అమరావతే ఏపీ రాజధాని... వైసీపీకి షాకిచ్చిన కేంద్రం... టీడీపీ మాటకు విలువ..!

  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కేంద్రం గుర్తించింది. నవంబర్ 8న విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో అమరావతి పేరు లేకపోవడాన్ని... టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్‌లో ప్రస్తావించడంతో కేంద్రం స్పందించింది. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానమని, ఎందుకంటే అమరావతి నిర్మాణానికి స్వయంగా ప్రధానే శంకస్థాపన చేశారంటూ  గల్లా చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని కదిలించాయి. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు. గల్లా అలా అడిగారో లేదో నెక్ట్స్ డేనే కేంద్ర హోంశాఖ చర్యలు చేపట్టింది.ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కేంద్రం మరోసారి మ్యాప్ విడుదల చేసింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో సర్వే ఆఫ్ ఇండియా... మ్యాప్‌ ను సరిచేసింది. అయితే, నవంబరు 8న కేంద్రం విడుదల చేసిన ఇండియన్ పొలిటికల్‌ మ్యాప్‌లో నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడంపై విమర్శలు చెలరేగాయి. అన్ని రాష్ట్రాల రాజధానులను మ్యాప్ లో ప్రస్తావించిన కేంద్రం... ఏపీ కేపిటల్ అమరావతిని మాత్రం ఎందుకు విస్మరించదనే అనుమానాలు వచ్చాయి. అయితే, రాజధానిపై ఏపీలో గందరగోళం నెలకొనడం, కొత్త ప్రభుత్వం ఆలోచన ఏంటో తెలియకపోవడంతోనే అలా చేసిందేమోనని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వైసీపీ ఎంపీలు... మ్యాప్ అంశాన్ని పార్లమెంట్ ప్రస్తావించలేదు. అయితే, అనూహ్యంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్... మ్యాప్ వివాదాన్ని ప్రస్తావించడం.... కేంద్రం వెంటనే దాన్ని సరిచేసి... ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ మళ్లీ మ్యాప్ ను విడుదల చేయడం సంచలనంగా మారింది. కేంద్రం విడుదల చేసిన మ్యాప్ తో ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించినట్లే భావించాలి. అది కూడా టీడీపీ రిక్వెస్ట్ తర్వాత కేంద్రం మ్యాప్ ను సరిచేసి విడుదల చేయడమంటే అది వైసీపీకి దెబ్బగానే అనుకోవాలి. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా... మళ్లీ ఇఫ్పుడు టీడీపీ దగ్గరవుతుందనే మాట వినిపిస్తోంది. అందుకే, వైసీపీ కంటే టీడీపీ నేతల మాటకే కేంద్రం ఎక్కువ విలువ ఇస్తుందని అంటున్నారు.

ప్రారంభంకానున్న రచ్చబండ.. నేను మాట ఇస్తే ప్రభుత్వం ఇచ్చినట్లే: సీఎం జగన్

  రచ్చబండ కార్యక్రమం చేపడతానని ఏపీ సీఎం జగన్ తెలిపారు. తాను ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వ హామీగానే భావించి..అమలు చేయాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ శాఖల అధిపతులకు కార్యదర్శులకు స్పష్టం చేశారు.  ప్రభుత్వ పాలన విధానంపై ప్రజల అభిప్రాయాలను నేరుగా తెలుసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు.  వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా జగన్ తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలపై జరిపిన సమీక్ష సందర్భంగా ఆయన ప్రకటన చేశారు.  ప్రభుత్వం తిరిగి ఎన్నిక కావటమే మైలురాయిగా పనిచేయాలని.. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చినపుడే అది సాధ్యమవుతుందన్నారు. నవరత్నాల అమలే ఫోకస్ గా ఉండాలని వైసీపీ ప్రభుత్వం ఏం చేసినా సంతృప్త స్థాయిలో చేస్తుందనేది ప్రజల్లో చర్చ కావాలన్నారు. సామాన్యులపై భారం మోపకుండా ఆదాయాలు ఎలా పెంచుకోగలం ఆలోచనల చెయ్యాలని ఆదేశించారు. కేంద్రం నుంచి వీలైనన్ని నిధులు తెచ్చుకోవాలన్నారు. దీనికోసం ఢిల్లీలో ఉన్న మన అధికారులను బాగా వినియోగించుకోమని సలహా ఇచ్చారు. రచ్చబండ సమయంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై హామీలిస్తాం వాటన్నింటిని అమలుచేయటంపై అధికారులు ఖచ్చితంగా దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రతి హామీ అమలు కావాలి పనులు వెనువెంటనే మొదలుకావాల్సిందే.. మాట ఇస్తే అమలుచేయాల్సిందే.. తాత్సారం జరగకూడదు, ఇచ్చిన మాటను నెరవేర్చలేదన్న మాట రాకూడదు. రచ్చబండ కోసం అన్ని శాఖల అధికారులు సిద్ధంగా ఉండాలని సెలవిచ్చారు. ఏదైనా పనికి శంకుస్థాపన చేస్తే నాలుగు వారాల్లోనే పనులు ప్రారంభం కావాలి. వచ్చే సమీక్ష నాటికి జిల్లాల పర్యటనల్లో నేనిచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని కోరారు.

అప్పుడు కుమారస్వామి... ఇప్పుడు అజిత్ పవార్... దేవెగౌడ మాదిరిగా శరద్ పవార్...

