బీజేపీ కొత్త మిషన్... టార్గెట్ 7 ప్లస్

  కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న సమయంలో ఆపరేషన్ 7 ప్లస్ ను ముమ్మరం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోను 15 సీట్లలో 7 కి పైగా సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. దక్షిణాదిన బీజేపీకి బలం ప్రభుత్వ ఉండేది కేవలం కర్ణాటకలో మాత్రమే అది కూడా ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలపైగా సీట్లు సంపాదిస్తే కానీ సర్కారు నిలబడదు. దీంతో పూర్తిగా మిషన్ 7 ప్లస్ పై ఆధారపడింది బీజేపీ.  15 నియోజక వర్గాల్లో 8 నియోజకవర్గాలపైన పూర్తిగా దృష్టిని పెట్టింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలని చూస్తోంది. దీంతో పాటు ప్రత్యర్ధులను తమ దారిలోకి రప్పించి ఈజీగా గెలిచేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు బిజెపికి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కారు కొనసాగించాల్సిందేనని అందుకు దేనికి వెనకాడకూడదని రాష్ట్ర నేతలకు ఇప్పటికే జాతీయ నేతలు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టైం దగ్గర పడుతుండటంతో యడ్యూరప్ప ప్రచారాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం కొనసాగుతోందని దీనికి ఎవరి సహకారం అక్కరలేదని హవేరిలో జరిగిన ప్రచారంలో అన్నారు. 15 నియోజకవర్గాల్లోనూ బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 14 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కొనసాగించాయి. పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు, రాజీనామాలతో సర్కారు కూలిపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రస్తుతం మైనారిటీల్లో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది రెబల్స్ ను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య పడిపోయి బీజేపీ బలపరీక్షలో నెగ్గింది. ఖాళీ అయిన స్థానాలకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాడు పరోక్షంగా బిజెపికి సహకరించిన రెబల్స్ ఆ పార్టీలో చేరి ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 15 స్థానాలకు డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుంది. అయితే టైం దగ్గరపడుతూండటంతో గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతోంది బిజెపి. అయితే ఫలితాలపై నమ్మకం లేకపోవడం వల్లే రాష్ట్రంలో స్పెషల్ ఆపరేషన్లు బిజెపి నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

వైఎస్ వివేకా హత్య కేసు.. ఒక్కసారిగా దర్యాప్తు వేగం పుంజుకుంది

  మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డిలను సిట్ అధికారులు పిలిపించి ప్రశ్నించారు. అలాగే టిడిపికి చెందిన శివరాఘవరెడ్డి సహా ఇద్దరు టిడిపి నేతలను సిట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నా.. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని కడప జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నెల 24 నుంచి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో సిట్ సీఎం సమీప బంధువులను పిలిపించి ప్రశ్నించటం సంచలనం సృష్టించింది. గతంలో భాస్కరరెడ్డిని పులివెందుల్లోనే ఒకసారి ప్రశ్నించారు. ఇప్పుడు కడపకు పిలిపించి రహస్య ప్రాంతంలో విచారణ జరిపినట్లు తెలిసింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న పులివెందుల లోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును చేధించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా టెక్నికల్ టీం, ఫీడ్ టీం, డాక్యుమెంటరీ సేకరణ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించారు. అప్పట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 26న నాటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమించారు. మహంతి ఆధ్వర్యంలోనే వివేక హత్య కేసును సిట్ బృందం దర్యాప్తు చేసింది. మే 30 న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగానే సిట్ కు నాయకత్వం వహిస్తున్న ఎస్పీ మహంతి నెలన్నర క్రితం దీర్ఘ కాలిక సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.

కేసీఆర్ తీరుపై జాతీయ మీడియా ఫైర్.. దిశ ఘటన కంటే పెళ్లి ఎక్కువా?

  హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దిశ ఘటన నేపథ్యంలో జాతీయ మీడియా తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర సీఎంగా కేసీఆర్ స్పందించలేదని విమర్శించిన జాతీయ మీడియా.. తాజాగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ని.. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటూ మొహం మీదనే నిలదీసింది. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెల్సిందే. ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రులని కలవడంతో పాటు.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే కేసీఆర్ ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో.. అక్కడి జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ నిలదీశారు. కానీ కేసీఆర్.. మీడియా ప్రతినిధులకు ఏ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దీంతో జాతీయ మీడియా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఓ వైపు దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఏం పట్టనట్టు ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ పై ఇక్కడి మీడియా విమర్శలు చేసే సాహసం చెయ్యట్లేదు కానీ.. జాతీయ మీడియా మాత్రం మాత్రం కేసీఆర్ తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది.   మరోవైపు సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాహ వేడుకకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. దీంతో సీఎంకి వేడుకలకు వెళ్లే టైం ఉంది కానీ, ఘటనపై స్పందించే టైం లేదంటూ నెటిజన్లు విమర్శించారు. ఇక అప్పటివరకు దిశ ఘటనపై స్పందించని కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులతో చర్చ సందర్భంగా స్పందించారు. వెంటనే, న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఘటన జరిగిన వెంటనే కేసీఆర్ స్పందించకపోవడం, మరోవైపు దిశ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించని కేసీఆర్.. వివాహ వేడుకులకు హాజరు కావడంపై.. అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమిత్ షా vs రాహుల్.. జార్ఖండ్ లో వేడెక్కిన రాజకీయం

  జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో వైపు రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల ( డిసెంబర్ ) 7వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో జంషెడ్ పూర్ లో జరిగిన సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తీర్పు ఆలస్యం కావటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు అమిత్ షా. మరోవైపు దేశంలో హాట్ టాపిక్ గా మారిన ఎన్ఆర్సీ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో చొరబడ్డ విదేశీయులను తరిమేస్తామని తెలిపారు అమిత్ షా. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ఆర్సీ ని అమలు చేస్తామంటే రాహుల్ గాంధీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అమిత్ షా.  మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారి జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిండోకాతో పాటు జంషెడ్ పూర్ ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ భయపెట్టే రాజకీయాలు చేయదన్నారు రాహుల్. జార్ఖండ్ ప్రజల్నీ బిజెపి భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఆదివాసీల నుంచి విలువైన భూములు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని రాహుల్ విమర్శించారు. మొత్తం మీద రెండో దశ పోలింగ్ కు 5 రోజుల ముందే జార్ఖండ్ లో ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది.

మోదీతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?

  ఢిల్లీలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పలు అంశాలపై చర్చించనున్నారు. ఆయనతో పాటు జగదీశ్ రెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సంతోష్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. దిశ ఘటన నేపథ్యంలో చట్టాల్లో మార్పులు చేసి.. కఠిన శిక్షలను అమలు చేసేలా కేంద్రం నిర్ణయాలు తీసుకోవాలని ప్రధాని మోదీని కోరనున్నారు కేసీఆర్. విభజన హామీలు, ఆర్టీసీ పరిణామాలపై చర్చించే అవకాశముంది. దిశ ఉదంతం నేపథ్యంలో చట్టాల్లో మార్పులు చేసి సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. ప్రధానితో పాటు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశముంది. విభజన హామీల అమలు, తొమ్మిది పదో షెడ్యూల్ సంస్థల ఆస్తులు, అప్పుల బదలాయింపు, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే కోచ్ ల కార్మాగారం, బయ్యారం ఉక్కు కర్మాగారం, హైదరాబాద్ లో ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల కేటాయింపు, వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధి కింద రూ.451 కోట్ల బకాయిలు, మిషన్ భగీరథ, కాకతీయలకు నీతి ఆయోగ్ సిఫార్సు చేసిన నిధుల చెల్లింపు, కాళేశ్వరానికి జాతీయ హోదా, సీతారామ ప్రాజెక్టుకు నిధులు, 13 వ ఆర్థిక సంఘం నుంచి రావలసిన రూ.2000 కోట్ల బకాయిలతో పాటు పలు అంశాల పై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ రాజీవ్ శర్మ కుమారుడి వివాహంలోనూ పాల్గొనున్నారు కేసీఆర్.

తెలుగు రాదు కానీ డబ్బు కావాలి.. పవన్ టార్గెట్ చేసింది ఏ హీరోని?

  తెలుగు విషయంలో టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరు పై అసహనం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాయలసీమలో పర్యటస్తూ.. ఆయన తిరుపతిలో తెలుగు భాషాభిమానుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ తీరు పై విమర్శలు గుప్పించారు. తెలుగు సినిమా సాహిత్యం రానురాను దిగజారిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు హీరోలకు తెలుగు రాయడం, మాట్లాడటం రాదన్నారు. తెలుగు సినిమాలతో వచ్చే డబ్బులు మాత్రమే హీరోలకు కావాలని మండిపడ్డారు. ఏపిలో తెలుగు మీడియం రద్దు పై తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా స్పందించలేదన్నారు. తెలుగు సినిమాలు తీస్తూ ఎవరూ మాట్లాడకపోవటం పై విభిన్న వర్గాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. ఏపీ ప్రభుత్వ నిర్ణయం పై విమర్శలు చేసి లేనిపోని చిక్కులు తెచ్చుకోవడం ఎందుకని నోరు విప్పలేదని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ తీరు పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారని అంచనా వేస్తున్నారు. అందులోనూ తాను ఒక హీరోగా ఉన్నవారే.. అయినా కూడా తోటి హీరోలపై గురి పెట్టడమే చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  ఇప్పుడున్న యువతరం హీరోల్లో ఎక్కువ మంది వారసులే ఉన్నారు. వాళ్లలో చెన్నైలో పుట్టి పెరిగినవారే ఎక్కువ. ఇంగ్లీష్ మీడియంలో తమిళం ఒక సబ్జెక్టుగా చదువుకుని ఉంటారు కానీ తెలుగు చాలామందికి తెలియదు. మాట్లాడ్డం మాత్రమే ఎక్కువ మంది హీరోలకి వచ్చు. చదవడం, రాయడం రాదు. హీరోల్లో ఎవరెవరికి తెలుగు చదవడం రాయడం వచ్చో టాలీవుడ్ లో చాలా మందికి క్లారిటీ వుంది కానీ ఎవరూ నేరుగా చెప్పరు. స్టార్ హీరోల్లో టాప్ రేంజ్ లో వున్న ఓ నటుడు నిజాయితీగా తన తెలుగు గురించి చెబుతూ ఉంటారు. తనకు తెలుగు మాట్లాడడమే వచ్చని చదవడం రాయడం రాదని చాలా సందర్భాల్లో చెప్పారు. తెలుగు విషయంలో టాలీవుడ్ తీరును పవన్ కళ్యాణ్ సూటిగానే విమర్శించారు. ఇందులో ఇతర హీరోల ప్రస్తావన కూడా తీసుకువచ్చారు. అందుకే టాలీవుడ్ లో ఈ విమర్శల హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్నికల ప్రచార సమయంలో కొంత మంది టాలీవుడ్ నటులు పవన్ పై ఘాటు విమర్శలు చేశారు. వారిని మళ్లీ వైసీపీ తెరమీదక తెచ్చే అవకాశం ఉందటున్నారు. మరోవైపు ఏ పార్టీలతో సంబంధం లేని వారు మాత్రం ఈ విషయం పై స్పందించకపోతేనే బెటర్ అని అనుకుంటున్నట్లు చెప్తున్నారు.

దేశాన్ని కదిలించిన దిశ ఘటనపై చర్చ.. వైసీపీ ఎంపీకి జోలపాట!!

  క్లాస్ రూమ్ లో టీచర్ పాఠాలు చెప్తుంటే కొందరు స్టూడెంట్స్ వినకుండా నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు కొందరు పొలిటీషియన్స్ కి కూడా ఉంది. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యల గురించి చర్చించాల్సింది పోయి.. ఆ చర్చలనే జోల పాటలా ఫీలయ్యి నిద్రపోతుంటారు కొందరు పొలిటీషియన్స్.  తాజాగా అలా నిద్రపొయ్యే విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రజలు పెద్ద ఎత్తుగా డిమాండ్ చేస్తున్నారు. పొలిటీషియన్స్ కూడా ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా పార్లమెంట్ వేదికగా ఎంపీలు అందరూ ఈ ఘటనని ఖండించారు. చట్టాలు మార్చాలని, నిందితులని కఠినంగా శిక్షించాలని, స్త్రీలకు భరోసా కల్పించాలని ఎంపీలు పార్లమెట్ వేదికగా చెప్పారు. అయితే ఓ వైపు ఇంతలా చర్చ జరుగుతుంటే.. వైసీపీ ఎంపీ మాధవ్ మాత్రం.. ఆ చర్చని ఏదో జోలపాటలా ఫీలవుతూ నిద్రపోయారు. ప్రస్తుతం ఆయన నిద్రపోతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ అమ్మాయిని అతి కిరాతకంగా అత్యాచారం, హత్య చేసిన ఘటనపై.. పార్లమెంట్ సాక్షిగా మిగిలిన ఎంపీలంతా ఆవేదన వ్యక్తం చేస్తూ.. స్త్రీల రక్షణ కోసం మాట్లాడుతుంటే.. ఇలా నిద్ర పోవడం ఏంటంటూ.. ఎంపీ మాధవ్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆయన ఇలా నిద్రపోవడం మొత్తం స్త్రీ జాతినే అవమానించినట్టు అని ఆయనపై తీవ్రస్థాయిలో  ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ఒకవైపు అవినీతి నిరోధానికి కాల్ సెంటర్స్... మరోవైపు అక్రమార్కులకు కీలక పదవులు

