రోడ్డు ప్రమాదంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మృతి

విజయనగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ క్రీడాకారిణి దుర్మరణం పాలైంది. రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పతకం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న సత్యజ్యోతి విజయనగరంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. నెల్లిమర మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన శివజ్యోతి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి. కొండవెలగాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీలలో పాల్గొనేందుకు కోసం తన సోదరి గాయత్రితో కలిసి స్కూటీపై బయలుదేరారు . విజయనగరం సమీపంలోని వైఎస్‌ఆర్ నగర్ దాటిన తర్వాత, ఎదురుగా వేగంగా వస్తున్న ఓ లారీ వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యజ్యోతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆమె సోదరి గాయత్రి గాయపడ్డారు. ప్రతిభామంతురాలైన క్రీడాకారిణి సత్యజ్యోతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలు కావడంతో  ఆమె స్వగ్రామం కొండవెలగాడలో విషాద చ్ఛాయలు అలుముకున్నాయి. సత్యజ్యోతి మృతి పట్ల శాప్ ఛైర్మన్ రవినాయుడు, జిల్లా కలెక్టర్ రామసుందర్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులు

విశాఖలో జరిగిన సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో టెక్స్ టైల్స్ రంగంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. ఈ రంగంలో నాలుగువేల 380 కోట్ల రూపాయలకు ఏడు ఎంవోయులు కుదిరాయి. ఈ ఒప్పందాలతో ప్రత్యక్షంగా 6,100 ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి సవిత సమక్షంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. టెక్నికల్ టెక్స్‌టైల్స్,   రీసైక్లింగ్,  గార్మెంట్స్,   సిల్క్, అప్పారెల్స్ రంగాల్లో ఈ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడి దారులు ముందుకు వచ్చారు.  విశాఖపట్నం,  చిత్తూరు,  గుంటూరు,  శ్రీ సత్యసాయి,  అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. కామధేను సటికా సంస్థ రూ.90 కోట్లతో   మచిలీపట్నంలో పరిశ్రమ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమతో 650 మందికి ఉద్యోగాలు రానున్నాయి.అలాగే చిత్తూరు జిల్లా గండ్రాజుపల్లిలో జీనియస్ ఫిల్టర్స్ సంస్థ రూ.120 కోట్ల మేర పెట్టుబడులకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఏర్పాటుతో  ప్రత్యక్షంగా 250 మందికి ఉపాధి లభించనుంది.  ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో అరవింద్ అపెరల్ పార్క్ రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా   రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది.  అదే విధంగా గుంటూరులో వామిని ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.35 కోట్లు మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దీని ద్వారా రెండు వేల ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయి.  విశాఖపట్నంలో ఎంవీఆర్ టెక్స్ టైల్స్ రూ.105.38 కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థ యాజమాన్యం ముందుకొచ్చింది. ఈ సంస్థ ఏర్పాటుతో 900  మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అనకాపల్లిలో బీసీయూబీఈ టెక్స్ టైల్స్ యాజమాన్యం రూ.10 కోట్ల పెట్టుబడులు పెట్టంది. ఈ సంస్థ వందమందికి ఉపాధి కల్పించనుంది.  ఇక సీఎం చంద్రబాబు సమక్షంలో విశాఖలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు  ఫిన్లాండ్ కు చెందిన ఇన్ఫినిటెడ్ ఫైబర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.  టెక్స్‌టైల్ రీసైక్లింగ్ టెక్నాలజీని ఈ సంస్థ భారత్‌ కు తొలిసారి తీసుకు రానుంది.విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించనుందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి  .సవిత తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ పరిశ్రమలను ఆరు నెలల్లో నెలకొల్పనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. 

తెలుగు.. తేనెలొలుకు.. జపాన్ నోట తెలుగు మాట

విశాఖలో జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే కాదు.. మన తెలుగు భాష పట్ల కూడా విదేశీ ప్రతినిథులు, రాయబారుల ఆసక్తిని, అనురక్తిని పెంచింది. తెలుగు పలుకుబడి, నుడికారం పట్ల మమకారం పెంచింది.  జపాన్‌  రాయబారి ఓనో కెయిచ్చి ఏకంగా తన తెలుగులోనే ప్రసంగాన్ని  ప్రారంభించి అందరినీ విశ్మయపరిచారు. జపాన్‌ దేశంతో వాణిజ్య సంబంధాలపైన ఆయన ప్రసంగించారు. సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొన్నందుకు తాను చాలా గౌరవంగా, గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ సదస్సు ద్వారా జపాన్‌, భారత్‌ కంపెనీలు పరస్పర సహకారం అందిపుచ్చుకోవడంపై తాను సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ విషయాలన్నింటినీ ఆయన తెలుగులోనే చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు  తెలుగు భాష పట్ల  తనకున్న అభిమానాన్ని ఆయన భావోద్వేగభరితంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ ద్వారా పంచుకున్నారు.  తనను ఆహ్వానించినందుకు కృతజ్ణతలు అని పేర్కొన్న ఆయన..  తెలుగులో ఇదే తన మొదటి ప్రసంగం అన్నారు.  జపాన్‌,ఆంధ్రప్రదేశ్ మధ్య వాణిజ్య సంబంధాలు ఈ సదస్సు ద్వారా మరింత బలోపేతమవుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  స్టీల్‌, ఫార్మా, రిన్యూవబుల్‌ ఎనర్జీ రంగాల్లో, శ్రీసిటీ, టయోమా ప్రీఫెక్చూర్‌ సంస్థలతో వాణిజ్య సహకారం కొనసాగిస్తున్నామన్నారు.