  మహారాష్ట్రలో నెలరోజులుగా సాగుతోన్న రాజకీయ హైడ్రామాకు ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది. ముఖ్యమంత్రి పదవి కోసం తన మూల సిద్ధాంతాలకు భిన్నంగా కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన జతకట్టగా... బీజేపీ సైతం తామేమీ తక్కువ కాదంటూ, తన విధానాలకు వ్యతిరేకంగా ఎన్సీపీతో కలిసి హడావిడిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి శివసేనకు షాకిచ్చింది. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమనడానికి ఇది మరో ఉదాహరణ. అయితే, శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చర్చలు జరుపుతుండగానే, పవార్ మేనల్లుడు అజిత్.... బీజేపీ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడమే కాంగ్రెస్, శివసేన జీర్జించుకోలేకపోతున్నాయి. అజిత్ ప్రమాణస్వీకారం చేసేవరకు తనకేమీ తెలియదంటోన్న శరద్ మాటలపైనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. సేమ్ టు సేమ్ ఇలాంటి ఘటనే కర్నాటకలో జరిగింది. 2004 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. జేడీఎస్ పరోక్ష మద్దతుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా, కొద్దిరోజులకే కుప్పకూలింది. అయితే, బీజేపీతో చేతులు కలిపిన ఆనాటి జేడీఎస్ శాసనసభాపక్ష నేత కుమారస్వామి... 2006 ఫిబ్రవరి 4న కర్నాటక ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే, సెక్యులర్ పార్టీగా ముద్రపడిన జేడీఎస్.... బీజేపీతో చేతులు కలపడంపై ఆనాడు తీవ్ర విమర్శలు వచ్చాయి. కుమారస్వామి తండ్రి, జేడీఎస్ అధినేత దేవెగౌడ దీనిపై విచిత్రంగా స్పందించారు. కుమారస్వామి తనకు చెప్పకుండానే బీజేపీతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడని తప్పించుకున్నారు. అలా, ఏడాదిన్నరపాటు కుమారస్వామి కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.  అప్పుడు దేవెగౌడ మాదిరిగానే, ఇప్పుడు శరద్ పవార్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్, శివసేన అంటున్నాయి. శరద్ పవార్ కు తెలియకుండానే అజిత్ పవార్.... బీజేపీతో చేతులు కలపారా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీని శరద్ పవార్ కలిసినప్పుటి నుంచే ఈ అనుమానాలు కలిగాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకపక్క కాంగ్రెస్, శివసేనతో చర్చలు జరుపుతూనే, గుట్టుచప్పుడు కాకుండా శరద్ పవార్ బీజేపీకి మద్దతిచ్చారని భావిస్తున్నారు.

ఆర్టీసీ రేట్లకే ప్రైవేట్ బస్సులు... 5100 బస్సులకు గ్రీన్ సిగ్నల్

  మొత్తం 5,100 ప్రైవేటు బస్సులకు స్టేజీ క్యారేజీలుగా తెలంగాణ సర్కార్ రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం ఇవాళే ఈ ప్రక్రియను మొదలుపెట్టబోతుంది. అయితే ప్రైవేటు బస్సులను ఆర్టీసీ చార్జీలతోనే నడపాలని తెలిపింది. హైదరాబాద్ లో తిరిగే బస్సులకు కనీస చార్జీ 5 రూపాయలుగా ఉంది. సెట్విన్ బస్సుల్లో పదిరూపాలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆటోల చార్జీలు రెట్టింపు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆపరేటర్ లకు ఆర్టీసీ చార్జీలు నచ్చుతాయా..? వారికి గిట్టుబాటు అవుతుందా..? స్టేజి క్యారేజి పర్మిట్ లు తీసుకోవటానికి వారు ముందుకొస్తారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీలో  10,460 బస్సులున్నాయి. వీటిలో 2,103 అద్దె బస్సులు, 2,609 ఆర్టీసి సొంత బస్సులకు కాలం చెల్లింది. మరో 400-500 ల బస్సులకు మూడు నాలుగు నెలల్లో కాలం చెల్లనుంది. ఇవన్నీ కలిపి 5,100 వరకూ అవుతాయి.  కొత్త బస్సులను కొనుగోలు చేయలేని పరిస్థితిలో ఆర్టీసీ ఉందని ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది. దాంతో ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్ లు ఇవ్వనుంది. ఆర్టీసీ ఆధీనంలో ఉన్న రూట్లలో ఇవి స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ఒక రూట్ లో ఉన్న ప్రతి గ్రామం దగ్గర ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించటం పద్ధతిలో స్టేజీ క్యారేజీలుగా నడుస్తాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడిచే 3,726 రూట్లలో కొన్నింటిలో మాత్రమే ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు ఇచ్చేలా అధికారులు కొత్త విధానాన్ని రూపొందించారు. ఇవి ఆర్టీసీ చార్జీలతో నడుస్తాయి. వాటిని రవాణా శాఖ నియంత్రిస్తుంది. ప్రస్తుతం అద్దె బస్సులకు కిలో మీటర్ కు 6 నుంచి 11 రూపాయల చొప్పున ఆర్టీసీ చెల్లిస్తుంది. ప్రతి బస్సు రోజుకు 280 కిలో మీటర్ లు తిరగాలనే నిబంధన ఉంది. టికెట్ ఆదాయం ఆర్టీసీకే చెందుతుంది. ప్రైవేటు బస్సులకు పర్మిట్ లు ఇస్తే ఆ ఆదాయం రవాణా శాఖకు సమకూరనుంది. పర్మిట్ల ఫీజులు ఎలా నిర్ధారిస్తారన్నది తేలాల్సి ఉంది. 22 సీట్లు.. 40 సీట్లతో ఉన్న ప్రైవేటు బస్సులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఐటి ఉద్యోగులను వారి కంపెనీలకు చేరుస్తున్నాయి. ఎక్కువగా హైదరాబాద్ సంగారెడ్డి జిల్లాలలోనే ఇలాంటి బస్సులున్నాయి. ఇవి ఒక్కో సీటుకు రూ.1210 రూపాయల చొప్పున త్రైమాసిక పన్నును రవాణా శాఖకు చెల్లిస్తున్నాయి. ఇవి కాకుండా టూరిస్టు బస్సులు మాత్రం సీటుకు  రూ.896 రూపాయల చొప్పున త్రైమాసిక పన్ను చెల్లిస్తున్నాయి. ఇలాంటి బస్సులు రాష్ట్ర పరిధి దాటితే అదనంగా రూ.700 రూపాయల చొప్పున పన్ను చెల్లించాలి. ఇలాంటి బస్సులను స్టేజీ క్యారేజీలుగా తీసుకోవాలంటే ఎంత పన్ను నిర్ధారిస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ట్విస్టులకే ట్విస్ట్... ఇది మహా ట్విస్ట్... సీఎంగా ఫడ్నవిస్... డిప్యూటీగా అజిత్...

