విశాఖపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి.. మెట్రోతో పాటు మరిన్ని వరాలు

  విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. మాస్టర్ ప్లాన్ ప్రతిపాదన నివేదికను సీఎం పరిశీలించారు. మెట్రో రైలు మార్గం మొత్తం 140.13 కిలోమీటర్ లతో ఏర్పాటు చేయాలని అధికారులు డిజైన్ చేశారు. ఈ దశలో 10 కారిడార్ల నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ మొత్తం 46.40 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేయనున్నారు. తొలి దశలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.23 కిలోమీటర్ల కారిడర్, గురుద్వారా ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.26 కిలోమీటర్ల కారిడార్, తాటిచెట్లపాలెం నుంచి ఆర్కే బీచ్ వరకు 6.91 కిలో మీటర్ల మేర కారిడర్ ఉండనున్నాయి. తొలి దశ మెట్రోను 2024 సంవత్సరానికల్లా పూర్తి చేసేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వాడుతున్న మెట్రో రైల్ మోడళ్లను పరిశీలించి బెస్ట్ మోడల్ ఎంపిక చేయాలని ఆదేశించారు సీఎం జగన్. మెట్రో రైల్ కోచ్ నుంచి స్టేషన్ల నిర్మాణం వరకు అత్యుత్తమ విధానాలు పాటించాలని అధికారులకు సూచించారు.  ముంబై మెట్రో నిర్మాణంలో పిల్లర్ డిజైను పరిశీలించాలన్న సీఎం.. ప్రతి స్టేషన్ వద్ద ప్రధాన జంక్షన్ల వద్ద పార్కింగ్ కు స్థలాలు ఉండే విధంగా డిజైన్ చేయాలన్నారు.  మరోవైపు గ్రేటర్ విశాఖకు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపైన ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. నగరాభివృద్ధిపైనా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు. పోలవరం వద్దే నీటిని ఫిల్టర్ చేసి అక్కడి నుంచి విశాఖకు పంపిణీ చేయాలన్నారు. కెనాల్స్ ద్వారా వస్తున్న నీటిని 40 శాతం వృథా అవుతున్న పరిస్థితుల్లో పైపు లైన్ ద్వారా తాగునీటి సరఫరా అత్యవసరమని అధికారులు తెలిపారు. పరిశ్రమల అవసరాల కోసం డీశాలినేషన్ వాటర్ ప్లాంటు ఏర్పాటుపై సీఎం చర్చించారు. ఇజ్రాయిల్ తరహాలో మనం కూడా పరిశ్రమలకు ఫ్రెష్ వాటర్ కాకుండా డిసాలినేషన్ నీటిని వాడే ఆలోచన చేయాలన్నారు. లీటర్ నీటికి 4 పైసలు ఖర్చవుతుందన్న సీఎం అలా డిసాలినేషన్ చేసిన నీటిని పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. అలాగే విశాఖ నగరంలో వ్యర్థాల నిర్వహణపైనా సీఎం జగన్ దృష్టి సారించారు. భూగర్భ జలాలు కలుషితం కాకుండా తీసుకోవాల్సిన చర్యల పై సీఎం పలు సూచనలు చేశారు. కాపులుప్పాడలోని డంపింగ్ యార్డ్ లో బయో మైనింగ్ ప్రక్రియకు సీఎం ఆమోదించారు. అన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. బీచ్ రోడ్ లో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు.  

విశాఖలో విందు.. అచ్చట అన్ని ఆవు నూనెతోనే చేయబడును

  ఆవు కనిపిస్తే దండం పెడతాము.. గోవును తాకి కళ్ళకు అద్దుకుంటాము.. మూడు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలను పూజించినట్టేనని భావిస్తాము.. కానీ విశాఖ జిల్లా అనకాపల్లిలో మాత్రం అత్యంత క్రూరంగా ఆవులను చంపేస్తున్నారు. ఆవు మాంసం కోసం ఏకంగా సంతలకు వెళ్లి మరీ కొనుగోళ్లుచేస్తున్నారు. ఇదంతా కేవలం మాంసం కోసమే అనుకుంటే పొరపాటే ఎందుకంటే మాంసం అమ్మగా మిగిలిన కొవ్వుతో నూనెలు తయారు చేస్తున్నారు. ఈ నూనెను ఎక్కడో కాదు విశాఖకే సప్లై చేస్తున్నారు. ఎవరికి అనుమానం రాకుండా డబ్బాల్లో నింపుతూ సరఫరా చేస్తున్నారు. కొన్నిసార్లు మంచి నూనెలో కలిపి మరీ అమ్ముతున్నారు.  విశాఖలో ఆవు కొవ్వుతో తయారైన నూనె వాడుతున్నారని ఎవరికీ తెలియదు. ఏమో రోడ్డు మీద మీరు తినే పకోడిలు, మిర్చి బజ్జీలు, వేడి వేడి సమోసాలు ఆవు కొవ్వు నుండి తీసిన నూనె తోనే తయారు చేస్తున్నారేమో. ఎందుకంటే ఆవుల్ని చంపి కొవ్వు తీసి దాని నుంచి నూనె తయారు చేసి రోడ్డుపై తినుబండారాలు అమ్మే షాపులకు అమ్ముతున్నామని స్వయంగా ఒప్పుకున్నారు. పైగా పామాయిల్ కంటే తక్కువ రేటుకే వస్తుండటంతో వ్యాపారులు కూడా ముందూ వెనుక చూడకుండా కొనేస్తున్నారు.  అనకాపల్లి నుంచి విశాఖ వెళ్లే దారిలో సుంకరమెట్ట వద్ద నిత్యం జన సంచారం ఉండే ప్రాంతంలో ప్రభుత్వం లక్షలాది రూపాయల వ్యయంతో స్లాటర్ హౌస్ ను నిర్మించింది. ఈ భవనంలో గోవధ చేస్తూ కొవ్వుతో నూనె తయారు చేసి డబ్బాలో నింపుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండేలా భవనం గేట్లను మురికిగా ఉన్న వస్త్రాలతో కప్పేశారు. బయటి నుంచి చూసేవాళ్ళు బిల్డింగ్లో ఏమీ జరగడం లేదని లోపల ఏమి లేదు అనిపించేలా ఉంటుంది.  వార్డు పర్యటనలో భాగంగా జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామమూర్తి స్లాటర్ హౌస్ వైపు వచ్చారు. భయంకరమైన దుర్వాసన చెత్తా చెదారంతో ఉండటంతో వెళ్లి చూశారు, చూసి షాకయ్యారు. పదేళ్ల క్రితం నిర్మించిన భవనంలో ఏం జరుగుతుందో ఇప్పటి వరకూ గుర్తించలేని స్థితిలో ఉన్నామా అనుకున్నారు అధికారులు. స్లాటర్ హౌస్ లో చిక్కిన నిందితుడు కొల్లి సూరిబాబును అధికారులు పోలీసులకు అప్పగించారు. ఈ వ్యాపారంలో ఎవరెవరి పాత్ర ఉంది ఎంత ఉంది అనే దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో వేపచేదు రమణ అనే వ్యక్తి ప్రమేయం ఉందని గుర్తించిన పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు. సబ్బుల్లో ఆవు కొవ్వుతో తయారు చేసే నూనెను వాడుతారని వారికి ఈ నూనెను అమ్ముతున్నామని విచారణలో నిందితులు చెప్పారు. ఇది ఎవరికి అమ్ముతున్నారన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

తెలంగాణ కొత్త సీఎస్ గా అజయ్ మిశ్రా?

