ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలియక బయటకు రాని నేతలు!!

  తెలంగాణ ఆర్టీసీ సమస్య ఇంకా కొలిక్కి రాకపోవడంతో నియోజకవర్గంలో పర్యటించడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ వ్యవహారంపై ప్రతి రోజూ రివ్యూ చేస్తున్నారు. కానీ కార్మికుల సమ్మె ముగింపునకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సొంత పార్టీ నేతలు సైతం అంచనా వేయలేని స్థితిలో ఉన్నారు. దీంతో కార్మికులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సమ్మె కాలంలో తమ నియోజకవర్గాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వాయిదాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోకి వెళితే కార్మికులు అడ్డుకుంటారని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. కార్మికుల పట్ల ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.  సమ్మె మొదలైనప్పట్నుంచి ప్రభుత్వం కూడా ఆర్టీసీ విషయంపై తప్ప ఇతర అంశాల పై దృష్టి పెట్టడం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత చేజారుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగితే సమస్య జఠిలమవుతుందనే తమ అనుచరుల వద్ద ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద ఆర్టీసీ అంశంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఆర్టీసీ వ్యవహారానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనే వాదన అధికార పార్టీలో వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

ఠాక్రే కుటుంబ రాజకీయం... ఉద్ధవ్ ఠాక్రే ప్రస్థానం

  శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తిగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చరిత్రకెక్కనున్నారు. నిజానికి బాల్ ఠాక్రే కాని.. ఆయన తమ్ముడు కొడుకు రాజ్ ఠాక్రే కానీ.. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు శివసేన నేతలైన మనోహర్ జోషి, నారాయణ్ రాణె సీఎంలు అయ్యారు. ఇప్పటి వరకూ ఉద్ధవ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి పోటీ చేసి గెలిచి ఠాక్రే కుటుంబం నుంచి చట్ట సభలో అడుగు పెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్ రానున్న 6 నెలల్లో అసెంబ్లీకి కానీ, శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంది. తండ్రి కోసం వర్లీ స్థానాన్ని వదులుకునేందుకు ఆదిత్య సిద్ధంగా ఉన్నారు.  మహారాష్ట్ర అధికార పీఠం ఉద్ధవ్ ఠాక్రే కు రాత్రికి రాత్రి సంక్రమించింది కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల తెర వెనుక కృషి ఫలితమిది. తండ్రి బాల్ ఠాక్రే మాదిరిగా ఆయన దూకుడు స్వభావం వున్న వ్యక్తి కాదు. మృదుస్వభావి, మితభాషి, మౌనంగానే పనులు చక్కబెట్టే నేర్పరి. అతివాద హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉన్న శివసేనను.. వ్యవస్థాగత రాజకీయ పార్టీగా కొంత మితవాదంగా మార్చిన ఘనత ఉద్ధవ్ కే దక్కింది. అసలు బాల్ ఠాక్రే కు ఈయన రాజకీయ వారసుడు కాదని అంత చాలా యేళ్ళ పాటు భావించారు. రాజ్ ఠాక్రే తదుపరి నేత అని అనుకున్నారు. కానీ ఉద్ధవ్ చాప కింద నీరులా విస్తరించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు ఉన్న దూకుడు.. జగడాల మారితనం, వివిధ వర్గాల వారితో విరోధం మొదలైన వాటిని తన ఎదుగుదలలో కూడా వాడుకున్నారు ఉద్దవ్. 1985 బృహన్ ముంబై ఎన్నికల్లో శివసేన విజయంలో కీలక పాత్ర పోషించారు. 1990,2005 మధ్య రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డంకిగా నిలిచిన రాజ్ ఠాక్రే, నారాయణ రాణేలను వ్యూహాత్మకంగా దెబ్బ తీశారు. 2002 లో బీఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో శివసేన విజయ ఢంకా మోగించినట్లు చెయ్యగలిగారు. దాంతో 2003 లో బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2004 లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు.  2014 ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ నేతృత్వంలో స్వతంత్రంగా పోటీ చేసింది. 63 స్థానాల్లో నెగ్గి బిజెపి అనివార్యంగా తన మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఉద్ధవ్ ఠాక్రే ముద్దుపేరు డింగా జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్డ్ లో గ్రాడ్యుయేషన్ చదివారు. తండ్రి మాదిరిగానే కార్టూనిస్ట్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా పేరు. వాటిని ప్రతి ఏటా ముంబైలో ప్రదర్శిస్తారు. 1986 లో స్నేహితులతో కలిసి యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ఠాక్రే 1989 లో రాజకీయ పత్రిక సామ్నా ప్రారంభంలో కీలక భూమిక పోషించారు. రాజకీయ మెళకువలు తెలిసిన రశ్మిని వివాహం చేసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఇద్దరు కుమారులు ఆదిత్య, తేజాస్.  

