నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

  ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే, అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  ఆయన  మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా, అపకీర్తి కలిగించాలన్నా  ఉద్దేశ్యం నాకు  ఎప్పటికీ లేదు. నా వ్యాఖ్యల వల్ల ఏవైనా అనుకోని అపోహలు కలిగినట్లయితే, దానికి నేను చింతిస్తున్నాను. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఈ వివరణతో నాగార్జున కుటుంబంపై ఉన్న అపోహలు తొలగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రేపు నాంపల్లి స్పెషల్ కోర్టు లో నాగార్జున పరువు నష్టం పిటిషన్ పై విచారణ జరగనున్నది. విచారణ కు ఒక రోజు ముందు మంత్రి కొండ సురేఖ... నాగార్జునను ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో  పోస్ట్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ... హీరో నాగచైతన్య, సమంత విడాకుల అంశంపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు నాగార్జున తీవ్రంగా స్పందించారు. ఆమెపై పరువు నష్టం దావా  వేశారు. మరోవైపు నాగచైతన్య, సమంత సైతం తమ విడాకులు పరస్పర అంగీకారంతో తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, తమ పేర్లను అనవసరంగా రాజకీయ వివాదాల్లోకి లాగవద్దని నాగార్జున విజ్ఞప్తి చేశారు.  

తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ

  తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతుంది.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది.  మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,367 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,369 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న  శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.30 కోట్ల రూపాయలు వచ్చిందని  టీటీడీ అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీ పేలుడు మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

  ఢిల్లీలో జరిగిన పేలుడులో మరణించిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా రూ.10 లక్షల  ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. శాశ్వతంగా వికలాంగులైన వారికి రూ. 5లక్షలు తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2లక్షలు అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్సను అందిస్తామని తెలిపారు. బాధితులందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.  ఈ పేలుడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా సంతాపం తెలియజేశారు.ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అక్రమ ఆస్తుల కేసులో జగన్‌కు చుక్కదెరు

  అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ నెల 21 న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని  సీబీఐ కోర్టు ఆదేశించింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.  కొంత సమయం ఇస్తే వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతారని చెప్పారు. ఇందుకోసం వారం రోజులు సమయం ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది కోరగా.. ఈనెల 21 వరకు న్యాయస్థానం సమయం ఇచ్చింది. యూరప్ పర్యటనకు వెళితే ఈ నెల 14వరకు కోర్టుకు హాజరు కావాలని గతంలోనే సీబీఐ కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ చార్జిషీట్

  తెలంగాణ రాష్ట్రంలో నిషేధిత సిపిఐ మావోయిస్ట్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలపై దర్యాప్తును వేగవంతం చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ, మూడు వేర్వేరు కేసుల్లో 21 మంది మావోయిస్ట్ కార్యకర్తలపై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎన్ఐఏ వెల్లడించిన ప్రకారం, ఈ చార్జ్ షీట్లు ఈరోజు హైదరాబాద్‌లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ముందు దాఖలు చేశారు. అరెస్టయిన 20 మందితో పాటు ఒక పరారీలో ఉన్న వ్యక్తిపైన కూడా ఉగ్రవాద నిరోధక చట్టం (UAPA), ఆయుధ చట్టం, పేలుడు పదార్థాల చట్టం మరియు BNSSలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపుతూ మూడు వేర్వేరు చార్జిషీట్లను ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేశారు. ఎన్ ఐ ఏ దర్యాప్తులో భాగంగా, నిందితులు కరిగుట్ట కొండ ప్రాంతాన్ని మావోయిస్టు కార్యకలాపాలకు సురక్షిత స్థావరంగా మార్చేందుకు కుట్ర పన్నినట్లుగా తేలింది.. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, హింసాత్మక దాడులు జరపడం ద్వారా దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, మరియు రాజ్యాంగ వ్యవస్థను దెబ్బతీయడం ఈ కుట్ర ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు.  సిపిఐ మావోయిస్టు సీనియర్ కార్యకర్తలు పన్నిన మావోయిస్టు కుట్రలో 21 మంది నిందితులు చురుగ్గా పాల్గొన్నట్లు తేలింది. ఈ సంవత్సరం మే నెలలో అదుపులోకి తీసుకున్న కుంజం లక్కా, మరిగల సుమతి, కర్తం జోగా, కర్తం భీమా, హేమల సుక్కి తదితరులు కీలక పాత్ర పోషించినట్లుగా అధికారులు గుర్తించారు.  తెలంగాణ పోలీసులు ములుగు జిల్లాలోని మూడు వేర్వేరు ప్రదేశాల్లో వీరందరినీ అదుపు లోకి తీసుకుని వారి వద్ద నుండి  ఆటోమేటిక్ అస్సాల్ట్ రైఫిళ్లు, మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం మరియు ఇతర నేరారోపణ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర పోలీసుల నుండి ములుగు జిల్లాలో నమోదైన మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్‌లను  ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. సిపిఐ (మావోయిస్టు) తన పునరుజ్జీవన ప్రయత్నాలను అడ్డుకోవడం లక్ష్యంగా దర్యాప్తును కొనసాగిస్తోంది.

