హైదరాబాద్ లో మరో దారుణం.. పట్టపగలు 35 ఏళ్ల మహిళ సజీవ దహనం

  శంషాబాద్ ప్రాంతం వరుస హత్యలతో అట్టుడుకుతోంది. ప్రియాంక రెడ్డి దారుణ హత్యను మరువక ముందే హైదరాబాద్ శివార్లలో మరో ఘోరం జరిగింది. 35 ఏళ్ల మహిళను దుండగులు తగులబెట్టారు. శంషాబాద్ సిద్ధులగుట్ట సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోచమ్మ దేవాలయం పక్కనే ఆ మహిళను దహనం చేశారు. ఆమె చీర ధరించి ఉంది, చేతికి గాజులు ఉన్నాయి, ఆమెని ప్రియాంక హత్య తరహాలోనే మరో చోట చంపేసి డెడ్ బాడీని తగులబెట్టారా లేద అక్కడికే తీసుకొచ్చి చంపేసి తగులబెట్టారా అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రియాంకని చంపిన ప్రాంతానికి ఈ మహిళ డెడ్ బాడీ కనిపించిన ప్రాంతానికి దూరం కేవలం ఒక్క కిలో మీటర్ మాత్రమే. ఈ మహిళ ఎవరన్నది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం మహిళల మిస్సింగ్ ఫిర్యాదులను పోలీసులు సేకరిస్తున్నారు.  సిద్ధుల గుట్ట దగ్గర మహిళను తగలబెట్టిన ప్రాంతానికి 200 ల మీటర్ల దూరంలో హీరో రవితేజ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు వచ్చిన నలుగురు స్థానికులు మంటలను గమనించి ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 70 శాతానికి పైగా బాడీ కాలిపోయింది. 48 గంటల వ్యవధిలో 2 ఘటనలు ఇలా కలకలం రేపుతున్నాయి. ఇద్దరూ మహిళలే, ఇద్దరి డెడ్ బాడీలను తగలబెట్టారు. 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు, ఇవాళ పోస్టుమార్టం చేయనున్నారు.  సజీవ దహనం జరిగిన స్పాట్ ని శంషాబాద్ డిసిపి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్స్ కూడా రంగంలోకి దిగాయి. హత్య జరిగిన ప్రదేశంలో కొన్ని ఆధారాలను సేకరించారు. మృతురాలి చెప్పులు, దుస్తులను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. సమీపంలోని పోచమ్మ గుడిలో ఉన్న అయ్యప్ప స్వాములను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిసరాలు నేరాలకు అడ్డాగా మారుతున్నాయి. ఖాళీగా ఉన్న రియల్ ఎస్టేట్ భూముల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు.

పక్కా ప్లాన్.. ప్రియాంకని ఇలా ట్రాప్ చేశారు.. ఆ తరువాత 5 గంటలు?

  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశు వైద్యురాలి అత్యాచారం హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. అఘాయిత్యానికి పాల్పడే క్రమంలో అత్యంత ఘోరంగా ప్రవర్తించారు నిందితులు. మృగాల తరహాలో విరుచుకుపడి 45 నిమిషాల పాటు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి మరీ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.  షాద్ నగర్ పశు వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనలో నిందితుల పైశాచికత్వం బయటపడుతోంది. స్కూటర్ కోసం వేచి చూస్తున్న ప్రదేశం నుంచి మహ్మద్, శివ, నవీన్ లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో బాధితురాలు సాయం కోసం అరిచినా వాహనాల రాకపోకల శబ్దానికి ఆమె వేదన అరణ్యరోదనగానే మిగిలింది. ఆ తర్వాత దుండగులు ఆమె నోరు నొక్కి లాక్కెళ్లారు. ఆమె బయటకు కనబడకుండా లారీని అడ్డుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిఘటించేందుకు ప్రయత్నించినా మద్యం మత్తులో ఉన్న దుండగులు ఆమె కాళ్లు చేతులు పట్టుకొని పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అంతటితో ఆగక వారి వెంట తెచ్చుకున్న మద్యాన్ని బలవంతంగా ఆమె నోట్లో పోశారు. రాత్రి 10 గంటల 20 నిమిషాల వరకు రాక్షస కాండను కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది.  ఘటనాస్థలిలో పోలీసులు ప్రియాంక రెడ్డి లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మొదట్లో మొబైల్ ఫోన్, స్కూటర్ కనిపించలేదు. గురువారం సాయంత్రం కొత్తూరు జేపీ దర్గాకు సమీపంలో పోలీసులు ద్విచక్ర వాహనాన్ని గుర్తించారు. ఫోన్  నిందితుల దగ్గర ఉండొచ్చని పోలీసులు భావించారు. కానీ వారి వద్ద ఫోన్ దొరకలేదు. మరోవైపు నలుగురు నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరిగింది. బుధవారం రాత్రి సోదరితో ఫోన్ సంభాషణలోనూ ఓ చిన్న కుర్రాడు పంచర్ వేయించేందుకు బండిని తీసుకెళ్లినట్లు స్పష్టంగా పేర్కొన్నారు. పోలీసులు మాత్రం నిందితులంతా 20 ఏళ్లకు పైబడిన వారేనని మనకు స్పష్టం చేశారు. కేసులో పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఆ నాలుగు నెలల ట్వీట్స్ ఎక్కడ పవన్ కల్యాణ్ ?

ప్రశ్నిస్తాను అంటూ ట్విట్టర్ ను వజ్రాయుధంలా వాడుకుంటూ వాడీవేడీ ట్వీట్లతో ప్రత్యర్థి రాజకీయపక్షాలకు పవన్ కల్యాణ్ వేడి పుట్టించారు. ముఖ్యంగా సాధారణ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ ట్వీట్లతో తెలుగుదేశం, వైసీపీల పై యుద్ధం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఆయన ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. ఆయన ట్వీట్లు అప్పట్లో సంచలనంగా మారాయి. ఏ అంశంపై ఎప్పుడూ ఎలాంటి ట్వీట్ తో దాడి చేస్తారా అని రాజకీయ పక్షాలూ బెదురుతూ ఎదురుచూసేవి, ఆ ట్వీట్ లకు కౌంటర్ ఇచ్చేందు కు సిద్ధమయ్యేవి.కాకపోతే ఈ సారి ఎక్కువగా అధికారంలో ఉన్న వైసీపీనే ఆయన టార్గెట్ చేశారు. ఇది ఇలా ఉండగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ఎకౌంట్ లో చేసిన ట్వీట్లు కనిపించడం లేదు అంటు జనాలు ఆశ్చర్యానికి గురి అయ్యారు. ఈ విషయం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతూ సడన్ గా ఆయన ట్వీట్లన్నీ ఏమై పోయాయనే చర్చ మొదలైంది.4 నెలల కాలంలో అసలు పవన్ ట్వీట్లే చెయ్యలేదా ఏంటి ?... మరి సడన్గా 4 నెలలపాటు ఆయన ట్విట్ లేవీ కనిపించకపోవటంతో..... అసలు ఏం జరిగిందా అని వైసీపీతో పాటు ఆయనను ఫాలో అవుతున్నవారు ఆలోచనలో పడ్డారు. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందనే అనుమానాలు వస్తున్నాయంటున్నారు. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ కొంతవరకు టిడిపికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ బాగా నడుస్తోంది. అలాగే ఆయన బీజేపీతో కూడా సన్నిహితంగా మెలుగుతున్నారని గుస గుసలు విన్పిస్తున్నాయి. వచ్చే నెలలో తెలుగుదేశం పార్టీతో కలిసి వైసీపీ సర్కారుపై పోరాడాలని నిర్ణయించుకున్నారని.... ఏపీ మొత్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఆయన గత 4 నెలల ట్వీట్లను డిలీట్ చేశారేమో అని కూడా జనాలు అనుకుంటున్నారు.తెలుగుదేశంతో జత కలిసేటప్పుడు... ఇబ్బంది లేకుండా ఉండాలంటే గతంలో చేసిన ట్వీట్లను తొలగించేస్తే బెటర్ అనుకోని, పవన్ కళ్యాణ్ ఇలా చేసి ఉంటారు అని అంటున్నారు. భవిష్యత్ లో టిడిపి నుంచి... ఎందుకు గతంలో అలా ట్వీట్ చేశావని పవన్ ని ప్రశ్నిస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందనే కారణంగానే డిలీట్ చేసేశారని అనుకుంటున్నారు. మరో పక్క ఆ సమయంలో ఎన్నికల హడావుడిలో ఉన్నందున అసలు ట్వీట్లు ఏమీ చెయ్యలేదని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.ట్వీట్లను తొలగించాల్సిన అవసరం లేదని... పవర్ స్టార్ కు అలాంటి భయాలు ఏమి లేవని చెబుతున్నాయి. ఏదైనా నిర్భయంగా మాట్లాడ్డమే తమ అధినేత నైజమని చెప్పుకొంటున్నాయి. ఆ కాలంలో పార్టీ ఐడీ నుంచి తప్ప పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అకౌంట్ నుంచి ట్వీట్ లేవీ చెయ్యలేదని వాదిస్తున్నాయి. కానీ ఆంధ్రలోని జనాలు మాత్రం దీని వెనుక ఏదో మతలబు ఉందని చెవులు కొరుక్కుంటున్నారు. ఏకంగా 4 నెలల పాటు ఒక్క ట్విట్ కూడ చేయకుండా పవన్ ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఏదైనా ఈ విషయంపై పవన్ మరియు కార్యకర్తలకు మాత్రమే తెలియాలని ముక్తాయిస్తున్నారు.

