ఇంకా టైం పడుతుంది... నామమాత్రంగా ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు

సుదీర్ఘ విరామం తర్వాత పోలవరం ప్రాజెక్టు దగ్గర పనులు ప్రారంభమైయ్యాయి. స్పిల్ వే, స్పిల్ చానల్ లో నీరు నిలిచిపోవడంతో తోడేసిన తర్వాత పనులు మరింత ఊపందుకోనున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లో కొంత పురోగతి మొదలైందనే చెప్పలి. మొత్తం మీద 6 నెలల తర్వాత పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు దగ్గర గత కొంత కాలం నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి నెలకొంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను పూర్తిగా నిలిపివేసింది. అంతేకా కుండా రీటెండరింగ్ విధానం ద్వారా కాంట్రాక్టును మార్చాలనే ప్రతిపాదన తలెత్తడంతో పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఆ తర్వాత కాంట్రాక్టును మార్చారు. నవయుగ స్థానంలో కొత్త మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగించారు. పనులు అప్పగించిన తరువాత ఒక్కసారిగా గోదావరికి వరదలు రావడంతో మొత్తం పనులు ప్రారంభించటానికి ఎటువంటి ఆకాశం లేకుండా పోయింది.వరద అధిక స్థాయిలో రావడంతో స్పిల్ వే పై నుండి నీరు ప్రవహించింది. అందు కారణంగా పనులు అసలు ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. మరో పక్క ఎగువ కాపర్ డ్యామ్ దగ్గర కూడా వరద నీరు చాలా వేగంగా వెళ్లడంతో ఆ కాపర్ డ్యామ్ కొట్టుకు పోతుందన్న భయం నెలకొంది. కానీ దాదాపు రెండు నెలల క్రితం ఈ పరిస్థితి ఉండేది. కాని వరద నీరు తగ్గు ముఖం పట్టినప్పటికీ స్పిల్ వేలో మాత్రం నీరు అలానే ఉండి పోయాయి. స్పిల్ వే తో పాటు స్పిల్ చానల్ లో కూడా నీరు అలాగే నిలబడిపోయింది.ఈ పనులకు సంబంధించి జలవనరులశాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా సమీక్ష జరిపారు. ఆ సమీక్షలో పనులు వేగంగా జరగటానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం మీద చూస్తే పోలవరం పనులు ప్రారంభమైనా పూర్తిస్థాయిలో సాగనట్లు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదో రెండు మూడు యంత్రాలు పెట్టి మాత్రం పనులు నామమాత్రంగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ప్రారంభం కావడానికి మరికొంత సమయం పడుతుందని ఇంజనీరింగ్ అధికారులు అదే విధంగా కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులు స్పష్టంగా చెప్తున్నారు.

ఆర్టీసీ కార్మికులకు బలవంతపు రిటైర్మెంట్..! సంచలన నిర్ణయం దిశగా కేసీఆర్ కేబినెట్

ఆర్టీసీ సమస్యకు శాశ్వత ముగింపు పలికేందుకు కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తోంది. ప్రగతిభవన్‌లో సమావేశమవుతోన్న తెలంగాణ మంత్రివర్గం... ఆర్టీసీ కార్మికుల భవితవ్యాన్ని తేల్చేయబోతోంది. ఆర్టీసీ ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతోన్న ప్రభుత్వం.... కార్మికులకు కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేసి ఇంటికి పంపించనుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆర్టీసీ సమ్మె చట్టబద్ధంకాదని లేబర్ కమిషనర్ అండ్ లేబర్ కోర్టు తేల్చితే... కార్మికులకు తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ ఇప్లిమెంట్ చేయాలని భావిస్తోంది. 15ఏళ్ల సర్వీస్... 50ఏళ్లు దాటిన కార్మికులందరినీ ఇంటికి పంపేందుకు రంగంసిద్ధమైందంటున్నారు. ఒకవేళ అదే జరిగితే, 48వేల మంది కార్మికుల్లో మెజారిటీ సిబ్బంది ఉద్యోగాలను కోల్పోనున్నారు. అయితే, తప్పనిసరి రిటైర్మెంట్ స్కీమ్‌ అమలుచేస్తే, ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా, గత తీర్పులు, ఆయా ప్రభుత్వాలు అనుసరించిన విధానాలపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అమలుచేస్తే, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్, గ్రాడ్యుటీతోపాటు ఫైనల్ సెటిల్‌మెంట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 48వేల మంది కార్మికులు ఉండటంతో... ఎంతమేర నిధులు అవసరమవుతాయి... వాటిని ఎలా సమీకరించుకోవాలన్నదానిపై కేబినెట్ చర్చించనుంది. అయితే, కంపల్సరీ వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది అత్యంత సున్నితమైన కీలక నిర్ణయం కావడంతో... కేబినెట్ సమావేశాన్ని రెండ్రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆర్టీసీయే ప్రధాన అజెండాగా సమావేశమవుతోన్న మంత్రివర్గం.... చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకోబోతుందని అంటున్నారు.

ఒక్కరోజు మానేస్తే 8రోజుల జీతం కట్... 52డేస్ మానేస్తే ఇంకా జీతమేంటన్న ప్రభుత్వం

ముందు నుయ్యి... వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది తెలంగాణ ఆర్టీసీ కార్మికుల పరిస్థితి. ఒకవైపు సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకునేందుకు ససేమిరా అంటోన్న ప్రభుత్వం.... మరోవైపు జీతాలు కూడా చెల్లించేది లేదంటూ మరో షాకిచ్చింది. వేతనాలు చెల్లించకపోవడంతో... 48వేల మంది కార్మికుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే జీతాలు చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరగా, ప్రభుత్వం సరికొత్త వాదనలు వినిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు చెల్లించలేమన్న ప్రభుత్వం... పేమెంట్ ఆఫ్ పేజెస్ యాక్ట్-7 ప్రకారం ఒకరోజు విధులకు హాజరుకాకుంటే... 8రోజుల జీతం కట్ చేయవచ్చని... ఆ లెక్కన, కార్మికులు 52రోజులుగా సమ్మెలో ఉండటంతో జీతాలు చెల్లింపు సాధ్యంకాదంటూ హైకోర్టు వాదించింది. దాంతో, జీతాలు కూడా వస్తాయో రావోనన్న భయం ఆర్టీసీ కార్మికులను వెంటాడుతోంది. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల ఆందోళనలతో డిపోల దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సమ్మె విరమించినా విధుల్లోకి తీసుకోకపోవడంతో కార్మికులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. బలవంతంగా విధుల్లో చేరేందుకు కార్మికులు ప్రయత్నిస్తుండటంతో ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దాంతో, కొన్ని డిపోల దగ్గర పోలీసులు-కార్మికుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలు జరుగుతున్నాయి. ఇక, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ వైఖరిపై మండిపడుతోన్న ఆర్టీసీ జేఏసీ... సమస్య పరిష్కారం కోసం కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకుంది. సమ్మె విరమించినా, కార్మికులను విధుల్లోకి తీసుకోకపోవడంపై అఖిలపక్షాలతో చర్చించిన ఆర్టీసీ జేఏసీ... ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీ ఖజానాలో డబ్బుల్లేవు కానీ.. 19 మంది సలహాదారులు, లక్షల్లో జీతాలు!

  వైసిపి అధికారం లోకి వచ్చినప్పటి నుంచిసలహాదారుల నియామకం ఒక ప్రవాహంగా సాగుతుంది. టిడిపి హయాంలో 6 సలహాదారులు మాత్రమే ఉన్నారు. వీరిలో నలుగురికి క్యాబినెట్ ర్యాంక్ ఉండేది. ఈ సలహాదారుల్లో చివరి దాకా ఉన్నవారు ఒకరిద్దరేనని చెప్పుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు వైసీపీ కి ఏకంగా 19 మంది సలహాదారులున్నారు. అందులో 10 మందికి క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. ఒక్కొక్కరికీ జీతభత్యాల కింద రూ.3 లక్షల నుంచి రూ.3.50 లక్షలు చెల్లిస్తున్నారు. వారి సహాయక సిబ్బంది జీతభత్యాలు దీనికి అదనం. ఒక వైపు డబ్బుల్లేవంటూ ఆర్భాటాలకు పోకూడదని అంటూనే సలహాదారుల కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెడుతున్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో 25 మంది సభ్యులున్నారు. ఈ సంఖ్యకు పోటా పోటీగా సలహాదారుల నియామకాలున్నాయి. విచిత్రమేమిటంటే రాష్ట్రంతో సంబంధం లేని వారిని కూడా సలహాదారుడుగా నియమించుకున్నారు.  మొత్తం సలహాదారుల్లో ఎక్కువ మందిని రాజకీయ లేదా ఇతర పునరావాసం కోసం నియమించుకున్నారని ఆరోపణులున్నాయి. వీరు ఎలాంటి సలహాలిస్తున్నారు.. ఇస్తున్న సలహాలను ప్రభుత్వ పెద్దలు ఎలా స్వీకరిస్తున్నారన్నదే అర్థం కావటం లేదు. చాలా మందికి ఈ పదవులు అలంకార ప్రాయమేనని ప్రభుత్వ పెద్దలకు సలహాలిచ్చేంత సాహసం వీరు చెయ్యలేరనే వాదన కూడా ఉంది. మరింత విచిత్రమేంటంటే చాలా మంది సలహాదారులకు సచివాలయంలో కూర్చునేందుకు ఛాంబర్ల కూడాలేవు. సలహాదారులు ఎక్కడ కూర్చొని సలహాలు ఇస్తున్నారని దానిపై స్పష్టత లేదు. పెంపకమే లక్ష్యంగా పదవులను సృష్టించటానికి సలహాదారుల నియామకమే ఒక ఉదాహరణ. మీడియాకు సంబంధించే ముగ్గురు సలహాదారులున్నారు. పరిశ్రమల శాఖకు కూడా 3 సలహాదారులను నియమించారు. ఐటీకి 2 సలహాదారులను ఇచ్చారు. అష్టకష్టాల్లో ఉన్న ఆర్ధిక శాఖకు ఒక సలహాదారును కేటాయించారు. ఆ సలహాదారు ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. ప్రజా వ్యవహారాలకు ఒక సలహాదారును ప్రజా విధానాలకు ఒక సలహాదారును విడివిడిగా నియమించారు. గల్ఫ్ దేశాలతో ఏపీ పారిశ్రామిక సంబంధ బాంధవ్యాలు నెలకొల్పేందుకు క్యాబినెట్ ర్యాంకు ఇచ్చి మరీ ఒక సలహాదారును నియమించారు. వ్యవసాయ శాఖ సలహాదారు విజయ్ కుమార్ చంద్రబాబు హయాం నుంచి అదే పోస్టులో ఉన్నారు.

శోకసంద్రంలో తల్లి.. ఖమ్మం జిల్లాలో 16 రోజుల పసికందు అపహరణ

  నవంబర్ 26వ తేదీ ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి, నాగరాజు దంపతుల పసిబిడ్డ అపహరణకు గురైంది. ఖమ్మం ధర్మాస్పత్రిలో రమాదేవి 16 రోజుల క్రితం డెలివరీ అయింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా ఉంటున్న రమాదేవిని ఒక మహిళ గమనిస్తూ వచ్చింది. మంగళవారం ఉదయం ఇంజక్షన్ చేయించి తెస్తానంటూ పసికందును తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో రమాదేవి ఆస్పత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సైబర్ టీం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని పోలీస్ స్టేషన్ లను ఎలర్ట్ చేశారు. సైబర్ సిబ్బందితో పాటు పెట్రోలింగ్ సిబ్బంది అలాగే ఇతర పోలీస్ విభాగాలకు చెందిన వారితో 3 బృందాలను ఏర్పాటు చేసి పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళతో పాటు ముగ్గురు ఉన్నట్టు సమాచారం. ఖమ్మం నగరంతో పాటు విజయవాడ, నందిగామలో దర్యాప్తు చేస్తున్నారు. 2 ప్రత్యేక టీంలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు ఖమ్మం సీఐ గోపి. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు అమర్చినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల రోగుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. నిత్యం జన సంచారం వైద్య సిబ్బంది కదలికలు.. సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉన్నప్పటికీ శిశువు అపహరణకు గురి కావడం విమర్శలకు తావిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాలను నమ్ముకుని భద్రతా విషయాల పై దృష్టి సారించడం లేదనే వాదనలున్నాయి. సీసీ కెమెరాలు ఆవరణలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన ఆలయ ఏఈవో ధనపాల్ అరెస్ట్

  లంకెబిందెలు..నిధులు.. ఉన్నాయని నమ్మి క్షుద్రపూజలు.. చేతబడులు.. చేస్తునే ఉన్నారు కొందరు అమాయకులు. కానీ అన్ని తెలిసి.. చదువుకున్న మూర్ఖులను తక్కువగా చూస్తూ ఉంటాము. ఆ కోవలోకే చెందుతాడు మన ఆలయ ఏఈవో ధనపాల్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల పై ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ఆరా తీసింది. ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.  శ్రీకాళహస్తి అనుబంధాలయమైన భైరవకోనలో నవంబర్ 26న అమావాస్య రోజు కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వాళ్లలో ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ కూడా ఉన్నారు. ఆలయానికి చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటపెట్టారు తమిళనాడుకు చెందిన ముఠా. ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ చెబితేనే క్షుద్ర పూజలు నిర్వహించామని చెప్తున్నారు. భైరవకోన ఆలయంలో నిక్షిప్తమైన నిధుల కోసమే క్షుద్ర పూజలు నిర్వహించారా అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. ఆలయ ఏఈవో ధన్ పాల్ గతంలో కూడా క్షుద్ర పూజలు నిర్వహిస్తూ సస్పెన్షన్ కు గురయ్యారు.

టైలరింగ్ చేసి ఆస్తులు సంపాదించానని చెప్పిన నయీం భార్య

  నయీం ఆస్తుల వివరాలను సేకరించే పనిలో పడింది ఐటీ శాఖ. నయీం ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసులను కోరారు ఐటీ అధికారులు. అటు నయీం భార్య హసీనాబేగంను కూడా విచారించారు ఐటి అధికారులు. ఆమె దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చారు. టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు తెలిపారు నయీం భార్య హసీనా బేగం. ఆమె స్టేట్ మెంట్ ని రికార్డు చేసుకున్నారు. భూకబ్జాలు, సెటిల్మెంట్ లకు పాల్పడిన గ్యాంగ్ స్టర్ నయీం 2016 లో జరిగిన పోలీసు ఎన్ కౌంటర్ లో చనిపోయాడు. అప్పటి నుంచి నయీం దందాలపై ఫోకస్ పెట్టిన పోలీసులు నయీం అనుచరులను కూడా జైలులో వేశారు. తాజాగా ఐటీ శాఖ నయీం ఆస్తులపై ఫోకస్ పెట్టింది.ఎనకౌంటర్ తర్వాత ఆయన బినామీ ఆస్థుల వ్యవహారం పెద్ద ఎత్తున బయటికి వచ్చింది. ఆ ఆస్తుల పైన ఐటి శాఖ , ఇంటితో పాటుగా వాళ్ల కుటుంబ సభ్యులకు 2016-17 సంవత్సరంలోనే నోటీసులు జారీ చేసింది. వాళ్ళ ఇంటికి ఐటీ శాఖకు సంబంధించిన నోటీసులు కూడా అంటించారు. ఆ సిట్ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన ఆస్థుల వివరాలు ఇవ్వాలని గతంలో లేఖ రాసారు ఐటి అధికారులు. ఆ లేఖ ఆధారంగా కొంత ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన ఐటీ అధికారులు నయీం భార్య హసీనా బేగంని పిలిపించారు. ఆమె చెప్పిన సమాధానాలతో ఒక్క సారిగా షాక్ కి గురైయ్యారు.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వైఎస్ఆర్ కాపునేస్తం, కడప స్టీల్ ప్లాంట్‌

  ఏపీ ప్రభుత్వం పథకాల పరంపర కొనసాగిస్తోంది. ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాపునేస్తం పేరుతో జగన్ సర్కార్ కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా కాపు సామాజికవర్గం మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు. ఈ పథకానికి రూ. 1101 కోట్లు కేటాయిస్తూ కేబినెట్‌లో తీర్మానం చేశారు. కుటుంబానికి రూ. 2.5 లక్షల లోపు ఆదాయం ఉండి.. 45 ఏళ్లు దాటిన ప్రతి కాపు మహిళకు ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లలో ఒక్కొక్కరికి రూ.75వేల సాయం అందించనున్నారు.  కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. నవశకం సర్వే ద్వారా వైఎస్ఆర్ కాపునేస్తం పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. జగనన్న వసతి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ ఆపైన చదువుకునే విద్యార్థులకు రూ.20వేల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇళ్ల పట్టాలపై హక్కు కల్పిస్తూ పేదలకు రిజిస్ట్రేషన్లు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా మద్యం ధరల పెంపునకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 26న కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన జరుగుతుందన్నారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో రోగులకు అందని మందులు.. ఎంపీ ఆకస్మిక తనిఖీ

  సకాలంలో ఆస్పత్రులకు మందులు సప్లై చేసి రోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత జిల్లా వైద్యశాఖాధికారులది. అయితే మందుల సరఫరా విషయంలో అధికారులు అంతులేని జాప్యం వహించారు. కర్నూలులో వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో కోట్ల విలువ చేసే మందులు హాస్పిటల్స్ కు సరఫరా చెయ్యక మూలనపడ్డాయి. సరైన సమయంలో ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతున్నాయా.. వాటిని డాక్టర్లు రోగులకు పంపిణీ చేస్తున్నారా లేదా అని పర్యవేక్షణ లేకపోవటంతో ఖరీదైన మందులు కాలం చెల్లిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కర్నూల్ జనరల్ ఆస్పత్రి పక్కన ఉండే కర్నూల్ వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ వివరాలు ఆసుపత్రులకు మందుల సరఫరా మందులు రోగులకు ఏ మేరకు పంపిణీ అవుతున్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నలకు అధికారులు నీళ్లు నమిలారు. దాదాపు 2 కోట్ల విలువ చేసే మందులు జిల్లాలోని సర్కారు ఆస్పత్రులకు సరఫరా కాలేదని. దీనివల్ల 112 రకాల మెడిసిన్స్ ఎక్స్ పైర్ అయ్యాయని ఎంపీకి తెలిపారు. అధికారుల మాటలు విన్న ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ షాకయ్యారు.  కర్నూల్ జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రితో పాటు 87 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,18 సామాజిక ఆరోగ్య కేంద్రాలు,22 అర్బన్ హెల్త్ సెంటర్లు, నంద్యాలలో జిల్లా ఆస్పత్రి, ఆదోనిలో ఏరియా ఆసుపత్రి ఉన్నాయి. ఈ ఆసుపత్రులకు వచ్చే రోగుల సంఖ్యను బట్టి 3 నెలలకు ఒకసారి మందుల కోసం అధికారులు ఆన్ లైన్ లో ఇండెంట్ పెడతారు. ప్రభుత్వం మందులకు సరిపడా బడ్జెట్ కూడా ఏమాత్రం ఆలస్యం కాకుండా మంజూరు చేస్తుంది. ఆ నిధులతో మందుల కంపెనీల ద్వారా మెడిసిన్స్ కొని జిల్లాలకు పంపుతారు. కంపెనీల నుంచి వచ్చిన డ్రగ్స్ మంచివా కాదా అని అధికారులు పరిశీలించాక ఆస్పత్రులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇండెంట్ ప్రకారం మందులు ఆసుపత్రికి సరఫరా అయ్యాయా లేదా అని వైద్యాధికారులు దృష్టి సారించడం లేదు. సర్కార్ హాస్పిటల్స్ కు మందుల సరఫరా సక్రమంగా జరుగుతుందా లేదా అని పర్యవేక్షణ చేసే ఆఫీసర్ లు లేకపోవటం వల్ల మందులు జిల్లా కేంద్రంలోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు సర్కార్ మందులు అందడం లేదు. మరోవైపు డాక్టర్ లు కూడా హాస్పటల్స్ కు వచ్చే పేషెంట్ లకు మెడిసిన్స్ బయటకు రాసిస్తున్నారు.  కర్నూలులోని ఒక జనరల్ ఆసుపత్రిలో మినహా మిగతా ఆసుపత్రుల్లో ఏడాది క్రితం నుంచి మందులు రోగులకు అందటం లేదు. ప్రభుత్వం ఇచ్చే మందుల కోసం వారాల పాటు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది మందులు ఇవ్వడం లేదంటూ ఏవో కొన్ని మందులు ఇచ్చి మిగతా మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నారని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందుల కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్న మందులు దొరకడం లేదని పేషెంట్స్ మండిపడుతున్నారు.  

ప్రత్యర్థితో లాలూచీ.. సిద్ధాంతాలు, విధి విధానాలతో పనిలేదు.. అధికారమే ముఖ్యం

  ఈమధ్య కాలంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటు తీరును పరిశీలిస్తే సామాన్యులందరికి పలు సందేహాలు కలుగుతున్నాయి. తమ పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా పోరాడిన వారితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పార్టీలు పరుగులు పెడుతున్నాయి. అధికారం అనే సిద్ధాంతాన్ని అన్ని పార్టీలు దత్తత తీసుకున్నాయి. ఫలితంగా ఓటర్లకు ఏ భావజాలను చెప్పి ఆకర్షించారో.. అందుకు భిన్నమైన అభిప్రాయాలున్న పార్టీలతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒకరిని చూసి మరొకరు వాళ్లు చేస్తే మేము చేయడం తప్పా అని ఎదురుదాడితో తమ వాదనను సమర్థించుకుంటున్నారు.  కొన్నాళ్ల క్రితం కశ్మీర్ లో బీజేపీ,పీడీపీ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీది వేర్పాటువాద భావజాలం, బీజేపీది కరుడు గట్టిన జాతీయవాదం. ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ గా మారిపోయింది. శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడాన్ని బిజెపి ప్రశ్నిస్తే కశ్మీర్ అంశాన్ని సమాధానంగా చెబుతోంది. ఒక్క కశ్మీర్ మరో మహారాష్ట్ర మాత్రమే కాదు, ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేసి ఒకరి పై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసి ప్రజా తీర్పు అంటూ కలిసి ప్రభుత్వంను ఏర్పాటు చేసిన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అలా చూస్తే భావజాలం సిద్ధాంతాలు అన్ని ఓటర్లను మభ్య పెట్టటానికేనని అర్థమవుతుంది. చివరికి అంతిమ సూత్రం అధికారమే అవుతుంది.  ప్రతిపక్షంలో వుండడానికి ఏ ఒక్క పార్టీ కూడా సిద్ధపడటం లేదు.ఆ ఆలోచనే వారిని అసహనానికి గురిచేస్తోంది. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంప్రదాయాలు ఏది లెక్కలోకి రావడం లేదు. గతంలో అధికార పార్టీతో సమానంగా ప్రతిపక్ష పార్టీకి ప్రాధాన్యత ఉండేది. కానీ రానురాను రాజకీయం ఓ వైపు మగ్గిపోతోంది. అధికార పార్టీ అంటే తిరుగులేని రాజ్యాధికారాన్ని అనుభవించమని నయా పాలకులు నేర్చుకున్నారు. ఫలితంగా ప్రతిపక్షంలో ఉండటం నేతలకు నచ్చడం లేదు. అందుకే అధికారం అందుకనే సమీకరణాలూ ఏ పార్టీతో సరిపోతాయో లెక్కలేసుకుంటున్నారు. ఫలితంగా దేశంలో ఏ ప్రభుత్వం కూడా సుస్థిరంగా లేకపోయింది. మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు కళ్ళముందు కదలాడుతుండగానే మధ్యప్రదేశ్ లో సింధియా ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో తిరుగులేని మెజారిటీ ఉన్న వైసిపి సర్కార్ కూడా నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది.  పార్టీలు మారడం అనేది చొక్కా మార్చినంత సులువుగా తయారైంది. ఫిరాయింపు నిరోధక చట్టాలు తెచ్చినా పార్టీలే తమ కోసం కొన్ని లూప్ హోల్స్ ఉంచుకున్నాయి. దాంతో ఆ చట్టం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువగా జరుగుతోంది. ఆ చట్టాలు తెచ్చిన పార్టీలే బాధితులుగా మారుతున్నాయి. బాధితులైన పార్టీలు అధికారంలోకి వచ్చాక దాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేయడం లేదు. తాము ఆ లూప్ హోల్స్ నుంచి లబ్ధి పొందకూడదా అనే ధోరణిలో ఆపరేషన్ లు చేసుకుంటున్నాయి. దాంతో పార్టీ ఫిరాయించే వారికి ఏ ఆటంకం లేకుండా పోయింది. విపక్షంలో ఉండటమే అసహనంగా భావించే పరిస్థితి రావడానికి అసలు కారణం ఏమిటి.. అధికారం అండతో ప్రభుత్వాల్ని మార్చేసే ప్రజా తీర్పుకు అర్థం ఏముంటుంది.. ఈ పరిస్థితులు మారాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి.

టీటీడీ డాలర్ల కుంభకోణం కేసు మళ్ళీ విచారణ జరపాలని ఆదేశాలు జారీ

  తిరుమల శ్రీవారి ఆలయంలో 2006 లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. నిత్యం విక్రయించే బంగారు డాలర్లలో 300 బంగారు డాలర్లు గల్లంతయ్యాయి. డాలర్ల చోరీపై ప్రాథమికంగా టిటిడి విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించారు. ఈ కేసును విచారించిన విజిలెన్స్ అధికారులు డాలర్లు విక్రయించే షరాబు వెంకటాచలపతి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అయితే వెంకటాచలపతి నేరం అంగీకరించకపోవటంతో శ్రీ వారి ఆలయంలో విక్రయించే డాలర్ల కౌంటర్ లో 300 డాలర్లు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో షరాబు వెంకటాచలపతితో పాటు అప్పటి బొక్కసం ఇన్ చార్జ్ డాలర్ శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర రెడ్డి, పేష్కార్ వాసుదేవన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వెంకటాచలపతి ఇంట్లో 3 బంగారు డాలర్లు లభించటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ అధికారులు షరాబు వెంకటాచలపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వెంకటాచలపతి నేరాన్ని ఒప్పుకున్నాడు. తప్పుడు లెక్కలు చూపి ఆ డబ్బును తన అవసరాల నిమిత్తం వినియోగించుకున్నానని చెప్పాడు.  అయితే డాలర్ కేసు అంతటితో ఆగలేదు. డాలర్లతో పాటు వేల కోట్ల విలువ చేసే శ్రీవారి ఆభరణాల కూడా మాయమైపోయాయని దీని వెనుక ఆభరణాల ఇన్ చార్జి డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఎన్ని ప్రకటనలు చేసిన ఆందోళనలు విమర్శలు ఆగడం లేదు.దీంతో డాలర్ల కుంభకోణం కేసును టిటిడి అధికారులు సీబీసీఐడీకి అప్పగించారు. విచారించిన సీబీసీఐడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని తేల్చి చెప్పారు.  2008 లో అప్పటి ఈవో రమణాచారి ఆదేశాలతో డాలర్ కుంభకోణం కేసును సీవీఎస్వో రమణ కుమార్ మళ్లీ విచారించారు. వెంకటాచలపతితో పాటు ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర్ రెడ్డి, పేష్కార్ వాసుదేవన్, డాలర్ శేషాద్రికి కుంభకోణంలో సంబంధం ఉందని వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలంటూ నివేదిక ఇచ్చారు. నివేదిక లీకవడంతో టిటిడి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నివేదిక తప్పుల తడకని డాలర్ శేషాద్రితో పాటు ఇతర ఉద్యోగులెవరికీ ఈ కేసుతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్ల కుంభకోణంకు సంబంధించి పలు విచారణలు దర్యాప్తుల అనంతరం 2014 లో రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ప్రకటించడం జరిగింది. కేసుకు సంబంధించి టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితో పాటు మరి కొందరు అధికారులు నిర్దోషులుగా బయట పడ్డారు.  ఇక డాలర్ కుంభకోణం ముగిసిపోయిందని అంతా భావించగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం చర్చనియాంశంగా మారింది. ప్రధాన నిందితుడు వెంకటాచలపతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మందిని విచారించి 3 నెలల్లో నివేదిక సమర్పించాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సత్యనారాయణను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఉషా రాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో చెంచులక్ష్మి మృతి చెందటంతో 16 మంది ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. డాలర్ శేషాద్రితో పాటు ప్రభాకరరెడ్డి, వాసుదేవన్ కు క్లీన్ చిట్ లభించటంతో వారి పేర్లను తొలగించారు. ఎప్పుడో ముగిసిన కేసును తిరిగి తెరపైకి తేవడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ బంగారు డాలర్ల కుంభకోణం ఓ మాయని మచ్చలా మిగిలిపోవడం ఖాయం.

నారదునిగా మారిన కొడాలి నాని.. ధర్మాన సోదరుల మధ్య దూరం పెంచే వ్యాఖ్యలు!

  2019 ఎన్నికల్లో శ్రీ కాకుళం జిల్లాలో ఫ్యాన్ గాలి బలంగానే వీచింది. సిక్కోలులో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుంటే అందులో 8 చోట్ల వైసీపీ అభ్యర్ధులు గెలిచారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా వీచిన వ్యతిరేక పవనాలు సిక్కోలును తాకాయి. దీంతో టిడిపి డీలా పడింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత అధికార వైసీపీ నేతల్లో మంచి జోష్ కనిపించింది. ఇక సిక్కోలులో పార్టీకి తిరుగులేదనే తీరులో ఉన్నారు నేతలు. మెజారిటీ సీట్లు సాధించమన్న ధీమా వారిలో ఏర్పడింది. అయితే వైసీపీ అధికారం లోకి వచ్చి 6 నెలలు గడవక ముందే ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు కేడర్ ను గందరగోళానికి గురి చేస్తున్నాయని లోకల్ టాక్.  వాస్తవానికి శ్రీకాకుళం జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధర్మాన కుటుంబం పెద్ద దిక్కుగా చెప్పాలి. పార్టీ ఆవిర్భావ సమయంలో జిల్లాలో వైసీపీ జెండా చేపట్టడానికి ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పదవిని వదిలేసి ధర్మాన కృష్ణదాస్.. వైయస్ జగన్ కు బాసటగా నిలిచారు. అంతేకాదు ఆ పార్టీకి మేమున్నామంటూ కృష్ణదాస్ భార్య పద్మప్రియ పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కృష్ణదాస్ కుటుంబానికి జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సముచిత స్థానం కల్పించారు.తన క్యాబినెట్ లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా క్రిష్ణదాసును నియమించారు. దీంతో విధేయతకు జగన్ పట్టం గట్టారన్న భావన పార్టీ శ్రేణుల్లో ఏర్పడింది.  ఇక రాజకీయ అనుభవం విషయానికొస్తే ధర్మాన సోదరుల్లో ప్రసాదరావు సీనియర్.. గతంలో ధర్మాన ప్రసాదరావు , క్రిష్ణదాసు వేర్వేరు పార్టీలు ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రసాదరావు సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరారు. మొన్నటి ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో, క్రిష్ణదాస్ నరసన్నపేట అసెంబ్లీ స్థానంల్లో విజయం సాధించారు. సీనియర్ కాబట్టి ధర్మాన ప్రసాదరావుకే మంత్రి పీఠం దక్కుతుందని అందరూ అంచనా వేసుకున్నారు. కానీ జగన్ వ్యూహాత్మకంగా ఈ సోదరుల్లో పెద్దవాడైన కృష్ణదాస్ కి మంత్రి కుర్చీ వేశారు.అంతే అప్పటి నుంచి ఈ ధర్మాన సోదరుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి.  సిక్కోలులో ఏదైనా ప్రభుత్వం  పథకాన్ని లేదా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు జిల్లా కేంద్రంలో శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. అందులో జిల్లా మంత్రిగా ఉన్న కృష్ణదాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడం సహజం. అయితే కృష్ణదాస్ అటెండవుతున్న కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న ధర్మాన ప్రసాదరావు డుమ్మా కొడుతుండటం కొత్త చర్చకు దారితీస్తుంది. గ్రామ సచివాలయ ఉద్యోగుల నియామక పత్రాలు జారీ, సన్న బియ్యం పంపిణీ, అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, వైయస్ఆర్ వాహన మిత్ర వంటి పలు కార్యక్రమాలనూ జిల్లా అధికార యంత్రాంగం శ్రీకాకుళంలో అట్టహసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో ఎక్కడా ప్రసాదరావు జాడ కనిపించలేదు.  ఇటీవల జరిగిన ఓ పరిణామం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు తెరతీసింది. జిల్లా ఇన్ చార్జి మంత్రిగా నియమితులైన కొడాలి నాని నవంబర్ 14 న సిక్కోలు పర్యటనకు వచ్చారు. అయితే జిల్లా కేంద్రానికి వచ్చిన కొడాలి నాని స్థానిక ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఇంటికి అల్పాహార విందుకు వెళ్లారు. అదే సమయంలో మంత్రి క్రిష్ణదాస్ సైతం కొడాలి వెంట ప్రసాదరావు ఇంటికెళ్లారు. బ్రేక్ ఫాస్ట్ అనంతరం కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఈ అన్నదమ్ములిద్దరి మధ్య మరింత దూరం పెంచాయని స్థానికంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈ జిల్లాలో మంత్రి క్రిష్ణదాస్ ఉండేమి లాభం? స్పీకర్ తమ్మినేని తప్ప మిగతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలెవరూ తెలుగుదేశం పార్టీ పై విమర్శలు చేయడం లేదు అంటూ కొడాలి నాని చురకలంటించారు. అక్కడితో ఊరుకోకుండా అక్కడే ఉన్న కృష్ణదాస్ వైపు చూస్తూ రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ కూడా తమ్మినేని గట్టిగా మాట్లాడుతున్నారు. ఆయనను చూసైనా నేర్చుకోండి అని కామెంట్ చేశారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న మంత్రి కృష్ణదాస్ అక్కడ్నించి వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో కృష్ణదాస్ ను ధర్మాన ప్రసాదరావు చిరునవ్వుతొ ఆపి అన్న బయటకు వెళ్లాల్సిన దారి అటుకాదు ఇటూ అంటూ కాస్త వెటకారం ప్రదర్శించారు. అప్పటికే ఆవేశంతో ఉన్న క్రిష్ణదాసు ఆ దృశ్యాలను కెమెరాలో క్లిక్ మనిపిస్తున్న మీడియా వారిపై మండిపడ్డారు.  వాస్తవానికి కృష్ణదాస్ కి సున్నిత మనస్కుడని పేరుంది. అయితే ఇసుక వారోత్సవాలకు హాజరైన మంత్రి కృష్ణదాస్ తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారు. టిడిపి నేతలను ఉద్దేశించి అసభ్య పదాలు వాడేశారు. కృష్ణదాస్ నోటి వెంట అలాంటి మాటలు రావటం చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయారు. అయితే లోతుగా ఆరా తీస్తే అసలు సంగతి తెలిసింది.. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది ఈ అన్నదమ్ముల మధ్య కొడాలి నాని ఆజ్యం పోశారని స్థానిక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ చర్చించుకుంటుంది.నిజానికి మంత్రి కృష్ణదాస్ కు సిక్కోలులో సహాయనిరాకరణ జరుగుతోందనే చర్చ కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న మంత్రి పర్యటనల్లో నరసన్నపేట కార్యకర్తల మినహా ప్రసాదరావు అనుచరులెవరూ కనిపించటం లేదు. ఈ తరుణంలో ధర్మాన సోదరుల మధ్య పెరుగుతున్న అంతరం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అన్న ఆందోళన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో పెరుగుతోంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

ఆర్టీసీపై కేసీఆర్ నిర్ణయం ఏంటో తెలియక బయటకు రాని నేతలు!!

  తెలంగాణ ఆర్టీసీ సమస్య ఇంకా కొలిక్కి రాకపోవడంతో నియోజకవర్గంలో పర్యటించడానికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ వ్యవహారంపై ప్రతి రోజూ రివ్యూ చేస్తున్నారు. కానీ కార్మికుల సమ్మె ముగింపునకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సొంత పార్టీ నేతలు సైతం అంచనా వేయలేని స్థితిలో ఉన్నారు. దీంతో కార్మికులతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. సమ్మె కాలంలో తమ నియోజకవర్గాల్లో చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వాయిదాలు వేసుకుంటున్నారు. నియోజకవర్గంలోకి వెళితే కార్మికులు అడ్డుకుంటారని ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. కార్మికుల పట్ల ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకోవాలని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు.  సమ్మె మొదలైనప్పట్నుంచి ప్రభుత్వం కూడా ఆర్టీసీ విషయంపై తప్ప ఇతర అంశాల పై దృష్టి పెట్టడం లేదని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత చేజారుతుందన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగితే సమస్య జఠిలమవుతుందనే తమ అనుచరుల వద్ద ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద ఆర్టీసీ అంశంలో కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెగ టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. నియోజకవర్గంలో సాధారణ పరిస్థితులు నెలకొనాలంటే ఆర్టీసీ వ్యవహారానికి త్వరగా ఫుల్ స్టాప్ పెట్టాలనే వాదన అధికార పార్టీలో వినిపిస్తోంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  

ఠాక్రే కుటుంబ రాజకీయం... ఉద్ధవ్ ఠాక్రే ప్రస్థానం

  శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రి అవుతున్న తొలి వ్యక్తిగా ఆ పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చరిత్రకెక్కనున్నారు. నిజానికి బాల్ ఠాక్రే కాని.. ఆయన తమ్ముడు కొడుకు రాజ్ ఠాక్రే కానీ.. ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. శివసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినపుడు శివసేన నేతలైన మనోహర్ జోషి, నారాయణ్ రాణె సీఎంలు అయ్యారు. ఇప్పటి వరకూ ఉద్ధవ్ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య ఠాక్రే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నుంచి పోటీ చేసి గెలిచి ఠాక్రే కుటుంబం నుంచి చట్ట సభలో అడుగు పెట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇప్పుడు సీఎం కాబోతున్న ఉద్ధవ్ రానున్న 6 నెలల్లో అసెంబ్లీకి కానీ, శాసన మండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంది. తండ్రి కోసం వర్లీ స్థానాన్ని వదులుకునేందుకు ఆదిత్య సిద్ధంగా ఉన్నారు.  మహారాష్ట్ర అధికార పీఠం ఉద్ధవ్ ఠాక్రే కు రాత్రికి రాత్రి సంక్రమించింది కాదు. దాదాపు మూడున్నర దశాబ్దాల తెర వెనుక కృషి ఫలితమిది. తండ్రి బాల్ ఠాక్రే మాదిరిగా ఆయన దూకుడు స్వభావం వున్న వ్యక్తి కాదు. మృదుస్వభావి, మితభాషి, మౌనంగానే పనులు చక్కబెట్టే నేర్పరి. అతివాద హిందుత్వ పార్టీ అనే ముద్ర ఉన్న శివసేనను.. వ్యవస్థాగత రాజకీయ పార్టీగా కొంత మితవాదంగా మార్చిన ఘనత ఉద్ధవ్ కే దక్కింది. అసలు బాల్ ఠాక్రే కు ఈయన రాజకీయ వారసుడు కాదని అంత చాలా యేళ్ళ పాటు భావించారు. రాజ్ ఠాక్రే తదుపరి నేత అని అనుకున్నారు. కానీ ఉద్ధవ్ చాప కింద నీరులా విస్తరించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా రాజ్ ఠాక్రేకు ఉన్న దూకుడు.. జగడాల మారితనం, వివిధ వర్గాల వారితో విరోధం మొదలైన వాటిని తన ఎదుగుదలలో కూడా వాడుకున్నారు ఉద్దవ్. 1985 బృహన్ ముంబై ఎన్నికల్లో శివసేన విజయంలో కీలక పాత్ర పోషించారు. 1990,2005 మధ్య రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డంకిగా నిలిచిన రాజ్ ఠాక్రే, నారాయణ రాణేలను వ్యూహాత్మకంగా దెబ్బ తీశారు. 2002 లో బీఎంసీ ఎన్నికల్లో ఒంటిచేత్తో శివసేన విజయ ఢంకా మోగించినట్లు చెయ్యగలిగారు. దాంతో 2003 లో బాల్ ఠాక్రే ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. 2004 లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా కట్టబెట్టారు.  2014 ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ నేతృత్వంలో స్వతంత్రంగా పోటీ చేసింది. 63 స్థానాల్లో నెగ్గి బిజెపి అనివార్యంగా తన మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది. ఉద్ధవ్ ఠాక్రే ముద్దుపేరు డింగా జెజె ఇనిస్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆర్డ్ లో గ్రాడ్యుయేషన్ చదివారు. తండ్రి మాదిరిగానే కార్టూనిస్ట్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ గా పేరు. వాటిని ప్రతి ఏటా ముంబైలో ప్రదర్శిస్తారు. 1986 లో స్నేహితులతో కలిసి యాడ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన ఠాక్రే 1989 లో రాజకీయ పత్రిక సామ్నా ప్రారంభంలో కీలక భూమిక పోషించారు. రాజకీయ మెళకువలు తెలిసిన రశ్మిని వివాహం చేసుకున్నారు. ఉద్ధవ్ ఠాక్రేకు ఇద్దరు కుమారులు ఆదిత్య, తేజాస్.  

ఇస్రో మరో విజయం సాధించింది

  భారత అంతరిక్ష ప్రయోగ క్షేత్రం ఇస్రో మరో విజయం సాధించింది. నింగిలో మరో విజయ పతాకాన్ని ఎగురవేసింది. రాకెట్ ప్రయోగాలలో భారతకు ఎవరూ సాటి లేరని నిరూపించుకుంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీ-47 వాహన నౌక ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ సీ-47 వాహన నౌక కార్టోశాట్ ౩ తో పాటు యూఎస్ కు చెందిన 13 ఉపగ్రహాల్ని నింగి లోకి మోసుకెళ్లి నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. నింగి లోకి వెళుతున్న కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిసల్యూషన్ తో కూడిన చిత్రాలని తీసే సామర్థ్యం ఉంది. ఇస్రో విజయవంతంగా రాకెట్ ను ప్రయోగించిందన్నారు ఇస్రో చైర్మన్ శివన్. ఈ అద్భుతమైన రాకెట్ ప్రయోగంలో భాగస్వాములైన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. మార్చి వరకూ తమకు 13 మిషన్ లు ఉన్నాయి. ఇస్రోకి తగినంత పని వుందని చెప్పుకొచ్చారు.  ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్ 3 ఉపగ్రహాన్ని కక్ష్య లోకి ప్రవేశ పెడుతోంది. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసి లోకి పంపించారు. ఇందులో 12 ఫ్లో పోపి అనే బుల్లి ఉపగ్రహాలు, మేష్ బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాం ఉంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహించిన 74 వ ప్రయోగం. షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రయోగాలు 48 జరిగాయి. ఇందులో 2 మినహా మిగిలినవన్నీ విజయవంతమయ్యాయి. ఇప్పటి వరకూ 20 వరకు ఎక్సెల్ వాహక నౌకల్లో పంపారు. ఈ ఏడాదిలో ఇది 5 వ రాకెట్ ప్రయోగం. చంద్రయాన్ 2 తరువాత మొదటి ప్రయోగం. కార్టోశాట్ సిరీస్ లో 9 వ ఉపగ్రహం. ఇప్పటి వరకు ఇస్రో కార్టోశాట్ కు చెందిన 8 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది. గతంలో పంపిన కార్టోశాట్ 2,2A,2B ఉపగ్రహాల్లోని కేమరాలకు 0.8 మీటర్స్ కచ్చితత్వం ఉంది. కార్టోశాట్ 3 లో 0.25 మీటర్ల కంటే మెరుగైన రిజల్యూషన్ తో చిత్రాలను తీసే సామర్థ్యం ఉంది.

అలిగిన సీనియర్లు... సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి ఇవ్వడమే కారణం!

  మహబూబాబాద్ జిల్లాలో వర్గపోరు రోజు రోజుకి రాజుకుంటుంది. మంత్రి సత్యవతి రాథోడ్ వర్సెస్ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్యా నాయక్ మధ్య పోరు రసవత్తరంగా నడుస్తోంది. జిల్లా కేంద్రం లోనే మంత్రి సత్యవతి రాథోడ్ ఉంటారు. కానీ మిగితా ఇద్దరు ఎమ్మెల్యేలు ఆమెను కలువరు. తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు పిలవరు.  తమ సీనియారిటీని పట్టించుకోకుండా జూనియర్ కు మంత్రి పదవి ఇచ్చారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ లు మంత్రి వర్గ విస్తరణ జరిగిన నాటి నుంచి మంత్రికి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలను కలుపుకొని పోవాలని మంత్రి ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యేలు నిరాకరిస్తున్నారని జిల్లాలో చర్చ నడుస్తోంది. మంత్రి ఎమ్మెల్యేల మధ్య ఫైట్ జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  సీఎం కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకుని సత్యవతి రాథోడ్ కు ఛాన్స్ ఇచ్చారు. అయితే జిల్లాలో తనకు సహకరించకపోవడంతో ఆమె అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే సత్యవతి సొంత జిల్లా మహబూబాబాద్ మంత్రిగా ఆమె తమ నియోజకవర్గంలో తిరిగితే భవిష్యత్ రాజకీయాల్లో తమకు ఇబ్బంది తప్పదని ఆలోచనతోనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో అనే అంశంపై కార్యకర్తల్లో చర్చసాగుతోంది.

సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

  సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంపూర్ణేష్‌తో పాటు ఆయన భార్య, కూతురుకు గాయాలైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకి స‌మాచారం ఇవ్వ‌డంతో వెంట‌నే వారు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని సంపూర్ణేష్ ఫ్యామిలీని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం గత యాభై రోజులుగా తాత్కాలిక డ్రైవర్లలో బస్సులు నడిపిస్తోంది. అయితే ఈ తాత్కాలిక డ్రైవర్ల మూలంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు కూడా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మరణించింది. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే.. సంపూర్ణేష్ కి పెను ప్రమాదం తప్పింది. ఏదిఏమైనా తాత్కాలిక డ్రైవర్ల మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండంతో.. ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

అన్నీ అప్పులే.. ఆదాయం పెంచే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న వైసీపీ సర్కార్!

  కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సాధించుకోలేని దుస్థితిలో రాష్ట్ర ఆర్థిక శాఖ కూరుకుపోయింది. కేంద్ర ప్రాయోజిత పథకాలను అమలు చేసి వాటికి యూసీలు చెల్లిస్తే తిరిగి నిధులు తెచ్చుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆర్థిక శాఖనే తన అంచనాల్లో గణాంకాల రూపంలో అంగీకరించడం గమనార్హం. భూములు అమ్మడం, అప్పులు చేయటం ఈ నిధులను పథకాలకు మళ్లించటం తప్ప ఆదాయం పెంచుకునే మార్గం ఒక్కటి కూడా ఈ శాఖకు కనిపిస్తున్నట్లుగా లేదు. బడ్జెట్ లో కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి 32,040 కోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ మార్చి చివరికి ఈ పద్దు కింద రూ.14,235 కోట్లు వస్తాయని ఆ శాఖ భావిస్తోంది. అంటే దాదాపు రూ.17,805 కోట్లు తగ్గుతున్నాయి.  రాష్ట్ర ఆదాయ వనరుల తీరుతెన్నులపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం విజయవాడలో ఆర్థిక శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రూ.2.31 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ రూ.2.26 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కానీ వచ్చే మార్చి నాటికి కేవలం రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది పరిస్థితి. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఆదాయం మధ్య తేడా రూ.86,000 ల కోట్లకు పైగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం లోటును పూడ్చడం అసాధ్యం. కేంద్రం నుంచి ఏకంగా గ్రాంట్ల రూపంలో రూ.61,071 కోట్లు వస్తాయని బడ్జెట్ లో ప్రతిపాదించారు. మార్చి నాటికి ఆ పద్దు కింద రూ.17,665 కోట్లే వస్తాయని ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేశారు. అంటే గ్రాంట్ల రూపంలో వచ్చే ఆదాయమే రూ.43,406 కోట్లు తగ్గిపోతుంది. రాష్ట్ర స్వంత పన్ను ఆదాయం రూ.18,230 కోట్లు, పన్నేతర ఆదాయం రూ.3,539 కోట్లు, పబ్లిక్ రుణాలు రూ.3,000 ల కోట్లు, కేంద్ర పథకాల నిధులు రూ.17,805 కోట్లు, పన్నుల్లో వాటా రూ.9,000 కోట్లు తగ్గే అవకాశాలున్నాయి. ఈ లోటు నిధుల మొత్తం రూ.94,000 కోట్లకు పైగా ఉంది.  కేంద్ర పన్నుల్లో వాటా కింద రాష్ట్రానికి రూ.34,883 కోట్లు వస్తాయని బడ్జెట్ లో పేర్కొన్నారు. కానీ మొదటి త్రైమాసికంలో ఈ పద్దు కింద రూ.6,398 కోట్లు, రెండో త్రైమాసికంలో రూ.6,623 కోట్లు వచ్చాయి, మూడో త్రైమాసికంలోని మొదటి రెండు నెలల్లో రూ.4,440 కోట్లు వచ్చాయి. డిసెంబర్ లో రూ.2,200 ల కోట్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాలుగవ త్రైమాసికంలో మాత్ర పన్నుల్లో వాటా అమాంతం రూ.15,188 కోట్లకు పెరుగుతుందని ఆర్థిక శాఖ భావిస్తున్నది. వాస్తవానికి నాలుగో త్రైమాసికం లోనూ పన్నుల్లో వాటా రూ.6,600 ల కోట్లు మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి. రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం రూ.82,792 కోట్లు వస్తుందని బడ్జెట్ లో పెట్టారు. ఈ ఆదాయం రూ.18,230 కోట్ల మేర తగ్గి, రూ.64,562 కోట్లకు పరిమితమవుతుందని ఆర్ధిక శాఖ భావిస్తోంది. పన్నేతర ఆదాయం రూ.7,354 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అది కూడా రూ.3,539 కోట్లకు తగ్గుతుందని అంటున్నారు. పబ్లిక్ రుణాల రూపంలో రూ.32,417 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. కానీ కేంద్రం మొదటి మూడు త్రైమాసికాలకు రూ.29,000 ల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ గడువు డిసెంబరుతో ముగుస్తుంది. నాలుగో త్రైమాసికానికి కేంద్రం అనుమతి లభిస్తేనే ఇంకో రూ.3,417 కోట్లు అప్పు రూపంలో తెచ్చుకోగలం. జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో పబ్లిక్ రుణాలు తీసుకునే అవకాశం ఉండదు.

నగరి క్యాడర్ కష్టాలు... టిడిపికి తలనొప్పిగా మారిన ముద్దుకృష్ణ కుటుంబ పోరు

  గాలి ముద్దు కృష్ణమనాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ గుర్తింపు ఉన్న నేత. ఎమ్మెల్యేగా, మంత్రిగానే.. కాకుండా రాజకీయాల్లో అనేక పదవులు చేపట్టారు. 2014 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి ఓడిపోయిన తర్వాత చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నుంచి టిడిపి ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణ గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తూ 2018 లో మృతి చెందారు. అప్పటి నుంచి గాలి వారసత్వం పై చిత్తూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గాలి ఇద్దరు కొడుకుల మధ్య వార్ కు తెరతీసింది. గాలి పెద్దకొడుకు భానుప్రకాశ్, చిన్న కొడుకు జగదీష్ ల మధ్య వారసత్వపోరు టీడీపీ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారింది. దీంతో టీడీపీ హైకమాండ్ గాలి ముద్దు కృష్ణమనాయుడు భార్య సరస్వతమ్మను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. గాలి మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని సరస్వతమ్మతో భర్తీ చేసింది. తాత్కాలికంగా వారసత్వపు పోరుకు బ్రేకులు వేసింది.  కానీ 2019 ఎన్నికల్లో నగరి టిడిపి టికెట్ ను దక్కించుకునేందుకు సోదరులు ఫైట్ కు దిగారు. గాలిభానుప్రకాష్ ఓ వర్గం గా గాలి జగదీష్ ఎమెల్సీ సరస్వతమ్మ మరో వర్గంగా నగరి టీడీపీ క్యాడర్ ను పంచుకున్నారు. ఎన్నికల ముందు గాలిభానుప్రకాష్ ను టిడిపి అభ్యర్థిగా ప్రకటించింది. హైకమాండ్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసి ఎమ్మెల్సీ సరస్వతమ్మ , ఆమె రెండో కొడుకు జగదీష్ లు ఎన్నికలకు దూరంగా ఉన్నారు. భాను ఓటమికి కారణమయ్యారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఆ తర్వాత పార్టీకే తాము దూరమన్న సంకేతాలిస్తున్నారు.  చిత్తూరు జిల్లాలో ఇటీవల చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించారు. నగరి మీటింగ్ కు సరస్వతమ్మ.. జగదీష్ లు దూరంగా ఉన్నారు. ఇక తల్లి , తమ్ముడు పై మరింత పగ పెంచుకున్న గాలిభానుప్రకాష్ వారిని నియోజకవర్గానికి మరింత దూరం చేసే ఎత్తుగడలు వేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికీ గాలి కుటుంబంలో వేరు వేరు కుంపట్లు పెట్టడంతో బలమైన పార్టీ క్యాడర్ కాస్తా నగరిలో గాలి కుటుంబం దెబ్బకి ముక్కలుగా విడిపోవడంతో కొంప మనిగిందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. మొత్తానికి కాలమే ముద్దుకృష్ణమ వారసత్వాన్ని నిర్ణయిస్తుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.