విజన్, ఇన్నోవేషన్, జీల్, యాస్పిరేషన్, గ్రోత్.. వైజాగ్ కు చంద్రబాబు కొత్త భాష్యం

విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి.  సాగర తీరనగరంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక సంస్థలు పెట్టుబడులతో తరలివచ్చాయి. శుక్ర, శనివారాలలో (నవంబర్ 14, 15) రెండు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో  .లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్వలతో పాటుగా పలు దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో రూ.11.92 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 400 అవగాహన ఒప్పందాలు కుదిరాయని ప్రభుత్వం తెలిపింది. ఈ ఒప్పందాల వల్ల మొత్తం 13.32 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఈ సదస్సు సందర్భంగా విశాఖకు చంద్రబాబు కొత్త భాష్యం చెప్పారు.  వి అంటే విజన్‌, ఐ అంటే ఇన్నోవేషన్‌, జడ్‌‌కి జీల్‌ అంటే ఉత్సాహం, ఏ అంటే యాస్పిరేషన్‌, జీ అంటే  గ్రోత్‌  అని అభివర్ణించారు. విశాఖకు చంద్రబాబు చెప్పిన కొత్త భాష్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇక దీనిపై  తెలుగు దేశం పార్టీ   చంద్రబాబు, లోకేష్  కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే .. ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం" అని చెప్పుకుంటున్నారంటూ సామాజిక మాధ్యమ వేదికలో ఎక్స్ లో పోస్టు చేసింది. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ సందడి చేశారు. ఏపీ పెవిలియన్‌లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించిందని పలువురు ప్రతనిథులు పేర్కొన్నారు.   

జూబ్లీ గెలుపు.. నవీన్ యాదవ్ కు రాహుల్ అభినందన

ప్రతిష్టాత్మక  జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఘన విజయం సాధించిన నేపథ్యం లో ఢిల్లీలో ఏఐసిసి అగ్రనేత రాహు ల్ గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జూబ్లీ హి ల్స్ ఉప ఎన్నికలో గెలుపొందిన నవీన్ యాదవ్ ను రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ నవీన్ యాదవ్ ను అభినందించారు. అలాగే వెల్ డన్ గుడ్ వర్క్ అంటూ సీఎం రేవంత్ నూ అభినందించినట్లు తెలిసింది.   ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ వ్యవ హారాలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై రాహుల్ తో కాంగ్రెస్ బృందం చర్చించింది.  జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ సాధించిన విజయంపై రాహుల్  సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో పార్టీ బ లా న్ని మరింత పటిష్ఠం చేయడానికి తీ సుకోవాల్సిన చర్యలపై నాయకులకి రాహుల్‌ సూచనలు ఇచ్చారు.  స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తు న్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక, బలహీన ప్రాంతాల్లో పార్టీ బలోపేతం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అనంతరం ఢిల్లీ పర్యటన ముగిం చుకుని రేవంత్ బృందం శనివారం (నవంబర్ 15) రాత్రి హైదరాబాద్ కు తిరిగి వచ్చింది. 

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు.. సిట్ విచారణకు రానా దగ్గుబాటి, విష్ణు ప్రియ

తెలంగాణలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల కేసు దర్యాప్తులో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో  ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, ప్రముఖ యాంకర్ విష్ణు ప్రియలు శనివారం సిట్ ముందు విచారణకు హాజరయ్యారు.  విష్ణు ప్రియ   మూడు బెట్టింగ్ యాప్ లను   ప్రమోట్ చేసినట్లుగా సిట్ గుర్తించింది.ఈ నేపథ్యంలోనే   ఆమెకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది.  విచారణ సందర్భంగా విష్ణుప్రియ తన బ్యాంక్ అక్కౌంట్ వివరాలు, బ్యాంక్ స్టేట్ మెంట్లను సిట్ అధికారులకు అందజేసినట్లు తెలిసింది. అలాగే బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ కోసం ఆమె కుదుర్చుకున్న ఒప్పందాలపై సిట్ ఆమెను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బెట్టింగ్ యాప్ ల ప్రమోషన్ ద్వారా విష్ణుప్రియకు చెల్లింపులు ఎలా, ఎవరి ద్వారా అందాయి అన్న విషయాలపై సిట్ ఈ విచారణలో ఆరా తీసినట్లు తెలిపింది.  కాగా  ప్రముఖ హీరో దగ్గుబాటి రానా కూడా శనివారం ఈ కేసులో విచారణకు సిట్ ఎదుట హాజరయ్యారు. రానా కూడా తన బ్యాంక్ స్టేట్ మెంట్లు సిట్ కు సమర్పించారు. తాను ప్రమోట్ చేసింది స్కిల్ బేస్డ్ గేమింగ్ యాప్ మాత్రమే ననీ, అది చట్టవిరుద్ధం కాదని రానా తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు తెలిసింది.న 

ఏపీలో రేమాండ్స్ ఇన్వెస్ట్ మెంట్

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతి మరో లెవెల్ కు చేరింది. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా జరుగుతున్న  సీఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా  రాష్ట్రంలో ప్రముఖ పారిశ్రామిక టౌన్‌షిప్‌గా ఉన్న శ్రీసిటీకి అదనంగా 6 వేల ఎకరాల భూమిని కేటాయించనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. శ్రీసిటీని రాష్ట్ర అభివృద్ధికి ఒక రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామన్న ఆయన  సదస్సు వేదికపై నుంచే  రేమాండ్స్ గ్రూప్‌కు చెందిన 3 ప్రాజెక్టులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీసిటీలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన 5 కంపెనీలను లాంఛనంగా ప్రారంభించారు. శ్రీసిటీలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన పలు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవగాహన ఒప్పందాలు  కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు   దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్‌ అయిన శ్రీసిటీ  నుంచే  డైకెన్, ఇసుజు, క్యాడ్బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు  తమ ఉత్పత్తులను ప్రపంచానికి అందిస్తున్నాయని చెప్పారు. మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు శ్రీసిటీకి రావాలన్నారు. ఇప్పటికే బెల్జియం, జపాన్, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి దేశాలకు చెందిన హెల్త్‌కేర్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, మెడికల్ పరికరాల కంపెనీల నుంచి రూ.8.87 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు.  గత రెండు రోజులుగా జరిగిన సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, మొత్తంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో   22 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను సాధించామని చంద్రబాబు వివరించారు.  త్వరలోనే శ్రీసిటీకి మరో 6 వేల ఎకరాల భూమిని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో 50కి పైగా దేశాలకు చెందిన కంపెనీలు శ్రీసిటీ నుంచి పనిచేస్తాయనీ,  తద్వారా లక్షన్నర మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.  రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న చంద్రబాబు 2014-19 మధ్య కాలంలోనే కియా కార్ల ఫ్యాక్టరీని సీమకు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటివి ఏర్పాటు చేస్తున్నామనీ,  ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు కూడా రాబోతున్నాయి తెలిపారు. అనంతపురం జిల్లాకు రేమాండ్స్ సంస్థ రావడం శుభపరిణామమన్న ఆయన,  కియా సమీపంలోనే రేమాండ్స్ ఆటో కాంపోనెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోందన్నారు.   

కేటీఆర్ పరాజయాల హ్యాట్రిక్!