ఆర్టీసీ పై మరో ముందడుగు వేయనున్న కేసీఆర్

  తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాలకు చరమ గీతం పాడే విధంగా సంస్థ యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఆర్టీసీ గుర్తింపు యూనియన్ టీఎంయూ కార్యాలయానికి బస్ భవన్ అధికారులు తాళం వేశారు. యూనియన్ నాయకులకు విధుల నుంచి మినహాయింపును ఆర్టీసీ రద్దు చేసింది. రాష్ట్రం లోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ ఒకటి ఆదివారం నాడు ప్రగతి భవన్ లో సమావేశం కావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ప్రతి డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని వారికి తగిన రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి అని ఆర్టీసీ ఎండీని సీఎం ఆదేశించారు. సమావేశానికి పిలిచే ఐదుగురిలో ఖచ్చితంగా ఇద్దరు మహిళా ఉద్యోగులు ఉండాలని అన్ని వర్గాలకు చెందిన కార్మికుల భాగస్వామ్యం ఉండేలా చూడాలి అని సీఎం కోరారు. డిసెంబర్ ఒకటిన మధ్యాహ్నం 12 గంటల వరకు కార్మికులను ప్రగతి భవన్ తీసుకు రావాలని వారికి ప్రగతి భవన్ లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. మధ్యాహ్న భోజనం అనంతరం కార్మికులతో ముఖ్యమంత్రి నేరుగా మాట్లాడతారు. ఆర్టీసికి సంబంధించిన అన్ని విషయాలనూ కూలంకషంగా చర్చిస్తారు. ఈ సమావేశానికి రవాణ శాఖ మంత్రి అజయ్ కుమార్ తో పాటు ఆర్టీసీ ఎండీ, ఈడీలు, ఆర్ఎంలు, డివిఎంలను ఆహ్వానించారు. మరి ఈ డిసెంబర్ 1 కి ఆర్టీసీ పై పూర్తి స్థాయి చర్యలు జరగనున్నట్లు సమాచారం.

విజయనగరం జనానికి జగన్ ఫోటో తప్ప ఎమ్మెల్యేలు కనిపించట్లేదు!!

  విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేల జాడ అంతగా కనిపించడం లేదు. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు బయటకు వచ్చేందుకు కూడా మొహమాటపడుతున్నారు. వారికి జనాలు అవసరం లేదా లేక జనాలకి వారి అవసరం లేదో తెలియటం లేదు. 2019 ఎన్నికల్లో జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ పార్టీ కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. గెలిచిన వారిలో బొత్స, రాజన్నదొర వంటి సీనియర్లు కొందరైతే అలజంగి జోగారావు , శ్రీనివాసరావుల వంటి జూనియర్లు ఉన్నారు. జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికైన నేతలు విజయోత్సాహంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇక నియోజికవర్గాలకు తామే రారాజులమంటూ లోలోపలే పొంగిపోయారు. తమ మాటే శాసనం తమ బాటే రహదారి అనుకుంటూ మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు విజయోత్సాహంతో నియోజకవర్గాల్లో బాగానే తిరిగారు. తమ వద్దకు వచ్చి పోయె అనుచరులు, అభిమానుల సందడి తో వారి ఇల్లు కళకళలాడుతుండేవి. నెలలు గడుస్తున్న క్రమంగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద సందడి తగ్గింది అనుచరుల తాకిడి కూడా చల్లబడింది. వివిధ పనుల కోసం వచ్చే వారి సంఖ్య క్రమంగా పడిపోతూ వచ్చింది.  ప్రస్తుతం ఎమ్మెల్యేలను పట్టించుకునే వారు కరువయ్యారు.ఇప్పుడు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలంతా ముసుగేసుకుని కూర్చున్నారంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేలకు ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదంటూ చర్చించుకుంటున్నారు. తాము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఎదురుగా కనిపించిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలన్నీ నేరుగా తమ అకౌంట్లలోకే చేరిపోతుంటే ఇక ఎమ్మెల్యేలతో పనేంటని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేల అనుచరులు.. అభిమానులది అదే బాటగా మారింది. నియోజకవర్గాలలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదు. ఇక జాబులు పోస్టింగులు అన్ని అధికారుల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఎమ్మెల్యేల సిఫార్సులు చెల్లక పోవడంతో వీరితో పనేముంది అంటూ తప్పించుకుంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం జగన్ టూ జనం అన్న రీతిలో పరిస్థితులు మారడం జనానికి జగన్ ఫోటో తప్ప ఎమ్మెల్యేల కానరావడం లేదంటూ ఎమ్మెల్యేలు మాత్రం బిక్కమొహాలు వేసుకొని చూస్తున్నారు.  

