ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి: అధికారులకు జగన్ ఆదేశాలు
posted on Mar 20, 2020 @ 7:17PM
కరోనా నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం..
కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచండి..
నిత్యావసర వస్తువుల ధరలను పెంచితే కఠిన చర్యలు తప్పవు..
కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని ముందస్తు జాగ్రత్తలను తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలు, మాల్స్, సినిమా థియేటర్స్ ను మూసేశామని తెలిపారు. ఆ తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయాలను తీసుకుంటామని చెప్పారు. కరోనా గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా... ప్రజల్లో అవగాహన పెంచాలని, వారిలో అపోహలను తొలగించాలని ఆదేశించారు.
ప్రజల మధ్య సామాజిక దూరంపై తప్పనిసరిగా పర్యవేక్షణ చేయాలని జగన్ ఆదేశించారు. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని... నిత్యావసరాల ధరలను పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో పరిశుభ్రతను పాటించాలని చెప్పారు. ఆసుపత్రుల్లో పారాసిటమాల్, యాంటీ బయోటిక్స్ ను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వైద్య సిబ్బంది మొత్తం ఆసుపత్రుల్లో ఉండేలా చూసుకోవాలని చెప్పారు. స్వీయ నిర్బంధంపై దృష్టి సారించాలని సూచించారు.