బళ్లారి నుండి ఖనిజం కావాలంటూ 'ఎన్ఎండీసీ'పై వైసీపీ సర్కార్ ఒత్తిడి!!

  కడప స్టీల్ ప్లాంట్ కు ఇనుప ఖనిజం ఎక్కడి నుంచి సరఫరా చేయాలన్న అంశం పై పీటముడి పడింది. ఈ ప్లాంటుకు డిసెంబర్ లో శంకుస్థాపన చేస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అవసరమైన ఇనుప ఖనిజం సరఫరా కోసం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎన్ఎండీసీతో ఒప్పందం చేసుకుంది. అందులో పేర్కొన్నట్లు సమీప గనుల నుంచి ఖనిజం సరఫరా చేయాలని ప్రభుత్వం విధించిన నిబంధనకు ఎన్ఎండీసీ అంగీకరించడం లేదని తెలిసింది. ఎన్ఎండీసీకి బళ్లారి ప్రాంతాల్లో, చత్తీస్ గఢ్ లో ఇనుప గనులున్నాయి. బళ్లారి నుంచి కడపకు దగ్గర అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతోంది. ఖచ్చితంగా అక్కడి నుంచే ఇస్తామన్న అంశాన్ని ఒప్పందంలో ఉంచేందుకు ఎన్ఎండీసీ ఒప్పుకోవడం లేదని సమాచారం. బళ్లారి దగ్గర కావడంతో రవాణా ఖర్చు తగ్గుతుందని అదే చత్తీస్ గఢ్ అయితే పెను భారం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కర్ణాటకలో అక్రమ ఇనుప ఖనిజం తవ్వకాల విచ్చలివిడిగా జరిగినప్పుడు అక్కడ నుంచి ఖనిజాన్ని ఎగుమతి చేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. ఈ తీర్పు ప్రకారం విదేశాలకు మాత్రమే ఎగుమతి చెయ్యకూడదని కర్ణాటకలో ఐరన్ ఓర్ ని ఈ వేలం ద్వారా విక్రయిస్తామని ఎన్ఎండీసీ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు సమీప గనుల నుంచే అన్న నిబంధన లేకుంటే భవిష్యత్తులో ఇబ్బంది అనే అభిప్రాయం వినిపిస్తొంది. అయినా ప్లాంట్ పూర్తయినప్పుడు కదా ఖనిజ సరఫరా చేసేది.. అప్పుడు చూద్దామని ఎన్ఎండీసీ అంటున్నా దాని పై పట్టు పట్టాల్సిందేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చత్తీస్ గఢ్ లో ఎన్ఎండీసీ స్వయంగా స్టీల్ ప్లాంట్ నిర్మిస్తుంది. కావలసినన్ని నిధులున్నా పదేళ్లుగా పనులు నడుస్తూనే ఉన్నాయి. దీని నిర్మాణానికి మరో రెండు మూడేళ్ళు పట్టేలా ఉందంటున్నారు. దాని కోసం రూ. 80 వేల కోట్ల వరకు ఖర్చ అయ్యిందని ఏటా రూ. 8 వేల కోట్ల రూపాయల చొప్పున పెట్టుబడి పెడుతూనే ఉన్నారని సమాచారం.

అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం మళ్లీ తెరచుకుంది

  అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో కార్యాలయం మళ్లీ తెరచుకుంది. పెట్రోల్ దాడి జరిగిన పాత బిల్డింగ్ కు కొద్ది దూరంలోనే మరో బిల్డింగ్ లో కార్యాలయం తెరచుకుంది. కొత్త తహసీల్దార్ గా వెంకట్ రెడ్డి చార్జి తీసుకున్నారు. ఆయనతో పాటు సిబ్బంది ప్రత్యేక పూజలు చేశారు. నవంబర్ 4వ తేదీన అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వోగా ఉన్న విజయా రెడ్డి పై సురేష్ అనే రైతు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. విజయారెడ్డితో పాటు ఆమె డ్రైవర్, రైతు సురేష్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దాడి ఘటన నుంచి 24 రోజులుగా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో ఆఫీస్ తెరుచుకోలేదు.  పాస్ పుస్తకాల విషయంలో ఆగ్రహానికి గురైన రైతు సురేష్ మధ్యాహ్నం సమయంలో ఎమ్మార్వో విజయా రెడ్డి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న డ్రైవర్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతనికి మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదం లో విజయా రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సురేష్, డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన రెవెన్యూ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.  ఈ కేసులో సురేష్ వాంగ్మూలం తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కొందరి ప్రోద్బలం తోనే సురేష్ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్నారు.  విజయా రెడ్డి పై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాడి ఘటన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాలకు ప్రభుత్వం భద్రత పెంచింది. మరోవైపు, తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ వృద్ధ దంపతులు ఆర్టీవో కాళ్లు పట్టుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ లో జరిగింది. తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో వేణుమాధవరావు తనిఖీలు చేస్తూ ఉండగా ఆశప్ప- భారతమ్మ అనే దంపతులు ఆర్టీవో కాళ్ల పై పడ్డారు. సంఘటన పై చలించిన ఆర్టీవో సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎమ్మార్వోకు సూచించారు.

విమర్శల వ్యూహం.. టీడీపీ నేతలు అందుకే మౌనంగా ఉన్నారు

  ఏపీలో అధికార పార్టీ నేతలు చంద్రబాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయ విమర్శల స్థాయి దాటిపోయి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీ, తమ్మినేని వంటి నేతల విమర్శలు కాక పుట్టిస్తున్నాయి. ఆయా అంశాల పై మాట్లాడుతూ వారు వాడిన పదాలు తీవ్ర చర్చలకు దారి తీస్తుంది. ఎవరైనా.. ఏమైనా.. తిరిగి మాట్లాడితే తాను మరింత ఘాటుగా తిడతానని కొడాలి నాని మీడియా ముందే ప్రకటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వాటికి ధీటుగా కౌంటర్లు రావడం లేదు. దీని వెనుక టిడిపి పక్కా వ్యూహంతో వెళుతున్నట్లు కనిపిస్తోంది.  మంత్రులు.. అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో వైసీపీ నేతల బూతుపురాణం వల్ల తమకు లాభమే తప్ప నష్టం ఉండదంటున్నారు టిడిపి నేతలు. రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చడం వల్ల బాబు అమరావతి పర్యటనలకు మరింత ఊపొచ్చిందని టిడిపి భావిస్తోంది. బాబు అమరావతిలో టూర్ అనగానే బొత్స ఘాటుగా స్పందించారు. దీంతో చంద్రబాబు టూర్ అంశంపై అందరి ఫోకస్ పెరిగింది. బొత్స తీవ్ర వ్యాఖ్యల వల్లనే ఇప్పుడు బాబు టూర్ పై చర్చ పెరిగిందని టిడిపి నేతలు చెబుతున్నారు.  ఇక తమ్మినేని సీతారాం, వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చంద్రబాబు.. లోకేష్ ల మీద చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా మంత్రి కొడాలితో పాటు వంశీ చేస్తున్న ఘాటు విమర్శల వల్ల వారికే నష్టం జరుగుతుందని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పాలనా వ్యవహారాలు.. ప్రభుత్వ పథకాలపై జరగాల్సిన చర్చలు.. వైసీపీ మంత్రులు.. నేతల ఘాటు విమర్శల వైపు డైవర్ట్ అవుతుండటం తమకు ప్లస్ అవుతుందంటున్నారు. ముందు నుంచి చంద్రబాబుపై అధికార పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో వారికే నష్టం చేస్తాయని టిడిపి నేతలు లెక్కలేసుకుంటున్నారు. ముఖ్యంగా చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై చేస్తున్న విమర్శల్లో వాడుతున్న భాష పై ప్రజల్లోనూ చర్చ జరుగుతుందని టిడిపి భావిస్తోంది.  ప్రస్తుతం మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు ప్రభుత్వానికి చుట్టుకుంటాయని కేబినెట్ లో ఉండేవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజలు హర్షించరని టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే తమ పార్టీ నేతలు కౌంటర్ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ చెప్తోంది. వైసీపీ నేతలు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పటికీ మాట్లాడుతున్నారని దీనివల్ల అధికార పార్టీనే నష్టపోయే పరిస్థితి ఉందని టిడిపి నేతలు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలతోనే చంద్రబాబుపై విమర్శలు చేసినా టిడిపిలోని ముఖ్య నేతలు ఆచితూచి కౌంటర్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