జూబ్లీహిల్స్ ‌లో అత్యల్ప పోలింగ్ నమోదు

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఫైనల్ పోలింగ్ శాతం 48.43%  నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో హైదరాబాదీలు వెనకడుగు వేస్తున్నారు. ఇది మరోసారి నిరూపించారు. సెలవు ఇచ్చి రండి వచ్చి తమకు నచ్చిన నాయకులను ఎన్నుకొమని చెప్పిన జూబ్లీ ఓటర్ల ఆమడ దూరం పోయారు. దేశంలో 8 స్థానాలకు ఉప ఎన్నిక జరగగా అత్యల్పంగా జూబ్లీహిల్స్‌లోనే 48.43 శాతం నమోదు అయింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యం సమస్యతో మృతి చెందటంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఓట్ల లెక్కింపు ఈ నెల 14న జరగనుంది. జూబ్లీహిల్స్‌ బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులు నిలిచారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు.  ప్రధానంగా పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్నాట్లు తెలుస్తోంది.  

జూబ్లీహిల్స్‌లో హస్తానిదే హవా...తేల్చిచేసిన ఎగ్జిట్ పోల్స్‌‌

  తీవ్ర ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశముందని ఎక్కువ సర్వే సంస్థలు చెబుతున్నాయి. మరోవైపు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వేళ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేసినందుకు ఆమెను, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు.. ఉప ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం 6గంటల వరకు క్యూలో ఉన్నవారికి.. ఓటు వేసేందుకు అధికారులు ఛాన్స్ ఇచ్చారు చాణక్య స్ట్రాటజీస్‌  కాంగ్రెస్‌ 46%, బీఆర్‌ఎస్ 43%, బీజేపీ 6% ఓట్లు పీపుల్స్‌ పల్స్‌: కాంగ్రెస్‌ 48%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 6% ఓట్లు నాగన్న సర్వే: కాంగ్రెస్‌ 47%, బీఆర్‌ఎస్ 41%, బీజేపీ 8% ఓట్లు ఆపరేషన్‌ చాణక్య: 8 వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌దే విజయమని సర్వే JANMINE సర్వే: కాంగ్రెస్‌కు 42.5%, బీఆర్‌ఎస్ 41.5%, బీజేపీ 11.5% ఓట్లు ఆరా మస్తాన్ సర్వే :  కాంగ్రెస్‌  47.49% బీఆర్‌ఎస్ 39.25%, బీజేపీ 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?

బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది..  ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం   66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122. ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ  చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి.  పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది.   మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది.  ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది.  ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది.  అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది. 

ముగిసిన జూబ్లీ పోలింగ్... ఎగ్జిట్ పోల్స్‌‌పై ఉత్కంఠ

  జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో సాయంత్రం 5  గంటల వరకూ 47.16 శాతం నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయా పోలింగ్ బూత్‌లలో ఓటర్లు తమ హక్కును వినియెగించుకుంటున్నారు. మరో అరగంట పోలింగ్ అవకాశం ఉండడంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తుది ఫలితం ఈ నెల 14వ తేదీన తెలుస్తుంది.  పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్‌ను ప్రకటించేందుకు రెడీగా ఉన్నాయి.. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ ఉంది. అనేక సంస్థల అంచనాల ప్రకారం.. అధికార కాంగ్రెస్ పార్టీ లేదాబీఆర్‌ఎస్ ల మధ్యే గెలిచే ఛాన్స్ ఉంది. తక్కువ పోలింగ్ శాతం కారణంగా పోల్స్ అంచనాలలోనూ కొంత భిన్నత్వం కనిపించనుంది. 

