కరోనా సెమీ ఫైనలా! ఏప్రిల్ 19 నాటికి భూమిమీద మనిషే బతికే అవకాశం లేదా?
posted on Mar 20, 2020 @ 6:06PM
ఓవైపు కరోనా వైరస్‌తో ప్రపంచం గజగజ వణికిపోతుంటే యుగాంతానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని, కరోనా సెమీ ఫైనల్ మాత్రమే, అసలు ఫైనల్ ఏప్రిల్ 19వ తేదీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భూమి అంతం కాబోతోందంటూ కొందరు, కాదు కాదు ప్రళయం రాబోతుందంటూ మరి కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి లాజిక్ జోడిస్తూ నాసాను కోట్ చేస్తున్నారు. వచ్చే నెల 19 నాటికి అసలు ప్రపంచంపై మనిషే బతికే అవకాశం లేదంట.
2020 ఏప్రిల్ 19న భూమికి సమీపంగా ఓ గ్రహశకలం వెళ్లనుందని మూడేళ్ల క్రితం నాసా తెలిపింది. దాదాపు 2వేల అడుగుల పరిమాణం గల జేఓ25 అనే గ్రహశకలం (స్పేస్‌రాక్) భూమి నుంచి 1.8 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దూసుకెళ్లనుందని అప్పట్లో ఓ వార్త సంస్థ విశ్లేషించింది.
ఇది చంద్రుడి నుంచి భూమికి గల మధ్య దూరానికి 4.6 రెట్లు దూరంలో పయనించనుందని పేర్కొంది. అయితే, ఆ గ్రహశకలం మన భూమిని తాకే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఇంతకుముందు ఇలాంటి గ్రహ శకలాలు చాలా సార్లు భూమికి అతి సమీపంగా వెళ్లాయి. ఇంతవరకు భూమికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. అయితే, ఈ గ్రహశకలం పరిమాణం వాటన్నింటికంటే చాలా పెద్దది.
గడిచిన 400ఏళ్లలో, రానున్న 500 ఏళ్లలో భూమికి ఇంత సమీపంలోకి రానున్న గ్రహశకలం ఇదే అని నాసా పేర్కొంది. అయితే, ఏప్రిల్ 19 తర్వాత భూమి నుంచి దూరంగా వెళ్లే క్రమంలో రాత్రివేళ టెలిస్కోపు ద్వారా ఈ గ్రహశకలాన్ని చూడవచ్చని నాసా తెలిపింది.
2004 సెప్టెంబర్‌లో ఐదు కిలోమీటర్ల చుట్టుకొలత గల టౌటాటిస్ అనే గ్రహశకలం ఒకటి భూమి నుంచి 4 లూనార్లు (ఒక లూనర్- చంద్రుడి నుంచి భూమికి మధ్య గల దూరం)తో దూసుకెళ్లింది. రాబోయే గ్రహశకలం టౌటాటిస్ కంటే కూడా పెద్దదట. ఈ గ్రహశకలం భూమికి తాకుతుందని, ఆ తర్వాత భూగ్రహం అంతమవుతుందని వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే నెల 19 నాటికి అసలు ప్రపంచంపై మనిషే బతికే అవకాశం లేదనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.