రమ్మనప్పుడు రావాలి.. పార్టీ మారని టిడిపి ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు

  ప్రకాశం జిల్లా, అద్దంకి టిడిపి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ని అధికార పార్టీ టార్గెట్ చేసిందని జిల్లా వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2004 నుంచి వరుసగా నాలుగు సార్లు గొట్టిపాటి రవి కుమార్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 లో వైసీపీ నుంచి గెలుపొందిన రవికుమార్ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిడిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి తిరిగి అద్దంకి ఎమ్మెల్యేగా గెలుపొందారు.వైసీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్న గొట్టిపాటి రవికుమార్ ని టీడీపీకి దూరం చేసేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట. టీడీపీకి రాజీనామా చేయాలని గత నెల రోజుల నుంచి రవి కుమార్ పై ఒత్తిడి తెస్తున్నట్టు ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. కాకపోతే రాజీనామా చేసి వస్తే అధికార పార్టీలో ఇచ్చే పదవిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదట. దీంతో రవికుమార్ వైసీపీలో ఉన్న తన సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు. పార్టీకే కాదు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేస్తా కానీ అద్దంకి నియోజకవర్గ ఇంచార్జి పదవి మాత్రం తనకే ఇవ్వాలని గొట్టిపాటి రవికుమార్ కండీషన్ పెట్టినట్టు వైసీపి వర్గాల టాక్. ప్రస్తుతం చెప్పింది చేయడమే తప్ప కండిషన్ లు పట్టడం కుదరదని  వైసిపి ముఖ్య నేతలు చెప్పారట. దాంతో టీడీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే పదవి వదులుకుంటే తన పొలిటికల్ ఫ్యూచర్ ఏంటో రవికుమారి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మరోవైపు రవికుమారి పై అధికార పార్టీ విజిలెన్స్ దాడులు మొదలు పెట్టేసింది. గొట్టిపాటి రవికుమార్ కి అద్దంకి నియోజక వర్గంలోని బల్లికురవ మండలం లో గ్రానైట్ క్వారీ లు ఉన్నాయి వీటి పై గత కొద్ది రోజులుగా వరుస దాడులు జరుగుతున్నాయి. బల్లికురవలో వంద గ్రానైట్ క్వారీల ఉన్నా కేవలం రవికుమార్ గ్రానైట్ క్వారీల పై మాత్రమే విజిలెన్స్ అధికారుల దాడులు చేస్తున్నారు. క్వారీ రికార్డులూ ఇప్పటి వరకూ వెలికితీసిన గ్రానైట్ రాళ్ల వివరాలూ అడుగుతూ సతాయిస్తున్నారు.దీంతో పాటు పెనాల్టీ లు వేస్తే వంద కోట్లు దాటుతున్నట్టు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో గొట్టిపాటి రవి కుమార్ పొలిటికల్ ఫ్యూచర్ పై సతమతమై పోతున్నారు. అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న ఒత్తిడితో గొట్టిపాటి రవికుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఐదు గంటల పాటు చిత్రహింసలు పెట్టి ప్రియాంకని కాల్చేశారు!

  డాక్టర్ ప్రియాంకను హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ ను నిందితులుగా గుర్తించినట్టు సమాచారం. ప్రియాంక స్కూటిని రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జేపీ దర్గా బస్టాండ్ వద్ద గుర్తించారు. నిందితులు నెంబర్ ప్లేట్ తొలగించి స్కూటీని జేపీ దర్గా బస్టాండ్ వద్ద వదిలి వెళ్లారు. స్కూటీ దొరికిన ప్రాంతంలోని సీసీ టీవీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలించారు. అనంతపురానికి చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ గా అనుమానించారు. లారీ నెంబరు ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ప్రియాంక మృతదేహాన్ని చటాన్ పల్లి సమీపంలోని వంతెన కింద పడేసి దహనం చేశారు. మృతదేహం దహనమైన తీరు పోలీసులను కూడా నివ్వెరపరిచింది. శరీర భాగాలు పూర్తిగా కాలిపోయాయి. మృతదేహం పై పెట్రోల్ పోసి పూర్తిగా కాలిపోయేలా చేసి ఉంటారు అనేది నిపుణుల అంచనా. ప్రియాంక మృతదేహాన్ని జన సంచారం లేని వంతెన కింద పడేశారు. అర్ధరాత్రి సమయంలో మృతదేహాన్ని పడేసి కాల్చటానికి చోటు గుర్తించగలిగారు అంటే ఈ ప్రాంతం పై అవగాహన ఉన్నవారే ఇంతటి ఘోరానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. రాత్రి 9:40 నిమిషాల ప్రాంతాల్లో ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయిన విషయం కుటుంబ సభ్యులు గమనించారు. ఆ సమయంలోనే ఆమెను కిడ్నాప్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ వైద్యుల అంచనా ప్రకారం రాత్రి మూడు గంటల సమయంలో ఆమె చనిపోయారు. అంటే కిడ్నాప్ అయినప్పటి నుంచి చనిపోయే వరకు మధ్యలో ఉన్న అయిదు గంటల పాటు ఆమెను చిత్ర హింసలు పెట్టి ఉంటారని అర్థమవుతోంది. ప్రియాంక మృతదేహం తలపై చిన్న దెబ్బ ఉన్నట్టుగా గుర్తించారు. ఆమె మెడకు చున్నీ చుట్టి ఉన్న గొంతు పిసికి ఊపిరాడకుండా చేసి హతమార్చి ఉంటారని తెలుస్తొంది.  

