వరాల వరద.. కేసీఆర్ వరాల జల్లులో తడిసి ముద్దైన ఆర్టీసీ ఉద్యోగులు

  సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు అందించారు. సెప్టెంబరు నెల జీతాలు వెంటనే చెల్లిస్తామని సీఎం సమ్మె కాలపు జీతాన్ని సైతం ఇస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల వయో పరిమితి పెంపు, సమ్మె సమయంలో చనిపోయిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు.ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి పలికి అందరిని ఉద్యోగులనే పిలవాలన్నారు సీఎం కేసీఆర్. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి 8 రోజులు ఉద్యోగం ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం తరపున 2 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్టుగా స్పష్టం చేశారు.  ఆర్టీసీ కార్మికులతో సీఎం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో వరాలు కురిపించారు. సమావేశంలో మాట్లాడిన కేసీఆర్ కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేసుకోవాలి తప్ప ఉద్యోగం తొలగించొద్దని ఉన్నతాధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్తలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపామని.. కరెంటు , మంచినీటి సమస్యలు పరిష్కరించామని అన్నారు.మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వెయ్యొద్దని రాత్రి ఎనిమిది గంటలకు మహిళలు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి డిపోలో కేవలం ఇరవై రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక మరుగు దొడ్లు, డ్రెస్సింగ్ చేంజ్ గదులు, లంచ్ గదులు ఏర్పాటు చెయ్యాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేస్తామన్నారు. మహిళలకూ కాకీ డ్రెస్సు తొలగిస్తామని, యూనిఫాం వేసుకునే వెసులుబాటు కల్పిస్తామని సీఎం తెలిపారు. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదని సీఎం కేసీఆర్ చెప్పారు.ప్రతి డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.  ఉద్యోగుల తల్లితండ్రులు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసుల అందించాలనీ హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల తల్లితండ్రులకు ఉచిత బస్ పాసులు అందించాలని ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందన్నారు. ఉద్యోగుల పీఎఫ్ బకాయిలను సీసీఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తామన్నారు. డిపోలో కావలసిన స్పేర్ పార్ట్స్ ను అందుబాటులో ఉంచుతామని ఆర్టీసిలో పని చేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తామని ఆర్టీసి ఉద్యోగుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుందని పేర్కొన్నారు. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలని ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.  

వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా.. నెలకు రూ.5000 ఇవ్వనున్న జగన్ ప్రభుత్వం

  నేడు ( డిసెంబర్ 2న ) మరో కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే పథకానికి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే వైయస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ప్రారంభించనున్నారు. గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ పథకం ద్వారా రోజుకు 225 లేదా నెలకు గరిష్ఠంగా రూ.5000 రూపాయలను సాయంగా అందజేస్తారు. 3 నెలల పాటు రూ.5000 చొప్పున అందించనున్నారు.  శస్త్ర చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బు బారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతోంది. ఈ స్కీమ్ తో ఏటా నాలుగున్నర లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల ఎకౌంట్ లో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించనుంది. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలను ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే జారీ చేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు వివరాలు ఇవ్వాల్సి వుంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంక్ ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమ చేస్తారు. ఈ పథకం అమలులో ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.  గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఆరోగ్య శ్రీ కార్డు ద్వారా లబ్దిపొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆరోగ్య శ్రీ ద్వారా శస్త్ర చికిత్స చేసుకున్న రోగులకూ ఆయన చెక్కులు అందించనున్నారు. అంతేకాదు ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన క్యాన్సర్ వార్డును ప్రారంభించనున్నారు. అనంతరం గుంటూరు మెడికల్ కాలేజ్ జింకానా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటారు. చిన్న పిల్లలకు సంబంధించిన కాక్లియర్ ఇంప్లాంట్స్ కు సంబంధించి బ్రోచర్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం అదే వేదిక పై నుంచి ప్రసంగిస్తారు, సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం వచ్చే రూట్లలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

శ్రీ యేసయ్య నమః.. అన్యమత ప్రచారాలతో హోరెత్తుతున్న టీటీడీ

  ప్రతి ఏటా తిరుమలలో జరిగే కార్యక్రమాలను తెలుసుకునేందుకు టీటీడీ క్యాలెండర్ ను కొనుగోలు చేస్తారు శ్రీ వారి భక్తులు. తిరుమల పంచాంగం తెలుగుతో పాటు ఇంగ్లీష్ క్యాలెండర్ అందించేవారు కూడా ఉంటారు. ఆంగ్ల సంవత్సరం 2020  దగ్గర పడుతున్నందున ఎప్పటిలాగే తిరుమల కొత్త క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వారంతా ఆన్ లైన్ లో క్యాలెండర్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలా క్యాలెండర్ కోసం సెర్చ్ చేస్తున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. టీటీడీ కొత్త క్యాలెండర్ డౌన్ లోడ్ కోసం చూస్తున్న వారికి ఇలా డిస్క్రిప్షన్ లో అన్యమత నినాదం శ్రీ యేసయ్యా అని దర్శనమిచ్చింది. ఇంకా కొత్త క్యాలెండర్ ను టీటీడీ అప్ లోడ్ చేయలేదు. కానీ పాత క్యాలెండర్ లో ఇపుడు అన్యమత నినాదం కనిపించటం విమర్శలకు తావిస్తోంది. పాత క్యాలెండర్ పీడీఎఫ్ డౌన్ లోడ్ డిస్క్రిప్షన్ లో ఈ నినాదం కనిపించడంతో యేసయ్య పేరు తిరుమల సైటులో ఎందుకొచ్చింది అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ అధికారుల తీరుపై హిందూ సంఘాల నేతలు.. శ్రీ వారి భక్తులు మండిపడుతున్నారు. టీటీడీలో అసలు ఏం జరుగుతోందంటూ ప్రశ్నిస్తున్నారు బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి. టీటీడీలో అన్యమతస్తులను వెంటనే తొలగించాలని ఈ వ్యవహారంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  వెబ్ సైట్ లో అన్యమత ప్రచారంపై టీటీడీ టెక్నికల్ విభాగం పొంతన లేని సమాధానం చెబుతుంది. వివాదం పై స్పందించిన టీటీడీ ఈవో సింఘాల్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఇది ఇంటి దొంగల పనే కావచ్చని అనుమానిస్తున్న విజిలెన్స్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం సాగుతోందని కొంత కాలంగా ఆరోపణలొస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలోకి వచ్చాక ఏపిలో మతాల లొల్లి ఎక్కువైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఏకంగా తిరుమల సైటులోనే అన్యమత ప్రచారంపై హిందూ మత సంఘాలు శ్రీ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అగస్టులో బస్సు టికెట్ లతో అన్యమత ప్రచారం చేశారు. తిరుమల వెళ్లే బస్ టిక్కెట్ల వెనుక హాస్ జెరూసలేం యాత్ర ప్రకటనలు ముద్రించి ఉండడంపై వివాదం రేగింది. ఆ టిక్కెట్లు గత ప్రభుత్వ హయాంలో ముద్రించినవి అని చెప్పి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఏకంగా తిరుమల వెబ్ సైట్ లోనే ప్రచారం నిర్వహించడం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