"ఖి" లేడి టెర్రరిస్ట్ డాక్టర్‌ షాహిన్‌

  ఢిల్లీ ఎర్రకోట వద్ద బాంబు పేలుడు కేసులో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళ డాక్టర్‌ షాహిన్‌ ఫోటో బయటికొచ్చింది. అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అల్ ఫలాహ్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆమె ఉగ్రవాద ఆపరేషన్‌‌కు నిధులు సమకూర్చడం, ఆపరేషన్‌కు సులభతరం చేయడంలో కీలకంగా పనిచేసినట్లు గుర్తించారు. దేశంలో జైషే మహమ్మద్‌ కోసం మహిళా నియామకాలను షాహీన్ పర్యవేక్షిస్తున్నట్లు నిఘా వర్గలు తెలిపాయి.   ఈ జమాత్‌ ఉల్‌ మొమినాత్‌ విభాగానికి మసూద్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విభాగంలో డా.షాహిన్‌కు కీలక బాధ్యతలు అందించినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉమెన్ విభాగాలు స్థాపించి, వారి నియామకాలు చేపట్టడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి.డా. షాహిన్‌ షాహిద్ లఖ్‌నవూలోని  లాల్‌బాగ్‌ నివాసి. ఫరీదాబాద్‌లోని మాడ్యూల్‌పై ఆపరేషన్‌ నేపథ్యంలో ముగ్గురు వైద్యులు అదీల్‌ అహ్మద్, ముజమ్మిల్‌ షకీల్, షాహిన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ముజమ్మిల్‌తో షాహిన్‌కు దగ్గర సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలను నిల్వ చేసేందుకు అనుమానితులు ఉపయోగించిన కారు మహిళా డాక్టర్‌ పేరు మీదే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముజమ్మిల్‌ విచారణ నేపథ్యంలో ఈ మహిళా డాక్టర్‌ విషయం తెలియగా.. అధికారులు ఆమెను కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో విచారణ కోసం  ఆమెను శ్రీనగర్‌కు తరలించారు. ఢిల్లీ పేలుళ్ల ఘటనలో ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్న దర్యాప్తు బృందం..  ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డాక్టర్ ఉమర్ మహమ్మద్ ఫొటోను పోలీసులు తొలిసారిగా విడుదల చేశారు. ఈ భీకర పేలుడులో 12 మంది మృతి చెందగా, 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.  

ఎంఎస్ఎంఈల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు : సీఎం చంద్రబాబు

  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఆలోచనలతో ముందుకు వస్తే పారిశ్రామిక యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లోనూ ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.  విద్యుత్తు, నీటి సరఫరా, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలను ఈ పార్కుల్లో కల్పిస్తూ పెట్టుబడులకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ముఖ్యమంత్రి ప్రారంభించారు. దీంతో పాటు 17 జిల్లాల్లో ఏర్పాటు చేసిన మరో 49 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. 868 ఎకరాల విస్తీర్ణంలో రూ.873 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులను పరిశ్రమల శాఖ చేపట్టింది.  పారిశ్రామిక పార్కుల్లో భూమి పొందిన 1597 ఎంఎస్ఎంఈ సంస్థలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు సీఎం చేశారు. వీటితో పాటు రాష్ట్రంలో రూ.25,256 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటైన 38 వివిధ మెగా పారిశ్రామిక యూనిట్లను కూడా ముఖ్యమంత్రి వర్చువల్ గా  ప్రారంభించారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లోని పారిశ్రామిక పార్కుల్లో ఏర్పాటు చేసిన పారిశ్రామిక వేత్తలతోనూ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసు నమోదు

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సంద‌ర్భంగా ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని ఉల్లంఘించిన ప‌లువురిపై హైద‌రాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐల‌య్య,  రామ‌చంద్ర‌నాయ‌క్‌,  రాందాస్ పై మ‌ధురాన‌గ‌ర్ పోలీస్‌స్టేష‌న్‌లో రెండు కేసులు , మాజీ ఎమ్మెల్యేలు  దాస్యం విన‌య్ భాస్క‌ర్,  మెతుకు ఆనంద్‌పై బోర‌బండ పోలీస్ స్టేష‌న్‌లో ఒక కేసు న‌మోద‌య్యాయి. ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు హైదరాబాద్ సిటీ పోలీసులు స్ప‌ష్టం చేస్తున్నారు. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు శాంతియుతంగా, పారదర్శకంగా జరగాలంటే ప్రతి ఒక్కరూ ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియామ‌వ‌ళిని గౌర‌వించాల‌ని సూచిస్తున్నారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినట్లు గ‌మ‌నిస్తే వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు 40.20 శాతం మాత్రమే నమోదైంది. పోలింగ్ మొదలై సుమారు 9 గంటలు గడుస్తున్నా ఓటింగ్ శాతం పెరగలేదు. చివరి రెండు గంటల్లో పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి.. 12 మంది మృతి

పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ లోని  జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం జరిగిన శక్తిమంతమైన పేలుడులో   12 మంది మరణించారు. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులలో అత్యధికులు న్యాయవాదులేనని తెలుస్తోంది.  స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో కోర్టు గేటు వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారులో ఈ పేలుడు సంభవించింది.   ఇది అత్యంత రద్దీగా ఉండే సమయం కావడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగింది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నా, ఇది ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల పార్క్ చేసిన అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 6 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. ఈ  దాడిని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందే దక్షిణ వజీరిస్థాన్‌లో పాక్ భద్రతా దళాలు ఓ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి. వానాలోని కేడెట్ కాలేజీపై తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు చేయబోయిన దాడిని భద్రతా దళాలు అడ్డుకుని, ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్ టీటీపీ ఉగ్రవాదుల నుంచి తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పాక్‌లో టీటీపీ కార్యకలాపాలు పెరిగాయి. టీటీపీ నాయకులకు ఆఫ్ఘనిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ప్రతి లైబ్రరీలోనూ అందెశ్రీ నిప్పుల వాగు.. రేవంత్

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ అంత్యక్రియలు తెలంగాణ ప్రజానీకం అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. హైదరాబాద్‌లోని లాలాపేట్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు అందెశ్రీ అంతిమయాత్ర కొనసాగింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఘట్‌కేసర్‌లోని ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్‌ బాబు, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.   అంతిమయాత్ర సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందెశ్రీ పాడెను మోశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అందెశ్రీ కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. వారికి అండగా ఉంటానని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.   అనంతరం   మీడియాతో మట్లాడిన రేవంత్ రెడ్డి.. ఓ కళాకారుడిగా, రచయితగా అందెశ్రీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు పడ్డారో తనకు తెలుసునని చెప్పిన రేవంత్ రెడ్డి, అందెశ్రీ పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా పనిచేశారు. ఉద్యమకారుడిగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అందెశ్రీ గొప్ప పాత్ర పోషించారు. ఆయనను కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు వ్యక్తిగతంగా తనకు కూడా తీరని లోటన్నారు.  అందెశ్రీ రాసిన ప్రతీ పాట తెలంగాణ ప్రజల్లో స్ఫూర్తి నింపిందని సీఎం రేవంత్‌ అన్నారు. అందుకే ఆయన రాసిన  జయ జయహే తెలంగాణ  గీతాన్ని పాఠ్యాంశంగా చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందెశ్రీ పేరుతో ఓ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అందెశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అలాగే ఆయన పాటల సంకలనం  నిప్పుల వాగు  ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా తెలంగాణ సమస్యలపై పోరాడేవారికి మార్గదర్శకంగా పయోగపడుతుందన్న రేవంత్ రెడ్డి అందుకే నిప్పుల వాగు పుస్తకాన్ని తెలంగాణలోని ప్రతీ లైబ్రరీలో  అందుబాటులో ఉంచుతామన్నారు.  ప్రత్యేక రాష్ట్ర సాధనలో తన పాటలతో అలుపెరుగని కృషి చేసిన అందెశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గత ఏడాది కేంద్రానికి లేఖ రాశామని సీఎం రేవంత్‌ అన్నారు. ఈ సంవత్సరం కూడా కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఆయనకు పద్మశ్రీ గౌరవం దక్కేలా కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆయనను పద్మశ్రీతో గౌరవించుకునేందుకు కృషి చేద్దామని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. 

ఢిల్లీ పేలుడు కేసు...ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం

    పేలిపోయిన హ్యుందాయ్ ఐ20 కారు మొదట ఎండీ సల్మాన్ సొంతం, కానీ నదీమ్ కు అమ్మివేయబడింది, తరువాత అతను దానిని ఫరీదాబాద్ లోని రాయల్ కార్ జోన్ అనే యూజ్డ్ కార్ డీలర్ కు విక్రయించాడు. తరువాత దీనిని తారీఖ్ కొనుగోలు చేశాడు. తారీఖ్ ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు కానీ పుల్వామాకు చెందినవాడు. 2900 కిలోల ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్న డాక్టర్ ముజ్జామిల్ షకీల్ కూడా ఫరీదాబాద్ లో నివసిస్తున్నాడు మరియు పుల్వామాకు చెందినవాడు కూడా. ఇవన్నీ ముడిపడి ఉన్నట్లు కనిపిస్తోంది.  డాక్టర్ ముజ్జామిల్ ను అరెస్టు చేసి ఎర్రకోట దాడిని నిర్వహించిన తర్వాత తారీఖ్ భయపడినట్లు కనిపిస్తోంది, బహుశా ఇది ఒక ఫిదాయీన్ చర్య కావచ్చు.  మరోవైపు పేలుడు కేసును కేంద్ర హోం శాఖ జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకి  అప్పగించింది. త్వరలో పేలుడు ఘటనపై ఏన్ఐ అధికారులు దర్యాప్తు చేసి ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనున్నారు. ఫరీదాబాద్ లో మరోసారి భారీగా పేలుడు పదార్థాలు లభ్యమైంది.  లక్నోకు చెందిన డాక్టర్ షాహీనా షాహిద్ ను అదుపులోకి తీసుకున్నారు  

ఢిల్లీ బ్లాస్ట్.. బీహార్ ఎలక్షన్స్!

ఢిల్లీలో చాందినీ చౌక్, లాల్ ఖిలా, నయి దిల్లి రైల్వే స్టేషన్ కు అతి దగ్గర గా ,  పార్లమెంట్ కు కూడా పెద్దగా దూరం లేని ప్రాంతం లో కారు లో భారీ పేలుడు పదార్ధాలతో కూడిన ఆత్మహుతి దాడి జరిగింది.  కేంద్ర దర్యాప్తు సంస్థలు తన ప్రాథమిక దర్యాప్తులో ఇదే తేలిందని చెబుతున్నాయి.   ఇక  బీహార్ లో అత్యంత కీలక మైన  రెండో, చివరి దశ పోలింగ్ జరుగుతోంది.  ఈ రెంటికీ లింక్ లేదు.. డిల్లి లో జరిగిన పేలుడు కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద కుదుపునకు లోను చేసింది.  పహాల్ గావ్ ఘటన జరిగిన తరువాత.. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లు అత్యంత అప్రమత్తత తో పనిచేస్తున్నాయి అన్నది వాస్తవం.  అయినా వాటి నిఘా నీడ ను తప్పించుకొని డిల్లి లో కొన్ని కిలోల పేలుడు మెటీరియల్ ను తెచ్చి పేల్చడాన్ని నిఘావైఫల్యంగానే పరిగణించాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు.  ఇకపోతే బీహార్ ఎన్నికల పై ఈ బ్లాస్ట్ ప్రభావం  ఉంటుందా? అన్నదో ప్రశ్న. సోమవారం  రాత్రి 7.30 నిముషాలకు జరిగిన బ్లాస్ట్ దేశం లో నిముషాల్లో పాకి పోయింది.. దీనికంటే ముందు ఒక  విషయం చెప్పుకోవలసి ఉంటుంది. 1991 లో రాజీవ్ గాంధీ పై మానవ బాంబుదాడి జరిగింది.. ఆ దాడిలో రాజీవ్ గాంధీ మరణించారు. అప్పుడు దేశం లో జనరల్ ఎన్నికలు జరుగుతున్నాయి . దాదాపుగా కాంగ్రెస్ కు స్వంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేని ఎన్నికలు అవి. రాజీవ్ గాంధీ హత్య  అనంతరం   జరిగిన ఫేజ్ లో కాంగ్రెస్ కు మెజారిటీ స్థానాలు వచ్చాయి. రాజీవ్ హత్యకు ముందు  జరిగిన స్థానాల్లో కాంగ్రెస్ కు చాలా చాలా తక్కువ స్థానాలు వచ్చాయి.. ఇక ఇప్పుడు ప్రజెంట్ బీహార్ ఎన్నికలకు వద్దాం..  తెల్లారి రెండోది చివరిది అయిన ఎన్నికల ఫేజ్.. మొదటి ఫేజ్ లో ఎన్ డీ ఏ కూటమికి అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనేది పబ్లిక్ టాక్ గా ఉంది.. రెండో ఫేజ్ పై దాని ప్రభావం పడి ఆర్ జేడి కి ఒక 135 స్థానాలు గ్యారంటీగా వచ్చే పరిస్థితి నెలకొని ఉంది.. ఇప్పటి బ్లాస్ట్ ప్రభావం , దాని టైమింగ్ ఎన్నికల పై పడుతుందా అనేది పోల్ స్టర్స్ ను తొలుస్తున్న ప్రశ్న. పోలింగ ప్రారంభం కావడానికి కేవలం 12 గంటల ముందు, అదీ దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరిగిన పేలుడు ప్రభావం బీహార్ లో రెండో దశ పోలింగ్ పై  పడే అవకాశం కేవలం ఐదుశాతం మాత్రమే ఉంటుందంటున్నారు. ఆ ప్రభావం కూడా పట్టణాలూ, నగరాలకే పరిమితమౌతుందనీ అంటున్నారు. అయితే ఆ ఐదు శాతం ప్రభావమే..  సీట్ల లో భారీ తేడాను తెస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఘటబంధన్ ఆ ప్రభావం ను అడ్డుకోగలిగితే గెలుపు వాకిట్లో బోల్తా పడే పరిస్థితి నుంచి కూటమి బయటపడుతుంది

కన్న కొడుకును హతమార్చిన తండ్రి

  దురలవాట్లకు బానిసలయిన పిల్లలను భరించే స్థితి ని తల్లిదండ్రులు కోల్పోతున్నారు డ్రగ్స్ మద్యం యువతరం జీవితాలను నాశనం చేస్తుంది. అదే సమయంలో తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకి గురి చేస్తోంది దీంతో తల్లిదండ్రులు క్షణికావేశంలో కన్నా కొడుకులను కడతేర్చడానికి వెనుకాడడం లేదు. అలా విశాఖలో మద్యానికి బానిసైన  కొడుకు వై ప్రసాద్ (36)ను తండ్రి లక్ష్మణరావు(60) హతమార్చాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మద్యానికి డబ్బులు కావాలని వేధించడంతో  ఈనెల ఆరవ తేదీన  మధ్యాహ్నం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో కొడుకు ప్రసాదును   కర్రతో బలంగా తలపై కొట్టడంతో  మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని  ఆ మరుసటి రోజు  జోడిగుడ్లపాలెం  స్మశాన వాటికలో పూడిచిపెట్టాడు. మృతుడు ప్రసాదు  కు 2019లో వివాహం కాగా  ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య వై.రాజీ విజయవాడలో నివసిస్తున్నారు. విషయం భార్య రాజీకి తెలియడంతో ఆమె ఫిర్యాదు మేరకు  ఆరి లోవ పోలీసులు దర్యాప్తు చేయగా  నిందితుడు కన్న తండ్రి లక్ష్మణరావు గా నిర్ధారించారు.