నిజంగానే ఇది ట్విస్టులకే ట్విస్టు... క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఇన్ని మలుపులు ఉండవేమో... ఎందుకంటే, నెలరోజులుగా మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయాల్లో... ఎవ్వరూ ఊహించనివిధంగా ఎండ్ కార్డ్ పడింది... శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవగా... అనూహ్యంగా దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.... ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్.... డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గతంలో ఎన్నడు జరగనివిధంగా హడావిడిగా గవర్నర్ బంగ్లాలో ఈ తతంతం జరిగిపోయింది.  ఏదో కొంపలు మునిగిపోతున్నట్లు తెల్లవారుజామున ఐదున్నర తర్వాత రాష్ట్రపతి పాలనను ఎత్తివేయగా, వెనువెంటనే...గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ... బీజేపీని శివసేనను ఇద్దరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అనంతరం రాజ్ భవన్ వేదికగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవ్వరూ ఊహించనివిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేయగా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్.... డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసి కలకలం రేపాడు.  అయితే, మేనల్లుడు అజిత్ పవార్ ... బీజేపీతో చేతులు కలపడంపై శరద్ పవార్ విస్మయం వ్యక్తంచేశారు. తనకీ విషయం తెలియనే తెలియదన్నారు. కానీ, శరద్ పవార్ పై కాంగ్రెస్ పరోక్షంగా సెటైర్లు వేసింది. పవార్ జీ... మీరు చాలా గ్రేట్.. అంటూ వ్యాఖ్యానించారు. అయితే, శరద్ పవార్ ను ప్రధాని మోడీ పొగడటం... ఆ తర్వాత మోడీని పవార్ కలవడంతో.... అప్పుడే అనుమానాలు చేలరేగాయి. బీజేపీ-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని, కానీ... ఒకవైపు శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగానే, శరద్ పవార్ ను కాదని, అజిత్ పవార్... బీజేపీతో చేతులు కలిపాడంటే నమ్మడానికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

వైసీపీలో సుజనా మంటలు... జగన్ కంగారెందుకు పడుతున్నారు?

50శాతం ఓట్లు... 22మంది ఎంపీలు... 151మంది ఎమ్మెల్యేలతో కనీవినీ ఎరుగనిరీతిలో తిరుగులేని విజయం సాధించి... అధికారంలోకి వచ్చిన వైసీపీ... విపక్ష నేతలు చేస్తోన్న ప్రతీ చిన్న విమర్శకూ ఉలిక్కిపడుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేకపోయినాసరే... ప్రతిపక్షాల పదునైన మాటలకు అల్లకల్లోలమవుతోంది. ఇసుక, ఇంగ్లీష్ మీడియం, మతం, ఫిరాయింపులు... ఇలా చిన్న ప్రతి విషయంలోనూ వైసీపీ కంగారుపడుతోంది.  ఇక, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలు వైసీపీలో అలజడి సృష్టించాయి. పలువురు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు.... అలాగే, 20మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ సుజనా చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం అస్సలు పట్టించుకోకపోగా, వైసీపీ మాత్రం తీవ్రంగా స్పందించింది. వైసీపీ ఎంపీలు, మంత్రులైతే సుజనాపై ముప్పేట దాడికి దిగారు. సుజనాకి దమ్ముంటే అసలు ఎవరు టచ్ లో ఉన్నారో చెప్పాలంటూ సవాలు విసిరారు. కొందరు ఎంపీలు, మంత్రులైతే వ్యక్తిగత విమర్శలకు దిగారు. సుజనా ఓ బ్యాంకుల దొంగని... గూగుల్ లో బ్యాంకుల దొంగని టైట్ చేస్తే... సుజనా పేరే వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని సుజనా... బ్యాంకులకు మాత్రం తెలివిగా కన్నాలు వేస్తారని దుయ్యబట్టారు. అరెస్టుల భయంతో బీజేపీ పంచన చేరిన సుజనా... ఇప్పటికీ చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నాడని ఆరోపించారు. సుజనా... చంద్రబాబు ఏజెంటు, కోవర్టని... ఇది బీజేపీ నేతలు ఎప్పుడు తెలుసుకుంటారోనంటూ వ్యాఖ్యానించారు. సుజనాను నమ్ముకుంటే బీజేపీ నాయకులు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అవుతుందని సూచించారు. ఇక, విజయసాయిరెడ్డి అయితే, ఒక వింత డిమాండ్‌ను సుజనాచౌదరి ముందు ఉంచారు. ఈసారి విలేకరులతో కాకుండా బ్యాంకు అధికారులను పిలిచి సుజనా ప్రెస్‌మీట్ పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. బ్యాంకు అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే... సుజనా పార్టీ ఎందుకు మారాడో, చంద్రబాబు ఎందుకు మార్చాడో... అన్నీ బయటకు వస్తాయన్నారు.  అయితే, మొన్నటివరకు టీడీపీ నేతలతో రహస్య మంతనాలు సాగించిన సుజనా... ఇప్పుడు పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీలకు గాలమేసే పనిలో పడ్డారని చెప్పుకుంటున్నారు. ఏమైనా సుజనా ప్రకటనతో వైసీపీలో అలజడి అయితే రేగింది. ఎమ్మెల్యేల సంగతి ఎలాగున్నా... నలుగురైదురు ఎంపీలు మాత్రం బీజేపీతో టచ్ లో ఉన్నారని ఎప్పుడ్నుంచో ప్రచారం జరుగుతున్నవేళ... సుజనా వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. లేకపోతే వైసీపీ ఎంపీలంతా అంత హడావిడిగా సుజనాపై మూకుమ్మడిగా కౌంటర్ అటాక్ చేయాల్సినంత అసరమేముందని మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా సుజనా కామెంట్స్... వైసీపీలో మాత్రం కలవరం సృష్టిస్తున్నాయి. అంతేకాదు అసలా ఎంపీలు ఎవరన్న చర్చ కూడా నడుస్తోంది.

మహా రాజకీయంలో.. మోడీ విజయం... ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ

మహా రాజకీయాల్లో చివరికి అనూహ్యమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫెడ్నవిస్ ప్రమాణస్వీకారం చెయ్యగా.. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. శనివారం ( నవంబర్ 23న ) ఉదయం గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ వీళ్ళతో ప్రమాణస్వీకారం చేయించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భాజపా-ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాత్రికి రాత్రే రాజకీయం పూర్తిగా మారిపోయింది. మిత్రపక్షమైన శివసేనకు భాజపా భారీ షాక్‌ ఇచ్చినట్లే అని చెప్పుకోవచ్చు.   రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నామని శుక్రవారం ( నవంబర్ 22న ) ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌.. శివసేన నాయకుడు ఉద్ధవ్‌ ఠాక్రే.. ఇద్దరూ పోటాపోటీగా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం రాజకీయ పండితుల్ని సైతం విస్మయానికి గురి చేస్తుంది. రెండు రోజుల క్రితం ప్రధాని మోదీతో పవార్‌ భేటీ అయిన సందర్భంలోనే.. భాజపా-ఎన్సీపీ కూటమికి బీజం పడినట్లు తెలుస్తుంది. ప్రమాణస్వీకారం అనంతరం ప్రధాని మోదీకి.. అమిత్‌ షాకి.. ఫెడ్నవిస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన  దేవేంద్ర ఫడణవీస్‌, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. మహారాష్ట్ర భవిష్యత్తు కొరకు కృషి చేస్తూ ముందుకు సాగుతారని  విశ్వాసం వ్యక్తం చేశారు.

