ .. మధ్యాహ్నం ఒంటి గంట సమయానికల్లా దాదాపు 50 శాతానికి చేరుకుంది. ఈ విడతలో తొలి దశకంటే అధికంగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. అయితే భారీ పోలింగ్ ఏ కూటమికి అనుకూలం అనే విషయంపై పలు రకాల అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.  కాగా మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కిషన్ గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం నమోదు కాగా,  గయాలో 50.95, జుమాయిలో 50.91, బంకాలో 50.07శాతం ఓటింగ్ నమోదైంది. ఇక మధుబనిలో అయితే అత్యల్పంగా 43.39శాతం ఓటింగ్ నమోదైంది.   రెండో విడత పోలింగ్ లో ఇప్పటి వరకూ ఓటు వేసిన ప్రముఖులలో జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా, కేంద్ర మంత్రి జితన్ రామ్ మంఝా, ఎంపీ పప్పుయాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ పరిశ్రమల శాఖ మంత్రి నితిష్ మిశ్రా, జుమాయ్ బీజేపీ అభ్యర్థి శ్రేయేషి సింగ్, ఇండిపెండెంట్ అభ్యర్థి జ్యోతి సింగ్, బీజేపీ సీనియర్ నాయకుడు షహనవాజ్ హుస్సేన్, కాంగ్రెస్ నాయకుడు అజీత్ శర్మ తదితరులు ఉన్నారు.

ఢిల్లీ పేలుడు సూత్రధారులను వదిలే ప్రశ్నే లేదు.. మోడీ

ఢిల్లీఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి పాల్పడిన కుట్రదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని   హెచ్చరించారు. సోమవారం (నవంబర్ 10) జరిగిన ఈ ఘటనలో13 మంది మరణించగా, 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్‌లో ఉన్న ప్రధాని మోదీ... థింపూలో మాట్లాడుతూ  ఈ పేలుడు వెనుక ఉన్న కుట్రను మన దర్యాప్తు సంస్థలు ఛేదిస్తాయి. సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.   ఢిల్లీ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, ఎంతో భారమైన హృదయంతో ఇక్కడికి వచ్చానని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.  బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.  పేలుడు ఘటనపై దర్యాప్తు చేస్తున్న అన్ని ఏజెన్సీలతో తాను రాత్రంతా టచ్‌లోనే ఉన్నానని ప్రధాని వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌.. పలువురు నక్సల్స్ మృతి?

ఛత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, నక్సల్స్ మధ్యా ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులోని బీజాపూర్   జిల్లాలో మంగళవారం (నవంబర్ 11) ఉదయం నుంచి జరుగుతున్న ఎన్ కౌంటర్ లో పలువురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు ధృవీక రించారు.   పలువురు నక్సల్స్ మరణించారనీ, అయితే ఎంత మంది మరణించారన్న విషయంలో స్పష్టత లేదనీ అన్నారు.  కాగా ఆదివారం (నవంబర్ 9)న గురియాబంద్ జిల్లాలో కూడా మావోలు, పోలీసుల మధ్య కాల్పులు జరిగాయి. ఆ ఎన్ కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సలైట్లే ఇప్పుడు బీజాపూర్ వద్ద ఎన్ కౌంటర్ లో ఉన్నారని అంటున్నారు.  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.  

ఆత్మాహుతి దాడే.. ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ

ఢిల్లీ  బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్యాప్తు సంస్థలు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఆత్మాహుతి దాడేనని ప్రాథమింకంగా నిర్థారణకు వచ్చారు.  సోమవారం(నవంబర 10) ఫరీదాబాద్ లో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను భద్రతా బలగా లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అరెస్టు నుంచి తప్పించుకున్న  ఆ ముఠాకు చెందిన వ్యక్తే బాంబు పేలుడుకు కారణమని  ప్రాథమిక దర్యాప్తులో తేలింది. సహచరులు దొరికిపోవడంతో తాను కూడా పట్టుబడతాననే ఆందోళనకు గురైన నిందితుడు.. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి జరిపినట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.   ఫరీదాబాద్ లో పట్టుబడిన అనుమానిత ఉగ్రవాదుల వద్ద స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల వంటివే  పేలుడు బ్లాస్ట్ లో ఉపయోగించినట్లు   గుర్తించింది. డిటోనేటర్లు, అమ్మోనియం నైట్రేట్ తో పాటు ఇంధనం ఉపయోగించి పేలుడు జరిపినట్లు దర్యాప్తు సంస్థలు నిర్థారణకు వచ్చాయి. అలాగే పేలుడుకు పాల్పడిన వ్యక్తిని  డాక్టర్ ఉమర్‌ మహ్మద్‌ గా పోలీసులు గుర్తించారు. సోమవారం పట్టుబడ్డ ఉగ్రవాద ముఠాకు, ఉమర్ మహ్మద్ కు సంబంధం ఉందని చెబుతున్నారు. పేలుడు జరిగిన సమయంలో కారులో ఉమర్‌తోపాటు ఇంకెవరైనా ఉన్నారా? అనే విషయం తెలుసుకోవడానికి దర్యాగంజ్, పహార్‌గంజ్ ప్రాంతాలలోని హోటళ్లు, లాడ్జిల ఎంట్రీలను దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేస్తున్నాయి. 