ఇస్రో మరో విజయం సాధించింది

  భారత అంతరిక్ష ప్రయోగ క్షేత్రం ఇస్రో మరో విజయం సాధించింది. నింగిలో మరో విజయ పతాకాన్ని ఎగురవేసింది. రాకెట్ ప్రయోగాలలో భారతకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-47 వాహన నౌక ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-47 వాహన నౌక కార్టోశాట్ ౩ తో పాటు యూఎస్ కు చెందిన 13 ఉపగ్రహాల్ని నింగి లోకి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. నింగి లోకి వెళుతున్న కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిసల్యూషన్ తో కూడిన చిత్రాలని తీసే సామర్థ్యం ఉంది. ఇస్రో విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఈ అద్భుతమైన రాకెట్ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి వరకూ తమకు 13 మిషన్ లు ఉన్నాయి. ఇస్రోకి తగినంత పని వుందని చెప్పుకొచ్చారు.  ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని కక్ష్య లోకి ప్రవేశ పెడుతోంది. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసి లోకి పంపించారు. ఇందులో 12 ఫ్లో పోపి అనే బుల్లి ఉపగ్రహాలు, మేష్ బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాం ఉంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహించిన 74 వ ప్రయోగం. షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు 48 జరిగాయి. ఇందులో 2 మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకూ 20 వరకు ఎక్సెల్ వాహక నౌకల్లో పంపారు. ఈ ఏడాదిలో ఇది 5 వ రాకెట్ ప్రయోగం. చంద్రయాన్ 2 తరువాత మొదటి ప్రయోగం. కార్టోశాట్ సిరీస్ లో 9 వ ఉపగ్రహం. ఇప్పటి వరకు ఇస్రో కార్టోశాట్ కు చెందిన 8 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. గతంలో పంపిన కార్టోశాట్ 2,2A,2B ఉపగ్రహాల్లోని కేమరాలకు 0.8 మీటర్స్ కచ్చితత్వం ఉంది. కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్ తో చిత్రాలను తీసే సామర్థ్యం ఉంది.

అలిగిన సీనియర్లు... సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి ఇవ్వడమే కారణం!

  మహబూబాబాద్ జిల్లాలో వర్గపోరు రోజు రోజుకి రాజుకుంటుంది. మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. జిల్లా కేంద్రం లోనే మంత్రి సత్యవతి రాథోడ్ ఉంటారు. కానీ మిగితా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమెను కలువరు. తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పిలవరు.  తమ సీనియారిటీని పట్టించుకోకుండా జూనియర్ కు మంత్రి పదవి ఇచ్చారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు మంత్రి వర్గ విస్తరణ జరిగిన నాటి నుంచి మంత్రికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలని మంత్రి ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారని జిల్లాలో చర్చ నడుస్తోంది. మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఫైట్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుని సత్యవతి రాథోడ్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే జిల్లాలో తనకు సహకరించకపోవడంతో ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సత్యవతి సొంత జిల్లా మహబూబాబాద్ మంత్రిగా ఆమె తమ నియోజకవర్గంలో తిరిగితే భవిష్యత్ రాజకీయాల్లో తమకు ఇబ్బంది తప్పదని ఆలోచనతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే అంశంపై కార్యకర్తల్లో చర్చసాగుతోంది.

సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

  సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంపూర్ణేష్‌తో పాటు ఆయన భార్య, కూతురుకు గాయాలైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సంపూర్ణేష్ ఫ్యామిలీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం గత యాభై రోజులుగా తాత్కాలిక డ్రైవర్లలో బస్సులు నడిపిస్తోంది. అయితే ఈ తాత్కాలిక డ్రైవర్ల మూలంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు కూడా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మరణించింది. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే.. సంపూర్ణేష్ కి పెను ప్రమాదం తప్పింది. ఏదిఏమైనా తాత్కాలిక డ్రైవర్ల మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండంతో.. ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అన్నీ అప్పులే.. ఆదాయం పెంచే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కార్!

  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.

నగరి క్యాడర్ కష్టాలు... టిడిపికి తలనొప్పిగా మారిన ముద్దుకృష్ణ కుటుంబ పోరు

  గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగానే.. కాకుండా రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి ఓడిపోయిన తర్వాత చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి టిడిపి ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణ గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తూ 2018 లో మృతి చెందారు. అప్పటి నుంచి గాలి వారసత్వం పై చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాలి ఇద్దరు కొడుకుల మధ్య వార్ కు తెరతీసింది. గాలి పెద్దకొడుకు భానుప్రకాశ్, చిన్న కొడుకు జగదీష్ ల మధ్య వారసత్వపోరు టీడీపీ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీ హైకమాండ్ గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య సరస్వతమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. గాలి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సరస్వతమ్మతో భర్తీ చేసింది. తాత్కాలికంగా వారసత్వపు పోరుకు బ్రేకులు వేసింది.  కానీ 2019 ఎన్నికల్లో నగరి టిడిపి టికెట్ ను దక్కించుకునేందుకు సోదరులు ఫైట్ కు దిగారు. గాలిభానుప్రకాష్ ఓ వర్గం గా గాలి జగదీష్ ఎమెల్సీ సరస్వతమ్మ మరో వర్గంగా నగరి టీడీపీ క్యాడర్ ను పంచుకున్నారు. ఎన్నికల ముందు గాలిభానుప్రకాష్ ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్సీ సరస్వతమ్మ , ఆమె రెండో కొడుకు జగదీష్ లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. భాను ఓటమికి కారణమయ్యారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత పార్టీకే తాము దూరమన్న సంకేతాలిస్తున్నారు.  చిత్తూరు జిల్లాలో ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. నగరి మీటింగ్ కు సరస్వతమ్మ.. జగదీష్ లు దూరంగా ఉన్నారు. ఇక తల్లి , తమ్ముడు పై మరింత పగ పెంచుకున్న గాలిభానుప్రకాష్ వారిని నియోజకవర్గానికి మరింత దూరం చేసే ఎత్తుగడలు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికీ గాలి కుటుంబంలో వేరు వేరు కుంపట్లు పెట్టడంతో బలమైన పార్టీ క్యాడర్ కాస్తా నగరిలో గాలి కుటుంబం దెబ్బకి ముక్కలుగా విడిపోవడంతో కొంప మనిగిందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి కాలమే ముద్దుకృష్ణమ వారసత్వాన్ని నిర్ణయిస్తుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