టీడీపీలో మొదలైన ఎన్నికల కోలాహలం... సంస్థాగత ఎన్నికలకు కసరత్తులు

తెలుగుదేశం పార్టీలో సంస్థాగత ఎన్నికల కోలాహలం మొదలైంది. ముందుగా గ్రామ స్థాయి కమిటీలతో మొదలు పెట్టి, జిల్లా స్థాయి వరకు ఎన్నికల నిర్వహణకు పార్టీ కసరత్తులు ప్రారంభించింది. ప్రతి రెండేళ్లకు నియమబద్ధంగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న టిడిపి ఈ సారి కొంత ఆలస్యంగా దీన్ని చేపట్టింది. ఎన్నికల్లో అనూహ్య ఓటమి టిడిపి శ్రేణుల్లో స్తబ్దత తెచ్చింది. కిందిస్థాయిలో కొందరు నేతలు పార్టీని వీడి వెళ్లిపోయారు. ఆ స్తబ్దత పోయేలా కొత్త వారిని ఎంపిక చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించటానికి సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మంచి అవకాశమని టిడిపి వర్గాలు భావిస్తున్నాయి. ఈ నెల ( నవంబర్ ) 18 నుంచి గ్రామ స్థాయి పార్టీ కమిటీల ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టారు. పదమూడు జిల్లాలల్లో కలిపి సుమారు 16,000 ల గ్రామ కమిటీలను నియమించాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి మండలానికి ముగ్గురు సభ్యుల పార్టీ బృందాలను నియమించారు. స్థానిక రాజకీయాల ప్రభావం వారిపై పడకుండా చూసేందుకు పొరుగు మండలాల వారిని ఈ బృందాల్లో నియమించారు. ఈ సారి ఈ కమిటీల నియామకంలో మార్పులు చేర్పులు చేశారు. గతంలో కేవలం పార్టీ కమిటీ ఎన్నిక మాత్రమే గ్రామ స్థాయిలో జరిగేది. ఈ దఫా కిందినుంచి అనుబంధ సంఘాలను బలోపేతం చేసే నిమిత్తం అదనంగా మూడు కమిటీలను కూడా ప్రతి గ్రామంలో నియమించాలని అధిష్టానం ఆదేశించింది. దీని ప్రకారం ప్రతి గ్రామంలో తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు రైతు కమిటీల్లో కూడా నియమించాల్సి వుంటుంది. గ్రామ కమిటీల నియామకంలో ఎక్కడా సిఫారసులు నామినేషన్ కు అవకాశం ఇవ్వొద్దని ఆ గ్రామంలో పార్టీ సభ్యులందరి అభిప్రాయం తీసుకొని ఆ ప్రకారం కమిటీ ఎంపిక జరగాలని సూచించారు. అవసరమైతే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక నిర్వహించి కమిటీనీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలే కానీ తమపై రుద్దద్దని.. అభిప్రాయభేదం ఇవ్వొద్దని.. అధిష్టానం ఆదేశించింది. కమిటీల కూర్పులో కూడా భారీగా మార్పులు చేశారు. కమిటీలోని మొత్తం పదవుల్లో ఖచ్చితంగా సగం బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీ వర్గాల వారికి ఇవ్వాలని ఆదేశించారు.కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి పదవుల్లో ఒకటి తప్పని సరిగా బీసీలకు ఇవ్వాలని వారు అందుబాటులో లేకపోతే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చాన్స్ ఇవ్వాలని అధిష్టానం నిర్దేశించింది. పదవుల్లో కచ్చితంగా 33 శాతం యువత ఉండాలని 33 శాతం పదవుల్లో మహిళలు కూడా ఉండేలా చూడాలని నిర్ణయం తీసుకున్నారు. యువత మహిళలకు కమిటీల్లో తగిన ప్రాధాన్యం ఉంటే కొత్త నాయకత్వం ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుందని, దానివల్ల కొత్త నీరు వస్తుందని పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. గ్రామ స్థాయి ఎన్నికల తర్వాత మండల కమిటీల ఎన్నికలను చేపట్టనుంది. మండల స్థాయి వరకూ ఎన్నికలను డిసెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. గ్రామ స్థాయి ఎన్నికలు జరుగుతున్న తీరును టిడిపి అధినేత చంద్రబాబు నుంచి టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గ్రామానికి వెళ్లకుండా ఎక్కడో కూర్చొని కమిటీల పేర్లు రాస్తే ఊరుకునే సమస్యే లేదని పార్టీ పరిశీలకులు ఖచ్చితంగా ప్రతి గ్రామానికి వెళ్లి అక్కడే కమిటీ ఎన్నిక జరపాలని ఆదేశించారు. కమిటీల ఎన్నికలో ఉత్సాహంగా కింది స్థాయి నేతలు పాల్గొంటున్నారని.. స్తబ్ధత వైదొలిగిన వాతావరణం కనిపిస్తోందని.. పార్టీ పరిశీలకులు నివేదించారు.

ఆర్టీసీ కార్మికుల నెత్తిన మరో పిడుగు... ఇక ఆ దేవుడే కాపాడాలి..!