కేసీఆర్ రాజకీయంగా క్రీయాశీలంగా లేరు. ఆయన స్థానంలో ఆయన కుమారుడు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. పార్టీ బాధ్యతలను కేటీఆర్ స్వీకరించిన తరువాత  జూబ్లీ ఉప ఎన్నిక పరాజయంతో కేటీఆర్ వరుస వైఫల్యాలలో హ్యాట్రిక్ సాధించినట్లైంది.  2023 అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ పూర్తిగా క్రీయాశీల రాజకీయాలకు దూరమై, ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అడపాదడపా.. పార్టీ నేతలను ఫామ్ హౌస్ కు పిలిపించుకుని మాట్లాడినా, వారికి రాజకీయ దిశానిర్దేశం చేసినా గత రెండేళ్లుగా ఆయన తీరు చూస్తుంటే ఆయన రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారని అనిపించక మానదు.  సరే అది పక్కన పెడితే.. తండ్రి క్రీయాశీల రాజకీయాలకు దూరమైనప్పటి నుంచీ పార్టీ వ్యవహారాలన్నీ తానై నడిపిస్తున్న కేసీఆర్ ఆ విషయంలో విఫలమయ్యారనే చెప్పాలి. జూబ్లీ ఉప ఎన్నిక ఓటమి ద్వారా కేటీఆర్ వరుసగా మూడు ఎన్నికలలో పార్టీని పరాజయం దిశగా సక్సెస్ ఫుల్ గా నడిపించారు. ఔను.. గత ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ కేసీఆర్ బాధ్యతలను పూర్తిగా కేటీఆర్ కు అప్పగించి తాను క్రియాశీల రాజకీయాలకు విరామం ప్రకటించారు. అప్పటి నుంచీ బీఆర్ఎస్ బాధ్యతలన్నీ కేసీఆర్ తన భుజస్కంధాలపై పెట్టుకుని నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత అసెంబ్లీ ఎన్నికల తరువాత గత ఏడాది జరిగిన పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో స్కోర్ చేసింది. ఆ తరువాత కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో పరాజయం పాలై సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇప్పుడు తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయి పరాజయాలలో హ్యాట్రిక్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు పరాజయాలూ కేటీఆర్ ఖాతాలోనే పడ్డాయి.   పార్లమెంటు ఎన్నికల తరువాత రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో  బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనబరిచిన జీహెచ్ఎంసీ పరిధిలోనివి కావడం గమనార్హం. గత అసెంబ్లీ ఎన్నికలలో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ విజయం సాధించలేదు. అటువంటిది ఇప్పుడు ఉప ఎన్నికలలో కాంగ్రెస్ విజయాలతో సత్తా చాటింది. దీంతో పార్టీ క్యాడర్ లో కేటీఆర్ నాయకత్వం పట్ల నమ్మకాన్ని సడిలేలా చేశాయి ఈ పరాజయాలు.   

జూబ్లీలో ఓటమిని కేసీఆర్ ముందే ఊహించారా?

బీఆర్ఎస్ చావో రేవో అన్నట్లు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ హిల్ ఉప ఎన్నికలో అనూహ్యంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.  కాంగ్రెస్ కు కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాదాపు పాతిక వేల ఓట్ల తేడాతో ఇక్కడ పరాజయాన్ని మూటగట్టుకుంది. 2023 ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత జరిగిన రెండు ఉప ఎన్నికలలోనూ కూడా బీఆర్ఎస్ పరాజయం పాలైంది. అయితే కంటోన్మెంట్ పరాజయంతో పోలిస్తే ఈ పరాజయం బీఆర్ఎస్ కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. 2023 ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాదాపుగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. పార్టీ వ్యవహారాలన్నీ ఆయన కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావే ముందుండి నడిపిస్తున్నారు. అయితే జూబ్లీ ఉప ఎన్నికలో మాత్రం స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ముందుగా కేసీఆర్ పేరు కూడా ఉంది. దీంతో పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జూబ్లీ ఉప ఎన్నిక ప్రచార సారథ్యం కేసీఆర్ చేపడతారని అంతా భావించారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా అలానే అనుకుంది. అయితే కేసీఆర్ మాత్రం గడపదాటి బయటకు రాలేదు. జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం చేయలేదు. దీంతో ఇప్పుడు పార్టీ ఓటమి తరువాత.. కేసీఆర్ జూబ్లీ ఓటమిని ముందే ఊహించారా? అన్న చర్చ మొదలైంది.   జూబ్లీ హిల్స్ లో క్షేత్రస్థాయి పరిస్థితి ఏమిటన్నది అర్ధం అయ్యింది కనుకనే కేసీఆర్ ప్రచారానికి దూరంగా ఉన్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఎటూ ఓడిపోయే ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడం అనవసరమని ఆయన భావించి ఉంటారని  అంటున్నారు. తాను ప్రచారం చేసిన తరువాత కూడా పార్టీ అభ్యర్థి పరాజయం పాలైతే అది గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం కంటే ఎక్కువ అవమానకరమని కేసీఆర్ భావించి ఉంటారని అంటున్నారు.  జూబ్లీ ఉప ఎన్నిక ప్రచారం వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడకపోవడంతో  పార్టీ క్యాడర్ కూడా ఇదే  అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నది. 

జూబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం క్యాడర్?!