  ప్రతిపక్షంలో ఉండగా ఒకమాట... అధికారంలోకి వచ్చాక మరో మాట... ఇది దాదాపు అన్ని పార్టీలకూ వర్తిస్తుంది... నీతి నిజాయితీ, విశ్వసనీయత, పారదర్శకతంటూ చెప్పుకునే వైసీపీకి ఇదేమీ మినహాయింపు కాదు. అనేక విషయాల్లో అన్ని పార్టీల్లాగే జగన్ పార్టీ కూడా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షంలో ఉండగా... దేన్నయితే తప్పు అన్నారో... అవినీతి అన్నారో... అధికారంలోకి వచ్చాక... దాన్నే ఒప్పు అంటున్నారు... ఏ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఆరోపించారో... ఇప్పుడదే కంపెనీకి కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. పట్టిసీమలో వందల కోట్ల అవినీతి జరిగిందన్నారు... ఇఫ్పుడదే కంపెనీకి పోలవరం పనులు అప్పజెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రుజువులు ఉన్నాయి. ఇలాంటిదే మరొకటి ఇప్పుడు బయటికొచ్చింది. ప్రతిపక్షంలో ఉండగా ...అవినీతి అక్రమాలు జరిగాయని ఆరోపించారో... ఇప్పుడదే కంపెనీకి లేదా వ్యక్తి చేతుల్లో మళ్లీ ప్రాజెక్టును పెడుతున్నారు. ఏపీ మెడిటెక్ జోన్ (ఏఎంటీజెడ్)లో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ఆరోపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించింది. వైసీపీ గతంలో ఆరోపించినవిధంగానే పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని తేలింది. అంతేకాదు పలువురు ఉన్నతాధికారులతోపాటు ఈ ప్రాజెక్టులో కీలక బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జితేంద్రశర్మ పాత్ర కూడా ఉందని నిగ్గుతేల్చారు. అంతేకాదు, విజిలెన్స్ విచారణకు సహకరించని జితేంద్రశర్మ.... మెడిటెక్ జోన్ ఫైళ్లను అధికారులకు ఇఛ్చేందుకు నిరాకరించారు. అయినప్పటికీ విచారణాధికారులు అక్రమాలను నిగ్గుతేల్చి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడంతో మెడిటెక్ జోన్ సీఈవో జితేంద్ర శర్మను ఈ ప్రాజెక్టు నుంచి తొలగిస్తూ జగన్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇంతవరకూ బాగానే ఉంది, అయితే ఇంతలోనే ఏమైందో ఏమో తెలియదు గానీ, ఎవరినైతే మెడిటెక్ జోన్ ప్రాజెక్టు నుంచి తప్పించిందో...  మళ్లీ ఆ వ్యక్తి(జితేంద్ర శర్మ)నే ఏఎంటీజెడ్ ఎండీ అండ్ సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో, అప్పటివరకు జితేంద్ర శర్మ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికిచ్చి, అతని బ్యాంకు ఖాతాలు సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు కంగుతిన్నారు. జితేంద్రశర్మకు మళ్లీ అదే సంస్థకి ఎండీ అండ్ సీఈవోగా పోస్టింగ్ ఇవ్వడంతో సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలు కూడా తెరుచుకోనున్నాయని అంటున్నారు. అయితే, ఒకవైపు అవినీతి నిరోధానికి టోల్ ఫ్రీ నెంబర్లు పెడుతూ... మరోవైపు అవినీతిపరుడంటూ విజిలెన్స్ పక్కా రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తికి... మళ్లీ కీలక పోస్టింగ్ ఇవ్వడమేంటని ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదేమీ మతలబు... చోద్యమంటూ చర్చించుకుంటున్నారు.  

జగన్ స్పీడ్ ను అందుకోలేకపోతున్న కేసీఆర్, బాబు... టీఆర్ఎస్ లీడర్ల వెరైటీ సెంటిమెంట్