బ్రతకండి..మీ సంస్థను బ్రతికించుకోండి.. ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ హితవు

  తీవ్ర నిరాశా నిస్పృహలు.. ఆవేదన.. కూడకట్టుకున్న ఆర్టీసీ కార్మికులకు ముఖ్య మంత్రి కేసీఆర్ ఎట్టకేలకు తీపి కబురు చెప్పారు. భేషరతుగా ఉద్యోగాల్లో చేరొచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం తలచుకుంటే సమ్మెను లేబర్ కోర్టుకు పంపగలదని అలా చేస్తే కార్మికుల ఉద్యోగాలు ఊడిపోతాయి కాబట్టి తాము అలా చేయటం లేదని ఊరటనిచ్చారు. ఆర్టీసీ మనుగడకు తక్షణమే రూ.100 కోట్ల రూపాయల ఇస్తున్నారని కూడా ప్రకటించారు. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీసీ మనుగడ పేరిట చార్జీలనూ కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచేశారు. డిసెంబర్ 2 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయని ప్రకటించారు. సమ్మె కాలంలో తాత్కాలికంగా పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు బెదిరించినా.. అవమానించినా.. భరిస్తూ కష్టకాలంలో పని చేశారని భవిష్యత్తులో తప్పకుండా వారి గురుంచి ప్రభుత్వం ఆలోచిస్తుందని హామీ ఇచ్చారు. క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో కలిసి కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు.  ప్రభుత్వం ఎన్నో సంస్థలను కాపాడింది.. ఎంతో మందికి అన్నం పెట్టింది.. అలాంటిది ఆర్టీసీ కార్మికులను బజారున పడేస్తే ప్రభుత్వానికి వచ్చేది ఏముందని..చివరిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాం అని కేబినెట్ చర్చల్లో మంత్రులు తెలిపినట్లుగా కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున.. ఆర్టీసీ సంస్థ తరుపున.. సదరు కార్మికుడికి చెబుతున్నా.. " ఇక ఇప్పటికైనా మీరు తెలుసుకోండి.. అందరి మాటలు నమ్మి మీరు మోసపోకండి.. ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నాను వెళ్లి ఉద్యోగాల్లో చేరి మంచిగ బ్రతకండి.. మీ సంస్థను బ్రతికించుకోండి " అని పిలుపునిచ్చారు కేసీఆర్. మీరు మా బిడ్డలని ఎన్నడో చెప్పాము అలానే చూసుకుంటాము. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కార్మికుల పొట్టనింపామే కానీ పొట్టలు కొట్టిన దాఖలాలు లేవని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆశా వర్కర్లకు,హోమ్ గార్డులకు ఇలా చాలా మందికి ఎక్కువ వేతనం ఇస్తుంది కేవలం తెలంగాణలోనే అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు 30% శాతం రిస్క్ అలవెన్సు ఇస్తున్నామని.. ఇండియాలో తెలంగాణ ఒక్కటే దీనిని ఇస్తోందన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వారికి పింఛను ఇవ్వట్లేదని, ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో ఇవ్వడం లేదని వివరించారు. యూనియన్ల మాటలు నమ్మి కార్మికులు పెడదారి పట్టారని సంస్థను దెబ్బతీస్తున్నారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కేసీఆర్ మండిపడ్డారు.

అంతటా ఉత్కంఠ :- నేడు ఆర్టీసీ సమ్మెపై తీర్పు వెల్లడించనున్న హైకోర్టు

  ఆర్టీసీ సమ్మె ఒక కోలోక్కి రానుందా.. లేక ఈ సాగతీత తప్పదా? ఈ రోజు ( నవంబర్ 18న ) జరిగే విచారణపై సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది. అక్టోబర్ 05వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతూనే ఉంది. 5 వేలకు పైగా బస్సులను ప్రైవేటీకరణ చేస్తామన్న పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. తాజాగా ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన ఫైనల్ అఫిడవిట్ పిటిషన్ తో ఆగ్రహించిన కార్మికులు.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ వాదన వినిపించనున్నారు. తాత్కాలికంగా పరిష్కారం కోసం విలీనం డిమాండ్‌ను పక్కనపెట్టినా.. కార్మికులు ఏ క్షణంలోనైనా మళ్లీ విలీన ప్రతిపాదనతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు సునీల్ శర్మ.  జేఏసీ నేతలు విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా సమ్మె చేస్తున్నారని.. ప్రభుత్వాన్ని అగౌరవపరిచేలా ఈ సమ్మె చేస్తున్నందున చర్చలు జరపడం కుదరదని అఫిడవిట్‌లో తెలపడంతో ఆందోళనలు మరింత ఉధృతం చేశారు జేఏసీ నేతలు. ఎన్నటికైనా ప్రభుత్వం దిగి వచ్చి కార్మికులతో చర్చలు జరిపేంత వరకు  సమ్మెను కొనసాగించాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. మరోవైపు.. నిరాహార దీక్ష చేస్తున్న జేఏసీ నాయకులను అరెస్టు చేయడంతో కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. నిరాహారదీక్ష చేస్తున్న ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని నిన్న ( నవంబర్ 17న ) పోలీసులు అరెస్ట్ చేశారు చేశారు. రెండవ రోజు దీక్ష అయినందున..ఆరోగ్యం క్షీణిస్తుండటంతో దీక్ష విరమించుకోవాలని వైద్యులు సూచించారు. అశ్వత్థామరెడ్డి అందుకు నిరాకరించడంతో పోలీసులు బలవంతంగా దీక్షను భగ్నం చేసి.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్‌ రాజిరెడ్డిని కూడా..ఇంటి తలుపులు పగలగొట్టి.. బయటకు తీసుకొచ్చి.. పోలీసులు అరెస్ట్‌ చేశారు. మొత్తనికి సమ్మెపై హైకోర్టు తీర్పును వెలువరిస్తుందా.. లేక మళ్లా వాయిదా వేస్తుందా అనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది.

కనికరం కూడా లేదా... ఉద్యోగ సంఘాల పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు

  తెలంగాణ ఉద్యమంలో పేరొందిన నాయకుల్లో ఈ నలుగురు ముఖ్యులు. జీతం కోసం ఉద్యోగం.. జీవితం కోసం తెలంగాణ.. నినాదంతో కార్మిక వర్గాలను ఏకం చేసే పనిలో సక్సెస్ అయ్యారు నలుగురు. ఉద్యోగ సంఘాల నాయకులైన స్వామిగౌడ్, దేవీ ప్రసాద్, శ్రీనివాసగౌడ్ ,విఠల్ లు ముందుండి సకల జనుల సమ్మెతో యావత్ సమాజాన్ని ఏకం చేశారు. ఆ సమ్మెతోనే ఉద్యమానికి ఊపిరి వచ్చిందని చెప్పుకోవాలి. అప్పట్లో ఆర్టీసీ చక్రాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఇలా అన్ని వర్గాలనూ ఉద్యమంలో నడిపించారు ఉద్యోగ సంఘాల నేతలు. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమ్మె 53 రోజులు జరిగినా ఉద్యమంలో కలిసి పని చేసిన ఉద్యోగ సంఘాలు అంతగా సహకరించిన దాఖలాలు లేవన్నది కాంగ్రెస్ వాదన. అందుకే కాంగ్రెస్ నేతలు ఉద్యోగ సంఘాల నాయకులను టార్గెట్ చేస్తున్నారు.  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మొదటి నుండి ఉద్యోగ సంఘాలను బయటకు రప్పించేందుకు ప్రయత్నం చేశారు. ఇప్పుడు జగ్గారెడ్డి ఆర్టీసీ సమ్మె కారణంగా చూపుతూ ఉద్యోగ సంఘాల పై విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఇతర సంఘాల నేతలు ఒకటి రెండు రోజులు మద్దతిచ్చారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పట్లో అన్ని వర్గాల నుండి ఒత్తిడి రావడం తోనే ఆ మాత్రం మద్దతిచ్చారని విమర్శలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకుని ఉద్యోగాల్లో చేరతామన్నా కూడా చేర్చుకునేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నాయకుల పై దాడి మొదలుపెట్టింది కాంగ్రెస్. ఉద్యమంలో అందరినీ కలిపి నడిపించిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు కార్మికులు అలమటిస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నారని జగ్గారెడ్డి మాటలు ఎక్కుపెట్టారు. ఉద్యమంలో వాడుకుని ఇప్పుడు మాత్రం కార్మికులను రోడ్డు మీద పడటం ఏంటన్నది జగ్గారెడ్డి వాదన. ఆర్టీసీ ఎండీ ప్రకటన తరువాత కూడా ఇతర ఉద్యోగ సంఘాలు కనీసం స్పందించకుండా మౌనంగా ఉండటం ఎంత వరకు సబబని ఫైరవుతున్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ కార్మి కుల సమ్మెపై వ్యవహరిస్తున్న తీరుతో భవిష్యత్ లో ఏ ఉద్యోగ సంఘమైనా సమ్మె అంటే ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే మిగిలిన సంఘాల నేతలు ఆర్టీసీ సమ్మె విషయంలో ఓపెన్ అవ్వడానికి వెనుకా ముందాడుతున్నారని అభిప్రాయముంది. అయితే తోటి ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కనీసం కలుపుకుని పోయే మార్గం కూడా చూపలేదన్న అపవాదు మాత్రం ఉద్యోగ సంఘాల నాయకులపై పడింది. దాన్ని ఇపుడు కాంగ్రెస్ చర్చకు పెడుతోంది.

అసెంబ్లీకి వ్యూహం రెడీ... వంశీతో అటాక్ ప్లాన్ చేస్తున్న వైసీపీ

  టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవితవ్యం పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీ మార్పు అంశానికి సంబంధించి ఎన్నికల తర్వాత తొలి అడుగు వేసిన ఎమ్మెల్యే వంశీ.. తాను వైసీపీలో చేరతానని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. టిడిపికి రాజీనామా చేశానని జగన్ తో కలిసి నడుస్తానని వంశీ ప్రకటన చేసిన తర్వాత నుంచి ఆయన ఎప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకుంటారా అని రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇతర పార్టీ ఎమ్మెల్యే.. తమ పార్టీలోకి చేరాలనుకుంటే పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని సీఎం జగన్ స్పష్టం చేశారు. వంశీ ఎప్పుడు రాజీనామా చేస్తారా అనే విషయం పై చర్చ నడుస్తుంది.  సీఎం జగన్ తో ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యే వంశీ భేటీ అయ్యారు. తొలిసారి కలిసినప్పుడు కేవలం తాను నియోజకవర్గంలో పరిస్థితులను వివరించడానికి కలిశారని చెప్పారు వంశీ. ఆ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టుగా ప్రకటించి గన్నవరం రాజకీయాలను హీటెక్కించారు. ఆ తరువాత మళ్లీ తన కేడర్ ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లో కొనసాగుతానని.. జగన్ వెంట నడుస్తానని.. మాట మార్చారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కూడా ప్రకటించారు. ఆ క్రమంలో సీఎం జగన్ తో వంశీ రెండో సారి భేటీ అయ్యారు. ఈ సారి కూడా పార్టీలో చేరిక రాజీనామా అంశాల పై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా సమాచారం. కానీ వంశీ మాత్రం సీఎం సహాయ నిధి కోసం కలిసినట్టు మీడియాకూ చెప్పుకొచ్చారు. జగన్ తో జరిగిన భేటీలో వంశీ రాజీనామా అంశమే ప్రధానంగా చర్చకొచ్చినట్లుగా వైసిపి వర్గాలు అంటున్నాయి. వచ్చే నెల (డిసెంబర్) 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వంశీ అసెంబ్లీలో ఏ విధంగా వ్యవహరించాలి.. చంద్రబాబు విషయంలో ఎలా మెలగాలి అనే అంశం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం వంశీని పార్టీ లోకి తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఒకవేళ రాజీనామా చేస్తే ఆపై పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై లోతైన చర్చ జరుగుతోంది. వైసిపిలో ఇప్పటికే నియోజకవర్గం లో వైసీపీ శ్రేణులు వంశీ రాకను తీవ్రంగా నిరసిస్తున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో మాత్రమే వంశీ గట్టెక్కారని విషయాన్ని వైసిపి శ్రేణులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు వంశీని ఇప్పుడే పార్టీలో చేర్చుకోవాలా లేదా కొద్ది సమయం వేచి చూసి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా వైసీపీ అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లుగా పార్టీ వర్గాల కథనం. వంశీ పార్టీ లోకి చేరాలంటే ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి కాబట్టి అలా కాకుండా బయట నుంచి మద్దతు తీసుకుని సరైన సమయంలో రాజీనామా చేయించి అవకాశాలున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సీఎం చేతుల మీదుగా అవార్డు అందుకున్న మహిళా రైతుకు కష్టాలు!

  ఆమె ఓ వితంతువు, భర్త లేకపోయినా కష్టాలకు ఎదురెళ్లి ధైర్యంగా వ్యవసాయం చేస్తోంది. ఉత్తమ మహిళా రైతుగా అవార్డు అందుకుంది. అలాంటి మహిళకు ఇవాళ అంతులేని కష్టం వచ్చింది. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం దుగ్గేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కర్ర పని గూడెంలో కర్ర శశికళకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. భర్త మరణంతో ఆమె వ్యవసాయంలోకి అడుగుపెట్టింది. మొదట వ్యవసాయంలో ఇబ్బందులు తలెత్తాయి. గ్రామస్తులు, స్థానికులు ఆమెను అవమానించారు.. నిరుత్సాహపరిచారు.. అయినా ఎక్కడ బెదరకుండా అద్భుతాలు సృష్టించింది. ఉత్తమ మహిళా రైతుగా ఎదిగి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంది. అనేక విజయాలు సాధించిన ఆమె ఇవాళ ఓ ఇటుకబట్టీ వ్యాపారి నిర్వాకం వల్ల తన వ్యవసాయ క్షేత్రం కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని మదనపడుతోంది. ఓ వ్యాపారి ఎలాంటి అనుమతులూ లేకుండా శశికళ వ్యవసాయ క్షేత్రం పక్కనే 30 ఎకరాలు లీజుకు తీసుకొని అక్రమంగా ఇటుకబట్టీ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం పై ఆమె పొల్యూషన్ ఫైర్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా అతనికే సహకరించారు. ఇటుకబట్టీకి మిషన్ భగీరథ పైప్ లైన్ వేయించారు. బట్టి వల్ల బూడిద నిప్పు రవ్వలు పొలల్లో పడుతున్నాయని శశికళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గడ్డివాము.. గోశాల.. మీద నిప్పు రవ్వలు పడి అగ్ని ప్రమాదం సంభవించే అవకాశముందని వాపోతుంది. పాలిహౌస్, నర్సరీ చెట్ల మీద బూడిద పడి చెట్లు చనిపోతున్నాయని చెబుతోంది. వెంటనే బట్టి మూసివేయించాలని లేకపోతే తాను వ్యవసాయ క్షేత్రం వదిలిపెట్టే పరిస్థితి వస్తుందని ఆదర్శ మహిళా రైతు కన్నీటి పర్యంతమవుతుంది. మహిళా సాధికారత కోసం అండగా ఉంటామంటూ ఊగిపోయే.. ఊదరగొట్టే.. ప్రభుత్వం శశికళ లాంటి మహిళలకు ప్రోత్సాహం అందిస్తే చాలని స్థానికులు అంటున్నారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి బట్టి వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శంషాబాద్ లో దారుణం.. యువతి దారుణ హత్య