  తెలంగాణకు కొత్త ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ప్రస్తుత సీఎస్ జోషి పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ఆ స్థానంలో ఎవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సీనియారిటీ ప్రకారం చూస్తే జోషి తర్వాత అజయ్ మిశ్రా ఉన్నారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన మిశ్రా, 1960 జూలై 16 న జన్మించటంతో ఆయన పదవీ విరమణ 2020 జూలై వరకు ఉంటుంది. ప్రస్తుతం ఆయన ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అజయ్ మిశ్రాను సీఎస్ గా నియమిస్తే ఆయన కేవలం 7 నెలలే ఆ పదవిలో కొనసాగే అవకాశముంది. ఇక తెలంగాణ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారులు కూడా రేసులో ఉన్నారు. ఇందులో వీపీ ఆచార్య టాప్ లో ఉన్నారు. అయితే జోషి కంటే ఆచార్య సీనియర్ అయినప్పటికీ గతంలో అతని పక్కన పెట్టారు కేసీఆర్. జోషిని సీఎస్ గా నియమించారు. దీంతో ఈసారైన ఆచార్యకు అవకాశం కల్పిస్తారా లేక పక్కనపెడతార అన్నది ఆసక్తికరంగా మారింది. పలువురు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా సీఎస్ రేసులో ఉన్నారు. వినయ్ కుమార్, పుష్పా సుబ్రమణ్యం, హీరాలాల్ పేర్లను కూడా సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త సీఎస్ గా ఎవరు బాధ్యతలు చేపడతారన్నది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సీఎస్ గా రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ఆయన తర్వాత ప్రదీప్ చంద్ర సీఎస్ గా వచ్చారు. అయితే కేవలం నెల రోజులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా పని చేశారు.

ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్ వచ్చింది

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఢిల్లీ హై కోర్టు బెయిల్ ఇవ్వకపోవడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 106 రోజులుగా తీహార్ జైల్లో ఉన్న చిదంబరం ఎట్టకేలకు విడుదల కానున్నారు. 2 లక్షల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని మీడియాతో మాట్లాడవద్దని జస్టిస్ ఆర్.భానుమతితో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఆర్థిక నేరాలు తీవ్రమైనవి అయినప్పటికీ కూడా ప్రతి కేసునూ విడివిడిగా చూడాలన్న ధర్మాసనం చిదంబరానికి బెయిలు మంజూరు చేసింది.  కస్టడీలో ఉన్న సమయంలో కూడా చిదంబరం సాక్ష్యాలను తారుమారు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. మనీలాండరింగ్ లాంటి ఆర్థిక నేరాలు ఆర్ధిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో చిదంబరానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రమేయం లేదని కపిల్ సిబాల్ తో పాటు అభిషేక్ మను సింగ్ వాదించారు.  ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఆగస్టు 21 న సీబీఐ చిదంబరాన్ని అరెస్ట్ చేసింది. సీబీఐ పెట్టిన కేసులో బెయిల్ మంజూరైన అప్పటికే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా చిదంబరం చుట్టూ ఉచ్చు బిగించడంతో జైలుకే పరిమితం అయ్యారు. 2007 లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఐఎన్ఎక్స్ మీడియాలోకి 305 కోట్ల రూపాయల విదేశీ నిధులను తరలించడంలో ఆర్థిక మంత్రి హోదాలో క్విడ్ ప్రోకు పాల్పడ్డారఅన్నది చిదంబరం పై వున్న అభియోగం. తండ్రికి బెయిల్ లభించడంతో కార్తీ చిదంబరం హర్షం వ్యక్తం చేశారు. 106 రోజుల తర్వాత బెయిల్ వచ్చిందంటూ ట్వీట్ చేశారు.

నావల్లే వైసీపీ గెలిచింది.. వాళ్లు నాకు చేతులెత్తి దండం పెట్టాలి: పవన్

  పవన్ కళ్యాణ్ బీజేపీకి దగ్గరవుతున్నాడని, త్వరలో జనసేనని బీజేపీలో విలీనం చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడని.. వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పవన్ స్పందించారు. తాజాగా ఆయన తిరుపతిలో మీడియాలో మాట్లాడుతూ.. అసలు తాను బీజేపీకి దూరంగా లేనని.. కలిసే ఉన్నానని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా అంశంలోనే బీజేపీతో విభేదించానని అన్నారు. అసలు ఆ మాటకొస్తే.. వైసీపీ వాళ్లు నాకు రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలన్నారు. ఎందుకంటే.. నేను బీజేపీ, టీడీపీతో కలిసి మళ్లీ పోటీ చేసి ఉంటే వైసీపీ ఎక్కడ ఉండేది? అసలు వైసీపీ అధికారంలోకి వచ్చేదా? అని ప్రశ్నించారు. నేను విలువలకు కట్టుబడి ఒంటరిగా పోటీ చేశాను అని చెప్పుకొచ్చారు. వైసీపీకి అమిత్ షా అంటే భయం.. కానీ నాకు ఆయనంటే గౌరవం.. అందుకే వైసీపీ వాళ్లకి విమర్శలు చేయడం తప్ప.. ఇంకేం తెలియదని పవన్ విమర్శించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించడంతోనే వైసీపీ ప్రభుత్వం సమయం వృధా చేస్తోందని విమర్శించారు. మాజీ సీఎం ఇల్లు కూల్చివేతపై ఉన్న శ్రద్ధ సమస్యలపై లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి సామాన్యుడి కష్టాలు పట్టవా? అని ప్రశ్నించారు. కియా పరిశ్రమ సీఈవోను వైసీపీ నేతలు బెదిరించారు.. ఇక రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి అని నిలదీశారు. ఇంగ్లీష్‌ మీడియం అవసరమే.. కానీ అసలు తెలుగుమీడియం లేకుండా చేస్తే ఎలా? అని ప్రశ్నించారు. తెలుగు మీడియం తీసేసినట్టుగా.. ఉర్దూ మీడియం కూడా తీసేసి ఇంగ్లీష్‌ మీడియాన్ని ప్రోత్సహించగలరా? అని నిలదీశారు. తెలుగు భాషను పరిరక్షించమంటే వైసీపీ వక్రీకరిస్తోందని పవన్ మండిపడ్డారు.