హైదరాబాద్ లో మరో ప్రమాదం.. ఇద్దరు మహిళల పరిస్థితి విషమం

  వేగం ప్రాణాలు తీస్తున్నా.. వాహనదారుల్లో ఎలాంటి మార్పు కనిపించటం లేదు. అతివేగం.. నిర్లక్ష్యమే ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ వారంలో ఇది మూడో యాక్సిడెంట్. ఎల్బీనగర్‌- దిల్‌సుఖ్‌నగర్‌ ప్రధాన రహదారిపై అన్‌లిమిటెడ్‌ మాల్‌ దగ్గర ప్రమాదం జరిగింది.అతివేగంతో కారు దూసుకొచ్చి రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. అదే వేగంతో కారు పల్టీలు కొడుతూ వెళ్లి మెట్రో డివైడర్‌ను ఢీకొట్టి ఆగింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు..యాక్సిడెంట్ లో గాయపడిన మహిళలను ఓజోన్ ఆసుపత్రికి తరలించారు.  రంగంలోకి దిగిన పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ మహిళలను వెంకటమ్మ , సత్తెమ్మగా గుర్తించారు పోలీసులు. ఇద్దరిలో వెంకటమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగమే కారణమని దర్యాప్తులో పోలీసులకు తెలిపారు స్థానికులు. యాక్సిడెంట్ చేసిన కారు నెంబర్ AP9 AB 5436 మీద ఏవైనా పాత కేసులు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరువుతున్నారు. ప్రమాదంలో కారు పూర్తిగా డ్యామేజ్ కాగా.. ప్రమాదాన్ని కళ్లారా చూసిన స్థానికులు షాక్ కి గురయ్యారు. ఇలా అతివేగంతో నడిపే వారిని కఠినంగా శిక్షించకపోతే ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని మండిపడ్డారు స్థానికులు.  

మాతృభాషకు సెల్యూట్.. తమిళ పోలీసులంతా తమిళంలోనే సంతకం చేయాలి

  ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషకు ప్రాధాన్యత ఇచ్చే ఎన్నో దేశాలను చూస్తున్నాము. ఇతర దేశాల సంగతి పక్కకి పెడితే మన దక్షిణ భారతంలో మాతృభాషను తల్లితో సమానంగా.. ఎంతో ప్రేమిస్తారు. అలా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. అక్కడ పోలీసు శాఖలో తమిళం తప్పనిసరి చేస్తూ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆఫీస్ రికార్డులను తమిళంలో మెయింటేన్ చేయడమే కాకుండా.. ప్రతిరోజు హాజరుపట్టికలో సంతకాలు కూడా తమిళంలోనే చేయాలని డీజీపీ ఆదేశించారు.  తమిళనాట మొత్తంగా ఉన్న అన్ని పోలీసు స్టేషన్లకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు డీజీపీ. స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుండి పోలీస్ కమిషనరేట్లు.. సూపరింటెండెంట్ ఆఫీసులు.. ఇలా ప్రతి రికార్డు తమిళంలోనే ఉండాలన్నారు. పోలీస్ శాఖకు సంబంధించిన అన్ని సీల్స్ కూడా తమిళంలోనే ఉండాలని చెప్పారు. పోలీసు వాహనాలపై కూడా ఇంగ్లీషలో కాకుండా తమిళంలో కవల్(పోలీస్) అనే పదం కనిపించాలన్నారు.  డీజీపీ కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ తమిళనాడు విభాగం సమీక్ష జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.పోలీస్ శాఖలో తమిళం తప్పనిసరి చేయడంతో ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతుంది. మాతృభాషకి పెద్దపీట వేసినట్టు అవుతుందని సంతోష పడుతున్నారు. మాతృభాష పరిరక్షణ కోసం మొదటి అడుగు వేస్తూ ఇలా చర్యలు తీసుకోవడం హర్షణీయం అన్నారు. మాతృభాష పట్ల తమిళులకు అమితమైన అభిమానం.. అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇలా తమిళం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తమిళ ప్రజలు ఆనందంగా స్వీకరిస్తున్నామని అంటున్నారు.