చెన్నైలో కుంభవృష్టి.. నీట మునిగిన నగరం.. స్తంభించిన జనజీవనం

  చెన్నైలో అకాల వర్షాలు భయపెడుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు భారీ వర్షం కురిసింది. ఏకంగా 14  సెంటిమీటర్ల వర్షం కురవడంతో రోడ్లన్నీ జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. భారీ వర్షానికి జన జీవనం స్తంభించిపోయింది. కుండపోత వర్షాలకు కొన్ని చోట్ల ఇళ్లలోకి సైతం నీళ్లు చొరబడ్డంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారుల తీరు మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కొత్త కాలువల నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆగి ఉండడంతో నీళ్లు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఆయా మార్గాల్లో ప్రయాణం గగనంగా మారింది. ఇక వేలూరు జిల్లా పరిధిలో అనేక చోట్ల భారీ వర్షం దాటికి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కొన్ని కళాశాలల్లో జరగాల్సిన పరీక్షలను యాజమాన్యాలు వాయిదా వేశాయి. చెన్నై లోని ట్రిప్లికేన్, పురసైవాక్కం, విల్లివాక్కం,ఎగ్మోర్, ధీనగర్, వడపళని, అంబత్తూరు, ఆవడి ప్రాంతంల్లో భారీ వర్షం కురిసింది. ఈశాన్య రుతు పవనాలు మరింత బలపడే అవకాశాలతో మరో 3 రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీర ప్రాంత జిల్లాల్లో మోస్తరుగా వర్షం పడుతోందని ఉత్తర తమిళనాడులో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ కేంద్రం సమాచారంతో అధికార వర్గాలు అప్రమత్తమయ్యాయి. 2015 లో ఇదే తరహాలో నవంబరు చివరిలో భారీ వర్షం పడటం, డిసెంబర్ 1,2 తేదీల్లో రాత్రికి రాత్రే కురిసిన వర్షాలతో చెన్నై నీట మునిగింది. ప్రస్తుతం అదే తరహా వర్షం పడే అవకాశాలు ఉండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.  మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒంగోలు పట్టణం నీట మునిగింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న పరిణామాలతో అకాల వర్షాలు పడుతున్నాయి. ఇటీవల కర్ణాటకలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. కర్ణాటకలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతవరణ శాఖ కేంద్రం. పలు రిజర్వాయర్లలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అవి నిండుకుండలను తలపిస్తున్నాయి. ఏ క్షణమైనా రిజర్వాయర్ల గేట్లు ఎత్తివేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరద ప్రవాహంలో వాహనాలు కొట్టుకుపోయాయి. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని వందలాది గ్రామాలు నీట మునిగాయి. అపార పంట నష్టం జరిగింది. మొన్న కర్ణాటకలో నేడు చెన్నైలో ఏకధాటి వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రేపిస్టులను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీని కోరిన కేటీఆర్

  ప్రియాంక రెడ్డి హత్య తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆమె పేరును దిశాగా మార్చారు పోలీసు అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో దిశా హత్యను ఖండిస్తూ ఎక్కడికక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిందితులను బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో దిశా నిందితులను కఠినంగా శిక్షించాలని వారి కుటుంబాన్ని ఆదుకోవాలని విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. పెద్ద ఎత్తున రోడ్ల పైకి వచ్చిన విద్యార్థులు రేపిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిశా హత్య ఘటన పై విద్యార్థులు మండిపడ్డారు. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను ఖండించారు. దిశ హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శంషాబాద్ లో దిశా నివాసం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిందితులను తమ దగ్గరికి తీసుకు వచ్చి బహిరంగంగా ఉరితీయాలి అంటూ పలువురు మహిళలు ఆందోళనకు దిగారు. తమ ఇంటి దగ్గరకు ఎవరూ రావద్దని దిశా కుటుంబ సభ్యలు వేడుకున్నారు. కాలనీ ఎంట్రెన్స్ గేటుకు తాళాలు వేసుకున్న స్థానికులు తమ కాలనీలోకి రావద్దంటూ తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు.  మరోవైపు దిశ హత్యోదంతంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. మన మధ్యనే మానవ మృగాలు తిరుగుతున్నాయి అన్నారు సీఎం కేసీఆర్. దిశా హత్యాచారంపై ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో స్పందించారు ఆయన. దీన్ని దారుణమైన అమానూషమైన ఘటనగా అభివర్ణించారు కేసీఆర్.  ఇక ట్విట్టర్ లో మరోసారి స్పందించిన మంత్రి కేటీఆర్ రేపిస్టులకు కఠిన శిక్ష పడేలా చట్టాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ హత్యాకాండ జరిగి 7 ఏళ్లు అయ్యిందని గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితులకు ఇప్పటికీ శిక్ష పడలేదని ఇలాంటి పరిస్థితుల్లో దిశా కుటుంబానికి హామీ ఎలా ఇవ్వగలమని ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లు భయపడే విధంగా చట్టాన్ని సవరించాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేశారు ఆయన. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయని ఈ సమావేశాల్లోనే రేపిస్టులకు ఉరిశిక్ష విధించే చట్టాన్ని తీసుకు రావాలని ట్విటర్ లో పేర్కొన్నారు కేటీఆర్.  వరంగల్లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం జరిపి చంపేసిన ఉన్మాదికీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరణశిక్ష విధిస్తే హై కోర్టు యావజ్జీవ శిక్షగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం ఆలస్యమైతే బాధితులకు అన్యాయం జరిగినట్టే అన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడినవాళ్లు దోషిగా తేలితే మళ్లీ తీర్పు పై సమీక్ష లేకుండా శిక్షలు ఉండాలని అభిప్రాయపడ్డారు కేటీఆర్. వేలాది మంది పౌరుల తరపున ప్రధానికి ఈ విషయం పై విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు. అటు మహిళలు విద్యార్థినులు బయటకు వెళ్లాలంటేనే భయమేస్తోందని కత్తులు తుపాకులు ఇస్తే మృగాళ్ల నుంచి రక్షణ ఉంటుందన్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దిశ హత్యను ఖండిస్తూ నిరసనలు జరిగాయి. దిశా మృతి పై ప్రతి ఒక్కరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్ల పోస్ట్ లతో సోషల్ మీడియా హోరెత్తుతోంది.  