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వెటర్నరీ డాక్టర్ గా పని చేస్తున్న ప్రియాంక రెడ్డిని దారుణంగా హత్య చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం, చటాన్ పల్లి గ్రామ శివారులో పెట్రోల్ పోసి నిప్పంటించారు కొందరు. దహనమవుతున్న మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు.ఈ ఘాతుకానికి ఎవరు పాల్పడ్డారు అనే అంశం కలకలం రేపుతుంది. ఈ సంఘటనకు సంభందించి ప్రస్తుతానికి పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటన పై విచారణ కొనసాగుతుంది. విచారణలో అసలు ప్రియాంకా రెడ్డిని ఎవరు చంపారు..ఎందుకు చంపారు..దేనికోసం చంపారు.. అనే విషయాన్ని కనుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేపడుతున్నారు. ప్రయాంకా రెడ్డి ఓ వెటనరీ డాక్టర్ గా పని చేస్తొందని తెలిసింది. ప్రియాంకా తన విధులు నిర్వహించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. మెయిన్ రోడ్ హైవే మీద అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి తగులబెట్టారు. రాత్రి సమయంలో తాను షంషాబాద్ లోని ఇంటికి వస్తున్న సమయంలో తన స్కూటీ టైరు పంక్చర్ అవ్వడంతో రోడ్డు పై నిలబడి తన సోదరికి కాల్ చేసి మాట్లాడింది. దాదాపు అరగంట సేపు మాట్లాడిన తరువాత సిగ్నల్ కట్ అవ్వడంతో ఇంట్లో వాళ్లు కంగారు పడ్డారు.ఇవాళ ఉదయం చటాన్ పల్లి దగ్గర స్థానికులు మృతదేహం కాలుతుండడం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.స్కూటీ అధారంగా మృతదేహం ప్రియాంకా రెడ్డిగా గుర్తించారు పోలీసులు.

ఐదేళ్లలో బాబు చెయ్యలేనిది.. జగన్ ఐదు నెలల్లో ఎలా చేస్తాడు?

ఐదేళ్లూ అధికారంలో ఉన్న చంద్రబాబు చేయనిది ఐదు నెలల్లో జగన్ చేస్తారా అని ప్రశ్నించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు అన్ని టెంపరరీ పనులు చేశారని జగన్ శాశ్వత కట్టడాల కోసం ప్రయత్నిస్తున్నారు ఆయన. బాబు ఎక్కడ అడుగుపెడితే అక్కడ వినాశనమేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవలంబించిన విధానాల వల్లే రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాజధానిలో అడుగు పెట్టాలంటే క్షమించండని రైతుల్ని బాబు వేడుకోవాలి అంటున్నారు. లక్షా తొమ్మిది వేల కోట్లు రాజధానికి కావాలని చెప్పి నాలుగు వేల కోట్లతో టెంపరరీగా అసెంబ్లీలు.. సెక్రటేరియట్లు.. హైకోర్టులు కట్టిన వ్యక్తి చంద్రబాబే అని గుర్తు చేశారు. జగన్ రెడ్డి గారు అన్ని పర్మినెంటుగా చేయాలని గ్రాఫిక్స్ ఉండకూడదని భావిస్తున్నారని అన్నారు. తాను చేయగలిగిందే చెబుతాడని.. చెప్పాలనే అభిప్రాయంతో ముందుకెళ్తున్న సమయంలో వచ్చి.. ఐదు నెలల్లో జగన్ ఏమి చేయలేదని అనడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు యాత్రలో కొందరు రైతులు చంద్రబాబునాయడుని రావద్దని చెప్పి నినాదాలు చేశారని వెల్లడించారు. రైతులు తమకు ఎంతో మేలు జరుగుతుందని ఇచ్చిన భూములకు తగిన న్యాయం జరగలేదని అన్నారు. ఏమాత్రం అభివృద్ధి చేయకుండా సిగ్గు శరం లేకుండా ఇవాళ పర్యటణ చేపట్టారని చంద్రబాబు పై తీవ్రంగా మండిపడ్డారు.అమరావతికి వెళ్లి చంద్రబాబు ఏం పరిశిలిస్తారని ఆయన మండిపడ్డారు. రైతులు ధారాదత్తం ఇచ్చిన భూముల్లో ప్రైవేటు కాలేజీల నుంచి కట్టబేడుతున్నారని.. సభలో హైకోర్టు గురించి ప్రస్తావిస్తే కానీ హైకోర్టు కట్టడం గురించి ఆలోచించలేదన్నారు. ఇలా విఫలమయ్యారు కాబట్టే చంద్రబాబు గో బ్యాక్ అని అమరావతి ప్రజలు తిరుగుబాటు వ్యక్తం చేశారని వెల్లంపల్లి ఆరోపించారు.