త్వరలోనే కూలిపోతుంది... శివసేన సర్కారుపై ఫడ్నవిస్ జోస్యం

మరాఠా రాజకీయం మరో మలుపు తిరిగింది. ఎవరూ ఊహించని-విధంగా ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేసిన ఫడ్నవిస్... అంతే సంచలనం రేపుతూ... బలపరీక్షకు ముందే చేతులెత్తేశారు. బలనిరూపణకు సుప్రీం ఒక్కరోజు మాత్రమే టైమివ్వడంతో... గట్టెక్కడం కష్టమని భావించిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే, ఫడ్నవిస్ కూడా రిజైన్ చేశారు. దాంతో, బలపరీక్షకు ముందే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. అజిత్‌ పవార్ మద్దతు లేఖ ఇవ్వడంతో ఎన్సీపీ... తమతో ఉందనుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, కానీ... తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాజీనామా చేస్తున్నట్లు ఫడ్నవిస్ ప్రకటించారు. అయితే, బీజేపీని శివసేన మోసం చేసిందన్న ఫడ్నవిస్ నిప్పులు చెరిగారు. అధికారం కోసం హిందుత్వాన్ని సోనియా కాళ్ల దగ్గర ఫణంగా పెట్టారని మండిపడ్డారు. సైద్ధాంతిక విభేదాలున్నా... అధికారం కోసమే శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ఏకమయ్యాయన్న ఫడ్నవిస్... త్వరలోనే ఈ కూటమి విచ్ఛిన్నమవడం ఖాయమన్నారు. మొత్తం పరిణామాలను మరాఠా ప్రజలు గమనిస్తున్నారన్న ఫడ్నవిస్‌... ఇకపై తాము ప్రతిపక్షంలో కూర్చొని ప్రజావాణి వినిపిస్తామని ప్రకటించారు. పార్టీ ఫిరాయింపులను పోత్సహించే తత్వం తమది కాదని, అందుకే, ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడుతానని స్పష్టం చేశారు. అయితే, కేవలం అధికారం కోసమే ఎన్సీపీ, కాంగ్రెస్ తో చేతులు కలిపిన శివసేన ప్రభుత్వం మధ్యలోనే కూలిపోక తప్పదని జోస్యం చెప్పారు.

మంత్రుల బండ్లు యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి?... అసలు కాన్వాయ్‌లో ఏం జరుగుతుంది ?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కాన్వాయ్ లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మంత్రి కాన్వాయిలో వెనుక వస్తున్న వాహనం బోల్తా పడి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో మంత్రుల కాన్వాయ్ లో తరచూ ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయని సమస్య మొదలైంది. కాన్వాయ్ లో ఏం జరుగుతోంది అని ఆరా తీస్తే అసలు విషయాలు బయటికొచ్చాయి. కాన్వాయ్ లో మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు. లేటెస్ట్ వెర్షన్ ఫార్చునర్ వాడుతున్నారు, అయితే ఇచ్చిన కారు సౌకర్యంగా లేదని మంత్రులు తమ సొంత కార్లలో ప్రయాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని వదిలి ఓల్వో, బెంజ్ కార్లలో తిరుగుతున్నారు. ఈ కార్లల్లో హై ఎండ్ ,సెకన్ లలో వంద కిలోమీటర్ల స్పీడ్ దాటి పరుగుపెడతాయి.దీంతో ఈ కారును స్పీడ్ ను కాన్వాయ్ లోని ఇతర వాహనాల్లో అందుకోలేకపోతున్నాయి. మంత్రి కారును అందుకోవాలని స్పీడుగా వెళ్లి పైలట్ ఎస్కార్ట్ సిబ్బంది వాహనాల ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా జరిగిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు కాన్వాయ్ ప్రమాదంలోనూ ఇదే జరిగింది. తన సొంత బెంజ్ కారులో ఎర్రబెల్లి ప్రయాణం చేస్తే ఆయన కారును అందుకోవాలని స్పీడ్ గా కాన్వాయ్ వాహనం వెళ్ళిందని తెలిసింది. చివర్లో స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ప్రమాదానికి గురైంది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్ లో వాహనం కూడా బోల్తా పడింది. అయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కావడం వల్ల ఆయన సురక్షితంగా బయట పడ్డారు. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్ లు కూడా అప్పుడప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వదిలి సొంత వాహనాల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో ఈ విషయాన్ని పోలీసులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అప్పట్లో మంత్రులందరూ ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడాలని సీఎం ఆదేశించారు. అయినప్పటికీ మళ్లి కొంత మంది మంత్రులు సొంత వాహనాన్ని వాడుతున్నారు. రూరల్ ఏరియా లో సింగిల్ రోడ్ల పై మంత్రుల కాన్వాయ్ కు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు కంట్రోల్ తప్పి సామాన్యుల పై దూసుకెళుతున్నాయి. వరుసగా జరుగుతున్న ప్రమాదాల చూసైనా మంత్రుల తీరు మార్చుకోవాలని బయటికి చెప్పుకోలేక సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

మహా ముఖ్యమంత్రిగా ఉద్ధవ్... డిప్యూటీలుగా జయంత్, థోరాట్

మొత్తానికి అనుకున్నది సాధించారు. మరాఠా అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. అనేక మలుపులు తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి పగ్గాలను శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే అందుకోబోతున్నారు. డిసెంబర్‌ ఒకటిన శివాజీ పార్క్‌లో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిప్యూటీలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణం చేస్తారు. బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. ముంబైలో సమావేశమైన శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు... మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా  ఉద్ధవ్ ఠాక్రే‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకం చేసిన మద్దతు లేఖను అందజేశారు.  ఇక, గవర్నర్ ఆదేశాలతో ఈరోజు మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. ఉదయం 8గంటలకు ప్రారంభంకానున్న సభ.... ఎమ్మెల్యేల ప్రమాణం తర్వాత ముగియనుంది. ప్రొటెం స్పీకర్ కాళిదాస్... నూతన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు.

అక్టోబర్ 21 నుంచి నవంబర్ 26 వరకు... మహారాష్ట్రలో ఏ రోజు ఏం జరిగిందంటే...!