ఆర్టీసీ కార్మికుల నెత్తిన మరో పిడుగుపడింది. 50రోజులుగా సమ్మె చేస్తున్నా... ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో... చేతులెత్తేసిన ఆర్టీసీ జేఏసీకి మరో భంగపాటు ఎదురైంది. 50శాతం ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపైనా మొదట్లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగి కార్మికుల్లో లేనిపోని ఆశలు రేపిన హైకోర్టు... ఆఖర్లో మాత్రం తుస్సుమనిపించింది. ప్రభుత్వం స్పందించకపోయినా, తమను హైకోర్టు ఆదుకుంటుందని, కనీసం తమకు న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశిస్తుందని ఆశపడ్డారు. కానీ, ఆర్టీసీ సమ్మె విషయంలో తాము ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలివ్వలేమని చేతులెత్తేయడంతోనే ఆర్టీసీ జేఏసీ సమ్మె విరమణ దిశగా నిర్ణయం తీసుకుంది.  ఇక, ఇప్పుడు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ విషయంలోనూ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునివ్వడంతో కార్మికుల గుండెల్లో గునపాలు దిగినట్లయ్యింది. దాంతో, ఆర్టీసీ కార్మికుల భవితవ్యం ఎలా ఉండబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇక, ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుందా? ఎప్పుడు విధుల్లో చేరదామా అంటూ ఆర్టీసీ కార్మికులు డిపోల దగ్గర పడిగాపులు పడుతున్నారు. అయితే, షరతులతో కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకున్నా, దాదాపు 50శాతం రూట్ల ప్రైవేటీకరణ కారణంగా దాదాపు పాతికవేల మంది కార్మికులను ఆర్టీసీలో కొనసాగించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మరి, వీళ్లందరినీ ప్రభుత్వం ఆర్టీసీలోనే కొనసాగిస్తుందా? లేక ఇతర కార్పొరేషన్లకు బదిలీ చేస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే, 5100 ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో సుప్రీంను ఆశ్రయించాలని పిటిషనర్ విశ్వేశ్వర్రావు నిర్ణయించారు. మోటార్ వెహికల్‌ యాక్ట్ సెక్షన్ 102 ప్రకారం... ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయన్న హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేయనున్నారు. అసలు, టీఎస్‌-ఆర్టీసీకే చట్టబద్ధత లేదంటోన్న విశ్వేశ్వర్రావు.... 50శాతం రూట్లను ప్రైవేటీకరణ చేస్తే... ఆర్టీసీ కార్మికులు ఏమైపోవాలని ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత దూకుడుగా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఆర్టీసీ జేఏసీకి మరో షాక్.. రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్!!

  దాదాపుగా 50 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ఒక్క డిమాండ్ ని కూడా నెరవేర్చుకోలేక సతమవుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలకు మరో షాక్ తగిలింది. రూట్ల ప్రైవేటీకరణపై దాఖలపైన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. ఈరోజు తుది తీర్పు వెల్లడించింది. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టలేమని స్పష్టం చేసింది. అడ్వొకేట్ జనరల్ వినిపించిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఆర్టీసీపై పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుందని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలసీ విధానాలలో పిటిషనర్ల జోక్యం తగదని సూచించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులను ఏజీ ప్రస్తావించారు. ఈ సందర్భంగా.. రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ అమలు చేసే బాధ్యత ఎవరికి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర రవాణా అథారిటీకి అధికారం అప్పగిస్తున్నట్టు కేబినెట్ తీర్మానంలో ఉందని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం వేరు, అథారిటీ వేరని.. ప్రభుత్వం చేయాల్సిన పని అథారిటీ ఎలా చేస్తుందని కోర్టు ప్రశ్నించింది. దీంతో.. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ప్రభుత్వం తరఫున ఏజీ హామీ ఇచ్చారు. కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి జీవో రాకముందే.. కేబినెట్ నిర్ణయాన్ని సవాల్ చేయకూడదన్న ఏజీ వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అదేవిధంగా.. మోటారు వాహనచట్టం-1988 సెక్షన్ 102 ప్రకారం రూట్ల ప్రైవేటీకరణకు ప్రభుత్వానికి విస్తృత అధికారాలున్నాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీంతో ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయింది.

ఆర్టీసీ సమ్మెలో కొత్త ట్విస్ట్.. సమ్మెకు బ్రేకు లేదు!

  ఇబ్బంది పడేది సామాన్య ప్రజలు, కార్మికులే కదా.. మనదేం పోయింది?, మన పంతం మనది అన్నట్టుంది.. అటు ప్రభుత్వ వైఖరి, ఇటు ఆర్టీసీ జేఏసీ వైఖరి. సమ్మె మొదలై దాదాపు యాభై రోజులైంది. ఎవ్వరూ మెట్టు దిగరు.. ముగింపు పలకరు. ఒకవేళ ఎవరైనా ఒక మెట్టు దిగినా మరొకరు పట్టించుకోరు. ఇలా ఈ వ్యవహారాన్ని సాగదీస్తూ అర్థ శతదినోత్సవం వైపు పరుగులు తీయిస్తున్నారు. సామాన్య ప్రజలకు కోపం, చిరాకు, అసహనం తెప్పిస్తున్నారు. మొన్నటికి మొన్న ఆర్టీసీ సమ్మెపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మె విరమించే యోచనలో ఉన్నట్టు ప్రకటించారు. ఎటువంటి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. దీంతో ఆయన మీద విమర్శలు వ్యక్తమయ్యాయి. 20 పైగా డిమాండ్లతో సమ్మెకు దిగారు. కొద్ది రోజులకి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెడుతున్నాం. మిగతా వాటిపై చర్చలకు పిలవండి అన్నారు. కొన్నిరోజులకి షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోండి సమ్మె విరమిస్తాం అన్నారు. కార్మికులు ప్రాణాలు కోల్పోయారు, ప్రజలు నలభై రోజులకి పైగా ఇబ్బంది పడ్డారు, ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు.. మరి ఈ సమ్మె చేసి ఏం సాధించినట్టు అని విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో అశ్వత్థామరెడ్డి పునరాలోచనలో పడ్డారు. తాజాగా, ఆర్టీసీ సమ్మె యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.  సమ్మె విరమణ నిర్ణయంపై శుక్రవారం ఆయన పున:సమీక్ష జరిపారు. సమ్మె విరమిస్తామని చెప్పినా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని తెలిపారు. కార్మికులెవరూ బస్సు డిపోల వద్దకు వెళ్లి విధుల్లోకి తీసుకోవాలని కోరవద్దన్నారు. కార్మికులు అధైర్య పడవద్దని, న్యాయం జరిగేలా చూసే బాధ్యత జేఏసీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. శనివారం మరోసారి జేఏసీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందన్నారు అశ్వత్థామరెడ్డి. ఇదంతా చూస్తుంటే ఆర్టీసీ సమ్మెకు ఇప్పట్లో బ్రేకు పడేలా లేదనిపిస్తోంది.

మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ మరోసారి గల్లా నిప్పులు

  ప్రత్యేక హోదా, విభజన హామీలపై మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ పార్లమెంట్ లో నిప్పులు చెరిగిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మరోసారి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పట్ల చూపుతోన్న పక్షపాత వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా, జమ్మూకశ్మీర్ విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పేరు లేకపోవడాన్ని గల్లా జయదేవ్ తప్పుబట్టారు. ఇండియన్ పొలిటికల్ మ్యాప్ లో అమరావతి పేరు లేకపోవడం... ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అవమానం మాత్రమే కాదని... అది ప్రధాని మోడీకి కూడా జరిగిన అవమానంగా చెప్పుకొచ్చారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రధాని మోడీ స్వయంగా శంకస్థాపన చేసిన విషయాన్ని గల్లా జయదేవ్ గుర్తుచేశారు. ఇప్పటికైనా, పొరపాటును సరిచేసి, అమరావతి పేరు ఉండేలా ఇండియన్ మ్యాప్‌ను మరోసారి విడుదల చేయాలని గల్లా డిమాండ్ చేశారు.  

ప్రతిపక్షాలపై కేసీఆర్ మైండ్ గేమ్... వ్యూహంలో చిక్కుకున్న ప్రతిపక్ష నేతలు!!

  ప్రతిపక్షాలు కేసీఆర్ ట్రాప్ లో పడ్డాయానే వార్త ఈ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఆర్టీసీ సమ్మెను పరిశీలించన కొందరు నేతలు ఈ ప్రశ్న సంధిస్తున్నారు. కేసీఆర్ ట్రాప్ లో ప్రతిపక్షాల పడ్డాయనేది వీరి అనుమానం. దానికి ఉదాహరణగా చ ఆర్టీసీ సమ్మెను చూపిస్తున్నారు. రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా పథకాలు ప్రవేశపెట్టలేదు. పాత స్కీములు కూడా పూర్తిగా అమలు కావడం లేదు. ఆర్థిక మాంద్యం దెబ్బకి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగ జారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు.. యాభై ఏళ్లకే పెన్షన్, కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి లాంటి వాటికి డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రైతుబంధు కూడా పూర్తి స్థాయిలో రైతులకు అందడం లేదు. ఐదు ఎకరాలు దాటిన రైతులకు చాలా మందికి ఇప్పటి వరకు అకౌంట్ లో డబ్బులు పడలేదు. ఇలా చాలా సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఇలాంటి సమస్యల పై పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలను సక్సెస్ ఫుల్ గా ఆర్టీసీ బస్ ఎక్కించారు కేసీఆర్. దాదాపు గా యాభై రోజులుగా ప్రతిపక్షాలన్నీ ఆర్టీసీ చుట్టే తిరుగుతున్నాయి. మరి కొన్ని రోజులు కూడా ఆర్టీసీ వివాదం చుట్టే ప్రతిపక్షాల తిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఆర్టీసీ వివాదం చుట్టూ ప్రతిపక్షాలను పంపించి కేసీఆర్ వ్యూహం అమలు చేశారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. రెడీమేడ్ గా వచ్చిన సమ్మెతో ప్రజల్లోకి వెళ్లాలని ప్రతి పక్షాలు భావించి.. అసలు సమస్యలు వదిలేస్తున్నారని కొంత మంది నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రతిపక్షాలతో పాటు జనం కూడా ఒకే సమస్య పై ఫోకస్ పెట్టేలా సీఎం చూశారని అందులో సక్సెస్ అయ్యారని అంటున్నారు. రేపో మాపో సమ్మె ముగుస్తుంది.. ఆ తరువాత అందరూ ఆ సమస్య మరిచిపోతారని విశ్లేషిస్తున్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల టైంలో ప్రతిపక్షాలు రెండు నెలల పాటు ఏ సమస్య వైపు దృష్టి పెట్టకుండా కేసీఆర్ చూశారని.. ఈ విషయాన్ని పసిగట్టలేకపోవటం వల్ల ఫెయిల్యూర్ గా కొంత మంది నేతలు చెబుతున్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల టైంలో కూడా సీపీఐ తో పొత్తు అంటూ అటు కమ్యునిస్టు పార్టీలను కూడా కన్ఫ్యూస్ చేశారు కేసీఆర్. మొత్తానికి సక్సెస్ ఫుల్ గా ప్రతి పక్ష పార్టీలు అన్నింటిని ఆర్టీసీ బస్సు ఎక్కించి తిప్పుతూ అసలు సమస్యల జోలికి రాకుండా దారి మళ్లిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తాయో చూడాలి.  

అమరావతిని జగన్ చంపేస్తున్నాడు.. మోనర్క్ పాలన సరికాదు

అమరావతి రాకూడదని మూర్ఖత్వంగా కమిటీలపై క్యాంపింగ్ వేస్తున్నారని టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే అమరావతి ప్రాజెక్టుని చంపేశారని ఆరోపించారు. అమరావతి ఆగిపోతే తెలుగు జాతికి తీవ్ర నష్టం చేసినట్లేనని ఆయన అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా స్పష్టంగా చెప్పిందన్నారు. మీ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీ దగ్గర ఆధారాలుంటే తప్ప క్యాన్సిల్ చెయ్యడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అది కూడా మీ బుర్రకు ఎక్క లేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికి కూడా ఎదురు దాడి చేస్తూ అమరావతి రాకూడదని.. దాని మీద కమిటీల మీద కమిటీలు వేస్తున్నారని ఆరోపించారు. అసలు కమిటీలు దేనికంటూ.. నాకైతే అర్థం కావడం లేదన్నారు బాబు. మీరు ఎంత మూర్ఖత్వంగా ముందుకుపోతున్నారో.. సింగపూర్ గవర్నమెంట్ వెనక్కి వెళ్లినపుడే అర్థం చేసుకోవాలన్నారు. అమరావతి ప్రాజెక్టు దెబ్బతినింది, రాష్ట్ర భవిష్యత్ అంధకారమైంది. కనీసం తెలంగాణకి వెళితే ఒక హైదరాబాద్ సిటీ ఉంది.. కర్నాటకకు వెళితే బెంగళూరు సిటీ.. తమిళనాడు పోతే చెన్నై ఒక సిటీ.. ఆంధ్రప్రదేశ్ కు వస్తే ఏముందండి ఇక్కడ అని చంద్రబాబు ప్రశ్నించారు.  మనం ఎక్కడికో ఎందుకు పోతామని అడిగారు. అధికారం లేక పోయినా పీపీఏలను రద్దు చేయడంతో ప్రభుత్వానికి కోర్టు మొట్టికాయలు వేసిందని విమర్శించారు టిడిపి అధినేత చంద్రబాబు. కేంద్రం హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రభుత్వ పరువు తీశారని మండిపడ్డారు. పీపీఏలు రద్దు చేశారు.. అలా చెయ్యడానికి అధికారం లేదు.. ఎందుకు రద్దు చేశావు అంటే కరెప్షన్ అంటాడు. ఇప్పుడు కోర్టు తనను తప్పని చెప్పే స్థాయికి వచ్చాడన్నారు. అమరావతి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని చూసి తట్టుకోలేక ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.