బయటపడనివి మరెన్నో... నయీం ఆస్తుల విలువ అక్షరాల రూ.1200 కోట్లు

గ్యాంగ్ స్టర్ నయీం కేసులో ఆదాయపు పన్ను శాఖ విచారణ వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా నయీం భార్య హసీనాబేగంను ఐటీ అధికారులు విచారించారు. నయీం ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని హసీనా బేగం ఐటి అధికారులకు వెల్లడించారు. నల్లగొండలోని ఇంటితో పాటు మరి కొన్ని ఆస్తులని తాను దర్జీ పని చేసి సంపాదించినట్లు హసీనా బేగం ఐటీ అధికారులకు వివరించినట్టు తెలిసింది. ఇతర ఆస్తులకు సంబంధించి తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటావిడ పర్హాన పేరుతో ఉన్న ఆస్తుల గురించి కూడా ఐటీ అధికారులు హసీనాబేగంను ఆరా తీశారు. ఫర్హానా పేరుతో హైదరాబాద్ , సైబరాబాద్ తో పాటు రంగారెడ్డి, నల్గొండలో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఒక్క ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని గుర్తించారు ఐటీ అధికారులు. ఆ కోణంలోనూ హసీనా బేగం నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకుండానే విలువైన భూముల సెటిల్ మెంట్ లతో నయీం పెద్ద మొత్తంలో సంపాదించడాన్ని అధికారులు నిర్ధారించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత సిట్ నిర్వహించిన దర్యాప్తులో గుర్తించిన అంశాల్ని ఐటీ అధికారులు సేకరించారు. సిట్ నివేదిక ప్రకారం తాము గుర్తించిన ఆస్తుల అనధికారికమైనవి ఆయా ఆస్తులకు ఐటీ చెల్లించలేదని నిగ్గు తేల్చిన అధికారులు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. కిడ్నాప్ లు, బెదిరింపులు, సెటిల్ మెంట్ లు, భూకబ్జాలతో నయీం సంపాదించిన ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. నయీం ఎన్ కౌంటర్ జరిగిన శంషాబాద్ లోని మిలీనియం టౌన్ షిప్ లోని ఇల్లు, నయీం బావమర్ది సాజిద్ పేరుతో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బంధువులు.. గ్యాంగ్ సభ్యుల బినామీ పేర్లతో నయీం రిజిస్ర్టేషన్ చేయించినట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లలో బహిర్గతమైంది. నయీం బినామీ ఆస్తుల విలువ మార్కెట్ లో రేటు ప్రకారం సుమారు 1200 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. విచారణ అనంతరం త్వరలోనే ఆయా ఆస్తుల్ని ఐటీ శాఖ స్వాధీనం చేసుకోనుంది. నయీం ఆస్తుల్ని అటాక్ చేసేందుకు ఐటి శాఖ రంగం సిద్ధం చేసింది. ఆస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోరుతూ ఢిల్లీలోని అడ్జ్యుటికేటింగ్ అథారిటీలో ఐటీ అధికారులు ఇది వరకే పిటీషన్ దాఖలు చేశారు. ఆదాయ మార్గం లేకుండా వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టడంతో సిట్ నిర్వహించిన ఆధారాల మేరకు ఈడీ కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది. తెలంగాణలోని ఆయా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర ,ఛత్తీస్ గడ్ రాష్ట్రాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది. అరెస్టు సమయంలో నిందితులు ఇచ్చిన సమాచారం ప్రకారం జరిగిన సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా గ్యాంగ్ స్టర్ కు 1015 ఎకరాల భూములు..1,67,117 చదరపు అడుగుల ఇళ్ళస్ధలాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఎన్ కౌంటర్ తరువాత హైదరాబాద్ లోని నయీం డెన్ లో నిర్వహించిన సోదాల్లో 2.08 కోట్ల నగదు,1.90 కిలోల బంగారు ఆభరణాలు,258 సెల్ ఫోన్ లు వేర్వేరు వ్యక్తుల పేరుతో ఉన్న 203 ఒరిజినల్ రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ లో పేలుడు పదార్ధాలు ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మైత్రి తెచ్చిన కష్టాలు.. శివసేనపై విరుచుకుపడుతున్న అమిత్ షా & కో

  మహారాష్ట్ర లో మూడు దశాబ్దాల మైత్రి బంధాన్ని తెంచుకొని ఎన్సీపీ-కాంగ్రెస్ తో జట్టు కట్టిన శివసేనపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. మహారాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శివసేన నేతలు అవమానించారంటూ బీజేపీ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై తాజాగా బీజేపీ స్పందించింది. సీఎం పదవిపై వ్యామోహంతోనే బీజేపీ కూటమి నుంచి శివసేన తనంతట తానే విడిపోయిందని కమలదళం మండిపడుతుంది. సీఎం పదవి ఇస్తామని ఎన్నికల ముందు శివసేనకు హామీ ఇవ్వలేదని.. బీజేపీ మరోసారి స్పష్టం చేసింది.  శివసేన మహారాష్ట్ర ప్రజా తీర్పును అవమానించిందని బీజేపీ చీఫ్ అమిత్ షా అన్నారు. ఎమ్మెల్యేలను క్యాంపుల్లో పెట్టి, ఎన్నికల ముందు పెట్టుకున్న పొత్తును వీడిన శివసేన బిజెపిని నిందిస్తోందని ఆయన దుయ్యబట్టారు. సైద్ధాంతికతకు, అన్ని విలువలకు తిలోదకాలిచ్చి శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని విమర్శించారు. సీఎం పదవిపై శివసేనకు తాము ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఉద్దవ్ థాక్రే, ఆదిత్య ఠాక్రే పాల్గొన్న ఎన్నికల ప్రచార సభల్లోనూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారని తాము ప్రతిచోటా చెప్పామని ఆయన గుర్తు చేశారు. మరి అప్పుడెందుకు వారు అభ్యంతరం వ్యక్తం చేయలేదని నిలదీశారు. శివసేన ఎమ్మెల్యేలందరూ తమతో కలిసి గెలిచిన వారేనని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టుకోని వారు శివసేనలో ఏ ఒక్కరూ లేరని తెలిపారు. ప్రచార సభల్లో మోదీవే పెద్ద పెద్ద కటౌట్ లు పెట్టారని ఇవన్నీ దేశ ప్రజలకు మహారాష్ట్ర ప్రజలకు తెలియదా అని ప్రశ్నించారు అమిత్ షా.  మహారాష్ట్ర సీఎం పదవిని శివసేనకు ఇవ్వటంలో ఆంతర్యమేంటని అమిత షా ప్రశ్నించారు. వంద సీట్లు గెలిచిన ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమికే ముఖ్యమంత్రి పదవి దక్కాలి తప్ప శివసేనకు ఇవ్వడమేంటని శరద్ పవార్, సోనియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీన్ని బేరసారాలు కాక ఇంకేమంటారని నిలదీశారు బీజేపీ చీఫ్. ఇక దీని పై స్పందించిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్, అమిత్ షా ఏమైనా మాట్లాడగలరని అన్నారు. మోడీ కటౌట్ లు పెట్టుకొని శివసేన ఎమ్మెల్యేలు గెలిస్తే బాల్ థాక్రే పోస్టర్ పెట్టుకుని బిజెపి ఎమ్మెల్యేలు గెలిచారు అన్నారు. మొత్తానికి మైత్రి బంధానికి తిలోదకాలిచ్చిన శివసేనపై బిజెపి ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తోంది. మహారాష్ట్ర కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అది ఎన్నాళ్లపాటు అధికారంలో ఉంటుందనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

బీజేపీకి మరో గట్టి దెబ్బ.. కర్ణాటకలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం!!

  మహారాష్ట్రలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రమాణస్వీకారం చేసిన మూడు రోజులకే బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే కొద్ది రోజుల్లో కర్ణాటకలో కూడా బీజేపీకి ఇలాంటి షాకే తగిలే అవకాశముందని తెలుస్తోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లు గెలిచినా అధికారం చేపట్టడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ మాత్రం దాటలేదు. దీంతో కాంగ్రెస్‌, జేడీఎస్ లు కలసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే కేవలం 9మంది ఎమ్మెల్యేలు తక్కువై అధికారం చేపట్టలేకపోయిన బీజేపీ.. సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. చివరకు ఈ ఏడాది జూలైలో విజయం సాధించింది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, సంకీర్ణ ప్రభుత్వానికి అసెంబ్లీలో మెజారిటీ లేకుండా చేసింది. యడియూరప్ప సీఎంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కూలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే చేరికతో ప్రస్తుతం బీజేపీ బలం 105 గా ఉంది. కాంగ్రెస్-జేడీఎస్ లకు చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో బీజేపీకి మెజారిటీ సరిపోయింది. కానీ ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీలో ఉంటే బీజేపీకి మెజారిటీ లేనట్టే. అందుకే ఇప్పుడు బీజేపీకి ఉపఎన్నికలు కీలకం కానున్నాయి. డిసెంబర్ 5 న కర్ణాటకలో 15 స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు డిసెంబర్ 9 న తేలనున్నాయి. ఉపఎన్నికల్లో కనీసం 7 స్థానాలు గెలిస్తేనే బీజేపీ సర్కార్ సేఫ్‌జోన్‌ లో ఉంటుంది. లేదా మూడు నెలల ముచ్చటగానే మిగిపోయే అవకాశముంది. ఉపఎన్నికల్లో సత్తాచాటి బీజేపీకి షాక్ ఇవ్వాలని కాంగ్రెస్-జేడీఎస్ దృఢనిశ్చయంతో ఉన్నాయి. ఉపఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తే.. డి.కె.శివకుమార్‌ను సీఎం చేస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే దేవేగౌడ కాంగ్రెస్ పార్టీకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఉపఎన్నికల్లో బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచి అధికారం నిలుపుకుంటుందో లేక మహారాష్ట్రలో లాగా దెబ్బ తింటుందో చెప్పాలి.

బాబు అమరావతి పర్యటన... కాన్వాయ్ పైకి రాళ్లు, చెప్పులు

  ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ ఉద్దేశాన్ని ప్రజలకు వివరించేందుకు చంద్రబాబు అమరావతి యాత్ర చేపట్టారు. కాసేపటి క్రితమే ఉండవల్లిలోని తన నివాసం నుంచి టిడిపి నేతలతో కలిసి బయలుదేరారు. దారివెంటా టిడిపి శ్రేణులు స్థానికులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఎన్నికల తర్వాత తొలి సారి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులతో ఆయన ముచ్చటించనున్నారు. రాజధానిలో నిలిచిపోయిన నిర్మాణాలనూ చంద్రబాబు పరిశీలించనున్నారు. మరోవైపు అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా వైసీపీ వర్గీయులు ఆందోళనకు దిగాయి. నల్లబాడ్జీలు ధరించి చంద్రబాబు గో బ్యాక్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. పలుచోట్ల చంద్రబాబు కాన్వాయ్ పైకి రాళ్లు రువ్వారు. చెప్పు లు విసిరారు. అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. వెంకటాయపాలెం దగ్గర పలువురు చంద్రబాబు కాన్వాయ్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు.దీని పై టిడిపి కార్యకర్తలు అభ్యంతరం తెలిపారు. నినాదాలు చేయవద్దంటూ హెచ్చరించారు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు టిడిపి కార్యకర్తలను.. స్థానికులను.. అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. బాబు అమారావతిలో ఆయన హయాంలో చేపట్టిన పనులు ఇప్పుడు ఎంతవరకు వచ్చాయి అని చూసి జగన్ సర్కార్ ను నిలదీయటానికి ఈ పర్యటణ చేపట్టినట్లు సమాచార. తాను రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకుంటానని వెల్లడించారు.మొత్తానికి వెంకటయ్యపాలెం వద్ద ప్రజలు రెందు వర్గాలుగా చీలిక అయ్యారు. కొంత మంది చంద్రబాబు తమకు ఏ అన్యాయం చేయలేదని జగన్ కూడా పాలనలో బాబు లాగే అభివృద్ధి చేపట్టాలని వారి భావాలు వెల్లడించారు. మరి కొత మంది నేతలు వైసీపీ ప్రజలు రాళ్ళు రువ్వుతూ గో బ్యాక్ అని నినాదాలు చేపట్టారు. వారిని పోలీసులు మరియు రోప్ టీమ్ బృందం తిప్పి పంపించారు. మొత్తానికి  చంద్రబాబు పర్యటణ ఉద్దండ్రాయునిపాలెం చేరుకోగా అక్కడ ప్రజలు కొంతమంది ఘన స్వాగతం పలుకుతూ తమ ప్రియ నేతకు భ్రమ్మరధం పట్టారు. 

శివసేన 16-ఎన్సీపీ 15-కాంగ్రెస్ 13... ఒక్కో పార్టీ నుంచి ఒక్కొక్కరే ప్రమాణం

  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేయనున్నారు. శివాజీ పార్క్‌లో జరగనున్న ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందు డిసెంబర్ ఒకటిన ప్రమాణం చేయాలనుకున్నా, గవర్నర్ సూచన మేరకు ఈరోజే(నవంబర్ 28)న ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇక, ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌ తదితరులు హాజరవుతారని తెలుస్తోంది. అలాగే, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌షాను కూడా ఆహ్వానించామని... వాళ్లు కూడా ఉద్ధవ్ ప్రమాణ కార్యక్రమానికి హాజరవుతారని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. అయితే, తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలంటూ... ఆత్మహత్య చేసుకున్న 400మంది రైతుల కుటుంబాలను ఉద్ధవ్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే, ఎంఎన్‌‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రే‌కు కూడా ఆహ్వానం పంపారు. ఉద్ధవ్ ప్రమాణస్వీకారోత్సవంతో సంకీర్ణ సర్కారు కొలువుతీరుతుండగా, పదవుల పంపకంపైనా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కుదిరింది. శివసేనకు ముఖ్యమంత్రి పదవితోపాటు 15మంది పదవులు దక్కనున్నాయి. ఇక, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రితోపాటు 13 కేబినెట్‌ బెర్త్‌లు... అలాగే కాంగ్రెస్‌కు స్పీకర్‌తోపాటు 13మంత్రి పదవులు లభించేలా మూడు పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఉద్ధవ్ తోపాటు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నుంచి ఒక్కొక్కరు మాత్రమే ప్రమాణం చేయనున్నారు. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై అవగాహనకు వచ్చాక డిసెంబర్ మూడున కేబినెట్ విస్తరణ ఉంటుందని కూటమి నేతలు తెలిపారు.

ఏదో ఒకటి తేల్చండి.. ఆర్టీసీ భవిష్యత్తుపై కేబినెట్ సమావేశం

  టీఎస్ఆర్టీసీ భవితవ్యం నేడు తేలిపోనుంది.కార్మికుల డిమాండ్లతో పాటు రూట్ల ప్రైవేటీకరణపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నది. నిజాం హయాంలో నిజాం పూచికత్తుతో పురుడు పోసుకొని కాలక్రమంలో తెలంగాణ ఆర్టీసీగా మారిన ఈ సంస్థ మనుగడ పై కీలక నిర్ణయాలు వెలువడనున్నాయి. ఐదువేల ప్రైవేటు బస్సులను ఆర్టీసీ రూట్లలో ప్రవేశపెట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. కేంద్ర రవాణా చట్టం కూడా దీనికి పూర్తి వెలుసుబాటు ఇవ్వడం.. హై కోర్టు కూడా రూట్ల ప్రైవేటీకరణ పై అభ్యంతరాలు లేవనెత్తటంతో నేడు జరిగే మంత్రి వర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్టు ప్రకటించారు. అయితే కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోమంటూ సీఎం కార్యాలయం ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ పేరుతో ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రధాన ఎజెండాగా గురువారం నుంచి రెండు రోజుల పాటు మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగుల వయో పరిమితి పెంపుతో పాటు వేతన సవరణపై కూడా చర్చ ఉండే అవకాశాలున్నాయి. 10 నుండి 12 రోజుల్లో పీఆర్సీ నివేదిక ఇవ్వాలని ఈ నెల 10వ తేదీన సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ గడువు ఈ నెల 22వ తేదీన ముగిసింది. వాస్తవానికి అదే రోజు నివేదిక తెప్పించుకొని ఒక కమిటీ వేసి నివేదికపై అధ్యయనం చేస్తారని ప్రచారం జరిగింది. తరువాత వారం రోజుల కు ఉద్యోగ సంఘాల జేఏసీతో సిఎం సమావేశమవుతారని అనుకున్నారు. నివేదిక గడువు ముగిసినా అలజడి లేకపోవటంతో నివేదిక తుదిరూపునకు మరి కొన్ని రోజులు పడుతోందని సంకేతాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాది బడ్జెట్ లోనే ఫిట్ మెంట్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని ఏప్రిల్ 1 నుంచి కొత్త వేతనాలు ఆదుకుంటారని తెలుస్తుంది. దీని పై ఉద్యోగ సంఘాల కు కీలక సంకేతాలందాయి.వేతన సవరణపై ఆశలు ఏవీ లేవని ఏప్రిల్ దాకా ఆగాల్సి ఉంటుంద ని కీలక నేత ఒకరు తమ సంఘం ప్రతినిధులకు సమాచారం అందించారు. దాంతో వేతన సవరణ పై తమకెలాంటి ఆశల్లేవుని ,వచ్చే బడ్జెట్ తర్వాతే జీతాల పెంపు ఉండొచ్చు అని ఉద్యోగ జేఏసీ కీలక ప్రతి నిధి ఒకరు తమ ప్రతినిధులకు స్పష్టం చేశారు.తెలంగాణలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో రద్దయిన పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను మళ్లీ ప్రవేశపెట్టటానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదే పేరుతో కాకుండా కొత్త పేరుతో ఈ నియామకం ఉంటుందని సమాచారం.నేడు,రేపు జరిగే సమావేశాల్లో దీని పై కూడా చర్చించ నున్నట్లు తెలుస్తొంది. పలు రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ పై ప్రజాప్రతినిధులు అధ్యయనం చేశారు. ఆ నివేదిక ఆధారం గానే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం పై చర్చ ఉంటుందని సమాచారం. ప్రస్తుతం టిఆర్ ఎస్ బలం కాంగ్రెస్ నుంచి చేరిన వారితో కలిపి 103గా ఉంది. కానీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి వర్గంలో చోటు కల్పించేలా పరిమితి ఉంది. దీంతో ఎమ్మెల్యేల్లో చాలా మంది మంత్రులు అవుతారని ప్రచారం జరిగినా, చట్ట పరిమితి వల్ల అవకాశం దొరకలేదు. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికి ఆ స్థానంలో కొత్త వారికి చాన్స్ ఇస్తారని ప్రచారం జరిగినా అది కుదరలేదు. ఈ పరిస్థితుల్లో మంత్రులను వదులుకోకుండా ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తే బాగుంటుందని చర్చలు జరుగుతున్నాయి.  

సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యం... చరిత్రకెక్కిన సేన పోరాటం...

ఊహించని ట్విస్టులు, మలుపుల తర్వాత మరాఠా పీఠం చివరికి పులి పంజాకి చిక్కింది. అయితే,  ముఖ్యమంత్రి పదవి, అధికారం కోసం పాతికేళ్ల స్నేహాన్ని, నమ్మిన సిద్ధాంతాలను అలవోకగా వదిలేసింది. దాదాపు అన్ని రాజకీయ పార్టీల్లాగే తమకు సిద్ధాంతం కాదు... పదవే ముఖ్యమని తేల్చేసింది. శివసేనకు అధికారం, సీఎం పదవి కొత్త కాదు... కానీ ఈసారి చేసిన పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. నిజమే, శివసేనకు అధికారం కొత్తకాదు. 1995లో, 2014లో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. అయితే, మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేనది ప్రత్యేకమైన పాత్ర. పొలిటికల్ కార్టూనిస్టయిన బాల్ ఠాక్రే ముంబై రాజకీయాల్లోకి చాలా విచిత్రంగా అడుగుపెట్టారు. ముంబైలో మరాఠీలను కాదని, వలసవాదులకు ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోందంటూ పెద్ద ఉద్యమానికే బీజం వేశారు. అప్పట్నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ముంబైలో శివసేన వేళ్లూనుపోయింది. స్థానికతను లేవనెత్తి మరాఠీల మనసుల్లోకి చొచ్చుకుపోయింది. అలాగే, కరుడుగట్టిన మత ఛాందసవాద పార్టీగా ముద్రపడిన శివసేన, ఆ తర్వాత నెమ్మదిగా మరాఠీ అనుకూల సిద్ధాంతం నుంచి హిందూత్వ అజెండా దిశగా అడుగులు వేసింది.  ఇక, మహారాష్ట్రను ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ కాగా, తొలి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రి పీఠం శివసేనకే దక్కింది. బీజేపీ సహాయంతో 1995 నుంచి 99వరకు మహారాష్ట్రను శివసేన ఏలింది. అయితే, బీజేపీ-సేన మధ్య స్నేహం కొంతకాలం చెడింది. వాజ్ పేయి ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా ఉన్నా, ఆ తర్వాత 2014వరకు పెద్దగా సత్సంబంధాలు కొనసాగలేదు. అయితే, 2014 ఎన్నికల్లో కూడా విడివిడిగానే పోటీచేశాయి. అయితే, చర్చల అనంతరం అటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వాల్లో శివసేన భాగస్వామిగా చేరింది. కానీ, రెండు పార్టీల మధ్య మళ్లీ విభేదాలు రావడంతో... 2018లో బంధం తెగింది. అయితే, 2019 ఎన్నికల్లో మళ్లీ కలిసి పోటీ చేశాయి. అయితే,  ఈసారి 50-50 ఫార్ములాను తెరపైకి తెచ్చిన శివసేన... ముఖ్యమంత్రి పీఠం చెరో రెండున్నరేళ్లు పంచుకోవాల్సిందేనంటూ పట్టుబట్టింది. అందుకు బీజేపీ ఒప్పుకోకపోవడంతో... మళ్లీ ఇద్దరి మధ్య తెగదెంపులు జరిగాయి. అయితే, ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలనుకున్న శివసేన... బీజేపీతో పాతికేళ్ల స్నేహబంధాన్ని తెంచుకుని.... సైద్ధాంతిక విభేదాలున్న ఎన్సీపీ, కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అలా, సీఎం పీఠం కోసం శివసేన చేసిన రాజకీయం.... హిందూత్వ వాదాన్ని, సిద్ధాంతాలను పక్కనబెట్టిన విధానం ఇప్పుడు చర్చనీయాంశమైంది.