# (అక్టోబర్‌ 21)న మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగగా... బీజేపీ-శివసేన ఒక కూటమిగా, కాంగ్రెస్-ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగాయి. # (అక్టోబర్‌ 24)న మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 288 స్థానాలకు బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్ 44 సీట్లు గెలుచుకోవడంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అయితే, కూటమిగా బరిలోకి దిగిన బీజేపీ-శివసేనకు కలిపి 161 స్థానాలు రావడంతో... ఎప్పటిలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని అంతా భావించారు.  # (అక్టోబర్‌ 25)న బీజేపీ, శివసేన మధ్య విభేదాలు బయటపడ్డాయి. 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ఎన్నికలకు ముందు జరిగిన ఒప్పందం మేరకు ము‌ఖ్యమంత్రి పదవిని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అయితే, శివసేన డిమాండ్‌ను బీజేపీ తిరస్కరించడంతో మహా డ్రామా మొదలైంది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన శివసేన... ఎన్సీపీ అండ్ కాంగ్రెస్‌తో సంప్రదింపులు జరిపింది. మరోవైపు, శివసేనను చీల్చి, ఇండిపెండెంట్ల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ పావులు కదిపింది. ఇలా అక్టోబర్ 25నుంచి నవంబర్ 9వరకు మహారాష్ట్రలో నెంబర్ గేమ్ సాగింది. # (నవంబర్ 9) మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగియడంతో, ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ ఆహ్వానించారు.  # (నవంబర్ 10) తగినంత సంఖ్యాబలం లేనందున తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తేల్చిచెప్పడంతో, సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన శివసేనను ఆహ్వానిస్తూ, 24గంటల గడువిచ్చారు. # (నవంబర్ 11) అయితే, ఎన్సీపీ-కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికొచ్చిన శివసేన... చర్చల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో, ప్రభుత్వ ఏర్పాటుకు 3రోజులు గడువు ఇవ్వాలని గవర్నర్‌ను కోరింది. శివసేన విజ్ఞప్తిని తిరస్కరించిన గవర్నర్... మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ‎ఎన్సీపీకి ఆహ్వానం పలికారు.  # (నవంబర్ 12) అయితే, ఎన్సీపీకి ఇచ్చిన గడువు ముగియకముందే, రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేయడంతో... కేంద్రం, రాష్ట్రపతి ఆమోదంతో ఆగమేఘాల మీద, ప్రెసిడెంట్‌ రూల్ విధించారు. # (నవంబర్ 13) గవర్నర్‌ నిర్ణయంపై మండిపడ్డ శివసేన... ప్రభుత్వ ఏర్పాటుకు తాము గడువు కోరినా, ఇవ్వలేదంటూ, సుప్రీంను ఆశ్రయించింది. # (నవంబర్ 13-21) ఒకవైపు సుప్రీంలో కేసు నడుస్తుండగానే... మరోవైపు కాంగ్రెస్‌, ఎన్సీపీలతో శివసేన సంప్రదింపులు సాగించింది. అయితే, శరద్ పవార్‌‌ను మోడీ ప్రశంసించడం... వెంటనే ప్రధానితో పవార్ సమావేశం కావడంతో... బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయేమోనంటూ ప్రచారం జరిగింది. # (నవంబర్ 22) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ మధ్య చర్చలు కొలిక్కిరావడంతో, ఉద్ధవ్‌కు మద్దతిచ్చేందుకు సోనియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. # (నవంబర్ 23) అయితే, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవడంతో... బీజేపీ రాత్రికి రాత్రే వేగంగా పావులు కదిపింది. ఎవరూ ఊహించనివిధంగా ఉదయం 5:47కి రాష్ట్రపతి పాలన ఎత్తేయగా, ఆ కొద్దిసేపటికే ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా... ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దాంతో, దేశం మొత్తం నివ్వెరపోయింది. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ అయితే ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాయి. ఎన్సీపీ-శాసనసభాపక్షనేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడంతో... ఎన్సీపీలో చీలిక వచ్చిందేమోనని భావించారు. అయితే, అజిత్ వెంట ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని శరద్ పవార్ ప్రకటించడంతో మహా డ్రామా మరో కొత్త మలుపు తిరిగింది. అదే సమయంలో, గవర్నర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సుప్రీంను ఆశ్రయించాయి.  # (నవంబర్ 24) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ పిటిషన్లపై అత్యవసర విచారణ జరిపిన సుప్రీం... గవర్నర్‌కు బీజేపీ సమర్పించిన మద్దతు లేఖలను తమ ముందు పెట్టాలని ఆదేశించింది. # (నవంబర్ 25) శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌లు బల ప్రదర్శనకు దిగాయి. 162మంది ఎమ్మెల్యేలతో మహా పరేడ్ నిర్వహించాయి.  # (నవంబర్ 26) మహారాష్ట్ర వివాదంపై తుది తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.... బలనిరూపణ చేసుకోవాలంటూ ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఒక్కరోజు టైమిచ్చింది. అయితే, సుప్రీం తీర్పు తర్వాత మహారాష్ట్రలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. అయితే, బలపరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్‌... ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.  # (నవంబర్ 26-27) బలపరీక్షకు ముందే బీజేపీ చేతులెత్తేయడంతో... ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమి ముందడుగు వేసింది. మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి నేతగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఎన్నుకున్నారు. అనంతరం గవర్నర్‌ను కలిసి ఎమ్మెల్యేలు సంతకాలు చేసిన లేఖను అందజేశారు. దాంతో, డిసెంబర్ ఒకటిన శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే‌.... డిప్యూటీ సీఎంలుగా ఎన్సీపీ నేత జయంత్ పాటిల్... కాంగ్రెస్ లీడర్‌ బాలా సాహెబ్‌ థోరాట్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు.

జీవీఎల్ సైలెన్స్‌కి కారణమేంటి? మోడీ-షాకి ఫిర్యాదు చేసిందెవరు?

జీవీఎల్ నరసింహరావు... బీజేపీ ఫైర్ బ్రాండ్ లీడర్... ఇక జీవీఎల్ స్టైలే వేరు... ప్రెస్ మీట్ పెట్టారంటే ఏదో ఒక సంచలనం ఉండి తీరుతుంది... 2014కి ముందు పెద్దగా ఎవరికీ తెలియకపోయినా... ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చాక... చంద్రబాబుపైనా, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంపైనా తీవ్ర ఆరోపణలు చేయడంతో జీవీఎల్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. జీవీఎల్ ఏ ఆరోపణ చేసినా నిజమేననిపించేలా ఉండేవి. ఎక్కువగా టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసేవారు. ఇవిగో ఆధారాలంటూ లెక్కలతో సహా వివరించేవారు. దాంతో, జీవీఎల్ ను ఎదుర్కోవడానికి టీడీపీ నేతలు నానా తిప్పలు పడేవారు. ప్రతి అంశంలోనూ లోతైన విషయ పరిజ్ఞానంతోపాటు వాగ్ధాటి మరో అడ్వాంటేజ్ గా ఉండటంతో టీవీ డిబేట్స్ లో ప్రత్యర్ధులపై మాటల తూటాలతో విరుచుకుపడేవారు.  అయితే, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా, అలాగే బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న జీవీఎల్ కొద్దిరోజులుగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత, ఇంగ్లీష్ మీడియం, రాజధాని వివాదం, మత వివాదం.... ఇలా అనేక బర్నింగ్ ఇష్యూస్ తో విపక్షాలన్నీ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే... జీవీఎల్ మాత్రం తనకేమీపట్టనట్టు మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశమైంది. ప్రత్యర్ధులపై పదునైన మాటలతో విరుచుకుపడుతూ బీజేపీ తరపున బలమైన వాయిస్ వినిపించే జీవీఎల్ ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే, జీవీఎల్ మౌనం వ్యూహాత్మకమా? లేక అధిష్టానం ఆదేశమా అనే చర్చ జరుగుతోంది. జీవీఎల్ సైలెన్స్ కి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. వైసీపీ అండ్ జగన్ సర్కారుపై బీజేపీ హైకమాండ్ ఇంకా స్పష్టమైన స్టాండ్ తీసుకోలేదని... అందుకే మౌనంగా ఉన్నారని అంటున్నారు. అయితే, రాజధాని ఇష్యూలో ఆమధ్య జగన్ సర్కారుకు అనుకూలంగా జీవీఎల్ మాట్లాడరనే విమర్శలు వచ్చాయి. ఏపీ బీజేపీ నేతలకు భిన్నంగా జీవీఎల్ మాట్లాడటంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, దాంతో సైలెన్స్ అయ్యారని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీలో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పులు జరిగిన తర్వాత, వైసీపీ అండ్ జగన్ సర్కారుపై ఎలా వ్యవహరించాలో స్పష్టత వస్తుందని, ఆ తర్వాత తన వాయిస్ వినిపించాలని జీవీఎల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే, టీడీపీ, జనసేనతో మళ్లీ కలిసి సాగే అవకాశముందని ప్రచారం జరుగుతుండటంతో... దీనిపైనా క్లారిటీ కోసం చూస్తున్నారట. మొత్తానికి ప్రత్యర్ధులపై మాటల తూటాలు పేల్చే జీవీఎల్... వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నారని... వన్స్ ఏపీ పొలిటికల్ స్టాండ్ పై అధిష్టానం క్లారిటీ ఇచ్చిందంటే మాత్రం మళ్లీ సూపర్ యాక్టివ్ అవుతారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

సీఎం రమేష్‌ ఈవెంట్లో వలసల రాజకీయం... దుబాయ్ వేదికగా బేరసారాల మంత్రాంగం

రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ నిశ్చితార్థ వేడుక కోసం 25కోట్ల రూపాయలను సీఎం రమేష్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. దాంతో, 700మంది వీవీఐపీ గెస్టులు, 15 స్పెషల్ ఫ్లైట్లు, కళ్లు చెదిరే ఏర్పాట్లతో ఎంగేజ్ మెంట్ వేడుక కనీవినీ ఎరుగనిరీతిలో జరిగింది. ఇక, ఏపీ, తెలంగాణతోపాటు పలువురు జాతీయ నేతలు, సినీ రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. అయితే, సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థం వేడుక ...రాజకీయాలకు కూడా వేదికగా మారిందని అంటున్నారు. జంపింగ్ జపాంగులు తమ చర్చల కోసం ఈ ఈవెంట్ ను వేదికగా మార్చుకున్నారని అంటున్నారు. సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకకు అన్ని పార్టీల నేతలూ వెళ్లారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి బాంబు పేల్చడం... దానికి కొనసాగింపుగా... దుబాయ్ వేదికగా వలసల రాజకీయం జరుగుతోందంటూ సీపీఐ నారాయణ వ్యాఖ్యానించడంతో... సీఎం రమేష్ కుమారుడి ఎంగేజ్ మెంట్ వేడుక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎందుకంటే, నిశ్చితార్థ వేడుక కోసం దుబాయ్ వెళ్లిన 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు... బీజేపీ నేతలతో చర్చలు జరిపారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాషాయ గూటికి చేరాలని నిర్ణయించుకున్న గంటా... ఈ జంపింగ్ జపాంగులకు నాయకత్వం వహించినట్లు చెబుతున్నారు. సీఎం రమేష్‌ కుమారుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొనేందుకు దుబాయ్‌ వెళ్లిన వైసీపీ, టీడీపీ ప్రజాప్రతినిధులంతా పార్టీ మారతారని చెప్పలేం. కానీ, దుబాయ్ వేదికగా మాత్రం జంపింగ్ జపాంగులు మంతనాలు, బేరసారాలు మాత్రం కచ్చితంగా సాగాయని అంటున్నారు. దుబాయ్ వేదికగా సాగిన పరిణామాలను గమనిస్తే ఏపీ రాజకీయాల్లో పెను సంచలనాలు ఉంటాయంటున్నారు.