మనసు మార్చుకున్న ప్రత్తిపాటి... త్వరలోనే కీలక నిర్ణయం వెల్లడి

గుంటూరు జిల్లా టీడీపీకి పెద్ద దిక్కు..మాజీ మంత్రి, ప్రత్తిపాటి పుల్లారావు పార్టీలో కీలక నేత. 2004-2009 ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు పనిచేసారు. అధికారంలోకి రావడంతోనే మంత్రయ్యారు. జిల్లా అధ్యక్షుడిగా.. మంత్రిగా.. టిడిపిని ముందుండి నడిపించారు. ఐదేళ్ళు మంత్రిగా పని చేసిన ప్రత్తిపాటి గత ఎన్నికల్లో తన శిష్యురాలి చేతిలోనే ఓడిపోయారు. ఓటమి తర్వాత కొంత కాలం హడావుడి చేసిన ఆయన ఇప్పుడు పూర్తిగా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తర్వాత మూడు నెలల పాటు పార్టీ కార్యక్రమాల్లో ప్రత్తిపాటి చురుగ్గా పాల్గొన్నారు. పార్టీ చేపట్టిన చలో ఆత్మకూరులో లీడ్ తీసుకున్నారు. పార్టీ బలోపేతం దిశగా ఆలోచనలు చేశారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే పల్నాడు నేత కోడెల శివ ప్రసాద్ మరణం తరువాత ప్రత్తిపాటిలో ఒక్కసారిగా మార్పొచ్చింది. పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొనడం మానేశారు. జిల్లా రాష్ట్ర పార్టీ కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నెలలో లోకేష్ పొన్నూరు పర్యటనకు కూడా రాలేదు. వల్లభనేని వంశీ, అవినాష్ వంటి నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినప్పుడు కూడా ప్రత్తిపాటి నుంచి రియాక్షన్ లేదు. రెండు నెలలుగా పార్టీ స్టేట్ ఆఫీసులో పుల్లారావు ఒక ప్రెస్ మీట్ లో పాల్గొనలేదు. గతంలో చిలకలూరిపేటలో నివాసముండే ఆయన ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వస్తున్నారు. ప్రత్తిపాటి మౌనం వెనుక పార్టీ మరో ఎజెండా ఉందా అని డిస్కషన్ నడుస్తుంది. గతంలో ఆయన బిజెపిలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ సమయంలో ఆయన వాటిని కొట్టి పారేశారు. అయితే రెండు నెలలుగా సైలెంట్ గా ఉండటం వెనుక కారణాలేంటనే అనుమానాలు కార్యకర్తల్లో వ్యక్తమవుతున్నాయి. కొంతకాలంగా వేచి చూసి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ప్రత్తిపాటి ఉన్నారని తెలుస్తుంది. మొత్తానికి ప్రత్తిపాటి రానున్న రోజుల్లో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని నియోజక వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

2021లో మిరాకిల్ ఖాయమన్న రజనీ... పిల్లీ ఎలుకంటూ అన్నాడీఎంకే సెటైర్లు

తమిళనాడు పొలిటికల్ స్క్రీన్ పై సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ ప్రజల కోసం అవసరమైతే కమల్ హాసన్‌తో కలిసి పనిచేస్తానంటూ ప్రకటించిన సూపర్ స్టార్ రజనీకాంత్‌... మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతాలు జరుగుతాయని అన్నారు. తమిళ ప్రజలు మార్పు కోసం చూస్తున్నారన్న రజనీ.... 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని ఫలితాలు రావడం ఖాయమన్నారు. ఇక, అవసరమైతే కమల్ తో పనిచేస్తానన్న రజనీ... మక్కల్ నీది మయ్యం పార్టీతో పొత్తుపై హింట్ ఇచ్చారు. అయితే, ఒకవైపు కమల్... మరోవైపు రజనీ చేస్తున్న వరుస ప్రకటనలతో తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతున్నాయి. రజనీ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే సెటైర్లు వేస్తోంది. కమల్, రజనీ కలిస్తే ఎలుకా పిల్లిలా ఉంటుందంటూ జోకులు పేల్చుతున్నారు. అయితే, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ ప్రజలు పెద్ద అద్భుతం చేయబోతున్నారన్న రజనీ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనీస్వామి వెరైటీగా స్పందించారు. అవును 2021లో తమిళ ప్రజలు నిజంగానే అద్భుతం చేయబోతున్నారు... మళ్లీ అన్నాడీఎంకేను అధికారంలోకి తేబోతున్నారు... ఇది అర్ధమయ్యే రజనీ అలా చెప్పారంటూ సెటైర్లు వేశారు.