విజయవాడలో సామూహిక మత మార్పిడి.. సాక్ష్యం చూపించి మరీ పవన్ ఫైర్

  విజయవాడలోని పున్నమి ఘాట్‌లో క్రైస్తవ మత మార్పిడులు జరగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పున్నమి ఘాట్ వద్ద స్నానాలు చేయించిన పాస్టర్లు పెద్ద ఎత్తున మత మార్పిడి కార్యక్రమం నిర్వహించారు. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టి మత ప్రచారం చేసుకుంటూ 47 మందిని మతం మార్పించారు. అంతేకాదు, పున్నమి రిసార్ట్స్ గేట్ ఆర్చికి మేరీమాత విగ్రహాన్ని పెట్టారు. ఇంద్రకీలాద్రికి అత్యంత సమీపంలో ఇలా అన్యమత ప్రార్ధనలు, మత మార్పిడి జరగడం వివాదాస్పదమవుతోంది. దీనిపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇతర మతాల వారు ప్రచారం చేసుకోవడం, మార్పిడులకు పాల్పడటం నిషేదం ఉన్నా పాస్టర్లు పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అమ్మవారి ఆలయం వద్ద ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇటీవల తిరుమలలో కూడా అన్యమత ప్రచార ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతిలో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారని తెలిపారు. హిందూ ధర్మ పరిరక్షణ అంశంపై కూడా తన వ్యాఖ్యలను వైసీపీ వక్రీకరించిందని, మాటలను వక్రీకరించడమనేది వైసీపీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి అండతో ఏపీలో సామూహిక మత మార్పిడులు జరుగుతున్నాయని పవన్ నిలదీశారు. మత మార్పిడుల మీద వైసీపీ ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి. లేదంటే ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు. అత్యధిక మెజారిటీ ఉన్న ప్రభుత్వం మీది. పాలన సరిగ్గా ఉండాలి అని పవన్ అన్నారు. అంతేకాదు, సామూహిక మత మార్పిడి జరుపుతోన్న వీడియోను కూడా పవన్ మీడియా ద్వారా విడుదల చేసారు. దీంతో ఈ అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మత మార్పడిపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

వలస పక్షులతో కలకలలాడుతున్న నగరంలోని చెరువులు

  వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే ఎన్నో రకాల పక్షులకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమిస్తోంది. చలికాలం ప్రారంభమైందంటే చాలు ఏటా వర్ణ శోభితమైన పక్షులు నగరంలో చెరువుల్లో సందడి చేస్తుంటాయి. ప్రస్తుతం నగర శివారు లోని అమీన్ పూర్, గండిపేట చెరువులకు విదేశీ వలస పక్షులు వస్తుండడంతో నూతన శోభ సంతరించుకుంటున్నాయి. సైబీరియాలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లడం తద్వారా వాటికి ఆహార సమస్య ఎదురవడం వంటి కారణాలతో అత్యంత సురక్షిత ప్రాంతంతో పాటు ఆహారం దొరికే ప్రాంతంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలను వలస పక్షులు ఎంచుకుంటాయి. అందుకే సైబీరియాలో శీతలకాలం మొదలయ్యేసరికే అక్కడి నుంచి తుర్రుమంటాయి. సైబీరియాతో పాటు యూరప్, దక్షిణ యురేషియా, సెంట్రల్ ఏషియా, రష్యా, టర్కీ, ఆఫ్రికా, ట్రాన్స్- హిమాలయాల నుంచి వివిధ రకాల పక్షులు వలస వస్తుంటాయి. మధ్య మధ్యలో ఆగుతూ దాదాపు రెండు నెలల పాటు ప్రయాణం చేసి మరీ భాగ్యనగరానికి చేరుకుంటాయి.  హైదరాబాద్ లో చలిని తట్టుకునే ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు ఆహారానికి అనువుగా ఉంటుంది. చెరువుల చుట్టూ భారీ చెట్లు ఉండడం చెరువుల మధ్యలో అక్కడక్కడ రాతిశిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటు చేసిన స్టాండ్ లు ఉండటం వల్ల ప్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు ఎదురుచూసి చేపలను వేటాడతాయి. చేపలు అవసరం లేని కొన్ని పక్షులు చెరువు ఒడ్డున సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. మొత్తం 380 రకాల పక్షిజాతుల్లో దాదాపు 70 నుంచి 80 వలస పక్షులు ఏటా చలికాలంలో నగరాన్ని ముద్దాడుతూ ఉంటాయి. ఇందులో విదేశాలకు చెందిన 40 నుంచి 45 రకాల పక్షులు విహారం చేస్తుంటాయి. ప్రధానంగా ఫ్లెమింగో లోని పలు రకాల పక్షులు వెర్టిటైర్ ఫ్లై క్యాచర్, కామన్ స్టోన్ చాట్, నార్తరన్ శోభల, బ్లాక్ టైల్డ్ గాడ్ బీట్, ఎల్లో వాగ్ టెయిల్, హారియర్స్ లో పలు రకాల పక్షులు 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, బార్డర్స్, లిటిల్ టెన్ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులను ఈ వింటర్ సీజన్ లో చూడవచ్చు. అమీన్ పూర్ చెరువు దాదాపు 300 ల ఎకరాల్లో విస్తరించి ఉంది. కృత్రిమ రమణీయతకు నిదర్శనంగా కనిపించే ఈ ప్రదేశానికి విదేశాల నుంచి వలస పక్షులు రావడం చూడముచ్చటగా ఉందంటున్నారు స్థానికులు.

ఉంటారో..పోతారో.. అగమ్యగోచరంగా మారిన టీడీపీ పరిస్థితి

  ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేసే ప్రయత్నంలో అధికార పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు నిమగ్నమయ్యారు. జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉండగా వారిలో ముగ్గురికి ఫోన్లు చేయడంతో టీడీపీలో అలజడి మొదలైంది. డిసెంబర్ 4వ తేదీన విజయవాడలో మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ముగ్గురు మంత్రులు సమావేశమై మంతనాలు జరిపినట్లు సమాచారం. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యేలకు నేరుగా ఫోన్ లు చేసి వారి యోగక్షేమాలు కనుకున్నారు టిడిపి అధినేత చంద్రబాబు. టీడీపీకి ఉన్న 23 మంది శాసన సభ్యుల్లో కనీసం 6,7 మందిని ఆ పార్టీకి దూరం చేసి చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేయాలని వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం జరుగుతోంది.  గత అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి ప్రకాశం జిల్లాలో నాలుగు చోట్ల విజయం సాధించింది. చీరాలలో కరణం బలరాం, అద్దంకిలో గొట్టిపాటి రవి కుమార్, పరుచూరులో ఏలూరి సాంబశివరావు, కొండపిలో డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి గెలుపొందారు. వీరిలో ముగ్గురిని తమ వైపు లాక్కునే ప్రయత్నాలకు వైసీపీకి చెందిన మంత్రులూ బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని శ్రీకారం చుట్టినట్టు తెలిసింది. కొడాలి నాని, పేర్ని నాని తొలుత ఎమ్మెల్యే గొట్టిపాటితో మంతనాలు జరిపారు. పార్టీ మారేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఆయన క్వారీల పై అధికారుల దాడులు ప్రారంభమయ్యాయి. అనంతరం బాలినేని కూడా రంగంలోకి దిగి రవి కుమార్ తో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతుంది.  ఇదే సమయంలో కొడాలి నాని పరుచూరు శాసన సభ్యుడు ఏలూరికి ఫోన్ చేసి వైసిపి లోకి రావాలని ఆహ్వానించారని అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల ఓ కార్యక్రమంలో కలిసిన కరణం బలరాంతో బాలినేని చర్చించి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్టు తెలిసింది. కొండపి ఎమ్మెల్యే స్వామి పార్టీ మారతారని ఆ నియోజక వర్గ వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నా ఆయనతో ఏ మంత్రి మాట్లాడలేదని తెలిసింది. టిడిపి ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న మంత్రులు నిన్న విజయవాడలోని మంత్రి బాలినేని నివాసంలో సమావేశమై చర్చించినట్లు సమాచారం. వీరు ఇవాళ ముఖ్యమంత్రి జగన్ ను కలిసి ఇదే విషయం పై మాట్లాడబోతున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  

మారిన కాల్ చార్జీలతో మోత మోగుతున్న మొబైల్ బిల్లులు

  మొబైల్ బిల్లు మోత మోగింది, కాస్ట్ లీగా మారిన కాల్ చార్జీలు 40 శాతానికి పైగా పెరిగిన ప్లాన్ ధరలు, మొబైల్ బిల్లుల మోత మోగించాయి టెలికాం కంపెనీలు. వాయిస్ కాల్ చార్జెస్, మొబైల్ డేటా టారిఫ్ లను పెంచాయి. అయిదేళ్ళలో తొలి సారిగా ప్రీపెయిడ్ కస్టమర్ లకు వాయిస్ కాల్, డేటా చార్జీలు పెరిగాయి. కనీసం 15 శాతం నుంచి గరిష్టంగా 47 శాతం వరకు చార్జీలు పెరిగాయి. ఇప్పటి దాకా ఉచితంగానే లభించిన ఇన్ కమింగ్ సేవలు ఇప్పుడు ప్రియమయ్యాయి. నెలకు 49 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటేనే ఇన్ కమింగ్ కాల్స్ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పటి నుంచి పెంచిన ఛార్జీలు అందుబాటులో ఉన్నట్టు తెలిపాయి వొడాఫోన్, ఎయిర్టెల్.  మూడేళ్ల క్రితం జియో రాకతో ఫ్రీ అన్ లిమిటెడ్ కాల్స్ వచ్చాయి , టెలికాం రంగంలో సంచలనంగా మారాయి. కానీ నేడు ఫ్రీ కాల్స్ లేకుండా పోయాయి. జియో టూ జియో కాకుండా ఇతర నెట్ వర్క్ యూజర్లకు చేసే ప్రతి కాల్స్ పై నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తోంది జియో. జియో కస్టమర్లు ఆయా ప్లాన్లలో టాక్ టైం దాటితే ఇతర నెట్ వర్క్స్ కు ఫోన్ చేయాలంటే టాప్ అప్ కార్డ్స్ వేసుకోవాల్సిందే. ఎయిర్టెల్ కొత్త ప్లాన్ లో రోజుకు 50 పైసల నుంచి 2 రూపాయల 85 పైసల వరకు పెరగనున్నాయి. ఎయిర్టెల్ తన 169,199 రూపాయల ప్లాన్లను విలీనంచేసి ఒకే ప్యాక్ లో 248 రూపాయలకు అందించనుంది. 169 రూపాయల ప్లాన్ ను ఎంచుకుంటున్న వినియోగదారులు ఇక పై 47 శాతం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే రోజుకు 1.5 ఐదు జీబీ మొబైల్ డేటా ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్, ఐడియా కూడా ప్రీపెయిడ్ వినియోగదారులకు 2 రోజులు, 28 రోజులు, 84 రోజులు, 365 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్లను ప్రకటించింది.  మునుపటి ప్రణాళికలతో పోలిస్తే కొత్త ప్రణాళికల్లో దాదాపు 42 శాతం వరకు రేట్లు పెరగనున్నాయి. ఓవరాల్ గా ఉచిత సేవలకు టెలికాం సంస్థలు స్వస్తి పలుకుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి చార్జీల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది ఎయిర్టెల్. చార్జీల్లో పెరుగుదల 50 శాతం వరకు ఉండొచ్చని ప్రకటించింది. నెలకు కనీసం 49 తో రీచార్జ్ చేయిస్తేనే కస్టమర్లకు ఇన్ కమింగ్ కాల్స్ వస్తాయి.కస్టమర్ల సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్న వొడాఫోన్, ఐడియా 2, 28,84, 365 రోజుల కాల వ్యవధితో ఇప్పటికే ఉన్న టారిఫ్ లకు కొత్త చార్జీలను ప్రకటించింది. 41.02 శాతం వరకు చార్జీలను పెంచింది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అన్ లిమిటెడ్ కాల్స్ 12 జీబీ డేటాకు 998 రూపాయలుండగా 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ 14,99 రూపాయలుగా ప్లాన్ మార్చింది. వొడాఫోన్, ఐడియా రోజుకు 1.5 జీబీ డేటా అన్ లిమిటెడ్ కాల్స్ తో 365 రోజుల కాలపరిమితికి ఇప్పటి వరకు 1699 వసూలు చేస్తుండగా ఇక పై ఈ ప్లాన్ 2,399 గా మారింది. 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటా లభించే అన్ లిమిటెడ్ ప్లాన్ 458 నుంచి 31 శాతం అధికమై 599కి చేరింది. అన్ లిమిటెడ్ ప్లాన్ కింద ఉన్న ఎస్సెమ్మెస్ లను రోజుకు 100, కాల్స్ కూడా టైం పరిమితి కిందకు తీసుకువస్తున్నట్టు ప్రకటించింది వొడాఫోన్, ఐడియా. ఎయిర్టెల్ చార్జీల పెంపు కూడా రోజుకు 50 పైసల నుంచి 2 రూపాయల 85 పైసల వరకు ఉంది. ప్రస్తుతం 365 రోజుల కాలపరిమితితో అన్ లిమిటెడ్ కాల్స్, 12 జీబీ డేటా ప్లాన్, 998 కి లభిస్తుండగా ఇక పై 50 శాతం పెరుగుదలతో 24 జీబీ డేటా అందిస్తూ 14,99 కానుంది. ఇక జియో కాల్స్ డేటా చార్జీలు కూడా 40 శాతం వరకు పెరగనున్నాయి. కొత్త ప్లాన్స్ కింద కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు కల్పిస్తామని తెలిపింది జియో. ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు పరిమితి విధించనున్నట్టు తెలిపింది.  

కేసీఆర్ కు చుక్కలు చూపిస్తోన్న నేషనల్ మీడియా

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కైనా... ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికైనా... తెలుగు మీడియా అంటే చులక భావం... మీడియా సమావేశాల్లో తెలుగు జర్నలిస్టులు ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతారు... నీకేం తెలుసంటూ గద్దిస్తారు... తెలంగాణ కేసీఆర్ అయితే కొట్టడం ఒక్కటే తక్కువన్నట్లుగా మాట్లాడతారు... కేసీఆర్ గద్దింపు, బెదిరింపులతో జర్నలిస్టులంతా మౌనవ్రతం పాటిస్తారు... ఏ ప్రెస్ మీట్ లో చూసినా ఇదే ధోరణి కనిపిస్తుంది... అదే నేషనల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నిస్తే మాత్రం గమ్మున సమాధానమిస్తారు... ఎంత ఇబ్బంది కలిగించే ప్రశ్న అడిగినా సార్ సార్ అంటూ గౌరవిస్తూ మాట్లాడతారు. అదే, తెలుగు జర్నలిస్టుల మీద అయితే అమాంతం విరుచుకుపడతారు. బెదిరిస్తారు... గద్దిస్తారు. దాంతో, కేసీఆర్ ను ప్రశ్నించడానికి తెలుగు జర్నలిస్టులు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక, తెలుగు మీడియా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎందుకంటే, తప్పు జరిగినా, కేసీఆర్ ను ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేదు. అయితే, నేషనల్ మీడియా అలా కాదు. ఇష్యూ ఏదైనా ఏకిపారేస్తాయి.  ఇక, దిశ రేప్ అండ్ మర్డర్ పై ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ మంత్రులు, తెలంగాణ ఎంపీల తీరును జాతీయ మీడియా ఎండగట్టింది. కేసీఆర్ ఎందుకు స్పందించలేదంటూ ప్రశ్నించింది. హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని వివాదాస్పద వ్యాఖ్యలను ఎండగట్టింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ తీరును కూడా ప్రశ్నించింది. ఇలా, తెలంగాణ ప్రభుత్వ తీరును, సీఎంను, మంత్రులను ఏకిపారేసిన నేషనల్ మీడియా... ఢిల్లీ వచ్చిన కేసీఆర్ ను చుట్టుముట్టింది. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ ప్రశ్నించి నిలదీసింది. అయితే, మీడియా ప్రతినిధులకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండానే కేసీఆర్ వెళ్లిపోయారు. అలా, సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడాన్ని కూడా జాతీయ మీడియా ఏకిపారేసింది. దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే... ఆ కుటుంబాన్ని పరామర్శించని కేసీఆర్.... ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం మాత్రం ఢిల్లీ వచ్చారంటూ ఘాటుగా కథనాలు ప్రసారం చేశాయి. దాంతో, ఢిల్లీ పర్యటనలో కేసీఆర్ కు చేదు అనుభవం ఎదురు కావడంతో సీఎంతోపాటున్న టీఆర్ఎస్ నేతలు కంగుతిన్నారు.

యాదాద్రిలో మరో అపచారం.. స్వామి రూపం మార్చి సెల్ఫీలు!!

  తెలంగాణ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో మరో అపచారం చోటు చేసుకుందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏకంగా స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పెద్ద శిలపై వెలిసిన మూలవిరాట్టు విగ్రహాన్ని.. యాదాద్రి పనులు నిర్వహిస్తున్న ఆర్కిటెక్ట్‌, శిల్పులు.. పెద్దల అనుమతి లేకుండానే.. చెక్కినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాంత నరసింహస్వామిని వారు ఉగ్రరూపంగా తయారు చేశారు. ఆయనకు కోరలు పెట్టారు. నాలుక పెద్దదైంది. స్వామి తలపై ఉండే ఆదిశేషుడి ఆకారంలో కూడా మార్పు చేశారు. ఏడు తలల ఆదిశేషుడుని ఐదు తలల ఆదిశేషుడుగా మార్చేశారని తెలుస్తోంది. అంతేకాదు.. అసలు మూల విరాట్టు ఫొటోలు తీయడం, ప్రచురించడమే పాపమన్న సంప్రదాయం ఉండగా.. ఏకంగా స్వయంభువు విగ్రహాన్నే చెక్కడం, శిల్పులు సెల్ఫీలు దిగడం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం చినజీయర్‌ స్వామికి తెలిసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరిగిన ఈ అపచారంపై ఆలయ అర్చకులు, సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని తెలుస్తోంది. 15 రోజుల క్రితం.. ఆలయానికి చెందిన కొందరు ఈ విషయాలన్నీ వివరిస్తూ, మూలవిరాట్టుతో శిల్పులు తీసుకున్న సెల్ఫీలను చినజీయర్‌ స్వామికి ఈమెయిల్‌ చేశారని సమాచారం. దీనిపై ఆగ్రహం చెందిన చినజీయర్‌ స్వామి.. వెంటనే ఆలయ ఈవోను తన ఆశ్రమానికి పిలిపించుకుని వివరణ కోరగా.. ఆమె అలాంటిదేమీ జరగలేదని, తాము విగ్రహాన్ని పూర్తిగా చెక్కలేదని, శాండ్‌ బ్లాస్టింగ్‌ మాత్రమే చేశామని ఆమె చినజీయర్‌ స్వామికి వివరించినట్లు తెలుస్తోంది. ఆమె వివరణతో చినజీయర్‌ స్వామి సంతృప్తి చెందలేదని సమాచారం. యాదాద్రిగా పేర్చు మార్చి, పునర్నిర్మాణం చేస్తున్న యాదగిరిగుట్ట ఆలయంలో జరుగుతున్న పనుల్లో అపచారం చోటుచేసుకోవడం ఇది రెండో సారి. ఆ మధ్య ఆలయ స్థంబాలపై పై సీఎం కేసీఆర్ బొమ్మతో పాటు పార్టీ గుర్తు, పథకాల పేర్లు చెక్కారు. అప్పుడు ఈ ఫోటోలు లీక్ అవ్వడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అసలు వాటి గురించి ప్రభుత్వానికి తెలియదని, శిల్పులు అత్యుత్సాహానికి పోయి అలా చెక్కారని చెప్పుకొచ్చారు. ఎవరూ చెప్పకుండా శిల్పులు ఎందుకు చెక్కుతారు? ఒకవేళ చెక్కినా.. వాళ్ళు అలా ఆలయంలో ఇష్టానుసారంగా రాజకీయ బొమ్మలు చెక్కుతుంటే.. పర్యవేక్షణ అధికారులు ఏం చేస్తున్నారు అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏకంగా స్వయంభువు విగ్రహంలో మార్పులు చేసినట్టు ప్రచారం జరుగుతుండటంతో భక్తులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయం పునర్నిర్మాణం చేయాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆచరణలో అపచారాలు చోటు చేసుకోవడంతో ఆగ్రహాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జనసేనను బీజేపీలో విలీనం చేస్తారేమో? పవన్ కు మంత్రుల కౌంటర్

  ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి జగనే టార్గెట్ గా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను జగన్మోహన్ రెడ్డి అంటూ పిలవనని... జగన్ రెడ్డి మాత్రమే అంటానన్న పవన్... ఇఫ్పుడు జగన్ ను అస్సలు ముఖ్యమంత్రిగానే గుర్తించడం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు, తాను ప్రత్యేక హోదా ఇష్యూను పక్కనబెట్టి మోడీ-షాతో చేతులు కలిపి ఉంటే అస్సలు వైసీపీ గెలిచేదా అంటూ వ్యాఖ్యానించారు. ఇక, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటి రాజకీయాలకు మోడీ, అమిత్ షా లాంటి వాళ్లే కరెక్ట్ అన్నారు. మోడీ-షాలు ఏదైనా అనుకుంటే ఉక్కుపాదంతో తొక్కినట్లు వ్యహరిస్తారని అన్నారు. ప్రస్తుత రాజకీయాలు దారుణంగా మారాయన్న పవన్... ఇప్పటి నేతలకు మోడీ-షాలే కరెక్ట్ అంటూ వ్యాఖ్యానించారు. ఇక, తన కులం... మాట తప్పని కులమంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపైనా జనసేనాని మండిపడ్డారు. మీది మాట తప్పని కులమైతే... మిగతా కులాలు మాట తప్పుతాయనా మీ ఉద్దేశం అంటూ ప్రశ్నించారు. ఇక, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల భాషపైనా పవన్ నిప్పులు చెరిగారు. మంత్రులు, ఎమ్మెల్చేలు పిచ్చి కూతలు కూస్తుంటే జగన్ ఏం చేస్తున్నారని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఆర్నెళ్లవుతున్నా కనీసం ఉల్లి ధరను కూడా నియంత్రించలేకపోయారని ఎద్దేవా చేశారు. తాను ఎవరికీ భయపడనన్న పవన్ కల్యాణ్... తాను నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టే.... అధికార పార్టీ వణికిపోతోందని అన్నారు. అయితే, పవన్ విమర్శలకు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. జనసేనను బీజేపీలో కలిసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని, అందుకే మోడీ-అమిత్ షాను పొగుడుతున్నాడని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని అన్నారు. జనసేనను విలీనం చేయాలంటూ అమిత్ షా అడిగారని గతంలో పవనే స్వయంగా చెప్పారని, ఇప్పుడు అది నిజం కాబోతుందేమోనన్నారు. ఇక, పవన్ గుర్తించకపోయినా పర్వాలేదని... జగన్మోహన్ రెడ్డిని, తమను ప్రజలు గుర్తించారని... తమకది చాలన్నారు. స్త్రీ అంటే విలువ లేకుండా నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్ కూడా మహిళోద్ధరణపై మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందంటూ కౌంటరిచ్చారు మంత్రులు.   

ఆర్నెళ్లలో 30వేల కోట్ల అప్పు..! దుబారా ఖర్చు తగ్గిస్తామంటూనే ప్రజాధనం దుర్వినియోగం

  దాదాపు అరవై ఏళ్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో లక్షన్నర కోట్లలోపు అప్పు ఉంటే రాష్ట్ర విభజన తర్వాత సుమారు 88వేల కోట్ల రూపాయల రుణం ఏపీ వాటాగా వచ్చింది. ఇక, నవ్యాంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 2019 వరకు అది రెండున్నర లక్షల కోట్లకు చేరింది. అంటే, ఐదేళ్లలోనే లక్షన్నర కోట్లకు పైగా అప్పు పెరిగింది. ఏడాదికి 30వేల కోట్ల చొప్పున అప్పు చేశారు. అయితే, ఆర్నెళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి... దూకుడుగా సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారు. ఒకవైపు పన్ను రాబడి తగ్గింది... మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా సకాలంలో అందని పరిస్థితి... అయినాసరే జగన్ మాత్రం పథకం మీద పథకాన్ని ప్రకటిస్తూ... ప్రజల మన్ననలు పొందాలని తాపత్రయం పడుతున్నారు. అయితే, జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తున్న... అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఎక్కడ్నుంచి వస్తున్నాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆ ట్రిక్ ఏమిటో మంత్రులకు కూడా అంతుపట్టడం లేదు. కొందరు మంత్రులైతే బహిరంగ వేదికలపైనే తమ మనసులో మాటను బయటపెడుతున్నారు. అయితే, ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి తన ఆర్నెళ్ల పాలనలో 28వేల కోట్ల రూపాయల అప్పుల భారం మోపారని అన్నారు. దుబారా ఖర్చులు తగ్గిస్తామంటూనే కేవలం ఆర్నెళ్లలో దాదాపు 30వేల కోట్ల అప్పులు చేశారని, ఇలాగైతే ఏడాదికి 60వేల కోట్లు... ఐదేళ్లలో 3లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడం ఖాయమన్నారు. అలాగే, హైదరాబాద్లోని లోటస్ పాండ్ ఇంట్లో సౌకర్యాల కోసం లక్షల లక్షల ప్రజాధనాన్ని కేటాయించడం... అదేవిధంగా తాడేపల్లిలో క్యాంప్ ఆఫీస్ కు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఏమిటని ప్రశ్నించారు. దుబారా తగ్గిస్తామంటోన్న జగన్మోహన్ రెడ్డి... ఇలా ప్రజాధనాన్ని సొంత ఇళ్ల కోసం వినియోగించడం సరికాదన్నారు. అలాగే, ప్రజలపై మరింత అప్పుల భారం మోపకుండా పాలన సాగించాలని సూచించారు.

విద్యుత్ సంస్థ లాకౌట్.. తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లిస్తేనే మళ్ళీ తెరుస్తాం

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో కరెంటు కష్టాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సమస్యను అధిగమించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద చర్యలు చేపట్టింది. ఎక్కడ విద్యుత్ అందుబాటులో ఉంటే అక్కడి నుంచి కొనుగోళ్లు జరిపింది. ఛత్తీస్ గఢ్ తో పాటు ఇతర ప్రాంతాల్లోని విద్యుదుత్పత్తి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. దీంతో అనతి కాలంలోనే తెలంగాణ రాష్ట్రం కరెంటు కష్టాలను అధిగమించింది, 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. సింగరేణి తదితర ప్లాంట్ ల విద్యుత్ కూడా తోడవడంతో అవసరానికి మించి కరెంట్ అందుబాటులోకి వచ్చింది.  ఇదంతా బాగానే ఉన్నా ఇప్పుడు మితిమీరిన విద్యుత్ కొనుగోళ్లు ప్రభుత్వానికి భారంగా మారింది. కరెంట్ కొంటున్న ట్రాన్స్ కో ఉత్పత్తి చేస్తున్న జెన్ కోలు విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదు. విద్యుత్ తో పాటు బొగ్గు కొనుగోళ్లకు సంబంధించి దాదాపు రూ.10,000 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకు చెల్లింపులు చేయాల్సి ఉంది. మిగిలిన ప్రైవేట్ రంగంలోని విద్యుత్ సంస్థలు ట్రాన్స్ కో నుంచి బకాయిల వసూలు అవ్వక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి.  ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన విద్యుత్ ప్లాంట్ పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సరఫరా చేసిన విద్యుత్ కు సంబంధించి ట్రాన్స్ కో బిల్లులు చెల్లించడం లేదనే నెపంతో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. నెల రోజులుగా కార్మికుల వేతనాలను నిలిపివేసింది. నవంబర్ 7వ తేదీన లాకౌట్ నోటీసిచ్చి ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేసింది. సంవత్సర కాలంగా టీఎస్ ట్రాన్స్ కో నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని.. కొద్దినెలలపాటు కార్మికుల వేతనాలు సర్దుబాటు చేసినప్పటికీ ఇక మీదట భరించే స్థితిలో లేనందున తమ ప్లాంట్ ను లాకౌట్ చేస్తున్నట్టుగా శాలివాహన విద్యుత్ సంస్థ స్పష్టం చేసింది.

కోమటి చెరువు అందాలను చూడటానికి క్యూ కడుతున్న పర్యాటకులు

  సిద్దిపేట లోని కోమటి చెరువు మరింత పర్యాటక శోభను సంతరించుకుంది. ఇప్పటికే పర్యాటకులతో కళకళలాడే కోమటి చెరువు అందాలలో తాజాగా సస్పెన్షన్ బ్రిడ్జి చేరింది. లక్నవరం వంతెన తరహాలో ఇక్కడ కూడా వంతెనను నిర్మించారు. ఈ సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు టికెట్ కౌంటర్ ను ఇటీవల మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. దీంతో కోమటి చెరువుకు పర్యాటకుల తాకిడి పెరిగింది. వేలాడే వంతెన పై నడిచేందుకు చెరువుకు క్యూ కడుతున్నారు ప్రజలు. దీంతో కోమటిచెరువు నిత్యం రద్దీగా కనిపిస్తోంది. లక్నవరం లోని సస్పెన్షన్ బ్రిడ్జి కంటే కోమటి చెరువు లోని వేలాడే వంతెన పొడవైంది. 6 కోట్ల రూపాయల ఖర్చుతో దీనిని ఏర్పాటు చేసి పర్యాటకులకు అందుబాటు లోకి తీసుకువచ్చారు. కోమటి చెరువు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టిన మున్సిపల్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సస్పెన్షన్ బ్రిడ్జితో పాటు అడ్వెంచర్ పార్క్ లోని పార్కింగ్ యార్డు ఆధునిక టెక్నాలజీతో ప్లాపి బ్యారియర్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రానికే రోల్ మోడల్ గా ఉన్న సిద్దిపేట ఇప్పుడు పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా మారింది.

బీజేపీ కొత్త మిషన్... టార్గెట్ 7 ప్లస్

  కర్ణాటకలో డిసెంబర్ 5 న జరగనున్న ఉప ఎన్నికలు బిజెపికి కీలకంగా మారాయి. సర్కార్ ను కాపాడుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల టైం దగ్గరపడుతున్న సమయంలో ఆపరేషన్ 7 ప్లస్ ను ముమ్మరం చేసింది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోను 15 సీట్లలో 7 కి పైగా సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది బీజేపీ. దక్షిణాదిన బీజేపీకి బలం ప్రభుత్వ ఉండేది కేవలం కర్ణాటకలో మాత్రమే అది కూడా ఇప్పుడు మైనారిటీలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏడు స్థానాలపైగా సీట్లు సంపాదిస్తే కానీ సర్కారు నిలబడదు. దీంతో పూర్తిగా మిషన్ 7 ప్లస్ పై ఆధారపడింది బీజేపీ.  15 నియోజక వర్గాల్లో 8 నియోజకవర్గాలపైన పూర్తిగా దృష్టిని పెట్టింది. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ప్రత్యర్థిని చిత్తు చేయాలని చూస్తోంది. దీంతో పాటు ప్రత్యర్ధులను తమ దారిలోకి రప్పించి ఈజీగా గెలిచేందుకు ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు బిజెపికి మహారాష్ట్రలో ఎదురు దెబ్బ తగలడంతో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సర్కారు కొనసాగించాల్సిందేనని అందుకు దేనికి వెనకాడకూడదని రాష్ట్ర నేతలకు ఇప్పటికే జాతీయ నేతలు సందేశం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు టైం దగ్గర పడుతుండటంతో యడ్యూరప్ప ప్రచారాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో మంచి ప్రభుత్వం కొనసాగుతోందని దీనికి ఎవరి సహకారం అక్కరలేదని హవేరిలో జరిగిన ప్రచారంలో అన్నారు. 15 నియోజకవర్గాల్లోనూ బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో 14 నెలల పాటు సంకీర్ణ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కొనసాగించాయి. పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు, రాజీనామాలతో సర్కారు కూలిపోయింది. అయితే అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రస్తుతం మైనారిటీల్లో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్ లకు చెందిన 17 మంది రెబల్స్ ను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో అసెంబ్లీలో సభ్యుల సంఖ్య పడిపోయి బీజేపీ బలపరీక్షలో నెగ్గింది. ఖాళీ అయిన స్థానాలకే ఇప్పుడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నాడు పరోక్షంగా బిజెపికి సహకరించిన రెబల్స్ ఆ పార్టీలో చేరి ప్రస్తుతం ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 15 స్థానాలకు డిసెంబర్ 5 న పోలింగ్ జరగనుంది. అయితే టైం దగ్గరపడుతూండటంతో గెలుపే ధ్యేయంగా ముందుకు దూసుకుపోతోంది బిజెపి. అయితే ఫలితాలపై నమ్మకం లేకపోవడం వల్లే రాష్ట్రంలో స్పెషల్ ఆపరేషన్లు బిజెపి నిర్వహిస్తోందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.

వైఎస్ వివేకా హత్య కేసు.. ఒక్కసారిగా దర్యాప్తు వేగం పుంజుకుంది

  మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ దర్యాప్తు ఒక్కసారిగా వేగం పుంజుకుంది. జగనకు సమీప బంధువు ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డితో పాటు మనోహర్ రెడ్డిలను సిట్ అధికారులు పిలిపించి ప్రశ్నించారు. అలాగే టిడిపికి చెందిన శివరాఘవరెడ్డి సహా ఇద్దరు టిడిపి నేతలను సిట్ బృందం ప్రశ్నించినట్లు సమాచారం. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి 6 నెలలు గడుస్తున్నా.. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను ఎందుకు పట్టుకోలేదని కడప జిల్లా పర్యటనలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. ఈ నెల 24 నుంచి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో సిట్ సీఎం సమీప బంధువులను పిలిపించి ప్రశ్నించటం సంచలనం సృష్టించింది. గతంలో భాస్కరరెడ్డిని పులివెందుల్లోనే ఒకసారి ప్రశ్నించారు. ఇప్పుడు కడపకు పిలిపించి రహస్య ప్రాంతంలో విచారణ జరిపినట్లు తెలిసింది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చి 15న పులివెందుల లోని తన స్వగృహంలో వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసును చేధించేందుకు అప్పటి సీఎం చంద్రబాబు సిట్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో భాగంగా టెక్నికల్ టీం, ఫీడ్ టీం, డాక్యుమెంటరీ సేకరణ టీమ్, ఇన్వెస్టిగేషన్ టీంలను నియమించారు. అప్పట్లో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మార్చి 26న నాటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎస్పీగా అభిషేక్ మహంతిని నియమించారు. మహంతి ఆధ్వర్యంలోనే వివేక హత్య కేసును సిట్ బృందం దర్యాప్తు చేసింది. మే 30 న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టారు. విచారణ కొనసాగుతుండగానే సిట్ కు నాయకత్వం వహిస్తున్న ఎస్పీ మహంతి నెలన్నర క్రితం దీర్ఘ కాలిక సెలవులో వెళ్లడంతో ఆయన స్థానంలో ఎస్పీగా కేకేఎన్ అన్బురాజన్ ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం సిట్ విచారణకు ఆయనే నేతృత్వం వహిస్తున్నారు.

కేసీఆర్ తీరుపై జాతీయ మీడియా ఫైర్.. దిశ ఘటన కంటే పెళ్లి ఎక్కువా?

  హైదరాబాద్ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ప్రజల్లో తీవ్ర ఆగ్రావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితులకు మరణశిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దిశ ఘటన నేపథ్యంలో జాతీయ మీడియా తెలంగాణ సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేసింది. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర సీఎంగా కేసీఆర్ స్పందించలేదని విమర్శించిన జాతీయ మీడియా.. తాజాగా ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ని.. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు అంటూ మొహం మీదనే నిలదీసింది. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లిన సంగతి తెల్సిందే. ప్రధాని మోడీ మరియు కేంద్ర మంత్రులని కలవడంతో పాటు.. ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అయితే కేసీఆర్ ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో.. అక్కడి జాతీయ మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. దిశ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదంటూ నిలదీశారు. కానీ కేసీఆర్.. మీడియా ప్రతినిధులకు ఏ సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో వెళ్లిపోయారు. దీంతో జాతీయ మీడియా కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తోంది. ఓ వైపు దిశ ఘటన దేశాన్ని కుదిపేస్తుంటే.. సీఎం కేసీఆర్ మాత్రం ఏం పట్టనట్టు ఓ విలాసవంతమైన వివాహ రిసెప్షన్ కోసం ఢిల్లీకి వచ్చారంటూ జాతీయ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ పై ఇక్కడి మీడియా విమర్శలు చేసే సాహసం చెయ్యట్లేదు కానీ.. జాతీయ మీడియా మాత్రం మాత్రం కేసీఆర్ తీరుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతోంది.   మరోవైపు సోషల్ మీడియాలో కూడా కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ ఘటన వెలుగులోకి వచ్చిన రోజు కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కుమార్తె పెళ్లికి హాజరయ్యారు. ఆ మరుసటి రోజు టీఆర్ఎస్ నేత పిడమర్తి రవి వివాహ వేడుకకు కూడా కేసీఆర్ హాజరయ్యారు. దీంతో సీఎంకి వేడుకలకు వెళ్లే టైం ఉంది కానీ, ఘటనపై స్పందించే టైం లేదంటూ నెటిజన్లు విమర్శించారు. ఇక అప్పటివరకు దిశ ఘటనపై స్పందించని కేసీఆర్.. ఆర్టీసీ కార్మికులతో చర్చ సందర్భంగా స్పందించారు. వెంటనే, న్యాయం జరిగేందుకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే ఘటన జరిగిన వెంటనే కేసీఆర్ స్పందించకపోవడం, మరోవైపు దిశ కుటుంబాన్ని ఇంతవరకు పరామర్శించని కేసీఆర్.. వివాహ వేడుకులకు హాజరు కావడంపై.. అటు జాతీయ మీడియా, ఇటు సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అమిత్ షా vs రాహుల్.. జార్ఖండ్ లో వేడెక్కిన రాజకీయం

  జార్ఖండ్ లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఒక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరో వైపు రాహుల్ గాంధీ మాటల తూటాలు పేల్చుతున్నారు. రెండో దశ ఎన్నికల ప్రచారం సందర్భంగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఈ నెల ( డిసెంబర్ ) 7వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. దీంతో జంషెడ్ పూర్ లో జరిగిన సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్య తీర్పు ఆలస్యం కావటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు అమిత్ షా. మరోవైపు దేశంలో హాట్ టాపిక్ గా మారిన ఎన్ఆర్సీ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు అమిత్ షా. 2024 లోక్ సభ ఎన్నికల నాటికి దేశ వ్యాప్తంగా ఎన్ఆర్సీ ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో చొరబడ్డ విదేశీయులను తరిమేస్తామని తెలిపారు అమిత్ షా. కాంగ్రెస్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎన్ఆర్సీ ని అమలు చేస్తామంటే రాహుల్ గాంధీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు అమిత్ షా.  మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలిసారి జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సిండోకాతో పాటు జంషెడ్ పూర్ ఎన్నికల సభలో రాహుల్ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఎవరినీ భయపెట్టే రాజకీయాలు చేయదన్నారు రాహుల్. జార్ఖండ్ ప్రజల్నీ బిజెపి భయబ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. ఆదివాసీల నుంచి విలువైన భూములు లాక్కుని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని రాహుల్ విమర్శించారు. మొత్తం మీద రెండో దశ పోలింగ్ కు 5 రోజుల ముందే జార్ఖండ్ లో ప్రచారం హీటెక్కింది. ప్రధాన పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలతో ప్రచారం హాట్ హాట్ గా సాగుతోంది.