జగన్ క్యాంపు ఆఫీస్ మెయింటనెన్స్ కి 1.94 కోట్లు.. ఉత్తర్వులు జారీ

  జగన్ క్యాంపు కార్యాలయం రక్షణ నిర్వాహణ కొత్త సదుపాయాల కల్పన కోసం వివిధ పద్దుల కింద 1.94 కోట్ల కేటాయింపుకు పరిపాలన అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో గుంటూరు జిల్లా తాడేపల్లి నివాసం వార్షిక నిర్వాహణకే 1.20 కోట్లు కేటాయించారు. ఇక్కడ జగన్ నివాసం క్యాంపు కార్యాలయంలో అల్యూమినియం కిటికీలు కొత్తగా ఏర్పాటు చేయటానికి గత నెలలో 73 లక్షలు విడుదల చేశారు. ఇప్పుడు ఫర్నీచర్ కోసం 39 లక్షలు కేటాయిస్తూ రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు ఇచ్చారు. జగన్ తాడేపల్లిలో ఉన్న తన నివాసాన్ని క్యాంప్ ఆఫీస్ గా మార్చుకున్నారు. ఆ ఇంటి కిటికీలు తలుపుల కోసం 73 లక్షలు విడుదల చేస్తూ ఇంతకు ముందే జీవో విడుదలైంది. ఓ వైపు ఖర్చులు తగ్గించుకోవాలి అంటూనే సొంత ఇంటికి కోట్ల ఖర్చుపెట్టడం పై విపక్షాలు భగ్గుమంటున్నాయి. గత ఐదు నెలల్లో జగన్ ఇంటి కోసం 16 కోట్లను ఎలా ఖర్చు చేశారంటూ టిడిపి ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే జగన్ ఇంటి వద్ద హెలిప్యాడ్ నిర్మాణానికి 1.89 కోట్ల, బారికేడ్ లకు 75 లక్షలు, పోలీస్ బ్యారెక్ టాయిలెట్ బ్లాక్ కు 30 లక్షలు, సెక్యూరిటీ పోర్స్ గేట్స్ పోర్టబుల్ క్యాబిన్స్ ఏర్పాటుకూ 31 లక్షలు, గార్డ్ రూమ్ అండ్ టాయిలెట్ బ్లాక్ కు మరో 13.5 లక్షల నిధులు కేటాయించారు. కిటికీల రేటు బయటకు వచ్చినప్పుడే అవేమైనా బంగారుతో చేసారా అంటూ కౌంటర్లు వేశారు. ఇక మొత్తం మీద 16 కోట్లు ఖర్చు అయ్యిందంటే సీఎం గారిని ప్రభుత్వాన్ని విపక్షాలు.. నెటిజన్లు.. ఏమంటారో చూడాలి.

నీతి లేని బ్రతుకులు.. చనిపోయిన వారి పేరు మీద పట్టాలు ఇస్తున్న అధికారులు!