చట్టాలు మారాలి.. అత్యాచారానికి పాల్పడితే చంపేయాలి: చినజీయర్

  హైదరాబాద్ పుప్పాలగూడలోని మైహోమ్ అపార్ట్ మెంట్ లో భూవరాహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ భూవరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీయర్ స్వామితో పాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల వైదిక కార్యక్రమానికి హాజరయ్యారు.  ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సంప్రోక్షణ నిర్వహించారు స్వామి. భగవంతుడి విగ్రహానికి ఎంతో శక్తి ఉందన్నారు ఆయన తెలియజేశారు.భగవంతుడు విగ్రహ రూపొందించే భక్తులను కరుణిస్తాడని చెప్పారు.భగవంతుడు ఒక్క సారి కన్ను రెప్ప వేసి తీసేటప్పటికీ కొన్ని వందల మంది గడిచిపోతారని.. మధ్యాహ్నం వేళ కళ్యాణం చేసుకుంటున్నామంటే భగవంతుని అంగీకారమేనని ఆయన ప్రసంగంలో తెలిపారు. భగవంతుడు కదిలితే సాధారణ మనుషులు ఎవ్వరూ కూడా తట్టుకోలేరని ప్రసంగించారు. మరో వైపు దిశా ఘటన పై కూడా స్పందించారు చినజీయర్ స్వామి. కాలం చెల్లిన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు కఠిన శిక్షలు విధించినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు వారికి ఎప్పుడు ధైరం చేకూర్చాలని ప్రసంగించారు చినజీయర్ స్వామి.

కరువులు కావాలనే సృష్టించారు.. సీమపై జనసేనాని సంచలన వ్యాఖ్యలు

  రాయలసీమలో జనసేన ఆత్మీయ యాత్ర ప్రారంభించారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రైల్వేకోడూరులో రైతులతో సమావేశమయ్యారు పవన్. జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నాయకుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ సీఎంలా ప్రవర్తిస్తే గౌరవిస్తానన్నారు పవన్ కళ్యాణ్. కొద్ది మందికే సీఎంలా వ్యవహరిస్తే జగన్ రెడ్డి అనే అంటానని చెప్పారు. సీఎం జగన్ పద్ధతి మార్చుకోవాలని అప్పుడే తాను గౌరవిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి దిగజారి మాట్లాడటం తగదన్నారు. రాయలసీమలో కరువులు కావాలనే సృష్టించారని మండిపడ్డారు పవన్. కొందరు బెదిరించి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. సీమలో కరువు నాయకుల వల్లేనని ఆరోపించారు పవన్. ఎంతమంది సీఎంలు ఇక్కడి నుంచి వచ్చినా పరిస్థితులను మార్చలేదన్నారు.  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో దొంగలు దొరికిన కాడికి దోచుకున్నారు. ఆయన్ను చూసేందుకు ఎయిర్ పోర్టు దగ్గరకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. పవన్ బయటకు వస్తున్న సమయంలో ఆయన చూసేందుకు ఎగబడ్డారు. వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. దీంతో అదే అదునుగా భావించిన దొంగలు కార్యకర్తల ముసుగులో చేతివాటం చూపించారు. జనసేన కార్యకర్తల పర్సులు, ఫోన్లు, బంగారు చైన్లు కొట్టేశారు. దీంతో జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనసేన ముఖ్యనేతల ఫోన్లు కూడా మాయమయ్యాయి. ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టు దగ్గర జనసేన కార్యకర్తల నిరసన తెలిపారు. మహిళలు, యువతులపై జరుగుతున్న దాడులను ఖండించారు. స్త్రీ జాతి రక్షణకు జనసేన అండగా ఉంటుందన్నారు. ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలి వచ్చారు.

వీడని అనుమానాలు.. రాజధానిపై పూర్తి క్లారిటీ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

  రాజధానిలో గత ఆరు నెలలుగా ఆగిన గవర్నమెంట్ హౌసింగ్ టవర్ ను పూర్తి చేయడంతో పాటు ల్యాండ్ పూలింగ్ స్కీం జోన్ లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. రాజధాని రైతులతో పాటు అమరావతి శ్రేయోభిలాషులకు ఈ వార్త ఊరట నిచ్చింది. జగన్ ప్రభుత్వ వైఖరితో రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేదా మరెక్కడికైనా తరలిపోనుందా అనే సందేహం ఆరుమాసాలుగా పైగా పలువురిని కలిచి వేస్తుంది.  సీఎం ప్రకటనతో రాజధాని రియల్టీ ఒక్క సారిగా ఊపందుకోవాలి కానీ ఒక పక్క సానుకూల ప్రకటన చేస్తూనే మరో పక్క రాజధానికి అత్యంత కీలకమైన అసెంబ్లీ, హై కోర్టు, సచివాలయం శాఖాధిపతుల కార్యాలయాల నిర్ణయాన్ని నిపుణుల కమిటీ నివేదిక మేరకే తీసుకుంటామని పేర్కొనడంతో అమరావతి పై స్పష్టత రాలేదు. హౌసింగ్ టవర్లు, ఎల్పీఎస్ జోన్ ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం హర్షణీయమే.. రాజధాని అనే పదానికి సార్థకత చేకూర్చే ముఖ్యమైన శాసన సభ సచివాలయం హై కోర్టులపై నిర్ణయం తర్వాత తీసుకుంటామనడంతో వాటి సంగతి ఏమవుతుందోనన్న సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కొందరు అనుమానిస్తున్నట్టుగా వీటన్నింటిని లేదా కొన్నింటిని అమరావతి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని నిపుణుల కమిటీ సూచిస్తే అమరావతికి కష్టకాలమేననని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే హౌసింగ్ టవర్ల పూర్తితో పాటు ఎల్పీఎస్ జోన్ లను అభివృద్ధి చేసిన అమరావతి రియల్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదనే వాదన ఉంది.  ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతిలో నిర్మాణాలు నిలిచిపోయాయి.ప్లాట్ ల ధరలు భారీగా పతనమై దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజధాని రియల్టీకి సీఎం ఇటీవల చేసిన ప్రకటన కొంత మేలు చేకూర్చిన మాట వాస్తవం. దీంతో నెలలుగా నీరసించిన ఈ ప్రాంత రియల్టర్లు, ప్లాట్ ల యజమానులు తిరిగి తమకు మంచి రోజులు వచ్చినట్లేనని ఆశపడ్డారు. ప్లాట్ల కోసం పలువురు ఎంక్వయిరీ చేయటం మొదలెడతారని క్రమేపీ వాటి క్రయ విక్రయాలు ఊపందుకుంటాయని భావించారు. కానీ వారు అనుకున్నట్టుగా జరగడం లేదని క్షేత్ర స్థాయి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఇందుకు కారణం అసెంబ్లీ హై కోర్టు సచివాలయం హెచ్ వోడీ కార్యాలయాలు ఎక్కడ వస్తాయో రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసే వరకు ఆగడమే మేలని పలువురు భావిస్తున్నారు.  ఇప్పటికిప్పుడు హడావిడి పడి రాజధానులు ప్లాట్ లను కొని రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని నిరీక్షించే బదులు రాజధాని పై పూర్తి స్పష్టత వచ్చాకే అడుగు ముందుకేయడం శ్రేయస్కరమన్నది అభిప్రాయంగా చెబుతున్నారు.రాజధాని లోని తమ ప్లాట్ లను తక్కువ ధరకైనా విక్రయిద్దామనికుంటున్న వారు సైతం ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఎన్నికల సమయంతో పోల్చితే దాదాపు 40-50% శాతం పడిపోయిన ధరలు కూడా విక్రయించేందుకు సిద్ధమైన వారు, సీఎం ప్రకటనతో ధరలు గణనీయంగా పుంజుకుంటాయేమోనన్న ఆశతో ఉన్నారు. అసెంబ్లీ, హై కోర్టు, సెక్రటేరియట్ అమరావతిలోనే ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే రేట్లకు రెక్కలు వస్తాయి అనుకుంటున్నవారు ఇంకొన్ని రోజులు ఆగడమే లాభమని భావిస్తున్నారు.

కర్నూలులో చంద్రబాబు పర్యటన... నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతానికి సమీక్షలు

టిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు ( డిసెంబర్ 2వ తేదీ ) నుండి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలోనే ఉండి నియోజకవర్గాల వారీగా పార్టీ పై సమీక్ష నిర్వహించనున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి సారిగా టిడిపి అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు సిద్ధమయ్యారు. మూడురోజుల పాటు జిల్లాలోనే బస చేసి పార్టీ పరిస్థితిని సమీక్షించనున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు రాక పార్టీ నేతలు.. కార్యకర్తల్లో.. నూతనోత్సాహాన్ని నింపుతుంది. పర్యటనలో భాగంగా నేడు కర్నూలులోని వీజేఆర్ కన్వెన్షన్ హాల్ లో ఉదయం 11 గంటలకు చంద్రబాబు పార్టీ పతాకావిష్కరణ చేస్తారు. అనంతరం 11:15 నిమిషాలకు పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తారు. అనంతరం ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, డోన్ నందికొట్కూరు, నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితి గురుంచి సమీక్ష నిర్వహిస్తారు. రాత్రి అక్కడే బస చేసి రెండో రోజున ఉదయం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం వైసిపి బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. ఉదయం 11 నుంచి ఆళ్ళగడ్డ కోడుమూరు నియోజక వర్గాల నాయకులు కార్యకర్తలతో కలిసి సమీక్ష నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజక వర్గాల వారీగా సమీక్షలు జరుపుతారు. మూడో రోజు బనగానపల్లె, పాణ్యం, శ్రీశైలం నియోజక వర్గాల పై సమీక్ష నిర్వహించటానికి బాబు సిద్ధమయ్యారు. మూడు రోజుల పర్యటన పై ఇప్పటికే పార్టీ శ్రేణులు కార్యక్రమాలను సిద్ధం చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఇతర నాయకుల ఆధ్వర్యంలో టోల్ గేట్ నుంచి సభా వేదిక వరకు భారీ ర్యాలీతో ఆహ్వానం పలికేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చంద్రబాబు పర్యటన జిల్లా నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందనే చెప్పుకోవాలి.

తెలంగాణలో నూతన పార్టీ.. నవ శకానికి నాంది పలుకుతూ వస్తున్న 'జన శంఖారావం' పార్టీ

  తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం చతికిల పడుతున్న తరుణంలో నూతన పార్టీ ఆవిర్భవించింది. అదే జన శంఖారావం పార్టీ. వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆకాంక్షల కొరకు పార్టీ స్థాపిస్తున్నట్లుగా పత్రికా ప్రకటన విడుదల చేసింది కార్యవర్గం. స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా వెనుక బడ్డ వర్గాల వారికి పదవులను నామమాత్రంగానే ఇచ్చారని పేర్కొన్నారు. విద్య , ఉద్యోగ , రాజకీయంగా వెనుక బడిన వర్గాలను పాలక వర్గం కోటాకే పరిమితం చేస్తుందన్నారు. దేశ ఉన్నతిని కోరుకొని ముందడుగు వేసే వెనుకబడ్డ పౌరులకు జన శంఖారావం పార్టీ వేదికగా నిలుస్తుందని యువతను ఆహ్వానించారు. పత్రికా ప్రకటనలో పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ.  పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్ , ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ , కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా , ఉమ్మడి కార్యదర్శిగా ఎ. గణేష్ రెడ్డి , నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్ , ఎం. రవి ముదిరాజ్ , కార్యనిర్వాహకులు - జె.అవినాష్ ( చింటు ) , ఎస్. శ్రీ శైలం యాదవ్ పేర్లను పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఆయన ప్రజారాజ్యం, జనసేన పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఇరు రాష్ట్రాల్లో పేరు పొందారు జన శంఖారావం పార్టీ అధ్యక్షులు పర్దిపూర్ నర్సింహ. తెలంగాణలో వెనుక బడ్డ వర్గాల ఉనికిని చాటడానికే ఆయన పార్టీ స్థాపించారంటూ అనుచరులు చెబుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా సాగుతున్న తెలంగాణ రాజకీయంలో ఈ పార్టీ నవ శాఖానికి నాంధి పలుకుతుందో లేదో వేచి చూడాలి.  

ప్రియాంకా ఘటనతో ఉప్పొంగిన ఆవేశం.. ఆ నీచుల్ని మేమే చంపేస్తాం

  మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలతో సామాన్యుల్లో కోపం కట్టలు తెచ్చుకుంటోంది. ఇంకోసారి ఆడవారిపై చెయ్యి వేయాలంటేనే భయపడేలా.. నడిరోడ్డు మీద ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక యువత అయితే.. అలంటి దుర్మార్గులని రాఖీ సినిమాలో లాగా పెట్రోల్ పోసీ సజీవ దహనం చేయాలనీ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా వరుస ఘటనలు సామాన్యుల్లో ఆవేశం కట్టలు తెంచుకునేలా చేసాయి. ముఖ్యంగా హైదరాబాద్ షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డిని నలుగురు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా రేప్ చేసి హత్య చేయడంతో.. ఆ నలుగుర్ని చంపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంక రెడ్డిపై అత్యాచారం చేసి, హతమార్చిన నిందితులను షాద్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు తీసుకొస్తున్నట్లు తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిందితుల్ని వెంటనే ఉరితీయాలని, లేదా ఎన్కౌంటర్ చేయాలనీ డిమాండ్ చేశారు. లేదా అసలు నేరస్థుల్ని తమకు అప్పగించండి.. ఏం చేయాలో చేసి చూపిస్తాం.. అంటూ పోలీస్ స్టేషన్‌లోకి చొచ్చుకొనేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు జనాన్ని చెదరగొట్టేందుకు స్వల్పంగా లాఠీ ఛార్జ్ కూడా చేయాల్సి వచ్చింది. అయినా జనం వెనకడుగు వేయలేదు. దీంతో ఇక చేసేదేం లేక స్టేషన్ గేటును మూసేశారు పోలీసులు. గేటుకు వేయడానికి తాళాలు లేకపోవడంతో.. దానికి బేడీలు వేశారు. నిందితులను బయటకు తీసుకెళ్తే జనావేశాన్ని కంట్రోల్ చేయడం కష్టమని భావించిన పోలీసులు.. నిందితుల్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించాల్సి ఉన్నా.. పరిస్థితి దానికి అనుకూలంగా లేకపోవడంతో.. డాక్టర్లనే స్టేషన్ కి తీసుకొచ్చి  మరీ పరీక్షలు చేయించారు. అంతేకాదు పరిస్థితి తెలిసి మేజిస్ట్రేట్ పాండు నాయక్ కూడా స్వయంగా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. నిందితులకు 14 రోజుల రిమాండ్‌ను విధించారు. ఇక ఈ నలుగురు దుర్మార్గులను శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రజల కంట పడకుండా మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో గంజాయి దందా.. అమరావతి ప్రాంతాల్లో మత్తులో మునిగిపోతున్న విద్యార్థులు

  నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో మత్తుపదార్ధాల వినియోగం పెరిగిపోతుంది. రాజధానితో పాటు 13 జిల్లాల్లో మత్తుపదార్ధాల వినియోగం.. రవాణా వ్యవహారాలు పెద్ద ఎత్తున వెలుగులోకి వస్తున్నాయి. నూతన రాజధాని ప్రాంతం కావడంతో విజయవాడ, గుంటూరు జిల్లాల్లో విదేశీయులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తున్నారు. చదువు పేరుతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వచ్చి నివసిస్తుండడంతో చాటుగా మత్తు పదార్థాల రవాణా వినియోగం విస్తరించటం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో మత్తు పదార్థాల రవాణా అధికంగా జరుగుతుంది. ఇందులోనూ గంజాయి వినియోగం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. రాజధాని ప్రాంతంలో గంజాయితో పాటు వైట్నర్ లాంటి పదార్థాలను సైతం విద్యార్ధులు ఆశ్రయిస్తున్నారు. మంగళగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో జరిగిన ఘర్షణ వ్యవహారంలో ఈ ఘటన వెలుగు చూసింది. మత్తు పదార్ధాలు సేవించిన విద్యార్థులు ఏకంగా అధ్యక్షుడి పైనే దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ఈ ఫలితాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. మత్తు పదార్థాలను స్థానిక మందుల దుకాణంలో కొనుగోలు చేశారని తెలుసుకున్న పోలీసులు యజమానిపై కేసు పెట్టారు.  మరోవైపు టోల్గెట్ కేంద్రంగా గంజాయి రవాణా అధికంగా జరుగుతోంది. పలుమార్లు పోలీసులు రవాణాదారులను అరెస్ట్ చేసినప్పటికీ వారు విడుదలై తిరిగి వచ్చి అక్రమ రవాణ సాగిస్తున్నారు. విజయవాడలో పోలీసులు డ్రగ్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. గంజాయితో పాటుగా ఇతర మత్తు పదార్థాలను వినియోగిస్తున్న విదేశీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. వీరంతా తాడేపల్లి , ఉండవల్లిలో ఇళ్లను అద్దెకు తీసుకొని ఉంటూ చదువు పేరుతో మత్తుకు అలవాటు పడినట్లుగా పోలీసులు చెబుతున్నారు.  గుంటూరు రూరల్ జిల్లా పరిధిలో విదేశీ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. స్థానికంగా ఓ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న షాజీ నుంచి గంజాయితో పాటుగా తెల్లరంగు పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీ కేంద్రంగా జరుగుతున్న మత్తు పదార్ధాల రవాణాపై డీజీపీ సవాంగ్ ప్రత్యేకంగా సిఐడి ఆధ్వర్యంలో నార్కోటిక్ సెల్ ను రంగంలోకి దించారు. వాట్సప్ నెంబర్ ను కూడా విడుదల చేశారు. మత్తు పదార్థాల రవాణా పై ఫిర్యాదు చేయాలనుకునే వారు 7382296118 నెంబర్ కు వాట్సప్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై యుద్ధం ప్రకటించి..  రవాణా వినియోగాన్ని అరికట్టేందుకు శ్రమిస్తున్నారు ఏపీ పోలీసులు.  

ఏమైంది ఈ సమాజానికి.. కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం

  గత వారం నుండి యాక్సిడెంట్లు.. రేప్ & మర్డర్లు.. అంటూ వచ్చే వార్తలే అందరిని కలిచివేస్తున్నాయి. నిందితులకు శిక్షలు కఠినంగా వేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా వార్తలను వింటూనే ఉన్న తరుణంలో మరో ఉదంతం చోటు చేసుకుంది. ఆగంతకుడు ఎవరో అమ్మాయిని చరిచి చంపితేనే మనం ఇంత మరిగిపోతున్నాము. అలాంటిది కన్న కూతురిపైనే తండ్రి అత్యాచారం చేసిన ఘటన కర్నూలు జిల్లా జిల్లెల గ్రామంలో చోటుచేసుకుంది. భార్య ఇంట్లో లేని సమయంలో కుమార్తె పై పలుమార్లు అత్యాచారం చేశాడు. బయటకు చెబితే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించాడు. వెంకటేశ్వర్లు భార్య స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో పని చేస్తోంది. గురువారం ఉదయం ఆమె డ్యూటీకి వెళ్లిన తర్వాత ఇంట్లో ఒంటరిగా ఉన్న తన 16 ఏళ్ల కుమార్తె పై తండ్రి అత్యాచారం చేశాడు. గత కొంతకాలంగా అమ్మాయి పై వెంకటేశ్వర్లు ఈ దారుణానికి పాల్పడుతున్నాడు. శుక్రవారం యువతి కడుపు నొప్పితో బాధపడుతుంటే తల్లి ఆసుపత్రికి తీసుకువెళ్లింది. డాక్టర్లు పరీక్షించగా ఆమె అత్యాచారానికి గురైనట్టు నిర్ధారించారు. దీంతో కుమార్తెను తల్లి నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. కన్న తండ్రే ఈ దారుణానికి పాల్పడుతున్నాడని చెప్పింది. దీంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలాంటి వారిని చంపితే కానీ మృగాళ్లా బయట తిరుగుతున్న మానవ పశువులను అదుపులో పెట్టలేమని నెటిజన్లు మండిపడుతున్నారు.

హైకోర్ట్ ఆర్డర్.. మునిసిపాలిటీ ఎన్నికలపై అభ్యంతరాలకు 7 రోజుల గడువు

  మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. 73 మున్సిపాలిటీల స్టే రిట్ పిటిషన్ పై విచారణ జరిపి స్టే ఎత్తివేస్తున్నట్లుగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్ ను విచారణ చేసింది న్యాయస్థానం. నవంబర్ 30 నుంచి 7 రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరించి 14 రోజుల్లోగా సవరణలు ముగించాలని మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత జూలైలో ఇచ్చిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్ట్. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్.  అయితే మీర్ పేట మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. మునిసిపాలిటీలపై అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించిందన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది. వార్డుల విభజన ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు పిటిషనర్. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు. మునిసిపాలిటీలపై అభ్యంతరాల సవరణ తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలని హై కోర్టు ఆదేశాలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. హై కోర్టు ఆదేశాలతో డిసెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.

చిత్తూరు చింత.. ఆ వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది

  చిత్తూరు జిల్లాలో చిత్రమైన రాజకీయ పరిస్థితి నెలకొంది. జిల్లాలోని 14 నియోజక వర్గాల్లో 13 స్థానాలను కైవసం చేసుకుని తన సత్తా చాటింది వైసిపి. జిల్లాలో ఆ పార్టీకి మెజారిటీ స్థానాలు రావటం వెనుక పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పాత్ర ముఖ్యంగా ఉంది. జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో తన సొంత మనుషులను నిలబెట్టి గెలిపించుకున్న సత్తా ఆయనది. అధికారం లేకున్నా గడిచిన 5 ఏళ్లు జిల్లాలో పార్టీకి అన్ని విధాలా అండదండలు అందించారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో 2 సార్లు మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి జగన్ సర్కర్ లోనూ కీలక మంత్రి పదవి దక్కించుకున్నారు. వైసిపి అధికారంలోకి వస్తే పెద్దిరెడ్డికి మంత్రి పదవి ఖాయమని అందరూ ఊహించారు. కాకపోతే జిల్లాలోని రిజర్వ్ నియోజకవర్గమైన జీడీ నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ స్వామికి అనూహ్యంగా ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. ఇదివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పని చేశారు. జిల్లా నుంచి రోజా, భూమన కరుణాకరరెడ్డి లాంటి వ్యక్తులను కాదని ఎస్సీ కోటాలో నారాయణ స్వామికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు సీఎం జగన్.  అయితే ఒకే ఒరలో రెండు కత్తులులా జిల్లాలో పెద్దిరెడ్డి, నారాయణ స్వామి మారారనే వార్తలు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి మంచి మిత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి , నారాయణస్వామిల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ నడుస్తోందంటున్నారు. పెద్దిరెడ్డికి విధేయుడిగా ఉంటున్న నారాయణ స్వామి ఇప్పుడు స్వతంత్రంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నారని ఒకటే గుసగుసలు. ఉద్యోగుల బదిలీలు, కాంట్రాక్టు నియామకాల్లో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాకపోతే అదంతా ఉత్తుత్తి ప్రచారమే కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని చెబుతున్నారు నారాయణ స్వామి. చాలా ఏళ్లుగా పెద్దిరెడ్డి, తాను మంచి మిత్రులమని ఈ కోల్డ్ వార్ గురించి తనకేమీ తెలియదని చెబుతున్నారు. కానీ పార్టీలో మాత్రం వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే గుసగుసలకు మాత్రం అడ్డూ అదుపూ ఉండడంలేదు.

తెలంగాణ కాంగ్రెస్ అన్ని పదవుల్లో మార్పులు.. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి?

  తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల మార్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే కొన్ని రోజుల నుండి పీసీసీ మార్పు పైనే హాట్ హాట్ గా చర్చ నడిచింది. డిసెంబర్ మొదటి వారంలో మార్పు ఖాయమని ఏఐసీసీ ఇప్పుడే ఎవరికిస్తే బాగుంటుందో అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. పీసీసీ కోసం పార్టీలో అర్హత ఉన్న నాయకులందరూ వారి వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇంచార్జి మార్పు ఉంటుందనే చర్చ తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో పీసీసీ కంటే ముందు ఏఐసీసీ ఇన్ చార్జి మారిస్తే బాగుంటుందనే వాయిస్ ని కొందరు నేతలు హైకమాండ్ దగ్గర వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో పీసీసీ కంటే ముందు ఇన్ చార్జ్ మార్పు ఉంటుంది అనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో నడుస్తుంది. అయితే ప్రస్తుతం ఉన్న ఇన్ చార్జి స్థానంలో ఎవరిని నియమిస్తారనే అనే చర్చ మొదలైంది. కుంతియా ఇన్ చార్జిగా ఉన్నప్పటి నుండి పార్టీ ఆశించిన ఫలితాలు రాబట్టలేదన్న ఫీలింగ్ చాలా మంది నాయకుల్లో ఉంది. ఇప్పటికే ఏఐసిసి నుండి పీసీసీ వరకు అన్ని స్థాయిల్లో మార్పులు చేయాలని పార్టీ భావిస్తున్న తరుణంలో కుంతియాని కూడా మార్చుతారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎవరికి అవకాశమిస్తారో అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు పరిచయం ఉన్న నాయకుడు కాస్త ప్రభావితం చేయగలిగిన నాయకుడిని ఇన్ చార్జిగా పెట్టే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఏఐసీసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.  

విధుల్లోకి రాకపోతే జీతం కట్.. ఆర్టీసీ యూనియన్ కార్యాలయాలు మూసివేత

  తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులతో నేరుగా మాట్లాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్ లో వారితో సమావేశం కానున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపో నుంచి ఐదుగురు చొప్పున మొత్తం 485 మందిని సమావేశానికి ఆహ్వానించారు. ఇందులో ఒక్కో డిపో నుంచి ఇద్దరు మహిళా కార్మికులు ఉండాలని అన్ని వర్గాల కార్మికులకు భాగస్వామ్యం ఉండేలా చూడాలని సీఎం నిర్దేశించారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ ఎండీని ఆదేశించారు. మధ్యాహ్నం 12 గంటల లోపు కార్మికులను ప్రగతి భవన్ కు తీసుకు రావాలని సూచించారు. వారికి ప్రగతి భవన్ లోనే మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేయనున్నారు. అనంతరం కార్మికులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల పై కూలంకషంగా చర్చించనున్నారు. సమావేశానికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఆర్ఎంలు, డీవీఎంలను ఆహ్వానించారు.  మరోవైపు ఆర్టీసీ యాజమాన్యం యూనియన్లకు షాకిచ్చింది. యూనియన్ల మాయలో పడి కార్మికుల బతుకులను చెడగొట్ట వద్దంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించిన మరుసటి రోజే యాజమాన్యం రంగంలోకి దిగింది. యూనియన్ కార్యాలయాలకు కేటాయించిన భవనాలకు తాళాలు వేసి స్వాధీనం చేసుకుంది. నేతలకున్న సదుపాయాలను రద్దు చేసింది. ఇక మీదట సంఘాల నేతలు కూడా విధులు నిర్వర్తించాల్సిందే.. లేదంటే వేతనాలు అందకపోగా అనధికారిక గైర్హాజరుగా పరిగణించాలని నిర్ణయించింది. సాధారణంగా ఆర్టీసీలో గుర్తింపు పొందిన యూనియన్ కేంద్ర కార్యాలయానికి బస్ భవన్ ఆవరణలో యాజమాన్యం భవన వసతి కల్పిస్తుంది. ఆ యూనియన్ నేతలకు వేతనంతో కూడిన సెలవులు ప్రయాణానికి రెడ్, బ్లూ వారెంట్ సౌకర్యాలు కల్పిస్తోంది. ఇలాంటి వాటన్నింటిని యాజమాన్యం రద్దు చేసింది.  ఆర్టీసీలో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గుర్తింపు పొందిన యూనియన్ గా ఉండేది. దీని గడువు 2018 ఆగస్టు 7వ తేదీతో ముగిసింది. ఈ యూనియన్ అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి , ఇలా మొత్తం 26 పోస్టులలోని నేతలకు వేతనంతో కూడిన సెలవుల వసతి కల్పించింది. ఎంప్లాయిస్ యూనియన్ కు చెందిన ముగ్గురు నేతలకు ఖమ్మం రీజియన్ లో గెలుపొందిన ఎస్డబ్ల్యూఎఫ్ నేతకు ఈ వసతి కల్పించింది. ఇలా మొత్తం 30 మంది యూనియన్ నేతలకు విధులు నిర్వహించక పోయినా వేతనాలిచ్చే అవకాశాన్ని కల్పించారు. అలాగే గుర్తింపు పొందిన టీఎంయూ జోనల్ సెక్రటరీలకు వారంలో 3 రీజినల్ సెక్రెటరీలు డిపో సెక్రటరీలకు వారంలో ఒకటి చోప్పున ప్రీ మస్టర్ సౌకర్యాన్ని కల్పించారు. శుక్రవారం ఈ సెలవులన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కార్మిక నేతలు ఇకపై విధుల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేసింది. టీఎంయూ కేంద్ర కార్యాలయానికి తాళం వేసింది.

40 టన్నుల ఉల్లి చోరి.. ఉల్లి ధర పెరగడమే దోపిడీకి దారి తీసింది

  దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ 100 రూపాయలు దాటి పలుకుతోంది. ఈ పరిణామం పేద, మధ్య తరగతి ప్రజలపై పెను ప్రభావం చూపిస్తోంది. దీంతో కిలో ఉల్లిపాయలు కొనే వినియోగదారుడు ఇప్పుడు కేవలం పావు కిలోతో సరిపెట్టుకుంటున్న దుస్థితి దాపురించింది. ఉల్లి లేకుంటే ఇల్లు గడవదని ఇంతలా ధరలు పెరిగితే రోజువారీ జీవితాలు సాగడం కష్టమంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు.  డబ్బులు, బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు వాటి జాబితాలో ఉల్లిపాయలు కూడా చేరాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు పక్కన నగదు పెట్టెలు ఉన్నప్పటికీ వాటిని కనీసం తాకను కూడ తాకకుండా కేవలం ఉల్లిపాయలను మాత్రం దొంగతనం చేస్తున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో దుండగులు 40 టన్నుల ఉల్లిపాయలు ఉన్న ట్రక్కును దొంగిలించారు. వాటి విలువ సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురిలో జరిగింది. ఇటు మరో చోట అయితే షాపు లోకి దూరిన దుండగులు డబ్బులు జోలికి వెళ్లకుండా ఉల్లిపాయల దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు.  ఇదీ విషయం.. చివరకు ఉల్లి దొంగతనాలు చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. మరో వైపు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. డిసెంబరు మొదటి వారం లోపు దేశానికి సరుకు చేరుకుంటుంది అంటున్నారు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది అంటున్నారు. మరోవైపు ఈ ఉల్లిఘాటు జార్ఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్న భయాలు బిజెపిని వెంటాడుతున్నాయి.

ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణం.. టెండరింగ్, పథకాలు అంటూ వైసీపీ సర్కార్ చేసిన నిర్వాకం!

  సంక్షేమం, సమగ్రాభివృద్ధి రాష్ట్ర ప్రగతి రథానికి రెండు చక్రాలు ఇవే. కానీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సమాజంలోని అందరికీ పనికొచ్చే పనుల కంటే వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే పథకాలపైనే దృష్టి సారించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి దాకా జరిగిన ప్రతి క్యాబినెట్ సమావేశంలో సంక్షేమ పథకాల జాతరే కొనసాగుతుంది. పాదయాత్రలో వచ్చిన వినతుల ఆధారంగా రూపొందించిన మేనిఫెస్టోను జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని పదేపదే చెబుతున్నారు. అందులో పొందు పరిచిన నవరత్నాలు అమలు పైనే పూర్తిగా దృష్టి సారించారు. మ్యానిఫెస్టోను ప్రతి కార్యాలయంలో ప్రదర్శించాలని కూడా ఆదేశించారు.  అక్రమ కట్టడం అంటూ స్వయంగా ప్రభుత్వానికి చెందిన ప్రజావేదిక కూల్చివేతతో ప్రభుత్వ పాలన మొదలైంది. జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్నింటికీ బ్రేక్ వేశారు, రివర్స్ టెండరింగ్ అన్నారు. ఇందులో భాగంగా అమరావతి, పోలవరంతో పాటు అన్ని ప్రధాన ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. పోలవరంలో రివర్స్ టెండరింగ్ వల్ల రూ.638 కోట్ల రూపాయలు ఆదా అయినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంది. కానీ కాంట్రాక్టు దక్కించుకున్న ఆ సంస్థ ఇసుక ఖర్చు ప్రభుత్వమే భరించాలని జీఎస్టీతో పాటు టెండర్లలో పేర్కొన్నని ఇతర పనులకు చెల్లించాలని మెలిక పెట్టడంతో ఈ భారం రూ.500 కోట్లకు పైనే పడింది.  అమరావతి నిలిపివేత, రివర్స్ టెండరింగ్, పవన సౌర విద్యుత్ ఒప్పందాలపై పునఃసమీక్ష వంటి చర్యలు జాతీయ స్థాయిలో వివాదాస్పదమయ్యాయి. అనేక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు గుడ్ బై చెప్పాయి. ఏపీలో పరిశ్రమలు పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం నెలకొందని విశ్లేషకులు పారిశ్రామికవేత్తలు బహిరంగంగానే ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా అంశాల పై జాతీయ పత్రికల్లో సంపాదకీయాలు ప్రత్యేక కథనాలు అనేకం వచ్చాయి. ఒక రాష్ట్రంలో పరిస్థితి పై అది కూడా ప్రభుత్వం ఏర్పాటైన 6 నెలల్లోనే ఈ స్థాయిలో జాతీయ మీడియా స్పందించడం బహుశా ఇదే మొదటి సారి.  పాలన ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం సహజం. కానీ వైసీపీ సర్కార్ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. గ్రామ వార్డు సచివాలయాలకు వైసిపి రంగులు వేయాలంటూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వాటర్ ట్యాంకులకు అవే రంగును పూయాలని ఆదేశించింది. టిడిపి హయాంలో అక్కడక్కడ వాటర్ ట్యాంక్లు, శ్మశానాల గోడలకు పచ్చరంగు పులిమారు, దీనికి స్థానిక అధికారులు లేదా నేతల అత్యుత్సాహమే కారణం. వైసీపీ సర్కార్ ఏకంగా అధికారిక ఉత్తర్వులు ఇవ్వడంతో కింది స్థాయి నేతలు రెచ్చిపోతున్నారు. చివరికి గాంధీ విగ్రహం దిమ్మకు వైసీపీ రంగులు పులుముతున్నారు.  నిరుపేదలు,కూలీల కడుపు నింపే అన్న క్యాంటీన్ల మూసివేత పై ఎన్ని విమర్శలు, వినతులు వచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్ర సర్వ సమగ్రాభివృద్ధికి ప్రత్యేక హోదాయే మార్గం. దీనికోసం కేంద్రంతో పోరాడతామని విపక్షంలో ఉండగా పదేపదే ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే దానిపై నోరు కూడా మెదపడం లేదు. ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి హోదా గురించి అడుగుతూనే ఉంటా అంటూ నిస్సహాయత ప్రదర్శించారు.  జగన్ సర్కార్ 6 నెలలు పూర్తి చేసుకోగా అందులో 5 నెలలకు పైగా ఇసుక కొరత వెంటాడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పనులు లేక భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్యకు ప్రధాన కారణం కొత్త పాలసీ పేరిట ఇసుక తవ్వకాలు నిలిపి వేయడం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం. భారీ వరదల వల్ల కూడా రీచ్ లు మూతపడ్డాయి. ఇప్పుడు ఇసుక అందుబాటు పెరిగింది కానీ ధర మాత్రం అధికం గానే ఉంది. వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. బడ్జెట్ తలకిందులవుతుంది. ఆదాయం అంచనాకు..ఆస్తుల ఆదాయానికి మధ్య రూ.80,000 కోట్ల వరకు తేడా ఉంటుందని తాజా అంచనా. వచ్చిన డబ్బు వచ్చినట్లుగా సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తుండటం, ఆదాయం పడిపోవడంతో అభివృద్ధి పనులకు నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. జనవరిలో మరిన్ని కొత్త పథకాలు వస్తుండడంతో పరిస్థితి దయనీయంగా మారుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు.