హజ్‌ యాత్రపై గందరగోళం! వాయిదా వేసుకోమంటున్న హ‌జ్ మంత్రి!

కరోనా వైరస్ నేప‌థ్యంలో హ‌జ్ యాత్ర‌పై సౌదీ స‌ర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 2020 హజ్ లో పాల్గొనే యాత్రికులు వాయిదా వేసుకోవాల‌ని హ‌జ్ మంత్రి మొహ‌మ్మ‌ద్ బంటెన్ విజ్ఞ‌ప్తి చేశారు. యాత్రికుల భ‌ద్ర‌త త‌మ‌కు ముఖ్య‌మ‌ని, వైర‌స్ నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చే వ‌ర‌కు యాత్రికులు త‌మ ప్లాన్‌ను ర‌ద్దు చేసుకోవాల‌ని ఆదేశించారు.  షెడ్యూల్ ప్రకారం... ఈ ఏడాది జులై, ఆగ‌స్టు నెల‌ల్లో ప్ర‌పంచం న‌లువైపుల నుంచి దాదాపు 40 ల‌క్ష‌ల మంది హ‌జ్‌ యాత్ర‌కు వెళ్ల‌నున్నారు.  అయితే వారంతా త‌మ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోవాల‌ని సౌదీ విజ్ఞప్తి చేసింది.  ఎప్పుడు కరోనా నుంచి బయటపడతామో తెలియని పరిస్థితి. హజ్‌ యాత్రకు సంబంధించి స్పష్టత కోసం మరికొన్నాళ్ళు వేచి చూడక తప్పదని సౌదీ అరేబియా, హజ్‌ ఫిలిగ్రిమ్స్ ను సూచించింది. ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన 40 లక్ష‌ల ముస్లీం యాత్రికులంతా హజ్‌ యాత్రకు తరలివస్తారు.    ఇండియా నుంచి ఈ ఏడాది ల‌క్షా 75 వేల మంది హ‌జ్ యాత్ర‌కు వెళ్ళ‌నున్నారు. ఒక్కొక్క‌రికి దాదాపు మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల ఖ‌ర్చు వ‌స్తుంది. ఇప్ప‌ట్టికే ఒక్కొక్క‌రు రెండు విడ‌త‌ల్లో రెండు ల‌క్ష‌ల రూపాయ‌లు హ‌జ్ క‌మిటీ ఆఫ్ ఇండియాకు చెల్లించారు. మూడ‌వ విడ‌త కింద మ‌రో ల‌క్ష రూపాయ‌లు చెల్లించాల్సి వుంది.  షెడ్యూల్ ప్ర‌కారం జూన్ నెల నుంచే సౌదీకి హ‌జ్‌యాత్రికుల్ని తీసుకుని విమానాలు బ‌య‌లుదేరుతాయి. ఈ నేప‌థ్యంలో హ‌జ్ ప్ర‌యాణాన్ని వాయిదా వేసుకోమ‌ని సౌదీ హ‌జ్ మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న గొంద‌ర‌గోళంలో ప‌డ‌వేసింది. ఈ ఏడాది హ‌జ్ యాత్ర వుంటుందా? లేదా అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

మేనల్లుడి అంత్యక్రియలకు వెళ్ల‌లేక‌పోయిన స‌ల్మాన్‌!

సల్మాన్ ఖాన్ సొంత‌ మేనల్లుడి అంత్యక్రియలకు హాజరు కాలేని దుస్థితి. స‌ల్మాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్ అనారోగ్యంతో మృతి చెందాడు. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సల్మాన్ కుటుంబంతో చాలా సన్నిహితంగా మెలిగే ఈయన అంత్యక్రియలు ఇండోర్‌లో ఎప్రిల్ 1న జరిగాయి.  అయితే లాక్ డౌన్ కారణంగా సల్మాన్ సహా చాలా మంది అబ్ధుల్లా అంత్యక్రియలకు హాజరు కాలేక పోయారు. కేవలం తక్కువ మందితోనే ఖ‌న‌నం జరగింది. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కాలేదు. నిరుపేద,  కోటీశ్వరుడు,  సామాన్యుడు, సెలబ్రెటీ ఎవ్వరినీ ఈ కరోనా ప్రభావం వదల లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడిక్కడ వ్యవస్థలన్నీ స్థంభించి పోయాయి.

మంగళగిరిలో మూడు కిలోమీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటన

* మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ * కూరగాయల దుకాణాలు, షాపులు మూసివేత * గుంటూరులో అత్యధికంగా 20 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌లో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన మంగళగిరి వ్యక్తికి గతరాత్రి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితుడు నివసిస్తున్న టిప్పర్ బజార్‌లోని ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్టు పురపాలక సంఘ కమిషనర్ హేమమాలిని తెలిపారు. అతడితోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించినట్టు పేర్కొన్నారు. కేసు వెలుగు చూడడంతో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలో కూరగాయల దుకాణాలు, మార్కెట్లను మూసివేయించారు. 144 సెక్షన్ విధించి, ఆ ప్రాంతం మొత్తాన్ని హైఅలర్ట్‌గా ప్రకటించారు. కాగా, నిన్న రాష్ట్రంలో 67 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మంగళవారం రాత్రి వరకు 44గా ఉన్న కేసుల సంఖ్య ఒక్కసారిగా 111కు చేరుకుంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు నమోదయ్యాయి.

ధారావి మురికివాడలో కరోనా వైరస్‌! ఒక‌రు మృతి

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడలో కరోనా వైరస్ ప్రవేశించింది. కారోనా కాటుకు ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ మురికివాడలో నివసించే దాదాపు పది లక్షల మంది ప్రాణభయంతో వణికిపోతున్నారు. ముంబైలోని ధారావి మురికివాడలో కరోనా వైరస్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ధారవిలో నివసిస్తున్న ఓ వ్యక్తి కరోనా అనుమానిత లక్షణాలతో బుధవారం సాయంత్రం సియాన్‌ ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఈ వ్యక్తి నివాసముంటున్న భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ భవనంలో ఉంటున్న మిగతా ఏడు కుటుంబాలను హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరందరికి ఈ రోజు కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ ధారవి మురికివాడలో సుమారుగా 10 లక్షల మంది గుడిసెవాసులు నివసిస్తున్నారు. మరి అక్కడుంటున్న ఓ వ్యక్తి కరోనా వైరస్‌తో చనిపోవడంతో.. మిగతా వారంతా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 10 లక్షల మందిలో ఎంత మందికి కరోనా సోకిందో అర్థం కావడం లేదని ఆందోళన చెందుతున్నారు. జస్‌లోక్‌ ఆస్పత్రిలోని ఔట్‌ పేషెంట్‌ విభాగంలో పని చేస్తున్న ఇద్దరు నర్సులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ ఆస్పత్రిని మూసివేశారు.

ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్!

* గుంటూరు కలెక్టర్ ఉపయోగించిన భాషపై అభ్యంతరం ...  * అసమర్ధ అధికారుల తీరుపై కామన్ మ్యాన్ అసహనం .....  * తండ్రి పేరుకూ, హెల్ప్ లైన్ ఫిర్యాదుకూ సంబంధమేమిటని ప్రశ్న  * కాలం చెల్లిన 'కాలమ్స్' ను తొలగించాలని సూచన  * వార్డు నెంబర్ చెపితే కానీ, ఫిర్యాదు తీసుకోలేమని చెప్పిన సి ఎం ఓ కాల్ సెంటర్  ఆంధ్ర సి ఎం ఓ కాల్ సెంటర్ ను కడిగిపారేసిన కామన్ మ్యాన్. ఏపీలో ప్రారంభమైన రేషన్ సరుకుల పంపిణీ, కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో పేద ప్రజలకు రేషన్ డీలర్ల వద్దే సరుకులు ఇవ్వడంపై మాత్రం విమర్శలు వస్తున్నాయి. వాటి గురించే ఈ కామన్ మ్యాన్ ఆంధ్ర ప్రదేశ్ సి ఎం ఓ కాల్ సెంటర్ ను ఎక్కి దిగారు. గతంలో అడక్కముందే పింఛన్లను ఇంటివద్దకే పంపిన ప్రభుత్వం ఇప్పుడు రేషన్ ను మాత్రం షాపులకు వచ్చి తీసుకోవాలనడం సరికాదని తన వాదన.  గతంలో నెలవారీ పెన్షన్ ను ఇంటివద్దే అందించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్.. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో అదే వాలంటీర్లను వాడుకుని ఇంటివద్దకే రేషన్ పంపుతుందని అంతా ఆశించారు. కానీ అలా జరగలేదు. వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పంపాల్సిన రేషన్ సరుకులను షాపుల వద్దే తీసుకోవాలని అధికారులు సూచించడంతో ఇవాళ పేద ప్రజలు డీలర్ల వద్ద క్యూలో కనిపించారు. అసలే కరోనా భయాలు, సామాజిక దూరం పాటించాలన్న హెచ్చరికలు, అలాగని ఇంటివద్దే ఉండిపోతే రేషన్ దొరకదేమో అన్న భయం, ఒక్క రోజులో సరుకులు దొరుకుతాయో లేదో అన్న ఆందోళన.. ఇలా అనేక భయాలతో ప్రజలు ఇవాళ రేషన్ డీలర్ షాపుల వద్దకు చేరుకుని సరుకులు తీసుకోవడం కనిపించింది. గతంలో నెలవారీ సామాజిక పెన్షన్లను ఇంటివద్దే ఇవ్వాలని ఎవరూ కోరలేదు. ఒకటో తేదీ ఆదివారం వచ్చినా అదే రోజు ఇవ్వాలని ఎవరూ అడగలేదు. కానీ ప్రభుత్వం మాత్రం లక్షలాది వాలంటీర్లను మోహరించి ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం ఒకే రోజు రికార్డు స్దాయిలో పెన్షన్లను ఇంటివద్దకే పంపింది. కానీ ఇప్పుడు కరోనా పరిస్ధితుల్లో ప్రజలు ఇంటి నుంచి బయటికి వచ్చే పరిస్దితి లేదు. లాక్ డౌన్ కొనసాగుతోంది. తప్పనిసరైతే తప్ప బయటికి వచ్చే పరిస్దితి లేదు. అయినా వాలంటీర్లను వాడుకోకుండా ప్రజలను రేషన్ కోసం షాపుల వద్ద క్యూ కట్టాలని ప్రభుత్వం సూచించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రజలు సామాజిక దూరం పాటించడం లేదన్న కారణంతో ఉదయం షాపింగ్ సమయాలను కూడా తగ్గించిన ప్రభుత్వం, రేషన్ కోసం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వారిని రేషన్ దుకాణాల వద్ద క్యూల్లో ఉండాలనడం సరికాదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని కామన్ మ్యాన్ సి ఎం ఓ కాల్ సెంటర్ కి వివరించే ప్రయత్నం చేస్తే, ఆయనకు ఎదురైనా చేదు అనుభవం ఇది. ఇంతే కాదు, కిక్కిరిసిన ప్రాంతం లోని ఒక షెడ్ లో పిల్లలకు ట్యూషన్ నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన గుంటూరు కలెక్టర్ కు విన్నవిస్తే, మీకు రూల్స్ తెలుసా అంటూ చాలా దురుసుగా కలెక్టర్ అడిగిన తీరును కూడా ఆయన వివరించారు. ఇదండీ, మొత్తానికి కరోనా కంట్రోల్ విషయం లో మన కలెక్టర్ గారి వైఖరి.

నూర్జహాన్ కళ్యాణ మండపంలో రహస్యంగా మకాం వేసిన వారెవరు?

* మత ప్రచారకులను దాచిన విషయంపై కడప పోలీసుల మౌనం  * కరోనా తీవ్రత కన్నా, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా?  ఇప్పుడు కడప లో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇదే. కానీ, దీనికి డెప్యూటీ సిఎం అంజాద్ బాషా కానీ, పోలీసు యంత్రాంగం కానీ సమాధానం ఇవ్వటం లేదు. వారి మౌనం, లేదా నీళ్లు నమలడం చూస్తుంటే, అంజాద్ బాషా సన్నిహితుల వివరాలేవీ బయటకు పొక్కే అవకాశం లేకుండా పోయింది. ఇదే  బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ మీడియా తో మాట్లాడుతూ, కడప జిల్లా లో దారుణమైన పరిస్థితి కి అధికారుల వైఫల్యమే కారణమని, డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పర్యటన వెనుక ఉన్న చిదంబర రహస్యమేమిటో బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. నూర్జాహాన్ కళ్యాణ మండపంలో రహస్యంగా మకాం వేసిన వారెవరని ప్రశ్నించిన ఆయన, పోలీసులు ఇందులో నిజాలను నిగ్గు తేల్చకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. 30మంది మత ప్రచారకులకు ఆశ్రయం కల్పించిందెవరో స్పష్ట చేయాలనీ, ఆశ్రయం కల్పించిన పెద్ద నేత ఎవరో బహిర్గత పరచాలని కూడా డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులను కాపాడుకోలేని డిప్యూటీ సీఎం ప్రజలకేమి చేస్తారని కూడా బండి ప్రభాకర్ ప్రశ్నించారు.  డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారని, లాక్ డౌన్ అంటే లాఠీ చార్జీలు కాదని,  ప్రపంచ దేశాలే వణికిపోతుంటే దాన్ని సీఎం జగన్ తేలికగా తీసుకోవడం తగదని, కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడైనా క్లోరినేషన్ చేశారా అనీ ఆయన ప్రశ్నించారు. భాద్యత కలిగిన హాదాలో ఉన్న కమీషనర్ 30మంది మత ప్రచారకులను ఎక్కడికి తరలించారంటే సమాధానం లేదు.బంధువు డిల్లీకి వెళ్ళినా ఎందుకు డిప్యూటీ సీఎం బయట పెట్టలేదని ఆయన నిలదీశారు. " ప్రాణాలు గుప్పెట్లో బ్రతుకుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని డిల్లీకి వెళ్లిన వారి పేర్లు డిప్యూటీ సీఎం బయట పెట్టాలి.డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనుక తిరిగిన అధికారుల పరిస్థితి ఏమిటని ప్రభాకర్ ప్రశ్నించారు. ద్రోహులు గా మారవద్దని అధికారులను బీ జె పీ నేత హెచ్చరించారు.

లాక్ డౌన్ తో 'రెక్కలు' విరిగిన ఎయిర్ లైన్స్ 

ముందు చూస్తే నుయ్యి..వెనుక చూస్తే గొయ్యి లావుంది భారతీయ ఎయిర్ లైన్స్ ఆపరేటర్ల పరిస్థితి. కరోనా మహమ్మారి ప్రభావంతో దేశీయ విమానయాన రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, వెంటనే ఆదుకోకుంటే ఎన్నో సంస్థలు దివాలా తీయక తప్పదని హెచ్చరిస్తూ, ఫిక్కీ కేంద్ర మంత్రులను ఉద్దేశించి లేఖ రాసింది. ఇప్పటికే దాదాపు 10 రోజులకు పైగా విమాన సర్వీసులు నిలిచిపోగా, టికెట్ల క్యాన్సిలేషన్ డబ్బులను ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో నిధుల కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేవు. ఇండిగో, స్పైస్ జెట్ లాంటి ఎయిర్ లైన్స్ అయితే, లాక్ డౌన్ పీరియడ్ వరకూ- తమ టికెట్లు బుక్ చేసుకున్న వారందరికీ, సొమ్ము వాపసు చేయకుండా-తర్వాత, అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి లోగా తిరిగి తమ ఎయిర్ లైన్స్ లో ప్రయాణించే సౌకర్యాన్ని ,లేదా వెసులుబాటును కల్పించాయి.  ఈ కారణంతో ఎయిర్ లైన్స్ సంస్థలు దివాలా దిశగా నడుస్తున్నాయని ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే విమానయాన సంస్థలకు ఉద్దీపన ప్రకటించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌ దీప్‌ సింగ్‌ పురి, ఏవియేషన్‌ కమిటీ చైర్మన్‌ ఆనంద్‌ స్టాన్లీ తదితరులకు ఫిక్కీ లేఖ రాసింది. ఎయిర్‌ లైన్స్‌ సంస్థలు బ్యాంక్‌ గ్యారంటీలు ఇచ్చి తీసుకున్న రుణాలను బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు జప్తు చేసుకోకుండా మూడు నెలల మారటోరియం విధించాలని ఫిక్కీ ప్రతినిధులు కోరారు. ఇదే సమయంలో ఎయిర్‌పోర్ట్‌ ఆపరేటర్లు విధించే వడ్డీలు,పెనాల్టీలు తదితరాల భారం నుంచి కూడా మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. విమాన సర్వీసులు ఆగిపోవడంతో సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలు తగ్గిపోతున్నాయని, ఇది ఓ పెను సమస్యని ఫిక్కీ హెచ్చరించింది. ఈ క్రమం లో ప్రయివేట్ ఎయిర్పోర్ట్ నిర్వాహకులైన జి ఎం ఆర్ లాంటి కార్పొరేట్ గ్రూపులు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తాయోనని, అన్ని ఎయిర్ లైన్స్ ఆపరేటర్లు ఎదురు చూస్తున్నారు.

ఏపీలో పాజిటివ్ కేసులు సంఖ్య 132

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఇంతవరకు ప్రపంచాన్ని గడగడ లాడించిన ఏ వైరస్ ఏపీ ప్ర‌జ‌ల‌కు నిద్ర లేకుండా చేస్తోంది.  ఈ వైరస్ ఉన్న వ్యక్తి ముట్టుకున్న ఏ వస్తువును ముట్టుకున్నా ఇంకొకరికి సోకవడం వల్లే ఇది  ఇంత వేగంగా వ్యాప్తిచెందుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రంగా విస్తరిస్తోంది.  ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 132కు చేరుకుంది. ఇందులో 70 మంది  ఢిల్లీ వెళ్లివచ్చిన వారివి లేదా వారితో లింకులు ఉన్నవాళ్లు వున్నారు.  బుధవారం ఒక్కరోజే 67 కొత్త పాజిటివ్ కేసులు నమోదైయాయి. జిల్లాల వారిగా చూస్తే అనంతపురం - 2 చిత్తూరు - 8 తూర్పుగోదావరి - 9 గుంటూరు - 20 కడప - 15 కృష్ణ - 15 కర్నూలు - 1 నెల్లూరు - 20 ప్రకాశం - 17 విశాఖపట్నం - 11 పశ్చిమగోదావరి - 14 ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాజిటివ్గా తేలినవారిలో ఎక్కువ మంది ఢిల్లీ వెళ్లివచ్చినవారు - వారితో సన్నిహితంగా ఉన్నవారేనని తెలుస్తోంది. ఇదిలావుంటే  కరోనాపై సీఎం జగన్‌ బాధ్యత లేకుండా మాట్లాడారని తెలుగుదేశం పార్టీ విమ‌ర్శిస్తోంది.  కరోనా జ్వరంలాంటిదేనని, భయంలేదని సీఎం జగన్ ఎలా అంటారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణాలో 9 మంది మృతి పాజిటివ్ వ‌చ్చిన వారు 127

తెలంగాణాలో ఒకే రోజు 30 కొత్త కేసులు న‌మోదైయ్యాయి. మ‌రో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఢిల్లీ నుంచి వ‌చ్చిన వారే!  దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 127కు పెరిగింది.  నిజాముద్దీన్ మర్కజీకి వెళ్లొచ్చిన వారికి, వారి వల్ల వారి కుటుంబ సభ్యులకు మాత్రమే తెలంగాణలో కొత్తగా వైరస్ సోకుతున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని అధికారులు తెలిపారు. బుధవారం జరిపిన పరీక్షల్లో 30 మందికి వైరస్ సోకినట్లు తేలింది. గాంధి ఆసుపత్రిలో ఇద్దరు, యశోదా ఆసుపత్రిలో ఒకరు బుధవారం కరోనా వైరస్ సోకి మరణించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో ఈ వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 9కి చేరింది. బుధవారం వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన 30 మంది, చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన ఆరుగురు కూడా మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారే. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు, అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు, ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి.  దీంతో తెలంగాణ ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మర్కజ్ వెల్లి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నది. మర్కజ్ కు వెళ్లివచ్చిన మరో 300 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మర్కజ్ వెళ్లి వచ్చిన వారు, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితంగా ఉన్న వారు ఇంకా ఎవరైనా వైద్య పరీక్షలు నిర్వహించుకోకుండా ఉంటే వెంటనే ఆసుపత్రికి వచ్చి పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది. మర్కజ్ కు వెళ్లివచ్చిన వారికి సోకిన వైరస్ ప్రమాదరకంగా మారుతున్నది కాబట్టి, వారంతా తప్పక పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తున్నది. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల, వైరస్ సోకినట్లు తేలినా, వారి ప్రాణాలు కాపాడడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇది వారికి, వారి కుటుంబానికి శ్రేయస్కరం కాబట్టి, మర్కజ్ వెళ్లి వచ్చిన ప్రతీ ఒక్కరు తప్పక పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం కోరుతున్నది.  కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు నిర్వహిస్తున్న లాక్ డౌన్ ను ప్రజలు విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. మరికొద్ది రోజుల పాటు ప్రజలు సహకరిస్తే, తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని సిఎం అన్నారు. కరోనా వైరస్ బాధితులకు వైద్యం అందిస్తున్న వైద్య సిబ్బంది భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సిఎం వెల్లడించారు. వైద్య సిబ్బందికి అవసరమైన పిపిఇ కిట్స్, ఎన్ 95 మాస్కులు, హైడ్రాక్సి క్లోరోక్విన్ మాత్రలు, అజిత్రో మైసిన టాబ్లెట్లు సిద్దంగా ఉంచినట్లు వెల్లడించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన మెడికల్ కిట్స్ ను కూడా సిద్ధంగా ఉంచినట్లు సిఎం చెప్పారు. వ్యాధి వచ్చిన వారికి వైద్యం అందించడానికి, వైద్యం అందిస్తున్న మెడికల్ సిబ్బంది భద్రతకు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కావాల్సిన అన్ని చర్యలును ప్రభుత్వం తీసుకుంటున్నదని సిఎం వెల్లడించారు.  తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, రోగులకు అందుతున్న చికిత్స, వైద్యసిబ్బంది భద్రతకు తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్ లో మద్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఉన్నతాధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సాయంత్రం గవర్నర్ తమిళిసైని కలుసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించారు. గురువారం రాష్ట్రపతితో గవర్నర్ కు, ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రికి వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున రాష్ట్రంలో చేస్తున్న ప్రయత్నాలపై ఇద్దరూ చర్చించారు.

వలసదారుల జీవితాలతో ఆడుకోవ‌ద్దు! ఒవైసీ ట్వీట్!

వలసదారుల సంక్షేమం కోసం ఎలాంటి ఆలోచన చేయకుండా లాక్ డౌన్ విధించి కేంద్ర ప్ర‌భుత్వం ప్రజల జీవితాలతో  ఆడుకుంటోంద‌ని ఒవైసీ ఆరోపించారు. ఇది ఏ తరహా లాక్‌డౌన్? అంటూ ఆయ‌న సంచలన వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ అమలవుతున్న తీరుపై ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  ఢిల్లీ, జైపూర్‌లో వేలాది మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు పడుతున్న అవస్థలపై ఆయన ప్రశ్నించారు. వలస వచ్చి బతుకుతున్నవారు తిరిగి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించరు. ప్రభుత్వం ఢిల్లీలో యూపీ వలసదారులను వెనక్కి నెట్టగలిగితే, తెలంగాణ కూడా బిహార్ యూపీ పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ నుంచి ఇక్కడికి వచ్చిన ఒంటరి వలసదారులను అలాగే చేయాలా?’’ అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.   పశ్చిమ బంగాల్, యూపీ, బిహార్ ప్రభుత్వాలు ఇలా చిక్కుకు పోయిన వలసదారులకు ఎలాంటి సాయం చేయట్లేదని ఆరోపించారు. ప్రజల జీవితాలతో ఇలా ఆడుకోవద్దని అసదుద్దీన్ ట్వీట్ చేశారు.

నిర్మాణ కార్మికులకు ఆర్థిక సహాయం చేయాలి!

తెలంగాణ రాష్ట్రంలోని భావన నిర్మాణ కార్మికులకు తక్షణమే 10 వేల‌ ఆర్థిక సహాయం అందించాలని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.  లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన రాష్ట్రంలో ఉన్న 14 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయ‌న ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. కరోనా నివారణ చర్యలతో ఎవరు నష్ట పోకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తత్సరం చేయడం తగదని,  తెలంగాణ రాష్ట్రంలో భావన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సెస్ లో ఉన్న 2300 కోట్లు నిధిని కార్మికుల సంక్షేమనికి వినియోగించాలని ఎం.పి. కోరారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు ఆర్డర్స్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని సూచించారు. కార్మిక సంక్షేమ నిధి కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 8 లక్షల 50వేళా మంది కార్మికులతో పాటు నమోదు చేసుకొని వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

అస్సలు భయపడొద్దు.. కరోనా కూడా జ్వరం లాంటిదే: సీఎం జగన్

కరోనా వైరస్ కి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి కానీ.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మాత్రం అసలు భయపడాల్సిన అవసరమే లేదు అంటున్నారు. ఏపీలో గంటల వ్యవధిలోనే 40 కి పైగా కరోనా పాజిటివ్ నమోదైన నేపథ్యంలో.. రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెప్పడంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టిన సీఎం జగన్.. కరోనాని సింపుల్ గా తీసి పడేశారు. కరోనా వస్తుందని ఓ ఇది అయిపోకండి. అది కూడా ఓ జ్వరం లాంటిదేనని తేల్చేశారు. కరోనా వస్తే ఏదో పెద్ద జబ్బు వచ్చిందని బాధ పడొద్దని, పద్నాలుగు రోజుల్లో తగ్గిపోతుందని తెలిపారు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా కరోనా సోకితే, వారితో ఆప్యాయంగా ఉంటూ ధైర్యం చెప్పాలని అన్నారు. అంతేకాదు, అసలు కరోనా వచ్చినా.. 80 శాతం మందికి ఇంట్లోనే నయమైపోతుందని.. కేవలం 4 శాతం మందిని మాత్రమే ఐసోలేషన్ లో పెడతారని చెప్పుకొచ్చారు. కాబట్టి కరోనా గురించి అసలు హైరానా పడాల్సిన అవసరం లేదని, కనీస జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని సీఎం చెప్పారు.

ఢిల్లీకి లింక్‌తో 70 మందికి పాజిటివ్! ఏపిలో 87 పెరిగిన క‌రోనా పాజిటివ్ కేసులు!

ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారి సంబంధికులకే 70 పాజిటివ్ కేస్ లు వచ్చాయ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్రం నుంచి 1085 ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో 585 మందికి టెస్ట్ లు చేసాం. రెండు రోజులుగా కేసులు పెరిగాయ‌ని సి.ఎం. తెలిపారు. వాలంటీర్లు, ఎ ఎన్ ఎమ్, ఆశ వర్కర్స్ ఇప్పటికే ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య భద్రతపై సర్వే చేస్తున్నారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేయాలి.  ఢిల్లీకి వెళ్లి వచ్చిన ప్రతి ఒక్కరినీ గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేస్తున్నాం. కరోనా బాధితులకు వైద్య సేవలు అందించేందుకు ప్రయివేట్ డాక్టర్స్,నర్స్ లు ముందుకు రావాలని సి.ఎం. పిలుపునిచ్చారు. కరోనా విపత్తు నేపద్యంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారం పడింది.  ప్రభుత్వ ఉద్యోగుల సహకారం ప్రశంసనీయం. రైతు కూలీలు,రైతన్నలు, ఆక్వ రంగంలో ఉన్న కూలీలు ప్రతి రోజు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు చేసుకోవచ్చు.  సామాజిక దూరం పాటిస్తూ రైతులు పనులు చేసుకోవచ్చు.  కరోనా వచ్చిన వారిపై వివక్ష ప్రదర్శించరాదని సి.ఎం. సూచించారు.

చేతులెత్తి నమస్కరిస్తున్న మ‌రో వారం ఇంట్లోనే ఉండండి!

కరోనా వైరస్ తదనంతర లాక్ డౌన్ చర్యలకు జిల్లా ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారని అధికారుల కృషి అభినందనీయం గా ఉన్నదని తెలంగాణా రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మార్చి 1 నుండి ఇప్పటివరకు 3480 మంది ఇతర దేశాల నుండి నిజామాబాద్ జిల్లాకు వచ్చారని వారందరినీ వారి ఇండ్లలో ఏకాంతంగా ఉంచడం ద్వారా 14 రోజులు పూర్తయిన వారిలో 2,200 మంది ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉన్నారని అదేవిధంగా మరో వారం రోజుల్లో మిగతా 1200 మంది కూడా 14 రోజుల హోమ్ క్వారంటైన్ పూర్తిచేసుకుని సంతోషంగా బయటకు వచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు ఇందుకు సహకరించిన వీరందరిని కూడా అభినందిస్తున్నానని అండగా నిలిచిన వారి కుటుంబ సభ్యులను కూడా అభినందిస్తున్నానని తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిని అధిగమించడానికి వీఆర్ఏ నుండి జిల్లా కలెక్టర్ వరకు, హోంగార్డు నుండి పోలీస్ కమిషనర్ వరకు,  ఆశా వర్కర్ నుండి డిఎంఅండ్హెచ్ఓ వరకు చేసిన కృషి చాలా గొప్పది అన్నారు. అయితే ఈ వారం రోజులు కూడా క్వారంటైన్ లో ఉన్నవారు ఇదే సహకారంతో ఇండ్ల వద్దనే ఉండాలని అధికారులు కూడా ఇప్పటి వరకు లాగే స్ఫూర్తిని కొనసాగించి మనమంతా మన కుటుంబ సభ్యులంతా ఈ కరోనా వైరస్ బారి నుండి బయటపడడానికి కృషి చేయాలన్నారు.

కర్తవ్య నిర్వహణలో శ్రీరాముడే మనకు ఆదర్శం!

నవమి వేడుకలు ఇంట్లోనే చేసుకోండి. పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలి. శ్రీ సీతారాముల కల్యాణం అర్చకుల వరకే పరిమితం చేయాలి. లోకరక్షణకై యింటి నుండే ఆ రాముడికి పూజలు చేయాల‌ని మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. శ్రీరామనవమి వేడుకల్ని దృష్టిలో పెట్టుకొని ఆయ‌న మాట్లాడారు. సామాజిక దూరమే మనకు ఇప్పుడు శ్రీరామరక్ష అని తెలంగాణా రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి రక్షణ కొరకే శ్రీరామనవమి వేడుకలు ఇంటివద్ద మాత్రమే చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లో బహిరంగ ప్రదేశాల్లో శ్రీరామనవమి వేడుకలు జరపడం నిషేధం అన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకొని సహకరించాలని ఆయన కోరారు. ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్ వైరల్ గా మారి మానవాళి భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నందునే ఇటువంటి కఠోర నిర్ణయాన్ని అమలు పర్చాల్సి వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.  కర్తవ్యనిర్వహణలో శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శమని అటువంటి మహానియుడి అడుగు జాడల్లో పయనిస్తున్న మన ముందున్న కర్తవ్యం లోకరక్షణనే అన్నది గ్రహించాలని ఆయన ప్రజలకు విజ్ణప్తి చేశారు. శ్రీ సీతారాముల కల్యాణం అర్చకులకే పరిమితం చెయ్యాలని యావత్ తెలంగాణ ప్రజానీకం యింటి దగ్గర నుండే ఆ కల్యాణాన్ని వీక్షించాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి హితవుపలికారు.

వైరస్ కట్టడికి పకడ్బందీగా పనిచేస్తున్నాం!

కరోనా వైరస్ కట్టడికి దేశంలో పకడ్బందీగా పని చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అంతర్జాతీయ విమానాలు రద్దు చేయాలని మొదట కోరింది తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా లాక్ డౌన్ ప్రకటించింది తెలంగాణ.  మర్కజ్ గురించి కూడా కేంద్రానికి సమాచారం అందించింది కూడా తెలంగాణనే అని మంత్రి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వెయ్యికి పైగా మంది మర్కజ్ కి వెళ్లినట్లు తెలిసింది. 160 మందిని తప్ప అందరినీ గుర్తించాం. కేవలం రెండు రోజుల్లోనే ఇంత మందిని గుర్తించి, పరీక్షలు చేయిస్తున్నాము అంటే తెలంగాణ ప్రభుత్వం సత్తా, చిత్తశుద్ది అర్దం చేసుకోవచ్చు.  తెలంగాణ రాష్ట్రం లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు. గాంధీ ఆసుపత్రిలో కరోనా వైరస్ పోసిటివ్ వచ్చి చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి నెగెటివ్ వచ్చింది. మరో సారి పరీక్ష చేసి డిశ్చార్జ్ చేస్తాం. ఈ రోజు మరో ఇద్దరు గాంధీ నుండి డిశ్చార్జ్ అవుతున్నారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.  డిశ్చార్జ్  అయిన వారందరూ మరో 14 రోజులు హోమ్ క్వారంటిన్ లో ఉండాలని ఆయ‌న సూచించారు. ఇప్పటివరకు తెలంగాణ లో 6 గురు కరోనాతో చనిపోయారు.

రేషన్ షాపుల సమయాన్ని పొడిగిస్తాం!

12 కిలోల ఉచిత బియ్యం పంపిణీ కార్య‌క్ర‌మాన్ని తెలంగాణా పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి లాంఛ‌నంగా ప్రారంభించారు. 2.80 కోట్ల మందికి ఉచితంగా 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ నేపథ్యంలో నిరుపేద కుటుంబాలు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రేషన్ లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమాన్ని, రేషన్ షాపులో బియ్యం నిల్వలు, లబ్దిదారులకు పంపిణీ వంటి వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.  ఖైరతాబాద్ లోని రేషన్ షాప్ నం. 702లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చైర్మన్‌గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యాన్ని అందిస్తోందని తెలిపారు. బియ్యం గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 12 కిలోల బియ్యాన్ని ఉచితంగా అందిస్తామని, ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 17 వేల రేషన్ షాపుల్లో 3.34 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. లబ్ధిదారులు రేషన్ షాపుల వద్ద బియ్యం కోసం ఎదురుచూడవలసిన పరిస్థితి ఉండకుండా ముందుగానే టోకెన్లను జారీచేయడం జరుగుతుందని, టోకెన్ పద్ధతిలో నిర్దేశించిన సమయానికి రేషన్ షాపుకు వచ్చి బియ్యాన్ని తీసుకోవాలన్నారు. ఉదయం, సాయంత్రం అనే కాకుండా స్థానిక అవసరాలను బట్టి రేషన్ షాపుల సమయాన్ని కూడా పొడిగిస్తామని తెలిపారు. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి బియ్యం అందించేవరకు రేషన్ షాపులు పనిచేస్తాయన్నారు. రేషన్ షాపుల వద్దకు వచ్చే లబ్ధిదారులు ప్రభుత్వం సూచనలను ఖచ్చితంగా పాటించాలని, ముఖ్యంగా రేషన్ దుకాణాల వద్ద సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలని, చేతులు శుభ్రం చేసుకునే విధంగా హ్యాండ్ వాష్, సానిటైజర్లు అందుబాటులో ఉంచుకోవాలని రేషన్ డీలర్లను ఆదేశించారు.