డిప్యూటీ సీఎం పదవికి అజిత్ పవార్ రాజీనామా.. అదే దారిలో ఫడ్నవీస్!!

  మహారాష్ట్ర రాజకీయాలు ప్రతి సీనూ క్లైమాక్స్ లా ఉన్నాయి. గంటకో ట్విస్ట్ తో పూటకో మలుపు తిరుగుతున్నాయి. అనూహ్యంగా బీజేపీకి మద్దతిచ్చిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ట్విస్ట్ ఇచ్చారు. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజుల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  అనేక ట్విస్ట్ ల నడుమ ఈనెల 23వ తేదీ శనివారం రోజు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై ఎన్సీపీ - కాంగ్రెస్ - శివసేన కలసి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బీజేపీకి మెజారిటీ లేదని పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఫడ్నవీస్ ప్రభుత్వం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ కార్యక్రమం మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని, ఎలాంటి రహస్య ఓటింగ్ నిర్వహించొద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ తీర్పు వచ్చిన కొన్ని గంటల్లోనే అజిత్ పవార్ రాజీనామా చేయడం విశేషం. ప్రభుత్వానికి సరైన సంఖ్యాబలం కూడగట్టడంలో విఫలం అయినందువల్లే అజిత్  రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ మాత్రం దానికి ఇంత హడావుడిగా ప్రమాణస్వీకారం చేయడం ఎందుకని సెటైర్లు వినిపిస్తున్నాయి. బలం లేకుండానే ప్రమాణ స్వీకారం చేసారు.. తీరా రహస్య ఓటింగ్ వద్దని, అలాగే శాసనసభ సమావేశం మొత్తం లైవ్ టెలికాస్ట్ ఇవ్వాలని ఆదేశించడంతో వెనకడుగు వేశారని విశ్లేషకులు అంటున్నారు.

జగన్ ఝలక్... ఏపీలో డిసెంబర్ 31వ తేదీ బార్లకు లాస్ట్ డేట్

మందు బాబులకు జగన్ సర్కార్ మరో ఝలక్ ఇచ్చింది. మద్యం ధరలను భారీగా పెంచేసింది. మరోవైపు బార్ల సంఖ్యకు భారీగా కోత విధించింది. డిసెంబర్ నెలాఖరు నాటికి 40 శాతం బార్ లు మూతపడే అవకాశముంది. దీనిపై లైసెన్స్ ఫీజులు కట్టే వ్యాపారాన్ని ప్రారంభించిన సిండికేట్ లు గగ్గోలు పెడుతున్నాయి. ఏపీలో నెల రోజుల వ్యవధి లోనే మద్యం ధరలను రెండవసారి భారీగా పెంచేసింది జగన్ సర్కార్. కొత్త ధరలు, బార్లు, స్టార్ హోటళ్లలో జరిగే మద్యం అమ్మకాలను పరిమితం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటున్నాయి. దీంతో మందు బాబులు బార్లకు వెళ్లిపోతున్నారు. ఫలితంగా అక్కడ రద్దీ పెరిగిపోయింది. ఇక దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం బార్ లకు తాకిడి తగ్గించే పనిలో పడింది. బార్ లలో విక్రయించే మద్యం ధరలను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాల దగ్గర సమయ పాలన విధించింది. అక్కడ కూర్చుని మందు కొట్టే అవకాశం లేకుండా పోయింది. బార్ లకు అలవాటు పడిన మందు బాబులకు సర్కార్ నిర్ణయం కరెంటు షాక్ లా తగిలింది. పెరిగిన ధరలను కేవలం బార్లకే పరిమితం చేసింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం ధర మాత్రం గతంలో మాదిరిగానే ఉంది. బార్ లలో మద్యం ధరలు ఒక్క సారిగా పెరగడంతో మందు బాబులు ప్రభుత్వ మద్యం దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఇక ప్రైవేటు మద్యం షాపులను రద్దు చేసిన నెలల వ్యవధి లోనే ఏపీ ప్రభుత్వం బార్ ల లైసెన్సుల సమీక్షకు సిద్ధమైంది. ఈ ఏడాది జూలైలో సుమారు 37 లక్షల రూపాయలు చెల్లించి లైసెన్సులు పొందిన బార్ నిర్వాహకులకు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. బార్ల సంఖ్యను కుదించాలని నిర్ణయించిన నేపథ్యంలో వారికి నోటీసులు జారీ చేస్తోంది. డిసెంబర్ 31వ తేదీ నాటికి ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులు రద్దయిపోతాయి. అయితే ఆ తర్వాత కొత్తగా ఎలాంటి విధానం అనుసరిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మరోవైపు స్కూళ్లు, ఆలయాలు, జాతీయ రహదారులకు సమీపంలో వైన్ షాపులు ఉండరాదని నిబంధన ఉంది. ఇది బార్ లకు పూర్తిస్థాయిలో వర్తింపజేస్తే అధిక సంఖ్యలో మూతపడే అవకాశం ఉంది. గ్రేటర్ విశాఖ నగర పరిధిలో సుమారు 40 బార్ లకు తాళాలు వేసుకోవలసి వస్తోందని నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. మరో 6 నెలలు లైసెన్స్ గడువు ఉండగానే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు బార్ల యజమానులు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ధరల కంటే బార్ ల నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. దీంతో మందు బాబుల జేబులకు చిల్లు పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పెంచిన ధరల కంటే క్వార్టర్ పై రూ.20, ఫుల్ బాటిల్ పై రూ.80, బీరుపై రూ.20 నుంచి రూ.40 రూపాయల వరకు అధికంగా వసూలు చేస్తున్నారు. నిజానికి బార్ లకు ఆ మేరకు పెంచుకునే వెసులుబాటు ఉంది. ఎక్సైజ్ అధికారులు కూడా వారిపై చర్యలు తీసుకోవటానికి వీలు లేకుండా పోతోంది.మొత్తం మీద బార్ లలో ధరలను పెంచేసి మందు బాబులకు లైసెన్సుల కోత పెట్టి సిండికేట్ లకు జగన్ ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. అదే సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర మాత్రం మందు బాబుల కోలాహలం పెరుగుతూనే ఉందంటున్నారు యజమానులు.

బీజేపీ ప్రస్తానానికి బీజం... వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఏపీలో అడ్డా..

అయిననూ పోయిరావలె హస్తినకు అన్నట్టు తయారైంది ఏపీ రాజకీయం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బలంగా నిలవడానికి బీజేపీ బాటలు వేసుకుంటుంది. అందుకుగానూ అందుబాటులో ఉన్న మార్గాలని అన్వేషిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి మోహన్ రావు, టిజి వెంకటేష్ బిజెపిలో చేరిపోయారు. దీంతో రాజ్యసభలో కమలనాథుల బలం పెరిగింది. 2024 ఎన్నికల నాటికి ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీని ఒక బలమైన శక్తిగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు పార్టీ పెద్దలు. ఇందు కోసం ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలి అన్న అంశంపై బిజెపి కేంద్ర పెద్దలు అనేక మంది నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీలో 2019 ఎన్నికల ముందు వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనధికార అవగాహనతో పని చేసిన బిజెపి.. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత దూరం జరిగింది. ఇసుక కొరత, రాజధాని నిర్మాణాల నిలిపివేత, పోలవరం రివర్స్ టెండరింగ్, గ్రామ వాలంటీర్ల నియామకాల వంటి పలు నిర్ణయాలను బిజెపి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం ఇరుపక్షాలు ఒకరి పై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటించి ఏపీలో సొంతంగానే ఎదగాలని బిజెపి అనుకుంటుంది. రాజకీయంగా బలాబలాలను లెక్కలు వేసుకుంటూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే వారి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ అంశాలపై మాట్లాడేందుకే బిజెపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, సుజనా చౌదరి ఇంటికి లంచ్ కు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి సుజనాని కలుసుకునేందుకు జెసి దివాకర్ రెడ్డి కూడా అక్కడికొచ్చారు. ఈ తరుణంలో సుజనా చౌదరి , దివాకర్ రెడ్డిని నడ్డాకు పరిచయం చేశారు. జేసీ రాజకీయ అనుభవాన్ని కూడా వివరించారు. ఏపీలో నెలకొన్న తాజా పరిణామాలపైనా వీరి మధ్య చర్చ జరిగింది. జెసి దివాకర్ రెడ్డి, జెపి నడ్డా మధ్య సంభాషణలు చాలా విషయాలు దొర్లాయి. ఏపీలో భారీ మెజారిటీతో జగన్ అధికారంలోకి రావడంతో ఆయనపై ప్రజల్లో అంచనాలు పెరిగాయని జేసీ వివరించారు. ప్రజల ఆశలకు తగ్గట్టుగా జగన్ పాలను సాగకపోతే అసంతృప్తి రాజుకుంటోందని ఇప్పుడు రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని నడ్డాకి ఆయన స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలకు న్యాయపరమైన చిక్కులు వంటి పలు కీలక అంశాలను దివాకరెడ్డి ప్రస్తావించారు. అనంతపురంలో తన బస్ ట్రావెల్స్ పై జరుగుతున్న దాడులు రాష్ట్రంలో టిడిపి, బిజెపి కార్యకర్తలపై సాగుతున్న కక్షసాధింపులను కూడా ఏకరువు పెట్టారు. ఈ భేటీ ముగిసిన తర్వాత సుజనా చౌదరితో చెప్పినట్టు సుమారు గంట సేపు సమావేశమయ్యారు. వీరిరువురి మధ్య కూడా ఏపీలో కమలనాథులు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఎపిలో బిజెపిని బలోపేతం చేసేందుకు రోడ్ మ్యాప్ తయారు చేసుకోవాలని కూడా వారు నిర్ణయానికొచ్చారు. ఈ సమయంలోనే టిడిపితో పాటు ఇతర పక్షాల నుంచి బీజేపీలోకి వచ్చే నేతలు వివరాలను సుజనా చౌదరి నడ్డాకి తెలియజేశారు. ఎపిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలపై హస్తిన పెద్దలకి సమాచారం ఉన్నప్పటికీ లోతైన అవగాహన కోసం పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సుజనా చౌదరిని జెపి నడ్డా కోరారు. జెసి దివాకర్ రెడ్డి చెప్పిన కొన్ని అంశాల పై నడ్డా తన అభిప్రాయాల్ని చెప్పారు. రాజకీయాల్లో మరీ ఇంత కక్షపూరిత ధోరణి అవసరం లేదని బహిరంగంగానే అన్నారు. డిసెంబర్ 8వ తేదీన విజయవాడకు నడ్డా వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సమయంలో మరి కొందరు నేతలను పార్టీలో చేర్చుకునే అంశంపై మాట్లాడేందుకే ప్రధానంగా జెపి నడ్డా.. సుజనా చౌదరి ఇంటికొచ్చారు.పనిలో పనిగా ఏపిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాల పై కూడా చర్చ సాగటం గమనార్హం. జాతీయ మీడియాలో సైతం ఏపీ ప్రభుత్వం పై వస్తున్న వ్యతిరేక కథనాలని ఈ సందర్భంగా నడ్డా ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో ఎపిలో ఏం జరుగుతోందన్న అంశంపై బిజెపి హైకమాండ్ కు అవగాహన ఉందని నిర్ధారణ అవుతోంది. రానున్న రోజుల్లో ఎపి రాజకీయాల్లో బిజెపి పోషించబోయే పాత్ర గురించే ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొన్నది.

గవర్నర్ పదవిపై ఇంద్రసేన ఆశలు..! మోడీ-షా గుర్తిస్తారని నమ్మకం

  ఇంద్రాసేనారెడ్డి... ఒకప్పుడు తెలంగాణ బీజేపీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు... తెలంగాణ బీజేపీ మోస్ట్ సీనియర్ లీడర్లలో ఇంద్రసేన ఒకరు... తెలంగాణ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో బీజేపీ నుంచి మూడుసార్లు గెలిచిన అతికొద్ది మందిలో ఇంద్రసేనారెడ్డి ఒకరు. మొదట విద్యార్ధి విభాగంలో పనిచేసిన ఇంద్రసేన... 1980 నుంచి బీజేపీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. జాతీయ స్థాయిలోనూ, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇంద్రసేన హయాంలోనే తెలంగాణలో పార్టీ పుంజుకుంది. అంతేకాదు, ప్రస్తుతమున్న బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిర్మించినదే. రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు కృషిచేసిన ఇంద్రసేన ప్రస్తుతం పార్టీ ఆఫీస్ కే పరిమితమయ్యారు. తెలంగాణ బీజేపీలో సీనియర్ గా ఉన్నప్పటికీ తనకు దక్కాల్సిన గుర్తింపు దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన చాలామందికి పార్టీ సముచిత స్థానం కల్పించడంతో... తనకు కూడా ఏదోఒక మంచి పదవి ఇవ్వకపోతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, విద్యాసాగర్ రావు ఇప్పటికే గవర్నర్ గా పనిచేసి రాగా, ప్రస్తుతం దత్తాత్రేయ హిమాచల్ గవర్నర్‌గా, కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా బాధ్యతల్లో ఉన్నారు. ఇక, ఇంద్రసేనారెడ్డి ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడి హోదాలో పని చేస్తున్నారు. అయితే, ఇంద్రసేనారెడ్డి గవర్నర్ పదవి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రం... ఇటు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేనప్పుడు పార్టీ బలోపేతానికి కృషిచేసిన తనను మోడీ-షాలు గుర్తిస్తారన్న నమ్మకంతో ఇంద్రసేన ఉన్నారు.  అయితే, ముక్కుసూటితనం, నిక్కచ్చిగా ఉండటమే ఇంద్రసేనారెడ్డి ఎదుగుదలకు ఆటంకంగా మారాయని ఆయన సన్నిహితులు, అనుచరులు అంటున్నారు. ఏదేమైనా, పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన ఇంద్రసేనారెడ్డికి, సరైన గౌరవం ఇవ్వట్లేదని, ఆయనను ఆఫీస్ కే పరిమితం చేయడం భావ్యం కాదని బాధను వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా, మరి పదవిని కట్టబెట్టి గౌరవించాలని కోరుతున్నారు. మరి, ఇంద్రసేనారెడ్డి ఆశిస్తున్నట్లుగా బీజేపీ అధిష్టానం మంచి పదవిని కట్టబెడుతుందో లేదో చూడాలి.

తాండూరు తంట... సబితాకు పదవి ఇవ్వడంతో పట్నం మహేందర్ అసంతృప్తి

అందిన పండు తీయన.. అందని పండు పుల్లన అన్న సామెతకు అద్దం పడుతోంది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ రాజకీయం. స్థానికంగా ఇద్దరు ముఖ్య నేతల మధ్య వర్గపోరు రోజురోజుకు తీవ్రం అవుతుంది. గతంలో ఆ జిల్లాలో మంత్రిగా ఉండి ఏకచ్ఛత్రాధిపత్యం చెలాయించిన పట్నం మహేందర్ రెడ్డి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఆయన చెప్పిందే వేదం అనే విధంగా ఉండేది. తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయనకు మంత్రి పదవి రావడం.. ఆ జిల్లాలో ఇతర నేతలు పోటీ లేకపోవడంతో ఆయన హవాకు ఎదురులేకుండా పోయింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ లో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రా రెడ్డి గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకొని ఏకంగా మంత్రి పదవి చేపట్టటంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయ సమీకరణమే మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో  తాండూరులో పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోయారు. కానీ రాష్ట్రంలో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు సీఎం కేసీఆర్. అయితే  మరోసారి తనకు మంత్రి పదవి వస్తుందన్న మహేందరెడ్డి ఆశ నెరవేరలేదు. అదే జిల్లాకు చెందిన తన దగ్గరి బంధువైన మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డికి మంత్రిగా అవకాశం ఇచ్చారు సీఎం  కేసీఆర్. దీంతో మంత్రి కావాలన్న పట్నం మహేందర్ రెడ్డి ఆశలకు గండి పడింది. సందట్లో సడేమియా అన్నట్టుగా అప్పట్నుండి ఈ రెండు శిబిరాల మధ్య వర్గపోరు కూడా షురూ అయ్యింది. ఇన్నాళ్లు జిల్లాలో తనకు తిరుగులేదని భావించిన మహేందర్ రెడ్డి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ అందలం వేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాండూరులో తనపై గెలిచిన పైలెట్ రోహిత్ రెడ్డికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారంటూ మహేందర్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఇటీవల రెండు సార్లు వికారాబాద్ జిల్లా పర్యటనకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లారు. ఆ కార్యక్రమాలకు అదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన భార్య జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు కూడా ఈ అధికారిక కార్యక్రమాలకు హాజరు కాలేదు. పట్నం మహేందర్ రెడ్డి సూచనల మేరకే సబితా ఇంద్రా రెడ్డి కార్యక్రమాలకు ఆయన వర్గీయులు వెళ్లలేదన్న వాదన జిల్లాలో గట్టిగానే వినిపిస్తుంది. సబితా ఇంద్రా రెడ్డి మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు మర్యాద పూర్వకంగా కూడా ఆమెను మహేంద్రరెడ్డిని కలవలేదు. దీన్ని బట్టి ఇరువురు నేతల మధ్య రాజకీయ అగాధం బాగా పెరిగిందనే చర్చ పార్టీలో సాగుతోంది. జిల్లాలో రానురాను ఈ వర్గపోరు మరింత ముదురుతోందని ఆందోళనను టీఆర్ఎస్ క్యాడర్ వ్యక్తం చేస్తుంది. ఒక వైపు మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఇద్దరు కీలక నేతల మధ్య వివాదం కొనసాగితే పార్టీకి నష్టం కలుగుతుందని కింది స్థాయి నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు నేతల మధ్య సఖ్యత కుదిర్చే ప్రయత్నం చేయడానికి టీఆర్ఎస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. వారు కలుస్తారా లేక కయ్యానికి సై అంటారా అనే సంగతి వేచి చూడాలి.

ముహూర్తం ఖరారు.. ఆర్టీసీపై తుది నిర్ణయం ప్రకటించనున్న ప్రభుత్వం

  రవాణా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. ఆర్టీసీ సమస్యల పై చర్చలు జరుపుతున్నారు. క్యాబినెట్ కు ముందే సమీక్ష నిర్వహించడంతో ఆర్టీసీ సమస్యకు కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. నవంబర్ 28 న ఆర్టీసీ ఏజెండాతో చేపట్టిన సమావేశం జరగబోతుంది. ఆ రోజు పూర్తి అవ్వకపోతే 29వ తేదిన కూడా సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి.. ఆర్టీసీ అధికారులు అదే విధంగా రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కూడా సమావేశమయ్యారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశం ముందు ఉంచే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నివేదికపై లోతుగా చర్చించారు.  సమ్మె విరమిస్తున్నామని ప్రకటించిన ఆర్టీసీ కార్మికులు ఉదయం నుంచే డిపోల వద్దకు చేరుకున్నారు. 52 రోజుల పాటు సమ్మె కొనసాగించిన కార్మికులు జేఏసీ సూచనలతో డిపో వద్దకు వచ్చారు. అయితే కార్మికులెవరూ డిపోలకు రావద్దని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని ఆర్టీసీ ఎండీ నిన్నే స్పష్టం చేశారు. భారీగా డిపోలకు చేరుకుంటున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్మికులను అరెస్టు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు భారీగా బలగాల ను మోహరించారు. బ్యారికేడ్ లను ఏర్పాటు చేసి కార్మికులను అడ్డుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం మేరకు ఆర్టీసీ కార్మికులే ఒక అడుగు వెనక్కు తగ్గారు. ఇంకా రెండు రోజుల గడువులో విషయం పూర్తిగా తెలుస్తుందని భావించి డిపోల వద్ద ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించారు. డిపోల వద్ద పరిస్థితి కూడా కుదుట పడింది. నవంబర్ 28, 29 తేదీలల్లో అసలు కార్మికులను మళ్ళీ విధుల్లోకి చేర్చుకుంటారా లేదా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనే విషయంపై చర్చలు జరుగుతున్నా.. కార్మికుల్లో మాత్రం ఆందోళన.. ఉత్కంఠత రెండు కనిపిస్తున్నాయి.

రాజధాని పనులు ఆపొద్దు.. ఆర్భాటాలకు పోవద్దు: ఏపీ సీఎం జగన్

  సీఆర్డీఏ పై సీఎం జగన్మోహనరెడ్డి నిర్వహించిన సమీక్షలో రాజధాని పై క్లారిటీ ఇస్తూ కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఆర్ డీఏ పరిధిలో నిర్మాణాలు ఎంత వరకు వచ్చాయని.. ఇంకా ప్రారంభించాల్సిన నిర్మాణాల పరిస్థితేంటనే అంశంపై అధికారుల నుంచి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు. రాజధాని పరిధిలోని నిర్మాణాలతో పాటు రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్లు.. వాటిని అభివృద్ధి చేసే అంశాలపైన సీఎం జగన్ సుదీర్ఘంగా చర్చించారు. క్యాపిటల్ పరిధిలో నిర్మాణాలను కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జగన్. మరో వైపు గత ప్రభుత్వం చేసిన విధంగా అనవసరపు ఆర్భాటాలకు పోవద్దని సూచించారు. ప్రస్తుతం ఏపీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో నిర్మాణాలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన డిజైన్ల రూపకల్పనలో ఐఐటీ లాంటి ప్రముఖ సంస్థల సలహాలు సూచనలు తీసుకోవాలని సూచించారు. ఇక ప్రస్తుతమున్న నిర్మాణాలతో పాటు పూర్తిస్థాయిలో ప్రారంభం కాని నిర్మాణాన్ని కూడా సర్కారు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకోనుంది.దీంట్లో భాగంగా హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు నిర్ణయించుకుంది. ఈ ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్. రైతులకు రిటర్నబుల్ ప్లాట్ లు ఇవ్వడంతో పాటు వాటిని అభివృద్ధి చేయడం భూములిచ్చిన రైతులకు కౌలు ఇవ్వడం వంటి వాటిని అమలు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది. ఇక రాజధాని ముంపు బారిన పడకుండా కృష్ణానది వరద కొండవీటి వాగు, పాలవాగు వరదప్రవాహం పరిస్థితి పైన దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం.  

తెలంగాణలో బీజేపీ బీసీ అస్త్రం.. పార్టీ అధ్యక్షుడి రేస్ లో బండి సంజయ్!

  పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోదీ మానియా కొనసాగింది. తెలంగాణలో 4 ఎంపీ సీట్లను బిజెపి గెలుచుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి మాత్రం పట్టుదొరకడం లేదు. కనీసం ఉన్న సీట్లు కూడా నిలబెట్టుకోవడం లేదు. దీంతో తెలంగాణలో పట్టు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. రకరకాల ఫార్ములతో తెరపైకి వస్తుంది. కానీ అవి అమలు చేసే లోపే నిర్వీర్యమవుతున్నాయి. తెలంగాణలో త్వరలోనే బిజెపి బ్రహ్మాస్త్రం ప్రయోగించ బోతున్నామని ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఇప్పుడు బిజెపి విసరబోతున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటి అనేది ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీ దగ్గర ఉన్న అస్త్రం ఏంటి అని పలువురు ఆరా తీస్తున్నారు. టిఆర్ఎస్ లో అసమ్మతి నేతలను ముందుగానే గుర్తించి గాలం వేయడమా.. లేక అధికార పార్టీలో గ్రూపులు ప్రోత్సహించి కుంపటి రాజేస్తారా అనేది ఇప్పుడు చర్చ నీయాంశంగా మారింది.  బిజెపి బ్రహ్మాస్త్రం ఏంటి అనే చర్చ అటు జరుగుతుండగానే పార్టీలో మాత్రం మరో టాక్ నడుస్తుంది. డిసెంబర్ లో బిజెపి ప్రయోగించబోయే అస్త్రం అధ్యక్ష మార్పు అంటున్నారు. లక్ష్మణ్ ను కొనసాగించడమా లేదా అనే విషయంపై హైకమాండ్ తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ సమీకరణాలపై పూర్తి అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా సామాజిక సమీకరణాల లెక్కలు తీస్తున్నారు. అధికార టీఆర్ఎస్ కు అన్ని వర్గాలూ అండగా ఉన్నాయి. కాంగ్రెస్ కు ఎస్సీ, ఎస్టీ తో పాటు రెడ్డి వర్గాలూ బ్యాక్ బోన్ గా ఉంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకప్పుడు టిడిపికి అండగా నిలిచిన బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకోవాలనేదే బిజెపి ప్లాన్ గా తెలుస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను అధ్యక్ష రేసులో తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఆయనకు ఆర్ఎస్ఎస్ తో పాటు ఇతర వర్గాలు అనుకూలంగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే బీసీ నినాదంతో బండి సంజయ్ కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్తారని అంటున్నారు. బిజెపి లక్ష్మణ్ చెప్పిన బ్రహ్మాస్త్రం ఇదేనా అని పార్టీలో చర్చ జరుగుతోంది.

బస్సు డిపోల వద్ద ఉద్రిక్తత.. ఆర్టీసీ కార్మికుల అరెస్టులు!!

  తెలంగాణలో ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా అన్ని డిపో పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. దీంతో పలు డిపోల ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది.. తోపులాటలు జరుగుతున్నాయి. సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులు డ్యూటీలో చేరేందుకు డిపోలకు చేరుకుంటున్నారు. అధికారుల నుండి ఎటువంటి అనుమతి లేకపోవడంతో డిపోలకు చేరుకుంటున్న కార్మికులను అడ్డుకుంటున్నారు పోలీసులు. డిపో లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హెచ్చరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాత్రి నుండే డిపోల ముందు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే భారీగా కార్మికులు డిపోకు చేరుకుంటారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.  రాష్ట్రంలోని 96 డిపోల ముందు టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం ఐదు గంటల నుండే డ్రైవర్ లు.. కండక్టర్ లు.. డిపోల వద్దకు చేరుకున్నారు. సమ్మె విరమించి కార్మికులు ముందుకు వస్తున్నా.. తమకు ప్రభుత్వం నుండి కానీ ఆర్టీసీ ఎండీ నుండి కానీ ఎలాంటి ఆదేశాలు లేవని వెల్లడిస్తున్నారు డిపో అధికారులు. నిన్న సునీల్ శర్మ చేసిన ప్రకటనలో డ్యూటీలోకి తీసుకోవద్దంటూ మాకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. 52 రోజులు సమ్మె చేసి..తరువాత సమ్మె విరమించి తిరిగొచ్చిన వారిని ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదేశాలు లేని పక్షాణ ఏ ప్రొఫార్మ మీద సంతకం పెట్టించుకోవాలని సునీల్ శర్మ ఎద్దేవా చేశారు. ఆర్టీసీ సమ్మె డ్రైవర్లు.. కండెక్టర్లు.. డిపో చుట్టూ పక్కల పరిసర ప్రాంతాల్లో కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు. మరోవైపు ప్రైవేటు డ్రైవర్ లు తాత్కాలిక డ్రైవర్ లు క్యూ కూడా పెద్ద సంఖ్యలో డిపో దగ్గరకు వచ్చి చేరారు. ఈరోజు నుండి ప్రైవేటు డ్రైవర్లను దయచేసి మానేయాలంటూ విజ్ఞప్తి కూడా చేశారు ఆర్టీసీ డ్రైవర్లు. అయినా వారి మాటలను పట్టిచుకోకుండా పెద్ద ఎత్తున క్యూ కట్టారు ప్రైవేట్ డ్రైవర్లు. ఇక కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠంగా మారింది.

జీవీఎల్ మౌనవ్రతం.. ఏపీపై బీజేపీ స్టాండ్ తెలిసేదాక ఇంతేనా?

  ఫైర్ బ్రాండ్ గా పేరు పొంది.. మొన్నటి దాకా ఏపీ రాజకీయాలపై ఘాటైన వ్యాఖ్యలు చేసేవారు బిజెపి రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. తమ ప్రత్యర్థి పార్టీకి చురకలు మీద చురకలు వేసేవారు. పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించేవారు. జీవీఎల్ ప్రెస్ మీట్ పెడితే ప్రత్యర్థి పార్టీలపై భారీగా పంచ్ లు పాడేవి. పార్టీ తరపున టీవీ డిబేట్ లలో కూడా గట్టిగా మాట్లాడేవారు. అలాంటిది ఈ మధ్య జీవీఎల్ సైలెంటయ్యారు. ఏపీ రాజకీయాల పై ఆయన కామెంట్ చేయడం లేదు. కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టడం లేదు.. టీవీ డిబేట్ లు కూడా రావడం లేదు. జీవీఎల్ ఎందుకు మౌనం వహించారు. వ్యూహాత్మక మౌనమా లేక పార్టీ ఆదేశాలతో ఆయన సైలెంట్ అయిపోయారా అనేది ఇపుడు చర్చనీయాంశమైంది.  జీవీఎల్ సైలెంట్ అవ్వడం వెనక చాలా కారణాలున్నాయని ప్రచారం జరుగుతుంది. ఏపి బిజెపిలో రాబోయే రోజుల్లో చాలా మార్పులు జరగబోతున్నాయి. కొత్త నాయకత్వం వస్తుందనే ప్రచారం నడుస్తుంది. ఇటు ఇసుక కొరత, ఇంగ్లిష్ మీడియంతో పాటు చాలా అంశాల పై చర్చ జరుగుతోంది. ఈ అంశాలపై పార్టీలో క్లియర్ స్టాండ్ లేదు.. ఒకవేళ మీడియా ముందుకొస్తే జీవీఎల్ ఈ అంశాల పై పార్టీ స్టాండ్ వివరించాల్సి ఉంటుంది. అందుకే ఆయన సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. వైసిపి సర్కార్ పై బిజెపి అనుసరించాల్సిన వ్యూహం ఖరారైన తరువాత జీవీఎల్ బయటకొచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఏపిలో బిజెపి జనసేన కలుస్తాయని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా కూడా చాలా పరిణామాలు జరుగుతున్నాయి. టిడిపి జనసేన విషయంలో క్లియర్ పిక్చర్ రావలసి ఉంది. ఈ అంశాల్లో క్లారిటీ లేదని జీవీఎల్ మౌనం వహించినట్లు తెలుస్తుంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత మళ్లీ జీవీఎల్ యాక్టివ్ అవుతారని సమాచారం.

వైసీపీ పద్మవ్యూహంలో టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి.. ఏం జరగబోతోంది?

  ప్రకాశం జిల్లా, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన గ్రానైట్ క్వారీల పై విజిలెన్స్ దాడులు మళ్లీ మొదలయ్యాయి. టిడిపికి చెందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ కి చెందిన మూడు క్వారీల్లో మూడు రోజుల పాటు విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. మూడు నెలల క్రితం ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని యాభై గ్రానైట్ క్వారీల్లో ముమ్మర తనిఖీలు చేసిన విజిలెన్స్ అధికారులు తిరిగి ఈ సారి కేవలం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన మూడు గ్రానైట్ క్వారీలలోనే తనిఖీలు చేయడం రాజకీయ రంగు పులుముకుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో పట్టున్న ఒక సామాజిక వర్గ నేతలపై వైసీపీ ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టిడిపికి చెందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయి పదవులు దక్కించుకోవచ్చని వైసీపీ ఆలోచనగా తెలుస్తుంది. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే అద్దంకి ఎమ్మెల్యే రవి కుమార్ ఆస్తుల మీద అధికార పార్టీ నాయకుల కన్ను పడింది.  ఈ నెల 9న హైదరాబాద్ లోని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మనవడి పుట్టిన రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవితో మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు మంతనాలు చేశారు. గతంలో కాంగ్రెస్, వైసిపి పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గొట్టిపాటి రవితో ఉన్న పరిచయాల నేపథ్యంలో మంత్రులు తిరిగి వైసిపిలోకి రావాలని ఆహ్వనించారు. అయితే గొట్టిపాటి ఏ విషయం తేల్చి చెప్పలేదని సమాచారం. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కూడా గొట్టిపాటికి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఆయన అడిగిన వెంటనే వైసీపీలో చేరుతారనే నమ్మకంతో వైసిపి అధిష్టానం ప్రయత్నాలు చేసింది. అయితే గొట్టిపాటి నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో సామ దాన దండోపాయాలపై అధికార పార్టీ దృష్టిపెట్టిందని చెప్పుకుంటున్నారు. మూడు రోజుల పాటు కేవలం గొట్టిపాటి రవికి చెందిన మూడు గ్రానైట్ క్వారీల్లోనే విజిలెన్స్ అధికారులు దాడులు చేశారని ప్రచారం జరుగుతోంది. ఈ దాడుల మాటున అవకతవకలు జరిగాయంటూ అధిక మొత్తంలో జరిమానాలు విధించటంతో పాటు పర్మిట్లు నిలిపివేసే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న దాడుల వెనుక అధికార పార్టీ రాజకీయ లక్ష్యం కనిపిస్తున్నందున ఎలాంటి చర్యలు చేపడతారోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా పరిణామాల నేపథ్యంలో గొట్టిపాటి ఏ నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ జోరుగా సాగుతోంది.

ఉగాదికి ఇళ్ల పట్టాల పంపిణీ... 20 లక్షల మందిని గుర్తుంచిన ఏపీ ప్రభుత్వం

ఇళ్ల పట్టాల పంపిణీ పై ఏపీ సర్కార్ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే 20 లక్షల మంది లబ్ధిదారులని గుర్తించిన ప్రభుత్వం ఇళ్ల పట్టాల కోసం 40,000 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తుంది. అందుబాటులో సుమారు 22,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా మరో 18,000 ఎకరాల ప్రైవేటు భూమి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు భూముల కొనుగోలుకు 10,000 కోట్లు ఖర్చవుతాయని భూమి కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం రుణం తీసుకోవాలని ఏపీ సర్కార్ యోచిస్తోంది. ఎల్ఐసి హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా రుణానికి సర్కార్ కసరత్తు చేస్తుంది. సర్కారుకు పది వేల కోట్ల రుణం ఇచ్చేందుకు ఎల్ఐసీ అంగీకరించినట్లు సమాచారం.దీనికి సంబంధించి కసరత్తును ముమ్మరం చేసినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రధానంగా కనిపిస్తుంది. మొదటిగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందివ్వాలని నిర్ణయించారు. ఉగాది నాటికి పూర్తిస్థాయిలో పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందివ్వాలన్న డెడ్ లైన్ ప్రభుత్వం తనకు తానే విధించుకుంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికతో పాటుగా అనువైన భూములను గుర్తించే దిశలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్ధికంగా రుణాలను సేకరించే విషయంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మిగిలిన భూమిని కొనుగోలు చేసైనా లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించుకుంది ఏపీ ప్రభుత్వం.

మహా రాజకీయంలో కీలక మలుపు.. రేపే బల పరీక్ష

  మహా రాజకీయం రేపు మరో కీలక మలుపు తిరిగే అవకాశముంది.మహారాష్ట్రలో ఏర్పాటైన ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం.. బుధవారం నాడు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది. తమకు బలం ఉందని చెబుతూ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా ఆలస్యం చేయడం ఏంటని ప్రశ్నించింది. బల పరీక్ష అసెంబ్లీ వేదికగా జరగాలే తప్ప, రాజ్ భవన్ లో కాదని చెప్పిన సుప్రీం.. బుధవారం సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పూర్తి కావాలని స్పష్టం చేసింది. సీక్రెట్ బ్యాలెట్ కుదరదని, బలనిరూపణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రం 5 గంటల లోపు ప్రొటెం స్పీకర్ ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. మరి బల పరీక్షలో బీజేపీ నెగ్గుతుందో లేక శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమికి అవకాశమిస్తుందో చూడాలి.

కుప్పంలో బాబుకు చెక్... వైసీపీ వ్యూహంలో చిక్కనున్నాడా లేదా ??

చిత్తూరు జిల్లా కుప్పం టిడిపికి కంచుకోట.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ఎమ్మెల్యేగా వరుస విజయాలను అందించిన నియోజకవర్గం. అయితే ఇప్పుడు కుప్పం పై కన్నేసిన వైసిపి.. చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో 13 స్థానాలను కైవసం చేసుకున్న వైసిపి.. కుప్పంలో సత్తా చాటాలని భావిస్తుంది. కుప్పం నియోజకవర్గంలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళిని వైసీపీ ఇన్ చార్జిగా నియమించిన ఆ పార్టీ 2014, 2018 సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీకి దింపింది. గత ఎన్నికల్లో నామినేషన్ కు ప్రచారానికి దూరంగానే ఉన్నా 70,000 లకు పైగా ఓట్లు సాధించారు. జిల్లా అంతటా గత ఎన్నికల్లో చతికిల పడ్డ టిడిపి కుప్పంలో మాత్రం పరువు నిలుపుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో ఎలాగైనా పట్టు సాధించాలని భావిస్తున్న వైసీపీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. ఇన్ చార్జ్ చంద్రమౌళి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కొడుకు భరత్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే కుప్పంలో వైసీపీ క్యాడర్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆయన మాటే అక్కడ చెల్లుతుంది. చంద్రబాబును ఓడించేందుకు ఇక్కడ ఇన్ చార్జిగా నారాయణస్వామి బాధ్యతలు చేపడతారని పెద్దిరెడ్డి ప్రకటించడం ఇప్పుడు చర్చగా మారింది. దీంతో కుప్పం వైసిపిలో కొంత గందరగోళం నెలకొంది. చంద్రమౌళి కొడుకు భరత్ ఇన్ చార్జిగా ఉంటారా..లేక నారాయణస్వామి బాధ్యతలు చూస్తారా.. అనే డౌట్లు మొదలయ్యాయి. ఇటు గతంలో చంద్రబాబుపై పోటీ చేసి ఓడిపోయినా రెడ్డి సుబ్రహ్మణ్యంను వైసిపిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో కుప్పంలో వైసీపీని బలోపేతం చేసేందుకు చంద్రమౌళిని తప్పించి కొత్త నాయకత్వం తీసుకువస్తారా అనే చర్చ ఇప్పుడు పార్టీలో నడుస్తోంది. మొత్తానికి ఇన్ చార్జి విషయంలో క్లారిటీ ఇవ్వాలని కార్యకర్తలు కోరుతున్నారు.

భయం ఇంకా పోలేదు... సాగర్ లాంచీ ప్రయాణానికి మొగ్గు చూపని పర్యాటకులు

  నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు లాంచీ ప్రయాణానికి కేంద్ర పర్యాటక శాఖ అనుమతులు ఇవ్వడంతో లాంచీ ప్రయాణం నడపడానికి సిద్ధమయ్యారు టూరిజం అధికారులు. కనీసం వంద మంది ప్రయాణికులు ప్రయాణించవలసిన లాంచిలో 34 మంది ప్రయాణికులు మాత్రమే పర్యటనకు ఆసక్తి చూపడంతో ట్రిప్ ని నిలిపివేశారు. శ్రీశైలంకు లాంచీని ప్రతి సంవత్సరం నడుపుతారు అధికారులు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలంకు వెళ్లడానికి పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు ఆరు గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉండటంతో పర్యాటకులు చాలా ఇష్టపడతారు. గతంలో వారానికి రెండు సార్లు ఈ లాంచీ ప్రయాణం ఉండేది. కానీ ఈ సంవత్సరం పర్యాటకులు బయలుదేరవలసిన శ్రీశైలం లాంచిని రద్దు చేశారు. లాంచీ టూరుకు కచ్చులూరు ప్రమాదం ఎఫెక్టే ఉండవచ్చని స్థానికులు అనుకుంటున్నారు. పర్యాటకులు ఆసక్తి చూపక పోవడం.. ఆన్ లైన్ లో విక్రయించాల్సిన టిక్కెట్ లు అమ్ముడు పోకపోవడంతో లాంచీని రద్దు చేశారు. ఇటీవల కచ్చులూరు లాంచీ ప్రమాదంతో ఏపీతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా నాగార్జున సాగర్ లో లాంచీ ప్రయాణాలు నిలిపివేశారు.ప్రయాణికులు కూడా కచ్చులూరు ప్రమాదం తరువాత లాంచీ ప్రయాణాలు అంటే ఒక అడుగు వెనుక్కు తగ్గుతున్నారు అనేది వాస్తవం.టూరిజం అధికారులు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు పాటించడం లేదని అందుకే సగం ప్రయాణికులు ఆశక్తి చూపించడం లేదని వెల్లడించారు.

ఢిల్లీ కాలుష్యం కంటే బాంబులు పెట్టి అందరిని చంపేయండి

ఢిల్లీలో పొల్యూషన్ పై సుప్రీం కోర్టు మండిపడింది. ఇలా కాలుష్యంతో నరకంలో బతకడం కంటే బాంబులు పెట్టి ఢిల్లీ ప్రజలందరిని ఒకేసారి చంపెయ్యాలని ఆక్రోశం వ్యక్తం చేసిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై జడ్జీలు మండిపడ్డారు. తప్పును ఒకరి పై ఒకరు నెట్టేసుకోవడం బ్లేమ్ గేమ్ ఆపాలని సూచించారు. జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాల బెంచ్ పొల్యూషన్ కేసును విచారించింది. పంటల వ్యర్ధాలు తగలబెట్టడం ఆపలేని మన దేశాన్ని చూసి ప్రపంచ దేశాల ప్రజలు నవ్వుకుంటున్నారని జడ్జిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదని ఆక్షేపించారు. హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతున్నాయని ఢిల్లీ ప్రజల్నీ క్యాన్సర్ బాధితులుగా మిగిలి పొమ్మంటారా అని ప్రశ్నించారు. ఢిల్లీ నరకం కంటే దారుణంగా తయారైందన్నారు జస్టిస్ అరుణ్ మిశ్రా. దేశంలో జీవితం చీపుగా ఏమీ లేదని ప్రాణానికి ఎలా ఖరీదు కడతారని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రభుత్వానికి అధికారంలో ఉండే అర్హత లేదన్నారు. ఒక్కో వ్యక్తి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో చెప్పాలన్నారు. సుప్రీంకు సమాధానమిచ్చిన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ రెండు అధికార కేంద్రాలతో పాలనా పరమైన సమస్యలని వస్తున్నాయన్నారు. దీంతో విభేదాలు పక్కన పెట్టి కలిసి పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వాలకు సూచించారు జస్టిస్ అరుణ్ మిశ్రా. సిటీలోని వేర్వేరు చోట్ల ఎయిర్ ప్యూరిఫయింగ్ టవర్స్ ను ఏర్పాటు చేసే అంశంలో పది రోజు ల్లోగా ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు. ఉత్తర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పైనా సిరీస్ ఇయ్యరు జస్టిస్ అరుణ్ మిశ్రా. మీపై మీ అధికార యంత్రాంగంపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఎవరినీ ఉపేక్షించేది లేదనే విషయం తెలుసుకోవాలని సీఎస్ కు సూచించారు. ఖచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే పంటల వ్యర్థాలు తగలబెడుతున్న వారిపై వెయ్యికి పైగా ఎఫ్ ఐఆర్ లు నమోదు చేసామని సుప్రీం దృష్టికి తీసుకువెళ్లారు యుపిసిఎస్. అలాగే ఒక కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించినట్లు చెప్పారు. అయితే ఇలాంటి తాత్కాలిక చర్యల కంటే పాజిటివ్ యాక్షన్ మొదలుపెట్టాలనీ సీఎస్ కు సూచించారు జడ్జీలు. ఢిల్లీ లిమిట్స్ లో నడుస్తున్న ఫ్యాక్టరీలు పర్యావరణంపై వాటి ప్రభావం ఎలా ఉందో సమగ్ర నివేదిక సమర్పించాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఆదేశించింది సుప్రీంకోర్టు.

70 వేల కోట్ల స్కాం... పవర్ రాగానే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పవార్‌కు ఊరట

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాష్ట్ర ఇరిగేషన్ స్కామ్ లో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు ఊరట లభించింది. ఈ కేసులో ఏసిబి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. 70 వేల కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు రావడంతో దీని పై ఏసీబీ విచారణ జరిపింది. అయితే బిజెపితో సీక్రెట్ డీల్ లో భాగంగానే ఈ కేసును క్లోజ్ చేశారని శివసేన ఆరోపించింది. అజిత్ పవార్ ను బ్లాక్ మెయిల్ చేసి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారని ఆరోపించింది. డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టిన మరుసటి రోజే ఇరిగేషన్ స్కామ్ ఫైల్ ని ఏసీబీ మూసివేయడం తీవ్ర సంచలనం రేపుతోంది. బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకి ఇది నిదర్శనమని శివసేన, ఎన్సీపీ నేతలు ఆరోపించారు. నవంబర్ ఇరవై ఎనిమిది న హై కోర్టు ముందు ఈ కేసు విచారణకు రానుంది. వాస్తవానికి ఎఫ్ఐఆర్ లో అజిత్ పవార్ పేరు లేదు. కాకపోతే కాంట్రాక్టులకు సంబంధించి అజిత్ పవార్ జోక్యం చేసుకున్నారని ఆరోపణలు రావడంతో ఆయన పాత్ర పై ఏసీబీ దర్యాప్తు చేసింది. అజిత్ పవార్ కు నచ్చజెప్పడానికి ఎన్సీపీ నేతలు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఇంకా ఆయన పదవి బాధ్యతలు చేపట్ట లేదని అంటున్నారు ఎన్సీపీ నేతలు. డెప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఎన్సీపీ కార్యకర్తలు. 

ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే... కేసీఆర్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందా?

ఊహించినట్లే ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాకిచ్చింది. సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై... మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే... చట్ట ప్రకారం కుదరదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టంచేశారు. ఒకవైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ... సమ్మె చేయమని చెప్పలేదని...  కార్మికులే తమంతట తాముగా విధులకు గైర్హాజరై... చట్ట విరుద్ధంగా సమ్మెలో ఉన్నారన్న సునీల్ శర్మ... ఇష్టానుసారంగా విధులకు గైర్హాజరై... మళ్లీ నచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే ఏ ప్రభుత్వరంగ సంస్థలో సాధ్యంకాదని స్పష్టంచేశారు. బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతిముఖ్యమైన పండగల సమయంలో సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారన్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరతామంటే చట్ట ప్రకారం కుదరదన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నాక... ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసేవరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం కుదరని తేల్చిచెప్పారు. ఏ నిర్ణయమైనా సరే, అంతా చట్ట ప్రకారం జరుగుతుందని, అప్పటివరకు సంయమనం పాటించాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు. ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, ఇప్పుడు మరోసారి డిపోల దగ్గర ఉద్రిక్తతలు సృష్టించి కష్టాలను కోరి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. డిపోల దగ్గర శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని, తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను అడ్డుకోవద్దని వార్నింగ్ ఇఛ్చారు. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న ఆర్టీసీ ఎండీ.... ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే... చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు సంయమనం పాటించాలని కార్మికులకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ సూచించారు.

ఏపీకి కిరణ్..! మరి, తెలంగాణకు ఎవరు? ఇంకెన్ని రోజులు నాన్చుతారు?

తెలుగు రాష్ట్రాలకు కొత్త పీసీసీ అధ్యక్షుల నియామకంపై ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నా అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పగ్గాలు... మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించేందుకు దాదాపు ఖరారు కాగా, తెలంగాణ విషయంలోనూ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. టీపీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రంగా ఉండటంతో ఎవరికి అప్పగించాలో తెలియక హైకమాండ్ తర్జనభర్జనలు పడుతోంది.  పీసీసీ రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, వి.హనుమంతరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు ఉన్నా... వీళ్లందరిలో రేవంతే ముందున్నారని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక, రేవంత్ కూడా పీసీసీ పగ్గాల కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఒకానొక టైమ్ లో రేవంతే నెక్ట్స్ పీసీసీ ప్రెసిడెంట్ అన్న ప్రచారం కూడా సాగింది. అయితే, సీనియర్ల ఫిర్యాదులు, అభ్యంతరాలతో అది ఆగిందనే మాట వినిపించింది. ముఖ్యంగా రేవంత్ కు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నుంచి పోటీ ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. దాంతో, రేవంత్... ఇతర సీనియర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అలా, తనకు మద్దతిస్తోన్న సీనియర్లతో ఢిల్లీలో రేవంత్ లాబీయింగ్ చేయిస్తున్నారని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తనకు పీసీసీ పగ్గాలు అప్పగిస్తే, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి తీరుతానని బల్లగుద్దిమరీ హైకమాండ్ కి నమ్మకం రేవంత్ కలిగించారట. ఏఐసీసీ అండ్ గాంధీభవన్ వర్గాల సమాచారం మేరకు రేవంత్ రెడ్డి లేదంటే కోమటిరెడ్డికి పీసీసీ పీఠం దక్కే అవకాశముందని అంటున్నారు. వీళ్లిద్దరిలో ఎవరూ కాకపోతే, ఎస్సీ కోటా దామోదర రాజనర్సింహ.... మైనారిటీ కోటా షబ్బీర్ అలీ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటున్నారు. అలాగే, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి, వీహెచ్ తదితరులు తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే, ఏళ్ల తరబడి పార్టీనే నమ్ముకుని నేతల్లో ఎవరికిచ్చినా ఫర్వాలేదు కానీ, కొత్తగా పార్టీలోకి వచ్చినవాళ్లకు ఇస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని సీనియర్లు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే, కొత్త పీసీసీ చీఫ్ ఎంపికలో ఉత్తమ్ సిఫార్సు కీలకం కానుందనే మాట వినిపిస్తోంది. ఉత్తమ్ ఎవరికి మద్దతిస్తే వాళ్లకే పీసీసీ పగ్గాలు దక్కుతాయని అంటున్నారు. మరి, టీపీసీసీ చీఫ్ పదవి ఎవరిని వరిస్తుందో... ఈ ఉత్కంఠకు ఢిల్లీ పెద్దలు ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో చూడాలి.