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించేలా పార్టీని ముందుండి నడిపించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజయం సాధించారు. జూబ్లీ ఉప ఎన్నిక విజయంతో ఇటు జనంలోనే కాకుండా పార్టీ హైకమాండ్ వద్ద కూడా రేవంత్ ఇమేజ్ ఇనుమడించిందనడంలో సందేహం లేదు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుందనుకున్న జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. అయితే పోలింగ్ ముగిసి ఫలితం వచ్చిన తరువాత.. ఇప్పుడు మరో చర్చ తెరపైకి వచ్చింది. ఈ ఉప ఎన్నికలో తెలుగుదేశం క్యాడర్ మద్దతు ఎవరికి లభించింది? అందుకు కారణమేంటి? అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న నిర్ణయాత్మక శక్తి తెలుగుదేశం క్యాడరే అని అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా, గణాంకాలతో సహా వివరించారు. ఇప్పుడు జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ కు తెలుగుదేశం క్యాడర్ అండగా నిలవడం వల్లనే ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో సునాయాస విజయం సాధించారని అంటున్నారు.  ఇందుకు కారణాలు కూడా పరిశీలకులు వివరిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి  శ్రీశైలం యాదవ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయన తెలంగాణలో తెలుగుదేశం నాయకులు, శ్రేణులతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే గతంలో తెలుగుదేశంలో అత్యంత కీలకమైన, బలమైన నాయకుడైన రేవంత్ రెడ్డి పట్ల తెలంగాణ తెలుగుదేశం శ్రేణులలో అభిమానం చెక్కు చెదరలేదు. ఈ కారణంగానే జూబ్లీ బైపోల్ లో తెలుగుదేశం క్యాడర్, ఆ పార్టీ మద్దతుదారులు, అభిమానులు మొత్తంగా కాంగ్రెస్ కు అండదండగా నిలిచారని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఉప ఎన్నిక సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం కారణంగా వచ్చింది. మాగంటి గోపీనాథ్ కూడా గతంలో తెలుగుదేశం నాయకుడే. 2019, 2023 ఎన్నికలలో మాగంటి విజయం వెనుక ఉన్నది తెలుగుదేశం క్యాడరే. అయితే రాష్ట్రంలో మారిన  పరిస్థితి,  మాగంటి మరణం తరువాత తెలుగుదేశం  క్యాడర్ బీఆర్ఎస్ కు దూరం జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే తెలుగుదేశం క్యాడర్ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా నిలిచిందని చెబుతున్నారు.  

విశాఖ భాగస్వామ్య సదస్సులో లోకేష్ పై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు

విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసీసీ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులకు గేట్ వేగా మారింది.  ఈ సదస్సు ఇంత విజయవంతంగా జరగడానికి, ఈ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ నారా లోకేష్ అంటున్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న, కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులూ చెబుతున్నారు.  రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో ఒప్పందాలను ఖరారు  కావడం, వారితో సమన్వయం చేయడంలోనూ లోకేష్ కీలక పాత్రపోషించారు. అందులో సందేహం లేదు. విశాఖలో భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడానికి చంద్రబాబు ట్రాక్ రికార్డ్, విజన్ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో తరలిరావడానికి ఒక కారణమైతే.. లోకేష్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చూపిన నిబద్ధత, అందుకోసం చేసిన కృషి మరో ప్రధానకారణమంటున్నారు.    ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సహా సీనియర్ కేంద్ర మంత్రులూ గుర్తించారు. అందుకే రాష్ట్ర ప్రగతి విషయంలో వారు చంద్రబాబు విజన్ ను ఎఫిషియెన్సీనే కాకుండా.. లోకేష్ ప్రతిభనూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయన చూపిన చొరవనూ ప్రశంసలతో ముంచెత్తారు.   ఆదానీ గ్రూప్ ఏపీలో నలభైవేల కోట్ల రూపయాలు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ముందు ముందు మరింత ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం వెనుక లోకేష్ చోరవ, ఆయన కనబరిచన శ్రద్ధ, అందించిన మద్దతు కారణమని ఆ సంస్థ ప్రతినిథులే పేర్కొన్నారు.   ఎస్ వైఆర్ఎమ్ఏ ఎస్జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్ గుజ్రాల్ లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ కంపెనీకి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు, క్లియరెన్సులు కేవలం పధ్నాలుగు రోజుల్లోనే వచ్చాయనీ, దీని వెనుక ఉన్న చురుకైన పాత్ర లోకేష్ దేనని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అపూర్వమైన చురుకైన చర్యలు తీసుకువచ్చినందుకు ఆయన లోకేష్‌ను ప్రశంసించారు. 

తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్

గేమింగ్ యాప్ లు, బెట్టింగ్ యాప్ లపై కొరడా ఝుళిపిస్తున్న కోర్టులకూ హ్యాకింగ్ బెడద తప్పడం లేదు. తాజాగా తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. హ్యాకర్లు ఆ వెబ్ సైట్ లో ఏకంగా బెట్టింగ్ యాప్ ను తీసుకువచ్చారు. వివరాల్లోకి వెడితే.. తెలంగాణ హైకోర్టు వెబ్ సైట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని శనివారం గుర్తించారు. ]కోర్టు ఆర్డర్లు డౌన్ లోడ్ చేస్తుండగా హైకోర్టు వెబ్ సైట్ హ్యాకింగ్ కు గురైందన్న విషయం వెలుగు చూసింది. సదరు వెబ్ సైట్ లో బెట్టింగ్ యాప్ ప్రత్యక్షమైంది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. హైకోర్టు వెబ్ సైట్ లోకి హ్యాకర్లు ఏలా యాక్సెస్ అయ్యారు.. సర్వర్ లో లోపాలు తదితర విషయాలపై విచారణ చేపట్టారు. మరో వైపు టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సిస్టమ్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టింది 

ఏపీకి మరో వాయు‘గండం’!

ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం ముప్పు పొంచి ఉందా? అంటే వాతావరణ శాఖ ఔననే అంటున్నది. ఇప్పుడిప్పుడే మొంథా తుపాను దెబ్బ నుంచి కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరోమారు భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో మరో అప్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీపంలో ఈ నెల 19 నాటికి ఏర్పడనున్న అల్పపీడనం, తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారే అవకాలున్నాయని తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 24 నుంచి  నాలుగు రోజుల పాటు కోస్తా, రాయలసీమలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదలా ఉండగా.. ఏపీలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతల్లో మార్పు ఉండటం లేదు. దీంతో పగలు ఉక్కపోత, రాత్రిళ్లు చలికి గజగజ అన్నట్లుగా ఏపీలోని వాతావరణం మారింది. ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోతున్నాయి. ఈ సీజన్ లో అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో శుక్రవారం (నవంబర్ 14) అత్యల్పంగా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

గన్నవరం టు సింగపూర్ విమాన సేవలు ప్రారంభం

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇండిగో సంస్థ ఈ సర్వీసును నడప నుంచి. శనివారం ప్రారంభమైన ఈ విమాన సర్వీసును  విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్, ఎంపీ బాలశౌరి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావులు లాంఛనంగా ప్రారంభించారు. గన్నవరం నుంచి నేరుగా సింగపూర్ కు విమాన సర్వీసు ప్రారంభం కావడంతో  రాజధాని అమరావతి నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం అవుతాయని అంటున్నారు. ఇండిగో విమానయాన సంస్థ గన్నవరం, సింగపూర్ విమాన సర్వీసును వారానికి మూడు రోజులు నడపనుంది.  గన్నవరం సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభంతో రాష్ట్రానికి అంతర్జాతీయ విమాన సర్వీసుల కు సంబంధించి కీలక పురోగతి సాధించినట్లయ్యింది.   ప్రయాణీకుల సంఖ్య, వయబులిటీ వంటి  అంశాలతో సంబంధం లేకుండానే ఇండిగో సంస్థ వారంలో మూడు రోజులు సింగపూర్ కు విమానసర్వీసులు నడుపుతుంది. మంగళవారం, గురువారం, శనివారం.. సింగపూర్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నడపనుంది. ఇందులో భాగంగా తొలి విమానం ఈ రోజు ఉదయం ఏడున్నర గంటలకు గన్నవరం నుంచి సింగపూర్ కు బయలుదేరింది.  .

మావోయిస్టు సీనియర్ నేత ఆజాద్ అలియాస్ సాంబయ్య లొంగుబాటు?

కేంద్ర ప్రభుత్వం నక్సల్ విముక్త భారత్ లక్ష్యం అంటూ చేపట్టిన ఆపరేషన్ కగార్ తో మావోయిస్టు పార్టీ కకావికలౌతోంది. వరుస ఎన్ కౌంటర్లో వందల మంది మావోయిస్టులు హతం కాగా, భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాట పట్టారు. అలా లొంగిపోయిన వారిలో పార్టీకి చెందిన అంత్యంత కీలక నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు అత్యంత బలపైన ప్రాంతంగా ఉన్న ఛత్తీస్ గఢ్ లో ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఉనికి మాత్రంగా నిలిచింది. ఆ తరువాత మావోయిస్టు పార్టీకి అంతో ఇంతో బలమైన పట్టు ఉన్న తెలంగాణలో సైతం మావోయిస్టు పార్టీ వరుస ఎదురుదెబ్బలతో సతమతమౌతోంది. తాజాగా మావోయిస్టు పార్టీకి తెలంగాణలో  మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, భద్రాద్రి కొత్తగూడెం ఏరియా కమిటీ కార్యదర్శి ఆజాద్ అలియాస్ సాంబయ్య పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. సాంబయ్యతో పాటు పెద్ద సంఖ్యలో మావోయిస్టు పార్టీ కేడర్ కూడా ఆయుధాలు విడిచి  జనజీవన స్రవంతిలో కలిసినట్లు తెలియవచ్చింది. అయితే సాంబయ్య, ఆయనతో పాటు క్యాడర్  లొంగుబాటు వార్తలను పోలీసులు   అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.  ములుగు జిల్లా  మొద్దులగూడెం గ్రామానికి చెందిన సాంబయ్య, 1995 నుంచీ అజ్ణాతంలో ఉన్నారు.   గతంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా  కూడా పని చేసిన సాంబయ్యపై 20 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది.  

సతీష్ కుమార్ ది హత్యే!

తిరుమల తిరుపతి దేవస్థానంలో పని చేసి .. పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సతీష్ అనే సీఐ హత్యకు గురయ్యారని పోలీసులు తేల్చారు.   దీంతో సతీశ్ కుమార్ మృతిని హత్యగా నిర్ధారిస్తూ గుత్తి పోలీసు స్టేషన్ లో కేసు  నమోదైంది.   మృతుడు సతీష్ బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.  సిట్ ఎదుట హాజరయ్యేందుకు రైలులో బయలుదేరిన ఆయన శుక్రవారం (నవంబర్ 14)న మరణించి రైలు పట్టాలపై పడి ఉన్నారు.  దీంతో ఆయనది అనుమానాస్పద మృతిగా అందరూ భావించారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ వైసీపీయులు పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. రైలు ఢీకొనడం వల్ల చనిపోయారన్నట్లుగా సీన్ క్రియేట్ చేసిన ఆనవాళ్లు కనిపించడంతో ఉండటంతో పోలీసులు ఉన్నత స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రాథమిక విచారణలో సతీష్ ది హత్యే అని తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.  అయితే  వైసీపీ మాత్రం దర్యాప్తు అధికారులు, తెలుగుదేశం నేతల వేధింపుల కారణంగానే సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నది.  అలాగే సతీష్ ఈ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చింది.  టీటీడీ మాజీ చైర్మర్ భూమన కరుణాకరరెడ్డి అయితే.. ఈ ఆరోపణలు, డిమాండ్ లతో చేసిన అతి వికటించింది.    అత్యంత కీలకమైన కేసులో  ఫిర్యాదుదారు, సాక్షి అయిన ఓ పోలీసు  అనుమానాస్పద స్థితిలో చనిపోతే.. మామూలుగా అయితే ఆయన హత్యకు గురయ్యారు అని వైసీపీయులు ఆరోపణలు చేయాలి. కానీ.. అసలు ఆయన ఎలా చనిపోయారు అన్నది ఇంకా తేలక ముందే ఆత్మహత్య అంటూ నిర్ధారించేసి ఆరోపణలు గుప్పించడం చూస్తుంటూ.. గతంలో అంటే వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు తొలుత గుండెపోటు అంటూ ప్రచార చేసిన విధానం గుర్తుకు వస్తున్నది.  ఇక భూమన అయితే..  ఓ దర్యాప్తు అధికారిని కూడా టార్గెట్ చేసి బెదిరించేలా ఆరోపణలు గుప్పించడం పలు సందేహాలకు తావిస్తున్నది. గతంలో వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారిపై కూడా వైసీపీయులు ఇలాగే టార్గెట్ చేసి ఆరోపణలు గుప్పించడం, కేసులు పెట్టడం తెలిసిందే. ఇప్పుడు విషయానికి వస్తే అప్పట్లో టీటీడీ విజిలెన్స్ లో పని చేస్తున్న సతీష్ కుమార్ ఫిర్యాదు మేరకే పరకామణి చోరీ కేసు నమోదు అయింది. తర్వాత ఆయనపై ఒత్తిడి  తెచ్చి కేసు  రాజీ చేయించారు. ఎవరు అలా చేశారన్నది సిట్ కు ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. ఆ వాంగ్మూలం ఇచ్చేందుకు వెడుతున్న సమయంలోనే సతీష్  మరణించారు. ఇక్కడే  సతీష్ మృతి వెనుక ఈ కేసులో నిందితులుగా  ఉన్న వారి ప్రమేయం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రా అరెస్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో కీలక  పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముంబైకి చెందిన అనిల్ చోఖ్రాను సిట్ అరెస్టు చేసింది. ఈ అనిల్ ఛోఖ్రా ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి చెందిన రూ.77.55 కోట్ల నగదును డొల్ల కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు సిట్ పేర్కొంది. అనిల్ చోఖ్రా ముంబై కేంద్రంగా బినామీల పేర్లతో నాలుగు డొల్ల కంపెనీలను సృష్టించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.  క్రిపటి ఎంటర్‌ప్రైజెస్‌, నైస్‌నా మల్టీ వెంచర్స్‌, ఓల్విక్‌ మల్టీ వెంచర్స్‌, విశాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పేర్లతో  సృష్టించిన ఈ కంపెనీల ఖాతాల్లోకి  లిక్కర్ సొమ్మును జమ చేసి,  అనంతరం ఆ నిధులను మరో 32 వేర్వేరు ఖాతాలకు బదిలీ  చేసి, బ్లాక్ మనీని వైట్ గా మార్చే మార్చే ప్రయత్నం చేసినట్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇలా ఉండగా  అనిల్ చోఖ్రా గతంలో కూడా ఇదే తరహా నేరాలకు పాల్పడ్డారని సిట్ పేర్కొంది. 2017, 2021 సంవత్సరాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అనిల్ చోఖ్రాను మనీలాండరింగ్ కేసుల్లో రెండు సార్లు అరెస్టు చేసినట్లు తెలిపింది. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత, ఈ అనిల్ చోఖ్రా లిక్కర్ స్కామ్ సొమ్మును వైట్‌గా మార్చేందుకు మద్యం స్కామ్ నిందితులు ఆయన్ను సంప్రదించినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు సిట్ పేర్కొంది. భారీగా కమీషన్ తీసుకుని మరీ అనీల్ చోఖ్రా ఈ లావాదేవీలకు సహకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. టెక్నాలజీ సహాయంతో  అనిల్ చోఖ్రాపై నిఘా పెట్టిన సిట్ అధికారులు, గురువారం  (నవంబర్ 13)న అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో  మద్యం కుంభకోణం కేసులో అనిల్ చోఖ్రాను 49వ నిందితుడిగా చేర్చిన సిట్ అతడిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్

ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు  ఇమ్మడి రవిని పోలీసులు అరెస్టు చేశారు.  తన ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా  సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ ను అందుబాటులోకి తీసుకువస్తే సినీ నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారిన రవిపై పలువురు తెలుగు నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై చర్యలు తీసుకుంటే పోలీసుల యవ్వారలన్నీ బయటపెడతానంటూ రవి ఆ సందర్భంగా పోలీసులకే సవాల్ చేసి బెదరించే స్థాయికి వెళ్లాడు. అప్పటి నుంచీ రవి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దమ్ముంటే పట్టుకోండంటూ రవి పోలీసులకు సవాల్ కూడా విసిరాడు.  ఇప్పటికే రవి బ్యాంకు ఖాతాలోని  రూ. 3 కోట్లు పోలీసులు ఫ్రీజ్ చేశారు.  కాగా రవి శుక్రవారం (నవంబర్ 14) హైదరాబాద్ వచ్చినట్లు తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు.    

బీహార్ ప‌వ‌న్ చిరాగ్ పాశ్వాన్!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌న్నెండేళ్ల శ్ర‌మ ఆపై రెండు ఎన్నిక‌ల ప్ర‌యోగాలు చేసి, అటు పిమ్మ‌ట మూడో ఎన్నిక‌ల్లో సాధించిన హండ్రెడ్ పర్సెంట్ విక్ట‌రీ ఇచ్చిన ఇన్ స్పిరేష‌న్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాకిందా అంటే.. ఔననే చెప్పాల్సి వస్తోంది.  త‌మిళ‌నాడులో విజ‌య్ పొలిటిక‌ల్ ఎంట్రీకి  ప‌వ‌నే అతి  పెద్ద ఇన్ స్పిరేష‌న్ గా చెబుతున్నారు. ఇదిలా ఉంటే బీహార్ లోని చిరాగ్ పాశ్వాన్ విజయం సైతం సైతం ప‌వ‌న్ హండ్రడ్ పర్సంట్ స్ట్రైక్ రేట్ తోనే పోలుస్తున్నారు. గ‌త ఏపీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో 21 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ  సీట్ల‌ను ఎలా కైవ‌సం  చేసుకున్నారో.. అక్క‌డ బీహార్ లో చిరాగ్ పాశ్వాన్ 75 శాతం స్ట్రైక్ రేట్ తో ప‌వ‌న్ ని తలపింపచేశారని పరిశీలకులు అంటున్నారు.  బీహార్ గ‌త కాల‌పు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒక‌రైన రామ్ విలాస్ పాశ్వాన్ వార‌స‌త్వాన్ని నిల‌బెడుతూ లోక్ జ‌న  శ‌క్తి పార్టీని ముందుకు తీస్కెళ్తున్న యువ కెర‌టం  చిరాగ్ పాశ్వాన్. ఈ ఎన్నిక‌ల్లో ఆ పార్టీ  29 సీట్ల‌కు పోటీ చేయ‌గా వాటిలో 19 స్థానాలలో విజయం సాధించింది.  గ‌త లోక్ స‌భ ఎన్నిక‌ల్లో చిరాగ్ పాశ్వాన్ పార్టీ ఐదు ఎంపీ  సీట్ల‌ను గెలిచింది. దీంతో తండ్రికి త‌గ్గ త‌న‌యుడిగా చిరాగ్ పాశ్వాన్ దూసుకెళ్తున్నారు. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లా  చిరాగ్  సైతం బీహార్ లో ప్ర‌భావం చూపుతున్న‌ట్టుగా చెబుతున్నారు చాలా మంది.