సిట్ ఎదుటకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి!

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి మంగళవారం (నవంబర్ 11) సీట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అలిపిరి వద్దనున్న సిట్ కార్యాలయానికి వచ్చిన ధర్మారెడ్డిని సిట్ డీఐజీ మురళీ లాంబ విచారించారు. కాగా ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారరెడ్డిని కూడా సిట్ విచారణకు హాజరు కావాల్సిందిగా ఆన్ లైన్ లో నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల మేరకు ఈ నెల 13న అంటే గురువారం వైవీసుబ్బారెడ్డి సిట్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున ఆ రోజు విచారణకు హాజరు కాలేనంటూ వైవీసుబ్బారెడ్డి సిట్ కు సమాచారం అందించినట్లు తెలుస్తున్నది. సిట్ ఎదుట విచారణకు హాజరు అయ్యేందుకు తనకు వారం రోజుల వ్యవధి కావాలని వైవీసుబ్బారెడ్డి కోరినట్లు తెలుస్తున్నది. ఇలా ఉండగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వ్యవహారంలో సిట్ ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. వారిలో కొందరు బెయిలుపై విడుదలయ్యారు కూడా.   ఇలా ఉండగా సిట్ ఇప్పటికే లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి పాత్రపై అనుమానాలున్నాయని పేర్కొంటూ సిట్ హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఆయనను విచారణకు రావాల్సిందిగా సమాచారం ఇవ్వడం, అందుకు ఆయన మరింత గడువు కోరాలని అడగడం ప్రాధ్యాన్యత సంతరించుకున్నాయి.

ఢిల్లీ పేలుడుపై అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం

ఎర్రకోట సమీపంలో  సోమవారం (నవంబర్ 10) జరిగిన  పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం (నవంబర్ 11)  ఉన్నత స్థాయి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఘటనపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు పురోగతిపై అధికారుల నుంచి పూర్తి వివరాలను అమిత్ షా తెలుసుకున్నారు. భద్రతా చర్యలను మరింత బలపరిచే దిశగా ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దర్యాప్తు పురోగతిలో ఉందనీ, ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవనీ అమిత్ షా చెప్పారు. ఈ కీలక సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో  డైరెక్టర్ తపన్ కుమార్ డేకా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చా, జాతీయ దర్యాప్తు సంస్థ  డైరెక్టర్ జనరల్ సదానంద్ వసంత్ దాఠే హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇలా ఉండగా  ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో  ఈ పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న ఎర్రకోట మెట్రో స్టేషన్ ను అధికారులు మూసి వేశారు.  ఈ ఘటన అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఫోరెన్సిక్,ఎన్ఐఏ, ఎన్ఎస్ జీ బృందాలు దర్యాప్తు ప్రారం భించా యి. భద్రతా కారణాల వల్ల ఎర్రకోట మెట్రో స్టేషన్ కు 500 మీటర్ల పరిధిలో నో ఎంట్రీ జోన్ ఏర్పాటు చేశారు. ఎర్రకోట మెట్రో స్టేషన్ మూసివేత తాత్కాలికమేనని అధికారులు తెలిపారు. త్వరలోనే ఈ మెట్రో స్టేషన్ ను తెరుస్తామన్నారు. కీలక ఆధారాల సేకరణకు ఇబ్బందులు తతెల్తకూడాదన్న ఉద్దేశంతో తాత్కాలిక మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 

జూబ్లీ బైపోల్ చాలా చిన్న ఎన్నిక.. కిషన్ రెడ్డి మాటల మర్మమేంటి?

జూబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. చెదురుమదురు సంఘటనలు వినా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం ఎంత? ఏ పార్టీ పట్ల జనం మొగ్గు చూపే అవకాశం ఉంది వంటి ప్రశ్నలకు కాసేపు పక్కన పెడితే.. పోలింగ్ ప్రారంభం కావడానికి గంటల ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ఓ వ్యాఖ్య.. ఈ ఉప ఎన్నికను బీజేపీ సీరియస్ గా తీసుకోలేదా? లేక.. ఓటమిని అంగీకరించేసిందా? అన్న చర్చ మొదలైంది. అసలు మొదటి నుంచీ కూడా జూబ్లీ ఉన ఎన్నిక విషయంలో బీజేపీ అసలు రేసులో ఉందా? లేక ఆటలో అరటిపండు చందమేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం మాదే అంటున్న బీజేపీ.. ఈ ఉప ఎన్నికలో విజయం ద్వారా తమ బలాన్ని ప్రదర్శించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుందని అంతా భావించారు. కానీ అభ్యర్థి ఎంపికలో జాప్యం నుంచి ఎన్నికల ప్రచారం వరకూ బీజేపీ జూబ్లీ బైపోల్ ను చాలా లైట్ గా తీసుకుందని తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైంది.  ఒకపక్క జూబ్లీ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డుతుంటే.. మరోపక్క సరిగ్గా పోలింగ్ కు గంటల ముందు ఇది చాలా చిన్న ఎన్నిక అంటూ బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం.. బీజేపీ ఓటమి అంగీకర ప్రకటనలా ఉందంటున్నారు పరిశీలకులు.  అంతే కాకుండా.. బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య అవగాహన ఉందంటూ కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేవిగా ఉన్నాయం టున్నారు.   

ఆత్మాహుతి దాడేనా?

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం (నవంబర్ 10) సంభవించిన పేలుడు ఆత్మాహుతిదాడి అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  పేలుడు ఘటన జరిగిన ఎర్రకోట పరిసరాలలో బుల్లెట్ దొరకడం సంచలనంగా మారింది. అదలా ఉంటే.. ఈ పేలుడు ఘటన ఆత్మాహుతి దాడిగా దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.  గుజరాత్ లో అనుమానితులను అరెస్టు చేసిన సమయంలో తప్పించుకున్న ఉగ్రవాదే ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఎన్ఐఏ అనుమానిస్తోంది.   ఇలా ఉండగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి పుల్వామాలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.  పోలీసులు అరెస్టు చేసిన ఆమిర్ రషీద్, ఉమర్ రషీద్ సోదరులలో  ఒకడైన అమీర్ పేలుడు జరిగిన  కారు కీ తీసుకుంటున్న ఫొటోలు బయటకు రావటంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు రిజిస్టర్ అయి ఉన్న తారిఖ్ ఎవరో తమకు తెలియదని ఈ సోదరుల కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రమాదానికి కారణమైన కారు ముగ్గురు చేతులు మారినట్టు తెలుస్తోంది. అదలా ఉంటే.. ఢిల్లీ పేలుడు ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా) కింద కేసు నమోదైంది.   ఎక్స్ ప్లోజివ్స్ యాక్ట్ సహా పలు కీలక సెక్షన్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.   జైషే మహమ్మద్ ఉగ్రసంస్థకు చెందిన డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడి చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఉమర్ మృతదేహానికి డీఎస్ఏ టెస్టులు చేస్తున్నారు. ఫరియాబాద్లో ఆర్డీఎక్స్, ఆయుధాల స్వాధీనం కేసులో ఉమర్ పరారిలో ఉన్నాడని తెలిపారు.కాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో   ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు   విడుదల చేశారు.   

ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రాణనష్టం

ఇటీవల వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ప్రయాణమంటేనే వెన్నులో వణుకు పుట్టేలా చేస్తున్నాయి. కర్నూలు బస్సు ప్రమాద ఘటన వంటిదే మరో సంఘటన మంగళవారం ఉదయం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం తప్పింది. వివరాలిలా ఉన్నాయి.  హైదరాబాద్ నుంచి కందుకూరు వెడుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్, విజయవాడ జాతీయరహదారిపై  చిట్యాల మండలం పిట్టంపల్లి వద్దు మంటల్లో చిక్కుకుంది. ముందుగా బస్సులో పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి.. ప్రయాణీకులను కిందకు దించేశాడు.  దీంతో పెను ప్రమాదం తప్పి.. ప్రయాణీకులంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. మరో ప్రైవేట్ ట్రావెల్ బస్సు మంటల్లో దగ్ధమైంది. ఈ ఘటనకు ముందు బస్సును డ్రైవర్ చౌటుప్పల్ వద్ద టీ బ్రేక్ కోసం ఆపాడు. మళ్లీ బస్సు బయలుదేరిన పది నిముషాలకే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఘటన జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. డ్రైవర్ అప్రమత్తత కారణంగానే తాము క్షేమంగా బయటపడగలిగామని వారు చెబుతున్నారు.