  కేసీఆర్, చంద్రబాబుతో పోల్చితే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు అత్యంత వేగంగా ఉంటున్నాయి. పదవుల పంపకం దగ్గర్నుంచి పథకాల అమలు వరకు అన్నింటిలోనూ దూకుడే కనిపిస్తుంది. ఒకరికిస్తే మిగతా వాళ్లు అసమ్మతి గళం విప్పుతారేమోనన్న భయాన్ని పక్కనబెట్టి తనను నమ్ముకున్నవాళ్లకు ఏదోఒక పదవితో కట్టబెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే అనేక నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో నామినేటెడ్ పదవుల భర్తీకి ఆపసోపాలు పడ్డారు. చివరి ఏడాదిన్నరలో ఏదో తూతూమంత్రంగా కొందరికి నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే... దాదాపు ఆరేళ్లుగా ఇటు నామినేటెడ్... అటు పార్టీ పదవులను భర్తీ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి నామినేటెడ్ అండ్ పార్టీ పదవులను భర్తీ చేస్తే... ఎక్కడ చిక్కులు వస్తాయోనన్న భయంతో అప్పడప్పుడూ ఒక్కో పదవిని మాత్రమే కట్టబెడుతున్నారు. దాంతో, తెలంగాణలో ఇంకా ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ కాకుండానే మిగిలిపోతున్నాయి. అయితే, ఆరేళ్లుగా పూర్తిస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీకాగా ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అయితే, నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఎంతోమంది టీఆర్ఎస్ నేతలు... ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేసుకుందామంటే అసలు అపాయింట్ మెంటే దొరకడం లేదు. దాంతో, ఏదోరకంగా కేసీఆర్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రిని కలవాలంటే ఒకే ఒక మార్గం పనవుతుందట. ఇంట్లో శుభకార్యం ఉందని, కేసీఆర్ ను ఆహ్వానించేందుకు, అపాయింట్ మెంట్ కోరుతుంటే మాత్రం సీఎం దర్శనభాగ్యం దక్కుతోందట. అపాయింట్ మెంట్ దక్కడమే కాదు... తమ మనసులోని మాటను కేసీఆర్ ముందు పెడుతుండటంతో ఫలితం కనిపిస్తోందట. శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పదవి రెన్యువల్... అలాగే, పల్లా రాజేశ్వరరెడ్డికి రైతు సమన్వయ సమితి ఛైర్మన్ పోస్ట్ అలాగే దక్కాయట. పల్లా కుమారుడి పెళ్లికి హాజరైన కేసీఆర్... ఆ తీపికబురును అక్కడే చెప్పి ఖుషీ చేశారట. అలాగే, శాట్స్ మాజీ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో ఫంక్షన్ కు వచ్చి... పదవి రెన్యువల్ వార్తను చెప్పారట. దాంతో, తమ ఇంట్లో కూడా త్వరగా ఏదైనా శుభకార్యం జరిగితే బాగుండ్ను... తమకి కూడా ఏదో ఒక పదవి దక్కుతుందేమోనని పలువురు టీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారట. మరి, ఇది అందరికీ వర్కటవుతుందో లేదో తెలియదు గానీ, గులాబీ నేతలు మాత్రం తమ ఇళ్లల్లో ఏదో శుభకార్యం జరగాలని మాత్రం కోరుకుంటున్నారట.

జగన్ హాజరుకాకపోయినా సీబీఐ కోర్టు ఎందుకు ఊరుకుంటోంది... అసలేమిటి కారణం?

  వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేది లేదని తేల్చిచెప్పి దాదాపు నెలరోజులైపోతోంది. అప్పుడే మూడు శుక్రవారాలు గడిచిపోయాయి. కానీ, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు సీబీఐ కోర్టుకు హాజరుకాలేదు. అయితే, వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదని, తప్పనిసరిగా శుక్రవారం... శుక్రవారం హాజరుకావాల్సిందేనంటూ న్యాయస్థానం తేల్చిచెప్పినా మూడు వారాలుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోర్టుకు రాలేదనేది చర్చనీయాంశంగా మారింది. అయితే, ఏదో ఒక కారణం చెబుతూ మూడు వారాలుగా సీబీఐ కోర్టుకు హాజరుకాలేదని తెలుస్తోంది. కొన్ని వారాలుగా ప్రతి శుక్రవారం జగన్ లాయర్లు సీబీఐ కోర్టులో వివిధ కారణాలతో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఫలానా కారణంతో ఈ వాయిదాకి హాజరుకాలేకపోతున్నారంటూ కోర్టుకు విన్నవిస్తూ వస్తున్నారు. సీబీఐ న్యాయస్థానం కూడా అంతే వెసులుబాటు కల్పిస్తూ కనికరిస్తూ వస్తోంది. అయితే, ఈసారైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టు హాజరవుతారా? లేదా? అనేది హాప్ టాపిక్ గా మారింది.  అయితే, వరుసగా మూడు వాయిదాలకు హాజరుకాకపోతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే అవకాశముంటుంది. కోర్టుకు ఆ అధికారం ఉంటుంది. అయితే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని వారాలుగా ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావడం లేదు. పైగా, వ్యక్తిగత మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను కొట్టివేసిన తర్వాత వరుసగా మూడు వారాలు కోర్టుకు రాలేదు. ఈ లెక్కన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వాలి. అయితే, ఇది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ప్రజాప్రతినిధులకు, అందున ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కొన్ని సెక్షన్ల ప్రకారం మినహాయింపు ఉంటుందని చెబుతున్నారు. సెక్షన్‌ 317 సీఆర్ పీసీ ప్రకారం డిస్పెన్స్ రిట్ పిటిషన్(DISPENCE RIT PITITION) కింద ఆబ్సెంట్ పిటిషన్ (ABSENT PITITION) వేస్తే కోర్టుకు హాజరుకాకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదని న్యాయ నిపుణులు అంటున్నారు. అయితే, ఈ పిటిషన్ ను ఏ వారానికి ఆ వారం సరైన కారణాలతో వేస్తేనే న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటుందని... ఇఫ్పుడు జగన్మోహన్ రెడ్డి లాయర్లు కూడా అదే చేస్తున్నారని అంటున్నారు. అయితే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండటంతో... నిత్యం ఏదో ఒక అధికారిక కార్యక్రమం ఉండటం సహజం. అలాగే, సీఎంను కలవడానికి దేశ విదేశీ ప్రముఖులు వస్తూనే ఉంటారు. ఇలా, ప్రముఖులతో భేటీలు, ఆ సమావేశం యొక్క ఇంపార్టెన్స్, జగన్మోహన్ రెడ్డి కచ్చితంగా ఉండాల్సిన పరిస్థితిని వివరిస్తూ ఏ వారానికి ఆ వారం పిటిషన్ ను దాఖలు చేస్తుండటంతోనే సీబీఐ కోర్టు మినహాయింపు ఇస్తోందంటున్నారు. మరి, ఇది ఎంతవరకు నిజమో... ఒకవేళ నిజమే అయితే... ఇలా ఎంతకాలం ఊరుకుంటుందో... ఎన్ని వారాలు మినహాయింపు ఇస్తుందో చూడాలి.  

ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం వెనుక మహా రహస్యం.. 80 గంటల్లో 40వేల కోట్లు!!

  మహా రాజకీయం కొన్నిరోజుల పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అనేక ట్విస్ట్ ల తరువాత.. శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అయితే అంతకన్నా ముందు పూర్తి మెజారిటీ లేకపోయినా ఎన్సీపీ నేత అజిత్ పవర్ తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం గా అజిత్ పవర్ ప్రమాణస్వీకారం చేసారు. అయితే మూడురోజులు కూడా తిరగకుండానే.. తమకి తగిన మెజారిటీ లేదంటూ రాజీనామా చేసారు. మరి ఈ మాత్రం దానికి ప్రమాణ స్వీకారం ఎందుకు చేసారని అప్పట్లోనే సెటైర్లు వినిపించాయి. కానీ తాజాగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం వెనుక ఓ రహస్యం ఉందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గరున్న రూ.40,000 కోట్ల రూపాయలను కేంద్రానికి తిరిగి అప్పగించేందుకే ప్రమాణ స్వీకారం డ్రామా ఆడారని కర్ణాటకు చెందిన మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఉత్తర కన్నడ లోని ఎల్లపోర్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో అనంత్ కుమార్ హెగ్డే మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన కేంద్రం నిధుల నుంచి రూ.40వేల కోట్లు వినియోగించుకునేందుకు సీఎంకు అధికారం ఉంటుందని.. కొత్త ప్రభుత్వం వస్తే అభివృద్ధి పేరుతో వాటిని దుర్వినియోగం చేస్తుందని భావించిన బీజేపీ.. ఈ ప్రమాణస్వీకారం డ్రామా ఆడిందని అన్నారు. 80 గంటల్లో ఆ డబ్బులు చేరాల్సిన చోటుకు చేరాయని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని తాను ఫడ్నవీస్ తో నిర్ధారించుకన్నట్టు కూడా చెప్పారు హెగ్డే. కాగా, సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో దీనిపై ఫడ్నవీస్ వివరణ ఇచ్చారు. తాను అధికారంలో ఉన్న ఆ కొన్ని గంటల్లో ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అలాంటిది ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆర్ధిక శాఖ దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. అసలు హెగ్డే ఎందుకు అలాంటి ఆరోపణలు చేశారో తనకు తెలియదని ఫడ్నవీస్ అన్నారు.

టార్గెట్ ప్రకాశం.. ఓడిన 4 స్థానాల్లో పట్టుకోసం అడుగులు వేస్తున్న వైసీపీ

  వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచి ప్రకాశం జిల్లా ఆ పార్టీకి కంచుకోట గానే ఉంది. జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని పార్టీ కనబరుస్తూనే ఉంది. కానీ ప్రస్తుతం టిడిపి సొంతం చేసుకున్న కొండేపి, అద్దంకి, పర్చూరు, చీరాల ప్రాంతాలు మాత్రం ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. 2014 ఎన్నికల్లో సైతం ఈ ప్రాంతాల పై పట్టు సాధించాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో జగన్ గాలి తుఫానులా వీచినా కూడా జిల్లాలో టిడిపి ఆ 4 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ నియోజక వర్గాల్లో బలాన్ని పెంచుకోవాలని అధినేత జగన్ సూచించారు. ఈ నేపథ్యంలో జగన్ బాబాయి.. వైవీ సుబ్బారెడ్డితో జిల్లా పరిశీలకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమవడం చర్చనీయాంశమైంది. ఓటమి పాలైన నియోజకవర్గాల పై ఓ వైపు దృష్టిసారిస్తూనే మరోవైపు జిల్లాలోని నియోజక వర్గాల్లో వైసీపీ గెలిచిన ప్రాంతాల్లో పార్టీ స్థితిగతులు నాయకుల పాలనపై అంచనా వేస్తున్నారు. వైసీపీ వర్గాల నుంచి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. ఆ నివేదికను జగన్ కు ఎప్పటికప్పుడు అందించి పార్టీ పై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని జనాలంటున్నారు. ఓటమి చెందిన 4 ప్రాంతాల్లో నాయకత్వం పై దృష్టి సారించి అక్కడ లోపాలను తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో మొత్తం క్లీన్ స్వీప్ చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు.  మరోపక్క జమిలి ఎన్నికలు రావొచ్చనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన టిడిపి ఇప్పటి నుండే మండల స్థాయి నుంచి నియోజక వర్గం జిల్లా నాయకత్వం వరకు సమీక్షలు నిర్వహించేలా అధినేత చంద్రబాబు పక్కా ప్లాన్ వేస్తున్నారు. అందుకే వైసీపీ కూడా ఈ 4 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రచిస్తోంది అంటున్నారు. అమరావతిలో వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు కలిసి జిల్లాలో పార్టీ పరిస్థితులు, నాయకుల పాలన, సమస్యలపై బాలినేనితో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. పర్చూరులో రావి రామనాథం నాయకత్వం పై అనుమానాలు వ్యక్తం చేయగా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామని డిసైడ్ చేశారు. అవసరమైతే ఎన్నికలకు ఏడాది ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయానికి వచ్చారు. అద్దంకి, కొండపి నియోజక వర్గాల్లోనే నాయకత్వం పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అక్కడ పూర్తి స్థాయిలో దృష్టి సారించి అవసరమైతే తమ రిమోట్ లోకి తీసుకుని అయినా సరే పార్టీని పటిష్టం చేసేలా చర్యలు తీసుకోవాలని బాలినేనికి సూచించారు. చీరాలలో రోజుకొక వివాదం అక్కడ పార్టీ పరిస్థితులు నాయకుల చేరికల పై ఆరా తీసినట్టు సమాచారం. పరుచూరులో ఎదురైన పరిస్థితులను చివరి వరకూ తెలుసుకోలేకపోవడం పై డిస్కస్ చేసుకున్నారు. మొత్తం మీద ఇప్పటి నుంచి ఆ నియోజక వర్గాల్లో పట్టు సాధించటానికి పనులు మొదలుపెట్టేశారని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు.

విదేశంలో విషాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం

  డిసెంబర్ 1న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఒకరిని విజయవాడకు చెందిన వైభవ్ గోపిశెట్టిగా గుర్తించారు. టేనస్సీ స్టేట్ యూనివర్సిటీలో వైభవ్ ఫుడ్ సైన్స్ లో పీహెచ్ డీ చేస్తున్నారు. అక్కడే ఎంఎస్ చేస్తున్న జుడీ స్టాన్లీ పిని రియోతో కలిసి రాత్రి ఓ పార్టీకి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు ఓ ట్రక్కును ఢీకొట్టింది.ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన ట్రక్ కు డ్రైవర్, డేవిడ్ స్టోరేజ్ వాహనం అక్కడే వదిలి పరారైనట్టు పోలీసులు పేర్కొన్నారు. తమ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందడం పట్ల టీఎస్ యూ సంతాపం ప్రకటించింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. ఈ ఘటన దురదృష్టకరమని అట్లాంటాలోని భారత రాయబార కార్యాలయం బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది అని అధికారులు తెలియజేశారు. భారత ఎంబస్సి వారిని సంప్రదించి ఆ ఇద్దరి మృతదేహాలను వారి ఇంటికి చేరేలా చెయ్యాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరారు.  