  రెవిన్యూ ఆఫీసుల్లో అవినీతి అలజడి రేపుతోంది. ఏ పనికైనా పైసా లేనిదే పని కావడం లేదన్న ఆరోపణలకు బలం చేకూరుతున్నాయి. తహసీల్దార్ విజయరెడ్డి హత్య తరువాత ఏమైనా మార్పు వచ్చిందా అంటే అది కనిపించటలేదు. అవినీతికి అలవాటు పడిన కొందరు ఇంకా బల్లకింద చేయి పెడుతూనే ఉన్నారు. పట్టాల కోసమో ఇతరత్రా పనుల కోసం రెవెన్యూ ఆఫీసులకు వస్తున్న అన్నదాతలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. చెప్పులు అరగడం తప్ప ఒక్క పని కావడంలేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది. రోజులు నెలలు కాదు సంవత్సరాల తరబడి తిరుగుతున్న పని కావడం లేదన్న ఆందోళన మాత్రం రైతన్నల్లో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో కొందరు రైతన్నలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అయ్యా.. అమ్మా.. అని వేడుకున్నా పని కాకపోవడంతో అబ్దుల్లాపూర్ మెట్ ఘటన తరహాలో కొందరు దాడులకు దిగే యత్నం చేస్తుండగా.. మరి కొందరు నిస్సహాయ స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే మెర్సీ కిల్లింగ్ కు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ టార్చర్ ను భరించడం తమ వల్ల కాదని వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన అయినాల శంకర్ దీ ఇదే పరిస్థితి. శంకర్ 9 ఏళ్ల క్రితం 8 ఎకరాల భూమి కొన్నాడు. బీడు భూమి కొని సాగు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే దాన్ని రిజిస్ర్టేషన్ చేయడం పై పాత యజమాని విష్ణు తాత్సారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే అతను చనిపోగా శంకర్ కి కూడా యాక్సిడెంట్ అయింది. ఈ క్రమంలో విష్ణు భార్య ఆ భూమి విషయంలో వీఆర్వో సహాయంతో వన్ బీ పట్టా పొంది తన పేరు మీదకు మార్చుకుంది. దీంతో మరింత ఆవేదనకు గురైన శంకర్ తండ్రి ఉప్పలయ్య హార్ట్ ఎటాక్ తో చనిపోగా తాను కూడా బతకడం వృథా అని శంకర్ వాపోతున్నాడు. అనుమతిస్తే మెర్సికిల్లింగ్ కు సిద్దమని రెవెన్యూ కార్యాలయాలం ముందు ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఇదిలా వుంటే కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో ఇటీవల మరో ఘటన జరిగింది. జీల కనకయ్య అనే రైతు తన భూమికి సంబంధించిన పాస్ బుక్కుల కోసం తిరిగి తిరిగి అలసి పోయాడు. ఆగ్రహాన్ని నిగ్రహించుకోలేక పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి అధికారులపై చల్లే యత్నం చేసి అరెస్టయ్యాడు. ఇక వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ తహసీల్దార్ గా డీఎస్ వెంకన్న ఇటీవల చార్జి తీసుకునేందుకు వచ్చాడు. అయితే తన చాంబర్ లో ఒకే టేబుల్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అలా కాదని మూడు టేబుళ్లను ఆ టేబుల్ ముందు రక్షణగా ఉంచాలన్న కండిషన్ ని పెట్టాడు. అలా అమర్చాకే మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంటే మొత్తంగా ఓ భయమైతే రెవెన్యూ అధికారుల్లో నెలకొంది. కానీ అవినీతికి పాల్పడటము, డబ్బులు తీసుకోకుండా పని చేస్తామని మాత్రం చెప్పడం లేదు. ప్రజల నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహాలతో మరింత భద్రత కావాలన్న డిమాండ్ ను తీసుకురావటం వాళ్ల పని తీరుకు అద్దం పడుతోందన్న విమర్శ వినిపిస్తోంది.  

బాబాయ్ ని చంపిన వారిని ఎందుకు పట్టుకోలేదు జగన్?

  బాబాయ్ ని చంపిన వారిని ఎందుకు పట్టుకోలేకపోయారని సీఎం జగన్ ను ప్రశ్నించారు మాజీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా ఏం చేశారంటూ నిలదీశారు. ఇంటి దొంగల పనేనని చెప్పినందుకే ఎస్పీని ట్రాన్స్ ఫర్ చేశారని విమర్శించారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.కోర్టుకు వెళ్లి విచారణ చేయకుండా ఈ అంశం గురించి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు మాట్లాడకుండా ఉండాలని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారన్నారు. ఆరు నెలలు అవుతున్నా కేసు విషయం ఏమి చేశారంటూ బాబు నిలదీసారు. కడప జిల్లా గడ్డ మీద కుర్చొని అడుగుతున్నానని.. సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా అంటూ మండిపడ్డారు. మీరు ఇంత నీచంగా ప్రవర్తిస్తూ.. సొంత బాబాయిని చంపిన ఇంటి దొంగలను పట్టుకోలేని వారు.. మా వాళ్ల పై తప్పుడు కేసులు పెట్టి హెరాస్ మెంట్ చేస్తారా అని జగన్ సర్కార్ పై బాబు భగ్గుమన్నారు. ధర్మం అనేది ఉంటుందని చివరకు ధర్మమే జయిస్తుంది కానీ ఆధర్మం జయించదని.. మేము ధర్మం కోసం పోరాడుతున్నమని.. మన పోరాటం ధర్మపోరాటం అని బాబు కడప జిల్లా పర్యటన సందర్బంగా వెల్లడించారు.

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ఢీకొని యువతి మృతి

  హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు నెంబర్ 12 లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ పై వెళ్తున్న యువతి స్పాట్ లోనే చనిపోయింది. బస్సు టైర్ యువతి తల పై నుంచి వెళ్లడంతో నుజ్జు నుజ్జయింది. బస్సు నడుపుతున్న వ్యక్తి తాత్కాలిక డ్రైవర్ కావడంతో స్థానికులు పట్టుకుని చితకబాదారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పని చేస్తున్న సోహినీ సక్సేనాగా గుర్తించారు పోలీసులు. బర్కత్ పురాకి చెందిన బస్ డ్రైవర్ బస్సును అతి వేగంగా నడపడం వల్ల ఎదురుగా వస్తున్న యువతి స్కూటీ దిగుతుండడంతో స్కూటీ బస్సు టైర్ల మధ్య ఇరుక్కు పోయింది. దీనితో మహిళ స్పాట్లోనే చనిపోయింది.అదే బస్సులో ఉన్న ప్రయాణికులు మరియు అక్కడి స్థానికులు ఆ బస్సు డ్రైవర్ పై దాడి చేశారు. ప్రమాదం జరిగిన స్పాట్ లో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయని చెప్తున్నారు స్థానికులు. గత మూడేళ్లలో అదే స్పాట్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన ప్రమాదంలో డ్రైవర్ అతివేగంగా వెళ్ళడం వళ్ళే జరిగింది. అతనికి బ్రేక్ కంట్రోల్ కాకపోవడం.. ఆ మహిళ పై నుంచి పోనివ్వడం.. వల్లే ఇంతటి ప్రమాదం చోటు చేసుకుంది. మహిళ స్పాట్లోనే చనిపోవడంతో పోలీసులు మృతిదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారాని సమాచారం.