సీఎం కుర్చీ కోసం తండ్రి నేర్పిన విలువలను విడిచిన ఉద్ధవ్ థాక్రే

  హిందుత్వ పునాదులు.. మరాఠా రిజర్వేషన్ ల డిమాండ్లతోనే 1966 లో మహారాష్ట్రలో శివసేన ఆవిర్భవించింది. కరుడు గట్టిన హిందూ వాదంతోనే మరాఠాల కోటలో కాంగ్రెస్ కు ఎదురు నిలిచారు బాల్ ఠాక్రే. ఆ తరువాత కాలంలో మరో హిందూత్వ పార్టీ బీజేపీతో జట్టుకట్టారు. కాంగ్రెస్ ను కట్టడి చేయడం హిందూ మత వ్యాప్తి మరాఠాల రిజర్వేషన్ల కొరకు బీజేపీతో కలిసే ప్రయాణం చేసింది శివసేన. కాని ప్రస్తుత పరిణామాలతో ఇప్పుడు రూటు మార్చింది. వ్యతిరేకించిన కాంగ్రెస్ ఎన్సీపీలతోనే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు బాల్ ఠాక్రే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రే.  బాల్ ఠాక్రే జీవించి ఉన్నంత కాలం ఆయన కుటుంబం నుంచి ఎవరు ఎన్నికల్లో పోటీ చేయలేదు. కుటుంబం నుంచి ఎవరూ కూడా ప్రభుత్వాల్లో ఉన్నత పదవులు చేపట్టరని కూడా ఠాక్రే బహిరంగంగా ప్రకటించారు. 2 సార్లు అవకాశం వచ్చినా పార్టీలో సీనియర్ నాయకులకే ముఖ్యమంత్రి పీఠం అప్పగించారు బాల్ ఠాక్రే. వాజ్ పేయి హయాంలో ఎండీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. బాల్ ఠాక్రే మరణించిన ఏడేళ్ల తరువాత ఆయన తనయుడు ఉద్ధవ్ ఠాక్రే తండ్రి వేసిన బాట నుంచి పక్కకు తప్పుకున్నారు. శివసేన మూలసూత్రాల్లో ఒకటైన హిందూత్వని వదులుకున్నారు. బీజేపీని వదిలి కాంగ్రెస్ చెంత చేరారు ఉద్దవ్ ఠాక్రే. అదే విధంగా ఠాక్రేల కుటుంబం నుంచి ఎవరు ఉన్నత పదవులు చేపట్టబోరన్న బాల్ ఠాక్రే నిర్ణయాన్ని కూడా తిరగరాశారు ఆయన తనయుడు ఉద్ధవ్. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా పావులు కదిపిన ఉద్దవ్ ఠాక్రే బిజెపితో దశాబ్దాలుగా సాగుతున్న స్నేహ బంధాన్ని తెంచేసుకున్నారు. ఎన్నికల ముందు కూటమి కట్టినప్పటికీ ఫలితాల తర్వాత బిజెపిని ముప్పుతిప్పలు పెట్టారు. మరాఠా యోధుడిగా పేరు పొందిన శరద్ పవార్ నీడన చేరి మోదీ షా ద్వయాన్ని కంగుతినిపించారు. పార్టీ ఆవిర్భవించిన 50 ఏళ్ల తర్వాత అసెంబ్లీకి పోటీ చేయకుండానే తాను కోరుకున్న విధంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వాన మూడు పార్టీల కూటమి అధికారంలోకి వచ్చింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంయుక్తంగా కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాయి. ఇతర అంశాలు ఎలా ఉన్నప్పటికీ శివసేన మూల సిద్ధాంతాలలో ఒకటైన హిందుత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దానికి బదులుగా ఠాక్రేలకు అసలు పడని సెక్యులర్ విధానాల పరిరక్షణకు ఉద్ధవ్ ఠాక్రే అంగీకరించాల్సి వచ్చింది. సెక్యులర్ విధానాలను తొలుత అంగీకరించని ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం కోసం మాత్రం రాజీపడక తప్పలేదు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లోని తొలి పేరాలోనే రెండు సార్లు సెక్యులర్ అనే పదాన్ని జోడించారు. ఇప్పటి వరకు హిందుత్వ పులిలా గాండ్రించిన శివసేన ఆవు ముఖాన్ని తగిలించుకుంది. ఇకపై రాజ్యాంగంలో పొందు పరిచిన సెక్యులర్ విధానాల పరిరక్షణ పేరుతో గోముఖ వ్యాఘ్రాలులా కనిపించబోతున్నారు శివసైనికులు.

మరో యువతి అదృశ్యం.. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది?

  నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యం కేసు కలకలం రేపింది. హైదరాబాద్ నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మౌనిక అనే యువతి అదృశ్యమై 3 రోజులు గడుస్తున్నా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నెల 26 న తనను ఓ యువకుడు వేధిస్తున్నాడంటూ తండ్రికి మౌనిక ఫోన్ చేసింది. ఆమెకు ధైర్యం చెప్పి.. హైదరాబాద్ కు అన్నయ్యను పంపిస్తానని అతనితో కలిసి ఇంటికి వచ్చేయమని సూచించారు తండ్రి శ్రీనివాస్. బుధవారం (నవంబర్ 27వ తేదీన) అన్నయ్య నందరాజ్.. హాస్టల్ కు వెళ్లి చూడగా మౌనిక అక్కడ లేకపోవడంతో తండ్రికి సమాచారం అందించారు. ఇద్దరూ కలిసి అమ్మాయి కోసం వెతికి చివరకు పోలీసులకు సమాచారమందించారు. ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు మౌనిక హాస్టల్ లో గాలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. తాను ట్యాంక్ బండ్ లో దూకి చనిపోతున్నానని.. నా శవాన్ని తీసుకు వెళ్ళు నాన్నా అంటూ కూడా మౌనిక సూసైడ్ లెటర్ రాసి హాస్టల్ నుంచి మాయమైంది. హాస్టల్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తరువాత మౌనిక ఆటోలో ట్యాంక్ బండ్ వైపు వెళ్లినట్లు సమాచారం . ఆ తర్వాత మౌనిక ఏమైందన్న కోణంలో పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు మొదలు పెట్టారు.

టెర్రరిస్టులకు టెర్రర్.. ఇకపై భారత్ లోకి అడుగుపెట్టాలంటే వణుకు పుడుతుంది

  మన దేశ భద్రతకు మరో తిరుగులేని అస్త్రం దొరికింది. శతృదేశాల నుండి అడ్డదారుల్లో చొరబడే టెర్రరిస్టుల ఆటలను ఇక సాగనివ్వకుండా చేయనుంది. ఏ చిన్న కదలికనైనా ఇట్టే కనిపెట్టేస్తుంది.. అదే కార్టోశాట్ 3 ప్రత్యేకత. 5 ఏళ్ళ పాటు అంతరిక్షం నుంచి నిఘా పెడుతుంది. చంద్రయాన్ 2 ప్రయోగం తర్వాత డీలా పడిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ విజయం ఎంతో హుషారు నిచ్చింది. మరి ఈ ప్రయోగం ద్వారా ఇస్రో ఇంకా ఇలాంటి ఉపగ్రహాలనూ నింగిలోకి పంపింది. నిప్పులు ఎగచిమ్ముతూ నింగి లోకి దూసుకెళ్లింది పీఎస్ఎల్వీ సి 47 రాకేట్. కాసేపటికే కార్టోశాట్ 3 ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అప్పటిదాకా ఎంతో ఉత్కంఠగా చూస్తున్న శాస్త్రవేత్తలలో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. ఆ హాల్ అంతా చప్పట్లతో మారు మోగి పోయింది.  నాలుగు నెలల క్రితం ప్రయోగించిన చంద్రయాన్ 2 నిరుత్సాహపరిచింది, అప్పట్నించి ఏదో తెలియని వెలితి. అదే టైమ్ లో ఎలాగైనా కార్టోశాట్ ౩ ని సక్సస్ చేసి తీరాలన్న కసి. ఇదొక్కటే కాదు అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో శాటిలైట్స్ ఉన్నాయి. వీటన్నింటిని విజయవంతంగా కక్ష్యలో చేర్చి చంద్రయాన్ 2 ప్రయోగం మిగిల్చిన బాధను దూరం చేసుకోవాలనుకున్న శాస్త్ర వేత్తల పట్టుదల ఫలించింది. మొత్తం 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సి 47 రాకెట్ నింగిలోకి తీసుకువెళ్ళింది. ఈ ప్రయోగం ఒక ఇస్రో సైంటిస్ట్ విజయం మాత్రమే కాదు మన దేశం విజయంగా భావించారు. భారత కీర్తి పతాక వినువీధుల్లో మరోసారి రెపరెపలాడింది. ఎందుకంటే ఇది మరి రక్షణ రంగానికి తిరుగులేని ఆయుధం. అంతరిక్షం నుంచి నిరంతరం నిఘా పెట్టే అస్త్రం. ఇప్పట్నించి మరో 5 ఏళ్ల పాటు తిరుగులేని సామర్థ్యంతో పనిచేస్తుంది. శతృదేశాల పన్నాగాలు, టెర్రరిస్టుల కదలికలను కనిపెడుతోంది. ఎప్పటికప్పుడు వారి ఫొటోలు తీసి పంపిస్తుంది, మన సైన్యాన్ని అప్రమత్తం చేస్తుంది. అంతేకాదు మౌలిక సదుపాయాల అభివృద్ధి తీర ప్రాంత వినియోగం గురించి కూడా సమాచారం అందచేస్తుంది. ఇప్పటికే ఓ వైపు పాకిస్తాన్ మరో వైపు చైనా దేశాలు పక్కలో బల్లెంలా మారాయి. ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాదులను భారతదేశం పైకి ఎగదోస్తోంది పాకిస్థాన్. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ మరింత పగతో రగిలిపోతోంది. అటు పాక్ కు వత్తాసు పలికే చైనా కూడా కన్నింగ్ నేచర్ కనబరుస్తోంది. అందుకే మన కేంద్ర ప్రభుత్వం సరిహద్దు భద్రతను మరింత పటిష్టం చేయాలనుకుంది, కార్టోశాట్ తో అది సాధ్యమవుతోంది. పాక్ భూభాగం లోని టెర్రరిస్టు స్థావరాలపై గతంలో మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఆ టైంలో రిసార్ట్ శ్రేణికి చెందిన శాటిలైట్ ఆర్మీకి సహకరించింది. కార్టోశాట్ 3 రీశాట్ కంటే పవర్ ఫుల్, రీశాట్ శ్రేణుల్లో కార్టోశాట్ 3 మూడో తరం ఉపగ్రహం. 25 సెంటీమీటర్ల హై రిజల్యూషన్ తో ఫొటోలు తీసే సామర్థ్యం దీని సొంతం. పాక్ సైనికులు ఉగ్రవాదుల స్థావరాలను ఫొటోలు తీసి మరింత స్పష్టంగా చూపగలుగుతుందని భావిస్తున్నారు.  పీఎస్ఎల్వీ సీ 47 రాకెట్ ద్వారా శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని రెండో లాంచింగ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ప్రయోగం విజయవంతమైన తర్వాత కార్టోశాట్ 3 నుంచి అంటార్కిటికా లోని ఇస్రో కేంద్రానికి సంగీతాలూ అందాయి. ఈ శాటిలైట్ ను భూమికి 509 కిలోమీటర్ల స్థిర కక్ష్యలో ఉంచారు. కార్టోశాట్ ౩ కి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. దీని తయారీకి 350 కోట్లు ఖర్చయింది. ఈ శాటిలైట్ బరువు 1,625 కిలోలు. కార్టోశాట్ 3 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందింది. మిగతావి అమెరికాకు చెందినవే. వీటిలో 12 ఫ్లోప్ ఓర్సి నానో ఉపగ్రహాలు ఉన్నాయి. 5 కిలోల చొప్పున బరువుండే వీటిని డౌ అంటే పావురాలు అని పిలుస్తారు. అమెరికా లోని ప్లానెట్ ల్యాబ్స్ సంస్థ వీటిని తయారు చేసింది. ఇప్పటి దాకా మన దేశం నుంచి 92 డౌ టౌన్ శాటిలైట్ లను ప్రయోగించారు. వీటిలో 66 ఇంకా పని చేస్తునే ఉన్నాయి. ఇక మరోటి మిస్ బెస్ట్ శ్యాటిలైట్ అమెరికాకు చెందిన స్పేస్ ఇంక్ సంస్థ దీన్ని రూపొందించింది. ఉపగ్రహం అందించే డేటాను వివిధ దేశాల్లోని కంపెనీలకు ఈ సంస్థ విక్రయిస్తోంది. ఇస్రో ప్రయోగాల సక్సెస్ రేటు చాలా ఎక్కువ, కానీ చంద్రయాన్ 2 నిరాశపరిచింది. లాస్ట్ మినిట్ లో తలెత్తిన సాంకేతిక లోపం దేశం మొత్తాన్ని నివ్వెరపరచింది. అయినా అది ఫెయిల్యూర్ కాదు. ఎందుకంటే ఇప్పటికే సాఫ్ ల్యాండింగ్ చేసిన ఎన్నో దేశాలకంటే మనం మెరుగైన ఫలితమే సాధించాం. మరి విక్రమ్ లాండర్ విషయంలో అసలేం జరిగింది. వీరిపై ఇస్రో ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయలేదు.

షాదనగర్ రేప్ కేసు.. కాసేపట్లో మీడియా ముందుకు నిందితులు

  ప్రియాంకా రెడ్డి రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితులు అందరూ దొరికారు. మరికాసేపట్లో వారందరిని మీడియా ముందు ప్రవేశపెట్టబోతున్నారు సైబరాబాద్ పోలీసులు. నిందితులు వాడిన లారీని కూడా ట్రేస్ చేశారు పోలీసులు. ట్రేస్ చేసిన లారీని గుర్తించి.. పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళు వాడిన లారీ శ్రీనివాస్ రెడ్డి అనే పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ పాషా కొంతకాలంగా శ్రీనివాస్‌రెడ్డి వద్ద లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మహమ్మద్ పాషాతో పాటు చెన్నకేశవరెడ్డి, జోళ్ల శివా, నవీన్ లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటనకు పాల్పడిన తరవాత ప్రియాంకా రెడ్డిని ఓ దుప్పట్లో చుట్టి అదే లారీలో షాద్ నగర్ కు తీసుకెళ్లారు దుండగులు. అక్కడ ఆమెపై కిరోసిన్ పోసి తగలబెట్టారు. అత్యంత దారుణంగా దాదాపు 70 శాతం ప్రియాంకా రెడ్డి కాలిపోయింది. మొత్తం నలుగురు లారీ డ్రైవర్లు ఈ అఘాయిత్యానికి చేశారు. ఆమెను కొట్టి, హింసించి ఈ దారుణానికి పాల్పడ్డారు. నలుగురి నిందితుల్లో ప్రధాన నిందితుడైన మహ్మద్ భాషా ఫోటో మాత్రమే ప్రస్తుతానికి బయటకు వచ్చింది.

హైటెక్ సిటీ టు రాయదుర్గం మెట్రో ప్రారంభించిన మంత్రి కేటీఆర్

  మాదాపూర్ లోని హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు ఉన్న మెట్రో రూట్ లో రైళ్ళు ఈరోజు ప్రారంభమయ్యాయి. మంత్రులు కేటీఆర్, అజయ్ కుమార్ మెట్రో మార్గాన్ని ప్రారంభించారు. హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు మంత్రులు మెట్రో రైల్లో ప్రయాణించారు. మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి రాయదుర్గం స్టేషన్ లో మెట్రో సేవలు ప్రయాణికులకు అందుబాటు లోకి వచ్చాయి.  మెట్రో రైలు నగర వాసులకు తొలిసారిగా అందుబాటు లోకి వచ్చి నేటికి 2 ఏళ్లు. ఇవాలే హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం వరకు కీలకమైన మరో కిలోమీటరున్నర దూరం అందుబాటులోకి వచ్చింది. మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించిన కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ గురువారం భద్రతా ధ్రువ పత్రం జారీ చేయడంతో ఈ మార్గాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.14,132 కోట్లు ఇందులో 90 శాతం L&T, మిగిలిన 10 శాతం కేంద్రం వ్యయ నిధి కింద నిర్మాణ సంస్థకు చెల్లించింది. రహదారి వెడల్పు, భూసేకరణ, విద్యుత్ స్తంభాల వ్యయాలను రాష్ట్ర ప్రభుత్వం భరించింది. రవాణా ఆధారిత అభివృద్ధి కింద మాల్స్ నిర్మాణానికి L&T మెట్రో అదనంగా రూ.2000 కోట్లు వెచ్చిస్తుంది. అయితే ఇప్పటి వరకూ L&T మాల్స్ కోసం రూ.14,800 కోట్లు ఖర్చు చేసిందని మెట్రో వర్గాలు తెలిపాయి. ఇందులో రూ.3000 కోట్లు ఈక్విటీ మిగిలినది రుణాలుగా సేకరించింది. నిర్మాణ సంస్థకి కేంద్రం 1200 ల కోట్ల సర్దుబాటు వ్యయనిధి అందజేసింది. రాష్ట్రప్రభుత్వం రహదారి విస్తరణ, సుందరీకరణ పనుల కోసం ఇప్పటి వరకు రూ.2800 కోట్ల వరకు ఖర్చు చేసింది.

అమ్మాయిలకు అందుబాటులో.. 112 కు ఫోన్ చేస్తే నిమిషాల్లో మీ ముందుకు పోలీసులు

  అర్థరాత్రి అమ్మయిలు బయట తిరిగిన రోజే స్వాతంత్రం వచ్చినట్లు అని గాంధీ గారు చెప్పారు. సాయంత్రం పూట.. చీకటి పడుతుంది అంటే చాలు అమ్మాయిని బయటకు పంపడానికి భయపడే స్థాయికి దేశం దిగజారిపోయింది. కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఒక అమ్మయిని చూడగానే మనిషిలో ఉండే మృగం క్షణాలలో బయటకి వస్తున్నాడు. అలా అమ్మయిలు చాలాసార్లు ప్రమాదాల్లో చిక్కుకుంటారు. అలాంటి సమయంలో వాళ్ళు సమాచారం ఎవరికి అందించాలో తెలియక ఖంగారు పడుతుంటారు. తాజాగా వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి విషయంలో అదే జరిగింది.చెల్లెలితో ఫోన్ మాట్లాడుతూ కాసేపు మాట్లాడు అని అంటూనే ఉంది కానీ ఆ పరిస్థితుల్లో ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి అడుగు తీసుకోవాలనేది తనకి తెలీలేదు.  అందరి చేతిల్లో ఫోన్లు ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా 112 అనే నెంబరు మీ ఫోన్ లో సేవ్ చేసుకోవాలని.. అది అత్యవసర ఎమర్జెన్సీ నెంబర్ గా పెట్టుకోవాలని అధికారులు వెల్లడిస్తున్నారు. ఏ రకమైన ఎమర్జెన్సీ అయినా సరే మెడికల్.. ఫైర్..ఏదైనా సరే.. ఆడవారి సెక్యూరిటీ.. చైల్డ్ ప్రొటెక్షన్ కాని దేనికి సంబంధించిన ఎమర్జెన్సీ ఉన్నా.. 112 అనే నెంబర్ చాలా ఉపయోగకరమైనది అని తెలియజేశారు. ఒకవేళ ఎవరైనా ఫోన్ ని ఉపయోగించే పరిస్థితిలో లేకపోతే.. ప్రస్తుతం వస్తున్న ప్రతి మొబైల్ లో పానిక్ బటన్ అనేది అందుబాటులో ఉందని వెల్లడించారు. పానిక్ బటన్ అంటే.. ఫోన్లో ఉన్న పవర్ బటన్ ని మూడు సార్లు వరుసగా ప్రెస్ చేస్తే 112 కి ఆటోమెటిగ్గా కనెక్ట్ అయిపోతుందని అధికారులు వెల్లడించారు. దానివల్ల ఆ వ్యక్తి ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు అన్న విషయం తెలిసిపోయి, జిపిఎస్ ద్యారా పోలీసులు ఆ ప్రాంతానికి సులువుగా చేరుకోవచ్చు అని వెల్లడించారు. ఒకవేళ ఆ వ్యక్తి దగ్గర స్మార్ట్ ఫోన్ లేని పక్ష్యంలో నార్మల్ ఫోన్ లో 5 కాని 9 కాని.. ఈ రెండిటిలో ఏదో ఒక కీ ని లాంగ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిగ్గా 112కి కనెక్టవుతుంది అంతేకాక ఆ వ్యక్తి ఎమర్జెన్సీలో ఉన్న విషయాన్ని గుర్తించి అధికారులు మిమ్మల్ని చేరుకోగలగుతారు అని అధికారులు ప్రజలకు జాగ్రత్తలు సూచించారు.

చొప్పదండి తలనొప్పి రాజకీయం.. వ్యక్తిగత విమర్శలతోనే కాలం గడిపేస్తున్నారు

  కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గ రాజకీయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే నిలుస్తాయి. అక్కడి ప్రజాప్రతినిధులు ఒకరి పై ఒకరు చేసుకునే ఆరోపణలు రాజకీయంగా వేడి రాజేస్తాయి. రాజకీయపరంగా విమర్శలు.. ప్రతివిమర్శలు..ఉంటేనే రాజకీయం కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా రాజకీయ విమర్శలన్ని ఆస్తులు.. అవినీతి ఆరోపణల చుట్టూ తిరుగుతుంటాయి. చివరికీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగించడమే కాదు రాజకీయంగా ఇరకాటంలో పడవేస్తుంటాయి. ఇలాంటి వ్యవహారాలు గతంలో కూడా చాలానే జరిగాయి.  రాష్ట్ర విభజన అనంతరం.. చొప్పదండి నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొడిగ శోభపై కూడా ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలే ఎక్కుపెట్టాయి. నియోజకవర్గంలో జరిగే ప్రతి అభివృద్ధికి ఎమ్మెల్యే మాములు వసూలు చేసే వారని.. కమీషన్ లేనిదే సంతకాలు పెట్టేవారు కాదంటూ.. ఆరోపణలొచ్చాయి. ఇది రెండేళ్ళ క్రితం నాటి కథ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఆమె స్థానంలో సుంకె రవిశంకర్ తెరమీదకొచ్చారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. అవినీతి ఆరోపణలతో చొప్పదండి నియోజక వర్గ రాజకీయాలు మళ్లీ రెండేళ్లు వెనక్కి వెళ్లాయి. రవిశంకర్ పై కూడా అక్రమాస్తులకు సంబంధించి ఆరోపణలు రావడంతో చర్చ మొదలైంది. శోభకు ఎదురైన పరిస్థితులే ఇప్పుడు రవిశంకర్ కు ఎదురవుతున్నాయి. మరిప్పుడు ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే డిస్కషన్ కార్యకర్తల్లో మొదలైంది.  మరోవైపు ప్రతిపక్షాలకు తమ పార్టీ నుంచే ఎవరో ఒకరు లీకులిస్తున్నారనే అనుమానాలు కూడా టీఆర్ఎస్ వర్గాల్లో కలుగుతున్నాయి. ఎక్కడి నుంచి లీకయిందనే విషయం తెలిసినా బయటకు చెప్పలేకపోతున్నారు. దీనిని ఉపయోగించుకొని కాంగ్రెస్ తన వద్ద ఉన్న సమాచారంతో ఎమ్మెల్యే పై విమర్శల బాణాలు ఎక్కుపెడుతోంది. ఎమ్మెల్యే రవిశంకర్ పాత ఎమ్మెల్యేనే ఫాలో అవుతున్నారనే విమర్శలు కూడా ఎక్కువయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు టీఆర్ఎస్ నేతల సైతం కౌంటర్ ఎటాక్ చేయడం మొదలెట్టారు. తమ ఎమ్మెల్యే నీతి నిజాయితీని శంకిస్తే సహించేది లేదంటూ మండిపడుతున్నారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ నాయకుల మధ్య ఆరోపణలను పక్కనబెడితే ఇదంతా అధికార పార్టీ నుంచే కాంగ్రెస్ కు సమాచారం వెళుతుందని అనుకుంటున్నారు. ఓవరాల్ గా చొప్పదండిలో వస్తున్న అవినీతి ఆరోపణల విషయం మాత్రం ఎమ్మెల్యేలకు కామన్ అయిపోయింది. దీంతో ఆ పదవిలో ఉండేవాళ్లు ఇదేం ఖర్మరా బాబూ అని తలలు పట్టుకుంటున్నారు.

ఎల్లారెడ్డిలో చీలిన గులాబీ.. కాంగ్రెస్ నుండి వలస వచ్చిన నేతలతో మొదలైన ముసలం!

  ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టిఆర్ఎస్ పుట్టినప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగిన నాయకులు.. సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి నాలుగు సార్లు ప్రాతినిధ్యం వహించిన రవీందర్ రెడ్డి పక్కా టీఆర్ఎస్ కాండిడేట్ అని చెప్పుకోవచ్చు. 2004 లో రాజకీయ అరంగేట్రం చేసిన రవీంద్రరెడ్డి ఇంతవరకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే స్థానానికి ఆరుసార్లు పోటీ చేయగా నాలుగు సార్లు గెలిచారు, రెండుసార్ల ఓడిపోయారు. 2008 ఉప ఎన్నికల్లో ఓసారి, 2018 ఎన్నికల్లో మరోసారి పరాజయం పాలయ్యారు. మిగతా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన ఇతర పదవులు పదోన్నతులు మాత్రం పొందలేకపోయారు. పార్టీ అధిష్టానంలో ఆయన పట్టు సాధించలేకపోవడం ఒక కారణమైతే జనంలో వ్యతిరేకత పెరగడం మరో కారణంగా మారింది. దీంతో గత ఎన్నికల్లో రవీందర్ రెడ్డి పరిస్థితి ఆశాజనకంగా లేదని నిఘా వర్గాలు ముందుగానే సంకేతాలిచ్చాయి. అభ్యర్థిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఎల్లారెడ్డి స్థానం గెలిచే అవకాశం లేదని గులాబీ బాస్ కు ముందస్తుగా వర్తమానం కూడా అందింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలో ఎనిమిదింటిని కైవసం చేసుకున్న టీఆర్ఎస్ ఎల్లారెడ్డిలో మాత్రం పరాజయం పాలైంది. ఇక్కడ కాంగ్రెస్ కు చెందిన నల్లమడుగు సురేందర్ చేతిలో సుమారు 34 వేల ఓట్ల తేడాతో రవీందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు.  రాష్ట్రమంతటా అనుకూల పవనాలు వీచినప్పటికీ ఎల్లారెడ్డిలో మాత్రం ఎదురుగాలి తగలడంతో పార్టీ పెద్దలు ఖంగుతిన్నారు. ఇది కేవలం రవీందర్ రెడ్డి స్వయంకృతాపరాధమేనని తేల్చారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన నల్లమడుగు సురేందర్ టీఆర్ఎస్ లో చేరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమో.. తన మనుగడ కోసమో తెలీదు కానీ నల్లమడుగు సురేందర్ గులాబీ గూటిలో చేరడంతో ఎల్లారెడ్డి రాజకీయం రంజుగా మారింది. స్వపక్షంలోనే విపక్షం తయారు కావడంతో టిఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్ రెడ్డి తన ఉనికి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 15 ఏళ్లుగా తన వెంట ఉంటున్న అనుచరుల కోసం గట్టిగా పని చేయాలని ఆయన భావించారు. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వర్గీయులకు టికెట్లు ఇప్పించేందుకు నానా ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ వర్గాన్ని ఢీకొనేందుకు సొంతంగా ప్రతి మండలంలో తన అనుచరులను రంగంలోకి దింపారు. ఈ ఇరువర్గ పోరు కారణంగా నియోజకవర్గంలో కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీకి ప్రతికూల ఫలితాలొచ్చాయి. ఎల్లారెడ్డి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. నాగిరెడ్డిపేట ఎంపిపి కుర్చినీ స్వతంత్ర అభ్యర్థి దక్కించుకున్నారు. మిగతావన్నీ టీఆర్ఎస్ ఖాతాలో పడినప్పటికీ వారంతా ఎమ్మెల్యే సురేందర్ వర్గీయులు కావడం విశేషం. అప్పటి నుంచి రవీందర్ రెడ్డి తన పంథా మార్చారు. మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని భవిష్యత్ కోసం వాడుకోవాలని చూస్తున్నారు. వారి అనుచరుడిగా చలామణి అయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని సమాచారం.  ప్రధానంగా తాను హరీశ్ రావు వర్గియుడనని చాటుకునే ప్రయత్నాలను ఏనుగు రవీందర్ రెడ్డి ముమ్మరం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని తన వర్గీయులను హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వద్దకు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నారు. ఇటీవల వరుసగా 3 రోజుల పాటు తన వారిని తీసుకెళ్లి మర్యాద పూర్వకంగా కల్పించారు. ఎల్లారెడ్డి, లింగంపేట, సదాశివనగర్, గాంధారి మండలాలకు చెందిన నాయకులను పరిచయం చేసి ఇదంతా తన వర్గమని చూపించారు. హరీశ్ రావుకు మంత్రి పదవి వచ్చిన తర్వాత ఇలా దూకుడు పెంచారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో తన వర్గీయులతో ఏనుగు రవీందర్ రెడ్డి ప్రత్యేక శిబిరం నడుపుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే పార్టీ సమావేశాలు చర్చలు రవీందర్ రెడ్డి శిబిరంలోనే జరుగుతున్నాయి. అధికారికంగా ఎమ్మెల్యే సురేంద్ర నడుపుతున్న ఆఫీస్లో ఈయన వర్గీయులెవరూ కనిపించడం లేదు. రవీందర్ రెడ్డి వర్గీయులు ఇంత వరకు ఎమ్మెల్యే ఆఫీసు గడప కూడా తొక్కలేదు,అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎమ్మెల్యే నిర్వహించే పార్టీ సమావేశాలు సభలకు హాజరవడం లేదు, రవీందర్ రెడ్డి వచ్చినపుడు మాత్రమే వారు ఎల్లారెడ్డిలో దర్శనమిస్తున్నారు, అది కూడా రవీందర్ రెడ్డి వెంట ఆయన ఉన్నంత సేపు హడావుడి చేసి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీంతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇరువర్గాల పోరు నానాటికీ ముదురుతున్నట్టు కనిపిస్తోంది.  ఇక త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వర్గపోరు ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశాలున్నాయి. ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందోనని కార్యకర్తలు ఆందోళనకు చెందుతున్నారు. కౌన్సిలర్ ల టికెట్ లు మొదలు వారిని గెలిపించుకునే వరకు ఇటు నల్లమడుగు సురేందర్, అటు ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించే సూచనలున్నాయి. ఇప్పటికే రవీందర్ రెడ్డి తన అనుచరుల్ని మున్సిపల్ చైర్మన్ చేయాలని భావిస్తున్నారు, ఆ అభ్యర్థి పేరు కూడా ఖరారు చేశారు. దీనిపై హరీశ్ రావు ద్వారా అంతర్గత ప్రయత్నాలు కూడా చేస్తున్నారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే సురేంద్ర మాత్రం కేటీఆర్ ద్వారా తన పరువు ప్రతిష్ట కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. మొదటి నుంచి హరీశ్ రావు అనుచరుడిగా ఉన్న రవీంద్రరెడ్డిపై సహజంగానే కేటీఆర్ కు సానుభూతి లేదు. దీనికి తోడు ఆయన ఇటీవల హరీశ్ రావు, ఈటెల రాజేందర్ వెంట తిరగడంతో కేటీఆర్ దృష్టిలో బలంగా నాటుకుపోయారు. ఈ వర్గపోరు కారణంగా ఏనుగు రవీందర్ రెడ్డిని మరింత దూరం చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్ పావులు కదుపుతున్నారు. ఇలాంటి ప్రతికూల వాతావరణంలో ఏనుగు రవీందర్ రెడ్డి ఇంకా ఎందుకు దూకుడు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదని కార్యకర్తలు అనుకుంటున్నారు. మొత్తం మీద ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే అయోమయంలో స్థానిక గులాబీ దళం ఉండగా అన్నీ కలిసొస్తే హరీశ్ రావు నీడను మళ్లీ అందలం ఎక్కుతాననే ఆశ విశ్వాసం మాత్రం ఏనుగు రవీందర్ రెడ్డికి ఉంది. మరి ఎవరి ఆశలు నెరవేరుతాయో ఎవరి అంచనాలు ఫలిస్తాయో చూడాలి.

విశాఖలో విహారం.. పర్యాటకుల కోసం మరింత ముస్తాబవుతున్న కంబాలకొండ!

  విశాఖ నగరానికి ఆనుకుని చుట్టూ కొండలు ఉంటాయి. ఇందులో చాలా వరకు రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. అందులో అతిపెద్ద ప్రాంతం ఏదైనా ఉందంటే అది కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్. ఇటు నగరానికి అటు మధురవాడ ప్రాంతానికి మధ్యలో ఉంటుంది. ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా మార్చారు. పర్యాటకులు వచ్చేందుకు అనుగుణంగా దీనిని మలిచారు. ఆరంభంలో అడపా దడపా పర్యాటకులు వస్తుండేవారు. నగరవాసులకు.. విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు కొన్ని ట్రెకింగ్ ట్రాక్స్, ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పర్యావరణ స్ఫూర్తిని నింపే యాత్రలా దీన్ని మలిచారు. నగర వాసులు విద్యార్థులు వివిధ కార్పొరేట్ గ్రూపులు ఇక్కడ శని ఆదివారాల్లో ఎక్కువగా వస్తారు. ఇందులో రెండు కిలో మీటర్లు, మూడు కిలో మీటర్లు, ఐదు కిలోమీటర్ల ట్రాక్ లుంటాయి. ఇందులో ఒక్కొక్క ఏజ్ గ్రూప్ కు అన్నట్టు ఉంటాయి. దారులు కూడా చాలా బాగుంటాయి. ఉదయాన్నే వచ్చి ట్రెకింగ్ కు వెళ్లే వారు ఎక్కువ మంది ఉంటారు.  కంబాలకొండ రిజర్వు ఫారెస్ట్ సుమారుగా 17,000 ల ఎకరాల్లో కేంద్రీకృతమై ఉంది. 1770 లో ప్రభుత్వం రిజర్వు ఫారెస్టుగా ప్రకటించింది. ఇందులో కొన్ని రకాల జింకలు, దుప్పులు కొన్ని రకాల పక్షులు ఉంటాయి కానీ బయటకు కనిపించవు. ఎకో టూరిజం పేరుతో సందర్శకులకు అవకాశం కల్పించి కొన్ని పక్షులు జంతువులను ఏర్పాటు చేశారు. అయితే వాటి సంరక్షణ కరువవడంతో వదిలేశారు. దీనిమీదనే ఆధారపడిన సంబువానిపాలెం గ్రామస్థులే ఇందులో పనిచేస్తుంటారు. ప్రస్తుతం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అండర్ లో ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇక్కడకు చాలా తక్కువ మంది పర్యాటకులు వస్తారు. కార్తీక మాసం వస్తే పర్యాటకులతో కిటకిటలాడుతోంది. కుటుంబాలతో సహా వాలిపోతారు. వచ్చే వారంతా చాలా బాగుందంటూ కితాబిచ్చేస్తారు.  రెండు సంవత్సరాల క్రితం కంబాలకొండలో ఒక ఎడ్వెంచర్ స్పోర్ట్స్ ప్రారంభించారు. అక్కడకు వచ్చే పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూ వాటిని ఎంజాయ్ చేస్తారు. అక్కడ రేగలగడ్డ రిజర్వాయర్ అనే రిజర్వాయర్ తో పాటు వరసలో మరో రెండు చిన్న రిజర్వాయర్ లు కూడా ఉన్నాయి.వర్షాలు కురిసినప్పుడు ఇందులోకి ఆ నీరు వచ్చి చేరుతుంది. అందులో బోటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కంబాలకొండ స్పెషల్ ఎట్రాక్షన్ ఏవైనా ఉన్నాయంటే అవి అడ్వెంచర్ స్పోర్ట్స్ అందులో బర్మా బ్రిడ్జ్, జిప్ లైన్, స్కైవాక్, గో టు వాక్, టైర్ వాల్. టైర్ వాల్ లాంటివి ఇక్కడకు వచ్చే పర్యాటకులను ఆకట్టుకోవడమే కాదు వారిని సాహసం చేసేలా చేస్తుంది. ఈ సాహసాలు చేసేందుకూ ధైర్యంతో పాటుగా మైండ్ కాన్సన్ ట్రేషన్ టెక్నికల్ లాజిక్ అప్లై చెయ్యాల్సుంటుంది. మెయిన్ గా ఫిజికల్ ఫిట్ నెస్ కూడా ముఖ్యం. ఇక్కడకు వచ్చే వారిలో ఎక్కువ మంది బర్నా బ్రిడ్జి, జిప్ లైన్ పై సాహసం చేస్తారు. చేసిన వారంతా వావ్ సూపర్ అంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వైల్డ్ లైఫ్ సెంచరీస్ డెవలప్ చేయటానికి ప్రభుత్వం ఈ మధ్యనే నిర్ణయం తీసుకుంది. గతంలో వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తో మరిన్ని డెవలప్ చేసేందుకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ చర్యలు చేపట్టింది. ఇదే ప్రాంతంలో నైట్ సఫారీ మరికొన్ని అడ్వెంచర్స్ పెట్టే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.

2021 నుండి తెలుగులోనూ ఐఐటీ జేఈఈ పరీక్ష

  తెలుగు విద్యార్థులకు తీపి కబురు అందించింది కేంద్రం. ఇకపై జేఈఈ మెయిన్ పరీక్షను తెలుగులో కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. పరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఈ నిర్ణయాన్ని 2021 లో నిర్వహించే పరీక్షల నుంచి అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.  ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇకపై తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, ఉర్దూ భాషలోనూ నిర్మించనున్నారు. జేఈఈ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలనే డిమాండ్లు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయి. కానీ దీనిపై గత ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మోదీ సర్కారు మాత్రం కీలక నిర్ణయం తీసుకోవటం గమనార్హం. జేఈఈ మెయిన్ పరీక్షకు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆ ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. ప్రఖ్యాత ఇంజినీరింగ్ విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీల్లో చదువుకోవాలన్నది ప్రతి విద్యార్థి కల..కానీ అదంత సులువు కాదు. సబ్జెక్టు పై అవగాహన ఉండి భాష సమస్యతో జేఈఈ మెయిన్ పరీక్షకు దూరమవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.  ఏటా తెలంగాణ , ఆంధ్రా నుండి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్ పరీక్షకు హాజరవుతారు. ప్రస్తుతం జేఈఈ మెయిన్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లో నిర్వహిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఈ పరీక్ష అందని ద్రాక్షగానే మారింది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ విద్యాసంస్థల నుంచి కూడా పలువురు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఇలాంటి వారికి జేఈఈ మెయిన్ ను తెలుగులో నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఇంగ్లిష్ భయం తొలగిపోయి ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం ఉంటుంది. అయితే ఆ విద్యార్థులకు ఎన్ఐటీల్లో సీట్లు వస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్ఐటీ చదువులు పూర్తిగా ఇంగ్లీషుమయం.  

అమ్మాయిలూ జాగ్రత్త

  వరుస ఘటనలు అమ్మాయిలను, అమ్మాయిల తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. వరంగల్‌లో 19 ఏళ్ల మానసను ఆమె మిత్రుడే రేప్‌ చేసి చంపేశాడు. హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకరెడ్డిని గుర్తు తెలియని దుండగులు రేప్ చేసి కిరాతకంగా హత్య చేసారు. ఇలా వరుస ఘటనలు భయాన్ని రేకెత్తిస్తున్నాయి. అమ్మాయిలు అంత గుడ్డిగా నమ్మి ఎవరితోనూ ఒంటరిగా వెళ్లొద్దని, ఒకవేళ రాత్రి సమయంలో ప్రయాణం చేయాల్సి వస్తే.. తోడుగా కుటుంబ సభ్యులను తీసుకెళ్లాలని లేదా దగ్గరలోని పోలీసుల సహాయం కోరాలని.. పోలీసులు సూచిస్తున్నారు. తాజా ఘటనల నేపథ్యంలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ కొన్ని సూచనలు చేసారు. సాయంత్రం 6 దాటిన తరువాత, రాత్రి సమయంలో మహిళలు, వృద్ధులు ప్రయత్నించే సమయంలో వాహనం చెడిపోయినా, పంక్చర్ అయినా సహాయం కోసం పోలీసులను ఆశ్రయించవచ్చని తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని మిమ్మల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు సహాయపడతారన్నారు. పోలీసుల సహాయం కోసం 100  డయల్ చేయొచ్చు లేదా రాచకొండ వాట్పాప్ నెంబరు 9490617111కు సమాచారం అందించవచ్చని సీపీ తెలిపారు. కొన్ని మానవ మృగాలు సంచరిస్తున్న ఈ సమాజంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు. అమ్మాయిలూ జాగ్రత్త. మీకు ఏ మాత్రం అనుమానం వచ్చినా, భయం వేసినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి.

హైదరాబాద్ లో మరో యాక్సిడెంట్.. ఇద్దరు ఇంటర్ విద్యార్థులు మృతి

  హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. TS 07 EB 3680 నెంబరు కారు పీవీ ఎక్స్ ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 221 ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన స్టూడెంట్స్ ఉదయశంకర్, తరుణ్ గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. క్షతగాత్రులుని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీళ్ళల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జ అయ్యింది. కారు ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన వాళ్లు మాదాపూర్ లో ప్రైవేట్ కాలేజీలో లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి రాజేంద్ర నగర్ దగ్గరకు వెళ్లి తిరిగి వస్తుండగా కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. అతివేగంగా నడపడం వల్లే కారు నుజ్జు నుజ్జు అయ్యిందని.. ఆ కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు పోలీసులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణం ఏంటి..ఆ కారు ఎవరిది.. అనే విషయం మీద ఆరా తీస్తున్నారు. మొత్తం 9 మంది విద్యార్థుల్లో గణేష్ అనే విద్యార్థి రాత్రి 9:30కు క్యాంపస్ నుండి బయటకు వచ్చాడు. అక్కడి నుండి నేరుగా కోంపల్లిలో ఉన్న తాత ఇంటికి వెళ్లాడు. గణేష్ తాత టాటా సఫారీ వాహనాన్ని తీసుకొని శంషాబాద్ ఏయిర్ పోర్టు వైపు రావడం జరిగింది. స్నేహితుడి బర్త్ డే పార్టీ సందర్భంగా ఈ 9 మంది విద్యార్థులు  ప్రీప్లాన్డ్ గా ఇక్కడకు వచ్చి పార్టీ చేసుకొని ఉదయం 5 గంటల లోపే హాస్టల్ కి తిరిగి వెళ్లాలనే ఉద్దేశంతో 2 గంటల ప్రాంతంలో పార్టీ ముగించుకున్నారు. అక్కడి నుండి తిరుగు ప్రయాణమై ప్రమాదానికి గురయ్యారు. అయితే ప్రమాదంలో ముందు కూర్చున్న ఉదయ్ శంకర్, తరుణ్ ఇద్దరూ కూడా స్పార్ట్ లోనే చనిపోయారు. డ్రైవర్ వెనుకాల కూర్చున్న శశాంఖ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని స్థానికంగా  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే కారులో ఉన్న మిగతా ఆరుగురుకి కేవలం స్వల్ప గాయాలు అయ్యాయి కాబట్టి వాళ్ళంత అక్కడ నుంచి పరారైపోయారు. అయితే వీరంతా మద్యం సేవించి ఉన్నారా లేరా అనేటువంటి కోణంలో  ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది.  

జైలుకెళ్లి వచ్చిన అధికారిణి శ్రీలక్ష్మి కోసం విశ్వప్రయత్నాలు!

  తెలంగాణ కేడర్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో మరోసారి ప్రత్యక్షమయ్యారు. డిప్యుటేషన్ పై ఏపీకి వచ్చేందుకు నాలుగు నెలల నుంచి ఆమె తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాన మంత్రి పరిధిలో ఉండే కేంద్ర సిబ్బంది, శిక్షణ ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారులను కలిసేందుకు గురువారం( నవంబర్ 28న ) పార్లమెంట్ కు వచ్చిన ఆమె వైసీపీ రాజ్య సభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంట కనిపించారు. కేసుల నేపథ్యంలో ఆమెను డిప్యుటేషన్ పై పంపడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నట్లు సమాచారం. సీబీఐ కేసుల్లో ఉన్నప్పుడు అంతర్రాష్ట్ర బదిలీకి ఎలా అవకాశమిస్తామని వారు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.  లక్ష్మి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిణి కాదు..రాష్ట్ర విభజన నేపథ్యం లో ఆమె తెలంగాణ కేడర్ ను ఎంచుకున్నారు. ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీకి డిప్యుటేషన్ పై వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తుని తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించినా కేంద్రం వ్యతిరేకించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ కేసులో ఆమె నిందితురాలు కావడమే దీనికి కారణమని తెలుస్తొంది. ఆమె ఢిల్లీలో మకాం వేసి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా ఆయనతో పాటు వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇతర మంత్రులను కలుస్తున్నారు. ఆయన లేనప్పుడు విజయసాయిరెడ్డి వెంట వెళ్లి వారితో సమావేశమవుతున్నారు.  డిప్యుటేషన్ కు అనుమతి రాకున్నా శ్రీలక్ష్మి ఆంధ్రా భవన్ లోనే మకాం పెట్టడం పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తెలంగాణ కేడర్ ఐఏఎస్ కు ఇక్కడ క్యాటగిరీ 1 గది కేటాయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. దీనికి తోడు ఆమెకు కారు కూడా ఏపీ భవన్ సమకూరుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రాకు చెందిన ముఖ్య కార్యదర్శి కి ఇచ్చే సదుపాయాలన్నీ తెలంగాణ అధికారిణి కేటాయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో అధికారులు ఆమెకు ఆంధ్రా భవన్ లోనే వసతి కల్పిస్తున్నారు. ఒకవేళ డిప్యుటేషన్ ఖాయమైతే ఆమె నేరుగా జగన్ పేషీలో నియమితులు కావచ్చని ఆ భయంతోనే ఈ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.

అనుకున్నది ఒకటి..అయినది ఒకటి... టీఆర్ఎస్ లో ఆశావహుల నిరాశ పర్వం

  టీఆర్ఎస్ పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చాక చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశించారు. క్యాబినెట్ లో 17 మందికి మాత్రమే చోటు ఉండడంతో కేవలం కొద్ది మందికే అదృష్టం దక్కింది. పదవులు ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్లు వారంతా చెప్పుకొచ్చారు. ఆ తరుణం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయంలోనే ఇటీవల కొన్ని కీలక పదవులను భర్తీ చేసింది గులాబీ పార్టీ అధిష్టానం. అయితే ఆ పదవులు కూడా దక్కక పోవడంతో కొందరు ఎమ్మెల్యేలు నిరాశకు గురైయ్యారని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఇటీవల రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్. అయితే మంత్రివర్గంలో చోటు ఆశించి భంగపడ్డ నిజామాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కీలక పదవి ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డికి మండలి చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయన నిర్వహించిన రైతు సమన్వయ సమితి పగ్గాలు బాజిరెడ్డికి ఇస్తామని కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. దీంతో బాజిరెడ్డి సైతం ఆ పదవి తనకే వస్తుందన్న ఆశతో మానసికంగా సిద్ధమైపోయారు. కాని ఆ పదవిని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కట్టబెట్టడంతో బాజిరెడ్డి నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.  ఇదే పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఎదురైంది. ఆయనకు శాట్స్ ఛైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఆ పదవిని నిర్వహించిన వెంకటేశ్వరెడ్డికే దాన్ని రెన్యువల్ చేశారు కేసీఆర్. దీంతో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. చాలా మంది ఎమ్మెల్యేలు తమకు కీలక పదవులు వస్తాయని ఆశించినా ఫలితం లేకుండా పోయింది. తమ ఆశలకు గండి పడుతుండడంతో సన్నిహితులు.. అనుచరుల వద్ద వారి గోడు వెళ్లబోసుకుంటున్నారు.  పార్టీ ఎమ్మెల్యేలకు కొంతమంది ముఖ్యనేతలకు కేటీఆర్ పదవులిస్తామని చెబుతుంటే కేసీఆర్ మాత్రం తన జాబితాలో ఉన్న వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ అధికార టీఆర్ఎస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ ఇచ్చిన మాట అమలు కాకపోవడం హామీ పొందిన నేతలను కలవరానికి గురి చేస్తోంది. ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకూ ఏదో ఒక పదవి కట్టబెడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇక కొన్ని బహిరంగ సభల్లో కేసీఆర్ సైతం హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ గానూ, కార్పొరేషన్ చైర్మన్ లు గానూ అవకాశం కల్పిస్తామని చెప్పారు. దీంతో వారంతా పదవుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. కానీ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలతో చాలా మంది నేతలు పదవులు దక్కుతాయో లేదోనన్న బెంగతో ఉన్నట్టు తెలుస్తోంది.