తమిళనాడులో ఘోర ప్రమాదం.. భారీ వర్షానికి భవనం కూలి 17 మంది మృతి

  తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఊటీ , మెట్టుపాళ్యంలోని ఓ కొండ పై ఉన్న భవంతి గోడ కూలిన ఘటనలో 17 మంది చనిపోయారు. మెట్టుపాళ్యం ప్రాంతంలో కూలిన బిల్డింగ్ శిథిలాల కింద కూడా పలువురు చిక్కుకుపోయారు. భారీ వర్షాలకు గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ లో నివసిస్తున్న వారు శిథిలాల కింద ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 15 మంది మృతదేహాలను బయటకు తీశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. బాధితులు అంతా కూడా ఊటీ సమీపంలో టీ ఆకు తోటల్లో పని చేసే కార్మికులు. వీళ్లంతా కూడా ఆ కొండ ప్రాంతంలో వరుసగా ఇళ్ళను కూడకట్టనున్నారు.  ప్రతిసారీ వరదలు భారీ వర్షా లు కురిసినప్పుడు అది కూడా మూడు నాలుగు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఆ కొండ ప్రాంతంలో మట్టి కదిలి కొన్ని సార్లు కొండచరియలు విరిగిపడుతుండడమే కాక కొన్నిసార్లు ఇళ్ళు కూడా కుప్పకూలిపోతూ ఉండటం అక్కడ సహజమే. గతంలో కూడా ప్రమాదాలు జరిగిన ఘటనలు ఉన్నాయని అక్కడి స్థానికులు వెల్లడించారు. ఈ తరహా ఇంత మంది ప్రాణాలు పోయిన సందర్భం ఘటన మాత్రం ఇదే మొదటి సారి అని తెలుస్తొంది. గత మూడు రోజులుగా మట్టి బాగా నాని ఉండటంతో పెద్దగోడ ఒక్కసారిగా కూలీ ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుంది. చనిపోయిన వారిలో ఏడుగురు మహిళలు మరో ముగ్గురు పిల్లలున్నారు, ఇంకో పదిహేను మంది వరకూ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కేంద్ర నిర్ణయం.. దేశమంతటా ప్రైవేట్ అవ్వనున్న ఎయిర్ పోర్టులు

  ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశంలో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ పూర్తయ్యింది. ఆ దిశగానే మరి కొన్ని విమానాశ్రయాలను ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారణాసి సహా దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో లక్నో, అహ్మదాబాద్, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గౌహతి విమానాశ్రయులను నిర్వహణ అభివృద్ధి కార్యకలాపాల కోసం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. ఇప్పుడు కొత్తగా ఆ జాబితాలో మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని డబ్ల్యుఎఫ్ఐ ప్రతిపాదించింది.  ఇప్పటికే ఆరు విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేశారు. వాటితో పాటు అమృతసర్, వారణాసి, భువనేశ్వర్, ఇండోర్, రాయిపూర్, తిరుచి విమానాశ్రయా లను కూడా ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించాలని సెప్టెంబర్ 5న జరిగిన బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బోర్డు నిర్ణయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపించారు. నిజానికి దేశ వ్యాప్తంగా డబ్ల్యుఐఐ వందకు పైగా విమానాశ్రయాల నిర్వహణ బాధ్యతలను చూసుకుంటోంది. మొదటి దశ ప్రైవేటు పరంలో భాగంగా అదాని గ్రూప్ ఆరు విమానాశ్రయాల నిర్మాణ కాంట్రాక్టును సొంతం చేసుకుంది. దీనికి జులై 3న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు విమానాశ్రయాల నిర్వహణను అదానీ సంస్థకు అప్పగించారు. మరో మూడింటిని అప్పగించాల్సి ఉంది. మొత్తానికి భారత్ లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ పై అటు ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇటు కేంద్ర ప్రభుత్వం సైతం దూకుడుగానే వెలుతున్నాయి. అయితే దేశంలోని అన్ని విమానాశ్రయాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి మాత్రం ఇంకొంచెం సమయం పట్టే అవకాశముందని సమాచారం.

పత్తి రైతుల కష్టాలు.. కనీస ధరలో సగం దోచేస్తున్న సీసీఐ అధికారులు

  కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ సంవత్సరం కురిసిన వర్షాలకు పత్తి విస్తీర్ణం బాగానే పెరిగింది. దిగుబడి అధికంగానే వచ్చినప్పటికీ వరుసగా కురిసిన వర్షాలకు తెల్ల బంగారం నల్ల పడింది. ఇటు సీసీఐ అధిక తేమ ఉంటే కొనుగోలు చేయమని ఆంక్షలు విధించారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 1,35,000 హెక్టార్లలో రైతులు పత్తిని సాగు చేశారు. అయితే పత్తి పూత, తీత సమయంలో అధిక వర్షాలు కురవడంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా కష్టాలు పడ్డారు. ఎన్నో చీడపీడల నుండి పంటను రక్షించుకున్న పత్తి తీత సమయంలో అకాల వర్షాలకు తడిసి పోయింది.  పత్తి కొనుగోళ్ల కోసం 15 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పత్తిలో 8 నుండి 12 శాతంకు మించి తేమ ఉంటే ధరలో కోత పెడుతున్నారు. దీంతో కొనుగోలు కేంద్రానికి తెచ్చిన పత్తి ఇంటికి తీసుకెళ్లలేక రైతులు వచ్చిన కాడికి అమేస్తున్నారు. ఇది తెలిసిన మిగతా రైతులు కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. ఇదే అదనుగా దళారీలు గ్రామాల్లో తిరుగుతూ రైతులకు మాయ మాటలు చెప్పి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.  ఈ ఏడాది కేంద్రం క్వింటా పత్తికి కనీస మద్దతు ధరను రూ.5,500 రూపాయలుగా నిర్ణయించింది. అయితే తేమ పేరుతో సిసిఐ ఆంక్షలు విధించడంతో వ్యాపారులకు సందు దొరికింది. క్వింటాకు కేవలం రూ 3,500 నుంచి రూ.3,800 వరకు మాత్రమే చెల్లిస్తూ రైతులను దోచేస్తున్నారు. ఓ వైపు పత్తి తీతలకు క్వింటాకు వెయ్యి రూపాయల చొప్పున కూలీలకు చెల్లించాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి రావడం కూడా రైతులకు కష్టంగా మారింది. అదునులో కురిసిన వర్షాలకు ఈ ఏడాది పత్తి మంచి దిగుబడి వస్తుందనుకున్న రైతులకు నిరాశే మిగిలింది. అకాల వర్షాలతో పత్తి తడవడంతో వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోళ్లు జరపడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సీసీఐ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేసి పత్తి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

2024 వరకు ఉండనిస్తారా?.. సుప్రీం తీర్పుపై ఆధారపడనున్న గంగూలీ భవిష్యత్తు

  బీసీసీఐ బాస్ గా సౌరవ్ గంగూలీ స్పెషల్ గా నిలుస్తున్నాడు. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గానూ తన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికే డే అండ్ నైట్ టెస్టు నిర్వహణలో మంచి మార్కులు కొట్టేశాడు సౌరవ్. అదే ఊపులో లోధా సంస్కరణల మార్పుపై కూడా ఫోకస్ పెట్టాడు. సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారిగా ఏజీఎం సమావేశం జరిగింది. గంగూలి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ క్రికెట్ సలహాదారుల కమిటీ ఐసీసీలో బోర్డు ప్రతినిధి నియామకం వంటి కీలకాంశాలపై చర్చ జరిగింది. లోధా సంస్కరణల మార్పుకు సభ్యులు ఆమోదం తెలిపారు. దీనిని సుప్రీంకోర్టు ఆమోదించాల్సి ఉంది.  సుప్రీం కోర్టు కూడా ఆమోదిస్తే బీసీసీఐ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో వరుసగా ఆరేళ్ల పాటు పదవిలో వున్న ఆఫీస్ బేరర్ మూడేళ్లు తప్పనిసరి విరామం తీసుకోవాలనే లోధా కమిటీ షరతు ఉండదు. క్యాబ్ అధ్యక్షుడిగా 5 ఏళ్లు పని చేసిన గంగూలి 9 నెలల్లో బీసీసీఐ అధ్యక్ష పదవిని విడిచిపెట్టాల్సిన అవసరముండదు. అంటే గంగూలి 2024 వరకు బీసీసీఐ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశముంటుంది.  గంగూలీతో పాటు బీసీసీఐ కార్యదర్శి జైషా కూడా పూర్తికాలం తన పదవిలో కొనసాగే వీలుంటుంది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశాలకు బీసీసీఐ ప్రతినిధిగా జైష హాజరు కానున్నారు. సెలక్షన్ కమిటీ పదవీ కాలం ముగిసిందని బీసీసీఐ ప్రకటించింది. పాత నిబంధనల ప్రకారమే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెస్కే ప్రసాద్ సారథ్యం లోని సెలెక్షన్ ప్యానెల్ పదవీ కాలం ఫినిష్ అయిందని ఏజీయం తర్వాత గంగూలీ చెప్పాడు. బీసీసీఐ పాలనలో అడుగడుగునా అడ్డంకిగా మారుతున్న లోధా సంస్కరణలకు దాదా చెక్ పెట్టేలా ముందుకు వెళ్తున్నాడు. బీసీసీఐ బాస్ గా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. బీసీసీఐ ఇమేజ్ ను పెంచాలనే పట్టుదలతో ఉన్నాడు.

పేరుకే కలెక్టర్.. పని చేస్తుంది వైసీపీ ప్రభుత్వానికి.. ప్రజలకు కాదు

  పని తక్కువ ఉన్నా పనితనం ఎక్కువగా కనిపించేలా  సొంత పబ్లిసిటీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు ఇద్దరు కలెక్టర్లు. మరో ఇద్దరు అయితే అధికార పార్టీ అధికార ప్రతినిధిని మించిపోయేలా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమను కలవాలంటే వైసీపీ నేతల అనుమతి తీసుకోవాలని.. వారు ఫోన్ చేసి చెబితేనే అపాయింట్ మెంట్ ఇస్తామనే విధంగా రూల్స్ పాటిస్తున్నారు. వీరి తీరుతో అధికార పార్టీ నేతలు జిల్లా స్థాయి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పుడు రాయలసీమలో ఎక్కడ చూసినా వీరి గురించే చర్చలు సాగుతున్నాయి. సీమకు చెందిన ఓ అధికారి ప్రజలకు చిక్కడు దొరకడు. మీరు కలవాలని.. మాట్లాడాలని.. ఆశపడితే సోషల్ మీడియాలో దర్శనమిస్తారు. మీకు బైక్ రైడింగ్ ఆసక్తి ఉంటే ఆయనతో పాటు లాంగ్ డ్రైవ్ కు కూడా వెళ్లవచ్చు. అలా ఆయనతో లాంగ్ డ్రైవ్ కి వెళ్లాలంటే  సోషల్ మీడియాలో ఆయన గారిని విపరీతంగా పొగడాలి. సీఎంకు, అధికార పార్టీ సోషల్ మీడియాకు చేరేలా ఆయనను ప్రమోట్ చేయాలి. ఈ షరతులకు మీరు సై అంటే ఆయన సై సై అంటారు. ఆయన ఆఫీసులో.. ప్రజల మధ్య కంటే.. రైడింగ్, టూర్లు, స్పెషల్ ఫ్రెండ్లీ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. వీటిలో పాల్గొనే వారికి కలెక్టర్ హోదాలో సకల ఏర్పాట్లు రాచ మర్యాదలు చేయిస్తుంటారు. ఓ వైపు ఇలా జరుగుతున్నప్పుడే ఆయన అపర ప్రజాబంధు ప్రజల కలెక్టర్ అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుంటారు. దీనికోసం కలెక్టరేట్లో ఇద్దరు నిపుణులు పనిచేస్తున్నారు. కలెక్టర్ టూర్లో ఉన్నప్పుడు ఆయన లేని లోటు కనిపించకుండా ఉండటానికి ఈ ప్రత్యేకమైన ప్రమోషన్. ఇక జిల్లాలో పరిపాలన భారమంతా జూనియర్ల పైనే ఉంటుంది. కేవలం బలహీన వర్గాల కోసమే గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామని అంటారు కానీ ఆయన మాత్రం అక్కడికి రారు.  ప్రభుత్వానికి అత్యంత కీలకమైన జిల్లాలో నమ్మకస్తులు.. నిజాయితీపరుడని పేరున్న వ్యక్తిగా భావించి కలెక్టర్ గా నియమిస్తే ఆయన ప్రజాపాలన మరచి రాజకీయ సేవల్లో తరించిపోతున్నారు. పాలనా వ్యవహారాలు పక్కన పెట్టి సచివాలయం మొదలు ఆయా శాఖల్లో ఎవరు ఏ పోస్టులో ఉండాలో ఎవరిని ఎక్కడ నియమించాలో ప్రభుత్వ పెద్దలకే దిశా నిర్దేశం చేస్తుంటారు. జిల్లా స్థాయిలో వైసీపీ నేతలు ,ఏ పని చేయాలి ఏ విషయంలో తలదూర్చిలో కూడా పై నుంచి చెప్పిస్తుంటారని చెబుతున్నారు. ఇటీవల ఓ ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు ఓ పెద్దమనిషి కలెక్టర్ అపాయింట్ మెంట్ కోరారు. ఓ వైసీపీ నేత పేరు చెప్పి ఆయనతో ఫోన్ చేయించుకొని రావాలని చెప్పి ఆ ఫోన్ వచ్చాకే అపాయింట్ మెంట్ ఇచ్చారట ఈ కలెక్టరు గారు. పేదలకు ఇళ్లు ఇచ్చే విషయంలో లబ్ధిదారుల ఎంపిక జాబితా పై నియోజకవర్గం వారిగా ఎమ్మెల్యేల ఆమోదం తీసుకోవాలని.. వారి అనుమతి లేకుండా ఒక్క పేరును కూడా లిస్ట్ లో చేర్చవద్దంటూ హుకుం జారీ చేయటం అధికారుల్లో విస్మయానికి గురిచేస్తుంది.నోరు తెరిస్తే అధికారులను పచ్చి బూతులు తిట్టడం ఆయన శైలిగా చూపుతున్నారు. ఇటీవల ఓ వైసీపీ నేతపై సైతం ఇదే భాష ప్రయోగించడంతో రచ్చ జరిగిందని నేతలు పేర్కొంటున్నారు.

నిబంధనలను పాటిస్తేనే.. మళ్ళీ ప్రారంభం కానున్న గోదావరి బోటు విహారం

  గోదావరి నది వయ్యారాలు.. పచ్చని అందమైన కొండలు.. అనగానే పాపికొండలు కళ్ల ముందు కదలాడతాయి. బోటులో ప్రయాణిస్తూ మైమరిచిపోయి ఎన్నో అనుభూతులు మిగిల్చే ఈ విహార యాత్రలో ఇటీవల కచ్చులూరు ఘటన తీరని విషాదాన్ని నింపింది. వశిష్ట రాయల్ బోటు నిర్లక్ష్యం 50 మందిని బలి తీసుకునేలా చేసింది. దీంతో పాపికొండల పర్యాటకానికి బ్రేక్ పడింది. అయితే మళ్లీ పాపికొండలను చూడలేమా అక్కడికే వెళ్ళలేమా అనుకునేవారి ఎదురు చూపులు త్వరలోనే నెరవేరబోతున్నాయి. కానీ ఈ సారి నిర్దిష్టమైన నిబంధన మధ్య పాపికొండల ప్రయాణం సాగనుంది. నదిలోకి బోటు దిగుతుంది అంటేనే అన్ని ప్రమాణాలు పాటిస్తేనే ముందుకు కదిలే అవకాశం ఉంటుంది. అంతేకాదు ప్రతి బోటు ప్రయాణం పై వివిధ దశలో నిఘా ఉంచబోతున్నారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటుతో పాటు పాపికొండల ప్రాంతంలో తిరిగే ప్రతిబొట్టు కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు.  వశిష్ట బోటు ప్రమాదం తరువాత రెండు నెలలుగా పాపికొండల యాత్ర నిలిచిపోవడంతో టూరిజం పై ఆధారపడిన చాలా కుటుంబాలు ఉపాధిని కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పర్యాటకుల భద్రతే ప్రధానం అన్న కాన్సెప్ట్ తో ప్రభుత్వం ముందుకు కదులుతోంది. జల పర్యాటకాన్ని మరింత కఠినతరం చేస్తోంది. టూరిజం శాఖ ఆధ్వర్యంలోనే ఇక పై బోట్లు నడవనున్నాయి. లైఫ్ జాకెట్ లతో పాటు బోటు అనుకూలత, కండిషన్ ను ఖచ్చితంగా చూడనున్నారు. బోటు డ్రైవర్లకు కూడా మరింత శిక్షణ ఇచ్చి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి, ఎలా ముందుకు సాగాలన్న దాని పై శిక్షణ ఇవ్వనున్నారు. టూరిజం అధికారులు ఇప్పటికే 83 బోట్లను పరిశీలించారు. వారిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగానే ఆ బోట్లు పాపికొండల్లో తిరుగుతాయా లేదా అన్నది తేలనుంది. పోచవరం వైపు వెళ్లే బోట్లను వెరిఫై చేయవలసి ఉంది. అన్ని అనుమతులు నిబంధనలు పాటిస్తేనే పాపికొండల ప్రయాణం ఉంటుంది. దేవీపట్నం దాటిని తరువాత పాపికొండల ప్రయాణంపై నిఘా ఉండటం లేదు. పెట్రోలింగ్ చేసే అవకాశమూ లేదు. సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో మైనస్ గా మారింది. ఈ క్రమంలో బోటింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘాలో ఆరు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.  రాజమహేంద్రవరం, పోసమ్మగండి, దేవీపట్నం, సింగనపల్లి పేరంటాలపల్లి, పోచవరం వద్ద వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాల్లోనే టిక్కెట్ లను కూడా విక్రయించనున్నారు.వాస్తవానికి బోటు ప్రయాణం చెయ్యడానికి రూట్ మ్యాప్ తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యత ను ఇరిగేషన్ శాఖ అధికారులకు అప్పగించింది. రూట్ మ్యాప్ సిద్ధమైతే తప్ప బోట్లు తిరిగే ఆస్కారం లేదు. అప్పటి వరకూ ఓ పైలెట్ బోటు నడిపించి ముందుకు సాగుదామనుకున్న ప్రతిపాదన వచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ దానిని తిరస్కరించారు. నిబంధనలు అన్నీ పూర్తయి రూట్ మ్యాప్ వస్తే కానీ బోటు షికారు చేయటం కుదరదని చెప్పేశారు. అప్పటి వరకు పాపికొండలను చూడాలనుకునే వారికి ఎదురు చూపులు తప్పవు.