మరోసారి గీత దాటిన రఘురామరాజు... మరి జగన్ రియాక్షన్ ఎలాగుంటుందో?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.... సీఎం జగన్ కు కొరకురాని కొయ్యగా తయారైనట్లు వైసీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పదేపదే ధిక్కరిస్తూ ఆగ్రహానికి గురవుతున్నారని అంటున్నారు. పార్టీ అనుమతి...ఎంపీ విజయసాయిరెడ్డి లేకుండా ప్రధాని మోడీని గానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని గానీ, అలాగే కేంద్ర మంత్రులను కానీ కలవొద్దని జగన్ ఆదేశించినా, రఘురామకృష్ణంరాజు మాత్రం లెక్కచేయడం లేదు. తనకు నచ్చిందే తాను చేస్తూ జగన్ ఆర్డర్స్ పై డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపై ఏపీలో రచ్చరచ్చ జరుగుతుంటే, అందుకు భిన్నంగా మాతృభాష పరిరక్షణపై లోక్ సభలో మాట్లాడినందుకు జగన్మోహన్ రెడ్డి ఆగ్రహానికి గురైన రఘురామకృష్ణంరాజు... మరోసారి జగన్ వద్దన్న పనే చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు.  పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని మోడీ ఎదురుపడటంతో రఘురామకృష్ణంరాజు వినయపూర్వకంగా నమస్తే సార్ అంటూ పలకరించారు. దాంతో, కమెండోల మధ్య నుంచే రఘురామరాజును మోడీ దగ్గరకు పిలిచారు. అలా మోడీ దగ్గరకు వెళ్లిన రఘురామకృష్ణంరాజు శిరసు వంచి నమస్కరించారు. దాంతో, రాజు గారూ అంటూ సంబోధించిన మోడీ... రఘురామరాజుతో కరచాలనం చేశారు. నవ్వుతూ ఆప్యాయంగా భుజం తట్టారు. ఆ సమయంలో అక్కడే ఉన్న వైసీపీ ఎంపీలు ఆ దృశ్యాన్ని చూసి విస్తుపోయారు. రఘురామకృష్ణంరాజును ప్రధాని మోడీ పేరు పెట్టి పిలిచిమరీ దగ్గరకు రప్పించుకుని ప్రత్యేకంగా పలకరించడంపై ఆశ్చర్యపోయారు. అయితే, పార్టీ అనుమతి లేకుండా ప్రధానిని, కేంద్ర పెద్దలను కలవొద్దని జగన్ హెచ్చరించినా, మోడీని పలకరించడంపై వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే, పెద్దలు ఎవరైనా ఎదురుపడినప్పుడు పలకరించడం సంప్రదాయమని, రఘురామకృష్ణంరాజు కూడా అదే చేశారని, కానీ ప్రధాని మోడీయే స్వయంగా దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారని, ఇందులో రఘురామరాజు తప్పేమీ లేదంటున్నారు. అయితే, ఎంపీగా గెలిచాక జరిగిన తొలి సమావేశాల్లోనే మోడీని రఘురామరాజు కలవడంపై జగన్ ఆగ్రహం వ్యక్తంచేయగా, పాత పరిచయంతోనే మర్యాదపూర్వకంగా కలిశానంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు ఇంగ్లీష్ వివాదంపైనా, అలాగే మోడీని కలవడంపైనా అధిష్టానానికి ఎలా సర్దిచెప్పుకుంటారో చూడాలి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్..! కాంగ్రెస్, ఎన్సీపీకి డిప్యూటీలు

నెలరోజులకుపైగా కొనసాగుతోన్న మహా డ్రామాకు తెరపడింది. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన చేస్తోన్న ప్రయత్నాలు దాదాపు కొలిక్కి వచ్చాయి. సంకీర్ణ సర్కారు ఏర్పాటుపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య జరిగిన చర్చలు సక్సెస్ అయ్యాయి. కనీస ఉమ్మడి ప్రణాళిక, అధికార పంపిణీపై మూడు పార్టీలూ ఒక అవగాహనకి వచ్చాయి. ముఖ్యంగా, శివసేన-ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకునేలా.... అలాగే, కాంగ్రెస్‌కు ఐదేళ్లపాటు డిప్యూటీ సీఎం ఇవ్వాలన్న ప్రతిపాదనపై అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ప్రణాళికతోపాటు లౌకిక స్ఫూర్తికి కట్టుబడాలన్న ప్రతిపాదనలపై మూడు పార్టీల మధ్య అవగాహన కుదరడంతో ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియరైంది. అయితే, మొదటి టర్మ్‌లో శివసేన నుంచి ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి పదవి చేపడతారని... అలాగే, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌... ఎన్సీపీ నుంచి అజిత్ పవార్‌లు డిప్యూటీ సీఎంలుగా ప్రభుత్వం ఏర్పాటవుతుందని అంటున్నారు. మంత్రి పదవులు పంపకంపైనా దాదాపు క్లారిటీ వచ్చేసింది. 14-14-14 చొప్పున మూడు పార్టీలూ సమానంగా మంత్రి పదవులను పంచుకోనున్నాయి. శివసేన నుంచి ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా, కీలకమైన హోం, ఆర్ధిక, రెవెన్యూ, ఇరిగేషన్, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ, ఉన్నత విద్య, గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను శివసేన కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ శాఖలనే కాంగ్రెస్, ఎన్సీపీ కూడా అడుతున్నట్లు చెబుతున్నారు.

ఆర్టీసీకి శాశ్వత పరిష్కారం... కార్మికులకు షాకిచ్చిన కేసీఆర్

షరతుల్లేకుండా విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఆర్టీసీ జేఏసీ ప్రకటించినా ప్రభుత్వం నుంచి మాత్రం సానుకూల స్పందన కరువైంది. ఆర్టీసీపై ఐదారు గంటలపాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్... ఇప్పుడున్నట్లు యథాతథంగా సంస్థను నడపలేమని తేల్చిచెప్పేశారు. ఆర్టీసీని 5వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న కేసీఆర్... తక్షణం 2వేలకోట్ల చెల్లించాల్సి ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఒక్క సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటేనే 240 కోట్లు కావాలని, అలాగే సీసీఎస్ కు 500కోట్లు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పుడున్నట్లుగా ఆర్టీసీని నడపాలంటే నెలకు 640కోట్లు కావాలన్నారు. ఇక పీఎఫ్ బకాయిలు నెలకు 70కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని, అలాగే, వందల కోట్ల మేర డీజిల్‌ అండ్ రవాణా పన్ను బకాయిలు పెండింగ్ ఉన్నాయని తెలిపారు. మరోవైపు 2వేల 600 కాలం చెల్లిన బస్సులను తప్పనిసరిగా మార్చాల్సి ఉందని... ఈ భారమంతా ఇప్పుడు ఎవరు భరించాలని కేసీఆర్ ప్రశ్నించారు. అయితే, ఆర్ధిక మాంద్యం కారణంగా ఆర్టీసీ భారాన్ని భరించే శక్తి  ప్రభుత్వానికి లేదని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఆర్టీసీ గట్టెక్కాలంటే ఛార్జీలు పెంచడం ఒక్కటే మార్గమని, అయితే, ఛార్జీలు పెంచితే జనం బస్సులెక్కరని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతోకొంత ప్రభుత్వం సహాయం చేసినా ఆర్టీసీ ఎంతవరకు నెట్టుకురాగలుగుతుందోనన్న సందేహాన్ని కేసీఆర్ వ్యక్తంచేశారు. అయితే, వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే లక్ష్యంగా ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ, ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై హైకోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది.