మహా రాజకీయంలో కీలక మలుపు.. రేపే బల పరీక్ష

  మహా రాజకీయం రేపు మరో కీలక మలుపు తిరిగే అవకాశముంది.మహారాష్ట్రలో ఏర్పాటైన ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. బుధవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. తమకు బలం ఉందని చెబుతూ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ఆలస్యం చేయడం ఏంటని ప్రశ్నించింది. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్ భవన్ లో కాదని చెప్పిన సుప్రీం.. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పూర్తి కావాలని స్పష్టం చేసింది. సీక్రెట్ బ్యాలెట్ కుదరదని, బలనిరూపణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 5 గంటల లోపు ప్రొటెం స్పీకర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరి బల పరీక్షలో బీజేపీ నెగ్గుతుందో లేక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి అవకాశమిస్తుందో చూడాలి.

కుప్పంలో బాబుకు చెక్... వైసీపీ వ్యూహంలో చిక్కనున్నాడా లేదా ??

చిత్తూరు జిల్లా కుప్పం టిడిపికి కంచుకోట.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యేగా వరుస విజయాలను అందించిన నియోజకవర్గం. అయితే ఇప్పుడు కుప్పం పై కన్నేసిన వైసిపి.. చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 13 స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి.. కుప్పంలో సత్తా చాటాలని భావిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ ఇన్ చార్జిగా నియమించిన ఆ పార్టీ 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీకి దింపింది. గత ఎన్నికల్లో నామినేషన్ కు ప్రచారానికి దూరంగానే ఉన్నా 70,000 లకు పైగా ఓట్లు సాధించారు. జిల్లా అంతటా గత ఎన్నికల్లో చతికిల పడ్డ టిడిపి కుప్పంలో మాత్రం పరువు నిలుపుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఇన్ చార్జ్ చంద్రమౌళి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొడుకు భరత్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే కుప్పంలో వైసీపీ క్యాడర్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన మాటే అక్కడ చెల్లుతుంది. చంద్రబాబును ఓడించేందుకు ఇక్కడ ఇన్ చార్జిగా నారాయణస్వామి బాధ్యతలు చేపడతారని పెద్దిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. దీంతో కుప్పం వైసిపిలో కొంత గందరగోళం నెలకొంది. చంద్రమౌళి కొడుకు భరత్ ఇన్ చార్జిగా ఉంటారా..లేక నారాయణస్వామి బాధ్యతలు చూస్తారా.. అనే డౌట్లు మొదలయ్యాయి. ఇటు గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయినా రెడ్డి సుబ్రహ్మణ్యంను వైసిపిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు చంద్రమౌళిని తప్పించి కొత్త నాయకత్వం తీసుకువస్తారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. మొత్తానికి ఇన్ చార్జి విషయంలో క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.

భయం ఇంకా పోలేదు... సాగర్ లాంచీ ప్రయాణానికి మొగ్గు చూపని పర్యాటకులు

  నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులు ఇవ్వడంతో లాంచీ ప్రయాణం నడపడానికి సిద్ధమయ్యారు టూరిజం అధికారులు. కనీసం వంద మంది ప్రయాణికులు ప్రయాణించవలసిన లాంచిలో 34 మంది ప్రయాణికులు మాత్రమే పర్యటనకు ఆసక్తి చూపడంతో ట్రిప్ ని నిలిపివేశారు. శ్రీశైలంకు లాంచీని ప్రతి సంవత్సరం నడుపుతారు అధికారులు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు వెళ్లడానికి పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఆరు గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యాటకులు చాలా ఇష్టపడతారు. గతంలో వారానికి రెండు సార్లు ఈ లాంచీ ప్రయాణం ఉండేది. కానీ ఈ సంవత్సరం పర్యాటకులు బయలుదేరవలసిన శ్రీశైలం లాంచిని రద్దు చేశారు. లాంచీ టూరుకు కచ్చులూరు ప్రమాదం ఎఫెక్టే ఉండవచ్చని స్థానికులు అనుకుంటున్నారు. పర్యాటకులు ఆసక్తి చూపక పోవడం.. ఆన్ లైన్ లో విక్రయించాల్సిన టిక్కెట్ లు అమ్ముడు పోకపోవడంతో లాంచీని రద్దు చేశారు. ఇటీవల కచ్చులూరు లాంచీ ప్రమాదంతో ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ లో లాంచీ ప్రయాణాలు నిలిపివేశారు.ప్రయాణికులు కూడా కచ్చులూరు ప్రమాదం తరువాత లాంచీ ప్రయాణాలు అంటే ఒక అడుగు వెనుక్కు తగ్గుతున్నారు అనేది వాస్తవం.టూరిజం అధికారులు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు పాటించడం లేదని అందుకే సగం ప్రయాణికులు ఆశక్తి చూపించడం లేదని వెల్లడించారు.

ఢిల్లీ కాలుష్యం కంటే బాంబులు పెట్టి అందరిని చంపేయండి

ఢిల్లీలో పొల్యూషన్ పై సుప్రీం కోర్టు మండిపడింది. ఇలా కాలుష్యంతో నరకంలో బతకడం కంటే బాంబులు పెట్టి ఢిల్లీ ప్రజలందరిని ఒకేసారి చంపెయ్యాలని ఆక్రోశం వ్యక్తం చేసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై జడ్జీలు మండిపడ్డారు. తప్పును ఒకరి పై ఒకరు నెట్టేసుకోవడం బ్లేమ్ గేమ్ ఆపాలని సూచించారు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ పొల్యూషన్ కేసును విచారించింది. పంటల వ్యర్ధాలు తగలబెట్టడం ఆపలేని మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాల ప్రజలు నవ్వుకుంటున్నారని జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదని ఆక్షేపించారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నాయని ఢిల్లీ ప్రజల్నీ క్యాన్సర్ బాధితులుగా మిగిలి పొమ్మంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీ నరకం కంటే దారుణంగా తయారైందన్నారు జస్టిస్ అరుణ్ మిశ్రా. దేశంలో జీవితం చీపుగా ఏమీ లేదని ప్రాణానికి ఎలా ఖరీదు కడతారని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఒక్కో వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో చెప్పాలన్నారు. సుప్రీంకు సమాధానమిచ్చిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ రెండు అధికార కేంద్రాలతో పాలనా పరమైన సమస్యలని వస్తున్నాయన్నారు. దీంతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాలకు సూచించారు జస్టిస్ అరుణ్ మిశ్రా. సిటీలోని వేర్వేరు చోట్ల ఎయిర్ ప్యూరిఫయింగ్ టవర్స్ ను ఏర్పాటు చేసే అంశంలో పది రోజు ల్లోగా ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పైనా సిరీస్ ఇయ్యరు జస్టిస్ అరుణ్ మిశ్రా. మీపై మీ అధికార యంత్రాంగంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదనే విషయం తెలుసుకోవాలని సీఎస్ కు సూచించారు. ఖచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే పంటల వ్యర్థాలు తగలబెడుతున్న వారిపై వెయ్యికి పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసామని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు యుపిసిఎస్. అలాగే ఒక కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు చెప్పారు. అయితే ఇలాంటి తాత్కాలిక చర్యల కంటే పాజిటివ్ యాక్షన్ మొదలుపెట్టాలనీ సీఎస్ కు సూచించారు జడ్జీలు. ఢిల్లీ లిమిట్స్ లో నడుస్తున్న ఫ్యాక్టరీలు పర్యావరణంపై వాటి ప్రభావం ఎలా ఉందో సమగ్ర నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది సుప్రీంకోర్టు.

70 వేల కోట్ల స్కాం... పవర్ రాగానే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పవార్‌కు ఊరట

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్ లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఏసిబి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 70 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో దీని పై ఏసీబీ విచారణ జరిపింది. అయితే బిజెపితో సీక్రెట్ డీల్ లో భాగంగానే ఈ కేసును క్లోజ్ చేశారని శివసేన ఆరోపించింది. అజిత్ పవార్ ను బ్లాక్ మెయిల్ చేసి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని ఆరోపించింది. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన మరుసటి రోజే ఇరిగేషన్ స్కామ్ ఫైల్ ని ఏసీబీ మూసివేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి ఇది నిదర్శనమని శివసేన, ఎన్సీపీ నేతలు ఆరోపించారు. నవంబర్ ఇరవై ఎనిమిది న హై కోర్టు ముందు ఈ కేసు విచారణకు రానుంది. వాస్తవానికి ఎఫ్ఐఆర్ లో అజిత్ పవార్ పేరు లేదు. కాకపోతే కాంట్రాక్టులకు సంబంధించి అజిత్ పవార్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆయన పాత్ర పై ఏసీబీ దర్యాప్తు చేసింది. అజిత్ పవార్ కు నచ్చజెప్పడానికి ఎన్సీపీ నేతలు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఇంకా ఆయన పదవి బాధ్యతలు చేపట్ట లేదని అంటున్నారు ఎన్సీపీ నేతలు. డెప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్సీపీ కార్యకర్తలు. 

ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే... కేసీఆర్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందా?

ఊహించినట్లే ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాకిచ్చింది. సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై... మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే... చట్ట ప్రకారం కుదరదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టంచేశారు. ఒకవైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ... సమ్మె చేయమని చెప్పలేదని...  కార్మికులే తమంతట తాముగా విధులకు గైర్హాజరై... చట్ట విరుద్ధంగా సమ్మెలో ఉన్నారన్న సునీల్ శర్మ... ఇష్టానుసారంగా విధులకు గైర్హాజరై... మళ్లీ నచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే ఏ ప్రభుత్వరంగ సంస్థలో సాధ్యంకాదని స్పష్టంచేశారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతిముఖ్యమైన పండగల సమయంలో సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారన్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరతామంటే చట్ట ప్రకారం కుదరదన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నాక... ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసేవరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం కుదరని తేల్చిచెప్పారు. ఏ నిర్ణయమైనా సరే, అంతా చట్ట ప్రకారం జరుగుతుందని, అప్పటివరకు సంయమనం పాటించాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, ఇప్పుడు మరోసారి డిపోల దగ్గర ఉద్రిక్తతలు సృష్టించి కష్టాలను కోరి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. డిపోల దగ్గర శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని, తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను అడ్డుకోవద్దని వార్నింగ్ ఇఛ్చారు. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న ఆర్టీసీ ఎండీ.... ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే... చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు సంయమనం పాటించాలని కార్మికులకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ సూచించారు.

ఏపీకి కిరణ్..! మరి, తెలంగాణకు ఎవరు? ఇంకెన్ని రోజులు నాన్చుతారు?

తెలుగు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించేందుకు దాదాపు ఖరారు కాగా, తెలంగాణ విషయంలోనూ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. టీపీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి అప్పగించాలో తెలియక హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది.  పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నా... వీళ్లందరిలో రేవంతే ముందున్నారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, రేవంత్ కూడా పీసీసీ పగ్గాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక టైమ్ లో రేవంతే నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ అన్న ప్రచారం కూడా సాగింది. అయితే, సీనియర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలతో అది ఆగిందనే మాట వినిపించింది. ముఖ్యంగా రేవంత్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి పోటీ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దాంతో, రేవంత్... ఇతర సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అలా, తనకు మద్దతిస్తోన్న సీనియర్లతో ఢిల్లీలో రేవంత్ లాబీయింగ్ చేయిస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని బల్లగుద్దిమరీ హైకమాండ్ కి నమ్మకం రేవంత్ కలిగించారట. ఏఐసీసీ అండ్ గాంధీభవన్ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశముందని అంటున్నారు. వీళ్లిద్దరిలో ఎవరూ కాకపోతే, ఎస్సీ కోటా దామోదర రాజనర్సింహ.... మైనారిటీ కోటా షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. అలాగే, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి, వీహెచ్ తదితరులు తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని నేతల్లో ఎవరికిచ్చినా ఫర్వాలేదు కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లకు ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్తమ్ సిఫార్సు కీలకం కానుందనే మాట వినిపిస్తోంది. ఉత్తమ్ ఎవరికి మద్దతిస్తే వాళ్లకే పీసీసీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరి, టీపీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో... ఈ ఉత్కంఠకు ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి.

చెబుతున్నదొక్కటి...చేస్తున్నదొక్కటి... రాజుగారి తీరుపై అనుమానాలు...

రఘురామకృష్ణంరాజు... ప్రస్తుతం నరసాపురం వైసీపీ ఎంపీ... 2014 ఎన్నికల ముందువరకు వైసీపీలో ఉన్న రఘురామకృష్ణంరాజు... సరిగ్గా ఎలక్షన్స్ ముందు జగన్ తో విభేదించి బయటికి వచ్చేశారు. అంతేకాదు, ఆనాడు ఎవరూ చేయనివిధంగా జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ కు పెద్దలంటే లెక్క లేదని, అసలు ఎవరినీ గౌరవించరని, అటిట్యూడ్ ప్రోబ్లామ్ ఉందని, తనను అవమానించారంటూ లెక్కలేనని విమర్శలు చేశారు. ఆ తర్వాత బీజేపీలోకి... నెక్ట్స్ టీడీపీలోకి వెళ్లారు. మళ్లీ తిరిగి 2019 ఎన్నికలకు ముందు జగన్ ను కలిసి వైసీపీ కండువా కప్పుకున్నారు. అలా, ఐదేళ్ల గ్యాప్ తర్వాత వైసీపీలో చేరి, నరసాపురం ఎంపీ టికెట్ దక్కించుకుని గెలిచారు.  అయితే, గెలిచిన నాటి నుంచీ రఘురామకృష్ణంరాజు వైఖరి కొంచెం తేడాగానే ఉందనే మాట వినిపిస్తూ వస్తోంది. సాధారణంగా ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అధినేత మాటే ఫైనల్. జాతీయ పార్టీలతో పోల్చితే స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంటుంది. కంట్రోల్డ్ గా వ్యవహరించాల్సి ఉంటుంది. హద్దుల్లో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ రఘురామకృష్ణంరాజు అలా కాదు, తనకు నచ్చిందే చేస్తారు, మనసుకు అనిపించే మాట్లాడతారు. తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెబుతారు. అయితే, అదే ఇఫ్పుడు రాజు గారికి చిక్కులు తెచ్చిపెడుతోంది. ఇఫ్పటికే ఇంగ్లీష్ మీడియం వివాదంలో ... అలాగే పార్టీ అనుమతి లేకుండా ప్రధాని మోడీని కలిశారంటూ ... అధినేత ఆగ్రహానికి గురైన రఘురామకృష్ణంరాజు... జగన్ ను కలిసి వివరణ ఇచ్చుకున్నారు. అయితే, ఇప్పుడు మరో వివాదంలో రఘురామరాజు చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. ఒకపక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, మరోపక్క రఘురామకృష్ణంరాజు... బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరిని కలిశారో ఏం మాట్లాడారో తెలియదు గానీ, దాదాపు గంటకు పైగానే అక్కడ గడిపారు. పార్టీ అనుమతి లేకుండా... విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి చెప్పకుండా... ప్రధానిని గానీ, కేంద్ర మంత్రులను కానీ కలవొద్దని జగన్ ఆదేశించినా... ఇలా బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లడం వైసీపీలో మరోసారి కలకలం రేపింది. అయితే, రఘురామకృష్ణంరాజుకి బీజేపీతో సత్సంబంధాలు ఉండటంతో పార్టీ మారొచ్చనే ప్రచారం ఎప్పట్నుంచో జరుగుతోంది. అలాంటిదేమీ లేదని రాజుగారు చెబుతున్నా... ఆయన వ్యవహార శైలి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. అయితే, జగన్ ను కలిసి వివరణ ఇచ్చుకున్న తర్వాత రోజే, బీజేపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లడంపై మాత్రం వైసీపీ వర్గాలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం.. త్వరలో పదవుల భర్తీ!!

  తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి సమయం దగ్గర పడింది. త్వరలో పార్టీ అధ్యక్షుడ్ని మారుస్తారని ప్రచారం జరుగుతుంది. అంతకుముందే అనుబంధ విభాగాల్లో భర్తీ చేపట్టాలని నేతలు నిర్ణయించారు. ఇందు కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు అధిష్టానం నుండి దూతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఈ మధ్యనే రెండుసార్లు గాంధీ భవన్ వేదికగా వివిధ అనుబంధ సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ప్రక్షాళన కార్యక్రమం మొదలైంది. పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులు, చైర్మన్లు, ఇన్ చార్జిలను నియమించేందుకు జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగారు. ప్రధానమైన విభాగాలకు తీవ్ర పోటీ ఉంది. ఏఐసీసీ నుంచి వచ్చిన నేతలు.. పీసీసీ అధ్యక్షుడు పార్టీ జనరల్ సెక్రెటరీల అభిప్రాయం తీసుకున్న తర్వాత అభ్యర్థులను ఫైనల్ చేస్తారు. దీంతో పార్టీకి కీలకంగా భావించే కమిటీల్లో అవకాశం కోసం క్యాడర్ ఎవరికి వారు తమ పద్ధతులు పైరవీలు ముమ్మరం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ లో ముఖ్య నేతలను కలుస్తూ ఈ సారి తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు ఆశావహులు.  ఇటీవల ఏఐసీసీ పరిశీలకులు గాంధీ భవన్ లో ఆయా అనుబంధ సంఘాల ఆశావహులతో భేటీ అయ్యారు. వారి నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. ఇందులో ఒక్క ఎస్సీ సేల్ కు ఇరవై మందికి పైగా పోటిపడుతున్నారు. ఈ పదవికి మాజీ మంత్రి ఎ చంద్రశేఖర్, సతీష్ మాదిగ, మానవతారాయ్, మేడిపల్లి సత్యంలు ఉన్నారు. మిగితా కమిటీల్లో కూడా నియామకం చేపట్టేందుకు కొందరు సీనియర్ లీడర్లను సామాజిక సమన్వయ సమావేశం పేరుతో ఢిల్లీకి పిలిపించి చర్చించారు అధిష్టానం పెద్దలు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పిసిసి కమిటీలు ప్రధానమైనవిగా కాంగ్రెస్ భావిస్తుంది. ఇందు కోసం సమర్థవంతంగా పని చేసే వాళ్లు పార్టీ అభివృద్ధికి పాటుపడే వారికి చాన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ఇక మహిళా కాంగ్రెస్ లో ప్రస్తుతమున్న నేరేళ్ల శారద తనకు మరో ఛాన్స్ ఇవ్వాలని అంటున్నారు. ఇందిరా శోభన్, రజినీరావు, సుజాత గుప్తాలకు కూడా తమకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. బీసీ సెల్ ఛైర్మన్ గా పలువురు మాజీ శాసన సభ్యుడు సీనియర్లు పోటీ పడుతూ ఉంటే ప్రస్తుతమున్న కత్తి వెంకట స్వామి తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారు. బెల్లయ్య నాయక్, రాములు నాయక్, ఫహీం వంటి వారు కూడా ఆయా విభాగాల్లోని అధ్యక్ష పదవుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. పార్టీ పటిష్టత కోసం ముందుగా అనుబంధ కమిటీలు పూర్తి చేసి తర్వాత పీసీసీ పదవులు నింపుతారనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతోంది. ఆ తరువాతనే పిసిసి చీఫ్ ను మారుస్తాననే ప్రచారం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతుంది.

దొరికినంత దోచుకుంటున్న ఏపీ నేతలు... వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్ బయట పడింది!

  వడ్ల కొనుగోళ్లలో భారీ స్కామ్ బయట పడింది. రైస్ మిల్లర్లు.. కొందరు లీడర్లు.. సివిల్ సప్లై అధికారులు.. కలిసి సర్కారు ఖజానాకు గండి కొట్టి.. ఏకంగా 1500  కోట్లు దోచుకున్నారు. గతేడాది ఖరీఫ్ లో ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకే వడ్లను కొని తెచ్చి ఇక్కడ మద్దతు ధరకు సర్కారుకు విక్రయించారు. దీనికోసం ఇక్కడి చిన్న రైతులు ఐకేపీ సెంటర్ల నిర్వాహకుల సహకారంతో వ్యవహారం నడిపించారు. ఇలా దోచుకున్న సొమ్ములో సివిల్ సప్లైలోని పెద్దాఫీసర్లు నుంచి మండల స్థాయి అధికారుల దాకా వాటాలు వెళ్లాయని, రాజకీయ నాయకుల ప్రమేయంతోనే ఇదంతా జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. రైస్ మిల్లర్లు పొరుగు రాష్ట్రాల నుంచి ముందే కొని తెచ్చిన వడ్లను తమ గోదాంలో నిల్వ చేస్తారు. అర ఎకరం నుంచి 7,8 ఎకరాల భూమి ఉన్న రైతులతో ఒప్పందాలు చేసుకుంటారు. వారి ఆధార్ నెంబర్, పట్టాదారు పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ వివరాలు తీసుకుంటారు. ముందే ఐకేపీ సెంటర్ సివిల్ సప్లై అధికారులతో మాట్లాడుకుని ఏ ఐకేపీ సెంటర్ కు ఏ రైతు వివరాలు పంపాలో ప్లాన్ చేసుకుంటారు మిల్లర్లు. తాము ఒప్పందాలు చేసుకున్న రైతుల వివరాలను సదరు ఐకేపీ సెంటర్ కు పంపుతారు. ఆ ఐకేపీ సెంటర్ వాళ్లు అదే వివరాలను అప్ లోడ్ చేస్తారు. కొద్ది రోజుల్లో సర్కారు నుంచి రైతు ఖాతాలో సొమ్ము జమవుతుంది. మిల్లర్లు ఆ సొమ్ము తీసుకుని ముందు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం రైతులకు ఎంతో కొంత డబ్బు ఇస్తారు. గతేడాది ఐకేపీ కొనుగోళ్ల పై అనుమానం వచ్చి లెక్కలు చూస్తే ఈ స్కామ్ ఇంటర్నల్ గా బయటకొచ్చింది. రాష్ట్రంలో 2017-18 ఖరీఫ్ లో 10.47 లక్షల హెక్టార్ లలో వరి సాగు జరిగితే 18,24,802 టన్నుల ధాన్యం సేకరించారు. 2018-19 ఖరీఫ్ లో 11.89 లక్షల హెక్టార్ లలో వరి సాగైంది. సివిల్ సప్లై శాఖ ఆధ్వర్యంలో జరిగిన వడ్ల కొనుగోళ్లు రెండింతలు దాటిపోయాయి. ఏకంగా 40,41,429 టన్నుల ధాన్యం కొనుగోళ్ళు జరిగాయి. ఒక్కసారి ఇంతగా పెరిగి పోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిపై ఆరా తీసే పనిలో పడింది సర్కార్. కొందరు మిల్లర్లు సివిల్ సప్లై శాఖ అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ చేశారని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత ఖరీఫ్ లో పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ మద్దతు ధరకు విక్రయించారన్న సమాచారంతో ఈ సారి ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు చెప్తున్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టామన్నారు. ఇక ప్రతి రైతు తను పండించిన పంటను సొంత గ్రామంలో మాత్రమే విక్రయించాలనే నిబంధన పెట్టారు. ఇప్పటి వరకు సుమారు 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్టు తెలుస్తోంది. వడ్ల కేసుపై ఇప్పటికే ప్రాథమిక విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. విచారణ పూర్తయితే కథ మొత్తం బయటపడుతోందని అక్రమార్కుల పై వేటు పడుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఆరోగ్యశ్రీకి కొత్త కష్టాలు.. ఏపీ సర్కార్ దెబ్బకి జారుకుంటున్న ప్రముఖ ఆసుపత్రులు!!

  ఆరోగ్యశ్రీ ట్రస్టు దెబ్బకు నెట్ వర్క్ ఆసుపత్రులు బెంబేలెత్తుతున్నాయి. భారీగా బకాయిలు, బిల్లుల కటింగులు, లక్షల రూపాయల పెనాల్టీతో ట్రస్టు అధికారులు వీటిని హడలెత్తిస్తున్నారు. దీంతో ప్రధాన నగరాల్లోని ప్రముఖ ఆసుపత్రులు నెట్ వర్క్ నుంచి బయటికొచ్చేస్తున్నాయి. ఇప్పటికే విశాఖలో రెండు, విజయవాడలో మూడు నెట్ వర్క్ నుంచి తప్పుకున్నట్లుగా సమాచారం. ఆసుపత్రులపై ట్రస్ట్ అధికారులు భారీగా పెనాల్టీలు వేస్తున్నారు. వంద రూపాయలు తప్పు జరిగిందని తేలిస్తే దానికి పది రెట్లు జరిమానా రూపంలో భారం మోపుతున్నారు. ఇటీవల విశాఖ లోని ఒక జాతీయ స్థాయి ఆసుపత్రికి 16 లక్షల పెనాల్టీ వేశారు. ఆ మొత్తం కట్టిన వెంటనే సదరు ఆస్పత్రి యాజమాన్యం నెట్ వర్క్ నుంచి తప్పుకుంది. అలాగే విజయవాడలో రెండు ఆసుపత్రులకు 15 లక్షల వరకు జరిమానాలు వేయటంతో అవి కూడా బయటకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. గతంలో ఒక ఆసుపత్రి తప్పు చేసిందని తెలిస్తే ముందుగా డిసిప్లీనరీ కమిటీకి పంపించేవారు. అక్కడ రుజువైతే సాధారణ పెనాల్టీతో సరిపెట్టేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని కేవలం ఆరోగ్యమిత్ర నిర్ధారించినా భారీగా పెనాల్టీలు వేస్తున్నారని ఆసుపత్రుల యాజమాన్యాలు వాపోతున్నాయి. సమయానికి బిల్లులు ఇవ్వకపోగా భారీగా పెనాల్టీలు వేస్తూ ఉండటంతో ఆరోగ్యశ్రీ సేవలు అందించటం వృథా అన్న స్థితికి ఆసుపత్రులు చేరుకున్నాయి. ట్రస్ట్ ను పూర్తిగా బిజినెస్ మోడల్ లోకి మార్చే విధంగా అధికారులు సిద్ధం చేస్తున్న కొత్త ప్రతిపాదనలు కూడా నెట్ వర్క్ ఆసుపత్రులకు వణుకు పుట్టిస్తున్నాయి. జిల్లాలో విధులు నిర్వహించే ఆరోగ్య మిత్రాలు, టీమ్ లీడర్లు, డిస్ట్రిక్ కో-ఆర్డినేటర్ లకు జీతాలు ట్రస్టు నుంచి చెల్లిస్తున్నారు. ఇకపై వారికిచ్చే జీతంలో సగం ట్రస్టు నుంచి సగం నెట్ వర్క్ ఆసుపత్రుల నుంచి చెల్లించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్య మిత్రాలు నెట్ వర్క్ ఆసుపత్రుల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలు ఎక్కువగా ఆయా ఆసుపత్రులకు బిజినెస్ పెంచటానికే ఉపయోగిస్తున్నారు. కాబట్టి వారి జీతాలలో కొంత మొత్తం సదరు ఆసుపత్రులే ఇవ్వాలని నిర్ణయించారు. దీనికోసం ఆస్పత్రులకు ఇచ్చే బిల్లుల్లో ఎడ్మినిస్ట్రేటివ్ ఖర్చు కింద రెండు శాతం కట్ చేసి ఇవ్వాలని భావిస్తున్నారు. మరో నెలలో ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే తమ బిల్లులో ఇప్పటికే రెండు శాతం ట్రస్ట్ కట్ చేస్తున్నట్లు కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.  కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కి అనుగుణంగా ఏటా ఆరోగ్యశ్రీ అమలు చేసే ప్యాకేజీలను పెంచాల్సి ఉంటుంది. 2007-09 వరకు సీపీఐ 150 శాతం పెరిగినట్టు సమాచారం. కానీ ప్రభుత్వాలు 7.5 శాతం మాత్రమే పెంచాయి. 2007-14 వరకు సీపీఐ నిబంధనల ప్రకారం ప్యాకేజీ ఐదు శాతం పెరిగింది. గత ప్రభుత్వం ఒకేసారి 2.5 శాతం పెంచి 2017-18లో అమలు చేసింది. దానిని యథాతథంగా కొనసాగించాల్సిన కొత్త ప్రభుత్వం పెరిగిన ప్యాకేజీ చెల్లించటం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అలాగే 2018-19లో పెంచిన ప్యాకేజీ కూడా చెల్లించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందంటున్నాయి.ఈ ఏడాది 2.5 శాతం ప్యాకేజీకి ప్రభుత్వం సున్నం కొట్టిందని. భవిష్యత్తులో కూడా వస్తుందో రాదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ట్రస్ట్ అవలంబిస్తున్న విధానాలు ప్రభుత్వం నిర్ణయాలతో నెట్ వర్క్ పై భారీగా భారం పడుతుంది. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాలలో సమావేశాలు నిర్వహించాలని ఆశా ప్రతినిధులు నిర్ణయించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించనున్నారు.  

పిల్ల‌ల‌మ‌ర్రికి పూర్వ వైభ‌వం.. పాలమూరు బ్రాండ్ కు కొత్త కళ

  ప్రకృతి రాజసం పిల్లలమర్రికి పునర్జన్మ నిచ్చింది. పాలమూరు జిల్లాకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచిన పిల్లలమర్రికి మళ్లీ ప్రాణం వచ్చింది. ఏడాది క్రితం వరకు ఎండిపోయిన ఆకులు విరిగిపడ్డ ఊడలతో కళావిహీనంగా కనిపించింది. 700 ఏళ్ళ సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఆ చెట్టు మళ్ళీ పునరుజ్జీవం పోసుకుంటుంది. ఏడాదిన్నర పాటు శ్రమించి అందించిన వైద్యంతో మహా మర్రి మళ్లీ నిలబడింది. ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఆ మహా వృక్షాన్ని సంరక్షించడంలో జిల్లా యంత్రాంగం కృషి ఫలించింది. త్వరలోనే పిల్లలమర్రి మహా వృక్షాన్ని చూడ్డానికి సందర్శకులను అనుమతించనున్నారు. చెద పీడను వదిలించడానికి.. చచ్చిపోతున్న చెట్టును బతికించడానికి.. సెలైన్ బాటిళ్లతో ప్రాణం పోసే చర్యలకు శ్రీకారం చుట్టారు జిల్లాధికారులు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి చెట్ల ఊడలకు అందించారు. చెట్టు చుట్టు పక్కల మూడు వందల ట్రాక్టర్ల ఎర్రమట్టిని పోయించారు. దీని పునరుజ్జీవం కోసం ఇప్పటి వరకు అధికారులు పది లక్షల వరకు వెచ్చించారు. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. నాడు 60 శాతం వరకు ఎండిపోయిన పిల్లలమర్రి నేడు 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ చూడముచ్చటగా దర్శనమిస్తుంది.

కల్తీలకు కేంద్రంగా గుంటూరు... పురుగుల మందును కూడా వదలని వైనం

  గుంటూరు జిల్లా నకిలీ వస్తువులకు అడ్డాగా మారింది. పల్నాడు ప్రాంతంలో నకిలీ పురుగు మందుల దందా సాగుతుంది. అమాయక రైతులకు ఈ నకిలీ మందులు అంటగట్టి వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. పురుగుమందు దుకాణంలోకి వెళ్లి కొనుగోలు చేసిన రైతు.. ఆ మందును పొలంలో పిచికారి చేసేదాక అది నకిలీదని గుర్తించలేకపోతున్నారు. ఇదేంటంటూ రైతులు వ్యాపారులను అడిగితే వాతావరణం, వర్షాలతో పురుగుల మందులు పనిచేయడం లేదని విక్రయదారులు సాధారణంగా చెబుతున్నారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరగడంతో రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు నామ మాత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఇలా అధికారుల అండదండలతో నకిలీ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతుంది. పత్తిలో రసం పీల్చే పురుగు నివారణ కోసం ఎఫ్ఎంసీ కొరాజిన్ మందు వినియోగిస్తారు. కొందరు ఇదే పేరుతో నకిలీలను తయారు చేసి గురజాల మండలంలో అమ్మకాలు చేపట్టారు. స్థానిక అధికార యంత్రాంగానికి తెలిసినా పట్టించుకోలేదు. దీంతో ఆ కంపెనీకి చెందిన ప్రతి నిధులే రంగంలోకి దిగారు. వాసవి ట్రేడర్స్, మురళీక్రిష్ణ ట్రేడర్స్ లో నకిలీ మందులను పట్టుకున్నారు. ఆ ఘటనతో ఈ నకిలీ మందుల బాగోతం ఒక్క సారిగా వెలుగు చూసింది. ఇప్పటికే పలు గ్రామాల్లో నకిలీ మందులు అమ్మినట్లు కంపెనీ ప్రతినిధులు గుర్తించారు. పురుగుమందు పనితనం సరిగ్గా లేదని రైతు సోదరులు తమ దృష్టికి తీసుకురావడంతో ఆ మందును నిజమైన మందా లేకపోతే ఏదైనా ఇబ్బందికరమైన మందా అనేది తేలడానికి పరీక్షలు నిర్వహించారు. కొన్ని బాటిళ్లు చెక్ చేస్తే అవి డూప్లికేట్ అనే విషయం బయటపడింది. ఈ ప్రాంతాల్లో దాదాపుగా మాచర్ల , రెంటచింతల , గురజాల , దాచేపల్లి, కారంపూడి ఈ ప్రాంతాల్లో పురుగు ఉధృతి పండగ ముందుకు పండగ తరవాతకి కొద్దిగా బాగా కనిపిస్తుంది. అయితే ఈ మందు వ్యాపారం దాదాపుగా కోటి నుంచి కోటిన్నర వరకు ఈ ప్రాంతాల్లో జరిగి ఉంటుందని తాము అభిప్రాయపడుతున్నట్లుగా తెలిపారు అధికారులు.

ఆంత్రాక్స్ దెబ్బ... కర్నూలు జిల్లాలో మృత్యువాత పడుతున్న గొర్రెలు

  కర్నూలు జిల్లాను ఆంత్రాక్స్ దడపుట్టిస్తోంది. ఆంత్రాక్స్ పంజాకు గొర్రెలు పిట్టల్లా రాలుతున్నాయి. కొలిమిగుండ్ల మండలం నాయునిపల్లెలో ఆంత్రాక్స్ సోకి 20 గొర్రెలు మృతి చెందినట్లు పశుసంవర్థక శాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో గొర్రెల పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ ఈ వ్యాధి మిగతా జీవులకూ వ్యాపిస్తుందోనని భయపడుతున్నారు. ఇక మాంసప్రియులూ మఠన్ తినాలంటేనే ఒకటి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. మేకలు ,గొర్రెలు, పొట్టేళ్లు గడ్డి మేసేటప్పుడు మూతి ద్వారా ఆంత్రోసిస్ స్పోర్ట్స్ లోపలకి ప్రవేశిస్తుంది. ఆ బాక్టీరియా శక్తిమంతమైన టాక్సీలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఈ వ్యాధి సోకిన జీవాలు శరీరంలో ఉష్ణో గ్రతలు పెరిగి వణుకుతాయి. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో పాటు నాలుక, గొంతు ,మెడ భాగాల్లో వాపు వస్తుంది. ఆంత్రాక్స్ వచ్చిన పశువులు, గొర్రెలు కొన్ని గంటల్లోనే మృత్యు వాత పడతాయి. ఆ తర్వాత పొట్ట ఉబ్బిపోయి కుళ్లిపోతాయి. ఈ వ్యాధి సోకిన మాంసం తిన్న వారికి కూడా ఆంత్రాక్స్ సోకుతుంది.  ఆంత్రాక్స్ వ్యాధితో చనిపోయిన గొర్రెలు, మేకలను కూడా వ్యాపారులు నగరాల్లో బహిరంగం గానే విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలియని చాలా మంది జనాలు ఆ మాంసాన్ని కొంటున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఆంత్రాక్స్ వ్యాధికి చికిత్స చాలా కష్టం, నివారణ ఒక్కటే మార్గం ఆంత్రాక్స్ ఎక్కువగా ఇతర జిల్లాల నుంచి మేత కోసం వచ్చే జీవాల నుంచి సంక్రమిస్తుంది. ఆంత్రాక్స్ తో 20 గొర్రెలు చనిపోయాయని పశుసంవర్థక శాఖాధికారులు చెప్తూంటే వందల కొద్ది మృతి చెందాయని గొర్రెల పెంపకం దారులు తెలుపుతున్నారు. గొర్రెలు చనిపోవడం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని ప్రభుత్వాధికారులు మేలుకొని జీవాలకు టీకాలు వేయించి ఆంత్రాక్స్ బారి నుంచి రక్షించాలని గొర్రెల పెంపకం దారులు కోరుకుంటున్నారు. పదేళ్ల క్రితం ఆళ్లగడ్డ, నంద్యాల, పత్తికొండ, దుగ్గలి ,శిరువెళ్ల, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లోని గొర్రెలు మేకలు ఆంత్రాక్స్ వ్యాధి బారిన పడి మృత్యు వాత పడ్డాయి. దశాబ్దం తర్వాత మళ్లీ ఈ జబ్బు ప్రబలింది, ప్రజలను భయపెడుతోంది.

సేల్..సేల్..సేల్.. ప్రభుత్వ భూముల అమ్మకంతో జగన్ ఇచ్చిన హామీల అమలు

  ఆర్థిక కష్టాలు ఏపీ ప్రభుత్వాన్ని వెంటాడుతున్నాయి. పాదయాత్రలో జగన్ హామి ఇచ్చిన అనేక పథకాలకు నిధుల కొరత ఏర్పడింది. గత ఐదు నెలలుగా ఆదాయ వనరులు తగ్గిపోవడంతో కొత్తమార్గాలపై అన్వేషణ ప్రారంభించారు. ప్రభుత్వ భూముల విక్రయానికి మిషన్ బిల్డ్ పై ఒప్పందం కార్యరూపం దాల్చనుంది. ప్రభుత్వ భూములను విక్రయించి నిధులు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నవరత్నాలతో పాటు పాఠశాల రూపురేఖలు మార్చే నాడు నేడు సదుపాయాల కల్పనకే ఈ నిధులు కేటాయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఒప్పందం కంటే ముందే భూములపై స్పష్టత రావాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్రంలో ఖాళీ భూములు ఎక్కడ ఉన్నాయి.. వాటి విస్తీర్ణం ఎంత.. పట్టణాలు గ్రామాల్లో ఎంత భూమి ఉంది.. వాటి రికార్డులు పరిస్థితి మొదలగు వివరాలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నివేదికను పరిశీలించి సిద్ధంగా ఉన్న భూముల లెక్కలు తీస్తోంది. సీఎం అధ్యక్షుడిగా ఉండే రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీకి నివేదించిన తర్వాత కమిటీ నిర్ణయం ద్వారా విక్రయిస్తారు. ఇక శాఖల వారీగా చూస్తే మిషన్ బిల్డ్ అమ్మకాలు, ఆర్ అండ్ బీ శాఖ నుంచి ప్రారంభం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. 1750 ఎకరాల భూములు ఉన్నాయని.. 60కి పైగా అతిథి గృహాలు ఉన్నాయని నిర్థారించారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అర్బన్ పరిధిలో ఉన్న భూముల విలువ 6,500 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. గత ప్రభుత్వం ఈ భూముల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్మాణాలు చేపట్టాలని భావించింది. అయితే అది పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక కొరత కారణంగా ఈ భూములను విక్రయించాలని నిర్ణయించింది. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న గెస్ట్ హౌజ్ ల చుట్టూ ఉన్న ఖాళీ స్థలాలు కూడా అమ్మి ఆదాయం సమకూర్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ లతో పాటు సాధారణ పరిపాలన శాఖ నిర్వహణలో ఉన్న స్టేట్ గెస్ట్ హౌజ్ ల జాబితా కూడా సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం మూడు ఎకరాల్లో ఉంది. ఇందులో ఎకరంన్నర ఖాళీగా ఉంటే చెట్లు పార్కింగ్ వంటి వాటికి ఈ స్థలాన్ని వినియోగిస్తారు. ఇక రాష్ర్టానికి వచ్చే వీఐపీలు ఇక్కడే బస ఏర్పాటు చేస్తారు. మంత్రులూ అతిథులు కూడా ఈ గెస్ట్ హౌస్ లోని సేదతీరుతుంటారు. అన్ని విధాలా అనుకూలంగా ఉన్న ఈ స్థలం అమ్మకానికి పెడుతున్నారు. ఇదే జరిగితే భవిష్యత్ లో చాలా ఇబ్బందులు వస్తాయని అధికారులంటున్నారు. వీవీఐపీలకు ఆతిథ్యమిచ్చే గెస్ట్ హౌస్ చుట్టూ ప్రైవేట్ కట్టడాలు వస్తే భద్రత కూడా కష్టసాధ్యంగా మారుతుందంటున్నారు. వీవీఐపీలు ముఖ్య అతిధులను విమానాశ్రయం నుంచి నేరుగా ఇక్కడకు తీసుకువస్తుంటారు. ఇది అమ్మితే స్టార్ హోటల్స్ లో వారికి బస ఏర్పాటు చేయటం ద్వారా ప్రభుత్వానికి భారం పడే అవకాశం ఉంది. ఇటువంటి కారణాల నేపథ్యంలో ఈ ఆలోచన సరికాదని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు. అధికారులు అన్ని శాఖల నిర్వహణపై సమాచారం సేకరిస్తున్నారు. శాఖల వారీగా భూముల లెక్కలు తీసి సర్కారుకు అందిస్తారు. త్వరలో దీనిపై కేబినెట్ సమావేశమై అధికారిక ఆస్తులు అమ్మే అంశానికి సంబంధించిన జాబితాను ప్రకటించే అవకాశముంది.  

బాబు క్షమాపణలు చెప్పాలని అమరావతి రైతుల డిమాండ్

  రాజధానిలో చంద్రబాబు పర్యటనకు ముందే వివాదం రాజుకుంది. చంద్రబాబు రాజధానిలో అడుగుపెట్టే ముందు రైతులకు క్షమాపణ చెప్పాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాన్ని నమ్మి భూములిచ్చామని.. బెదిరించి మరీ భూములు లాక్కున్నారని ప్రెస్ మీట్ పెట్టి విమర్శించారు పలువురు రాజధాని రైతులు. రాజధాని ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం అని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై వివరణ ఇచ్చిన తర్వాతే బాబు రాజధానిలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న బాబు రాజధానిలో పర్యటించనున్నారు.  రాజధాని ప్రకటించిన రోజు కూడా మందడం హై స్కూల్ లో రైతు అభిప్రాయ సేకరణ అని ఓ మీటింగ్ నిర్వహించటం జరిగింది. ప్రతి గ్రామానికి రెండు రోజులు ఆటో తిప్పి రైతులందరి దగ్గర సమాచారం చెప్పమని.. అందరూ ఏకాభిప్రాయంతో భూములు ఇద్దామని పేర్కొన్నారు. భూములు ఇచ్చాక ఎటువంటి కార్యక్రమం జరగలేదు.. రైతులు చర్చలు జరిపి భూములు ఇవ్వాలని అనుకున్నా అప్పటి స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారని తెలిపారు. అదే సమయంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చి ఆ మీటింగ్ ని రసాభాస చేయడం వల్ల రైతులు రెండు వర్గాలుగా అయిపోయారని చెప్పారు. తమ మీద లేనిపోని కేసులు పెట్టి బలవంతంగా మమ్మలని ఇబ్బందులు పెట్టి రకరకాలగా భూములు కేసులని, మా ఇళ్ల ముందు పోలీసులను పెట్టి చాలా రకాలుగా మమ్మల్ని బాధపెట్టారని రైతులు గతాన్ని గుర్తు చేశారు.  

సీతాఫలాల సీజన్.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అమ్మకాలు భేష్

    వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీతాఫలాల వ్యాపారం బాగా జరుగుతుంది. హన్మకొండలోని అంబేద్కర్ సెంటర్, పబ్లిక్ గార్డెన్స్ దగ్గర సీతాఫలాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ప్రధానంగా ఎత్తయిన గుట్టలు ఎడారి ప్రాంతాలలో సహజసిద్ధంగా పండే సీతాఫలం చెట్లు చల్లని వాతావరణంలో పూతకు కోతకు వస్తాయి. అంటే చలికాలంలోనే ఏటా ఈ సీతాఫలాలు ఎక్కువ శాతం కాస్తుంటాయి. సీతాఫలం సహజసిద్ధంగా ఎలాంటి పురుగు మందులు వాడకుండానే కాస్తాయి. అందుకే సీతాఫలాలు తినేందుకు అంత ఆసక్తి చూపుతారు. ధర ఎంతైనా కొనుగోళ్లు చేస్తారు. ఇష్టంగా సీతాఫలాలు తింటారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, చిలుపూరు, చిన్నపెండ్యాల, దేవరుప్పల, దేవునూరు, హసన్ పర్తి మండలం, చింతగట్టు వంటి ఎత్తయిన అటవీ ప్రాంతాలలో సీతాఫలాల చెట్లు పెరుగుతాయి. స్థానిక రైతులు, కూలీలు ఆయా ప్రాంతాలకు వెళ్లి వారి ఉపాధి కోసం సీతాఫలాలను కోసి ఎడ్లబండ్ల ద్వారా పట్టణ, నగర ప్రాంతాలకు తరలిస్తారు. వాటిని అమ్మి ఉపాధి పొందుతూ ఉంటారు. ఇది శీతాకాలంలోని గ్రామీణ కూలీలకు ఒక రకమైన ఉపాధి మార్గంగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చి పట్టణ, నగర ప్రాంతాల్లో అమ్మే రైతుల నుండి స్థానిక కూలీలు కొనుగోలు చేసి ప్రజలకు విక్రయించి ఉపాధి పొందుతూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుండి సీతాఫలాలను తెచ్చేవారి నుండి గంపగుత్తగా కొనుగోలు చేస్తారు. కొంత లాభాన్ని చూసుకొని ప్రజలకు సీజనల్ సీతాఫలాని అమ్ముతారు. అనేక రకాలైన పోషకాహార విలువలు గల సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. ఏటా శీతాకాలం ప్రారంభం కాగానే లభించే సీతాఫలం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సీతాఫలానికి చలువచేసే గుణం ఎక్కువ, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మలబద్దకాన్ని నివారిస్తుంది. వీటిని తినటం వలన కడుపులో మంట తగ్గుతుంది. అజీర్తిని అరికట్టి జీర్ణశక్తిని పెంచుతుంది. సీతాఫలాని మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్, జ్యూస్ తయారీలో అధికంగా వినియోగిస్తారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తప్పని సరిగా తినాల్సిన పండు ఏదైనా ఉందంటే అది ఒక్క సీతాఫలమేనని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా ఆరోగ్యపరంగా ఎన్నో లాభాలను ఇచ్చే సీతాఫలం చూడగానే అందరికీ నోరూరుతుంది. అన్ని కాలాలలో సీతాఫలాలు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. అయితే సీతాఫలాలలో స్వీట్ ఎక్కువగా ఉండటంతో షుగర్ పేషంట్స్ మాత్రం తమకున్న మక్కువను తీర్చుకోలేకపోవడం బాధగా అనిపిస్తుంది.  

ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే.. నిధుల్లేక తలలు పట్టుకుంటున్న జగన్ సర్కార్!!

  ఆంధ్ర ప్రదేశ్ లో తాగు నీటి ప్రాజెక్టుల పనులు పడకేశాయి. తీవ్ర నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. బ్యాంకులు రుణం ఇస్తేనే పనులు సాగే దుస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హాయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సమీక్ష జరిపే వరకు పనులు ముందుకు సాగనీయ వద్దంటూ జల వనరుల శాఖకు ఆదేశాలొచ్చాయి. దీంతో కమిటీ నివేదిక కోసం కొంత కాలంగా ఆ శాఖ పనులన్నీ ఆపేసింది. హంద్రీ నీవా గాలేరు నగరి సుజల స్రవంతిలో అక్రమ చెల్లింపులు జరిగాయని, పోలవరం ప్రాజెక్టులను అదనపు చెల్లింపులు జరిగాయని కమిటీ తేల్చడంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటికీ రివర్స్ టెండర్ కు వెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోలవరం సాగు నీటి ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రాల్లో ఒకే ప్యాకేజీ గా రివర్స్ టెండర్ కు వెళ్లారు. ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. మిగిలిన ప్రాజెక్టుల విషయంలో జల వనరుల శాఖ మూడుసార్లు సీఎంతో ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహించిన ఎలాంటి స్పష్టత రాలేదు. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగు నీటి ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ ఏడాది 7,687 కోట్లు అవసరమని సీఎం ఈ నెలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ నివేదిక ఇచ్చింది. అయితే ఈ 7,687 కోట్ల విషయంలో ఆర్థిక శాఖ ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్న సమయంలోనే ప్రభుత్వం భారీ సాగు నీటి ప్రాజెక్టులకు స్కెచ్ వేసింది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను పంపి రాయలసీమకు సాగు, తాగు నీరు అందించే భారీ ఎత్తిపోతల పథకానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు వ్యయం అవుతాయని ఇంజనీరింగ్ నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై ఇరు రాష్ట్రాల సీఎంలు సమావేశాలు నిర్వహించినా చివరకు రైతుల లేమి కారణం తోనే ఈ భారీ ప్రణాళికకు దాదాపు పుల్ స్టాప్ పెట్టినట్టుగా జల వనరుల శాఖ వర్గాలు వివరిస్తున్నాయి.  పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి బానకచెర్ల వరకు గోదావరి జలాలను ఎత్తిపోసే మరో పథకానికి కార్యాచరణను సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికి 80 వేల కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఆర్థిక ఒడిదుడుకుల నేపధ్యంలో ఇంత పెద్ద మొత్తంలో నిధుల సేకరణ సాధ్యమేనా అనే సందేహాలు నెలకొన్నాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టాలన్నా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి పూర్తికావాలన్న బ్యాంకు రుణాల పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జలవనరులశాఖ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని నుంచి బ్యాంకు రుణాలు పెద్ద మొత్తంలో తీసుకోవాలన్న ఆలోచనలో ఆ శాఖ ఉంది. అయితే రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ నుంచి ఎత్తిపోతల పథకాలు మధ్య తరహా ప్రాజెక్టుల కోసం తీసుకున్న వేల కోట్ల రుణాలకు ఇప్పటికే భారీ మొత్తంలో వడ్డీలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా బ్యాంకులను ఆశ్రయించే యోచనలో ఉన్నారు. అయితే ఈ కార్పొరేషన్ లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయ అనే సందేహాలున్నాయి.  

వీడని చిన్నారి కిడ్నాప్ మిస్టరీ... మృతదేహాన్ని మాయం చేసిన సవతి తల్లి

  తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి దీప్తీశ్రీ కిడ్నాప్ కేసులో మిస్టరీని చేధించేందుకు పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. మూడు రోజుల క్రితం ( నవంబర్ 22న ) స్కూల్ నుంచి తీసుకొస్తానని వెళ్లిన సవతి తల్లి శాంతకుమారి కిడ్నాప్ చేసి అటుపై హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అయితే హత్య చేయడానికి గల కారణాలు.. చిన్నారిని హతమార్చిన కేసులో నిందితురాలి శాంతకుమారి కాకుండా ఇంకా ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీప్తీశ్రీ ని గొంతు నులిమి చంపానని అంగీకరించిన సవతి తల్లి మృతదేహాన్ని ఎక్కడ పడేసిందని అడిగితే మాత్రం నోరు మెడపటంలేదు. అది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు.  చిన్నారి కిడ్నాప్ కు గురైన ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు పోలీసులు. స్కూలు నుంచి చిన్నారిని తీసుకుని కొద్ది దూరం వరకు నడిపించుకొని తీసుకెళ్లి అటుపై వేరే వ్యక్తి బైక్ పై తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. దీప్తీశ్రీ నాయనమ్మ బంధువులు చెప్పిన వివరాల్ని బట్టి కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. కిడ్నాప్ కు గురైన రోజు శాంతకుమారితో పాటు మరో వ్యక్తి ఉన్నాడని చెప్పడంతో వేర్వేరు కోణాల్లో వివరాలు సేకరిస్తున్నారు. ఇక పాప మృతదేహం కోసం కాకినాడ సామర్లకోట రోడ్డులోని పంట, మురుగు కాలువల్లో వెతుకుతున్నారు. బాలిక డెడ్ బాడీని గాలించేందుకు ధర్మాడి సత్యం బృందం నుండి 15 మందిని పిలిపించారు. మరోవైపు దీప్తీశ్రీ మృతదేహం ఆచూకీ లభించకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. చిన్నారి దీప్తీశ్రీ మిస్సింగ్ కేసులో పూర్తి వివరాలు రాబడుతున్నామని కాకినాడ డీఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఇక చిన్నారి సవతి తల్లి ఇచ్చిన వివరాల ప్రకారం మృతదేహం కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఈ హత్య వెనుక కుటుంబ కలహాలే కారణమా..లేక వేరే ఏమైనా విషయాలు దాగి ఉన్నాయా.. అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నామనని తెలిపారు. తమ విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు డీఎస్పీ కరణం కుమార్.